[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
విరాటపర్వము-మొదటి ఆశ్వాసము
మత్స్యదేశానికి బయలుదేరిన పాండవులు
(తిక్కన సోమయాజి శ్రీమదాంధ్రమహాభారతము విరాటపర్వం మొదలుపెడుతూ హరిహరనాథుడికి తను స్వయంగా విన్నవిస్తున్నట్టు “మనస్సులో సాన్నిధ్యం కలిగించుకొన్నాను. కావ్యస్వరూప మహాభారతేతిహాసంలో తాత్పర్యాన్ని తత్త్వాన్ని ప్రయోజనాన్ని స్పష్టం చేస్తాను” అని చెప్తూ..
“శరణు కోరి ఆశ్రయించిన వారి భయాన్ని పోగొట్టేవాడా! ఇంద్రాది దేవతలు నమస్కరించగా వాళ్ల కిరీటాల కాంతులవల్ల గొప్పగా ప్రకాశించే పాదాలు కలవాడా! వనమాలికను, పామునూ ఆభరణాలుగా కలవాడా! హరిహరనాథా! నీ మహిమాన్వితమైన మనస్సుతో విను” అని భక్తితో చెప్పుకుంటూ మొదలుపెట్టాడు. వ్యాసమహర్షి రచించిన శ్రీమదాంధ్ర మహాభారతాన్ని అనువదించిన కవిత్రయాన్ని అనుసరిస్తూ సాగుతోంది ఈ వచన కావ్యం).
ధౌమ్యుడు పాండవులని ఓదార్చాడు: ఎంతో నిర్మలమైన శీలం కలిగిన పాండవుల చరిత్రని ఉపాఖ్యానాలతో సహా వివరిస్తూ ఉండగా పాండవులు చేస్తున్న వనవాసవ్రతాన్ని గురించి, అందుకు తగిన విధంగా నడుచుకున్న వారి మంచి నడవడిక గురించి విన్న తరువాత జనమేజయ మహారాజు వైశంపాయనమహర్షితో “మహర్షీ! స్ఫురద్రూపులు, అభిమానధనులు, ప్రజలతో గౌరవింపబడిన మా తాతలు పాండవులు విరోధులు తమను గుర్తించకుండా అజ్ఞాతవాసాన్ని అతి రహస్యంగా ఎలా గడిపారో చెప్పండి” అని అడిగాడు.
వైశంపాయనమహర్షి వాత్సల్యంతో “జనమేజయమహారాజా! పాండవులు అరణ్యవాసం పూర్తి చేశారు. అరణ్యవాసం చివరలో ధర్మరాజుకి యమధర్మరాజు యక్షప్రశ్నలు వేస్తూ ప్రత్యక్షమయ్యాడు. పాండవులకి ఎటువంటి కష్టాలు రాకుండా ఉండేలా వరం ప్రసాదించాడు.
అగ్నిహోత్రాలతో పాటు తమతో ఉంటున్న బ్రాహ్మణులకి తమ అజ్ఞాతవాసం గురించి చెప్పాలని అనుకుని, పాండవులు వినయంగా చేతులు జోడించి “బ్రాహ్మణులారా! దుర్యోధనుడు చేసిన దుర్మార్గానికి మాతో వచ్చి మీరు కూడ అనేక కష్టాలు అనుభవించారు. పన్నెండు సంవత్సరాల కాలం ఏదో విధంగా గడిచిపోయింది. ఇంక ఒక సంవత్సరం అజ్ఞాతవాసం పూర్తి చేసుకోవాలి. దుర్యోధనుడు, దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని మొదలైన వాళ్లు ఎలాగయినా మా అజ్ఞాతవాసం చెడగొట్టడానికి ప్రయత్నిస్తారు. మా గురించి ఏమాత్రం తెలిసినా వదిలిపెట్టరు. కనుక, మా అజ్ఞాతవాసం ఎటువంటి ఆటంకాలు లేకుండా జరిగేటట్లు ఆశీర్వదించండి” అన్నారు.
