[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
పరశురాముడి జననము
తపస్సే సంపదగా అక్కడ నివసిస్తున్న మహర్షులకి నమస్కారం చేసి, సత్కారాలు చేసి వాళ్లని సంతోషపెట్టి ధర్మరాజు “మహర్షులారా! ఈ కొండమీద మీరు శుభచరిత్ర కలిగిన పరశురాముణ్ని ఎప్పుడూ చూస్తూ ఉంటారుట కదా? మీరు దర్శించేటప్పుడు మేము కూడా దర్శించడానికి వీలు కల్గుతుందా?” అని అడిగాడు.
అతడి మాటలు విని ఋషుల బృందంలో ఉన్న పరశురాముడి శిష్యుడు ‘అకృతవ్రణుడు’ అనే ఋషి ధర్మరాజుతో “ధర్మరాజా! రేపు చతుర్దశి రోజు మహాత్ముడైన పరశురాముణ్ని ఈ ఋషులు చూస్తారు. నువ్వు కూడా వాళ్లతోపాటు దర్శించవచ్చు” అన్నాడు.
ధర్మరాజు ఆ రాత్రి మహేంద్రపర్వతం మీద ఉండిపోయాడు. ధర్మరాజు అకృతవ్రణ మహర్షితో “మహర్షీ! సమస్తలోకాల్లో ఉన్న ప్రజలందరితో పొగడబడిన పరశురాముడి చరిత్ర వినాలని నా మనస్సు ఉవ్విళ్లూరుతోంది. భార్గవ వంశంలో పుట్టిన ఆ మహనీయుడి చరిత్ర వినిపించమని వేడుకుంటున్నాను” అన్నాడు.
ధర్మరాజుతో అకృతవ్రణుడు “పూర్వం కన్యాకుబ్జం అనే పట్టణంలో ‘గాధి’ అనే రాజుకి ‘సత్యవతి’ అనే కూతురు ఉండేది. ఆమెని పెళ్లి చేసుకోవాలని భృగుమహర్షి కొడుకు ఋచీకమహర్షి రాజుని అడిగాడు.
గాధిరాజు మహర్షితో “ఒక చెవి నల్లకలువలా నల్లగాను, శరీరం అంతా చంద్రుడిలా తెల్లగాను ఉన్న వెయ్యి గుర్రాల్ని కన్యాశుల్కంగా నువ్వు తెచ్చి ఇస్తే నా కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను. ఇది మా వంశ సంప్రదాయం” అని చెప్పాడు.
భృగుమహర్షి కొడుకు ఋచీకుడు వరుణదేవుడి దగ్గరికి వెళ్లి ఆ గుర్రాల్ని సంపాదించి తెచ్చాడు. ధర్మరాజా! అలా ఉండే వేయి గుర్రాలు కన్యాకుబ్జంలో ఉండే గంగానది నుంచి అవతరించాయి. అందువల్ల ఆనాటి నుంచి కన్యాకుబ్జంలో ఉండే గంగానదికి ‘అశ్వతీర్థం’ అనే పేరు వచ్చింది.
ఋచీకుడు గాధిరాజు అడిగిన కన్యాశుల్కాన్ని ఇచ్చి అతడి కూతురు సత్యవతిని శాస్త్రోక్తంగా పెళ్లి చేసుకున్నాడు. ఒకరోజు భృగుమహర్షి కన్యకుబ్జానికి వచ్చాడు. కొడుకు కోడలు మహర్షిని పూజించారు.
భృగుమహర్షి కోడలు సత్యవతిని ఏదయినా వరం కోరుకోమన్నాడు. సత్యవతి “మహానుభావా! నాకు ఒక కొడుకు, నా తల్లికి ఒక కొడుకు కలిగేలా వరం కావాలి” అని అడిగింది.
భృగుమహర్షి పరిశుభ్రంగా స్నానం చేసి సత్యవతిని మేడి చెట్టుని, ఆమె తల్లిని అశ్వత్థచెట్టుని కౌగలించుకోమన్నాడు. కాని సత్యవతి అశ్వత్థచెట్టుని, ఆమె తల్లి మేడిచెట్టుని కౌగలించుకున్నారు.
