Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-77: ధర్మరాజు దగ్గరికి వచ్చిన కృష్ణద్వైపాయనుడు

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

ధర్మరాజు దగ్గరికి వచ్చిన కృష్ణద్వైపాయనుడు

ర్మరాజు, భీముడు ఎన్నో అంశాల మీద చర్చించుకుంటున్నారు. అదే సమయంలో వాళ్ల పుణ్యం వల్ల పరాశరుడి కొడుకు, అన్ని లోకాల్లోను ఆరాధించబడేవాడు, బ్రహ్మతో సమానమైనవాడు, ధర్మస్వరూపుడు, నల్లజింక తోలుని ఉత్తరీయంగా ధరించిన వ్యాసమహర్షి అక్కడికి వచ్చాడు.

పాండవులు అతిభక్తితో వ్యాసమహర్షిని పూజించారు. వ్యాసభగవానుడు “ధర్మరాజా! మహావీరులైన మీరు గొప్ప పరాక్రమవంతులైన భీష్ముడు, ద్రోణుడు, కృపుడు, కర్ణుడు వంటివాళ్లని యుద్ధంలో చంపడం చాలా కష్టమయిన పని అని బాధపడడం నా మనస్సుతో గ్రహించి ఆ భారాన్ని తొలగించాలని ఇక్కడికి వచ్చాను.

‘ప్రతిస్మృతి’ అనే విద్య గొప్ప యోగాన్ని కలుగచేసేది, అతి రహస్యమైంది. దాన్ని నీకు ఉపదేశిస్తాను. ఈ విద్య వల్ల అర్జునుడు గొప్ప ఫలితాన్ని పొంది చరితార్థుడవుతాడు” అని చెప్పాడు.

ధర్మరాజుని ఒక రహస్య స్థలానికి తీసుకుని వెళ్లి ’ప్రతిస్మృతి’ అనే విద్యని ఉపదేశించాడు. “ఈ విద్యాశక్తి వల్ల ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు మొదలైన దేవతల్ని ఉపాసించి ప్రత్యక్షం చేసుకుని వాళ్లవల్ల దివ్యాస్త్రాలు పొంది అర్జునుడు శత్రువుల్ని జయించగలడు.

అంతేకాదు మీరు ఇక్కడ ఎక్కువ కాలం నుంచి ఉండడం వల్ల ఇక్కడ ఉండే పండ్లు, పువ్వులు, చెట్లు తగ్గిపోయాయి. అందువల్ల జంతువులకి కూడా ఇబ్బందిగ ఉంటుంది. అదీకాక ఎక్కువ కాలం ఒకే చోట ఉంటే ఆ ప్రదేశం మీద ఇష్టం తగ్గిపోతుంది. కనుక, మీరు ఇంకొక అడవికి వెళ్లడం మంచిది” అని చెప్పాడు.

ఆయన చెప్పినట్టుగా పాండవులు ఆ ప్రదేశం నుంచి బయలుదేరి కామ్యకవనంలో సరస్వతీ నదీ తీరంలో నివసించడం మొదలుపెట్టారు. ఒకరోజు ధర్మరాజు అర్జునుడితో “వేదం బ్రాహ్మణులలో స్థిరపడినట్టుగా, ధనుర్వేదం నాలుగుపాదాలతో శత్రువులపైన విజయం సాధించిన భీష్మాదుల్లో స్థిరపడింది. గొప్పదైన ధనుర్వేదం దివ్యమంత్రాలతో కలిసి భీష్మాదుల దగ్గర ఉండడం వల్ల వాళ్లు దుర్యోధనుడితో సత్కారాలు అందుకున్నారు.

యుద్ధం మొదలైనప్పుడు వాళ్లు మనల్ని ఎదిరించి గొప్ప పరాక్రమంతో యుద్ధం చేస్తారు. అటువంటి భీష్మాదుల్ని ఎదిరించి నిలిచే ఉపాయం వ్యాసమహర్షి ఉపదేశించాడు. ఆ విద్య నువ్వు నా దగ్గరినుంచి తీసుకుని అన్ని ఆయుధాలతో ఉత్తరదిక్కుగా వెళ్లి తపస్సు చేసి ఇంద్రుడి సాక్షాత్కారం పొందు.

