[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
సౌకన్యాఖ్యానము
అక్కడినుంచి బయలుదేరి నర్మదానదిలో స్నానం చేసి అక్కడున్న వైడూర్యపర్వతాన్ని చూశారు. ధర్మరాజుతో రోమశమహర్షి “త్రేతాయుగం చివర, ద్వాపరయుగం ప్రవేశించడానికి ముందు శర్యాతి మహారాజు ఇక్కడ యజ్ఞం చేశాడు.
ఇక్కడ భృగుమహర్షి కొడుకు చ్యవనమహర్షి శర్యాతిమహారాజు కూతురు సుకన్యని పెళ్లిచేసుకున్నాడు. తరువాత శర్యాతి చేసిన యజ్ఞంలో ఇంద్రుణ్ని లక్ష్యపెట్టక అశ్వినీదేవతలకి సోమరసాన్ని ఇచ్చాడు” అని చెప్పాడు.
అది విని ధర్మరాజు అదెల్లా జరిగిందో వివరంగా చెప్పమని అడిగాడు.
“ధర్మరాజా! ఈ సరస్సుకి దగ్గరగా భృగుమహర్షి కొడుకు చ్యవనమహర్షి ఎన్నోవేల సంవత్సరాలు గొప్ప తపస్సు చేశాడు. ఆ మహర్షి శరీరం పుట్టతో కప్పబడిపోయింది. దానికి దగ్గరలో పొదలు తీగలు ఆ పుట్టని చుట్టుకున్నాయి. ఆ అడవిలో మహర్షి శరీరం కనిపించకుండా ఉండిపోయింది. చాలా సంవత్సరాలు గడిచిపోయాయి.
ఒకసారి శర్యాతి మహారాజు నాలుగువేలమంది రాణులతో కలిసి ఆ కొలనులో విహరించడానికి వచ్చాడు. మహారాజు కూతురు సుకన్య తన చెలికత్తెలతో కలిసి అడవిలో తిరుగుతోంది.
పుట్టలో మెరుస్తూ కనిపిస్తున్న చ్యవనమహర్షి కళ్లు చూసి మిణుగురు పురుగుల వెలుగు అనుకుని ఆలోచించకుండా పుట్టని తవ్వించింది.
చ్యవనమహర్షికి కోపం వచ్చి శర్యాతి సైన్యానికి మలమూత్రాలు బంధించాడు. సుకన్య తను చేసిన పొరపాటు వల్లే ఇదంతా జరిగిందని అనుకుంది. ఏం జరిగిందని సైన్యాన్ని అడిగింది. ఎవరికీ కారణం తెలియలేదు. సుకన్య జరిగినదంతా తన తండ్రికి చెప్పింది.
శర్యాతి మహారాజు పుట్ట దగ్గరికి వెళ్లి చూశాడు. అందులో చాలాకాలంగా తపస్సు చేస్తూ ఉండడం వల్ల చిక్కిపోయి కేవలం తోలు, ఎముకలు మాత్రమే మిగిలిన శరీరంతో ఉన్న చ్యవనమహర్షిని చూసి నమస్కారం చేశాడు. “ఋషీశ్వరా! మీ తపస్సు యొక్క మహిమ తెలియక మా అమ్మాయి సుకన్య చేసిన పొరబాటుకి క్షమించండి. దయతో నా సైన్యానికి ఏర్పడిన బాధ పోగొట్టండి. వయస్సులో ఉన్న ఆడపిల్లలకి వివేకం ఉండదు కదా!” అని ప్రార్థించాడు.
చ్యవనమహర్షి శర్యాతిమహారాజు తన కూతురు సుకన్యని తనకిచ్చి పెళ్లిచేస్తే క్షమిస్తానని చెప్పాడు. మహారాజు తన కూతుర్ని మహర్షికి ఇచ్చి పెళ్లిచేసి తన సైన్యాన్ని బాధనుంచి రక్షించుకుని వెళ్లిపోయాడు. సుకన్య తన భర్త చ్యవనమహర్షికి భక్తితో సేవలు చేస్తోంది.
