Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-135: ద్రౌపదిని ఎత్తుకుపోయిన ఉపకీచకులు

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

విరాటపర్వము – మూడవ ఆశ్వాసము

ద్రౌపదిని ఎత్తుకుపోయిన ఉపకీచకులు

వైశంపాయన మహర్షి జనమేజయుడితో “భీముడు కీచకుణ్ని వధించి వెళ్లి వంటింటి దగ్గర తన ఒంటికి అంటుకుని ఉన్న నెత్తురు శుభ్రంగా కడుక్కున్నాడు. వాసన రాకుండా మైపూత పూసుకుని పడక మీద కూర్చున్నాడు.

ద్రౌపది నర్తనశాల నుంచి బయటికి వచ్చి భీమసేనుడు వంటశాలకి వెళ్లిపోయి ఉంటాడని నిర్ధారించుకుని అక్కడున్న కాపలావాళ్లని పిలిచింది. “నా భర్తలయిన గంధర్వులకి చిక్కి తన చెడు ప్రవర్తనకి ఫలితాన్ని పొందిన పాపాత్ముడైన సింహబలుణ్ని చూడండి” అంది.

వాళ్లు వేగంగా పరుగులు పెడుతూ కాగడాలు పట్టుకుని నర్తనశాలకి పరుగెత్తారు. ఆ కేకలు విని ఉపకీచకులు కూడ అక్కడికి వచ్చి గుర్తుపట్టలేనంతగా వింతచావు చచ్చిన తమ అన్న కీచకుడి శరీరం చూశారు. గుండెలు అదిరిపోయేలా అరిచారు. ఆశ్చర్యంతో కొయ్యబారిపోయారు. అన్న శవం మీద పడి మూర్ఛపోయారు. అంతలోనే భయంకరంగా ఉన్న ఆ శవం దగ్గరికి పోలేక దూరంగా నేలమీద పడి పొర్లుతూ ఏడ్చారు.

ఉపకీచకుల ఏడుపుల ధ్వనికి కీచకుడి బంధువులందరూ వచ్చి కీచకుడి శవాన్ని చూశారు. “లోకంలో ఇంత వింతగా పీనుగులా మారిన వాళ్లని ఇంతవరకు చూడలేదు. అయ్యో! ఎంత అప్రతిష్ఠ? ఇటువంటి పనికిమాలిన చావు వచ్చింది. అంత గొప్ప బలపరాక్రమాలు కూడ అవసరమైనప్పుడు పనికిరాకుండా పోయాయి. మూర్ఖుడి మనసు రాబోయే కీడుని చూడలేదు. గర్వంతో ఉండే మనసు చెడుని తప్పించుకోలేదు. దగ్గరికి వెళ్లి చూశారు. కాళ్లు, చేతులు, తల కనిపించలేదు. గంధర్వ వీరుల చేతిలో చచ్చిపోయేవాళ్లు ఇలాగే చస్తారేమో. కోపం ఎక్కువగా ఉండడం వల్ల ఇలా చంపేశారేమో.. చావు ఇంత ఆశ్చర్యంగా కూడా ఉంటుందా?” అని అందరూ అనేక విధాలుగా మాట్లాడుకుంటున్నారు.

అదే సమయంలో ఒక ఉపకీచకుడు తన సోదరులతో “మనం ఏడుస్తూ ఎంత పిలిచినా సింహబలుడికి వినిపించవు. ఇతణ్ని వెంటనే శ్మశానానికి తీసుకుని వెళ్లాలి” అంటూ అందరినీ ఊరడించాడు. ఉపకీచకుడు చెప్పినదానికి మిగిలినవాళ్లు అంగీకరించారు. తమ అన్న సింహబలుడికి దహనసంస్కారాలు చెయ్యడానికి సన్నాహాలు మొదలుపెట్టారు. ద్రౌపది వాళ్ల చేష్టల్ని చూస్తూ తరువాత ఏం జరుగుతుందో అని చూస్తూ నిలబడింది. ఆమెని ఉపకీచకులు చూసారు. ఒక్కసారిగా భయంకరమైన కోపం వచ్చి ఆమెని కసిగా పట్టుకుని ఆమె చేతులు వెనక్కి విరిచి కట్టారు.

