[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
కీచకుణ్ని చంపడానికి ప్రతిజ్ఞ చేసిన భీముడు
ద్రౌపది అప్పటి వరకు చెప్పినవన్నీ విని భీముడు చిరునవ్వు నవ్వుతూ “ద్రౌపదీ! కీచకుణ్ని చంపడానికి ఇన్ని రకాలుగా మాట్లాడడం అవసరమా? నేను చూస్తుండగానే అడ్డూ అదుపూ లేకుండా నిన్ను పరాభవించిన ఆ కీచకుడు భూమి మీద ఇంకా జీవించి ఉంటే ఇల్లాళ్లని మానభంగాలనుంచి రక్షించేందుకు మార్గమేముంటుంది? ఆ రోజు విరాటుడి కొలువులో నా భుజశక్తిని చూపించకపోవడమే తప్పయింది. రేపు మాత్రం కీచకుడు ఎక్కడ దాగి ఉన్నా, స్వయంగా ధర్మరాజు వచ్చి అడ్డుపడినా, నువ్వు కూడా ఎక్కువ దయ చూపించి వదిలెయ్యమని చెప్పినా నా చేతిలో అతడికి చావు తప్పదు. ఇంక నువ్వు కీచకుడి గురించి కొంచెం కూడా బాధపడాల్సిన అవసరం లేదు. వాడి విషయం ఇంక నువ్వు మర్చిపో” అని ద్రౌపదిని ఊరడించాడు.
కాలం కలిసిరాక ద్రౌపది పడుతున్న బాధ చూసి ఆమె మనోవేదన తగ్గించాలని భీముడు “చ్యవనుడి కోరిక మన్నించి సుకన్య అడవిలోపడి అనేక కష్టాలు భరించలేదా? రఘురాముడితో అడవులకు వెళ్లి సీతమ్మ ఇడుములు పడలేదా? అగస్త్యుడివెంట పర్వతాలు దాటి లోపాముద్ర అగచాట్లు పడలేదా? నలుడిని వెంబడించి అడవులకి వెళ్లి దమయంతి మనుషులు పడలేని పాట్లు పడలేదా? వాళ్లందరు కష్టాలు పడినా ఓర్పుపట్టి సుఖాలు అనుభవించలేదా? నువ్వు కష్టాలు అనుభవించినా కొంతకాలం ఓర్పు పట్టావంటే సంపదల్ని అనుభవిస్తావు.
దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని, సైంధవుడు మొదలైన దుష్టులందరిని పరలోకానికి పంపేటంత వరకు నా మనసు విచారంతో వంగిపోయి, అవమానంతో కుంగిపోయి, కోపతాపాలతో కలపడుతూనే ఉంటుంది. కౌరవులకి కాలం మూడినట్లు మన అజ్ఞాతవాస కాలం పూర్తవుతోంది. పదకొండు నెలలు పూర్తయి పన్నెండో నెల నడుస్తోంది. ఈ గడువు కొంచెం తీరిందంటే నీ దుఃఖం కూడా తీరుతుంది. కనుక, శాంతంగా ఉండు.
కీచకుడు నిన్ను అవమానించి బ్రతికే ఉన్నాడు. నువ్వు అంగీకరిస్తున్నట్టుగా అతడికి చెప్పి నర్తనశాలకి ఒంటరిగా రమ్మని చెప్పు. అతణ్ని నీ కళ్ల ముందే మట్టుబెట్టి నీ మనసుకి ఆనందం కలిగిస్తాను. ఈ పని మాటలతో జరిగేది కాదు. చేతలతో జరగవలసిందే. తెల్లవారబోతోంది, మనల్ని ఎవరేనా చూస్తే అజ్ఞతవాస వ్రతానికి, మన పనికి కూడా భంగం కలుగుతుంది. నువ్వు వెళ్లి పడుకో” అని తొందరపెట్టి భీముడు కొంతదూరం కలిసి వెళ్లి వీడ్కోలు చెప్పాడు. తను కూడా వెళ్లి తన పడక మీద పడుకున్నాడు. ద్రౌపది వెళ్లిపోయి తన పడక మీద పడుకుంది కాని కంటి మీద కునుకు రాలేదు.
