Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-88: ఋష్యశృంగమహర్షి చరిత్ర

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

ఋష్యశృంగుడి జననము

రోమశమహర్షి పాండవులతో “ఋషభకూటంలో ఉండే ఋషభమహర్షికి కోపం ఎక్కువ. ఎవరు ఏం మాట్లాడినా అతడికి కోపం వచ్చి మండిపడి రాళ్లనుంచి వచ్చే మబ్బుల్ని పిలిచి వాళ్లని వారిస్తాడు. అందువల్ల తపోదాన ధర్మాలు, శమదమాలు లేనివాళ్లు ఆ ప్రదేశంలోకి ప్రవేశించలేరు. దేవతలు, దేవతల్ని చూసే ఋషులు మాత్రమే ఆ మహర్షిని దర్శించడానికి వస్తారు.

ఇక్కడ దేవతలు యజ్ఞాలు చేశారు. ఆ స్థలాల్లో గడ్డిపోచలు దర్భల్లా మొలుస్తుంటాయి. అక్కడ ఉండే చెట్లు యజ్ఞశాలల్లో ఉండే యూపస్తంభాల్లా ఉంటాయి” అని చెప్పి స్నానం పూర్తి చేసుకుని వెడుతున్న ధర్మరాజుతో రోమశుడు “ఇది విశ్వామిత్రుడు ఉన్న ఆశ్రమం. ఈ నదికి కౌశికి అని పేరు. అదుగో అక్కడ కనిపిస్తున్న సరోవరం ఋష్యశృంగుడిది” అని చెప్పాడు.

ధర్మరాజు “మహర్షీ! ఋష్యశృంగుడి జన్మవృత్తాంతము, అతడి చరిత్ర వినాలని ఉంది దయచేసి చెప్పండి” అని అడిగాడు.

రోమశమహర్షి ధర్మరాజుతో “పూర్వం కశ్యపుడి కొడుకు విభాండకుడు అనే మహర్షి గొప్ప బ్రహ్మచర్యదీక్షతో తపస్సు చేస్తున్నాడు. అతడు ఒక రోజు చెరువులో స్నానం చేస్తుండగా అతిలోక సౌందర్యరాశి ఊర్వశి అనే అందాలరాశి ఋషికి కనిపించింది.

ఆమెని చూసి ఋషి ఒక క్షణం చలించాడు. ఆయన రేతస్సు నదిలో పడింది. దాన్ని ఆడు దుప్పి తాగి గర్భం ధరించింది. ఆ దుప్పికి ఋష్యశృంగుడు అనే కొడుకు కలిగాడు. అతడికి తండ్రి ఆశ్రమం తప్ప వేరే ఏదీ తెలియదు. అమాయకంగా కఠోరమైన తప్పస్సు చేస్తుండేవాడు.

బలవంతుడైన రోమపాదుడు అంగరాజ్యానికి రాజు. పురోహితుడికి అతడు చేసిన అపరాధం వల్ల బ్రాహ్మణులందరు రాజుని వదిలిపెట్టేశారు. అందువల్ల ఆ రాజ్యంలో వానలు కురవడం మానేశాయి. అనావృష్టికి భయపడిన రోమపాదుడు బ్రాహ్మణుల్ని ఆరాధించి “దేశంలో వానలు కురవకపోవడానికి కారణం ఏమిటి?” అని అడిగాడు.

బ్రాహ్మణులు “రాజా! నువ్వు చాలా గర్వం కలవాడివని బ్రాహ్మణులు నిన్ను విడిచిపెట్టేశారు. వాళ్లు విడిచిపెట్టడం వల్ల దేవతలు కూడ విడిచిపెట్టేశారు. అందువల్లే నీ దేశంలో వానలు కురవడం లేదు. ఋష్యశృంగుడనే మహాముని శాంతప్రవృత్తి కలవాడు. అతడు ఎక్కడ ఉంటే అక్కడ వానలు పుష్కలంగా కురుసేలా దేవేంద్రుడి నుంచి వరాన్ని పొందాడు. నీ సామర్థ్యంతో ఆ మహాఋషిని, వేదాంతవేత్తని నీ రాజ్యానికి రప్పించు” అని చెప్పారు.

రోమపాదుడు తను బ్రాహ్మణులకు చేసిన అపరాధానికి తగిన ప్రాయశ్చిత్తం చేసాడు. వాళ్లు చెప్పినట్లు పండితులతో కర్తవ్యాన్ని గురించి ఆలోచించాడు. సుందరీమణులు, చతురులు అయిన వేశ్యల్ని రప్పించి “మీ చాకచక్యం ఉపయోగించి ఎలాగయినా ఋష్యశృంగుడి మనసు రంజింపచేసి ఇక్కడికి తీసుకుని రండి” అని పంపించాడు.