ఈమె పాపిష్ఠి అందానికి ఆకర్షించబడే ఇటువంటి చావుని తెచ్చుకున్నాడు. కాబట్టి, ఈమెని కూడా కలిపి కట్టి దహనం చేయడం సరైన పని అని నిర్ణయించుకున్నారు. తమ నిర్ణయాన్ని విరాటరాజుకి చెప్పి చేయాలని రాజు దగ్గరికి బయలుదేరారు. అప్పటికే విషయం తెలిసి బాధపడుతున్న విరాటరాజు దగ్గరికి వెళ్లి తమ నిర్ణయాన్ని తెలియచేసి అనుమతించమని అడిగారు.

విరాటరాజు మనసులో “ఈ ఉపకీచకులు తను వద్దన్నా వినేట్లు లేరు. గంధర్వులు బలవంతులు కనుక సైరంధ్రికి అపాయం కలుగదు” అనుకుని  ఉపకీచకుల్ని చూసి “మీకు తోచినట్లు చేయండి” అన్నాడు.

అదే అనుమతిగా అనుకుని ఉపకీచకులు పరుగెత్తి వెనక్కి వెళ్లారు.  ద్రౌపదిని తీసుకుని వెళ్లి కీచకుడి శవంతో కలిసి కట్టారు. అపవిత్రుడూ, దుష్టుడూ, అల్పుడూ అయిన తమ అన్న శవంతో కలిపి.. పవిత్రురాలు, పుణ్యస్వభావం కలది, అదర్శవంతురాలు; ప్రసిద్ధికెక్కిన ఆ ఇల్లాలిని తీసుకుని వెళ్లి బంధువుల ఏడ్పులు పెడబొబ్బలు పెరిగి దిక్కులు అదిరేటట్లు వ్యాపించగా, కాగడాల గుంపులు ధగధగ వెలుగుతూ ఉండగా శ్మశానం వైపుకి వెడుతున్నారు.

ద్రౌపది భయంతో కన్నీరు కారుస్తూ బిగ్గరగా ఏడుస్తూ “దిక్కులేని నా ఆక్రందాన్ని వినండి. మీరుండగానే ఉపకీచకులు నన్ను చుట్టుముట్టి కట్టేసి భయం లేకుండా అవమానం చేస్తున్నారు. శత్రువుల్ని పాదాక్రాంతుల్ని చేసుకున్న జయుడా! మాహాద్భుత విక్రమశాలివైన జయంతుడా! దురభిమానులైన శత్రువుల్ని జయించిన విజయా! తేజోబలంతో శత్రువుల్ని పడగొట్టిన జయత్సేనా! భుజబలంతో విజృంభిస్తున్న శత్రువుల్ని నాశనం చేసిన ఓ జయద్బలా! ఎంత కష్టమైన పని అయినా సరే పట్టు వదలకుండా పూర్తి చేసే ప్రభువులారా! పోరాటంలో యమధర్మరాజుని కూడా పరాక్రమంతో చిటికెలో చంపగల వీరులారా! శరణు వేడితే దుర్మార్గుడైన శత్రువుని కూడా కాపాడే దయామయులారా! దేహి అన్నవాళ్లకి ప్రాణాలు కూడా దాచుకోకుండా దానమిచ్చే దాతలైన నాథులారా! గంధర్వశ్రేష్ఠులారా! ఉపకీచకులు నన్ను కీచకుడి శవంతో కట్టి వేగంగా తీసుకుని పోతున్నారు. మీరు త్వరగా వచ్చి నన్ను కాపాడాలి” అని అరుస్తోంది.

ఉపకీచకుల్ని చంపిన భీముడు

ఆమె ఆక్రందన భీమసేనుడు విన్నాడు. ఉపకీచకులు ఇంతపని చేశారా అనుకుంటూ కోపంతో ఊగిపోతూ యుద్ధానికి సిద్ధమై పరుగెట్టి కోట ప్రాకారాన్ని దూకాడు. శ్మశానం దగ్గరికి వెళ్లి నాలుగు దిక్కులా పరికించి చూశాడు. ఒక పెద్ద చెట్టుని పీకి కోపంతో భుజం మీద పెట్టుకున్నాడు. వంపులు తిరిగిన కనుబొమలతో భయంకరంగా మారిన నుదుటి మీద చెమటపట్టిన శూరుడూ, కంపిస్తూ విడ్డూరంగా కనిపిస్తున్న పెదవులు కలవాడూ, కోపంతో ఊగిపోతున్న శరీర కదలికలు కలవాడు, మనస్సు మండే ఉత్సాహంతో నిండైన కోపావేశాన్ని ప్రదర్శిస్తున్నవాడూ, బకాసురుణ్ని సంహరించిన భీముడు  భయంకరమైన ఆకారంతో నిలబడ్డాడు.

