[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]


నహుషుడి శాపము
వైశంపాయన మహర్షి జనమేజయుడితో “వాయుపుత్రుడు భీముడు వేటకోసం వెళ్లి హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఒక పాముతో పట్టుబడ్డాడు. అతడిని ధర్మరాజు విడిపించాడు” అని చెప్పాడు.
జనమేజయమహారాజు వైశంపాయనుడితో “మహర్షీ! భీముడికి పదివేల ఏనుగుల బలం ఉంది కదా? కుబేరుడితో యుద్ధం చేసి అనేకమంది యక్షుల్ని, రాక్షసుల్ని జయించినవాడు కదా? అంత బలపరాక్రమాలు కలిగిన భీముడు ఒక పాముతో ఎలా పట్టుబడ్డాడు?” అని అడిగాడు.
జనమేజయుడికి వైశంపాయనుడు “భీముడు వేటమీద ఇష్టంతో హిమాలయ పర్వత శిఖరాల్లో తిరిగి తిరిగి అలిసిపోయాడు. ఒకచోట భయంకరమైన కొండచిలువని చూశాడు. ఆహారం కోసం నోరు తెరుచుకుని ఉంది. ఆ పాము రూపం యముడిలా, దాని నోరు గుహలా ఉంది. దాని ఊపిరి నుంచి వచ్చిన పొగలతో ఆ అడవిలో ఉండే దట్టమైన చెట్లు, పొదలు భయంకరమైన బూడిద రంగులోకి మారిపోయాయి.
ఆ పాము శరీరం పసుపు రంగులోను; చూపులు కరుకుగాను, భయంకరంగాను ఉన్నాయి. దాని నాలుగు వంకర కోరలు చంద్రవంక కాంతులతో సమానమైన కాంతులతో ప్రకాశిస్తున్నాయి. అది ఆహారం కోసం భీముడి భుజాల్ని తన ముఖంతోను, అతడి శరీరాన్ని తన శరీరంతోను బంధించింది.
అంత బలం కలిగిన భీముడు పాము బంధించడం వల్ల కదలక మెదలక ఉండిపోయాడు. దాని బలానికి ఆశ్చర్యపడి అది సహజమైన పాము కాదని ఏదో అద్భుత రూపమని అనుకున్నాడు.
ఆ పాముతో “నేను భీముడిని పాండురాజు కొడుకుని. ధర్మరాజుకి తమ్ముణ్ని. పిశాచ, పన్నగ, యక్ష, రాక్షసవీరుల్ని యుద్ధాల్లో జయించిన గొప్ప శౌర్యవంతుణ్ని. ఏనుగులు, సింహాలు మొదలైన జంతువుల్నిముక్కలు చేయగల అంతులేని బాహుబలం కలవాడిని.
నా వంటి బాహుబలం కలిగిన వీరుణ్ని బంధించగలిగిన శక్తి నీకు ఎలా లభించింది? ఇది నీకు పుట్టుకతో వచ్చిన బలమా? ఎవరయినా దివ్యపురుషుడి వరాల వల్ల పొందిన బలమా? నాకు చెప్పు” అని అడిగాడు.
ఆ పాము తనకి పూర్వజన్మ పరిజ్ఞానం ఉండడం వల్ల భీముడితో “ఈ అసాధారణ బలం నాకు దేవతల వరం వల్లే వచ్చింది. ఎంతటి బలసంపదలు కలిగినవాళ్లైనా ఈ అడవిలో నన్ను ఎదిరిస్తే వాళ్లు తమ బలం పోగొట్టుకుంటారు. భీమసేనా! ఎంత పెద్ద జంతువులైనా సరే నాకు ఎదురుపడిన జంతువుల్ని పట్టి తింటున్నాను.
నాకు ఇప్పుడు నువ్వు ఆహారంగా దొరికావు. నేను ఒకప్పుడు దేవేంద్ర పదవిలో ఉన్నవాడిని. అప్పుడు మితిమీరిన గర్వంతో ఒక బ్రాహ్మణుణ్ని అవమానపరిచాను. అతడి శాపం వల్ల ఈ విధంగా సర్పంగా మారవలసివచ్చింది” అని పాము బాధపడుతూ చెప్పింది.
భీమసేనుణ్ని వెతుకుతూ వచ్చిన ధర్మరాజు
ఆ కొండచిలువ మాటలు విని భీముడు “కష్టాలు కలిగినప్పుడు తనను తాను నిందించుకోవడం మంచిది కాదు. భూలోకంలో కష్టాలు కలిగినప్పుడు మనస్సుని ఒకేవిధంగా అదుపులో ఉంచుకోవడమే మనుషులకి ధర్మం. చచ్చిపోడానికి కూడా బాధపడను.