ధర్మరాజు బాధతో “బ్రాహ్మణులారా! అసలు మేము ఎప్పటికైనా ఈ కష్టాల నుంచి గట్టెక్కుతామా? మీవంటి బ్రాహ్మణులు, చుట్టాలు అందరితో కలిసి సుఖంగా జీవిస్తామా?” అన్నాడు. ధర్మరాజు మాటల్లో కనపడిన దుఃఖం గమనించి చుట్టూ ఉన్న బ్రాహ్మణులు, తమ్ముళ్లు అతణ్ని ఓదార్చారు.
అతడి విచారాన్ని పోగొట్టాలని ధౌమ్యుడు “ధర్మరాజా నీకు సాటి అయిన మరొక వ్యక్తి లేడు, ధర్మాధర్మాలని నిర్ణయించడంలో మేటి, ధైర్యశాలి, ఉదాత్తప్రవృత్తి కలవాడు, సత్కర్మలు, వాటి విధులు బాగా తెలిసినవాడు, నేర్పరితనం కలవాడు, శక్తియుక్తులు ప్రదర్శించే నైపుణ్యం కలవాడు అని కీర్తి కలిగినవాడివి. కష్టాలు కలిగినప్పుడు నువ్వు బాధపడడం బాగుంటుందా? దేవతలు సమర్థులే అయినా కూడా కొన్ని సమయాల్లో ముఖ్యంగా విరోధుల్ని సంహరించే సమయంలో వాళ్ల సమర్థత కూడా పనికిరాదు. అటువంటి సందర్భంలో కాలం కలిసి వచ్చేవరకు తమ సామర్థ్యాన్ని ప్రదర్శించకుండా ఉంచడం అవసరం.
ఇంద్రుడు నిషధపర్వతం మీద రహస్య జీవితం గడిపాడు. హరి అదితి గర్భంలో ప్రవేశించి వామనరూపం పొందాడు. ఔర్వుడు తల్లి తొడలో దాగి ఉన్నాడు. సూర్యుడు ఆవు శరీరంలో విలీనమయిపోయి ఎవరికీ తెలియడానికి వీలు లేకుండా గడిపాడు. ఇవన్నీ నువ్వు వినలేదా? వీళ్లందరూ సమర్థులే అయినా కష్టాలు పడ్డారు. కాలం కలిసిరాగానే విరోధుల్ని జయించారు. అలాగే నువ్వు కూడా కొంచెం ఓర్పు పట్టి తరువాత ప్రతీకారం తీర్చుకో” అని చెప్పాడు.
పురోహితుడు ధౌమ్యుడు చెప్పిన మాటలు ధర్మరాజుకి మనస్తాపం తగ్గించాయి. తరువాత తమ్ముళ్లవైపు చూశాడు. భీముడు ధర్మరాజుతో “నిండు సభలో ద్రౌపదిని దుశ్శాసనుడు, మదించిన ఏనుగులాంటి అర్జునుడు విజృంభించకుండా నీ ఆజ్ఞ వల్ల తన వేగాన్ని కట్టడి చేసుకున్నాడు. లేకపోతే ఆ అర్జునగజం ఆవేశంతో విజృంభించి కౌరవుల్ని చిందరబందర చేసి నీకు సంతోషాన్ని కలిగించేది” అన్నాడు ఓదార్పుగా.
