[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
ద్రౌపది మీద మోహంతో పరితపించిన కీచకుడు
సుదేష్ణ మాటలకి సంతృప్తిపడి కీచకుడు తన మందిరానికి వెళ్లిపోయాడు. రకరకాల మద్యాల్ని, వాటితో తినడానికి సరిపడిన పదార్థాల్ని సిద్ధం చేసుకున్నాడు. చుట్టుపక్కల జనాలు లేకుండా చేసుకున్నాడు. ఒక అందమైన ప్రదేశంలో కూర్చుని సైరంధ్రి తనతో వున్నట్టుగా భావిస్తున్నాడు.
“సుదేష్ణ దగ్గర ఉన్నప్పుడు సైరంధ్రి మనసు నా మీద లగ్నమైనా తన భావాన్ని చెప్పలేకపోయింది. తనను మొదటిసారి చూడడం వల్ల సిగ్గుతో తత్తరపడి ఉండవచ్చు. నేను ఆ విషయం గురించి ఆలోచించలేకపోయాను” అని కీచకుడు సైరంధ్రి మీద కోరికతో అనేక విధాలుగా ఆలోచిస్తూ సైరంధ్రి రాక కోసం ఎదురు చూస్తూ తనలో తను మాట్లాడేసుకుంటున్నాడు.
అంతఃపురంలో సుదేష్ణ సైరంధ్రిని పిలిచి మద్యం తాగాలనే దాహాన్ని నటించింది. “సైరంధ్రీ! దాహానికి నా నోరు ఎండిపోతోంది. చక్కటి సువాసన కలిగిన మదిరని తాగాలని నా మనసుకి అనిపిస్తోంది. కీచకుడి ఇంట్లో ఎప్పుడూ రుచిగల మంచి మద్యం ఉంటుంది. నువ్వు త్వరగా వెళ్లి తీసుకుని రా! ఎంత త్వరగా వస్తావో చూస్తాను” అంది.
ద్రౌపది మనసు వణికిపోయి శరీరమంతా చెమట పట్టింది. నీరసపడిపోయి ‘సుదేష్ణ మాటలు నాకు చాలా దుఃఖం కలిగిస్తున్నాయి. నేను కీచకుడి ఇంటికి వెళ్లలేను అని చెప్పలేను. ఒంటరిగా అక్కడికి పోనూలేను. భగవంతుడా! ఈ చిక్కునుంచి బయటపడే ఉపాయం నువ్వే చూపించాలి!’ అని అనుకుంది. భయపడుతున్న మనసుతో సుదేష్ణతో “రాణీ! నన్ను వదిలిపెట్టి ఈ కల్లు తీసుకుని రావడానికి మరెవరినైనా పంపించు. నీ దగ్గర నేను మంచిమార్గంలో గౌరవప్రదమైన పనులు చేసేదాన్నే కాని, నీచ పరిచారికలు చేసే పనులు చేసేదాన్ని కాదు. నువ్వు సదాచార సంపన్నురాలివని తెలిసి నా భర్తలు దగ్గర లేకపోయినా నమ్మకంతో ధైర్యంగా ఉంటున్నాను. ఇలా మర్యాద తప్పడం ధర్మం కాదు.
మంచివాళ్లు తమ మంచి నడవడికతో చెడ్డవారితో చెరచబడకుండా కాపాడుకోడానికి పెద్దల్ని ఆశ్రయిస్తే వాళ్లు వాళ్లకి ఆశ్రయమిచ్చి వాళ్ల యోగ క్షేమాల భారం వహించి, వాళ్లకి ఎటువంటి ఆపదలు కలగకుండా కాపాడి అన్ని విధలా రక్షిస్తే కీర్తిని పొందుతారు. అలా కాకుండా వాళ్లని అపాయాలకి గురి చేస్తే నిందల పాలవుతారు. నన్ను ఎవరింటికో ఏ పని మీదో పంపడం భావ్యం కాదు. నేను మీ కొలువులో చేరినప్పుడే నీచపు పనులు చెయ్యనని మీ అంగీకారాన్ని పొందాను కదా” అంది.
