[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
పాండవులకి సేవాధర్మాలు తెలియచేసిన ధౌమ్యుడు
ధౌమ్యుడు ధర్మరాజుతో “మీరు కురువంశంలో పుట్టి గౌరవంగా పెరిగారు. మీవంటివాళ్లకి సామాన్య మానవమాత్రుణ్ని సేవిస్తూ, మానావమానాలు సహిస్తూ అణిగి మణిగి వినయంగా ఉండడం వీలుకాదు. అన్ని అస్త్రాలు మంటల వంటివి. వాటిని ధరించే పాండవులు అగ్నుల వంటివాళ్లు. కాలం ప్రతికూలంగా ఉందన్న సంగతి మరిచిపోయి మండిపడితే అందరికీ తెలిసిపోతుంది. అజ్ఞాతవాసం భంగమవుతుంది. జరగ వలసిన పని చెడిపోతుంది. మీకు ఎటువంటి ప్రమాదం జరగకుండా ఉండాలన్నది నా అభిమతం. కనుక, కొన్ని విషయాలు నాకు చేతనయినట్లు చెప్తాను.
“రాజుల్ని సేవిస్తూ జీవించేవాళ్లు చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకోసం రాజసేవలో ఇబ్బందులు పడకుండా ఉండే సాధారణ నీతిని మీకు చెప్తాను. సభలోకి తగిన పద్ధతిలో అడుగు పెట్టాలి. తన స్థానానికి తగిన ఆసనంలో కూర్చోవాలి. తన రూపంగాని, వేషంగాని వికృతంగా ఉండకుండా చూసుకోవాలి. పనులకి తగిన సమయం చూసుకుంటూ మసలుకోవాలి. అలా చేయగల వ్యక్తి రాజు గౌరవానికి అర్హుడవుతాడు. నేను రాజు కొలువులో ఉన్నాను, రాజుతో చనువుగా ఉన్నాను అని నిర్భయంగా మర్యాదని అతిక్రమైంచి నడుచుకుంటే మొదటికే మోసం వస్తుంది. రాజుగారి ఇంటికంటె అందంగా ఇల్లు కట్టుకోకూడదు.
రాజుగారి వేషధారణ పద్ధతిలో తాను కూడా దుస్తులు వేసుకోకూడదు. రాజు చేసే విహారం చేసే పద్ధతిలో విహరించడం, రాజు మాట్లాడే పద్ధతిలో మాట్లాడడం మంచిదికాదు. తన ఆజ్ఞ మీరినవాళ్లు కొడుకులు, మనుమలు, సోదరులు స్నేహితులైనా సరే రాజులు సహించరు. తమ మేలుకోసం, భద్రతకోసం వాళ్లని శత్రువులుగానే అనుకుని వాళ్ల మీద కోపం పెంచుకుని వాళ్ల అంతు చూస్తారు. పని చేసుకోగలిగిన సమర్థత ఉన్నవాడికి అడ్డు వెళ్లకూడదు. అడ్డువెళ్లి ఆ పనిని తన మీద వేసుకుని నేర్పుని ప్రదర్శిస్తే అసలుకే ముప్పు కలుగుతుంది.
రాజు దగ్గర మాట్లాడకుండా ఉండకూడదు, పదిమందితో ఆర్భాటంగా మాట్లాడడం కూడా మంచిది కాదు. తనకి దగ్గరగా మసలుకునే సేవకులతో కలిసి రాజుతో మాట్లాడడం మంచిది. తను రాజు దగ్గర ఉన్నప్పుడు వ్యతిరేకత కనిపించేలా ఇతరులతో మాట్లాడకూడదు. అవసరమైతే తనంతట తనే ముందుకి వచ్చి రాజు చెప్పిన పని పూర్తిచెయ్యాలి. కొలువులో రాజుకి పూర్తిగా ఎదురుగా ఉండకూడదు. ఏదో ఒక పక్క నిలబడి సేవించాలి. ఏమంటాడో, ఎటు చూస్తాడో, సభలో ఎవరిని చూస్తే ఎటువంటి ఆలోచన కలుగుతుందో మొదలైన భావాలు మనసులో ఉంచుకుని రాజు ముఖం మీదే దృష్టి పెట్టి మసలుకోవాలి.