వేశ్యలు తమతో రుచికరమైన ఆహారపదార్థాలు, సువాసనలు వెదజల్లే పువ్వులు, అనులేపనాలు తీసుకుని నావమీద ఆశ్రమాన్ని నిర్మించుకుని అప్సరసల్లా వెళ్లారు.

విభాండకమహర్షి అగ్నిహోత్రం రాజెయ్యడానికి తన కుమారుడు ఋష్యశృంగుణ్ని ఉంచి తను పండ్లు తేవడానికి అడవికి వెళ్లాడు. ఆ సమయంలో ఒక ముసలివేశ్య తన కుమార్తె పడుచుపిల్లని ఋషికుమారుడు ఋష్యశృంగుడి దగ్గరికి పంపించింది.

వేశ్యని మునికుమారుడిగా భావించిన ఋష్యశృంగుడు

తన ఆశ్రమానికి వచ్చిన వేశ్యకుమార్తెని చూసి ఋష్యశృంగుడు ఋషికుమారుడు అనుకుని ఆమెకి ఎదురువెళ్లి “మునికుమారా! నువ్వు ఏ ఆశ్రమం నుంచి వచ్చావు? నేను ఇంతకుముందు ఎప్పుడూ నీ వంటి అందమైన ఋషికుమారుణ్ని చూడలేదు. నువ్వు ఇక్కడే ఉండు” అన్నాడు.

అమెకి కూర్చునేందుకు నల్లజింక చర్మంతో చేసిన దర్భాసనాన్ని పరిచాడు. ఋష్యశృంగుడు అర్ఘ్యపాద్యాలు, అడవిలో దొరికే రుచికరమైన పళ్లు పెట్టి సత్కరిద్దామనుకున్నాడు.

వేశ్యాకుమారి అతణ్ని ఆపి “మహానుభావా! మా ఆశ్రమం ఇక్కడికి మూడు ఆమడల దూరంలో ఉంది. నువ్వు మా ఆశ్రమానికి వస్తానని అంగీకరిస్తే నువ్విచ్చే ఆతిథ్యం తీసుకుంటాను” అంది.

ఋష్యశృంగుడు అంగీకరించి ఆమెని సత్కరించాడు. ఆమె తనతో తెచ్చిన పరిమళాలు వెదజల్లుతున్న పువ్వుల్ని, అద్భుతమైన బట్టల్ని, తినే పదార్థాల్ని, పానీయాల్ని అతడికి ఇచ్చింది. ఋష్యశృంగుడు వాటిని తీసుకున్నాక అతడి ఎదురుగా బంతి ఆట, నాట్యకళ, మనోహరమైన పాటలు పాడి తన నైపుణ్యాన్ని ప్రదర్శించింది.

వెడుతూ వెడుతూ అతణ్ని గట్టిగా కౌగలించుకుని వెళ్లిపోయింది. ఋష్యశృంగుడు వేశ్యకుమార్తె వెళ్లినవైపే చూస్తూ చాలాసేపు అలాగే ఉండిపోయాడు.

పరాకులో ఉండిపోయిన ఋష్యశృంగుడు తండ్రి చెప్పిన పని చేయడం మర్చిపోయాడు. అడవి నుంచి అవసరమైన వస్తువుల్ని తీసుకుని విభాండకుడు ఆశ్రమానికి తిరిగి వచ్చాడు. కొడుకు అగ్నిహోత్రం రాజెయ్యకుండా పరాకుగా ఉండిపోవడం చూసి “అలా ఆలోచిస్తూ కూర్చుని చెయ్యవలసిన పనుల్ని వదిలేశావెందుకు?” అని అడిగాడు.

ఋష్యశృంగుడు తండ్రితో “తండ్రీ! నా దగ్గరకి ఒక బ్రహ్మచారి వచ్చి వెళ్లాడు. బంగారం వంటి శరీర రంగుతో అందమైన జడలతో ఉన్నాడు. అతడి వక్షస్థలము, కంఠంలో మెరుస్తున్న జపమాల, సన్నటి నడుము, కలహంసల నడక, గండుకోయిల గొంతులా తీయనైన మాటలు నా మనస్సుకి ఆనందం కలిగించాయి.

అతడి వస్త్రాలు చాలా మృదువుగా ఉన్నాయి. నడుముకు ఒక బంగారు వడ్డాణం కూడా ఉంది. వసంతంలో పూసే వేరు వేరు పూలమీద నుంచి వచ్చే సువాసన అతడి శరీరం మీదనుంచి వస్తోంది.