ద్రౌపది చెప్పిన మాటలు విని చెడుపని మీద పంపుతున్నందుకు సందేహించింనా తమ్ముడి బాధ గుర్తుకు తెచ్చుకుని గౌరవంగా సుదేష్ణ “సైరంధ్రీ! ఎంతో ఇష్టంగా తాగాలనుకున్న మద్యాన్ని తెప్పించుకునేందుకు నీచ పరిచారికల్ని పంపించడం ఇష్టం లేక చెప్పాను. నువ్వేమో దాన్ని దోషంగా అనుకుని నీచకార్యం చెప్పానని మనసులో బాధపడుతున్నావు. ఇది స్నేహధర్మం అనిపించుకుంటుందా? కీచకుడి ఇల్లు నీకు పరాయి ఇల్లు కాదుగా. నువ్వు అందరి మెప్పులూ పొందినదానివే. నిన్ను చూసినప్పటి నుంచి నీ మంచి గుణాల గురించి అందరికీ చెప్పడం వల్ల నువ్వు అందరికీ తెలుసు” అని సుదేష్ణ అనేక విధాలుగా నచ్చ చెప్పింది. సుదేష్ణతో ఎక్కువగా వాదించడం మంచిది కాదని అనుకుంది ద్రౌపది.
కీచకుడి ఇంటికి వెళ్లిన ద్రౌపది
ద్రౌపది మనస్సులో ఆలోచిస్తూనే “నువ్వు ఇంతగా అడిగావు కనుక తప్పకుండా చేస్తాను” అంది. సుదేష్ణ సంతోషంతో బంగారు పానపాత్రని ద్రౌపదికి ఇచ్చింది. దాన్ని తీసుకుని అంతకుముందు కీచకుడు గౌరవంగా మాట్లాడిన మాటలే కాకుండా అందుకు సుదేష్ణ కల్లు తీసుకుని రావడానికి తనను పంపించడం తలుచుకుని ద్రౌపది దుఃఖపడింది.
తనకి అనుకూలించని దైవాన్ని నిందిస్తూ, ఎవరూ దిక్కులేరని కన్నీళ్లు పెట్టుకుంది. అంతలోనే తనను ఎవరూ ముట్టుకోలేరని ధైర్యం తెచ్చుకుని దుఃఖాన్ని తగ్గించుకుంది. మనస్సులో కలిగే ఆలోచనల వల్ల ద్రౌపది ముఖం తెల్లబోయింది. భయంతో శరీరం వణుకుతోంది. అడుగులు తడబడుతున్నాయి. శరీరమంతా చెమటలు పట్టాయి. భయము, సంకోచము, నిశ్చేష్టత, బాధ కలిసి దిగులుపడుతోంది.
ద్రౌపది బాధపడుతూ కష్టాలు తీరాలంటే భగవంతుడే కరుణించాలని విష్ణుమూర్తిని మనస్సులో ధ్యానించింది. సుదేష్ణ మందిరం నుంచి బయటికి వచ్చి సూర్యుడికి నమస్కరించి “సూర్యదేవుడా! నేను పాండవుల్ని తప్ప ఇతరుల్ని భర్తగా అనుకోని పతివ్రతనైతే కీచకుడి వల్ల ఎటువంటి అపాయము జరగకుండా దయతో రక్షించు” అని రెండు చేతులు పైకెత్తి ప్రార్థించింది. ఆమె మొర విన్న సూర్యుడు ఆమెని రక్షించడానికి బలవంతుడైన ఒక రాక్షసుణ్ని పంపించాడు. ఆ రాక్షసుడు ద్రౌపది వెడుతున్న దారిలో వచ్చి ఆకాశంలో ఎవరికీ కనబడకుండా రక్షగా నిలబడ్డాడు.