ఆ విషయం తెలిసిన భృగుమహర్షి సత్యవతితో “బ్రాహ్మణులందరికీ పూజ్యుడైన కొడుకు నీకు పుడతాడు. కాని, దారుణమైన క్షత్రియ స్వభావంతో గర్వంగా ప్రవర్తిస్తాడు. నీ తల్లికి క్షత్రియుడు పుట్టినా గొప్ప తపస్వి అవుతాడు. బ్రాహ్మణ భావం, విజ్ఞానం గొప్పతేజస్సుల్ని పొందుతాడు” అని చెప్పాడు.
అది విని సత్యవతి ఆ మహర్షికి నమస్కరించి క్షత్రియభావం తన కొడుకుకి కాకుండా మనుమడికి కలిగేట్టు వరాన్ని పొందింది. కొంతకాలం తరువాత సత్యవతికి ప్రసన్నగుణము, నాలుగు వేదాల్లోను విలువిద్యలోను గొప్ప నేర్పు కలిగి పూర్వపు ఋషులతో సమానమైనవాడూ, మహాత్ముడూ అయిన కొడుకు కలిగాడు. అతడి పేరు జమదగ్ని.
జమదగ్నిమహర్షి ప్రసేనజితుడు అనే రాజు కూతురు రేణుకని వివాహం చేసుకున్నాడు. ఆమెయందు రుమణ్వంతుడు, సుషేణుడు, వసుడు, విశ్వావసుడు, రాముడు అనే అయిదుగురు కొడుకులు కలిగారు.
తండ్రి నుంచి వరాలు పొందిన పరశురాముడు
ఒకరోజు జమదగ్ని అడవిలో తీవ్రమైన తపస్సులో నిమగ్నుడై ఉన్నాడు. అతడి కొడుకులు పళ్లు తీసుకుని రావడానికి అడవికి వెళ్లారు. వాళ్లతో కలిసి తల్లి రేణుక కూడా వెళ్లింది. అక్కడికి దగ్గరలో భార్యలతో స్నానం చేస్తున్న మార్తికావత దేశపురాజుని చూసి ఆమె మనసు చలించింది.
మానసికమైన ఆమె నడవడిక తెలుసుకున్న ఆమె భర్త జమదగ్ని కోపంతో తన కొడుకులు నలుగురిని పిలిచి తన భార్యని చంపమన్నాడు.
వాళ్లు తల్లిని చంపడానికి అంగీకరించక మవునంగా ఉండిపోయారు. జమదగ్ని కోపంతో “భయంకరమైన అడవిలో బుద్ధి, జ్ఞానము లేకుండ జంతువులు, పక్షుల్లా ఉండండి!” అని శపించాడు.
తరువాత పదునైన గొడ్డలి పట్టుకుని ఉన్న రాముడిని చూసి ‘ఈ రేణుకని సంహరించు’ అన్నాడు. పరశురాముడు వెంటనే తన తండ్రి ఆజ్ఞ ప్రకారం తల్లిని సంహరించాడు.
పరశురాముడి తెగువ, తన మాట జవదాటని స్వభావానికి మెచ్చుకుని జమదగ్నిమహర్షి పరశురాముణ్ని అతడికి ఇష్టమైన వరాలు కోరుకోమన్నాడు.
పరశురాముడు సంతోషంతో “నా తల్లి బతకాలి. ఆమెని చంపిన పాపం నుంచి నాకు విముక్తి కలగాలి. నా సోదరులకి శాపవిమోచనం కలిగి ఎప్పటిలా ఉండాలి. యుద్ధాల్లో నన్ను మించినవాడు ఉండకూడదు. నేను ఎక్కువ ఆయుష్షు కలిగి ఉండాలి” అని కోరుకుని తండ్రి దగ్గరనుంచి ఆ వరాలన్నీ పొందాడు.
హైహయ వంశంలో పుట్టిన కార్తవీర్యుడు అపారమైన బలం, సూర్యుడి తేజస్సువంటి తేజస్సు, జయంచడానికి శక్యం కాని శౌర్యము కలిగి సహస్రబాహుడు అనే పేరుతో పిలవబడేవాడు. అతడు ఒకరోజు అరణ్యంలో వేటాడుతూ బడలికతో తన సైన్యంతో కలిసి జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు.
