[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
శిబిచక్రవర్తి చరిత్ర
“ధర్మరాజా! ఈ మానససరోవరంలో తనను ఆరాధించిన మహర్షులకి పరమేశ్వరుడు పార్వతీదేవితో కలిసి దర్శనాన్ని అనుగ్రహించాడు. అందువల్ల వశిష్ఠుడు అరుంధతీదేవితో కలిసి నివసించాడు.
ఇది ‘భృగుతుం’ పర్వత శిఖరం. ఇక్కడ ఉశీనర మహారాజు శిబిచక్రవర్తి యజ్ఞం చేశాడు.
ఇంద్రుడు, అగ్ని అతడి గుణగణాలు పరీక్షించాలని ఇంద్రుడు డేగరూపం, అగ్ని పావురంగాను మారారు. డేగ వల్ల భయపడిన పావురం శిబిచక్రవర్తిని శరణుకోరింది.
డేగ పావురాన్ని వెంటాడుతూ వచ్చి “అయ్యా! చక్రవర్తీ! నువ్వు ధర్మాన్ని, సత్యాన్ని ఆచరించేవాడివని విన్నాను. నేను చాలా ఆకలితో ఉన్నాను. నా ఆహారాన్ని నువ్వు నాకు దక్కకుండా చేస్తున్నావు. ప్రాణులన్నీ ఆహారం వల్లే జీవిస్తున్నాయి. ఈ పావురం నాకు అహారం. దాన్ని తినకపోతే నా ప్రాణాలు పొతాయి. నేను పోతే నా భార్య, పిల్లలు బ్రతకలేరు. ఒక్క పావురాన్ని కాపాడి నువ్వు ఇన్ని ప్రాణుల్ని హింసించడం ధర్మంకాదు.
ధర్మస్వరూపం తెలిసిన జ్ఞానులు ధర్మానికి కీడు కలిగించాలని మనస్సులో కూడా అనుకోరు. నిజమైన ధర్మం లోకానికంతటికీ మేలు చేసేదిగా ఉండాలి. ఈ పావురం నాకు వేదాలతో నిర్దేశించబడింది. డేగ పావురాల్ని భక్షిస్తుంది అనే వేదవాక్యం ఉంది కదా! కనుక, నువ్వు ఈ పావురాన్ని నాకు ఆహారంగా విడిచిపెట్టాలి” అంది.
డేగ మాటలు విని శిబిచక్రవర్తి “ఈ పావురం ప్రాణభయంతో నన్ను ఆశ్రయించింది. ఆశ్రయించినవాళ్లని నీచుడు కూడా వదలలేడు. నేను ఈ పావురాన్ని ఎలా విడిచిపెట్టగలను. ఆశ్రయించినవాళ్లని విడిచిపెట్టడం ధర్మం అనిపించుకుంటుందా. నువ్వు పక్షివయినా కూడా ధర్మం తెలిసినట్టు మాట్లాడుతున్నావు. ఆశ్రయించినవాళ్లని విడిచిపెట్టడం కంటే అధర్మం ఏముంది?
నీ ఆకలి ఈ పావురాన్ని తింటేనే తీరుతుందా? నీ పొట్టపోసుకుని ఆకలి తీర్చుకోడానికి ఈ అడవిలో ఎన్ని జంతువులు లేవు? లేళ్లు, దున్నలు, పందులు, పక్షులు వీటి మాంసాలు ఈ పక్షికంటే ఎక్కువగా నేను సమకూరుస్తాను. ఈ పావురం మీద కోపాన్ని విడిచిపెట్టు. నేను మాత్రం ఈ పక్షిని విడిచిపెట్టను” అన్నాడు.
అతడి మాటలకి డేగ “మహారాజా! ఈ పావురం నాకు ప్రకృతి సహజంగా ఏర్పడిన ఆహారం. ఈ పక్షిని రక్షించాలి అని నువ్వు అనుకుంటే దీని బరువుకి సమానమైన మాంసాన్ని నీ శరీరం నుంచి ఇయ్యి” అని అడిగింది.
శిబి డేగతో “నువ్వు చాలా మంచిదానివి” అని చెప్పి వెంటనే చిన్న కత్తితో తన శరీరంలో ఉన్న మాంసాన్ని కోసి తరాజుతో తూకం వేయించాడు.