అంతఃపురంలో జరిగే విషయాలు ఎప్పుడూ బయటపెట్టకూడదు. ఎక్కడైనా రాజుకి సంబంధించిన విషయాలు వింటే ఆలోచించుకుని అవసరమైతేనే రాజుకి చెప్పాలి. భటుడికి అంతఃపురంతో జోక్యం మంచిదికాదు. అక్కడ తిరిగే గూనివాళ్లు, వామనులు, పరిచారికలు మొదలైనవాళ్లతో స్నేహం చెయ్యడం మంచిదికాదు. రాజు అనుగ్రహించినప్పుడే ఆసనాలు, వాహనాలు ఎక్కాలి. ఎంత రాజగౌరవం పొందినవాళ్లకైనా తమంతట తాము పెద్దపెద్ద ఆసనాలు, వాహనాలు ఎక్కడం మంచిది కాదు. రాజు గౌరవించాడని ఉబ్బిపోవడం, అవమానించాడని క్రుంగిపోవడం మంచిది కాదు. వాటిని పట్టించుకోకుండా ఉండే సేవకులకి మంచి జరుగుతుంది.
రాజు ఎవరినైనా రక్షించాలనిగాని, శిక్షించాలని గాని అనుకున్నప్పుడు ఆ విషయాలు అమలుకాకముందే బయటపెట్టే సేవకుడు మూర్ఖుడు. ఎండనీ, వాననీ సహించాలి. తన ఇల్లనీ, పొరుగు చోటనీ అనుకోకూడదు. ఆకలి వేస్తుంది, అలిసిపోతాను, నిద్రకి సమయం దాటిపోతోంది అని అనుకోకూడదు. అనుకోకుండా రాజు ఏదయినా పనిని అప్పగించినప్పుడు భక్తితో, శ్రద్ధతో పూర్తి చెయ్యాలి. రాజుకి తాను ఎంత ఆప్తుడైనా రాజు ధనాన్ని సంగ్రహించకూడదు. సంగ్రహిస్తే ప్రాణము, మానము నిలబడవు.
రాజు సభతీర్చి ఉన్నప్పుడు సేవకులు ఆవులించడం, తుమ్మడం, నవ్వడం, ఉమ్మి వేయడం వంటివి ఎవరికీ తెలియకుండా చేయాలి. రాజుదగ్గర మెలిగే ఏనుగుతోగాని, దోమతోగాని శత్రుత్వం మంచిదికాదు. భటుడు ఎంత గౌరవించ తగినవాడయినా రాజు సభకి వచ్చిన వాళ్లతో స్నేహంగా మెలగాలి. సంపదలు ఉన్నాయి కదానని ఎక్కువగా వేడుకలు చేసుకోకూడదు. రాజుకి చిరాకు కలగకుండా వినయంగా వేడుకలు జరుపుకోవాలి” అని ధౌమ్యుడు పాండవులకి సేవాధర్మాలు చెప్పాడు.
వాటిని విని పాండవులు సంతోషంతో “మహానుభావా! మాకు తల్లి, తండ్రి, దైవం, స్నేహితుడు అన్నీ మీరే. మేము కొలువు చేసేటప్పుడు పాటించవలసిన నడవడికల గురించి స్పష్టంగా మాకు మంచి జరిగేలా చెప్పారు. నిజంగా మీ దయవల్ల మేము బ్రతికిపోయాము” అన్నారు.
