[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
అరణి తేవడానికి వెళ్లిన ధర్మరాజు
మహర్షి చెప్పిన కథని విని జనమేజయుడు “మహర్షీ! అరణ్యవాసం పన్నెండేళ్లు గడపడానికి ఎంతో కష్టపడిన మా తాతలు పన్నెండవ ఏడు చివరి రోజులు ఎలా గడిపారో చెప్పండి” అని ప్రార్థించాడు.
వైశంపాయన మహర్షి “జనమేజయమహారాజా! పాండవులు మార్కండేయ మహర్షి వల్ల అనేక పుణ్యకథలు విని మళ్లీ ద్వైతవనానికి వచ్చారు.
సుఖంగా కూర్చుని ఉన్న ధర్మరాజు దగ్గరికి ఒక బ్రాహ్మణుడు ఆందోళనతో వచ్చి “మహనుభావా! నేను నా అరణిని (నిప్పుకొయ్యని) ఒక చెట్టు కొమ్మకి వేలాడతీసాను. అంతలో ఒక లేడి వచ్చి వేగంగా ఆ చెట్టుకి రాపిడి చేసింది. నా అరణి ఆ లేడి కొమ్ముకి తగులుకుంది. ఆ లేడి పరుగులు తీసింది. నా అరణి లేడితో ఉండిపోయింది. నా నిత్యనుష్ఠానానికి అరణి అవసరం కదా! కొంచెం దాన్ని పట్టుకొచ్చే ఏర్పాటు చేయించండి” అని అడిగాడు.
వెంటనే ధర్మనందనుడు విల్లు తీసుకుని తను, తమ్ముళ్లు కలిసి లేడి మీద బాణాలు ప్రయోగించారు. కాని, ఒక్క బాణం కూడ లేడిని తాకలేదు. అది పరుగులు తీస్తూ వాళ్లని చాలా దూరం తీసుకునిపోయి భయంకరమైన అడవిలో మాయమైపోయింది.
పాండవులు తమ ప్రయత్నం విఫలమైందని బాధపడ్డారు. చాలాదూరం తిరగడం వల్ల అలిసిపోయిన పాండవులు ఒక మర్రిచెట్టుకింద విశ్రాంతి తీసుకుంటున్నారు. అప్పుడు నకులుడు ధర్మరాజుతో “మంచివంశంలో పుట్టి మంచినడవడికతో ధర్మంగా ప్రవర్తించే మనకి ఇన్ని కష్టాలు ఎందుకు కలిగాయి” అని అడిగాడు.
అది విని ధర్మరాజు నకులుడితో “సుఖం, దుఃఖం కలగడానికి కారణం తన పూర్వజన్మ కర్మే కాని వేరే కారణం ఏదీ చెప్పడానికి వీలు లేదు” అన్నాడు. ధర్మరాజు మాటలు విని భీమసేనుడు నకులుడితో “ఆనాడు కౌరవులో ద్రౌపదిని అవమానించినప్పుడే ఆగ్రహంతో ధృతరాష్ట్రుడి కొడుకుల్ని సంహరించకపోవడం వల్లే మనకి ఇన్ని కష్టాలు వచ్చాయి” అన్నాడు.
భీముడి మాటలు విని అర్జునుడు “నకులా! ఆనాడు నిండు సభలో సూతుడి కొడుకు మాట్లాడిన మాటలు విని కూడా ఆగ్రహించకుండా పిరికివాడిలా నేను అడవులకి రావడం వల్ల మనకి ఇన్ని కష్టాలు వచ్చాయి. చెడునడవడిక కలవాడు, మాయాజూదం ఆడిన శకునిని ఆ రోజే చంపి ఉంటే ఈరోజు అడవుల్లో ఇన్ని కష్టాలు పడేవాళ్లం కాదు” అన్నాడు.
తమ్ముళ్లందరు తలొక విధంగా మాట్లాడుతుంటే ధర్మరాజు “నకులా! నీ అన్నలందరికీ దాహంగా ఉంది. చెట్టు ఎక్కి నీరు ఎక్కడ ఉందో చూడు” అన్నాడు.
నకులుడు చెట్టు ఎక్కి దగ్గర్లో నీళ్లు ఉన్నాయని చెప్పాడు. నువ్వు చెట్టు దిగి అక్కడికి వెళ్లి కడుపునిండా నీళ్లు తాగి నీ అన్నలకి కూడా తీసుకునిరా!” అని చెప్పాడు ధర్మరాజు. నకులుడు చెట్టు దిగి అందంగా ఉన్న ఒక తటాకం దగ్గరికి వెళ్లాడు.
మూర్ఛపోయిన నకులుడు సోదరులు
తటాకంలో నీళ్లు తాగబోతున్న నకులుడికి శరీరం లేని ఒక భూతం “అన్నా! ఈ చెరువు నాది. ఇందులో నీళ్లు తాగాలనుకుంటే నేను అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పాలి” అంది.
అశరీరభూతం చేసిన హెచ్చరిక పట్టించుకోకుండా నకులుడు చెరువులో దిగి తియ్యటి నీళ్లు తాగి ఒడ్డు మీదకి వస్తూనే చైతన్యం లేకుండా పడిపోయాడు.
కొంతసేపు చూసి ధర్మరాజు “నకులుడు నీళ్లు తీసుకుని రావడానికి వెళ్లి చాలా సేపయింది. వెళ్లి నకులుణ్ని వెంటబెట్టుకునిరా!” అని సహదేవుణ్ని పంపించాడు.