సౌందర్యవంతురాలైన సుకన్య దగ్గరికి అశ్వినీదేవతలు వచ్చి “అవ్వా! నువ్వు ఎవరి కూతురివి? ఎవరి భార్యవు?” అని అడిగారు. సుకన్య “నేను శర్యాతి మహారాజు కూతుర్ని, భార్గవనందనుడు చ్యవనమహర్షికి భార్యని” అని చెప్పింది.
అశ్వినీ దేవతలు ఆమెను చూసి “నీ అందం ఎటువంటిది? నీ సంపదలు ఎటువంటివి? ఈ ముసలి చ్యవనుణ్ని పెళ్లి చేసుకున్నావా? నీకు తగిన వరుణ్ని కోరుకో. అతడితో నీకు పెళ్లి జరిపిస్తాము” అన్నారు.
సుకన్య “నా భర్త చ్యవనమర్షి అంటే నాకు చాలా ప్రేమ. మీరు ఇలా మాట్లాడ్డం బాగుండలేదు” అంది.
వాళ్ల మాటలు సుకన్య భర్తకి చెప్పింది. చ్యవనుడు “అశ్వినీదేవతలు చెప్పినట్టు చెయ్యి” అన్నాడు.
సుకన్య భర్త చెప్పమన్నట్టు “నాకు కొత్త పడుచుదనం కలిగిన పెండ్లికొడుకు కావాలి” అని అడిగింది.
వాళ్లు ఆ కొలనులోకి దిగారు. చ్యవనమహర్షి కూడా ఆ కొలనులోకి దిగాడు. ఆ ముగ్గురు కొలనులోంచి నవయౌవనంతో బయటికి వచ్చి “మా ముగ్గురిలో నీకు కావలసినవాళ్లని ఎంచుకో” అన్నారు. సుకన్య తన భర్త చ్యవనమహర్షిని ఎంచుకుంది.
చ్యవనమహర్షి అశ్వినీదేవతలతో “మీ వల్ల నాకు మళ్లీ కొత్తగా యౌవనం వచ్చింది. శర్యాతి మహారాజు చేసే యజ్ఞంలో దేవేంద్రుడు చూస్తుండగా మీతో సోమరసాన్ని తాగిస్తాను” అని చెప్పాడు. అది విని అశ్వినీదేవతలు సంతోషంగా వెళ్లిపోయారు.
శర్యాతి మహారాజు తన అల్లుడు మళ్లీ పడుచుదనాన్ని పొందాడని తెలుసుకుని సంతోషపడ్డాడు. కూతుర్ని అల్లుణ్ని చూడాలని వచ్చాడు. చ్యవనుడు మమగారైన శర్యాతిని గౌరవించి “మహారాజా! నీకు గొప్ప కీర్తి కలిగేట్టు నీ చేత యజ్ఞాన్ని చేయిస్తాను. నీకు మంచి జరుగుతుంది. యజ్ఞానికి కావలసిన ఏర్పాట్లు చేయించు” అని చెప్పాడు.
మహర్షి చెప్పినట్టు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు మహారాజు. చ్యవనమమర్షి శాస్త్రోక్తంగా శర్యాతితో యజ్ఞం చేయించాడు.
అశ్వినీ దేవతలకి సోమరసం ఇస్తున్న సమయంలో ఇంద్రుడు వచ్చి కోపంతో “అశ్వినీదేవతలు ఇద్దరూ దేవతలకి వైద్యం చేస్తారు. వీళ్లు సోమరసానికి అర్హులు కాదు. ఈ పని నువ్వు చెయ్యకూడదు” అన్నాడు.
ఇంద్రుడు వద్దని చెప్తున్నా వినకుండా చ్యవనమహర్షి అశ్వినీదేవతలకి సోమరసాన్ని ఇచ్చి తాగించాడు. ఇంద్రుడు కోపంతో చ్యవనమహర్షి మీదకి తన వజ్రయుధాన్ని ఎత్తాడు.
చ్యవనమహర్షి రౌద్రాకారంతో ఇంద్రుడి చేతిని వజ్రాయుధంతో సహా స్తంభించేలా చెయ్యడం కోసం అనుకుని హోమం చేశాడు. అందులోంచి బయంకరమైన శక్తి, గొప్ప వేగం కలిగిన రాక్షసుడు ‘మదుడు’ ఆవిర్భవించాడు.