ద్రౌపదిని ఒప్పించడానికి వెళ్లిన కీచకుడు
సూర్యోదయం అవగానే ఉదయంలో చెయ్యవలసిన పనులన్నీ ముగించుకుని కీచకుడు చక్కగా అలంకరించుకున్నాడు. తన మనస్సులో ఉన్న కోరికతో, ద్రౌపదితో మాట్లాడాలన్న కంగారుతో వేగంగా సుదేష్ణ అంతఃపురానికి బయలుదేరాడు. ఎలాగయినా ద్రౌపదిని కలిసి తన కోరిక తెలియచెయ్యాలని ఆమెని ఒప్పించాలని అనుకుంటూ వెడుతున్నాడు. సుదేష్ణ అంతఃపురానికి వెళ్లి తన పనిలో నిమగ్నమై ఉన్న సైరంధ్రిని చూశాడు. వేరే ఆలోచన లేకుండా పక్కన ఇతర పరిచారికలున్నా పట్టించుకోకుండా సైరంధ్రి దగ్గరికి వెళ్లాడు. ద్రౌపది భీముడిచ్చిన మాట గుర్తొచ్చి ధైర్యంతో తన పనిలో నిమగ్నమైపోయింది.
కీచకుడు నెమ్మదిగా సైరంధ్రిని సమీపించి “నన్ను లెక్కచెయ్యకుండా ఉండి నా ఆశ నిరాశ చెయ్యకు. నన్ను అనుగ్రహించి అంతులేని సంపదల్ని, సుఖాల్ని స్వేచ్ఛగా అనుభవించు. నా సంపదకి నీవే రాణివై పట్టణంలో స్త్రీలందరు నిన్ను కొలుస్తూ ఉంటే రాణీవాసంలో రాణిగా ఉండు. నేను భయంకరమైన యుద్ధాల్లో యుద్ధభూమిలో రాజులందరినీ చంపి ఈ రాజ్యానికి రాజుగా నేనే నడుపుతున్నాను. విరాటరాజుని నామమాత్రంగా రాజుగా ఉంచి అతడికి తిండి పడేస్తున్నాను. సైరంధ్రీ! నిన్ను ఒక్కదాన్నే కాదు, ఈ భూమి మీద పదివేలమందినైన నేను ఇష్టపడి పట్టుకుంటే కాదని వారించగల మగాడు ఇక్కడ లేడు. ఈ విషయం నువ్వు తెలుసుకోలేకపోతున్నావు. విరాటమహారాజు చూస్తుండగా సభలో వేలమంది చూస్తుండగా నేను నిన్ను అలా తోసి పారేసినా అన్ను అడ్డుకున్నవాళ్లు ఎవరూ లేరు. నీకు బలవంతులైన అయిదుగురు భర్తలు ఉన్నారని చెప్పావు. ఇప్పుడు తెలిసిందిగా వాళ్ల బలపరాక్రమాల గురించి? వాళ్ల అంతు చూస్తాను. వాళ్ల అడ్డు తొలగించుకుని నిన్ను నాదాన్నిగా చేసుకుంటాను” అన్నాడు.
అతడి చెప్పినవన్నీ విని ద్రౌపది అంగీకరించినట్టు అతడి వైపు చూసి “నేను వద్దని ఎంత వారించినా వినకుండా నా వెంట పడుతున్నావు. పురుషులు తమ కోరికని బయటికి వ్యక్తపరుస్తారు. స్త్రీలు బయటపడకుండ మనసులో అణుచుకుంటారు. నీ ఇష్టానికి నేను అంగీకరిస్తున్నాను” అంది.
కీచకుడు సంతోషంతో పొంగిపోయి “నువ్వు నన్ను ఎక్కడికి రమ్మంటావో చెప్పు” అన్నాడు. ద్రౌపది అతణ్ని రాత్రికి నర్తనశాలకి రమ్మని చెప్పింది. కీచకుడు సంతోషంతో అందుకు అంగీకరించి ఒంటరిగా వస్తానని ద్రౌపదిని అన్న మాట ప్రకారం రమ్మని సంతోషంగా చెప్పాడు. కీచకుడి వస్తానని చెప్పాక ద్రౌపది ఎవరేనా చూస్తే బాగుండదని అతణ్ని అక్కడినుంచి వెళ్లిపొమ్మని చెప్పింది. సంకేత సమయాన్ని, స్థలాన్ని నిర్ణయించిన తరువాత ద్రౌపది వంటశాలకి వెళ్లింది.