పూర్వం వృత్రాసురుడికి భయపడి దేవతలు తమ ఆయుధాలు, బలాలు ఇంద్రుడికి ఇచ్చారు. అతడి అనుగ్రహం వల్ల అవన్నీ నువ్వు పొందగలవు. తరువాత ఇంద్రుడు చెప్పినట్టు విని పరమేశ్వరుణ్ని అరాధించి అయన అనుగ్రహం పొందమని వ్యాసమహర్షి నాకు ఉపదేశించాడు” అని చెప్పాడు.

తపస్సుకోసం బయలుదేరిన అర్జునుడు

ధైర్యంతో వ్రతదీక్ష తీసుకున్నవాడు, పాపం లేనివాడు, మంత్రాన్ని సాధించాలనే పట్టుదలతో ఉన్న అర్జునుడికి శత్రువుల్ని జయించాలన్న కోరికతో ధర్మరాజు ‘ప్రతిస్మృతి’ అనే విద్యని ఉపదేశించాడు. ప్రతిస్మృతి అనే విద్యని పొందిన అర్జునుడు గొప్ప తేజస్సుతో ప్రకాశించాడు. దివ్యాస్త్రాల్ని సంపాదించడానికి అన్నగారి అనుమతి తీసుకున్నాడు. బ్రాహ్మణుల ఆశీస్సులు తీసుకుని అందరికీ వీడ్కోలు చెప్పి తపస్సు చేసుకోడానికి బయలుదేరాడు.

గాండీవాన్ని, అక్షయతూణీరాల్ని, బంగారు కవచాన్ని ధరించి బయలుదేరుతున్న అర్జునుణ్ని బ్రాహ్మణులు, కనపడని భూతాలు సంతోషంతో ’ఇతడికి ఇష్టసిద్ధి కలగాలి!’ అని ఆశీర్వదించారు.

శత్రువుల మీద విజయం సాధించడం కోసం వెడుతున్న అతడి ఉత్సాహాన్ని చూసి పాంచాలి మనసులో  ‘అవమానం భరించలేని ఈ క్షత్రియకులంలో ఇంక నాకు జన్మ ఉండకూడదు! క్షమాగుణం కలిగిన విప్ర వంశంలోనే నేను జన్మించాలి!’ అనుకుంది.

“అర్జునా! శత్రువులు  చేసిన అవమాన సముద్రంలో మునిగిన నన్ను ఉద్ధరించు. ఇంత గొప్ప పని మీద వెడుతున్న నిన్ను దిక్కులు, సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, భూమి, వాయుదేవుడు రక్షించాలని కోరుకుంటున్నాను” అని అతడి ఎడబాటుకు మనస్సుని కుదుటపరుచుకుంటూ సాగనంపింది.

అర్జునుడు ఈశాన్యదిక్కు వైపు తిరిగి ఇంద్రుడికి సంబంధించిన యోగ శక్తి వల్ల కలిగిన గొప్ప తేజస్సుతో హిమాలయ గంధమాదన పర్వాతాల్ని దాటి ఒంటరిగా బయలుదేరాడు. వీరుడైన అర్జునుడు గాండీవము, ప్రతిస్మృతి అనే యోగవిద్య తోడుగా ఇంద్రకీలాద్రి అనే పర్వతం మీద అడుగుపెట్టాడు.

“వీరుడా! కదలవద్దు!” అని వినిపించింది. అర్జునుడు ఆ శబ్దం విని ఆగిపోయాడు. అతడి మీద పూలవాన కురిసింది. అతడికి ఆశ్చర్యం కలిగింది. యమము, నియమము, తపస్సుల వల్ల చిక్కిన శరీరంతో బ్రాహ్మణుడు ఒక చెట్టు మొదట్లో కూర్చున్నాడు. అర్జునుడు కూడా ఆయన ప్రక్కనే విశ్రాంతి కోసం కూర్చున్నాడు.

