Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-126: యక్షప్రశ్నలకి జవాబు చెప్పిన ధర్మరాజు

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

యక్షప్రశ్నలకి జవాబు చెప్పిన ధర్మరాజు

యక్షుడు ధర్మరాజుని “సూర్యుణ్ని నడిపేది ఏది? సూర్యుణ్ని సేవించి తిరిగేవాళ్లు ఎవరు? సూర్యుడు దేనివల్ల అస్తమిస్తాడు? సూర్యుడికి ఆధారమైంది ఏది?” అని అడిగాడు.

యక్షుడి ప్రశ్నలకి సమాధానం చెప్తూ ధర్మరాజు “సూర్యుడిని బ్రహ్మం నడుపుతుంది. సూర్యుణ్ని సేవించేవాళ్లు దేవతలు. సూర్యుడు ధర్మం వల్ల అస్తమిస్తాడు. ఆ మహాత్ముడికి ఆధారం సత్యం అని పెద్దలంటారు” అని చెప్పాడు.

తరువాత యక్షుడు ధర్మరాజుతో “పురుషుడు దేనివలన శ్రోత్రియుడవుతాడు? దేనివల్ల గొప్ప మహిమని పొందగలుగుతాడు? దేనివల్ల సాయం పొందినవాడవుతాడు? దేనివల్ల బుద్ధిమంతుడవుతాడు? స్పష్టంగా సమాధానాలు చెప్పు” అన్నాడు.

యక్షుడు అడిగిన ప్రశ్నలకి ధర్మరాజు “వేదాభ్యాసం చెయ్యడం వల్ల శ్రోత్రియుడు అవుతాడు. గొప్ప తపస్సు చెయ్యడం వల్ల గొప్ప ప్రభావం సిద్ధిస్తుంది. ధైర్యంవల్ల సాయం పొందగలుగుతాడు. పెద్దల్ని సేవించడంవల్ల బుద్ధిమంతుడవుతాడు” అని చెప్పాడు.

యక్షుడు మళ్లీ ధర్మరాజుని “దేనివల్ల బ్రాహ్మణుడు దివ్యత్వాన్ని పొందుతాడు? బ్రాహ్మణులకి నిర్మలత్వం ఎలా ఏర్పడుతుంది? మాలిన్యం ఎలా కలుగుతుంది? దేనివల్ల బ్రాహ్మణుడు మర్త్యుడవుతాడు?” అని అడిగాడు.

ధర్మరాజు యక్షుడితో “బ్రాహ్మణుడు వేదపఠనం వల్ల దివ్యత్వం పొందుతాడు. అధికమైన నిష్ఠవల్ల సాధుభావం కలిగివుంటాడు. గొప్పదైన సౌశీల్యాన్ని విడిచిపెట్టడం వల్ల అసాధువు అవుతాడు. శుచిత్వాన్ని విడిచిపెట్టడం వల్ల మృత్యుభయంతో మర్త్యుడవుతాడు” అని చెప్పాడు.

ధర్మరాజు సమాధానం విని యక్షుడు మళ్లీ “జీవన్మృతుడు ఎవరు?” అని ప్రశ్నించాడు.

ధర్మరాజు “దేవతలు, పితృదేవతలు, అతిథులు, సేవకులు మొదలైనవాళ్లకి పెట్టకుండా తాను భోజనం చేసేవాడు బతికి ఉండగానే చచ్చినవాడితో సమానుడు” అని బదులిచ్చాడు.

యక్షుడు ధర్మరాజుని వదలకుండా “ధర్మరాజా! భూమికంటె బరువైనది ఏది? ఆకాశంకంటే నిడివి కలది ఏది? వేగంగా వెళ్లగలిగింది ఏది? గడ్డికంటే విరివిగా పెరిగేది ఏది?” అని అడిగాడు.

ధర్మరాజు ఉత్తముడైన యక్షుడితో “భూమికంటె బరువైంది కన్నతల్లి. ఆకాశం కంటె పొడవు తండ్రి. గాలికంటె వేగం కలది మనసు. గడ్డికంటె విరివిగా పెరిగేది చింత” అన్నాడు.

యక్షుడు మళ్లీ ధర్మరాజుతో “నిద్రపోతూ కూడా కళ్లు మూయనిది ఏది? జన్మించి కూడా చైతన్యం లేనిది ఏది? రూపం ఉండి కూడా హృదయం లేనిది ఏది? వేగం వల్ల అతిశయించేది ఏది?” అని అడిగాడు.