తండ్రీ! ఆ ఋషికుమారుడు తన ముఖాన్ని నా ముఖానికి దగ్గరగా పెట్టి ఒక శబ్దం చేశాడు. ఇంతకు ముందు ఎప్పుడూ ఆ శబ్దం వినలేదు. ఆ బ్రహ్మచారి ముఖం తామరపూవులా లేతగా అందంగా ఉంది. నేను అడవిలో దొరికిన మంచి పళ్లను ఇస్తే ఆ మునికుమారుడు వాటిని తినలేదు.

నాకు అమృతంతో సమానమైన తీపి కలిగిన పళ్లు, పానీయాలు ఇచ్చాడు. వాటిని నేను తీసుకున్నాను. అతడు తన చేతిలో ఉన్న పూలని వెదచల్లాడు. అవి గొప్ప సువాసలతో ఉన్నాయి. అతడితో కలిసి మెలిసి ఉంటూ అతడి ఆశ్రమంలో ఏకాంతంగా తపస్సు చేయాలని నాకు కోరికగా ఉంది” అన్నాడు.

కొడుకు మాటలు విని విభాండకుడు “ఋషుల తపస్సుకి ఆటంకం కలిగించడం కోసం రాక్షసులు అనేక రూపాలతో తిరుగుతూ ఉంటారు. వాళ్లు ఇచ్చే పానీయాలు తాగకూడదు. ఎక్కువ సువాసన కలిగిన పువ్వుల్ని ఋషులు ఉపయోగించకూడదు” అని జాగ్రత్తలు చెప్పి ఎప్పటిలాగే అడవికి వెళ్లాడు.

వేశ్యకుమార్తె రోజూ వస్తూ వెడుతోంది. ఋష్యశృంగుడు ఆమె ఆకర్షణలో పడ్డాడు. ఆశ్రమధర్మాల్ని విడిచిపెట్టి సాధారణ మానవుల నడవడికలో చిక్కుకున్నాడు. ఆమెతో కలిసి అంగదేశం వెళ్లాడు. అక్కడ రోమపాదుడు చూపించిన రాజాశ్రయం అనే తోటలో ఉన్నాడు.

ఋష్యశృంగమహర్షి మహిమవల్ల అంగదేశంలో పెద్ద పెద్ద ధారలతో వర్షాలు పడి సరస్సులు, నదులు నీటితో నిండిపోయాయి. రోమపాదుడు సంతోషించి తన కూతురు అందాలరాశి శాంతనిచ్చి పెళ్లిచేశాడు. ధనరాశులు, ఆభరణాలు, దాసీసమూహాలు, బంగారుశయ్యలు, ఆసనాలు మొదలైనవన్నీ ఋష్యశృంగుడుకి రోమపాదుడు సమకూర్చాడు.

ఋష్యశృంగుణ్ని వెతుకుతూ వచ్చిన విభాండకుడు

వేలకివేలుగా ఆవుల్ని ఇచ్చి అనేకచోట్ల గొల్లపల్లెల్ని ఏర్పాటుచేసి ప్రతిరోజు సత్కారాలు చేస్తూ రోమపాదుడు ఋష్యశృంగుణ్ని సంతోషంగా ఉంచుతున్నాడు.

ఋషివాటికలో కొడుకు కనిపించక విభాండకుడు దేశదేశాలు తిరుగుతూ కొడుకుని వెతుకుతున్నాడు. చివరికి అంగదేశం చేరాడు. అక్కడ గోపల్లెలో గోపాలకులు విభాండకమహర్షిని సత్కరించారు.

విభాండకుడు గోపాలకుల్ని “ఇది ఎవరి ఆవులమంద?” అని ప్రశ్నించాడు.

గోపాలురు “మహర్షీ! ఇది నీ కుమారుడికి చెందిన ఆవులమంద. ఇది ఒక్కటేకాదు, నీ కొడుకుకి ఇలాంటి ఆవులమందలతో ఉన్న గోపల్లెలు రాజ్యంలో అనేక చోట్ల ఉన్నాయి” అని చెప్పాడు.

విభాండకమహర్షి అక్కడినుంచి బయలుదేరి మధ్య మధ్యలో ఋష్యశృంగుడి ఆవులమందలు ఉన్న ప్రదేశాల్లో విశ్రాంతి తీసుకుంటూ రోమపాదుడి రాజధానికి చేరుకున్నాడు.

అక్కడ శాంతాదేవితో ఉన్న ఋష్యశృంగుణ్ని చూసి సంతోషించాడు. తరువాత కోడలిని, కొడుకుని తీసుకుని తన ఆశ్రమానికి వచ్చాడు. శాంతాదేవి కూడా అరంధతి వసిష్ఠుడికీ, ఇంద్రసేన ముద్గలుడికీ, లోపాముద్ర అగస్త్యుడికీ సేవచేసినట్టు ఋష్యశృంగుడిని సేవించింది” అని ఋష్యశృంగుడు చరిత్ర చెప్పాడు.