బ్రాహ్మణుడు అర్జునుడి వైపు చూసి “ఇది ఋషులు తపస్సు చేసుకునే ప్రశాంతమైన ప్రదేశం. నువ్వు కత్తి, కవచం, ధనుస్సు వంటివి పట్టుకుని వచ్చావు.. నువ్వు గొప్ప క్షత్రియ కులానికి చెందినవాడివా? ఇక్కడ ఆయుధాలు ధరించి ఉండకూడదు విడిచిపెట్టు” అన్నాడు.

అర్జునుడు బదులివ్వకుండ కదలకుండ ఉండిపోయాడు. అతడి ధైర్యానికి మెచ్చుకుని ఇంద్రుడు తన నిజ స్వరూపంలో కనిపించి “నీకు ఇష్టమైన వరాలు ఇస్తాను కోరుకో!” అన్నాడు.

అర్జునుడు అమితమైన భక్తితో ఇంద్రుడుకి నమస్కరించి “దేవా! నాకు నీ నుంచి దివ్యాస్త్రాలు కావాలి” అన్నాడు వినయంగా. అది విని దేవేంద్రుడు “వాటిని నీకు తప్పకుండా ఇస్తాను. ఇంకా పుణ్యలోకాలు, జన్మరాహిత్యము వంటివి నీకు కావలసినవన్నీ కోరుకో” అన్నాడు.

అర్జునుడు ఇంద్రుడితో “దేవా! నాకు కావలసింది దివ్యాస్త్రాలు. పుణ్యలోకాలు, అమరత్వము వంటివి నాకెందుకు? శత్రువులు చేసిన పరాభవం వల్ల నా అన్నదమ్ములు కారడివిలో మగ్గుతున్నారు. నేను నువ్విచ్చే వరాలు తీసుకుని ఊరికే వెడితే నన్ను చూసి నవ్వరా?” అన్నాడు.

అర్జునుడి మాటలకి సంతోషించి ఇంద్రుడు “అర్జునా! నువ్వు దివ్యాస్త్రాలు పొందాలంటే అన్ని లోకాలతో పూజలందుకునే సర్వేశ్వరుణ్ని ధ్యానించు. యోగ శక్తితో ప్రసన్నుణ్ని చేసుకో! అలా చేస్తే దిక్పాలకులందరితో కలిసిన శివుడు నీ కోరిక తప్పకుండా తీరుస్తాడు” అని చెప్పి దేవేంద్రుడు అదృశ్యమయ్యాడు.

అర్జునుడు హిమలయ పర్వతాలపైకి వెళ్లి అక్కడ పండ్లచెట్ల మధ్య, పూలచెట్లమధ్య, సెలయేళ్లమధ్య రాజహంసలు, కలువలు, రంగురంగుల పద్మాలతో ఉన్న సెలయేళ్లమధ్య ఏకాగ్రత గల మనస్సుతో శివుడి గురించి తపస్సు చేస్తున్నాడు.

అర్జునుడు వరుసగా మూడు రాత్రులు ఆహారం తీసుకోకుండ నెలరోజులు, ఆరు రాత్రులు ఆహారం తీసుకోకుండా నెలరోజులు, పదిహేను రాత్రులు ఆహారం తీసుకోకుండా నెలరోజులు గడిపాడు. చేతులు పైకెత్తి ఒక కాలి బొటనవేలిపైన నిలబడి గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ మరొకనెల గడిపాడు.

త్రికరణశుద్ధిగా కఠోర తపస్సు చేస్తున్న అర్జునుణ్ని చూసి ఆ వనంలో ఉన్న మహర్షులు ఆశ్చర్యపోయారు. మహేశ్వరుడి దగ్గరికి వెళ్లి “పరమేశ్వరా! అర్జునుడి కోరికని అనుగ్రహించండి” అని వేడుకున్నారు.

పరమేశ్వరుడు బంగారురంగు శరీర కాంతితో చేతిలో పెద్ద విల్లు పట్టుకుని ఎరుకలవాడిగా మారాడు. పార్వతీదేవి చెంచెతగా మారింది. భూతగణాలు అరుస్తూ కురుచ చేతులు, మిడిగ్రుడ్లు, మోటురూపాలతో ‘తడ’ అనే చెట్టుకర్రలతో చేసిన విల్లులు పట్టుకుని చెంచులుగా మారారు. వాళ్ల భార్యల్ని చెంచెతలుగా మార్చారు.

