[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
పరమేశ్వరుణ్ని స్తోత్రం చేస్తున్న అర్జునుడు
అర్జునుడు పరమేశ్వరుణ్ని అనేక విధాలుగా స్తోత్రం చేశాడు. “నువ్వు ఎరుకలవాడివని అనుకుని నీతో యుద్ధం చేశాను. నా తప్పు క్షమించు” అని అడిగాడు. శివుడు అర్జునుడి చేయి పట్టుకుని “అర్జునా! నీ తప్పుని క్షమించాను. లోకాతీతమైన నీ పరాక్రమానికి మెచ్చాను. పూర్వజన్మలో నువ్వు దేవఋషివి. నారాయణ మహర్షికి ప్రాణమిత్రుడివి.
మీరిద్దరు ఎన్నోవేల ఏళ్లు బదరీవనంలో తపస్సు చేశారు. మీ ప్రభావం వల్లే ఈ జగాలు రక్షించ బడుతున్నాయి. ఈ గాండీవం పూర్వం కూడా నీదే. దేవేంద్రుడి పట్టాభిషేకం సమయంలో నువ్వు ఈ గాండీవంతో రాక్షసుల్ని సంహరించావు. అప్పుడు నీ గాండీవాన్ని, అక్షయ తూణీరాల్ని మాయం చేశాను. వాటిని తీసుకుని నీకు ఇష్టమైన వరం కోరుకో ఇస్తాను” అన్నాడు.
అర్జుడు శివుడు చెప్పింది విని “పరమేశ్వరా! అస్త్రాలలో రౌద్రమైన దివ్యాస్త్రంగా చెప్పబడే పాశుపతాస్త్రాన్ని ప్రసాదించు. పాశుపతాస్త్రము, బ్రహ్మశిరము అనే పేరుగల మంత్రబాణము ప్రళయకాలంలో ప్రయోగించబడి జగత్సంహారం చేస్తాయి. పాశుపతాస్త్రం వల్ల లక్షలకొలదీ ఈటెలు, గదలు, బాణాలు పుడతాయని విన్నాను. నీ దయవల్ల పాశుపతాస్త్రాన్ని పొందగలిగితే దైత్య, దానవ, యక్ష, రాక్షస, పిశాచగణాల్ని; వీరాధివీరులైన భీష్ముడు, ద్రోణుడు మొదలైనవాళ్లని జయిస్తాను. సహజ కుండలాలతో పుట్టిన కర్ణుణ్ని చంపుతాను” అని ప్రార్థించాడు.
శివుడు మంత్రంతోపాటు ప్రయోగించడం, ఉపసంహారం చేయడం చెప్పి అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని ఇచ్చాడు. “దీన్ని బలహీనుల మీద ప్రయోగిస్తే జగత్తుని నాశనం చేస్తుంది. ఈ దివ్యాస్త్రం వల్ల నువ్వు సమస్త భువనాల్ని జయిస్తావు” అని చెప్పి పరమశివుడు మాయమయ్యాడు.
అర్జునుడి చేతిలో వెయ్యి సూర్యమండలాల కాంతితో వెలిగిపోతున్న పాశుపతాస్త్రాన్ని చూసి దేవతలు, యక్షులు, రాక్షసులు భయపడ్డారు. పరమేశ్వరుడి శరీరం తాకడం వల్ల అర్జునుడి శరీరం పవిత్రము, పాపరహితము, ప్రకాశవంతమై బలసంపన్నమైంది.
“జీవితం సార్థకమైంది, పరమశివుడి దేహాన్ని ముట్టుకోగలిగాను. దేవతల్ని వేధించే రాక్షసుల్ని సంహరించే ముక్కంటిని, గరళకంఠుడిని, ఉమాపతిని చూడగలిగాను. ఎంతో పుణ్యం చేసుకోడం వల్ల చరితార్థుడినయ్యాను” అని అర్జునుడు ఎంతో సంతోషపడ్డాడు.