నర్తనశాలకి కీచకుడు వస్తున్నట్టు భీముడికి చెప్పిన ద్రౌపది
ద్రౌపది వంటశాలకి వెళ్లి భీముడి కోపం ఇంకా పెరిగేట్టు చేస్తూ “నా వంతు పని నేను పూర్తిచేసి వచ్చాను. కీచకుణ్ని వధించడానికి ఈ రాత్రే తగిన సమయం. ఇంక నీ ఇష్టం. ఏం చేస్తావో చెప్పు” అంది. ద్రౌపది మాటలు విని భీముడు చిరునవ్వుతో “ద్రౌపదీ! నువ్వు, ఆ నీచుడు కీచకుడు మాట్లాడుకున్నదేమిటో నాకు వివరంగా చెప్పు. నువ్వు మెచ్చుకునే విధంగా చేస్తాను” అన్నాడు.
ద్రౌపది సుదేష్ణ మందిరంలోకి కీచకుడు అలంకరించుకుని రావడం భీముడు రాత్రి చెప్పిన ధైర్యం వల్ల తను భయపడకపోవడం, కీచకుడు తనని సామ దాన భేద దండోపాయాలతో లోబరుచుకోడానికి ప్రయత్నించడం, తను లోబడినట్లుగా నటించి కీచకుణ్ని ఒంటరిగా నర్తనశాలకి రమ్మని చెప్పడం, మూర్ఖుడైన కీచకుడు సంతోషంతో వస్తానని చెప్పి వెళ్లడం వివరంగా చెప్పింది.
భీముడు సంతోషంతో పొంగిపోయాడు. “ప్రతీకారం తీర్చుకోలేక బాధ పడుతున్న నాకు అత్యంత ఉత్సాహాన్ని కలిగించేలా కష్టమైన పని చేశావు. ఇది అజ్ఞతవాసానికి విరుద్ధమైనదైనా ఇది జరిగేటట్టు చేశావు. ఇంక ధర్మరాజు మనసులో మెచ్చుకునేలా పగ సాధించి చూపిస్తాను” అన్నాడు.
మళ్లీ కొంతసేపు ఆలోచించి “భయపడకుండా నువ్వు చెప్పిన చోటికి వస్తాడా? ఇంక కొంతమందిని వెంటపెట్టుకుని వస్తాడా? తొందరపాటుతో మూర్ఖుడు గుట్టు రట్టు చేస్తాడేమో? అయినా నువ్వు ప్రేమగా మాట్లాడి చెప్పినప్పుడు అలా చెయ్యడులే. ఆ స్థితిలో వాడికి అనుమానం కలగడానికి అవకాశం ఉండదు. కీచకుడు తప్పకుండా వస్తాడు. కళ్లు కప్పేసిన కోరికతో నర్తనశాలలోకి తప్పకుండా ఒంటరిగానే వస్తాడు. నీకోసం వెతుక్కుని నన్ను చూసి యుద్ధం చేస్తాడు. నా బహుబలం ముందు తన బలాన్ని పోగొట్టుకుని నీకు సంతోషం కలిగిస్తూ చస్తాడు. అనుమానం లేదు. ఇంక నువ్వు అదే పనిగా అలోచించకు. ద్రౌపదీ! కీచకుడు నాతో యుద్ధం చెయ్యగల శక్తి కలిగి నన్ను ఎదిరించి గట్టిగ పెనుగులాడి నాకు కోపం తెప్పిస్తే భూమండలం కంపించేలా, ఆకాశం అల్లల్లాడినట్లుగా, దిక్కులు పిక్కటిల్లేలా, కుల పర్వతాలు వణికేలా, సముద్రాలు అల్లకల్లోలం అయ్యేట్టుగా, నా కోపం తీర్చుకునేట్లు నా నేర్పరితనంతో చిత్రవధ చేసి నా రౌద్రరూపాన్ని అతడికి చూపిస్తాను” అన్నాడు.