అతడి ఆకారం భూమిమీద సంచరించేవాళ్లకి, ఆకాశంలో సంచరించేవాళ్లకి కూడా భయం కలిగించేట్టు ఉంది. పదివేల ఆమడలు పొడుగు కలిగిన చేతులు, నూరామడలు పొడుగు కలిగిన నాలుగు కోరలు, పది ఆమడలు పొడుగు కలిగిన దంతాలు, సూర్య చంద్రబింబాల్లా ఉన్న కళ్లు..
ప్రళయకాలంలో అగ్నిగోళంలా ఉన్న నోరు కలిగిన అతడి శరీరం అకాశము భూమి మధ్య భాగంలో ఒక దవడ భూమికి, రెండవ దవడ ఆకాశానికి వ్యాపించి ఉంది. అతడి నోటిలో ఉన్న నాలుక వేగంగా కదులుతూ కింద పెదవిని నాకుతూ చూస్తున్నవాళ్లకి భయం కలిగిస్తోంది. భయంకరమైన శబ్దంచేస్తూ మీదకి ఉరుకుతూ వస్తున్న ఆ రాక్షసుణ్ని చూసి దేవేంద్రుడు భయపడ్డాడు.
తన చెయ్యి కదలకుండా ఉండిపోవడం వల్ల అతణ్ని ఏమీ చెయ్యలేక చ్యవనుడి దగ్గరికి వచ్చి “మహర్షీ! నీ తపశ్శక్తివల్ల చేసిన ప్రయత్నం వ్యర్థమవదు కదా. ఈ రోజు నుంచి ఆశ్వినులు సోమరసాన్ని తీసుకోడానికి అర్హులవుతారు. నేను చేసిన తప్పుకి క్షమించి కాపాడు” అని ప్రార్థించాడు.
చ్యవనమహర్షి శాంతించాడు. ఇంద్రుడు మామూలు స్థితికి వచ్చాడు. మహర్షి దగ్గర సెలవు తీసుకుని తన పట్టణానికి వెళ్లిపోయాడు.
చ్యవనుడు సృష్టించిన రాక్షసుడు మహర్షి చెప్పడం వల్ల కల్లులోను, స్త్రీలలోను, వేటలోను, పాచికల్లోను ప్రవేశించాడు. అశ్వినీదేవతలు యజ్ఞంలో సోమరసాన్ని తాగే అర్హతని పొంది స్వర్గానికి వెళ్లారు.
చ్యవనమహర్షి తపోమహిమ వల్ల ఆ కొండకి ‘ఆర్చీకపర్వతం’ అనే పేరు వచ్చింది” అని చెప్పాడు రోమశుడు.
పాండవులు అక్కడి పుణ్యసరస్సులో స్నానం చేసి వెళ్లారు. తరువాత శంతనుడు, శునకుడు, నరుడు, నారాయణుడు, బ్రహ్మదేవుడు తపస్సు చేసిన స్థలము; దేవమునులు నివసించే స్థానమైన సైంధవారణ్యంలో ఉన్న చంద్రసరస్సులో హోమన్నాలతో హోమాలు చేసి అతిథుల్ని పూజించి ప్రయాణం చేస్తూ యమునా నదిని చేరారు.
మాంధాతృ చరిత్ర
రోమశుడు పాండవులతో “ఇది యమునానది. దేవతలనది అయిన గంగా నదితో సమానమైంది. పూర్వం ఈ నదీతీరంలో ఎంతో సంపదని ఖర్చుచేసి ప్రసిద్ధుడైన మాంధాతృడు అనేక యజ్ఞాలు చేశాడు” అని చెప్పాడు.
ధర్మరాజు “మహర్షీ! మాంధాత వృత్తాంతం వివరించండి!” అని అడిగాడు.
ధర్మరాజుతో రోమశుడు “వేయి అశ్వమేధయాగాలు చేసిన ధర్మచరిత్ర కలవాడు, ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడు, గొప్ప బలము, కీర్తి, శౌర్యము కలవాడు, మంచివాడు అయిన యవనాశ్వుడు అనే రాజు సంతానం లేక బాధపడుతూ రాజ్య పాలనాభారాన్ని మంత్రులకి అప్పగించి భృగుమహర్షి ఆశ్రమానికి వెళ్లి చాలాకాలం పుత్రుల కోసం మహర్షిని ఆరాధించాడు.