యక్షుడి ప్రశ్నలకి ధర్మరాజు “చేప నిద్రపోతున్నప్పుడు కూడా కళ్లు మూయదు. గుడ్డు జన్మించినా కూడా ప్రాణం ఉండదు. రాయికి రూపం ఉంటుంది కాని గుండె ఉండదు. వేగం వల్ల ఏరు వర్ధిల్లుతుంది” అని చెప్పాడు ధర్మరాజు.

యక్షుడు మళ్లీ అడిగాడు “బాటసారికి, రోగికి, గృహస్థుడికి మరణించినవాడికి చుట్టాలు ఎవరు?”.

ధర్మరాజు “బాటసారికి వర్తకజన సమూహము; రోగికి వైద్యుడు; గృహస్థుడికి మంచిభార్య, మరణించినవాడికి చేసిన ధర్మము” అన్నాడు.

యక్షుడు “ధర్మరాజా! ధర్మానికి కుదురు ఏది? కీర్తికి ఆధారం ఏది? స్వర్గానికి సరయిన మార్గం ఏది? సుఖానికి నెలవు ఏది? వివరంగా చెప్పు” అన్నాడు.

ధర్మరాజు “ధర్మానికి దాక్షిణ్యం కుదురు; కీర్తికి ఆధారం దానం; స్వర్గానికి మార్గం సత్యం; సమస్త సుఖాలకి నెలవు శీలము” అని చెప్పాడు.

యక్షుడు మళ్లీ అడిగాడు “నరుడికి ఆత్మ ఎవరు? అతడికి దైవికంగా ఏర్పడే చుట్టం ఎవరు? అతడు బ్రతుకు ఎలా నిర్వహిస్తాడు? ఏ విధంగా మంచితనాన్ని పొందుతాడు? అన్నింటికీ సరయిన సమాధానాలు చెప్పు” అన్నాడు.

ధర్మరాజు యక్షుడికి “నరుడికి ఆత్మ పుత్రుడు; అతడికి దైవికమయిన చుట్టం భార్య; అతడికి బ్రతుకు ప్రసాదించేది మేఘుడు, అతడికి గొప్పదనం కలిగించేది దానం” అని చెప్పాడు.

యక్షుడు మళ్లీ ప్రశ్నిస్తూ “ధర్మాలన్నింటిలో గొప్పదైన ధర్మం ఏది? ఎప్పుడూ పరిపూర్ణంగా ఫలితాన్ని ఇచ్చేది ఏది? దేన్ని వదిలిపెడితే సంతోషం కలుగుతుంది? ఎవరితో పొత్తు ఎప్పుడూ చెడిపోకుండ ఉంటుంది?” వీటన్నిటికీ చక్కటి సమాధానం చెప్పు. అని అడిగాడు.

ధర్మరాజు యక్షుడు అడిగిన ప్రశ్నలకి “అన్ని ధర్మాల్లోకి గొప్పదైన ధర్మం అహింస; ఎప్పుడూ పరిపూర్ణమైన ఫలితాన్ని ఇచ్చే కార్యం యజ్ఞం; సంతోషం కలగాలంటే అహంభావాన్ని వదిలిపెట్టాలి. ఎప్పుడూ చెడిపోకుండ ఉండేది సజ్జనసాంగత్యం” అన్నాడు.

ధర్మరాజు చెప్పినది విని యక్షుడు మళ్లీ ప్రశ్నించాడు “లోకంలో ప్రజల్ని ఆదుకుని సాయంచేసేవాళ్లు ఎవరు? దేనివల్ల నీరు, అన్నం లభిస్తాయి? విషం అంటే ఏమిటి? పితృతర్పణాలకి అనుకూలమైన కాలం ఏది?”.

ధర్మరాజు యక్షుడికి “ఈ సృష్టి మొత్తానికి దిక్కు అయినవాళ్లు సజ్జనులు; ఆకాశంవల్ల నీరు, భూమి వల్ల అన్నం లభిస్తాయి; బ్రాహ్మణుల ధనమే విషం; బ్రాహ్మణులరాక పితృతర్పణాలకి అనువైన కాలం” అని చెప్పాడు.

యక్షడు ధర్మరాజుని మళ్లీ ప్రశ్నిస్తూ “దేనిని వదిలిపెడితే మానవుడు ప్రజలందరికి ఇష్టుడవుతాడు? శోకంలేని వాడవుతాడు? సంపన్నుడవుతాడు? సౌఖ్యం కలవాడవుతాడు?” అని అడిగాడు.