కీచకుడి శవం వెంట వస్తున్న ఉపకీచకులు భయంకరమైన ఆకారంతో నిలబడిన భీముణ్ని దూరం నుంచే చూసి భయంతో ముందుకి నడవలేక ఎక్కడివాళ్లు అక్కడే ఆగిపోయారు. ‘గంధర్వులు వచ్చి మనల్ని చుట్టుముట్టారు. వాళ్లని ఎలా తప్పించుకోవాలో?’ అనుకుంటూ పల్లపు ప్రాంతాల్లో దాక్కుని, దగ్గరలో ఉన్న చెట్ల మీదకి ఎగబ్రాకి చెల్లాచెదురుగా పరుగెత్తారు. నీటిలో మునిగి కూర్చున్నారు. భయంతో నిశ్చేష్టులై కాళ్లాడక స్తంభించి పోయారు. చివరికి తమ అన్న శవాన్ని కూడా వదిలేసి ఊరివైపుకి పారిపోయారు. భీమసేనుడు వేగంగా వాళ్ల వెంట పరుగెత్తి వాళ్లని చావమోది ఆవేశంతో నుగ్గు నుగ్గు చేశాడు.

ఉపకీచకుల్ని చంపి శాంతించి ద్రౌపది కట్లు ఊడదీసి సుదేష్ణ మందిరానికి వెళ్లిపొమ్మని పంపించాడు. తరువాత తను మరొక దారిలో వంటయింటికి వెళ్లిపోయాడు. విరాటుడు కీచకుడి తమ్ముళ్లు అందరూ గంధర్వుల చేత చంపబడ్డారని విని కంపిస్తున్న మనసుతో తోబుట్టువులందరు మరణించారని విని దుఃఖపడుతున్న తన ఇల్లాలితో “దేవీ! సైరంధ్రిని ఏదో ఒక సాకుతో వెంటనే ఇక్కడి నుంచి పంపించెయ్యాలి. ఆమెతో నేను చెప్పినట్టు తగిన విధంగా చెప్పు. అందమైన ఆమె వైపు మగవాళ్లు వెడితే ప్రమాదం వస్తుంది. కనుక, నేను చెప్పడానికి భయపడుతున్నాను. ఆడవాళ్లయితే మెత్తటి మాటలతో నేర్పుతో ఉపాయంగా చెప్తారు. ఆమె అందమైంది, మగవాళ్లు భావోద్రేకం కలవాళ్లు. నగరప్రజల వల్ల ఎప్పటికైనా చేటు కలగకుండా ఉండదు. ఇటువంటి ప్రమాదకరమైన స్త్రీతో స్నేహంగా బతకగలమా?” అన్నాడు. సుదేష్ణకి భర్త చెప్పిన మాటలు నిజమనిపించాయి. సైరంధ్రిని పంపించెయ్యాలని అనుకుంది.

సింహబలుడితో పాటు కీచకులందరు చచ్చిపోవడంతో ద్రౌపది తేరుకుంది. తెల్లవారాక శవాన్ని తాకిన దోషం పోడానికి సచేలస్నానం చేసింది. నెమ్మదిగా నడుస్తూ నగరంలోకి ప్రవేశించి రాజవీధిలోకి వచ్చింది. ఆమెని చూసి విరాటుడి పట్టణంలో ఉన్న ప్రజలు పులిని చూసిన లేళ్లు పరుగెత్తినట్టు పరుగెత్తుతున్నారు. ద్రౌపది మనసులో నవ్వుకుంటూ వంటింటి వాకిట్లో నిలుచుని ఉన్న భీమసేనుణ్ని చూసింది. తన కృతజ్ఞతా భావాన్ని తెలియచెయ్యాలని అతడివైపు చూడకుండా తనలో తను అనుకుంటున్నట్లుగా “కీచకుడి వల్ల కలిగిన ప్రమాదాన్ని తొలగించి నన్ను కాపాడిన పరమధర్మమూర్తికి గంధర్వపతికి జీవితాంతం సదా భక్తిభావంతో నమస్కరిస్తూ జీవిస్తాను” అంది.