భీముడి మాటలు విని ధర్మరాజు ప్రశాంతంగా ఉన్నాడు. బ్రాహ్మణులందరు పాండవుల్ని “దైవం మీకు అనుకూలించుగాక! మరల మీ దర్శనం లభించుగాక!” అని ఆశీర్వదించి తమ తమ ప్రదేశాలకి వెళ్లిపోయారు. మిగిలిన ప్రజలు కూడా తమ నివాసాలకి వెళ్లిపోయారు. తమ్ముళ్లతోను, పురోహితుడు ధౌమ్యుడితోను, ద్రౌపది మొదలైన ఇంక కొంతమందితో కలిసి ధర్మరాజు రథాలమీద కొంతదూరం ప్రయాణం చేసాడు. చీకటిపడే సమయానికి తగిన ప్రదేశంలో ఆగి ఆ రాత్రి అక్కడే సుఖంగా కాలం గడిపారు.
పాండవులు అవసరానికి తగిన వేషాల్ని నిర్ణయించుకున్నారు: ఉదయాన్నే ధర్మరాజు తరువాత జరగవలసిన కర్తవ్యాన్ని గురించి ఆలోచిస్తూ అర్జునుడితో “అర్జునా! మనం అయిదుగురం, ద్రౌపది కలిసి ఎక్కడికి వెళ్లినా ప్రజలు మనల్ని గుర్తించకుండా ఉండరు. అజ్ఞాతవాసం ఎలా గడపాలో ఉపాయం ఆలోచించాలి” అన్నాడు.
అర్జునుడు ధర్మరాజుతో “నీ ధర్మప్రవర్తనకి మెచ్చుకున్ని యముడు మనం ఎక్కడ ఎలా నడుచుకున్నా గుర్తుపట్టకుండా ఉండేలా వరమిచ్చాడు కదా! మనకి ఇంక భయం లేదు. కురుదేశం చుట్టూ పాంచాల, చేది, మత్స్య దేశాలు ఉన్నాయి. ఇవే కాకుండా సాళ్వ, విదేహ, బహ్లిక, దశార్ణ, శూరసేన, కళింగ, మగధ దేశాలు కూడా సుభిక్షంగా నివసించడానికి అనువుగా సుస్థిరమైన ప్రభుత్వాలతో, జనాలతో నిండి ఉన్నాయని వింటున్నాం. ఈ ప్రదేశాల్లో ఎక్కడైనా మీకు నచ్చిన చోట ఉందాము” అన్నాడు.
అర్జునుడు చెప్పినది విని ధర్మరాజు “అవును, దైవం ఇచ్చిన వరం ఉంది కనుక మనకి భయం లేదు. కాని, మనం ఉండదగిన ప్రదేశం చూసుకుని ఆలస్యం చెయ్యకుండా ఎక్కడైనా స్థిరపడాలి. మత్స్యదేశపు రాజు విరాటుడు ధార్మికుడు, పరాక్రమవంతుడు. అతణ్ని ప్రజలందరు ఇష్టపడతారు. మనం మత్స్యదేశం వెళ్లి విరాటుడి కొలువులో మనకి తగిన పనులు చేస్తూ ఉండడమే నాకు ఇష్టం. ఆయన మెప్పు పొందే విధంగా మనలో ఎవరెవరు ఏ పనులు చేద్దామో నిర్ణయించండి. మీ మనస్సులో ఉన్న అభిప్రాయాలు చెప్పండి” అన్నాడు.
ధర్మరాజు అర్జునుడివైపు ఆలోచిస్తూ చూశాడు. అర్జునుడు “ధర్మరాజా! నీకు చక్కటి రూపము, అభిమానధనము, సౌకుమార్యము, సరసత్వము, మృదుత్వము, ప్రాభవము, నిష్కల్మషత్వము, గౌరవము, శాంతి, దాంతి, త్యాగభోగాలు, దయాసత్యాలు ఉన్నాయి. ధార్మికమైన పనులు చేయగల నేర్పు ఉంది. కీర్తిని సంపాదించడం నీ స్వభావం. ఇన్ని ఉన్నా కూడా ఇతరులని సేవించే నేర్పు నీకు లేదు. సేవలందుకోవడమే తెలిసిన నువ్వు విరాటమహారాజుని ఎలా సేవించగలవు?” అని అడిగాడు.