పాండవులతో ధౌమ్యుడు “మీరు ఎలాగయినా ఈ ఒక్క సంవత్సర కాలం అణిగి మణిగి ఉండాలి. కష్టాలకి ఓర్చుకుని అపదనుంచి బయటపడాలి” అని చెప్పాడు. పాండవులు భక్తితో ధౌమ్యుడికి నమస్కరించి ఆయన చెప్పినట్టే నడుచుకుంటామని చెప్పారు. ధౌమ్యుడు వాళ్లని ప్రేమతో ఆశీర్వదించాడు. పాండవులు తమ పనిమీద ప్రయాణమయ్యారు. ధౌమ్యుడు పాండవులకి శుభసంతోషాల కోసం పుణ్యకర్మలు చెయ్యడానికి ఉపక్రమించాడు. అగ్ని ప్రజ్వలింపచేసి కమ్య పూజచేసి ప్రయాణంలో శుభం జరగడానికి అవసరమైన మంత్రాలు జపిస్తున్నాడు.
విరాటరాజు నగరానికి బయలుదేరిన పాండవులు
పాండవులు అగ్నికి, ధౌమ్యుడికి ప్రదక్షిణ నమస్కారం చేశారు. ధౌమ్యుడి అనుమతితో పాంచాలిని ముందు ఉంచుకుని ధౌమ్యుడిని వెంటబెట్టుకుని బయలుదేరారు. శుభశకునాలు కనిపిస్తుంటే దశార్ణవదేశానికి ఉత్తరంలోను, పాంచాలదేశానికి దక్షిణంలోను సాళ్వ, శూరసేన దేశాల్లో ప్రవహించే యమునా నది దక్షిణపు ఒడ్డువెంట పశ్చిమంగా ప్రయాణం చేశారు. దారిలో చెరువుల్లో స్నానాలు చేస్తూ, కందమూల ఫలాలతో ఆకలిబాధ తీర్చుకుంటూ, అడవి మార్గంలో ప్రయాణిస్తూ మత్స్యదేశం పొలిమేర చేరుకున్నారు.
అక్కడ ధౌమ్యుడు ఆగిపోయి ఒక ఆశ్రమం నిర్మించుకుని దానిలో నివసించాడు. పాండవులు ఊళ్లదారిలో వెళ్లకుండా విరాటనగరానికి దగ్గరలో ఉన్న అడవిబాటలో వేగంగా నడుస్తున్నారు. అలిసిపోయిన ద్రౌపది “నాకు దాహం వేస్తోంది. కాలి వేళ్లు బొబ్బలెక్కుతున్నాయి. గోళ్లల్లో నెత్తురు చిమ్ముతోంది. స్పృహ తప్పుతున్నట్టుగా ఉంది. విరాటనగరం ఎంతో దూరం లేదు అనుకుంటూనే చాలా దూరం వచ్చాము. ఇప్పుడు నాకున్న పరిస్థితిని బట్టి నేను ఒక్క అడుగు కూడా వెయ్యలేను” అంది.
ద్రౌపది మాటలు విని ధర్మరాజుకి ఆమె బాధ అర్థమైంది. నకులుడితో “మనం ఇప్పటికే చాలా దూరం నడిచాము. ఈ రోజే విరాటరాజు నగరానికి చేరుకోవాలని చాలా వేగంగా నడిచాము. ద్రౌపది శరీరం తీగెలా సుకుమారమైంది. వడదెబ్బ తింది. నువ్వు కొంచెం దూరం మోసుకునిరా!” అన్నాడు. ధర్మరాజు మాటలు విని కూడా నకులుడు ముందుకి రాలేదు. నకులుడు కూడ అలిసిపోయాడని ధర్మరాజు అనుకున్నాడు. సహదేవుడితో “నకులుడు అలిసిపోయాడు. ద్రౌపదిని నువ్వు మోసుకునిరా!” అని చెప్పాడు.