అర్జునుడికి ప్రత్యక్షమైన ఇంద్రుడు
పరమశివుడితో వరాలు పొందాడని తెలుసుకుని తృప్తి చెందిన మనస్సుతో ఉన్న అర్జునుడి దగ్గరికి ఇంద్రుడు, కుబేరుడు, యముడు, వరుణుడు, అశ్వినులతోను దేవతాసమూహాలతోను కలిసి దివ్యవిమానాల్లో వచ్చారు. యమధర్మరాజు అర్జునుడితో “ఎప్పుడూ ధర్మాన్ని పాటించే పాండుపుత్రా! దేవనాయకులందరు నీకు వరాలు ఇవ్వాలని అభిమానంతో నీ దగ్గరికి వచ్చారు. అందరినీ చూడు” అని అర్జునుడికి దివ్యదృష్టిని ఇచ్చాడు.
“నువ్వు పూర్వకాలంలో నరుడు అనే ఋషివి. బ్రహ్మదేవుడి ఆదేశంతో మానవజన్మ ఎత్తి క్షత్రియ కులంలో పుట్టావు. తదుపరి సూర్యుడి అంశతో పుట్టిన కర్ణుణ్ని, దేవ, దైత్య, దానవ, గంధర్వ, యక్ష, రాక్షసుల అంశలతో పుట్టిన రాజుల్ని సంహరిస్తావు. నీకు గొప్ప పేరు ప్రతిష్ఠలు వస్తాయి” అని చెప్పి తన ఆయుధమైన దండాన్ని శాస్త్రోక్తంగా ఇచ్చాడు.
వరుణుడు శత్రువులకి భయం కలిగించే వారుణపాశాల్నిఇచ్చాడు. కుబేరుడు అర్జునుడికి ప్రేమతో శత్రువుల్ని సంహరించడానికి కుబేరాస్త్రాన్ని ఇచ్చాడు.
అర్జునుడు దివ్యత్వాన్ని పొంది మహాపురుషుడిగా మారి దివ్యదృష్టితో దేవతారూపాలు ధరించిన పితృదేవతలతో తన ముందు నిలిచి ఉన్న నీలవర్ణుడైన వైవస్వతుణ్ని; సముద్రాలు, నదులు, కొండలతో కొలవబడేవాడు, వైడూర్యపు రంగు కలవాడు అయిన వరుణదేవుణ్ని; యక్ష రాక్షసులతో కలిసి ఉన్న బంగారు రంగు కలిగిన కుబేరుణ్ని చూశాడు. వాళ్లవల్ల కూడా దివ్యాస్త్రాలు పొంది వాళ్లని మాటలతోను, పూలతోను, పండ్లతోను నీళ్లతోను ఆరాధించి పూజించాడు.
దేవతల సమూహాలతో కలిసి ఐరావతమనే తెల్ల ఏనుగుని ఎక్కి వజ్రాయుధాన్ని ధరించినవాడు, వృత్రాసురుడి శత్రువు, మూడు లోకాలకి అరాధ్యుడు అయిన దేవేంద్రుడిని చూసి అర్జునుడు సంతోషంతో ఉప్పొంగిపోయాడు.
దేవేంద్రుడు తన కుమారుడైన అర్జునుణ్ని చూసి ఎంతో సంతోషించాడు. “అర్జునా! నువ్వు పరమశివుడి అనుగ్రహం వల్ల గొప్ప వరాలు సంపాదించగలిగావు. దేవతలకి ఉపకారం చెయ్యగల యోగ్యత నీకు కలిగింది. నా రథం పంపిస్తాను. అమరావతికి రా! అక్కడ నేను నీకు దివ్యాస్త్రాలు ఇస్తాను” అని చెప్పి దేవతలతో కలిసి అమరావతికి వెళ్లిపోయాడు. అర్జునుడు రథం కోసం ఎదురు చూస్తున్నాడు.
ఇంద్రుడు చెప్పినట్టు గొప్ప వేగంతో పరుగెత్తగల పదివేల గుర్రాలు పూన్చిన దివ్యరథాన్ని తీసుకుని సారథి మాతలి అర్జునుడి దగ్గరికి వచ్చాడు. అది మేఘమండలం నుంచి వచ్చేటప్పుడు దాని వైజయంతీ జెండా నీలపురంగు ఆకాశంలో ప్రకాశించింది. ఆ రథానికి పొదగబడిన రత్నాల కాంతులతో భూమికీ ఆకాశానికీ మధ్య ఉండే ప్రదేశం మొత్తం తేజస్సు వ్యాపించింది.
చక్రాల కమ్ములు చేసిన పెనుసవ్వడికి పర్వతగుహల ముఖద్వారాలు ప్రతిధ్వనించాయి. రథంలో ఆయుధాలు ఉండడం వల్ల పిడుగులతో వేలకొలదీ మెరుతీగలతో ఉన్న మేఘంలా కనిపించింది.