భీముడి మాటలు విని ద్రౌపది ఉలిక్కిపడింది. భీముడి అధికమైన కోపం తమ అజ్ఞాతవాసానికి భంగం కలిగిస్తుందేమోనని భయపడింది. భీముడితో “మనమంటే పడనివాళ్లు నవ్వేటట్లు, ధర్మరాజుకి ఇంకా బాధ కలిగేటట్లు, లోకులతో నిందింపబడేట్లు అధికమైన కోపంతో రహస్యం బయటపడితే నా కోరిక తీరినా ఉపయోగం లేకుండా పోతుంది. అజ్ఞాతవాసానికి భంగం రాకుండా మన శత్రువుని చంపగలగాలి. అదే నా అభిమతం. లేకపోతే ఈ ప్రయత్నమే వదిలేద్దాం” అంది.
“యుద్ధం చేసే సమయంలో కీచకుడు విజృంభిస్తే నాకు అంత విచక్షణా జ్ఞానం ఎలా ఉంటుంది? అయినా నువ్వు చెప్పిన విషయాన్ని మనసులో ఉంచుకుని రహస్యాన్ని భద్రంగా కాపాడుతూ తగిన ఉపయంతో కీచకుణ్ని సంహరిస్తాను” అని చెప్పాడు.
ద్రౌపది జయలక్ష్మిని పొందమని శుభాకాంక్షలు చెప్పి సుదేష్ణ తన కోసం చూస్తూ ఉంటుంది ఆలస్యం చెయ్యడం మంచిదికాదని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయింది. భీముడు స్థిరమైన నిశ్చయంతో ఉన్నాడు.
నర్తనశాలలో బీమకీచకులు
ద్రౌపది భీముడి దగ్గరికి వెళ్లి సమయమయిందని చెప్పింది. భీముడు సంతోషంగా తలపాగా చుట్టుకుని ద్రౌపదిని వెనకాల నెమ్మదిగా రమ్మని ముఖంలో కోపం కనిపించకుండా గంభీరంగా నర్తనశాలకి వెళ్లాడు. నర్తనశాల నాలుగువైపులా పరికించి చూసి ధైర్యంగా మదించిన పట్టపుటేనుగులా నడుస్తూ వెళ్లాడు.
చీకటి రూపంగా మారిన గోడలు, నేల పైభాగం, వరుసగా ఉన్న స్తంభాలు కలిగినది, మొదలు చివర తెలుసుకోడానికి వీలు లేని సింహద్వారం కలిగినది, పిరికివాళ్ల మనసుల్ని భయపెట్టేది, వెళ్లడానికి సాధ్యంకానిది అయిన నర్తనశాల లోపలికి నిశ్చింతగా భీముడు భార్య చేయి పట్టుకుని అమితమైన కోపంతో ప్రవేశించాడు.
భవనానికి మధ్యలో ఉత్తర విలాసంగా పడుకునే మెత్తని పాన్పుని చూసి దాని మీద కూర్చున్నాడు. దగ్గరలో కీచకుడికి కనిపించకుండా ఉండేలా ద్రౌపదిని దాచాడు. అప్పుడే అలంకరించుకుని వచ్చిన కీచకుడు సంతోషంతో సింహం ఉన్న గుహ దగ్గరికి వచ్చే ఏనుగులా భీముడు కూర్చుని ఉన్న నర్తనశాలకి వచ్చాడు. తన బాహుబలం మీద ఉన్న నమ్మకము, ద్రౌపది మీద ఉన్న కోరికతో గుడ్డివాడై నర్తనశాల మండపంలో మధ్యభాగానికి వెళ్లాడు. సంకేతంగా ద్రౌపది చెప్పిన ప్రదేశానికి వెళ్లి అక్కడున్న శయ్యని చూసి సంతోషంతో మంచం మీదకి తన చెయ్యిని చాపాడు.