విధిని ఎవరూ మార్చలేరు కదా! నేను గొప్ప బలం కలవాడినే అయినా నీకు పట్టుబడ్డాను. ఇటువంటి దురవస్థ కలిగిందని నేను బాధపడను. కాని, రాజ్యాన్ని పోగొట్టుకుని నడవడానికి వీలులేని ఈ కొండ చరియల్లో తిరుగుతున్న నా సొదరులు నేను కనిపించలేదని ఎంత పరితపిస్తున్నారో అని బాధపడుతున్నాను” అని చెప్పాడు.
ధర్మరాజుకి భయంకరమైన నక్క కూత వినిపించింది. అశుభంగా అనుకున్నాడు. అతడి దక్షిణ భుజం అదిరింది. ముందు కీడు కలిగినా తరువాత శుభం జరుగుతుందని అనుకున్నాడు. తమ్ముళ్ల వైపు చూశాడు.
వాళ్లల్లో భీముడు కనిపించలేదు. ద్రౌపదిని కాపాడడానికి అర్జునుణ్ని, నకులసహదేవుల్ని ఉంచి తాను ధౌమ్యుడు మొదలైన బ్రాహ్మణులతో కలిసి భీముణ్ని వెతుకుతూ బయలుదేరాడు.
భీముడి అరికాళ్లలో ఉన్న అందమైన నాగలి, వజ్రాయుధము, పూర్ణకలశము, పద్మము మొదలైన శుభలక్షణాల గుర్తుల్ని చూసుకుంటూ దుమ్ముతో నిండిన దారి వెంట వెళ్లాడు. కొండ శిఖరంలా ఉన్న పెద్ద పాము చుట్టుకోడం వల్ల అలిసిపోయి కదలలేక ఉన్న భీముణ్ని చూశాడు. భీమసేనుడు పాముకి చిక్కి కదలలేక శక్తిసామర్థ్యాలు తగ్గిపోయి సామాన్య మానవుడిలా కనిపిస్తున్నాడు.
ఇదెక్కడి వింత అనుకుని భీమసేనుణ్ని చూసి బాధపడుతూ పాముతో “మహానుభావా! నువ్వు పాము ఆకారంలో ఉన్న రాక్షసివో, దేవతవో చెప్పు. నేను ధర్మరాజుని నిన్ను వేడుకుంటున్నాను. మహాబలపరాక్రమవంతుడైన నా తమ్ముడిని నువ్వు ఆహారం కోసమే పట్టుకుంటే చెప్పు నీ అహారానికి సరిపడిన జంతు మాంసాన్ని నీకు సమకూరుస్తాను” అని చెప్పాడు.
ఆ పాము ధర్మరాజుతో “పాపాలు లేని ధర్మరాజా! నేను మీ వంశంలో మీ కంటే ముందు పుట్టినవాళ్లకి ముందు పుట్టినవాణ్ని. నహుషుడు అనే రాజుని. దేవేంద్రుడితో సమానమైనవాడిని. సంపద ఉందన్న గర్వంతో మంచితనాన్ని విడిచిపెట్టి వివేకం లేకుండా వేయిమంది బ్రాహ్మణులు మోస్తున్న రథాన్ని ఎక్కి బ్రాహ్మణుల్ని అవమానించాను. కలశం నుంచి జన్మించిన మాహానుభావుడైన అగస్త్యమహర్షి కోపంతో నన్ను భయంకరమైన పాముగా మారమని శపించాడు.
ఆనాటి నుంచి ఈ దురవస్థని భరిస్తున్నాను. విధివిలాసాన్ని నీకు ఎలా చెప్పగలను? నేను వేదాలన్నీ చదివి, ఎన్నో పుణ్యకార్యాలు చేసి, నూరు యజ్ఞాలు నిర్వహించి, దేవేంద్ర పదవిని పొందినవాడిని. కాని, గర్వం వల్ల పాముగ మారి ఈ దురవస్థ పొందవలసి వచ్చింది.
సుఖదుఃఖాల్ని కల్పించగల బలం దైవానికి ఉంది. దైవం చెయ్యలేని పని ఏముంటుంది? అగస్త్యుడి శాపానికి గురయిన నేను దేవేంద్ర పదవికి దూరమయ్యాను.