మాతలి అర్జునుణ్ని చూసి “దేవతలు రాక్షసులు మీ తండ్రి దేవేంద్రుడికి మొక్కుతున్నప్పుడు వాళ్ల కిరీటాల్లో పొదిగిన రత్నాలకాంతులు ఆయన పాదల మీద పడి వెలిగిపోతూ ఉంటాయి. అంత గొప్ప వైభవం కలిగిన మీ తండ్రి మిమ్మల్ని చూడాలనే కోరికతో అమరావతికి ఆహ్వనించాడు.
వందలకొలది రాజసూయ యాగాలు, అశ్వమేధ యాగాలు చేసినవాళ్లకి కూడా ఈ రథంమీద ఎక్కే అవకాశం దొరకదు. నువ్వు ఈ రథాన్ని ఎక్కి స్వర్గ లోకానికి రా!” అని చెప్పాడు.
అర్జునుడు గంగానదిలో స్నానం చేసి పవిత్రమైన శరీరంతో దేవతలకి, ఋషులకి, పితృదేవతలకి తర్పణాలు వదిలి మాతలి నడిపే రథాన్ని ఎక్కాడు.
అమరావతికి చేరిన అర్జునుడు
మాతలితో కలిసి తన తండ్రి దేవేంద్రుణ్ని కలవడాని స్వర్గలోకానికి వెడుతూ అర్జునుడు మందరపర్వతం చూసి “గొప్ప తపస్సు వల్ల దొరికే నిర్వికల్ప సమాధిని పొందే మహానుభావులకి, అనేక పుణ్యలోకాల్ని పొందాలనుకునే మహనీయులకి, పవిత్రమైన మనస్సు కలిగినవాళ్లకి ఆశ్రయమిచ్చేదానివి. సుకుమారులైన స్వర్గదంపతుల విలాసవంతమైన వినోదయాత్రల సంబరాలకి స్థానానివి. రత్నాలు పొదిగిన గుహలతో అందమైన రూపం కలదానివి. నీలో ఉన్న పుణ్యతీర్థాల్ని అరాధిస్తూ, గంగానదీ నీళ్లతో తడిసిన స్థలాల్లో పుట్టిన చెట్లకు కాసిన పండ్లని ఆహారంగా తీసుకుంటూ ఇప్పటివరకు సుఖంగా ఉన్నాను. ఇప్పుడు అమరావతికి వెళ్లివస్తాను” అని వీడ్కోలు చెప్పాడు.
తరువాత తను చేరుకోవలసిన ప్రాంతానికి చేరుకున్నాడు. ఎంతో ఆసక్తితో, భక్తితో, సంభ్రమంతో అర్జునుడు అమరావతీ పట్టణాన్ని చూశాడు. ధర్మమార్గంలో జీవిస్తూ ప్రజల్ని పాలించిన రాజులకి; స్వామిభక్తి పరాయణత్వంతో ఏలికలకోసం ఘోరయుద్ధం చేసి తమ ప్రాణాల్ని అర్పించిన శూరులకి; యజ్ఞాలు, యాగాలువంటి క్రతువులు చేసి దేవతల్ని, భూదేవతలైన బ్రాహ్మణుల్ని సంతృప్తిపరిచిన ధర్మాత్ములకి; గొప్ప తపస్సంపన్నులకి నివాసాలైన అనేక అంతస్తులు కలిగిన మేడలు గోపురాలు కలిగి లోకాలన్నింటిలో ఉన్న గొప్ప పట్టణాలకంటే గొప్పది అని చెప్పబడేది; సూర్యచంద్రుల కాంతితో కాకుండా స్వయంప్రకాశంతో శోభిల్లుతున్న అమరావతి పట్టణాన్ని అర్జునుడు చూశాడు.
శ్రోత్రియులై నిత్యాగ్నిహోత్రం పాటించనివాళ్లకి, పుణ్యస్థలాలు దర్శించనివాళ్లకి, నిజం మాట్లాడనివాళ్లకి, మాంసం తినేవాళ్లకి, యుద్ధరంగం నుంచి పారిపోయి వచ్చినవాళ్లకి అమరావతి పట్టణంలో ప్రవేశించేందుకు అర్హత లేదు.