కాని అతడి శరీరంలో ఉన్న మాంసం మొత్తం వేసినా కూడా పావురం బరువే ఎక్కువ కనిపిస్తోంది. శిబి చక్రవర్తి తనే తక్కెడలో ఎక్కాడు. తనని తనే అర్పణ చేసుకుంటున్న త్యాగానికి గొప్పగుణానికి డేగ, పావురం తమ నిజ స్వరూపాలతో ఇంద్రుడు, అగ్నిహోత్రుడుగా ప్రత్యక్షమయ్యారు.
శిబిచక్రవర్తిని “మహనుభావా! నీ త్యాగం, ధైర్యం, శౌర్యం వంటి గుణాలు నీలో తప్ప మరెవరిలోను కనిపించవు. నీ కీర్తి శబ్దబ్రహ్మ ఉన్నంత కాలము వ్యాపించి ఉంటుంది” అని అతణ్ని అభినందించి, వరమిచ్చి వెళ్లిపోయారు.
ఇది ఆ మహాపురుషుడి క్షేత్రం. ఎప్పుడూ పళ్లతో నిండి ఉండే ఈ తోట ఉద్దాలకమహర్షి కొడుకు శ్వేతకేతమహర్షిది. ఇక్కడ సరస్వతి మనిషి రూపం ధరించి శ్వేతకేతుడికి సేవ చేసింది.
శ్వేతకేతుడు, అష్టావక్రుడు మేనమామ మేనల్లుళ్లు. వాళ్లిద్దరు కఠోరమైన తప్పసు చేశారు” అని చెప్పాడు.
ధర్మరాజు రోమశమహర్హితో “మహనుభావా! అష్టావక్రుడి మహత్మ్యం వివరించండి, వినాలని ఉంది” అని అడిగాడు.
అష్టావక్రుడి చరిత్ర
రోమశమహర్షి “ధర్మరాజా! ఏకపాదుడు అనే గొప్ప మహర్షి ఉండేవాడు. అతడి భార్య పేరు సుజాత. నిరంతరం శిష్యులతో వేదాధ్యనం, విధ్యాభ్యాసం చేయించేవాడు. అతడి భార్య గర్భవతి.
ఒకరోజు సుజాత గర్భంలో ఉన్న శిశువు తండ్రితో “నీ శిష్యులు పగలు రాత్రి ఆపకుండా విద్యభ్యాసం చేస్తూ మందబుద్ధులవుతున్నారు. నిద్ర లేకపోవడం వల్ల వేదపాఠాల్ని తప్పుగా చదువుతున్నారు. ఇలా తప్పులు చదివించడమెందుకు?” అన్నాడు.
తననే నిందిస్తున్నాడని కోపగించిన ఏకపాదుడు “నువ్వు వేదాధ్యయనాన్ని వక్రంగా విమర్శించావు కనుక అష్టావక్రుడవై పుట్టు” అని శపించాడు.
సుజాత కడుపులో అగ్నిహోత్రంతో సమానమైన కొడుకు పెరుగుతున్నాడు. ప్రసవసమయం దగ్గరపడిందని తెలుసుకుని అమె భర్తతో “నిరుపేదలు కూడ ప్రసవసమయానికి ముందే నెయ్యి, నూనె, తిండి గింజలు తెచ్చుకుంటారు. మనకి ధనం లేదు కనుక వాటిని తెచ్చుకోడం సులభం కాదు. ఈ ప్రసవబాధ నుంచి బయటపడడం ఎలాగో తెలియట్లేదు” అంది.
ఏకపాదుడు ధనం కోసం జనకమహారాజు ఆస్థానానికి వెళ్లాడు. అక్కడ వరుణకుమారుడయిన ‘వంది’తో వాదించి ఓడిపోయి నీళ్లల్లో బందీగా ఉండి పోయాడు. ఆ సమయంలో సుజాతకి అష్టావక్రుడు, ఉద్దాలకుడి భార్యకి శ్వేతకేతుడు పుట్టారు.