భీముడు తీవ్రమైన కోపంతో అదురుతున్న శరీర అవయవాల్ని అదుపులో పెట్టుకుంటూ కీచకుడు మాట్లాడే మాటల్ని వినాలని కదలకుండా ఉండిపోయాడు. తన భయంకరమైన కోపాన్ని బయటికి కనబడనీయకుండా అదుపులో పెట్టుకున్నాడు. కీచకుడు భీముడి శరీరం మీద చేయి వేసి చలిస్తున్న మనసుతో “మాలినీ! నీకు గొప్పవైన వస్తువుల్ని తెచ్చాను, ఇంతకు ముందు స్త్రీలు నన్ను పొందాలని విలువైన వస్తువులు నాకు కానుకలుగా తెచ్చేవాళ్లు. నా సౌందర్యం చూసిన స్త్రీ నన్నుతప్ప మరొకర్ని అంగీకరించదు. నా తెలివితేటలు చూసి ఆనందించిన స్త్రీ విరహాగ్నిలో పడి కొట్టుకుంటుంది. నా మాటలు అందమైన స్త్రీలని లొంగదీసుకోడానికి గాలాలుగా ఉపయోగపడతాయి. ఇంతవరకు వనితలందర్నీ ఆకర్షిస్తూనే ఉన్నాను. కాని నువ్వు ఒక్కత్తివే నన్ను ఆకర్షించి ఏలుకున్నావు. ఇంతకంటే ఇంక ఏమి చెప్పను?” అన్నాడు.
ఆ మాటలు విని భీముడు అసహ్యించుకుంటూ పైకి తెలియకూడదు కనుక, రహస్యంగా ప్రవర్తించాలి కనుక తన ప్రియమైన భార్య ద్రౌపదిని సంతోషపెట్టాలని అనుకున్నాడు కనుక, తన కంఠస్వరాన్ని మార్చి మృదువుగా కీచకుడితో “ఇటువంటి వాడివి కనుకనే నిన్ను నువ్వే పొగుడుకోవడం సమంజసంగానే ఉంటుంది. నావంటి స్త్రీ ఎక్కడ వెదికినా నీకు దొరకదు. నా శరీరంతో నీ శరీరం తగిలినప్పుడే నీ శరీరం ఏమవుతుందో అది నువ్వే తెలుసుకుంటావు. నన్ను మిగిలిన సామాన్య స్త్రీలతో సమానంగా చెయ్యాలనుకుంటే నువ్వు తప్పు చేసినట్లే. నన్ను ఒకసారి ముట్టుకున్నాక ఇంక ఏ ఆడదాన్నీ నువ్వు కోరుకోవు. ఆ సంతోషాన్ని ఇప్పుడే చూస్తావు” అన్నాడు.
అంతలోనే తటాలున లేచి భీముడు కీచకుడు భయపడేట్లు అట్టహాసం చేస్తూ తన భుజబలంతో అతడి తల పట్టుకుని వంచాడు. కీచకుడు తన బలపరాక్రమాలు కూడగట్టుకుని భీముణ్ని విడిపించుకున్నాడు. భీముడి భుజాల్ని పట్టి బలంగా లాగి కింద పడేసి అతడి శరీరాన్ని మోకాళ్లతో అదిమాడు. కర్ర దెబ్బ తిన్న పాములా పైకి లేచాడు భీముడు.
ఆ సమయంలో అటువంటి చోటులో ఉన్నానని ఇతరులు తెలుసుకుంటారేమో అని కీచకుడు, తన అజ్ఞాతవాస ప్రతిజ్ఞకి భంగం కలుగుతుందేమోనని భీముడు మనసులో భయపడుతూ చప్పుడు కాకుండా పిడికిటిపోట్ల దెబ్బలతో యుద్ధం చేస్తున్నారు. పరాక్రమంతో ఇద్దరూ పోరాడుతూ ఉండగ భీముడి భుజశక్తి క్రమంగా పెరిగింది. కీచకుడి భుజశక్తి క్రమంగా తగ్గింది.