తమ్ముడి మనస్సులో ఉన్న బాధ ధర్మరాజుకి అర్థమయింది. కాని, దానికి ప్రాధాన్యత ఇవ్వకుండా “నేను సన్యాసి వేషంలో విరాటరాజు కొలువులో ప్రవేశిస్తాను. మహారాజుకి ఇష్టమైనట్టుగా పుణ్యకథలు చెప్తాను. వేదాలు, స్మృతులు, శకునాలు, నక్షత్రాలనే విషయాలకి సంబంధించిన నేర్పుని ప్రదర్శించి మనసుకి సంతోషం కలిగిస్తాను. అతడితో సరదాగా జూదం ఆడతాను. అతడు సంతోషపడడమే కాదు, నా నేర్పుని కూడా తెలుసుకుంటాడు.
నా దగ్గర ఉన్న మణులతో చేసినవి; బంగారము, వెండితో చేసినవి తీసుకుని వెళ్లి మహారాజుకి చూపిస్తాను. ‘కంకుడు’ అనే పేరుతో రాజుకి సంతోషం కలిగిస్తూ అతడి అనుగ్రహాన్ని పొందుతాను. అతడు ఎప్పుడైనా నా గురించి వివరాలు అడిగితే ధర్మరాజు స్నేహితుడిననీ, అతడి దగ్గర ఉండేవాడిననీ చెప్పుకుంటాను” అన్నాడు.
తరువాత ధర్మరాజు భీముడి వైపు చూసి “ఒకప్పుడు యక్షుల గర్వాన్ని అణిచి సౌగంధిక పువ్వుల్ని తెచ్చి ద్రౌపదికి ఇచ్చాడు. కిమ్మీరుడనే రాక్షసుణ్ని చంపి అడవిలో శత్రుభయం లేకుండా చేశాడు. బకాసురుణ్ని చంపి ఏకచక్రపురాన్ని రక్షించాడు. జటాసురుణ్ని చంపి మనల్ని విడిపించాడు. ఇతడు పుట్టినప్పటి నుంచి కోపం కలవాడే. ఇటువంటివాడు ఇతరులకి నచ్చేటట్లు సేవకుడుగా ఎలా ఉండగలడు?” అన్నాడు.
ధర్మరాజు మాటలకి భీముడు “ధర్మరాజా! నేను వంటలవాడుగా విరాటుణ్ని సేవిస్తాను. రుచిగా, శుచిగా ఎప్పుడూ చేసేవి కాకుండా కొత్త వంటలు వండుతాను. రాజు మెచ్చే విధంగా వంటలు వండి నగరంలో నన్ను మించిన వంటలవాడు లేడని చెప్పుకునేలా చేస్తూ వినయంగా, నేర్పుగా వ్యవహరిస్తాను. ఈ వంట పనిలో ఎలాంటి శారీరక శ్రమ లేకుండా కట్టెలు చీల్చవలసి వచ్చినా, ముక్కలు విరచవలసి వచ్చినా కత్తి, కొడవలి అడగకుండా కాళ్లతో, చేతులతో, తొడలతో పట్టి చీల్చి పొయ్యిలోకి వాడతాను.
హేమాహేమీల్ని మల్లయుద్ధంలో ఓడిస్తాను. మల్లయుద్ధంలో నాకున్న నైపుణ్యంతోను, వేగంతోను, బలంతోను రాజుని మెప్పిస్తాను. ఒకే యుద్ధంలో చాలామందిని ఒకేసారి ఓడించి చిత్ర విచిత్రాలైన బంధన పద్ధతులతో సమయానికి తగినట్టు వినోదాన్ని కలిగిస్తాను. పెద్దపులినిగాని, అడవిదున్ననిగాని, మదించిన ఏనుగునికాని, భయంకరమైన సింహాన్నిగాని, ఉక్కిరిబిక్కిరి అయ్యేటట్లు అదిమి పట్టుకుంటాను. ‘వలలుడు’ అనే పేరుతో విరాటరాజు మనసుని ఆకర్షిస్తాను. నన్నెవరని అడిగితే ధర్మరాజు దగ్గర వంటలు చేసేవాడినని చెప్తాను” అన్నాడు.