అర్జునుడికి పట్టణ ముఖద్వారంలో ఉన్న ఐరావతం అనే తెల్ల ఏనుగు, ఎప్పుడూ ప్రవహించే సెలఏళ్లతో ఉండే హిమాలయపర్వతంలా కనిపించింది. దాన్ని చుస్తూ అమరావతీ నగరంలోకి ప్రవేశించాడు. ఆ సమయంలో దేవతలు, సిద్ధులు, సాధ్యులు, విద్యాధరులు, అప్సరసలు జయజయధ్వానాలు పలికారు.
సొంత ఉద్యానవనాల్లో అన్ని ఋతువుల్లోను పూస్తూ తమ పరిమళాలు వెదజల్లే పూలతో ఉండే చెట్ల చుట్టూ తిరుగుతూ వాయుదేవుడు అర్జునుడికి స్నేహభావంతో ఎదురొచ్చాడు. నరుడనే ఆది ఋషి, ఇంద్రుడి కొడుకు, ఇంద్రుడికి సాయంచేసేవాడు, పరమశివుడితో వరాలు పొందాడని చెప్పుకుంటూ దేవతలు ప్రేమతో అర్జునుణ్ని చూడ్డానికి వచ్చారు. అమరావతీపట్టణ వైభవాన్ని చూసి అర్జునుడు చాలా సంతోషంగా ఉన్నాడు.
అప్సరసలు శుభాన్ని పలుకుతూ పాడిన పాటలు అతణ్ని ఆకర్షించాయి. సిద్ధులు, ఋషులు అతణ్ని ఆశీర్వదించారు. వాటిని అందుకుంటూ అర్జునుడు మాతలి చెప్పినచోట దివ్యరథం నుంచి దిగాడు. నూరుయజ్ఞాలు చేసినవాడు; లోకాలన్నింటినీ రక్షించేవాడు; దేవర్షులు, రాజర్షులతో కలిసి ఉన్నవాడు; వజ్రాయుధాన్ని ధరించినవాడు; ఎత్తైనభుజాలు కలవాడు అయిన దేవేంద్రుడికి అర్జునుడు భక్తితోను, వినయంతోను నమస్కారం చేశాడు.
దేవేంద్రుడు అర్జునుణ్ని కౌగలించుకున్నాడు. కొడుకు మీద కలిగిన ప్రేమతో మొదట ఒడిలో కూర్చోబెట్టుకుని అతడి శరీరాన్ని నిమిరాడు. తరువాత తన ఆసనం మీద తన పక్కనే కూర్చోబెట్టుకుని గౌరవించాడు.
దేవలోకంలో ఉండే అందమైన అప్సరసలు బంగారుదండం ఉన్న విసనకర్రలతో వీచారు. దేవేంద్రుడి ఆజ్ఞని అనుసరించి అర్జునుణ్ని దేవతలు, గంధర్వులు, సిద్ధులు, విద్యాధరులు పూజించారు. అర్జునుడు దేవేంద్రుడు చెప్పినట్టు మణులతో నిర్మించబడిన ఒక భవనంలో కూర్చుని చెవులకి ఇంపైన సంగీతాన్ని ఆస్వాదిస్తున్నాడు.
అర్జునుణ్ని నపుంసకుడిగా శపించిన ఊర్వశి
ఆ సమయంలో దేవేంద్రుడి ఆజ్ఞతో అందంగా అలంకరించుకుని ఊర్వశి అర్జునుడి దగ్గరికి వచ్చింది. ఆమెని చూసి అర్జునుడు భయం, భక్తి, సంభ్రమాలతో రెండు చేతులూ జోడించి ఆమెకి ఎదురుగావెళ్లి “తల్లీ! నీకు నా మీద ఉన్న పుత్ర ప్రేమతో ఇక్కడికి వచ్చావా.. నా జన్మధన్యమైంది తల్లీ!” అన్నాడు.