ధర్మరాజు యక్షుడి ప్రశ్నలకి సమాధానం ఇస్తూ “గర్వం వదిలిపెడితే అందరికీ ఇష్టుడవుతాడు; కోపం వదిలిపెడితే శోకంలేని వాడవుతాడు. లోభం వదిలిపెడతే సంపన్నుడవుతాడు. ఆశ వదిలిపెడితే సుఖవంతుడవుతాడు” అన్నాడు.

యక్షుడు ఆపకుండా మళ్లీ ప్రశ్నించాడు “పురుషుడు అని అనదగినవాడు ఎవరు? సర్వసంపదలు కలవాడు ఎవరు?”.

ధర్మరాజు యక్షుడికి “ఎవరి కీర్తి మిరుమిట్లు కొలుపుతూ భూమి ఆకాశము విస్తరిస్తుందో అటువంటి మహానుభావుడే పురుషుడు అనిపించుకుంటాడు. ప్రియం, అప్రియం, సుఖం, దుఃఖం, జరిగిన పనులు, జరగబోయే పనులు ఎవరు సమానంగా భావిస్తాడో.. ఆ మహానుభావుడే సర్వసంపదలు కలవాడు అవుతాడు” అని చెప్పాడు.

యక్షుడు ధర్మరాజువైపు ప్రశాంతంగా చూస్తూ “మహాత్మా! ధర్మరాజా! నేను అడిగిన ప్రశ్నలకి సమాధానాలు చక్కగా నాకు సంతృప్తి కలిగేలా చెప్పావు. నీ తమ్ముళ్లలో ఎవరేనా ఒక్కళ్లని కోరుకో బ్రతికిస్తాను” అన్నాడు. ధర్మరాజు తమ్ముడు నకులుణ్ని బతికించమని అడిగాడు.

యక్షుడు “ధర్మరాజా! నీ కోరిక నాకు అర్థం కాలేదు. భీముడు, అర్జునుడు లోకోత్తరవీరులు, నీకు ఇష్టమైనవాళ్లు. వీళ్లల్లో ఒకళ్లని బతికించమని అడుగకుండా నకులుణ్ని బతికించమని ఎందుకు అడుగుతున్నావు?” అని ఆశ్చర్యంగా అడిగాడు.

అందుకు ధర్మరాజు “నా తండ్రి పాండురాజుకి ఇద్దరు భార్యలు. కుంతి, మాద్రి. కుంతి కుమారుల్లో నేను పెద్దవాడిని బ్రతికి ఉన్నాను. మాద్రి కుమారుల్లో ఒకడు బతికి ఉండాలి కదా! నువ్వు ధర్మంగా ఆలోచించి చెప్పు. ధర్మనందనుడు ధర్మాత్ముడు అని లోకం నన్ను పొగుడుతూ ఉంటుంది. అటువంటి పొగడ్తలు పొందుతున్న నేను ఎటువంటి ఆపదలు కలిగినా ధర్మహాని చెయ్యను. ఇది నిజం” అన్నాడు.

ధర్మరాజు మాటలు విని యక్షడు “ధర్మరాజా! నీ ధర్మజ్ఞానానికి మెచ్చాను. నీ తమ్ముళ్లందరూ బ్రతుకుతారు” అన్నాడు. వెంటనే భీముడు, అర్జునుడు, నకులసహదేవులు నలుగురు ఆకలిదప్పులు లేకుండ నిద్రనుంచి లేచినట్టు లేచారు.

వాళ్లని చూసి ధర్మరాజు ఆశ్చర్యపడ్డాడు. యక్షుడితో “మహాత్మా! నువ్వు సామాన్యుడవైన యక్షుడివి కాదు. నువ్వు ఎవరో మహానుభావుడవనే నా నమ్మకం. నిజంగా దేవేంద్రుడివో, అలకానగర ప్రభువు కుబేరుడివో, అగ్నిదేవుడివో, వాయుదేవుడివో అయి ఉండాలి. అలా కాకపోతే అన్ని జగత్తులతో ప్రశసింపబడే నా తండ్రి ధర్మదేవతవే అయి ఉండాలి. దయచేసి నువ్వు ఎవరివో నాకు నిజం చెప్పు” అని ధర్మరాజు వేడుకున్నాడు.

యక్షడు చిరునవ్వుతో “ధ్మరాజా! నేను యమధర్మరాజుని! నువ్వు నా కొడుకువి. పరమధర్మమూర్తివైన నిన్ను చూడాలన్న కోరికతో వచ్చాను. సత్యం. శౌచం, దానం, తపస్సు, శమం, దమం, కీర్తి, వివేకం నా రూపాలు.