భీముడి నిర్ణయానికి ధర్మరాజు అంగీకరించాడు. అర్జునుడి వైపు చూసి “ఈ అర్జునుడు ఖాండవ వనాన్ని కాల్చాడు. దేవతలు కూడా దర్శించలేని ఈశ్వరుడుని ప్రత్యక్షం చేసుకున్నాడు. భుజబల గర్వంతో ఉండే రాక్షసుల గర్వాన్ని అణిచాడు. ఇంద్రుడిని మెప్పించి అతడి అర్ధాసనాన్ని అలంకరించాడు. మహానుభావుడైన అర్జునుడు సామాన్యుడైన ఒక రాజుని ఆశ్రయించి ఎలా సేవిస్తాడో?” అన్నాడు.
ధర్మరాజు మాటలు విని అర్జునుడు “ధర్మరాజా! భగవంతుడి దయవల్ల అజ్ఞాతవాసానికి తగిన వేషానికి ఒక ఉపాయం సిద్ధంగా ఉంది. నేను అమరావతి వెళ్లినప్పుడు ఊర్వశి నన్ను నపుంసకుడివి అవమని శపించింది. దేవేంద్రుడు కరుణించి ఆ శాపాన్ని అజ్ఞతవాస సమయంలో అనుభవించమని అజ్ఞాతవాసం అయిపోగానే శాపవిముక్తి జరుగుతుందని చెప్పాడు.
నా ఆజానుబాహుత్వం కనిపించకుండా కంచుకం ధరిస్తాను. చేతులమీద, భుజాలమీద ఉన్న కాయలు కనిపించకుండా.. శంఖపుగాజులు వేసుకుని, నపుంసకుడిగా విరాటరాజు దగ్గరికి వెడతాను. నాకు నాట్యం తెలుసు కనుక అంతఃపురంలో ఉత్తమ కన్యలకి నాట్యం నేర్పుతానని చెప్పి ఆ పనికి నన్ను నియోగించుకోమని చెప్తాను. ‘బృహన్నల’ పేరుతో అంతఃపురంలో ఉంటూ నాట్యంలో ఉండే నేర్పరితనంతో విరాటరాజుని మెప్పిస్తాను. ఎక్కడివాడివని అడిగితే ద్రౌపది ఆదరగౌరవాలు పొంది ఆమె అంతఃపురంలో నాట్యాచార్యుడిగా ఉండేవాడినని రాజుకి చెప్తాను” అన్నాడు.
అర్జునుడు చెప్పినది విని ధర్మరాజు తన అంగీకారాన్ని తెలియచేశాడు. తరువాత ధర్మరాజు నకులుడి వైపు చూశాడు. అతడికి అవేదన కలిగింది. బొంగురుపోయిన గొంతుతో “నకులుడికి చక్కటి శరీర సౌష్ఠవము, గొప్ప మనసు, నాగరకమైన నడవడిక ఉన్నాయి. అందువల్ల అతణ్ని తేలికగా గుర్తుపట్టవచ్చు. ఇతరుల్ని సేవించడం అతడికి చాలా కష్టం. ఎవరూ గుర్తు పట్టకుండ నగరంలో ఎలా మసులుకుంటాడో ఎమో. నాకు మనసులో చాలా విచారంగా ఉంది” అన్నాడు.