కౌశిక సరోవరంలో అందరు స్నానం చేశారు. అయిదు వందల మహానదులకి సంగమస్థానమైన గంగాసాగర సంగమాన్ని దర్శిస్తూ తీరం వెంట ప్రయాణం చేస్తూ కళింగదేశం చేరి అక్కడ వైతరణి అనే మహానదిని చూశారు.

రోమశమహర్షి ధర్మరాజుతో “పూర్వం ఈ వైతరణీ నది ఉత్తర తీరంలో ఋషీశ్వరులు, దేవతాప్రముఖులు అనేక యజ్ఞాలు చేశారు.

యజ్ఞం పూర్తయ్యే సమయంలో వందలకొలదీ చేసిన అవబృథస్నానాల వల్ల ఈ మహానది పుణ్యనదిగా ప్రసిద్ధికెక్కింది. ఇక్కడ ప్రత్యేకంగ చెప్పుకోవలసిన విషయమేమిటంటే.. అన్ని యజ్ఞాల్లో గొప్పదిగా చెప్పుకోదగిన పశుభాగాన్ని దేవతలు, ఋషిప్రముఖులు కలిసి ఇక్కడ పశుపతికి ఏర్పాటు చేశారు. ఈ తీర్థంలో స్నానం చేసినవాళ్లు దేవతలు వెళ్లే మార్గంలో వెళ్లగలరు” అని చెప్పాడు.

ధర్మరాజు తమ్ముళ్లతోను, ద్రౌపదితోను కలిసి వైతరణీ నదిలో స్నానం చేశాడు. రోమశమహర్షితో “మహర్షీ! నాకు నీ దయవల్ల లోకాలన్నీ కనబడుతున్నాయి. వైఖానసులు చేస్తున్న వేదపారాయణం నాకు వినబడుతోంది” అని చెప్పాడు.

రోమశమహర్షి ఆశ్చర్యపోయి “వైఖానసులు నివసించే ప్రదేశం ఇక్కడికి ముఫ్పైవేల ఆమడల దూరంలో ఉంది. వాళ్లు చేస్తున్న పారాయణం నీకు వినబడుతోంది అంటే నీకు మానవమాత్రులకి లేని దివ్యశక్తి ఉంది. నువ్వు దివ్యపురుషుడివి” అని చెప్పాడు.

మళ్లీ ప్రయాణం చేస్తూ మధ్యలో ఎప్పుడూ ముగ్గిన పళ్లతో ఉండే ఒక తోటని చూపించి “ఇక్కడ పూర్వం స్వాయంభువ మనువుకి చెందిన విశ్వకర్మ యజ్ఞం చేసి గొప్పవాడయ్యాడు. దక్షిణ దిక్కులో ఉన్న భూభాగాన్ని మొత్తాన్ని కొండలు, అరణ్యాలతోపాటు ఋత్వుజుడికి సంభావనగా ఇచ్చాడు. అందుకు భూదేవికి కోపం వచ్చింది. ఆమె కశ్యపుడికి దూరంగా పాతాళానికి వెళ్లిపోయింది.

కశ్యపమహర్షి భూదేవి అనుగ్రహం పొందడం కోసం కఠోరమైన తపస్సు చేశాడు. భూదేవి ప్రసన్నురాలై నీటిలోంచి వేది(అరుగు, తిన్నె) రూపంలో బయటికి వచ్చి కశ్యపుడికి కనిపించింది. అదే ఈ తిన్నె. దీన్ని ఎక్కినవాళ్లు గొప్ప పరాక్రమంతో వెలుగుతారు. దీన్ని ఎక్కేటప్పుడు ఈ మంత్రాన్ని ఉచ్చరించాలి. లేకపోతే సముద్రంలోకి వెళ్లిపోతుంది” అని రోమశుడు ’అగ్నిర్మిత్రోనిః’ అనే పదాలతో ప్రారంభమయ్యే మంత్రాల్ని ఉపదేశించాడు.

మహర్షి చెప్పినట్టు చేస్తూ ధర్మరాజు తన తమ్ముళ్లతో కలిసి ఆ వేది ఎక్కాడు. అందువల్ల అతడికి అమితమైన బలం కలిగింది. బ్రాహ్మణుల ఆశీస్సులతో ధర్మరాజు ఇంద్రుడిలా ప్రకాశించాడు. బ్రాహ్మణులు, మహర్షులు తమ చూట్టూ వస్తుండగా పాండవులు ఆకాశగమనం కలిగిన దేవతలతో సేవింపబడుతున్న అందమైన గుహలు కలిగిన మహేంద్రపర్వతాన్ని చూశారు.

Exit mobile version