తన దెబ్బలకి తప్పించుకోబోతున్న కీచకుణ్ని భీముడు కోపంతో పిడికిలితో కొట్టాడు. కీచకుడికి కళ్లగుడ్లు బయటికి వచ్చి కిందపడి తన్నుకున్నాడు. భీముడికి కీచకుణ్ని వికారంగా చంపాలని కోరిక పుట్టింది. అతడి కళేబరాన్ని పట్టుకుని.. తల, చేతులు, పాదాలు మొండెంలోకి చొచ్చుకునేట్లు దూర్చి, చిల్లులు పడిన నిండు సంచీలా ఉన్న శవాన్ని నేలమీద పడేసి నలిపి మనసులో ఉన్న కసి తీరేలా మాంసపు ముద్దగా చేశాడు.
భీముడి బలం మీద నమ్మకం ఉన్నా కీచకుణ్ని చంపగలడో లేదో అని ద్రౌపది ఆలోచిస్తోంది. కీచకుడి చావు ఎప్పుడు చూస్తానా.. అని ఎదురు చూస్తున్న ద్రౌపదికి కీచకుడి చావు వార్త చెప్పాడు. రహస్యంగా నిప్పు తీసుకుని వచ్చి ఆ వెలుగులో కీచకుడి శవాన్ని చూపించాడు. ద్రౌపది విచిత్రంగా పడి ఉన్న కీచకుడి శవాన్ని చూసి ఆశ్చర్యపోయింది. దగ్గరకి వెళ్లి “కీచకా! దీనికోసమా ఇంత చేశావు? ఇప్పటికైనా శాంతంగా ఉండు” అంది.
భీముడు మనసులో ‘నేను అనుకున్న పని నెరవేర్చాను. భార్య దుఃఖభారాన్ని, అవమానాన్ని పోగొట్టాను’ అనుకున్నాడు.
ద్రౌపదితో “గుండెలో ముల్లులా బధ కలిగిస్తున్న నీ దుఃఖం తీరిందా? నా బలపరాక్రమాల్ని నీ మనసు మెచ్చుకుందా? నీ కోపం శాంతించిందా? దుష్టుడైన కీచకుడి చావు నీకు సంతోషం కలిగించిందా? దుర్బుద్ధితో నీతో ప్రవర్తించేవాళ్లు ఎంత వీరులైనా నా చేతిలో చావు తప్పదంతే!” అన్నాడు.
కీచకుణ్ని చంపిన భీముడి మాటలు విని ద్రౌపది సంతోషంతో “నిన్న విరాటుడి కొలువులో ప్రళయంలా వచ్చిన కోపోద్రేకాన్ని నిగ్రహించుకుని నిలబడిన నీ ధైర్యస్వభావం అపురూపమైంది. ప్రజల కళ్లు కప్పి నీ కర్తవ్యాన్ని నెరవేర్చడం చాలా విశేషం. మన పాండవుల్లో ఒక్కళ్లని కూడ సహాయానికి పిలవకుండా ఒంటరిగా ఉత్సాహంతో కార్యాన్ని సాధించిన నీ సాహసం మెచ్చుకోతగినది. ఎవ్వరికీ చంపడానికి సాధ్యుడు కాని కీచకుణ్ని క్షణంలో రూపం గుర్తుపట్టలేనంత ఘోరంగా చంపిన నీ పరాక్రమ విలాసం కీర్తించడం ఎవరి తరం కాదు. నీ ఉత్తమ నాయకత్వ లక్షణాలన్నింటినీ కీర్తించడానికి నేను ఎంతటిదానిని? అమితమైన ఆనందంతోను, ఆశ్చర్యంతోను మునిగిపోయాను” అంది.
భీముడు ద్రౌపది మాటలు విని సంతోషంతో ఉప్పొంగిపోయాడు. అంతలోనే “ఇంక ఇక్కడ ఉండడం మంచిది కాదు” అని ద్రౌపదిని హెచ్చరించి వెళ్లిపోయాడు.
వైశంపాయనుడు వీనుల విందుగా చెప్పిన కీచకవథ ఘట్టం విని, జనమేజయుడు తరువాత జరిగిన విషయాలు చెప్పమని ఆసక్తిగా అడిగాడు.
విరాటపర్వంలోని రెండవ ఆశ్వాసం సమాప్తం
