Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-130: విరాటుడి దగ్గరికి అశ్వపాలకుడుగా వచ్చిన నకులుడు

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

 

విరాటుడి దగ్గరికి అశ్వపాలకుడుగా వచ్చిన నకులుడు

క్కడికి వస్తున్న స్ఫురద్రూపుడైన నకులుడి మీద అందరి చూపులూ ఆగిపోయాయి. అప్పుడే విరాటుడు గుర్రాల్ని తీసుకుని రమ్మని చెప్పాడు. నకులుడు విరాటుడి కొలువు దగ్గరికి వచ్చి ఆ గుర్రాల్ని పరీక్షగా చూస్తున్నాడు.

నకులుడు గుర్రాల్ని పరిశీలనగా చూడ్డాన్ని గుర్తించాడు విరాటమహారాజు. తన సేవకులతో “ఇతడు ఎవరోగాని, ఎంత చక్కటి రూపం? ఇతణ్ని చూస్తుంటే మనస్సుకి హాయిగా అనిపిస్తోంది. గుర్రాల్ని పరిశీలించే తీరు చూస్తుంటే ఇతడికి అశ్వశాస్త్రంలో ప్రవేశం ఉన్నట్టు తెలుస్తోంది. అందమైనవాడే కాదు పరాక్రమం కలవాడు కూడా. ఇతడి వివరాలు హుందాగా వెళ్లి తెలుసుకుని రావాలి” అని అంటున్న సమయంలో నకులుడు విరాటుడి దగ్గరికి వచ్చి నమస్కరించాడు.

“రాజా! నేను రాజవాహనాలైన గుర్రాల్ని చాలా నేర్పుగా కనిపెట్టి చాలా జాగ్రత్తగా చూసుకుంటాను. నా పేరు దామగ్రంధి. నాకు అశ్వశాస్త్రం తెలుసు వినండి. అశ్వలక్షణాలు ఎటువంటివో నాకు తెలుసు. చూడగానే గుర్రాల ఆయుఃప్రమాణం చెప్పగలను. చూలో కాదో చెప్పగలను. ఆకారం చూసి మనోభావం చెప్పగలను. వయోపరిమితులు, జాతికి తగిన శిక్షణ విధానము, వ్యాయామ పద్ధతులు, చిత్తవృత్తుల విధాలు, గుర్రాల మేతలు, పోషణ పద్ధతులు, చికిత్సా పద్ధతులు నాకు తెలుసు. వాటిని మీకు చూపించగలను. ఒకవేళ యుద్ధం వస్తే అది నా పని కాదని ఊరుకోను. నా పరాక్రమాన్ని ప్రదర్శిస్తాను” అన్నాడు.

నకులుడు చెప్పినది విని విరాటుడు “నీకు తగిన పదవి ఇస్తాను. నా ఐశ్వర్యాన్ని కాపాడుదువు గానిలే. కేవలం గుర్రాల కాపరివని అనడం నీకు తగినట్లు లేదు.” అన్నాడు.

నకులుడు “మహారాజా! ఎవరైనా వాళ్లకి తెలిసిన పనులు వాళ్లు చేస్తూ బ్రతకాలి. చేతకాని సేవలకి ఒప్పుకోవడం న్యాయం కాదు. ధర్మరాజు నన్ను పెంచాడు. ఆశ్వశాస్త్రంలో నిపుణుడిగా చేశాడు. గుర్రాలకి అధిపతిని చేశాడు. నా మీద కలిగిన ప్రేమతో తన తమ్ముళ్లల్లో ఒకడిగా చూసుకునేవాడు. ధర్మరాజు రాజ్యం మీద విముఖతతో వెళ్లిపోయాడు. చుట్టాల్ని వదిలిపెట్టి, ఎక్కడెక్కడో తిరిగి చివరికి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. ఎక్కడ పొట్టపోసుకోవాలో తెలియక తిరిగాను. విరాటుడు మంచివాడని, పుణ్యాత్ముడని, ధర్మరాజువంటివాడని విని మిమ్మల్ని సేవించడానికి ఇక్కడికి వచ్చాను. నా చేత పని చేయించుకోవాలని అనిపిస్తే ఉంటాను. నా మీద మీకు సందేహంగా ఉంటే వెళ్లిపోతాను” అన్నాడు.

నకులుడు చెప్పినదంతా విని విరాటమహారాజు “అశ్వరక్షణ నీకిష్టమయితే అశ్వశాలన్నింటికీ అధిపతిగా ఉండి అశ్వపాలకుల్ని ఎలా చూసుకునేవాడివో అలాగే చూసుకో. ప్రేమగా వాళ్లతో పనులు చేయించుకో” అని చెప్పాడు. మాద్రి కొడుకు నకులుణ్ని గౌరవపూర్వకమైన ఆస్థానంలో ఉంచాడు. నకులుడు మనస్సులో ఆనందించాడు.