సహదేవుడు కూడా ముందుకి రాలేదు. ధర్మరాజు అర్జునుడి వైపు చూసి “ద్రౌపది అలసిపోయింది. ఈ అడవిలో మనం విడిది చేయడానికి అనువైన ప్రదేశం కూడా లేదు. అర్జునా! ఎలాగయినా సరే నువ్వు ద్రౌపదిని విరాటుడి నగర ప్రాంతం వరకు మోసుకునిరా!” అని చెప్పాడు. అర్జునుడు పువ్వులా కోమలంగా ఉన్న ద్రౌపదిని ప్రేమతో మోసుకుని వచ్చాడు.
పాండవులు నడుస్తున్నారు. కనుచూపు మేరలో కనిపిస్తున్న పట్టణాన్ని చూసి ధర్మరాజు తమ్ముళ్లతో “మన ఆకారాలు, ఆయుధాలు చూడగానే ప్రజలు మనల్ని గుర్తుపట్టేస్తారు. అందువల్ల ఈ ప్రదేశంలో ఆయుధాలు, వేషాలు మార్చుకోడానికి ఆగుదామా?” అని అడిగాడు.
అర్జునుడు ఆ ప్రదేశం బాగుందని చెప్పి ద్రౌపదిని ఒక ఇసుకతిన్నె మీద దింపాడు. మిగిలినవాళ్లు కూడా అందుకు అంగీకరించి అక్కడ ఆగారు. ధర్మరాజు గాండీవాన్ని చూసి “మన ఆయుధాలన్నీ ఒక ఎత్తు, అర్జునుడి గాండీవం ఒకఎత్తు. ఈ గాండీవంతో మనం విరాటుడి నగరంలోకి అడుగు పెడితే మన అచూకీ దుర్యోధనుడికి తప్పకుండా తెలుస్తుంది” అన్నాడు. అర్జునుడు “ఈ గాండీవము పెద్ద పాములాంటిది. ప్రజల్ని బెదరకొడుతుంది. అందువల్ల దీన్ని ఎక్కడయినా దాచి వెళ్లాలి. ఈ మాట అనుకోడానికి కూడా నా మనసు అంగీకరించడంలేదు. ఏమయినా సరే ఒకచోట దీన్ని దాచిపెట్టడమే మంచిదనిపిస్తోంది” అని ఆలోచించాడు.
మనసులో కలిగిన బాధని అణుచుకున్నాడు. ఆయుధాలు దాచడమే మంచిదని నిశ్చయించుకుని నాలుగువైపులా చూశాడు. శ్మశానానికి దగ్గరలో ఉన్న అరణ్యంలో గుబురుగా ఎత్తుగా ఉన్న జమ్మిచెట్టు కనిపించింది. దాని మీద ఉన్న కాకులు, గుడ్లగూబల అరుపులకి అటువైపు వెళ్లేవాళ్లు భయపడుతున్నారు. చూడ్డానికి ఆ చెట్టు పెద్ద సర్పంలా కనిపిస్తోంది. జమ్మిచెట్టుని ధర్మరాజుకి చూపించి “ధర్మరాజా! ఈ జమ్మిచెట్టు పక్షుల రొదలతో భయంకరంగా ఉంది. శ్మశానానికి దగ్గరలో ఉండడం వల్ల భూత, పిశాచ, రాక్షస గణాలతో ఉండడం వల్ల దాని దగ్గరికి వెళ్లడానికి ఎవరూ సాహసించరు.
దుర్గంధం కూడా వ్యాపించి దీని వైపు చూడానికే రోత పుట్టిస్తోంది. దీని దగ్గరికి ఎవరూ రాలేరు కనుక ఆయుధాలు ఈ చెట్టు మీద పెడదామా? వెంట్రుకలతో ఉన్న చర్మంతో ఆయుధాల్ని చుట్టి శవంలా అమర్చి కట్టి పెడితే ఇటువైపు ఎవరూ రారు. మహారాజా! నువ్వు మనస్సులో బాధపడకు. మనం ఎక్కడ ఉన్నా చివరికి తిరిగి వచ్చి ఆయుధాలు తీసుకోడానికి వీలుగా ఉంటుంది.