నన్ను ఆధారంగా చేసుకున్న మనుషులకి చెడు జరగదు. నువ్వు నన్ను ఆశ్రయించావు. కనుక, నీకు కావలసిన వరాలు ఇస్తాను కోరుకో!” అన్నాడు.

ధర్మరాజు తత్తరపడి పూజ్యభావంతో భుజాలు భూమికి తగిలేటట్టుగా వంగి ధర్మదేవుడికి నమస్కరించి, కీర్తించి “దేవా! దేవా! నా ఆశ్రమంలో నివసిస్తున్న ఒక బ్రాహ్మణుడి అరణిని ఒక లేడి ఎత్తుకుని పోయింది. అతడి నిత్యానుష్ఠానానికి భంగం కాకుండా దయతో అరణిని ప్రసాదించు” అని ప్రార్థించాడు.

“ధర్మరాజా! నేను నీ మనస్సుని తెలుసుకోవాలని అరణిని అపహరించాను. లేడి రూపంలో వచ్చింది నేనే” అని చెప్పి ధర్మదేవుడు అరణిని ధర్మరాజుకి ఇచ్చాడు.

తరువాత ధర్మరాజుతో “మీకు పన్నెండేళ్లు అరణ్యవాసం ముగిసింది. పదమూడవ సంవత్సరంలో అడుగుపెడుతున్నారు. ఇంక మీరు మారువేషాల్లో శత్రువులకి తెలియకుండా అజ్ఞాతవాసం పూర్తి చెయ్యాలి. మీరు ఏ రూపాలు దాల్చాలని అనుకుంటారో ఆ రూపాలు మీరు పొందగలరు. మిమ్మల్ని ఇతరులు ఎవరు గుర్తించకుండ ఉండేటట్లు వరం ఇస్తున్నాను. ఇంకొక వరం నువ్వు అడుగు” అన్నాడు.

ఆ మాటలు విని ధర్మరాజు యముడితో “దేవతలలో మొదటివాడవైన నువ్వు కరుణించి మాకు ప్రత్యక్షమై నన్ను క్షమించడం వల్ల మా జీవితం ధన్యమైంది. ఇంతకంటే వేరే భాగ్యం నేను కోరుకోవలసింది ఏముంది? అయినా నా మనస్సు ఎప్పుడూ దర్మమార్గం మీదే ఉండేట్లు వరం ప్రసాదించు” అని ప్రార్థించాడు. ధ్మరాజుకి వరం అనుగ్రహించి యమధర్మరాజ అదృశ్యమయ్యాడు.

పాండవులు అరణిని తీసుకుని వెళ్లి బ్రాహ్మణుడికి ఇచ్చారు. బ్రాహ్మణుడు పాండవుల్ని ఆశీర్వదించాడు. పాండవులు ఆనందాన్ని పొందారు” అని పాండవుల వనవాస కథని వివరంగా చక్కటి మాటలతో పుణ్యమూర్తి వేదవ్యాసమహర్షి శిష్యుడు వైశంపాయనుడు జనమేజయమహారాజుకి చెప్పి సంతోషాన్ని కలిగించాడు.

(కవిత్రయం తెనిగించిన శ్రీమదాంధ్ర మాహాభరతంలో యోగ్యమైన ప్రవర్తన కలవాడు, ఆపస్తంబసూత్రుల వంశంలో జన్మించినవాడు, శ్రీవత్ససగోత్రుడు, శివుడి పాదపద్మాలు అరాధించే మనస్సు కలవాడు, సూరనార్యుడు, పోతమాంబల కొడుకు, పాకనాటిలో నీలకంఠేశ్వరుడి ఆలయం ఉన్న గుడ్లూరు అనే ఊరిలో నివసించేవాడు, గొప్పగుణాలతో జీవితం ధన్యం చేసుకున్నవాడైన ఎఱ్ఱన జగద్వితుడయిన నన్నయభట్టు మహాకవివరేణ్యుడి సారస్వతమహిమలో పాలుపంచుకున్నట్లు పేరుపొందడం వల్ల సుజన సంతోష సిద్ధిని కోరి గంభీరమైన ఆలోచన చేసి నన్నయభట్టు యొక్క కవితాశిల్ప విధానం కొంత ప్రతిఫలించేట్లు అతడి రచనగానే ఉండేట్లు అరణ్యపర్వ శేషాన్ని కవివరేణ్యులకు వినసొంపుగా ఉండేలా పూరించాడు.)

అరణ్యపర్వంలోని ఏడవ ఆశ్వాసం సమాప్తం

అరణ్యపర్వం సమాప్తం

Exit mobile version