అతణ్ని జమదగ్ని గౌరవించాడు. రాజుని అనే గర్వంతో ఆ ఋషిని లక్ష్యపెట్టకుండా ఆశ్రమంలో వాళ్లని అవమానించాడు. అక్కడ ఉన్న చెట్లని విరిచేశాడు. లేగదూడతోసహా హోమధేనువుని బంధించి తీసుకుని పోయాడు.
పరశురాముడు శపథము
కొంత సమయానికి రాముడు దర్భలు మొదలైనవి పట్టుకుని అడవి నుంచి వచ్చాడు. జమదగ్నిమహర్షి జరిగినదాన్ని అతడికి చెప్పాడు. పరశురాముడు తండ్రి చెప్పినది విని కోపంతో ఊగిపోతూ వెళ్లి కార్తవీర్యుణ్ని వెంటాడి అనేక బాణాలు గుప్పించి అతడి సైన్యాన్ని చంపేశాడు.
సమస్తలోకాల్ని జయించి అందరు ఆశ్చర్యపోయేంత బలపరాక్రమాలు కలిగి గర్వంతో బలిసిన కార్తవీర్యుడి వేయి భుజాల్ని, చేతుల్ని నరికి యుద్ధంలో అతణ్ని సంహరించాడు.
కార్తవీర్యుడి కొడుకులు పగబట్టి పరశురాముడు లేని సమయంలో జమదగ్ని మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. ఋషుల్ని తిట్టి ఆశ్రమంలో కళకళలాడుతున్న చెట్లని పెకిలించివేశారు.
జమదగ్నిమహర్షిని పట్టుకుని బంధించారు. రామా! రామా! అని గట్టిగా పిలుస్తూ ఉండగానే ధర్మాత్ముడైన ఆ గొప్ప మహర్షిని మూర్ఖత్వంతో చంపేశారు.
పరశురాముడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. తండ్రి శవం దగ్గర కూర్చుని తల్లి బిగ్గరగా ఏడుస్తోంది. జరిగినదంతా తెలుసుకున్నాడు. వీరాధివీరుడైన జమదగ్ని కొడుకు పరశురాముడు బాధతోను, ఆగ్రహంతోను రగిలిపోతూ “పుణ్యాత్ముడు, ఏ కోరికలు లేనివాడు, కరుణామయుడు, ఇంద్రియాల్ని జయించిన మహాత్ముడు, శాంతుడు, దాంతుడు అయిన జమదగ్నిమహర్షిని నీచులైన హైహయులు ఆలోచించి బుద్ధిపూర్వకంగానే చంపారు.
ఇది తెలియక చేసిన నేరం కాదు. ఇటువంటి ఘోరమైన పనులు చేసే క్షత్రియ జాతిని మొత్తాన్ని సంహరిస్తాను” అని శపథం చేశాడు.
శపథం చేసినట్టుగానే క్షత్రియులందర్నీ సంహరించి మొత్తం భూమండలాన్ని జయించి శాస్త్రోక్తంగా యజ్ఞాన్ని చేసి ఋత్విజుడైన కశ్యపమహర్షికి సంభావనగా దానం చేశాడు. బంధాలన్నీ వదిలిపెట్టి వైరాగ్యంతో మహేంద్రగిరి కొండమీద ఎప్పుడూ నిష్ఠతో తపస్సు చేసుకుంటున్నాడు” అని చెప్పాడు.
ధర్మరాజు తమ్ముళ్లతోను, బ్రాహ్మణులతోను చతుర్దశి తిథిరోజు పరశురాముణ్ని దర్శించి పూజించి తిరిగి అతడితో గౌరవించబడి దక్షిణదిశగా బయలుదేరాడు. భూమండలంలో ప్రసిద్ధమై మూడులోకాల్ని పవిత్రం చేస్తూ ‘త్ర్యంబకం’ అనే చోట దక్షిణగంగ అయిన పుణ్యనది గోదావరిని దర్శించాడు.