మామ, మేనల్లుళ్లు ఇద్దరూ ఒకే వయస్సువాళ్లవడం వల్ల కలిసి మెలిసి పెరిగారు. పన్నెండేళ్లు దీక్షతో విద్యాభ్యాసం చేసి గొప్ప పండితులయ్యారు. అష్టావక్రుడు ఉద్దాలకుణ్ని తండ్రిగాను, శ్వేతకేతుణ్ని సోదరుడుగాను అనుకుంటూ సుఖంగా జీవిస్తున్నాడు.
ఒకరోజు అష్టావక్రుడు ఉద్దాలకుడి ఒళ్లో కూర్చుని ఆడుకుంటుంటే చూసి శ్వేతకేతుడు అసూయతో “నువ్వు నా తండ్రి ఒడిలో కూర్చుని ఆడుకోకు, వెళ్లి నీ తండ్రి ఒడిలో కూర్చుని ఆడుకో” అన్నాడు.
అష్టావక్రుడు ఏడుస్తూ తల్లి దగ్గరికి వెళ్లి “నా తండ్రి ఎవరు? ఎక్కడికి వెళ్లాడు?” అని అడిగాడు.
తన తల్లి చెప్పింది విని మేనమామ ఉద్దాలకుణ్ని వెంటబెట్టుకుని తండ్రి దగ్గరికి వెళ్లాడు. శ్వేతకేతుడు జనకమహారాజు చేస్తున్న యజ్ఞానికి వెళ్లారు. ద్వారపాలకుడు వాళ్లని లోపలికి వెళ్లనివ్వలేదు.
వాళ్లు ద్వారపాలకుణ్ని “ఈ వాకిలి నుంచి, మూగవాళ్లు, గుడ్డివాళ్లు, చెవిటివాళ్లు, స్త్రీలు, బ్రాహ్మణులు అందరూ లోపలికి వెడుతున్నారు కదా.. మేము బ్రాహ్మణులం, పండితులం. మమ్మల్ని ఎందుకు అడ్డగిస్తున్నావు?” అని అడిగారు.
ద్వారపాలకుడు “మహానుభావులైన వృద్ధ విద్వాంసులు, అనుభవం కలిగిన ఋత్విజులు మాత్రమే ఈ యజ్ఞవాటికలోకి వెళ్లాలి. మీరు చిన్నవాళ్లు కనుక మీరు వెళ్లకూడదు” అని చెప్పాడు.
“చాలా సంవత్సరాలు ఓర్పుతో బతకడం, వెంట్రుకలు తెల్లబడడం ముసలివాళ్లకి గుర్తులా? జ్ఞానవంతుడైతే బాలుడు కూడా వృద్ధుడే. చక్కగా చదువుకుని ఆ చదువు నిత్యజీవితంలో ప్రతిఫలించేట్టు తన ప్రవర్తన తీర్చిదిద్దుకునేవాడు చిన్నవాడే అయినా ప్రజల గౌరవానికి అర్హుడే.
మమ్మల్ని చిన్నవాళ్లంటూ అవమానించవద్దు. మేము జనకమహారాజు సభలో గర్వంతో విర్రవీగుతున్న వేదాల గురించి వాదనలు చేసేవాళ్లతో సిద్ధాంత రాద్ధాంతాలు చేసి వాదించడానికి వచ్చాము” అని చెప్పారు.
ద్వారపాలకుడు రాజుగారి అనుమతి తీసుకుని అష్టావక్రుడు, శ్వేతకేతుల్ని లోపలికి పంపించాడు. జనకమహారాజు అడిగిన చిక్కు ప్రశ్నలకి సమాధానం చెప్పి అతడి కొలువులో బ్రాహ్మణులతో వాదిస్తున్న వరుణకుమారుడు వందితో వాదించి, అతణ్ని ఓడించాడు. అంతకు ముందు అతడితో వాదించి ఓడి బందీలుగా ఉన్న బ్రాహ్మణులందర్ని విడిపించాడు.
అన్ని లోకాలతో పూజింపబడిన జనకమహారాజుతో సత్కారం పొంది పండితుల ప్రశంసలు అందుకున్నాడు. తన తండ్రి ఏకపాదుణ్ని వెంటబెట్టుకుని గొప్ప తేజస్సుతో వెలుగుతూ తన ఆశ్రమానికి చేరుకున్నాడు” అని చెప్పాడు.