భృగుమహర్షి యవనాశ్వుడి కోసం పుత్రకామేష్టి చేసి, అందులో మంత్రాలతో పవిత్రమైన నీటితో నిండిన, కొడుకులు కలగడానికి కారణమైన కుండని పొంది దాన్ని జాగ్రత్తగా కాపాడమని ఋత్విజుల్ని నియమించాడు.
యజ్ఞం పూర్తయ్యక ఆ రాత్రి ఋత్వుజులు అందరు అలిసిపోయి నిద్రపోయారు. రాజు యవనాశ్వుడు దాహం వేసి కలశంలో ఉన్న మంత్ర జలాన్ని మొత్తాన్ని తాగాడు.
ఆ విషయం భృగుమహర్షికి తెలిసింది. “మహారాజా! నీకు కొడుకు పుట్టాలని తపస్సు మహిమతో పొందిన ఈ మంత్రజలాల్ని నీ భార్యకి ఇవ్వాలని ఉంచాను. కాని, నువ్వు విపరీతమైన దాహం వల్ల ఆ నీటిని తాగావు.
దైవఘటనని ఎవరూ మార్చలేరు. నీ గర్భం నుంచి ఇంద్రుడితో సమానుడైన కొడుకు పుడతాడు” అని చెప్పాడు. యవనాశ్వుడు తన రాజధానికి వెళ్లిపోయాడు.
నూరు సంవత్సరాలు గడిచాక యవనాశ్వుడికి ఎడమ ప్రక్కని చీల్చుకుని గొప్ప తేజస్సుతో వెలిగిపోతూ కొడుకు కలిగాడు. ఆ బాలుణ్ని చూడడానికి దేవేంద్రుడు వచ్చి అతడి నోట్లో తన చూపుడు వేలు ఉంచి అమృతాన్ని తాగించాడు. అతడికి మాంధాతృడు అని పేరు పెట్టాడు. మాంధాత్రుణ్ని దేవేంద్రుడే పోషించాడు.
ఏకాగ్రతతో మనస్సులో తలుచుకోగానే అతడికి నాలుగువేదాలు, వివిధ శాస్త్రాలు, విలువిద్య, దివ్యాలైన అమ్ముల్ని ప్రయోగించడం అన్ని విద్యలు వచ్చేశాయి. అతడు మూడులోకాల్లోను గౌరవింపబడ్డాడు.
ఇంద్రుడు మాంధాతని సమస్త భూమండలానికి రాజుగా పట్టాభిషిక్తుణ్ని చేశాడు. ‘ఆజగవం’ అనే విల్లుని పట్టుకుని దేవేంద్రుడి సింహాసనం మీద ఇంద్రుడితోపాటు కూర్చున్నాడు.
అనేక మంత్రబాణాల్ని, భేదించడానికి శక్యంకాని కవచాన్ని ధరించాడు. అన్ని లోకాల్ని జయించిన జగదేకవీరుడిగా అనేక యజ్ఞాలు చేసి సంపూర్ణమైన దక్షిణలు ఇచ్చి, కోటానుకోట్ల ఆవుల దానంతో బ్రాహ్మణుల్ని సంతృప్తి పరిచి తన ఆజ్ఞ ప్రకారం ప్రజలు నడుచుకునేలా పాలించాడు.
భూమి మీద వానలు పడలేదన్న కోపంతో మాంధాత ఇంద్రుడితో భయంకరమైన యుద్ధం చేశాడు. మేఘాల మీద మంత్రబాణాల్ని ప్రయోగించి పంటలు బాగా పండేట్టుగా వానలు కురిపించాడు. ఇది మాంధాత యజ్ఞం చేసిన చోటు” అని చెప్పాడు.
రాజర్షి సోమకుడి చరిత్ర
తరువాత రోమశమహర్షి “ధర్మరాజా! కురుక్షేత్రంలో సరస్వతీనదీ తీరంలో సోమకుడు అనే రాజు యజ్ఞం చేసి నూరుగురు కొడుకుల్ని పొందాడు” అని చెప్పాడు.
ధర్మరాజు సోమకుడు అనే రాజర్షి గురించి వివరించమని అడిగాడు.