అడవి అంతా అదిరేటట్లు శివుడు వేటకి బయలుదేరాడు. అడవిలో నివసిస్తున్న జంతువులు, పక్షులు భయంతో కదలకుండా కూర్చుండిపోయాయి. పరమేశ్వరుడు అర్జునుణ్ని చంపడానికి ‘మూకుడు’ అనే రాక్షసుణ్ని పంది రూపంలో పంపించాడు. అర్జునుడు తన మీదకి వస్తున్న పందిని బాణంతో కొట్టాడు. అదే సమయంలో ఎరుకరాజు వేషంలో ఉన్న పరమేశ్వరుడు కూడా అదే పందిని బాణంతో కొట్టాడు.

రెండు బాణాలు ఒకేసారి వెళ్లి పందికి రెండు వైపులా తగిలాయి. ఇద్దరి బాణాలు గుచ్చుకోగానే మూకుడు అనే రాక్షసుడు పంది ఆకారాన్ని విడిచిపెట్టి రాక్షసుడిగా మారి పారిపోయాడు. అర్జునుడు ఆశ్చర్యపోయాడు. ఎరుకలరాజు వైపు చూసి “నేను కొట్టిన జంతువునే నువ్వు కూడా కొట్టావు. అలా కొట్టడం వేటలో పాటించవలసిన ధర్మం కాదు” అన్నాడు.

ఎరుకలరాజు “పరాక్రమ దర్పం చూపించవలసింది మాటల్లో కాదు. పౌరుషం ఉంటే నాతో యుద్ధం చెయ్యి” అన్నాడు. ఇద్దరి మధ్య యుద్ధం మొదలయింది. ఎన్ని బాణాలు వేసినా చలించని ఎరుకలవాడిని చూసి అర్జునుడు “నువ్వు దేవేంద్రుడో, పరమశివుడో, కుబేరుడో అయి ఉండాలి. లేకపోతే నేను ప్రయోగించిన బాణాల ధాటికి గాయపడక, మూర్ఛపోక, చలించక ఉండగలిగేవాడు ఎవడు?” అన్నాడు.

ఎరుకలవాడు వేసిన అస్త్రాలు దివ్యాస్త్రాలుగ కనిపిస్తున్నాయి. వేసే బాణాలు చూస్తే అపూర్వమైన అనుభూతి కలుగుతోంది. ఇతడు ఏ దివ్యపురుషుడో అయి ఉండాలి అనుకున్నాడు. వెంటనే అతడి మీద తన గాండీవాన్ని, కత్తిని, చెట్లని అన్నింటినీ ప్రయోగించి చివరికి అతడితో కలియబడ్డాడు. కాని, ఎరుకలవాడి ధాటికి తట్టుకోలేక కింద పడి మూర్ఛపోయాడు.

పరమేశ్వరుడు అర్జునుడి ధైర్యసాహసాలకి మెచ్చుకుని ప్రత్యక్షమయ్యాడు. తన నిజ స్వరూపం చూడడానికి దివ్యదృష్టిని ఇచ్చాడు. “అర్జునా! క్షత్రియుల్లో శౌర్య ధైర్య సాహసాల్లో నీకు సాటి ఎవరూ లేరు. నీ తపస్సు, పరాక్రమం, నాకు సంతోషాన్ని కలిగిస్తున్నాయి. నీకు కావలసిన వరాలు ఇస్తాను. దేవతల్ని, రాక్షసుల్ని, మనుషుల్ని జయించి జగాన్నంతటినీ నువ్వు ఏలగలవు” అన్నాడు.

కోరికల్ని తీర్చేవాడు, దేవతలచేత రాక్షసులచేత పూజించబడేవాడు, దయామయుడు, పినాకము అనే వింటిని చేతిలో ధరించినవాడు మంగళకరుడు, పార్వతీపతి అయిన పరమేశ్వరుణ్ని చూసి అర్జునుడు అత్యంత భక్తితో ప్రస్తుతించాడు.

Exit mobile version