విరాటుడి దగ్గరికి గోపాలకుడుగా వచ్చిన సహదేవుడు

విరాటరాజు కొలువుకి వస్తున్న సహదేవుడు పైకి చూస్తే ప్రశాంతంగా ఉన్నట్లు కనిపించినా చంద్రుడే మనిషి రూపంలో వచ్చాడా? అగ్నిదేవుడే వచ్చాడా? అన్నట్లు ఉన్నాడు. ఒక పక్క పలుపుల మోపు, మరోపక్క పెయ్యదూడల తాళ్లు ఎన్నో చుట్లు చుట్టిన ఒక పెద్ద తాడు మొలలో దోపుకుని గొల్లతనం ఉట్టిపడేలా ఉన్నాడు. సహదేవుడు చేతిలో నున్నని పసువుల కాపరి కర్ర పట్టుకున్నాడు. అతడి సౌందర్యం అందరినీ ఆకట్టుకుంది. తామరరేకుల్లాంటి కళ్లలో చలాకీతనం కనిపిస్తోంది చూపులో కనిపించని భయం కనిపిస్తోంది. తడబడే చూపులతో సహదేవుడు పసువుల కాపరి వేషంలో విరాటుడి దగ్గరికి వచ్చి నమస్కారం చేశాడు.

విరాటుడితో “మహారాజా! నీ ఆలమందని కాపాడడానికి నన్ను అధికారిగా నియమించు. నా పర్యవేక్షణలో వాటికి రోగాలు అంటవు. ఇతరులు ఆలమందని లోబరుచుకోలేరు. అలసట, దాహము ఉండదు. పశువులు తప్పిపోవు. క్రూరజంతువుల బారిన పడవు. పాడి తగ్గదు. తోటి గొల్లలు మెచ్చుకుంటారు” అని చెప్పాడు

సహదేవుడి మాటలు విని విరాటుడు “నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీలో గొల్లతనం కనిపించట్లేదు. నీ శరీరము, నీలో ఉన్న గాంభీర్యము, కాంతి చూస్తుంటే నువ్వు సూర్యవంశంలోనో, చంద్రవంశంలోనో పుట్టినట్టు కనిపిస్తోంది. నీకిష్టమైన పదవిలో కుదురుకుని రాజ్యాన్నంతా చక్కబెట్టగలిగిన పరాక్రమం ఉండి కూడా ఇంత చిన్న జీవనోపాధిని కోరుకుంటావెందుకు? నీకు ఉత్తమ వాహనాలు, శ్రేష్ఠమైన ఆయుధాలు ఇస్తాను. మత్స్యదేశంలో నువ్వు కోరుకున్న ప్రదేశాన్ని కూడా ఇస్తాను. నా మండల సేనల్ని పాలించు” అన్నాడు.

సహదేవుడు “రాజా! నేను తక్కువ కులం వాడిని. ఇంతకు ముందు నాగరికమైన పనుల గురించి తెలియదు. గతంలో మేము కౌరవుల సేవకులం. పశువుల్ని రక్షించేవాడిని. ఆ పని తప్ప మరే విధంగానూ బతకడం నాకు చేతకాదు. ఇంతకు ముందు ధర్మరాజు పశుగణాన్ని పాలించేవాడిని. అందులో ఆ మహారాజు మన్ననలు పొందాను. నా పేరు తంత్రీపాలుడు. నా హస్తవాసి మంచిది. అందువల్ల దూడలు బాగా పెరుగుతాయి. అతి తక్కువ కాలంలో ఆలమందల్ని పెంచుతాను. ఉంగిడి, అదురు, త్రిక్క అనే రోగాలు నా పేరు చెప్తే దగ్గరికి రావు. పశువుల రకాలన్నీ నాకు తెలుసు. వేరే పనికి నేను తగను. ఈ పనిలో మీకు నచ్చిన విధంగా నడుచుకుంటాను. నన్ను పశుపాలకుడిగా నియోగించండి” అన్నాడు

విరాటుడు సహదేవుడి వేడికోలు విని కొంచెంసేపు అతడి ముఖం వైపు చూసి “నీకు ఇష్టమైతే, పెద్ద పనులు చెయ్యడం నీకు ఇష్టం లేకపోతే గోసంపదని శ్రద్ధతో రక్షించు. ఇంతకు ముందు ఉన్న గోపాలురు నిన్ను కొలుస్తారు. నువ్వు చెప్పిన పని చేస్తారు. నీకు గౌరవంగా ఉంటుందనుకుంటే మంచిదే కాని నీ సేవలకు ఇష్టం లేకపోవడం ఉంటుందా?” అతడి కోరిక తీర్చాడు. గోపాలకులకి అధిపతిగా సహదేవుణ్ని నియమించుకున్నాడు. ఆ విధంగా పాండవులు అయిదుగురు విరాటరాజు కొలువులో చేరిపోయారు.