ద్రౌపది మాటలు విని భీముడు రహస్యంగా మాట్లాడుతూ నేర్పుగా “ఇల్లాలు ఆపదలో చిక్కుకున్నప్పుడు ఆదుకోకుండా ఉండే మగడు మగడనిపించుకుంటాడా? అది పౌరుషము లోకధర్మము కాదు. కనుక, నీ భర్తలు అలా చేయడం నీ ఇష్టానికి తగినట్టు నడుచుకోడమే కదా! అది వాళ్ల కర్తవ్యం. వాళ్లు చేయవలసిన పనినే చేసి తమ సహజ ప్రవర్తనని ప్రదర్శించారు. దీనికి వాళ్లని అంతగా పొగడాలా?” అన్నాడు.

అర్జునుడితో మాట్లాడిన ద్రౌపది

భీముడికి కృతజ్ఞత చెప్పుకున్నాక ద్రౌపది నర్తనశాలకి వెళ్లింది. అక్కడ నాట్యం చూసే నెపంతో అర్జునుణ్ని చూస్తోంది. నాట్యం చేస్తున్న కన్యలు అర్జునుణ్ని తీసుకుని ద్రౌపది దగ్గరికి వచ్చి “కీచకులవల్ల ఏ కీడూ జరగకుండ తిరిగి వచ్చావా తల్లీ? నిన్ను బాధించిన దురహంకారి కీచకుడు యమలోకానికి చేరాడా? అంతటితో ఆగక ఉపకీచకులందరు కలిసి సుకుమారివైన నీకు అంతటి దారుణాన్ని కలిగించాలని చూస్తారా? నీ భర్తలు వెంటనే వచ్చి శత్రువుల్ని చుట్టుముట్టి ఇంత త్వరగా నిన్ను రక్షించుకుంటారా?” అని సైరంధ్రికి ఓదార్పు మాటలు చెప్తున్నారు.

బృహన్నల సైరంధ్రితో “ఆ దుర్మార్గుల చేష్టలు, వరుసగా వాళ్లందరు చంపబడ్డ విధానము నీ నోటితో చెప్తే వినాలని అనుకుంటున్నాను. వివరంగా చెప్తావా?” అని అడిగాడు.

ద్రౌపది బృహన్నలతో “కన్యలకి నాట్యం నేర్పుతూ గడిపే నీకు సైరంధ్రి ఏమైపోయినా చీమ కుట్టినంత బాధ కూడా లేదు. అందుకే నవ్వు ముఖంతో విషయాలు చెప్పమని నన్ను అడుగుతున్నావు. నిన్ను ఏమనాలి”  అంది.

ఆమె మాటలు విని బృహన్నల “నువ్వు కష్టాల్లో చిక్కుకున్నావని తెలిసి దుఃఖాన్ని పొందినా ప్రయోజనం లేని ఈ పనికిమాలిన పుట్టుక పుట్టినందుకు నేను మనసులో పడే వేదన ఎవరికి తెలుస్తుంది? నీ గురించి నాకు తెలియదా? నువ్వు ఎటువంటి దోషం లేనిదానివి. నువ్వు బాధపడుతున్నందుకు నాకు మనసులో బాధ లేదనుకుంటున్నావా? నువ్వు నిజాన్ని గ్రహించలేకపోతున్నావు. అర్జునుడు తన సొదరుల మాదిరిగా మారు వేషమే కాకుండా ఊర్వశీ శాపం వల్ల మారు శరీరాన్ని పొందాను. కనుక శత్రువుల్ని చంపడం మంచిది కాదని ఆగాను” నెమ్మదిగా చెప్పాడు.

అతడి మాటలు విని నవ్వు ముఖంతో “నీ గురించి నాకు తెలియదా? ఇన్ని చెప్పడం ఎందుకు? అంతఃపురంలో తగిన విధంగా నువ్వు నడుచుకోడమే నాకు చాలా ఇష్టం” అంటూ కన్యలందరు తన వెంట వస్తుండగా సుదేష్ణ మందిరంలోకి ప్రవేశించింది. తన తోబుట్టువుల చావుకి దుఃఖంలో ఉన్న సుదేష్ణ దగ్గరికి వెడుతున్నప్పుడు మనసులో కలుగుతున్న సంతోషాన్ని బయటికి కనబడనీయకుండా ఏమీ తెలియని అమాయకురాల్లా వెళ్లింది. సైరంధ్రిని చూడాగానే సుదేష్ణ బాధపడుతూనే పలకరించింది.