గోవులు, దేవతలు, బ్రాహ్మణుల యందు భక్తికలిగి గోదావరీనదిలో స్నానం చేసి ఆవులు, బంగారము, అనేక రత్నాలు దానం చేసి బ్రాహ్మణుల్ని సత్కరించి ధర్మరాజు సూర్యుడి తేజస్సుతో వెలిగిపోతూ ఇంకా అనేక పుణ్యక్షేత్రాల్ని సందర్శించాలని బయలుదేరాడు.
ద్రవిడదేశంలో ఆగి అక్కడ ఉన్న అగస్త్యతీర్థంలో స్నానం చేశాడు. అంతకు ముందు అర్జునుడు చేసిన వేయి ఆవులదానం గురించి విని సంతోషపడ్డాడు.
శూర్పారకము అనే తీర్థాన్ని చేరుకుని అక్కడ కొండలా పొడవుగా వ్యాపించిన పరశురాముడి వేదికని చూసి అక్కడినుంచి సముద్ర తీరానికి వెళ్లి ప్రభాసతీర్థంలో పన్నెండు రోజులు ఉన్నాడు.
పాండవుల్ని కలిసిన శ్రీకృష్ణుడు
అక్కడ గాలి, నీరు మాత్రమే ఆహారంగా తీసుకుని ధర్మరాజు పంచాగ్ని మధ్యలో తపస్సు చేశాడు. పాండవులు ప్రభాసతీర్థంలో ఉన్నట్లు తెలుసుకున్న బలరాముడు, శ్రీకృష్ణుడు వృష్టి జాతికి చెందిన నాయకులతో కలిసి వచ్చారు. ఎన్నో పుణ్యక్షేత్రాలు దర్శిస్తూ రావడం వల్ల అలిసి, నీరసించినా స్వభావసిద్ధంగా ఉండే బలంతో ఉన్న పాండవుల్ని చూశారు.
నారబట్టలు, జింకచర్మము ధరించి తపోనిష్ఠతో ఉన్న పాండవుల్ని చూసి బాధపడ్డారు. సుకుమారి అయిన ద్రౌపదిని మృదువైన మాటలతో ఓదార్చారు. ధర్మరాజు తాము అరణ్యంలో పడిన బాధలు, తీర్థయాత్రలు సేవించడంలో పడిన బాధలు, అర్జునుడు సంపాదించిన దివ్యాస్త్రాల గురించి, దేవేంద్రుడి దగ్గర ఉన్న విషయం గురించీ అన్నీ వివరంగా చెప్పాడు.
అది విని బలరాముడు శ్రీక్రుష్ణుడు వృష్ణినాయకులతో “ధృతరాష్ట్రుడు ఆలోచన లేకుండా తన కొడుకులు చెప్పిన మాటలు విని పాపం చెయ్యడానికి భయపడే పాండవుల్ని రాజ్యం నుంచి వెళ్లగొట్టాడు. అడవుల్లో నివసించేటట్లు చేశాడు. భీష్ముడివంటి పెద్దలు కూడా నివారించలేదు.
సత్యనిష్ఠ తప్పకుండ పాటించేవాళ్లు, దైవాంశసంభూతులు, శత్రువుల్ని జయించిన మహావీరులు పాండవులకి అన్యాయం చేస్తున్నకౌరవులకి ఉన్నతిని, పాండవులకి కష్టాల్ని కలిగించడం బ్రహ్మదేవుడికి న్యాయం కాదు. భూమి మీద ధృతరాష్ట్రుడి కొడుకుల్ని లేకుండా చేసి ధర్మపరుడైన ధర్మరాజుని మనం భూమికి రాజుగా చెయ్యాలి” అన్నాడు.
అతడి మాటలు విని సాత్యకి “సాటిలేని పరాక్రమం, అంతులేని బలం కలిగిన నువ్వు, శ్రీకృష్ణుడు, సాంబుడు, సారణుడు, ప్రద్యుమ్నుడు వంటివాళ్లు అండగా ఉండి కూడా పాండవులు దిక్కులేని అనాథల్లా అరణ్యంలో ఆడవిపండ్లు ఆహారంగా తింటూ తిరుగుతున్నారు. యుద్ధసన్నాహాలు తెలియచేసే భయంకరమైన భేరీనాదాలు, ప్రపంచమంతా మారుమోగి ఆకాశం దిక్కులు నిండిపోతూ యాదవసేనలు విజృంభిస్తే వాళ్లని అడ్డుకోవడం కౌరవసేనకి చాలా కష్టమవుతుంది.