ద్రౌపది నెమ్మదిగా కీచకుడి ఇంటికి చేరుకుని పులిబోనులోకి వెళ్లే లేడిలా అతడి మందిరంలోకి ప్రవేశించింది. సైరంధ్రి రావడాన్ని కళ్లు విప్పార్చుకుని చూశాడు కీచకుడు. ఆశ్చర్యంతోను, సంతోషంతోను తొట్రుపడుతూ లేచాడు. ఎదురు వెళ్లాలని అనుకుని, హారాలు సవరించుకుంటూ, వెకిలి చేష్టలు చేస్తూ నిలబడ్డాడు. అతడితో సైరంధ్రి “సుదేష్ణాదేవి దాహానికి మద్యం తీసుకుని రమ్మని పంపిస్తే వచ్చాను, పోయించండి” అని చెప్పింది. కీచకుడు ఆమె మాటలు విని “సుందరాంగీ! సుదేష్ణాదేవి దాహాన్ని తీర్చాలని అనుకున్న నువ్వు అమె తమ్ముడైన నా దాహాన్ని నీ సరసమైన మాటలతో తీర్చకపోవడం న్యాయమా? నా మనస్సులో కలుగుతున్న బాధని పోగొట్టి నా జన్మ సఫలం చెయ్యి” అన్నాడు.
కీచకుడి మాటలకి కలిగిన కోపాన్ని వివేకంతో కనబడనీయకుండా “మద్యం త్వరగా పోయించండి. అలస్యమయితే దేవి కోపగిస్తుంది. నేను వెంటనే వెళ్లాలి” అంది. అది విని కీచకుడు “నేను మద్యాన్ని వేరేవాళ్లకి ఇచ్చి పంపుతాను. నువ్వు ఈ మద్యం తాగి నా బాధని పోగొట్టు. చతురంగబలాలతో వెలుగొందుతున్న నా సంపదకి నిన్నే రాణిని చేస్తాను. నీకు అందమైన మణిహారాలు, విలాసగృహాలు, వేశ్యాసమూహాల్ని పరిచారకులుగా సమకూర్చి ఇస్తాను.
నా భార్యలందర్నీ నీకు దాసీలుగా చేస్తాను. స్నేహంగా నీ కనుసన్నల్లో మెలుగుతాను. అధికారాలన్నీ నీకే ఇస్తాను” అంటూ ఒళ్లు తెలియని స్థితిలో కీచకుడు సైరంధ్రిని పట్టుకున్నాడు. సైరంధివెంట వచ్చిన రాక్షసుడు సైరంధ్రికి ఆవహించడం వల్ల ఆమె కీచకుడి చేతిని గట్టిగా విదిలించి వేగంగా అక్కడినుంచి బయటికి వచ్చింది. సైరంధ్రి తనని విదిలించుకుని వెళ్లిపోతుంటే కీచకుడు ఆమెని వెంబడించాడు. సైరంధ్రికి ఎక్కడికి వెళ్లాలో అర్థం కాక కొలువుతీరి ఉన్నవిరాటమహరాజు సభలోకి ప్రవేశించింది. కీచకుడు ఒళ్లు తెలియని స్థితిలో గర్వంతో కళ్లు మూసుకుపోయి అక్కడున్న ప్రజల్ని లెక్కచెయ్యకుండా తను కూడా సభలోకి వెళ్లాడు.
ద్రౌపదిని వెంటాడుతూ వెళ్లిన కీచకుడు
గండుపిల్లి గోరువంక పిల్లమీదకి దురుసుగా దూకినట్టు కీచకుడు కోపంతో ద్రౌపది వెంటపడి పరుగెత్తి జుట్టుముడి లాగి కిందపడేశాడు. ద్రౌపదిని కాపాడడానికి వచ్చిన రాక్షసుడు కీచకుణ్ని నేలమీద పడేశాడు. కీచకుడు ఇతరులు తన పరిస్థితిని చూసేలోపల వేగంగా లేచాడు. రాక్షసుడు అడ్డుపడడం వల్ల ద్రౌపదిని ఏమీ చెయ్యలేక కీచకుడు బుసలు కొడుతూ లోపల ఉడికిపోతున్నాడు.