రోమశమహర్షి ఇంకా అనేక పుణ్యక్షేత్రాల గురించి వివరించి చెప్పాడు. “ఇది సమంగ అనే పుణ్యనది. ఇక్కడ భరతుడు రాజ్యాభిషిక్తుడయ్యాడు. పూర్వం ఇంద్రుడు సంపదని పొంది దీని జలాన్ని పైన చల్లుకుని పాపాలనుంచి విముక్తుడయ్యాడు. ఇది ‘మైనకకుక్షి’ అనే పర్వతం.
ఇక్కడ అదితి కొడుకుల కోసం తపస్సు చేసింది. ఇది ‘కనఖిల’ పర్వతం, ఇది ఋషిదైవతం. ఇది గంగానది. ఇందులో సనత్కుమారుడు సిద్ధి పొందాడు. ఇది ‘ఉష్ణగంగ’ ఇక్కడ స్నానం చేసినవాళ్ల కోరికలు తీరుతాయి. ఇది ‘రైభ్యాశ్రమం’.
ఇది భరద్వాజమహర్షి ఆశ్రమం. ఇందులో భరద్వాజమహర్షి కొడుకు ‘యవక్రీతుడు’ తన తపస్సు, పాండిత్యం వల్ల ఏర్పడిన గర్వంతో ప్రాణాలు పోగొట్టుకున్నాడు” అని చెప్పాడు రోమశమహర్షి.
యవక్రీతుడి చరిత్ర
“ధర్మరాజా! గొప్పవాళ్లైన రైభ్యమహర్షి, భరద్వాజమహర్షి స్నేహంతో మెలుగుతూ ఈ అరణ్యంలో తపస్సు చేస్తూ ఉండేవాళ్లు. రైభ్యమహర్షి కొడుకులు అర్థావసుడు, పరావసుడు వేదశాస్త్రాల్లో గొప్ప పాండిత్యాన్ని పొందారు. వాళ్లు ముగ్గురూ పండితులతో గౌరవించబడుతుంటే చూసిన యవక్రీతుడికి అసూయ కలిగింది.
ఎంతో కష్టపడి వేదాలు, శాస్త్రాలు, భగవంతుణ్ని పూజించే విధానాలు నేర్చుకోవడం కంటే గొప్ప తపస్సు చేసి వాటిని పొందాలనుకున్నాడు.
తపస్సు చెయ్యడం ప్రారంభించాడు. అతడు చేస్తున్న తపస్సు తీవ్రతకి తట్టుకోలేక ఇంద్రుడు వచ్చి “ఎందుకు ఇంత ఉగ్రతపస్సు చేస్తున్నావు? అని అడిగాడు.
యవక్రీతుడు “నాకు ఏ గురువు దగ్గర విద్యాభ్యాసం చెయ్యకుండా వేదాలు శాస్త్రాలు అన్నీ వచ్చెయ్యాలి. అందుకే తపస్సు చేస్తున్నాను” అన్నాడు.
అతడి మాటలు విని ఇంద్రుడు “గురువుద్వారా కాకుండా తీవ్రమైన తపస్సు ద్వారా పొందిన విద్యల వల్ల గర్వము అసూయ కలుగుతాయి. విద్యని పొందడానికి ఇది పద్ధతి కాదు” అని చెప్పి వెళ్లిపోయాడు.
యవక్రీతుడు మళ్లీ తపస్సు మొదలుపెట్టాడు. ఇంద్రుడు ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో వచ్చి తన బలం లేని పిడికిళ్లతో ఇసుకని తీసి మహాప్రవాహం కలిగిన గంగానది నీటికి అడ్డంగా ఆనకట్ట కట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు.
అతణ్ని చూసి యవక్రీతుడు హేళనగా “నువ్వు నూరేళ్లు నిండిన ముసలివాడివి. పైగా బాగా బలహీనంగా ఉన్నావు. ఈ ఆనకట్ట ఎప్పటికి పూర్తవుతుంది?” అని అడిగాడు.
ఇంద్రుడు “నేను కూడా నీలాగే సాధ్యంకాని దానికోసం కష్టపడుతున్నాను” అని తన నిజస్వరూపం చూపించాడు. అతణ్ని కూడా వృథా ప్రయాస మానమన్నాడు.