ఇక్కడికి వచ్చేటప్పుడు నేను ఆ మహానుభావుణ్ని ప్రార్థించాను. ‘మహర్షీ! నేను పాముగా మారినా నాకు పూర్వజన్మ జ్ఞానం ఉండేటట్లు, బలం కలిగిన జంతువులు నా దగ్గరికి చేరగానే వాటి బలం తగ్గిపోయి నాకు ఆహారమయ్యేటట్లు, శాపం తీరే మార్గం చెప్పమ’ని రెండు చేతులు జోడించి ప్రార్థించాను. అగస్త్యమహర్షి దయతో నేను అడిగిన వరాలు అనుగ్రహించాడు.
తరువాత ‘నువ్వు అడిగిన ప్రశ్నలకి వివేకంతో సరైన సమాధానాలు ఎవరు చెప్తారో అతడి వల్ల నీకు శాపవిముక్తి జరుగుతుంది. నీ శాపవిముక్తి జరగడానికి చాలాకాలం పడుతుంది’ అన్నాడు.
ఆ మహర్షి చెప్పినట్లే చాలాకాలంగా ఈ అడవిలో పడి ఉన్నాను. నీ తమ్ముడు నాకు ఆహారంగా దొరికాడు. నువ్వు చెప్పగలిగితే నా ప్రశ్నలకి సమాధానం చెప్పి నీ తమ్ముణ్ని విడిపించుకో” అన్నాడు.
నహుషుడికి శాపవిమోచనము
ధర్మరాజు అతడితో “వివేకవంతుడా నువ్వు అడిగే ప్రశ్నలకి పండితులైన బ్రాహ్మణోత్తములు మాత్రమే సరయిన సమాధానం చెప్పగలరు. ఎన్ని తెలివితేటలు ఉన్నా ఇతరుల ప్రశ్నలు, తెలిసిన అంశాలు అవవు కదా అయినా కూడా నువ్వు అడిగిన ప్రశ్నలకి నాకు తెలిసినంత వరకు సమాధానాలు చెప్తాను, అడుగు” అన్నాడు.
కొండచిలువ “ధర్మరాజా! ఎటువంటి గుణాలు ఉన్నవాణ్ని బ్రాహ్మణుడు అంటారు. అతడికి తెలియవలసిన పరమార్థము ఏమిటి? ఈ విషయాన్ని నాకు సవిస్తరంగా చెప్పు” అని అడిగింది.
పాండవుల్లో పెద్దవాడైన ధర్మరాజు కొండచిలువతో “సత్యం, సహనం, ఇంద్రియనిగ్రహం, శుచిత్వం, కరుణ, తపస్సు, త్యాగం, సత్స్వభావం అనే గుణాలు ఎవరి ప్రవర్తనలో స్పష్టంగా కనిపిస్తాయో అతడే బ్రాహ్మణుడు అనిపించుకుంటాడు. సుఖాన్ని, దుఃఖాన్ని సమభావంతో చూడగలగడమే బ్రాహ్మణుడు నేర్చుకోవలసిన గొప్ప చదువు” అన్నాడు.
అది విని కొండచిలువ “ధర్మరాజా! మంచి ప్రవర్తన, మంచి గుణాల వల్లే బ్రాహ్మణత్వం దొరుకుతుందని చెప్తున్నావు. అలాగయితే నువ్వు చెప్పిన మంచిప్రవర్తన, మంచిగుణాలు శూద్రకులంలో పుట్టినవాడిలో కనిపిస్తే అతడిని బ్రాహ్మణుడు అని చెప్పగలవా? సరయిన అర్థాన్ని వివరించు” అని మళ్లీ ప్రశ్నించాడు.
ధర్మరాజు కొండచిలువతో “ఆకస్మికంగా విపరీతాలు జరిగినప్పుడు కులాలు కలిసిపోయిన సమయంలో కులాల్ని పరీక్షించి నిర్ణయించడం కోసం వేరు వేరు గుణాల్ని ప్రవర్తనల్ని స్వాయంభువ మనువు నిర్ణయించి చెప్పాడు. బ్రాహ్మణులలో ఉండే సత్యం వంటి మంచి గుణాలు శూద్రకులంలో పుట్టినవాడికి ఉంటే అతడు మంచి శూద్రుడు అవుతాడు కాని బ్రాహ్మణుడు అవగలడా?