ఆ సమయంలో విరాటుడి కొలువులో అన్నతో కూడా కూర్చున్న భీముడు ద్రౌపదికి జరిగిన అవమానాన్ని, కీచకుడి పొగరుని, అతడు చేసిన దాడిని చూశాడు. అతడికి కలిగిన కోపంతో జబ్బలు చరుస్తూ ప్రళయకాలంలో పుట్టిన మహాగ్ని మానవ రూపం తాల్చినట్టుగా భయంకరమైన ఆకారంతో నిలబడ్డాడు. తన అజ్ఞాతవాస ప్రతిజ్ఞని మర్చిపోయి కీచకుణ్ని మట్టుబెట్టాలని అనుకున్నాడు.
కీచకుడు విరాటరాజు బంధువు అవడం వల్ల విరాటరాజు కీచకుడి ఆజ్ఞకి లోబడి ఉండడం వల్ల విరాటరాజు మీద కూడా తన కోపాన్ని ప్రదర్శిస్తూ దగ్గరలో ఉన్న పెద్ద చెట్టుని చూస్తూ ఎర్రటి ముఖంతో ధర్మరాజు వైపు చూశాడు. ధర్మరాజు భీముడికి కళ్లతో సైగ చేస్తూ “వంటలవాడైన వలలుడికి మరొక చోట చెట్లు దొరకవా? పెద్ద కొమ్మలతో, నిండుగ పండిన పండ్లతో, విశాలంగా విస్తరించి ఆశ్రయించిన వాళ్ల శ్రమని పోగొట్టేలా నీడనిస్తున్న ఈ చెట్టుని వంటచెరుకుగా నరికెయ్యడం ఎందుకు?” అన్నాడు.
ధర్మరాజు మాటల్లో దాగి ఉన్న రహస్యాన్ని అర్థం చేసుకుని భీముడు కోపాన్ని తగ్గించుకున్నాడు. అన్నదమ్ముల చేష్టల్ని గమనిస్తూ ద్రౌపది నెమ్మదిగా లేచింది. ఆమె శరీరమంతా దుమ్ము నిండి ఉంది. వేడి నిట్టూర్పులు విడుస్తోంది. కళ్లనుంచి నీటిబొట్లు రాలుతున్నాయి. చంద్రబింబం లాంటి ముఖం మీద ముంగురులు పరుచుకున్నాయి. దీనవదనంతో విరాటుడి సభకి వచ్చి నిలబడింది. ఒకవైపు పెరుగుతున్న కోపం, మరొకవైపు అజ్ఞాతవాసానికి భంగ కలుగుతుందేమోననే భయంతో కలవరపడుతూనే సభాసదుల్ని చూస్తున్నట్టు తన భర్తలవైపు చూస్తూ విరాటుడూ సభలో ఉన్నవాళ్లు వింటూ ఉండగా గద్గదస్వరంతో మాట్లాడింది.
“ఏది ధర్మమో, ఏది అధర్మమో బాగా తెలిసినవాళ్లు, సాధుజనాల్ని రక్షించి, దుష్టుల్ని శిక్షించేవాళ్లు, అస్త్రశస్త్రవిద్యల్లో ఆరితేరినవాళ్లు, శత్రువుల్ని అవలీలగా చంపగల గంధర్వులైన నా భర్తలు ఐదుగురు కీచకుడు ఇలా అవమానించినా ఉదాసీనంగా ఉండిపోయారు. ముందు ముందు లోకంలో ఇతరుల భార్యలకి ఇటువంటి అవమానం కలిగితే రక్షించే దిక్కు ఎవరుంటారు? ఈ విరాటమహారాజు ఉన్న సభలో ఇంతమందిలో ఒక్కళ్లైనా ధర్మానికి లోపం జరుగుతుందేమోననే భయం వల్ల ధర్మాన్ని రక్షించడానికి ముందుకి వచ్చి ఒక్క చిన్న మాట కూడా న్యాయంగా చెప్పేవాళ్లు లేకపోయారు. అధర్మానికి భయపడేవాళ్లు కూడా కనిపించలేదు. సభలో ఉన్న ఇంతమంది చూస్తుండగా పతివ్రతని, ఉత్తమ సాధు స్వభావం కలదాన్ని, గొప్ప శీలవతిని అయిన నన్ను ఈ కీచకుడు అవమాన పరుస్తుంటే ఇంతమందిలో కొంతమందైనా కొంచెమయినా దయ చూపించలేరా? ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ధర్మానికి లోపం కలిగినప్పుడు రాజు దాన్ని గమనించి శిక్షించాలి. ఈ సభలో నన్ను అవమానపరిచిన కీచకుణ్ని చూస్తూ ఊరుకోడం ధర్మమా?” అని అడిగింది.