ఊర్వశి అర్జునుడి వైపు కోరికతో చూస్తూ “అర్జునా! నీ గొప్ప గుణాల గురించి నారదుడు మొదలైన మహర్షులు చెప్తుంటే విని నీ మీద కోరికతో వచ్చాను. నువ్వు నన్ను తల్లీ! అని పిలవడం విడ్డూరంగా ఉంది. అసలు నేను నీకు తల్లిని ఎలా అయ్యనో చెప్పు. మేము దేవలోకానికి చెందిన వేశ్యలం. ఇక్కడ న్యాయాన్యాయాలు వావివరుసలు వెదకకూడదు. ఈ స్వర్గ లోకంలో స్త్రీపురుషులు శృంగార ధోరణిలో ఉంటారు. ఇది ఇక్కడ తప్పు కాదు. నువ్వు స్వర్గానికి వచ్చిన దివ్య పురుషుడివి. ఇటువంటి ఆచారాలు పాటించవచ్చు” అంది ఊర్వశి.
ఆమె మాటలు విని అర్జునుడు “ధర్మానికి చెడు కలిగించే మాటలు నువ్వు మాట్లాడుతున్నావు. వావివరుసలు ఆలోచించకుండా మాట్లాడుతున్నావు. హరి! హరి! ఎంత మాట విన్నాను. ఇలా మాట్లాడ్డం నీకు ఉచితంగా ఉందా?
అమ్మా! సృష్టి, స్థితి, లయల శక్తులు కలిగిన దేవతలు ఎలా ప్రవర్తించినా చెల్లుబాటు అవుతుంది. నేను కర్మభూమిలో పుట్టాను. మంచి కర్మలు చేసి తరించాలని అనుకుంటున్నాను. నీవు మా వంశకర్త పురూరవుడికి భార్యవి. నా తండ్రి ఇంద్రుడికి పరిచారికవి. కాబట్టి నువ్వు నాకు తల్లివి. నువ్వు నన్ను పుత్ర ప్రేమతోనే చూడాలి” అన్నాడు.
అర్జునుడి మాటలకి ఊర్వశికి కోపం వచ్చింది. “నేను నిన్ను కోరి వస్తే తిరస్కరించావు కనుక భూలోకంలో అభిమానం లేనివాడిగా, ఆడవాళ్ల మధ్య మగతనం లేనివాడిగా ఉండు” అని శపించి వెళ్లిపోయింది.
జరిగిన సంగతి తెలుసుకున్న దేవేంద్రుడు అర్జునుడి దగ్గరికి వచ్చాడు. “అర్జునా! నువ్వు ధర్మాత్ముడివి. నీవంటి ధైర్యవంతుణ్ని ఎప్పుడూ చూడలేదు. ఋషులు కూడా నీ ఇంద్రియ నిగ్రహాన్ని పొగుడుతారు. అయినా ఊర్వశి ఇచ్చిన శాపం భూలోకంలో నువ్వు అనుభవించక తప్పదు. మీరు పదమూడవ సంవత్సరం అజ్ఞతవాసం చెయ్యాలి కదా.. ఆ సమయంలో నువ్వు నపుంసక రూపంలో మారువేషంలో ఉండి రాజకుమార్తెలకి నాట్యం నేర్పుతూ ఉంటావు. ఆ గడువు తీరగానే శాపవిమోచనం కలుగుతుంది” అని శాపవిమోచన మార్గాన్ని అర్జునుడికి ఉపదేశించాడు.
వైశంపాయనుడు జనమేజయుడితో ఈ కథ విన్న పుణ్యవంతులు సమస్త పాపాలనుంచి విముక్తులవుతారని చెప్పాడు.
తరువాత దేవేంద్రుడు అర్జునుడికి వజ్రాస్త్రము మొదలైన అనేక దివ్యాస్త్రాల్ని అనుగ్రహించాడు. వాటిని ప్రయోగించడం, వాటిలో ఉండే రహస్యాలు, ఉపసంహరించే మార్గాలు అన్నీ ఉపదేశించి “ఘోరయుద్ధాలు జరిగినప్పుడు గొప్ప వీరుడివిగా ఉంటావు!” అని ఆశీర్వదించాడు. సంగీతము, వాద్యము, నృత్యము మొదలైన విద్యలు నేర్పడానికి చిత్రసేనుడనే గంధర్వరాజుని నియమించాడు.
అర్జునుడు దేవేంద్రుడి దగ్గర ఉండగానే భూలోకంలో ఐదు సంవత్సరాలు గడిచిపోయాయి. ఒకరోజు రోమశుడు అనే గొప్ప మహర్షి ఇంద్రుడి దగ్గరికి వచ్చాడు. ఆయన్ని దేవతలందరు పూజించారు. దేవేంద్రుడితోపాటు అర్ధాసనం మీద కూర్చుని ఉన్న అర్జునుణ్ని చూసి మహర్షి ఆశ్చర్యపోయాడు.