ధర్మరాజు మాటలు విని నకులుడు “ధర్మరాజా! అశ్వశిక్షకుడిగా సేవలో చేరి నేను మత్స్యరాజుని మెప్పిస్తాను. అశ్వాలకు అవసరమైన శిక్షణా పద్ధతులన్నీ బాగా తెలిసినవాడిని కనుక నేర్పుగా గుర్రాల మంచి చెడుల్ని పర్యవేక్షిస్తాను. వయసు వచ్చిన ఆడు గుర్రాలతో, ఎదకు వచ్చినవాటిని గుర్తించి ఎన్నిక చేసిన మగ గుర్రాలతో కలిపే నేర్పు నాకు ఉంది.
పిల్ల గుర్రాల లక్షణాల్ని గుర్తించి, వాటిని తాళ్లతో కళ్లెం వేసి అలవాటు చేసే నేర్పు నాకు ఉంది. కళ్లేలకి లొంగని గుర్రాల్ని కేవలం నూలుపోగు కళ్లెంతో లోబరుచుకునే నేర్పు నాకు ఉంది. మొండి గుర్రాల పొగరుని తగ్గించి లొంగతీసుకునే నేర్పు నాకుంది. అశ్వశాలలో ఉండే గుర్రాలకి ఎటువంటి రోగాలు రాకుండా, లోపాలు ఏర్పడకుండా మెలకువతో ఉంటాను. అశ్వశిక్షకులకి ఊరట, విశ్రాంతి కలిగిస్తాను. నేను ‘దామగ్రంథి’ అనే పేరు పెట్టుకుంటాను. ఎక్కడి నుంచి వచ్చావని అడిగితే ధర్మరాజు దగ్గర ఉండేవాడినని చెప్తాను” అన్నాడు.
నకులుడి నిర్ణయానికి ధర్మరాజు సంతృప్తి చెందాడు. ధర్మరాజు “సహదేవుడు కపటము, అహంకారము లేనివాడు, నిర్మలమనస్కుడు, కళంకం లేనివాడు, ధార్మికుడు, దాంతుడు, కుంతీదేవి ముద్దుబిడ్డ. కోమలమైన శరీరము, మృదువైన మనస్సు కలిగిన సహదేవుడు ఎవర్ని ఆశ్రయించి ఉంటాడు?” అని బాధపడ్డాడు.
ధర్మరాజు బాధని అర్థం చేసుకున్న సహదేవుడు “ధర్మరాజా! నేను పశువుల సంరక్షకుడిగా విరాటుడి గోశాలలో గోరక్షకుడిగా చేరతాను. మంచి నడవడికతో వ్యవహరిస్తాను. ‘తంత్రీపాలుడు’ అనే పేరు పెట్టుకుంటాను. గొడ్డుపోయిన ఆవుల్ని కూడా చేపేటట్లు చేసి పాలు పితుకుతాను. బక్క చిక్కిన గోవుల్ని కూడా బాగా కండా, కొవ్వు పట్టేట్లు మేపుతాను. తరచు రోగాలతో బాధపడే గోవులకి రోగాలు నయం చేస్తాను. పొగరుబోతు ఆవులకి ముక్కుతాడు బిగించి పాలు పితుకుతాను. వాటిని మందలో చేరుస్తాను. నీరు, మేత ఉన్న చోటు తెలుసుకుని వాటిని మేపుతాను. క్రూరమృగాలు ఉండే చోటుని గుర్తిస్తాను. దొంగలను పసిగట్టి వాళ్లని శిక్షిస్తాను. పశువుల్ని ప్రేమగా చూసుకుంటాను. ఇంతకు ముందు ఎక్కడవున్నావని విరాటరాజు అడిగితే ధర్మరాజు గోశాలకి అధ్యక్షుడిగా ఉండేవాడినని చెప్తాను” అన్నాడు.
సహదేవుడు చెప్పింది విని ధర్మరాజు తన అనుమతిని తెలియచేశాడు. తరువాత ద్రౌపదిని చూసి “ఈమె సుకుమారి. ఏ పనయినా చేయించుకోడమేగాని చెయ్యడం చేతకాదు. నీచమైన పనులకి దూరంగా ఉంటుంది. ఒంటరిగా తిరిగే అలవాటు లేదు. మంచి మనసు కలది. ఏ ఒక్క పనిని తనంతట తాను చక్కపెట్టుకోవడం తెలియదు. ఇతరులని ఎలా సేవిస్తుంది? ఆ నేర్పు ఎలా అలవాటవుతుందో?” అన్నాడు.