సుధేష్ణ దగ్గరికి సైరంధ్రిగా వచ్చిన ద్రౌపది

ద్రౌపది తన దేశాచారానికి తగినట్టు అల్లిన జడ విప్పి సైరంధ్రీ వేషానికి తగినట్టు కుడివైపుకి కొంచెం ఒరిగేటట్లు కొప్పు అమర్చుకుంది. కొంచెంగా మాసిన చీర కట్టుకుని ముతకగా ఉన్న నారవస్త్రాన్ని వక్షస్థలం మీద కప్పుకుంది. తన ఆకారంలో దాసీదాని లక్షణాలు కనబడేటట్లు చేసుకుంది. దాసీభావాన్ని మనసులో స్థిరంగా నిలుపుకుని నగరంలోకి వచ్చింది. ఈ వేషం వల్ల ఆమె రూపంలో ఉండే తేజస్సు మరుగున పడింది. సైరంధ్రీ వేషంలో వెడుతున్న ద్రౌపదిని చూసి నగరవాసులు ‘ఈమె రోహిణి కాని, అరుంధతి కాని అయి ఉండాలి. మానవకాంత మాత్రం కాదు’ అనుకున్నారు. అందరూ ద్రౌపదిని గౌరవంగా చూస్తూ ‘ఏ లోకంలో అయినా ఇంత అందమైనవాళ్లు ఉంటారా?’ అనుకుంటున్నారు.

ఆమె దగ్గరికి వచ్చి “నువ్వెవరివి? ఏ పని మీద వచ్చావు? ఎక్కడికి వెడుతున్నావు?” అని అడిగారు. ద్రౌపది వినయంతో “నేను సైరంధ్రిని. నాకు కూడు, గుడ్డ చాలు. నన్ను దయతో ఎవరు పోషిస్తారో వాళ్ల దగ్గర పని చెయ్యాలని వచ్చాను” అంది. ఆమె మాటలు విని ‘కడుపుకూటికి ఎక్కడయినా ఉంటుందా? ఇది నమ్మదగిన విషయమేనా?’ అనుకున్నారు. ఒక్కొక్కళ్లుగా ఆమె చుట్టూ మూగిపోతున్నారు. ద్రౌపది నడుస్తూ రాజమందిరం సమీపించింది. అదే సమయంలో రాణి సుధేష్ణ తన చెలికత్తెలతో కలిసి మేడ పైభాగంలో విహరిస్తోంది.

మేడ కిటికీలనుంచి సైరంధ్రిని ఆసక్తిగా చూసింది. ‘ఈమె ఒంటరిగా ఎక్కడి నుంచి ఎక్కడికి వెడుతోందో. ఈమె అందంలో హుందాతనం కనిపిస్తోంది. అయినా సేవకురాలిలా వినయంగా వంగి మాట్లాడుతోంది. ప్రజలందరు ఆమెని వింతగా చూస్తున్నారు’ అనుకుని వెంటనే వెళ్లి ఆమెని వెంటబెట్టుకుని రమ్మని పంపించింది. ఇద్దరు చెలికత్తెలు ద్రౌపది దగ్గరికి వెళ్లి “మహారాణి సుధేష్ణ తీసుకుని రమ్మన్నారు” అని చెప్పారు.

ద్రౌపది మేలిముసుగు సవిరించుకుని వినయంగా వాళ్ల వెంట అంతఃపురంలోకి వెళ్లింది. ద్రౌపది అంతఃపురం పైకి నడిచి వెడుతుంటే. ఆమె నడిచిన చోట కుంకుమ పూసినట్టు ఎర్రబడిపోతోంది. ద్రౌపది అడుగుపెట్టగానే విరాటుడి అంతఃపురం కొత్త కాంతులు సంతరించుకుంది. ద్రౌపది నెమ్మదిగా నడుస్తూ సుధేష్ణ దగ్గరికి వచ్చింది.

రాణి రెండు చేతులూ చాపి దగ్గరికి రమ్మని పిలిచింది. ద్రౌపదిని చూసి “నీ కులం ఏమిటి? నీ పేరేమిటి? ఏ పనిమీద ఎక్కడికి వెళ్లాలని అనుకుంటున్నావు?” అని అడిగింది.