తన లక్ష్యం సిద్ధించేవరకు తన తపస్సు మాననన్నాడు యవక్రీతుడు. ఇంద్రుడు అతడికి కావలసిన వరాన్ని ప్రసాదించాడు. యవక్రీతుడు తండ్రి దగ్గరికి వెళ్లి చెప్పాడు. భరద్వాజమహర్షి కొడుకులో ఉన్న గర్వాన్ని గుర్తించాడు.
దేవగీతలుగా ప్రసిద్ధిగాంచిన పద్యగాథల భావాన్ని యవక్రీతుడికి వివరించాడు. “‘బలధి’ అనే మహర్షి కొడుకు చనిపోతే బాధపడుతూ గొప్ప తపస్సు చేశాడు. దేవతల్ని మెప్పించి చిరంజీవి అయిన కొడుకుని పొందాడు. అతడి పేరు ‘మేధావి’. అతడు తను ఆయుష్షు కలవాడిననే గర్వంతో ఋషుల్ని ఎవర్నీ లెక్కచేయకుండా విచ్చలవిడిగా తిరగడం మొదలుపెట్టాడు.
ఒకరోజు ‘ధనుషాక్షుడు’ అనే ఋషిని ఇష్టానుసారం మాట్లాడాడు. ఆయనకి కోపంవచ్చి మేధావిని యముడి దగ్గరికి పంపించాడు. గర్వం ఎవరినైనా క్షణంలో కాల్చేస్తుంది. గర్వంలేనివాడే మంచి మనిషి. కనుక నువ్వు గర్వాన్ని, కోపాన్ని వదిలిపెట్టి శాంతస్వబావంతో రైభ్యమహర్షి కొడుకుల మీద అసూయ వదిలిపెట్టు” అని చెప్పాడు.
యవక్రీతుడు అప్పటికి మాత్రం “అలాగే! నాకు రైభ్యమహర్షి, మీరూ సమానమే!” అని సమాధానం చెప్పాడు.
ఋషుల సభల్లో తన పాండిత్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఒకరోజు యవక్రీతుడు రైభ్యుడి ఆశ్రమానికి వెళ్లాడు. అక్కడ ‘కృష్ణ’ అనే పేరుగల రైభ్యమహర్షి కోడల్ని చూసి తన మనస్సులో కలిగిన కోరికని ఆమెకి చెప్పాడు.
కాదంటే శపిస్తాడేమో అని భయపడి మాట్లాడకుండా వేగంగా ఇంటికి వచ్చి కృష్ణ తన మామగారికి చెప్పి కళ్లనీళ్లతో తల వంచుకుని నిలబడింది.
రైభ్యమహర్షికి యవక్రీతుడి మీద పట్టలేనంత కోపం వచ్చింది. కోపాగ్నితో రగిలిపోతూ తన శిఖనుంచి ఒక జడని లాగి చేత్తో పట్టుకుని అగ్నిహోత్రంలో వేశాడు. అగ్నికుండంలోంచి తన కోడలికంటే గొప్ప సౌందర్యవంతురాలు ఉచ్భవించింది.
రైభ్యమహర్షి ఇంకో జడని తీసి మళ్లీ హోమకుండంలో వేశాడు. హోమకుండం నుంచి వంకరకోరలతో భయంకరమైన రాక్షసుడు ఉద్భవించాడు.
వాళ్లిద్దరూ చేతులు జోడించి చేయవలసిన పనేమిటో చెప్పమన్నారు. రైభ్యమహర్షి వాళ్లేం చెయ్యాలో వివరించి చెప్పాడు. మొదట సౌందర్యవంతురాలు యవక్రీతుడి దగ్గరికి వెళ్లి మంచి మాటలతో ప్రలోభపెట్టి అతడి చేతులో ఉన్న కమండలాన్ని తీసుకుంది.
అపవిత్రంగా ఉన్న యవక్రీతుడి గొప్ప శక్తి నశించిపోయింది. అతణ్ని రాక్షసుడు చంపడానికి వెంటపడ్డాడు. యవక్రీతుడు పారిపోయి నదుల్లోను, సరస్సుల్లోను దాక్కున్నాడు. అవన్నీ ఎండిపోయాయి.