ఇంద్రుడితో “ఎన్నో యుగాలు దీక్ష తీసుకుని తపస్సు చేసినవాళ్లు కూడా నీ లోకానికి చేరలేరు. ఒకవేళ ఇంత దూరం చేరుకున్నా నీ దయ సంపాదించడం చాలా కష్టం. ఇప్పుడు నీ అర్ధాసనం మీద కూర్చుని ఉన్న ఇతడు నీ రెండవ రూపమేమో అనిపిస్తున్నాడు. ఈ మానవుడు ఎవడు? ఎక్కడివాడు?” అని అడిగాడు రోమశ మహర్షి.
ఆయన అడిగినదానికి దేవేంద్రుడు “మహర్షీ! ఇతడు నరుడు అనే మహర్షి. నా అంశతో భూలోకంలో కుంతీదేవికి పుట్టాడు. గొప్ప మేధావి, తేజస్వి, విష్ణుదేవుడికి స్నేహితుడు. ఇతడికి పరమేశ్వరుడు అనుగ్రహించి పాశుపతాస్త్రాన్ని అనుగ్రహించాడు. నేను, దిక్పాలకులు దివ్యాస్త్రాలు అనుగ్రహించాము. ఇప్పుడు ఇతడు తన గొప్ప బలంతో నా సంతోషం కోసం దేవతల ప్రయోజనం కోసం ఒక కర్తవ్యాన్ని నెరవేర్చబోతున్నాడు.
భూమిని పాతాళం వరకు తొలిచిన గర్వంతో తిరిగే సగరుడి పుత్రుల్ని తన నేత్రాగ్నితో కాల్చివేసిన కపిలుడు అనే మహర్షి నారాయణుడయ్యాడు. ఈ నరనారాయణులు ఆది ఋషులు. వాళ్లు లోకాలకి మంచి జరిగేలా చూస్తారు. దైత్యుల్ని, దానవుల్ని వధించి భూభారాన్ని తగ్గించడానికి అవతరించిన కారణజన్ములు. దేవతలకి కీడు చేసి పాతాళంలో నివసిస్తున్న ’నివాతకవచులు’ అనే రాక్షసుల్ని మహావీరుడైన ఈ అర్జునుడు సంహరిస్తాడు” అని నరనారాయణుల మహిమ గురించి మహర్షికి వివరించాడు.
ఇంద్రుడు “మహర్షీ నువ్వు భూలోకానికి వెళ్లి ధర్మరాజుని కలిసి నా దగ్గర అర్జునుడు క్షేమంగా ఉన్నాడని; భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు మొదలైన మహావీరుల్ని జయించగల దివ్యాస్త్రాల్ని పొందాడని; త్వరలో వాళ్ల దగ్గరికి వస్తాడని; బాధపడవద్దని అతడికి, అతడి తమ్ముళ్లకి సంతోషం కలిగేలా నేను చెప్పినట్టుగా చెప్పు.
ధర్మరాజుని తీర్థయాత్రలు చెయ్యమని చెప్పు. అందువల్ల అన్ని పాపాలు నశించి మళ్లీ మొత్తం రాజ్యాన్ని పొందగలుగుతాడు. ధర్మరాజు తీర్థయాత్రలు చేసే సమయంలో నువ్వు అతడికి తోడుగా ఉండు” అని ఇంద్రుడు రోమశమహర్షికి చెప్పాడు.
ధృతరాష్ట్రుడికి సంజయుడి ఓదార్పు
భూలోకంలో వ్యాసమహర్షి గొప్ప తపస్సు చేసి అర్జునుడు దివ్యాస్త్రాలు సంపాదించాడని ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ధృతరాష్ట్రుడు భయపడి సంజయుడితో “అర్జునుడు దేవేంద్రుడినే ఓడించి ఖాండవవనాన్ని ఒంటరిగా దహించాడు. గొప్ప సామర్థ్యంతో భూమండలంలో ఉన్న రాజులందరినీ జయించి ధర్మరాజుతో రాజసూయ యాగాన్ని చేయించాడు.