రోమశమహర్షి “ధర్మరాజా! సోమకుడు అనే రాజర్షి గొప్ప యజ్ఞం చేసి ‘జంతుడు’ అనే పేరు కలిగిన కొడుకుని పొందాడు. రాజుకి నూరుగురు రాణులు ఉన్నారు.
వాళ్లు ఒకే కొడుకైన జంతుణ్ని తమ సొంత కొడుకుగా ప్రేమగా చూసుకుంటున్నారు. అసూయ లేకుండా పెంచుతున్న ఆ రాణుల్ని చూసి ప్రజలు ఆశ్చర్యపోయేవారు.
ఒకరోజు ఆ బాలుడికి గండు చీమ కుట్టింది. ఆ బాధ తట్టుకోలేక ఆ పిల్లవాడు గట్టిగా ఏడ్చాడు. రాణులందరు పరుగెత్తుకుని వచ్చి ఏడుస్తున్న కొడుకు ఏడుపు చూసి తట్టుకోలేక వాళ్లు కూడా గట్టిగా ఏడవడం మొదలెట్టారు. ఆ ఏడుపులు విని మహారాజు అంతఃపురానికి వెళ్లి వాళ్లందర్నీ చూసి కొడుకుని ఓదార్చాడు.
తరువాత సభకి వెళ్లి మంత్రులతోను, ఋత్విజులతోను “నాకు భార్యలు నూరుమంది ఉన్నారు. కొడుకు ఒక్కడే ఉన్నాడు. ఒక్క కొడుకుని నమ్మకూడదంటారు. ఇప్పుడు నేను ఏది చేస్తే బాగుంటుందో చెప్పండి” అని అడిగాడు.
సోమకమహారాజుకి యజ్ఞం చేయించే పురోహితులు “మహారాజా! నీ వందమంది రాణులవల్ల వందమంది కొడుకులు పుట్టాలనే కోరిక ఉంటే మేము చెప్పినట్టు యజ్ఞం చెయ్యి. ఇలా చెయ్యను, అలా చెయ్యను అని ఎదురు చెప్పకు.
మహారాజా! నీ ఏకైక కుమారుడు జంతుణ్ని యజ్ఞపశువుగా చేసి సంహరించి అతడి కడుపులో ఉండే ‘వపను’ (నాభి కింద పలుచని కొవ్వుతో ఉండే మాంసపు పొర లేదా మెదడు) హవ్యంగా చేసి అగ్నిహోత్రుడికి తృప్తి కలిగిస్తే నీ వందమంది భార్యలకి వందమంది కొడుకులు పుడతారు. వాళ్లల్లో ముందు పుట్టిన జంతుడు బంగారు లక్షణాలు కలిగిన కుడిపార్శ్వంతో ఉంటాడు” అని చెప్పారు.
సోమకుడు అందుకు అంగీకరించి కొడుకుని యజ్ఞంలో బలిపశువుగా చేసాడు. అతడి ‘వపని’ హోమంగా వేల్చడం చూసి నూరుగురు తల్లులు గోడు గోడున ఏడిచారు.
వపహోమం జరిగినప్పుడు వచ్చిన పొగని బాగా పీల్చడం వల్ల సోమకుడి భార్యలు గర్భం దాల్చారు. వాళ్లకి జంతుడితో సహా నూరుగురు కొడుకులు కలిగారు. జంతుడిని చూసుకున్నట్టే చూసుకున్నారు. వాళ్లందరు పెరిగి పెద్దవాళ్లయ్యారు. కొంతకాలానికి సోమకుడు, యజ్ఞం చేయించిన ఋత్విజుడు మరణించారు.
మహారాజు స్వర్గానికి వెడుతూ నరకంలో బాధలు పడుతున్న ఋత్విజుణ్ని చూసి “నువ్వెందుకిలా బాధలు పడుతున్నావు?” అని అడిగాడు.
ఋత్విజుడు “మహారాజా! నీ యజ్ఞంలో ఋత్విజుడిగా ఉండడం వల్లనే నాకు ఈ నరకబాధలు కలిగాయి. నువ్వే నన్ను కాపాడాలి” అన్నాడు.