ఆయుధాల్ని శమీవృక్షం మీద పెట్టిన పాండవులు
అర్జునుడు చెప్పిన ఉపాయం అందరికీ నచ్చింది. అర్జునుడు గాండీవం వైపు చూసి ‘నేను ఈ ధనుస్సు సహాయంతో అనేక యుద్ధాల్లో దేవతల్ని, దానవుల్ని, గంధర్వుల్ని గెలిచాను. గాండీవం శత్రువులకి భయంకరమైంది. ఇప్పుడు చెట్టుకి కట్టిపడేసే నిర్ణయం భగవంతుడే నిర్ణయించాడు’ అనుకుని బాధపడుతూ గాండీవం నారిముడి విప్పాడు. రాక్షసులకి భయాన్ని కలిగించేది, శత్రువుల్ని నాశనం చేసేది, రత్నాలు పొదిగినది, కురుదేశానికి సంతోషం కలిగించేది అయిన తన వింటినారిని ధర్మరాజు విప్పాడు. తరువాత భీమ, నకుల, సహదేవులవైపు చూశాడు.
“అభిమానవంతుడవైన భీమా! సైంధవుడినీ, యక్షుల్నీ, పాంచాలుర్నీ, త్రిగర్తుడినీ దీనితోనే కదా ఓడించావు; నకులా! సౌరాష్ట్రదేశరాజు మొదలైన విరోధుల్ని దీనితోనే కదా సంహరించావు; సహదేవా! కళింగ, పాండ్య, మగధ దేశపు రాజుల్ని జయించడానికి ఈ కోదండమే కదా ఉపయోగపడింది” అని వరుసగా వాళ్ల ధనుస్సుల్ని ప్రశసించి, వాళ్ల ధనుస్సుల నారుల్ని విప్పడానికి అనుమతించాడు.
ధనుస్సులు, అమ్ములపొదులు, కవచాలు, కత్తులు, గుదియలు మొదలైన ఆయుధాల్ని ఒకచోటకి చేర్చి ధర్మరాజు కట్టకట్టాడు. ఆయుధాల్ని కట్టకట్టి యముడి వల్ల వరం పొందినవాడు కనుక ధర్మరాజు జమ్మిచెట్టు ఎక్కాడు. బ్రహ్మని, ఈశ్వరుడిని, విష్ణువుని, దిక్పాలకుల్ని సూర్యుడిని వనదేవతలని, పితృదేవతలని స్తుతించాడు. భూమి ఆకాశాలవైపు చూసి ప్రార్థించి ఆయుధాల్ని చెట్టు కొమ్మకి వేలాడదీశాడు. ఆయుధాల అధిదేవతలకి నమస్కారం చేశాడు.
ఆయుధాలతో “నాకు, అర్జునుడికి తప్ప ఇతరులకి మీరు ఇక్కడ ఉన్నట్టు తెలియనివ్వకండి. మీ ఆకారం విషసర్పాల్లా భయంకరంగా కనపడాలి. భీముడు కౌరవులమీద అంతులేని కోపాన్ని కలిగి ఉంటాడు. అతడి మనస్సు ఏ సమయంలో ఆగ్రహావేశాలు కలిగిస్తుందో అప్పుడు వచ్చి మిమ్మల్ని ఆశ్రయించవచ్చు. అప్పుడు అతడి కోపానికి మీరు కూడా వశమై పోకుండా ఏదో ఒక వంకతో తప్పుకోండి. ఇది నా కోరిక. ఈ సంవత్సర అజ్ఞాతకాల సమయంలో అందరం భీముడిపట్ల ఏమారకుండా ఉండాలి” అని ప్రార్థించి ధర్మరాజు చెట్టు దిగాడు. ఆ చెట్టుకి ప్రదక్షిణం చేశాడు. భీముడి వైపు తిరిగి అనునయించి కౌగలించుకుని ఊరడించాడు.