గొప్పదైన నీ నాగలి దెబ్బ, శ్రీకృష్ణుడి శారంగమనే ధనస్సునుంచి వచ్చే బాణాలు, ప్రద్యుమ్నుడి అమ్ములు, అనిరుద్ధుడి వాడిబాణాల వరుసలు, నా మంత్రబాణాలు వాళ్ల శిరస్సుల్ని యుద్ధంలో ఖండించి తీరుతాయి.
శ్రీకృష్ణుడి అనుమతి ఉంటే కేకయులు, సృంజయులు, పాంచాలులు, వృష్ణులు, భోజకులు, అంధకులు ధృతరాష్ట్రుడి కొడుకుల్ని, భీష్మ, ద్రోణ, కర్ణ మొదలైన వీరుల్ని సంహరిస్తారు. ధర్మరాజు తన తమ్ముళ్లతో కలిసి తాము చేసిన ప్రతిజ్ఞ ప్రకారం పదమూడేళ్లు గడిచిపోయాక రాజ్యాభిషిక్తుడవుతాడు. అంతవరకు అభిమన్యుడు రాజప్రతినిధిగా ఉంటాడు” అని చెప్పాడు.
సాత్యకి చెప్పినది విని శ్రీకృష్ణుడు “ధర్మరాజా! సాత్యకి చెప్పినట్టు మహాబలవంతులైన నీ శత్రువుల్ని అసాధ్యులైన మీరు యుద్ధంలో చంపుతారు. మీకు భూరాజ్యం మొత్తం దక్కుతుంది” అన్నాడు.
అది విని ధర్మరాజు “మీ అందరి అండ ఉండగ శత్రువుల్ని చంపడం గొప్ప పని కాదు. పెద్దలైన భీష్ముడు, ద్రోణుడు వంటి పెద్దల ఎదుట అప్పుడు ప్రతిజ్ఞ చేసి ఇప్పుడు మాట తప్పడం పద్ధతి కాదు” అని చెప్పి యదువీరుల కోపాన్ని శాంతపరిచాడు. యదువీరులు పాండవుల దగ్గర సెలవు తీసుకుని వెళ్లిపోయారు.
పాండవులు సోమరసంతో కలిసిన నీళ్లుగల ’పయోష్ణీ’ నదిలో స్నానం చేశారు. రోమశమహర్షి ధర్మరాజుతో “మహారాజా! ఈ పయోష్ణి నది ఒడ్డున నృగుడు అనే రాజు యజ్ఞాలు చేశాడు. దేవేంద్రుడు ఈ యజ్ఞాలవల్ల తృప్తిచెంది భయంకరమైన ఆయుధాలతో రాక్షసుల్ని సంహరించాడు. ఇక్కడ అధూర్తరజసుడి కుమారుడైన గయుడు గొప్ప యజ్ఞాన్ని చేశాడు.
ఆ యజ్ఞంలో వాడిన ఉపకరణాలన్నీ-యూపస్తంభాల చివర తొడిగే కడియాలు, వంటపాత్రలు చిన్నవి, పెద్దవి గరిటెలు అన్నీ బంగారంతోనే చెయ్యబడ్డాయి. యూపలు దేవతలతో స్థాపించబడ్డాయి. గయుడు యజ్ఞాలు చేయించిన ఋత్విజుల్ని, యజ్ఞాలు సక్రమంగా నడిపించిన పరీక్షాధికారుల్ని అనేక బంగారు నాణేలతో అర్చించాడు.
బంగారు తొడుగులతో ఉన్న ఆవుల్ని బ్రాహ్మణులకి దానం చేసి తరగని స్వర్గలోక భోగాలు పొందాడు. అటువంటి ఈ పయోష్ణి నదిలో స్నానం చేసినవాళ్లు దేవతలతో సమానమవుతారు” అని చెప్పాడు.