ద్రౌపది మాటలు విని విరాటుడు ద్రౌపది వైపు సానుభూతిగా చూశాడు. కీచకుణ్ని మందలించే ధైర్యం లేక ఆమెను ఊరడించాడు. కోపంతో ఊగిపోతున్న కీచకుడి బాధని విరాటుడు అనునయించి తగ్గించాడు. కీచకుడు ఇంటికి వెళ్లిపోయాడు.
అందమైన ఈమె సైరంధ్రిగా ఎందుకు మారిందో అని కొందరు.. అందమైన ఈమెకి ఇన్ని కష్టాలు పెడుతున్న భగవంతుడు నిర్దయుడని కొందరు.. రాజు చూస్తుండగానే దుర్మార్గుడైన కీచకుడు ఈమెకి కీడు చేశాడే అని ఇంకొందరు అతణ్ని నిందించారు. అసలు ఇంత జరగడానికి సుదేష్ణ ఉపేక్షించడమే అని కొందరు అనుకున్నారు. గుసగుసగా మాట్లాడుతున్న సభాసదుల ముఖాలు వెలవెలబోయాయి. ధర్మరాజుకి మనసులో బాధకలిగింది. నుదుటి మీద చెమట పట్టింది. పెరిగిన కోపాన్ని అణుచుకుంటూ ద్రౌపదితో “సైరంధ్రీ! నీ విషయం రాజుగారికి, సభాసదులకి బాగా తెలిసింది. ఇంక ఎక్కువగా మాట్లాడకుండా రాణిగారి మందిరానికి వెళ్లిపో. నీ భర్తలకి ఉన్న నియమం వల్ల నీకు జరిగిన అవమానానికి నీ భర్తలు గంధర్వులు కోపం వచ్చినా ఇది తగిన సమయం కాదని ఊరుకుని ఉంటారు. ఆ విషయం తెలుసుకోకుండా నువ్వు నీ భర్తల్ని నిందించడం మంచిదికాదు. భార్య ఎన్ని పాట్లు పడినా నిండు సభల్లో చాలాసేపు నిలబడి ఆవేశంతో సంకోచం లేకుండా ఎదిరించి మాట్లాడడం మంచిది కాదు కదా? నువ్వే చెప్పు” అన్నాడు.
ధర్మరాజు మాటలు విని కూడా ద్రౌపది ఇంకా ఏదో చెప్పాలని అనుకుంటూ ఉండగా ధర్మరాజు “సైరంధ్రీ! ఇలా స్వేచ్ఛగా నాట్యం చేస్తున్నట్లుగా ఈ కొలువులో కులస్త్రీల గొప్పతనం పోయేట్లు నువ్వు నిలబడడం భావ్యం కాదు” అన్నాడు.
అతడి మాటలు విని ద్రౌపది “కంకుబట్టా! నా భర్త నటుడు. ఇది కాదనలేని నిజం. పెద్దవాళ్లతోనే చిన్నవాళ్లు కనుక, నేను కూడా నా భర్తవంటిదాన్నే. అందువల్ల నేను నర్తకిని కాదనడానికి వీలు లేదు. అందువల్ల నాకు కూడా నాట్యం చేయడం అలవాటే. నా భర్త నాట్యకాడు మాత్రమే కాదు. జూదరి కూడా! జూదరి భార్యకి గౌరవం, పెద్దరికం ఎక్కడి నుంచి వస్తుంది?” అంటూ అక్కడినుంచి వెళ్లిపోయింది.