ద్రౌపది “నేను సైరంధ్రీజాతిలో పుట్టాను. నా పేరు మాలిని. అయిదుగురు భర్తలతో ఉంటాను. ఒక కారణం వల్ల విరోధులు వాళ్ల ఎదురుగానే నా జుట్టుపట్టి లాగారు. నా భర్తలతో కలిసి అడవికి వెళ్లాను. ఒక వ్రత నియమంతో కందమూల ఫలలతో కాలక్షేపం చేస్తూ బ్రహ్మచర్యాన్ని అవలంబించాను. ఇంకా ఒక సంవత్సరం నా నియమం ఉండి పోయింది. నువ్వు ధర్మపరురాలివని నీ దగ్గర ఉండాలని ఇక్కడికి వచ్చాను. నాకు చేతనయిన పనులు చేస్తాను” అంది.

ద్రౌపది చెప్పింది విని సుధేష్ణ “దేవతలు, గరుడులు, ఖేచరులు, విద్యాధరులు, కిన్నరులు, యక్షులు, సిద్ధుల కాంతవేమో అనిపిస్తోంది. ఈ నగరానికి రావడానికి కారణమేమిటో అబద్ధమాడకుండా చెప్పు” అంది.

సుధేష్ణ మాటలకి ద్రౌపది చిరునవ్వు నవ్వింది. ఆ నవ్వుకి ఆమె ముఖంలో అందం ఇనుమడించింది. “నేను కృష్ణుడు భార్య సత్యభామ దగ్గర, తరువాత ద్రౌపది దగ్గర పనిచేస్తూ ఉండేదాన్ని. పరిచారికల విధులు నాకు తెలుసు. అవన్నీ నేను చేశాను. ద్రౌపది నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంది. అమ్మా! చందనాదులు (కలపాలు) కలపడం, రకరకాల తిలకాలు దిద్దడం, వింత వింతలుగా మాలలు కట్టడం, తలలో అందంగా ముడవడం, దండలు గుచ్చడం అన్నీ బాగా తెలుసు” అని చెప్పింది.

ద్రౌపది మాటలు విని సుధేష్ణ ఆశ్చర్యపడుతూ “నీ అందాన్ని చూసి రాజు విరాటుడు మనసులో కోరుకుంటాడు. ఆడవాళ్లు కూడా నీ మీద నుంచి చూపులు తిప్పుకోలేకపోతున్నారు. ఇంకా వేరే మాటలు ఎందుకు? నీతో పనులు ఎలా చేయించుకోగలను? నిన్ను భరించడం చాలా కష్టం. నీ రక్షణ పీత గర్భం లాంటిది. నా సంపూర్ణ వినాశనం నేనే కొనితెచ్చుకున్నట్టవుతుంది. ఇది తెలివైన పని కాదు” అంది.

రాణి మాటలు విని ద్రౌపది “నువ్వు అనుకున్నట్లు జరగదు. నా భర్తలు సామాన్యులు కాదు. ఉపాయం తెలిసినవాళ్లు. బలపరాక్రమాలు కలిగినవాళ్లు. ఎవరయినా నీచబుద్ధితో చూస్తే ఆ నీచుడిని ఎంత బలవంతుడైనా సరే రాత్రికి రాత్రే నరికేస్తారు. మగవాళ్లు నా వైపు తేరిపార చూడడానికి కూడా భయపడతారు. ఎటువంటి సందేహాలు లేకుండా నన్ను సేవకురాలిగా అంగీకరించు. నేను చేసే ఏ పనుల్లో ఉదాత్తత, ఏ పనుల్లో నాగరికత నచ్చుతాయో ఆ పనులే నేర్పుతో భయభక్తులతో చేస్తాను. మంచివాళ్లు మెచ్చుకునేటట్లు; ఉత్తములు, సాధుజనులు, పెద్దలు ప్రశంసించేలా ప్రవర్తిస్తాను. నన్ను నీచపు పనులకి పంపనివాళ్లని, ఎంగిలి పెట్టకుండా గౌరవంతో చూసేవాళ్లని నా భర్తలు ఆదరంతో చూస్తారు” అంది.

సైరంధ్రి మాటలకి సుధేష్ణ మనసు కుదుటపడింది. తన దగ్గర సేవకురాలిగా నియమించుకుంది. ద్రౌపది కూడ అంతఃపుర మర్యాదలు అతిక్రమించకుండా ప్రవర్తించసాగింది. ఆ విధంగా పాండవులు అయిదుగురు, ద్రౌపది విరాటుడి నగరంలో ప్రశాంతంగా ఉన్నారు అని జనమేజయుడికి వైశంపాయనుడు వీనులవిందుగా విరాటపర్వం మొదటి ఆశ్వాసాన్ని వినిపించాడు.

విరాటపర్వంలోని మొదటి ఆశ్వాసం సమాప్తం

Exit mobile version