ధర్మరాజు మాటలు విని అతడి బాధ అర్థం చేసుకుని ద్రౌపది “సైరంధ్రీ వేషంలో అంతఃపురం దగ్గరికి వెడతాను. అప్పుడు విరాటరాజు రాణి నన్ను సాదరంగా పిలిస్తే ‘మాలిని’ అనే పేరుతో వెళ్లి రాణి సుధేష్ణ దర్శనం చేసుకుని ఆమె కొలువులో చేరతాను. ఈమె మహాపతివ్రత, చెడుపనుల జోలికి వెళ్లదని అందరూ గౌరవించేలా ప్రవర్తిస్తాను. ఎప్పుడూ గుబాళిస్తూ ఉండే మైపూతలు తయారు చేస్తాను. వాటిని చందనంతో కలిపి రాణి శరీరానికి మృదువుగా పూస్తాను. అందంగా రాణికి తిలకం దిద్దుతాను. ఒక్కొక్క ముడికి ఒక్కొక్క విధంగా ఉండే పూలమాలలు కడతాను. కొత్త అందాలు విరజిమ్మేలా అందంగా హారాలు కూర్చుతాను. ఎంతో నేర్పుతో మహారాణికి అవసరమైన పనులు చేస్తూ ఆమెకి ఇష్టం కలిగేలా ఆమెను సేవిస్తాను. ఇంతకుముందు ఎక్కడ వున్నావని ప్రశ్నిస్తే ద్రౌపది పరిచారికగా ఉండి ఆమె పురమాయించిన గౌరవానికి భంగం లేని పనులు చేసేదానినని చెప్తాను” అంది.
ద్రౌపది చెప్పింది విని ధర్మరాజు “మన వంశం, మన ప్రవర్తన, గొప్పదనం అన్నీ తెలిసిన పతివ్రతవు. దుర్మార్గులయిన తుంటరుల మనస్సు పసిగట్టి ఏమరుపాటు లేకుండా ప్రవర్తించాలి” అన్నాడు. ధర్మరాజు భయాన్ని అర్థం చేసుకున్న ద్రౌపది స్పందించి చిరునవ్వుతో “సైరంధ్రీజాతి వాళ్లు గౌరవం కలవాళ్లు. తమ గౌరవాన్ని ఎప్పుడూ కాపాడుకుంటారు. సౌజన్యబుద్ధితోను, పాతివ్రత్యంతోను నడుచుకుంటారు” అంది.
ద్రౌపది మాటలకి ధర్మరాజు అంగీకరించాడు. “అందరము ఏ ఒడుదుడుకులు లేకుండా అజ్ఞాతవాస కాలాన్ని గడుపుదాము” అని తమ్ముళ్లతో చెప్పాడు. ధర్మరాజు కర్తవ్యాన్ని నిశ్చయించాడు. ధౌమ్యుడికి అగ్నిహోత్ర రక్షణ అప్పగించాడు. వంటలవాళ్లు పాంచాలి, పరిచారికలు ద్రుపదుడి నగరానికి వెళ్లాలని చెప్పాడు. ఇంద్రసేనుడు మొదలైన రథసారథుల్ని ద్వారకా నగరానికి వెళ్లమని ఆదేశించాడు. ఎవరేనా తమని గురించి అడిగితే ‘మమ్మల్ని ద్వైతవనంలో వదిలిపెట్టి వెళ్లారని, తరువాత మాకెమీ తెలియద’ని చెప్పమన్నాడు. మిగిలిన పరివారాన్ని పంపించేశాడు.