చివరికి తన తండ్రికి సంబంధించిన అగ్నిహోత్రశాలలో దాక్కున్నాడు. రాక్షసుడు ఋషికొడుకు యవక్రీతుణ్ని ఈటెతో పొడిచి చంపేశాడు. తరువాత ఇద్దరూ కలిసి రైభ్యమహర్షి దగ్గరికి వెళ్లారు. హోమం నుంచి పుట్టిన ‘కృత్తి’ని మహర్షి రాక్షసుడికి ఇచ్చేశాడు.
భరద్వాజమహర్షి అడవినుంచి ఆశ్రమానికి వచ్చాడు. ఎప్పుడూ వెలుగుతూ ఉండే అగ్నులు నివురుకప్పి కనిపించాయి. అతడికి ఆశ్చర్యం కలిగి సేవకుణ్ని అడిగాడు. సేవకుడు చెప్పింది విని తన కుమారుడు చనిపోయినందుకు బాధపడ్డాడు.
రైభ్యుడికి కోపం చాలా ఎక్కువని అతడి ఆశ్రమం వైపుకి వెళ్లద్దని ముందే చెప్పాను. నువ్వు వినలేదు. గర్వం ఎక్కువైనవాడికి మంచి బుద్ధి ఎలా వస్తుంది అని బాధపడుతూ కొడుకుకి అగ్నిసంస్కారం చేశాడు. కొడుకు మరణించిన బాధని తట్టుకోలేక భరద్వాజమహర్షి కూడ అదే చితిలో ప్రాణత్యాగం చేశాడు.
బృహద్యుమ్నుడు అనే రాజు సత్రయాగం చేయాలని అనుకుని రైభ్యమహర్షి కొడుకులు అర్థావసు, పరావసుల్ని ఋత్విజులుగా ఎంచుకున్నాడు. వాళ్లు తండ్రి అనుమతి తీసుకుని యజ్ఞం చేయిస్తున్నారు.
ఒకరోజు పరావసు ఉదయాన్నే ఆశ్రమానికి వస్తున్నాడు. అదే సమయంలో రైభ్యుడు వస్తున్నాడు తండ్రిని చూసి క్రూరమృగమనుకుని పరావసుడు తండ్రిని చంపేశాడు. తను చంపింది తన తండ్రినే అని తెలుసుకుని దుఃఖపడ్డాడు. శవానికి అగ్నిసంస్కారం చేసి బృహద్యుమ్నుడి యాగశాలకి తిరిగి వఛ్ఛాడు.
తను చేసిన పని అన్నగారికి వివరంగా చెప్పి “ఈ సత్రయాగాన్ని నువ్వు ఒక్కడివే నిర్వహించలేవు. నేను ఒక్కడినే నిర్వహించగలను. కనుక, నువ్వు నా బదులుగా బ్రహ్మహత్యా దోషాన్ని పోగొట్టే వ్రతాన్ని చేయమని చెప్పాడు.
అర్థావసుడు అందుకు అంగీకరించి బ్రహ్మహత్యాపాతకాన్ని పోగొట్టే వ్రతాలు చేస్తున్నాడు. పరావసుడు ఒక్కడే సత్రయాగాన్ని నిర్వహిస్తున్నాడు.
తన చెయ్యవలసిన కార్యక్రమం పూర్తయ్యాక అర్థావసుడు యాగశాలకి వెళ్లాడు. అతణ్ని చూసి పరావసుడు బృహదుమ్నమహారాజుతో “మహారాజా! ఈ ఋషి యాగశలలోకి ప్రవేశించడానికి అర్హుడు కాదు. ఇతడు శుభకార్యాలు వదిలేసి భయంకరమైన బ్రహ్మహత్యాపాతకాల్ని పోగొట్టే వ్ర్రతాలు చేస్తున్నాడు” అని చెప్పాడు.
అది విని అర్థావసుడు “మహారాజా! బ్రహ్మహత్య చేసింది పరావసుడే కాని నేను కాదు. అతడి పాపాలు పోగొట్టడానికి వ్రతాలు చేసినవాడిని నేను” అన్నాడు. అతడి మాటలు విని దేవతలు అర్థావసుణ్ని అభినందించారు.