అటువంటి మంచి గుణాలు బ్రాహ్మణ కులంలో పుట్టినవాడికి లేకపొతే అతడు శూద్రుడు అని చెప్పక తప్పదు. కాబట్టి మంచిప్రవర్తన, మంచి నడవడిక కలిగినవాడు తన సౌశీల్యాన్ని ఎన్ని సార్లయినా కాపాడుకోగలడు. మంచిప్రవర్తన లేనివాడు ఎప్పటికీ లేనివాడే. ధనాన్ని రక్షించుకోడం కంటే నడవడిక కాపాడుకోవడమే మంచిది” అన్నాడు.
ధర్మరాజు మాటలు విని కొండచిలువ “మహాత్మా! ఇతరులకి చెడు కలగచేసి, అసత్యాలు చెప్పి హింస చేయనివాడు పుణ్యలోకాన్ని పొందుతాడు అని పెద్దలు చెప్తారు. అది ఎలా సాధ్య పడుతుంది? అహింస అంత గొప్ప పరమధర్మం అని ఎలా చెప్పగలం? దీన్ని వివరించి నాకు చెప్పు” అని అడిగింది.
కొండచిలువ ప్రశ్నకి ధర్మరాజు “దానం, పరోపకారం, సత్యం, అహింస అనేవి నాలుగు సమానమైన గొప్ప ధర్మాలు. వాటిలో అహింస చాలా గొప్పది. జీవుడు దేవతల్లో, మనుషుల్లో జంతువుల్లో కూడా మళ్లీ పుడుతూ ఉంటాడు కదా! అందులో దానము, దయ మొదలైన గుణాలు కలిగి అహింసని దీక్షతో ఆచరించేవాడు దేవజన్మ పొందుతాడు.
హింసా ప్రవృత్తి కలవాడు జంతువుగా జన్మిస్తాడు. సద్గుణాలు కలిగి అహింసని ఆచరించే మనిషికి దివ్యత్వం కలుగుతుంది కనుక అహింస గొప్ప ధర్మంగా చెప్పబడింది” అని చెప్పాడు.
ధర్మరాజు చెప్పిన సమాధానాలకి సంతృప్తి కలిగి నహుషుడు భీముణ్ని విడిచి పెట్టాడు. నహుషుడికి శాపవిమోచనం కలిగి దివ్యమైన రూపంతో నిలిచి ధర్మరాజుకి అనేక ఆధ్యాత్మిక రహస్యాలు బోధించాడు. ధర్మరాజు భీముడిని తీసుకుని తన నివాసానికి వెళ్లాడు.
అప్పటి వరకు ఉన్న ఎండ వేడి వల్ల అంతకంటే ఎక్కువ వేడిని కలిగించే దావానలం వల్ల అడవిలో ఉన్న చెట్లన్నీ ఎండిపోయాయి. వాటికి సంతోషాన్ని కలిగించేలా ఆహ్లాదంగా వానాకాలం వచ్చింది. పెద్ద పెద్ద ధారలతో కురిసే వాన, మబ్బుల వల్ల వ్యాపించిన అంధకారం స్వభావసిద్ధంగా ఏర్పడిన చీకటిలా కనిపించింది.
అడవిలో వర్షకాలం ఆశ్చర్యంగాను ఆహ్లాదంగాను అనిపించింది. ఆకాశంలో మేఘాల గర్జనలు; నేల మీద నీటిగుంటల్లో కప్పల బెకబెకలు; చెట్ల కొసల మీద నాట్యం చేస్తున్న నెమళ్ల నృత్యంతో ఏర్పడిన ధ్వనులు; తుమ్మెద గుంపుల మనోహరమైన రొదలు; అరవిచ్చిన కడిమిమొగ్గల పూలగుత్తుల సువాసనలతోను, మొగలిపువ్వుల పుప్పొడులతో కలిసి వచ్చిన వాయువుతోను వాతావరణం ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తోంది.
కొత్తగా మొలకెత్తిన పచ్చగడ్డి, పుట్టగొడుగులు, ఆర్ద్రకీటకాలు వంటి వాటి రంగు రంగుల కలయికతో ప్రకాశిస్తున్న భూదేవి ఇంద్రధనుస్సుతో వెలుగుతున్న ఆకాశంలా ఉంది. వర్షకాలం తరువాత ప్రజలందరికి సంతోషాన్ని పంచుతూ శరదృతువు ప్రవేశించింది.
ఇంతవరకు నన్నయభట్టు రచించిన శ్రీమదాంధ్రమహాభారతము అరణ్యపర్వము (141వ పద్యము వరకు).