గొప్ప బలం కలిగిన సింహానికి కవచం తొడిగినట్టు పరమశివుడితోపాటు, దేవతలందరు దివ్యాస్త్రాలు ఇచ్చి అర్జునుణ్ని సన్మానించారు కదా. అంత గొప్ప యోధుడు ఉండగా పాండవుల్ని ఎవరు ఓడించగలరు? పాండవులు ధర్మం తప్పరు. సత్యానికి కట్టుబడి ఉంటారు. పవిత్రమైన నడత కలవాళ్లు. వాళ్లు కోరుకున్న దాన్ని పొందగల సమర్థులు. పాండవులతో సరితూగేవాళ్లు ఎవరు ఉన్నారు? అటువంటి పాండవులతో విరోధం పెట్టుకుని దుర్యోధనుడు తనకూ, తన బంధుమిత్రులకూ చేతులార ఆపద తెచ్చిపెట్టుకున్నాడు” అని బాధపడ్డాడు.
ధృతరాష్ట్రుడి బాధపడుతుంటే చూసి సంజయుడు “మహారాజా! దుర్యోధన దుశ్శాసనులు అసూయతో నిండు సభలో పాండవులకి కీడు చెయ్యడం విని వాళ్లని అప్పుడు శిక్షించకుండా ఇప్పుడు దుఃఖపడుతున్నావు. నీ అశ్రద్ధవల్ల పాండవులు దుర్యోధనుడు పన్నిన మాయాజూదంలో ఓడిపోయి కామ్యకవనంలో ఉన్నారు.
అక్కడికి శ్రీకృష్ణుడు అనేకమంది రాజులతో కలిసి వెళ్లాడు. పాండవుల్ని పరామర్శించి వాళ్లకి కీడు చేసిన కౌరవుల్ని నిందించాడు. ధర్మరాజుకి హస్తినాపురంలో పట్టాభిషేకం జరిపిస్తానని ప్రతిజ్ఞ చేశాడు. రాజసూయయాగం ఇంద్రప్రస్థపురంలో పొందిన వైభవం కంటె గొప్ప వైభవం కలిగిస్తానన్నాడు.
ఆ సమయంలో ద్రుపద, కేకయ, సృంజయ, దృష్టద్యుమ్న, బలదేవ, సాంబ, సాత్యకి ప్రభృతులందరు అక్కడే ఉన్నారు. సత్యసంధులైన పాండవులు తమ ప్రతిజ్ఞ ప్రకారం నడుచుకుంటామని శ్రీకృష్ణుణ్ని సముదాయించారు. అర్జునుడి రథానికి సారథ్యం వహించమని శ్రీకృష్ణుణ్ని అడిగారని విన్నాము.
బలవంతులైన పాండవులు పధ్నాలుగు సంవత్సరాల గడువు గడిచిపోయాక శ్రీకృష్ణుణ్ని ముందు పెట్టుకుని పట్టుదలతో యుద్ధానికి దిగుతారు. తపస్సు చేసి దేవతల్ని మెప్పించి వరాలు పొందుతారు. అర్జునుడు తన విలువిద్యతో పరమేశ్వరుణ్ని మెప్పించి ఆయన దయతో వరాలు పొందాడు. మహావీరుడైన అర్జునుడి దివ్యాస్త్రాలు, భీమసేనుడి గద దెబ్బలూ, నీ అశ్రద్ధ కౌరవుల వినాశనానికి మూల కారణాలు” అని చెప్పాడు సంజయుడు.
అతడి మాట్లాడిన మాటలు విని ధృతరాష్ట్రుడు “సంజయా! నేను ముసలివాడిని, గుడ్డివాడిని, బుద్ధిలేనివాడిని అనుకుని నా కొడుకు దుర్యోధనుడు నా మాట లెక్కచెయ్యడు. వాడికి అసంబద్ధ ప్రలాపాలే నచ్చుతాయి. దుర్యోధనుడు దుర్బుద్ధి కలవాడు. భీష్ముడు, ద్రోణుడు, విదురుడు వంటి పెద్దల మాట కూడా వినడు. కర్ణుడు, శకుని తనకి మంచి స్నేహితులు అనుకుని వాళ్లు చెప్పిన మాటలు విని గర్వంతో విర్రవీగుతుంటాడు” అన్నాడు బాధగా.