సోమకుడు యముడి దగ్గరికి వెళ్లి “ఈ ఋత్విజుడు నా కారణంగానే ఈ నరకలోకంలో మగ్గుతున్నాడు. అతడిని నాతో పాటు స్వర్గానికి తీసుకుని వెడతాను” అని చెప్పి అతడిని తనతో పుణ్యలోకాలకి తీసుకుని వెళ్లాడు. స్వర్గలోకంలోవాళ్లు సోమకుణ్ని పొగిడారు.
పాండవులతో కలిసి ప్రయాణం చేస్తూ రోమశమహర్షి “ఈ ప్రదేశంలో పూర్వకాలం బ్రహ్మదేవుడు వెయ్యి సంవత్సరాలు జరిపించే ‘ఇష్టాకృతం’ అనే సత్రయాగాన్ని చేశాడు. అతడు యజ్ఞంలో లోటుపాట్లు లేకుండా పరిశీలించే పండితులకి నూరు అర్బుదాల ధనాన్ని దక్షిణగా ఇచ్చాడు.
ఇది సార్వభౌముడి యజ్ఞవాటిక. ఇది యయాతి యజ్ఞం చేసిన ప్రదేశం. అతడి యజ్ఞానికి దేవేంద్రుడు వచ్చాడు. ఇది ‘రామహ్రదం’. ఇది ‘ప్లక్షావతరణం’ అనే తీర్థం. ఈ యమునా తీర్థంలో దేవతలు, మహర్షులు సరస్వతికి సంబంధించిన యజ్ఞం చేశారు. ఇది దేవఋషి సంవర్తుడితో కాపాడబడింది.
ఇక్కడ భరతుడు చాలా యజ్ఞాలు చేసి సర్వలోకాల్ని దివ్యదృష్టితో చూడగలిగాడు. నువ్వుకూడా స్నానం చేసి ఆ లోకాలన్నీ దర్శించు” అని చెప్పాడు.
ధర్మరాజు తన తమ్ముళ్లతోపాటు ఆ తీర్థంలో స్నానం చేసి రోమశమహర్షితో “ఓ గొప్ప మహర్షీ! నేను దేవర్షుల లోకాన్ని, అకాశగమనం ఉన్న ఖేచరుల లోకాన్ని, సర్పలోకాన్ని దర్శించాను.
ఇంకా దేవేంద్రుణ్ని, దేవేంద్రుడి దగ్గర గాండీవమనే విల్లు ధరించిన గొప్ప భుజాలు కలిగి గంభీరంగా ఉండే కిరీటిని జయలక్ష్మితో తేజరిల్లుతున్న పార్థుణ్ని సవ్యసాచిని చూశాను” అన్నాడు.
ధర్మరాజు చెప్పిన మాటలు విని రోమశమహర్షి “ధర్మరాజా! ఇది దక్షుడు యజ్ఞం చేసిన ప్రదేశం. ఇది భూలోకంలో ‘సరస్వతీ’ అనే పేరుగల గొప్ప నది. ఇక్కడ దేవతల్లో మొదటివాడైన బ్రహ్మదేవుడు యజ్ఞాలు చేశాడు.
ఈ వేదిక అయిదు ఆమడలు కలిగి ఉంటుంది. దీనిమీద బ్రహ్మదేవుడు యజ్ఞం చేశాడు. ఇక్క మరణిస్తే మనుషులకి దైవత్వం సిద్ధిస్తుంది. పూర్వకాలం సరస్వతీనది నిషధదేశంలో భూమి లోపలికి అంతర్థానమైంది. మళ్లీ ‘చమసోద్భేదం’ అనే తీర్థంలో బయటపడింది.
ఇది ‘సింధుతీర్థం’. ఇక్కడ అగస్త్యమహర్షి లోపాముద్రని పెళ్లి చేసుకున్నాడు. ధర్మరాజా! ఈ పుణ్యతీర్థానికి ‘విష్ణుపదం’ అనిపేరు. ఈ పుణ్యనదికి ’విపాశ’ అని పేరు.
ఇది కాశ్మీర మండలం. ఈ నదికి ‘వితస్తం’ అని పేరు. ఈ క్షేత్రానికి ‘మానసద్వారం’ అని పేరు. పూర్వం పరశురాముడు ‘హంసపథం’ అనే క్షేత్రాన్ని నిర్మించాడు.”