తన పక్కన కూర్చోబెట్టుకుని అమె ముఖం వైపు చూస్తూ “సైరంధ్రీ! నువ్వు అందగత్తెవి. మగవాళ్లు చిత్తస్థైర్యం లేనివాళ్లు. విరాటరాజు బాగా ఆలోచించి భయపడి నిన్ను నీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్లమని ప్రార్థనాపూర్వకంగా చెప్పి పంపమన్నాడు” అని చెప్పింది.

సుదేష్ణకి సోదరుల వియోగ బాధ

“సైరంధ్రీ! బిరుదున్న భర్తలున్నారని వరుసపెట్టి అందరినీ చంపించడానికి ప్రయత్నిస్తున్నావు. మనుషులు నీతో నడవడానికి భయపడుతున్నారు. మా నగరాన్ని, మా దేశాన్ని వదిలి ఎక్కడికైనా వెళ్లిపో” అంది.

సుదేష్ణ మాటలు విని సైరంధ్రి “ఇంతవరకు ఉన్నట్టుగానే ఇంకొక పదమూడు రోజులు మాత్రం నీ మందిరంలో ఉండడానికి ఒప్పుకుంటే చాలు. నా కోరిక తీరుతుంది. తరువాత నా భర్తలు వచ్చి మీ కోరికని తీరుస్తారు. అందువల్ల ఇంతకుముందు ఎప్పుడు కలుగని సంతోషం మీకు కలుగుతుంది. మేలుచేసిన విషయాన్ని కృతజ్ఞతతో నా భర్తలు గుర్తిస్తారు. పరులకి ఉపకారం చెయ్యాలన్న దీక్ష కలిగి ఉంటారు. నియమాన్ని వాళ్లు ఎప్పుడూ వదలరు. వాళ్లది దయాగుణం కలవాళ్లు. విరాటుడికి వాళ్లు మేలు చేస్తారు.  సైరంధ్రి ఇలా ఎందుకు అంటోందా అని ఆలోచించవద్దు.

అమ్మా! ఈ సైరంధ్రి ఏమైపోతే నాకేమిటి? ఈమెని గురించి ఆలోచన నాకెందుకు? ఇంతకాలం ఈమెని గౌరవంగానే చూశాను. చివరిదశలో ఆ గౌరవానికి భంగం కలుగకుండా ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని నెమ్మదిగా చెప్తాను అని మనసులో నిర్ణయించుకున్నావు. ఇది నీకు న్యాయమా?” అంది.

సైరంధ్రి మాటలు విని సుదేష్ణ “నువ్వు చెప్పిన గడువు పూర్తయ్యే వరకు నా మందిరంలో నువ్వు ఉండడానికి అంగీకరిస్తున్నాను. నువ్వు నీ వృత్తికి తగిన పనుల్లో ఉండిపో. నా కొడుకుల్నీ, నా భర్తనీ పెద్ద మనసుతో రక్షిస్తూ ఉండు. నీ మనసు ఊరట కలగడానికి అవసరమైనవన్నీ నువ్వు కోరుకున్నట్లు అమరుస్తాను” అంది.

సైరంధ్రి ఎప్పటిలాగే తన పనిలో తాను నిమగ్నమైంది. పట్టణంలో ప్రజలు “విరాటుడి బావమరిది కీచకుడనేవాడు శత్రుసేనలకి భయం కలిగించే బలం కలవాడు. అటువంటివాడు చూసేవాళ్లకి ఆశ్చర్యం కలిగించేలా వింతగా చచ్చిపోయాడు. అతడిని చంపినవాళ్లు ఎటువంటి వీరులో.. అసలెవరో? సింహబలుడైన కీచకుడు ఒక ఆడదాని కోసం గంధర్వుల చేతిలో పడి భయంకరంగా చచ్చిపోయాడు. మత్స్యరాజు బలం పోగొట్టుకున్నాడు. సూతవంశం నశించింది” అని చెప్పుకుంటున్నారు. ఈ వార్త అన్ని దేశాల్లోను వ్యాపించింది.

Exit mobile version