అర్జునుడు వెళ్లి చాలా రోజులు గడిచిపోయాయని పాండవులు బాధపడుతున్నారు. “పాండవులలో సింహంవంటి అర్జునుడు స్వచ్ఛమైన గొప్ప కీర్తితో ప్రకాశిస్తూ దేవేంద్రుడు మొదలైన దేవతల అనుగ్రహంతో వరాలు పొంది ఎప్పుడు తిరిగి వస్తాడో. మేము అతణ్ని తిరిగి చూడగలమా?” అని అర్జునుడి కోసం పరితపిస్తూ ఎదురుచూస్తున్నారు.
ధర్మరాజుతో భీముడు “నువ్వు ఆజ్ఞాపిస్తేనే కదా అర్జునుడు తపస్సు చేసేందుకు వెళ్లాడు. తిరిగి రావడానికి ఇంత ఆలస్యం ఎందుకవుతోందో. ఇంతకు ముందు అతణ్ని వదిలి ఉండలేదు. అతణ్ని చూడాలనే కోరికతో మనకి రోజులు యుగాల్లా అనిపిస్తున్నాయి. పాండవ పాంచాల వీరుల బ్రతుకులు అర్జునుడి మీదే ఆధారపడి ఉన్నాయి. మనం అర్జునుడి శౌర్యప్రతాపాల్ని నమ్ముకుని అతడి శక్తి వల్ల శత్రువుల్ని జయించి రాజ్యం మొత్తాన్ని మళ్లీ పొందాలని అనుకుంటున్నాం కదా! సమయం మించి పోకుండా అర్జునుణ్ని తీసుకుని రమ్మని శ్రీకృష్ణుడికి చెప్పండి.
పన్నెండేండ్లు వనవాసం ఒక ఏడు అజ్ఞాతవాసం చెయ్యడమనే ప్రతిజ్ఞని వదిలిపెట్టి పరాక్రమంతో విజృంభించి నేను అర్జునుడు ధృతరాష్ట్రుల కొడుకులందర్నీ చంపి భూమండలం మొత్తం ఆక్రమించగలం. అప్పుడు మొత్తం రాజ్యం మన చేతిలోకి వస్తుంది. నేను అర్జునుడు కలిసి యుద్ధభూమిలో ఉంటే మమ్మల్ని ఎదుర్కునేవాళ్లు ఎవరూ ఉండరు. శ్రీకృష్ణుడు మాకు అండగా ఉన్నాడు కనుక మేము ఈ పనిని సులువుగా నెరవేర్చగలుగుతాం.
నువ్వు అన్నమాటకి కట్టుబడి ఉంటావు. మాట తప్పడమంటే నీకు భయం. కనుక అరణ్యవాసం అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని హస్తినాపురానికి వచ్చి పట్టాభిషేకం చేసుకో. చెడు జూదంలో మన రాజ్యాన్ని దొంగిలించిన దుర్యోధనుణ్ని రాజ్యంలో ఎక్కువకాలం ఉంచకూడదు. మోసాన్ని మోసంతోనే జయించాలి. అలా చేయడం పాపం కాదు. రాజనీతి ప్రకారం శత్రువుల్ని అన్ని విధాలుగాను జయించవచ్చు” అని ఉద్రేకంగా చెప్పాడు భీముడు.
అతడి మాటలు విని ధర్మరాజు ప్రేమతో భీముణ్ని దగ్గరకి తీసుకుని తల నిమిరి కౌగలించుకున్నాడు. భీముడితో “అగ్నిహోత్రుడికి వాయువు తోడైనట్టు నీకు అర్జునుడు తోడైతే శత్రువులు మిమ్మల్ని యుద్ధంలో జయించలేరు. కాని, ఇది కోపం ప్రదర్శించడానికి తగిన సమయం కాదు.
పదమూడు సంవత్సరాలు గడిచిన తరువాత నువ్వు, అర్జునుడు మీ పరాక్రమంతో శత్రువుల్ని జయించి, ధర్మాన్ని రక్షించి విజయాన్ని పొందుదురుగాని. కౌరవులతో చేసుకున్న ఒడంబడిక ప్రకారమే నడుచుకుంటాను. ఎటువంటి పరిస్థితుల్లోను ఇచ్చిన మాటని జవదాటను” అని భీముణ్ని ఓదార్చాడు అని జనమేజయుడికి వైశంపాయన మహర్షి ఎంతో ప్రేమతో వీనులవిందుగా మహాభారతకథని చెప్పాడు.
అరణ్యపర్వంలోని (మొదటి భాగము) మొదటి ఆశ్వాసం సమాప్తం