తాము చేసిన పని అక్కడున్న గొడ్లకాపరులకి తెలియకుండా “ఈమె మాతల్లి. నూరేళ్లు నిండాయి. ఇప్పుడు చనిపోయింది. మేము దహనం చెయ్యము. ఇది పూర్వం నుంచి వస్తున్న కులాచారం మా పెద్దలు ఎలా చేసేవాళ్లో అలాగే మేము కూడా చేస్తున్నాము” అని వాళ్లకి తెలిసేట్లు చెప్పారు.
తమ ఆయుధాలు రహస్యంగా దాంచినందుకు ధర్మరాజు సంతోషించాడు. దగ్గరలో చచ్చి పడి ఉన్న జంతువుని చూసి దాని చర్మాన్ని ఒలిచి తియ్యమని సహదేవుడికి చెప్పాడు. ఆయుధాలకి చలి, గాలి, ఎండ, వాన తగలకుండా వాటి మీద చుట్టించాడు. దగ్గరలో ఎండిన మనిషి శవాన్నిచూసి దాన్ని ఆయుధాల మీద పెట్టి కట్టించాడు. ఆయుధ రక్షణ కార్యక్రమాన్ని పూర్తి చేశాడు. దుర్గంధం వల్ల అడవిలో తిరిగేవాళ్లు ఎవరూ అక్కడికి రారని అనుకుని సంతోషించాడు.
విరాటనగరం వైపు వెడుతూ అజ్ఞాతవాసంలో తమ రహస్య వ్యవహారాలకి అనుకూలంగా తమ అయిదుగురి పేర్లని జయుడు, జయంతుడు, విజయుడు, జయత్సేనుడు, జయద్బలుడు అని మార్చుకున్నారు. ద్రౌపదితోపాటు పవిత్రమైన నదుల్లో దిగి స్నానాలు చేశారు. బడలిక తీర్చుకుని దేవతలకి, పితృదేవతలకి తర్పణాలు ఇచ్చారు. జపాలు, హోమాలు, దైవధ్యానాలు మొదలైన అనుష్థానాలు పూర్తిచేశారు.
కుంతి కొడుకుల్లో పెద్దవాడైన ధర్మరాజు తూర్పుముఖంగా కూర్చుని నిర్మలమైన మనస్సుతో ధర్మదేవతని స్మరించి “తండ్రీ నువ్వు నాకిచ్చిన వరాన్ని మన్నించి, ఈ రాజకుమారులు అధర్మానికి పాల్పడకుండా కాపాడుతూ, మేము ఏ సమయంలో ఎలా చెయ్యాలో దానికి తగినట్లు సమకూర్చు” అన్నాడు. తమ్ముళ్ల బాధ చూసి దుఃఖంతో బొంగురుపోయిన కంఠంతో “ఆకాశంలో ఉన్న నిన్ను చూశాను. యక్షుడి వశమైన తమ్ముళ్ల ప్రాణాలు అడిగాను. నలుగురికీ నీతినీ, పరాక్రమాన్ని, మహిమని వేడుకున్నాను. నువ్వెంతో వాత్సల్యంతో ఆదరించావు” అని యముడికి విన్నవించుకున్నాడు. చేతులు జోడించి, వినయంతో నమస్కరించాడు.
యముడి దయవల్ల ధర్మరాజుకి సన్యాసి వేషం వచ్చింది. కాషయవస్త్రము, దండము. కమండలువు వచ్చాయి. అందరూ ఆశ్చర్యంగా చూస్తుండగా అందరి వేషాలకి తగిన వస్తువులన్నీ వచ్చేశాయి. అందర్నీ వరుసగా రమ్మని పిలిచి ధర్మరాజు తను పాచికల మూటని చంకలో పెట్టుకున్నాడు. భగవంతుడి దయవల్ల ఆ రోజు విరాటరాజు కొలువై ఉన్నాడు.