చెరువు దగ్గర పడి ఉన్న నకులుణ్ని చూసి ఎందుకు జరిగిందో అని ఆలోచిస్తూ దాహంగా ఉండడం వల్ల నీళ్లు తాగడానికి చెరువులో దిగాడు. అశరీరభూతం “పుణ్యాత్ముడా! ఈ చెరువు నా అధీనంలో ఉంది. నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం ఇచ్చాక నీకు కావలసినన్ని నీళ్లు తాగు” అని చెప్పింది.
సహదేవుడు భూతం మాటలు పట్టించుకోకుండా నీళ్లు తాగి చెట్టులా కూలి నేలమీద పడ్డాడు.
ధర్మరాజుకి ఆవేదన కలిగి “అర్జునా! నీ తమ్ముళ్లు నకులసహదేవులిద్దరు వెళ్లి చాలాసేపయింది. ఈ అడవిలో వాళ్లకి ఏ ఆపద కలిగిందో? నువ్వు వెళ్లి వాళ్లని వెంటబెట్టుకునిరా!” అని పంపించాడు.
అర్జునుడు వెంటనే వెళ్లి ఆ చెరువు దగ్గర పడి ఉన్న నకుల సహదేవుల్ని చూసి ఆశ్చర్యపోయాడు. దుఃఖంతో నాలుగువైపులకీ చూశాడు. అతడికి ఎవరూ కనిపించలేదు. దాహంగా ఉండడంతో నీళ్లు తాగడానికి చెరువు దగ్గరికి వెళ్లాడు.
“ఈ చెరువు నాది. ఇందులో ప్రవేశిస్తే వాళ్ల ప్రాణానికి ముప్పు కలుగుతుంది. నీళ్లు తాగాలనుకుంటే నా ప్రశ్నలకి సమాధానం చెప్పాలి” అని అదృశ్యరూపంలో ఉన్న భూతం చెప్పింది.
అది విని అర్జునుడికి కోపం వచ్చింది. “అలా దొంగల దాక్కుని మాట్లాడుతావెందుకు? నాకు శబ్దాన్ని విని బాణాలు వేయడం తెలుసు. కాచుకో అని శబ్దం వచ్చినవైపు బాణాలు వేశాడు.
అయినా అశరీరభూతం అలాగే మాట్లాడింది. దేవేంద్రుడి కుమారుడు అర్జునుడు అలిసిపోయి చెరువులో నీళ్లు తాగి నేలమీద ఒరిగిపోయాడు. ధర్మరాజు భీముణ్ని చూసి “నకులసహదేవులు, అర్జునుడు ఇంత అలస్యం చెయ్యడానికి కారణం ఏమిటో తెలియట్లేదు. నువ్వు వెళ్లి ఏమైందో చూసిరా!” అన్నాడు.
భీముడు వాయువేగంతో వెళ్లి నిద్రపోతున్నట్లుగా చెరువు గట్టు మీద పడి ఉన్న ముగ్గురిని చూసి బాధపడ్డాడు. ఇది మనుషులు చేసిన పనిగా అనిపించడం లేదు. దేవేంద్రుడో, కిన్నరులో, త్రిదశులో ఈ పని చేసి ఉండాలి. ఈ సంగతి తరువాత చూడవచ్చు ముందు దాహం తీర్చుకోవాలి అనుకుని చెరువులోకి దిగాడు.
అంతలో ఆకాశం నుంచి “అయ్యా! నువ్వు ఎందుకు ఇంత సాహసం చేస్తున్నావు? ఆ కొలను నాది. నీకు శక్తి ఉంటే నేను అడిగే ప్రశ్నలకి తగిన సమాధానాలు చెప్పు. తరువాత ఆ చెరువులో ఉన్న నీళ్లు తాగు” అని వినిపించింది.
భీముడు ఆ మాటలు పట్టించుకోకుండా ఆ నీళ్లని తాగి స్పృహతప్పి పడిపోయాడు.
ధర్మరాజు చాలాసేపు చూసి వెళ్లిన నలుగురు తమ్ముళ్లు తిరిగి రాలేదని పరితపిస్తూ ఆ నలుగురూ వెళ్లిన దారిలోనే బయలుదేరాడు. ధర్మరాజు నడుస్తున్న దారిలో మనుషుల అలికిడి ఎక్కడ ఉన్నట్టు కనిపించలేదు.
ఎక్కడ చూసినా నడవడానికి వీలు లేకుండ రాళ్లు, రప్పలు, కొండలు, కోనలు, చెట్లు, పొదలు తీగెలు అడ్డు తగులుతున్నాయి. ఏనుగులు, సింహాలు, పెద్దపులులు, పందులు, కారెనుపోతులు, తిరుగుతున్నాయి. అనేక రకాల పక్షుల కూతలు భయంకరంగా వినిపిస్తున్నాయి.
ధర్మరాజు తన తమ్ముళ్లని వెతుక్కుంటూ కొలను దగ్గరికి చేరాడు. కొలను గట్టుమీద పూరువంశంలో జన్మించిన గొప్పవాళ్లు, అధికమైన బలం కలవాళ్లు, నిర్మలమైన బుద్ధి కలవాళ్లు, గొప్ప పుణ్యాత్ములు తన తమ్ముళ్లు భీముడు, అర్జునుడు, నకులసహదేవుల్ని చూశాడు. వాళ్లు ప్రళయకాలంలో పడి ఉండే దిక్పాలకుల్లా చెరువుగట్టు మీద కూలిపోయి కనిపించారు.
వాళ్లని చూసిన ధర్మరాజు కొంతసేపు కదలక, మెదలక కొయ్యబారి ఉండిపోయాడు. ఆ దృశ్యాన్ని చూసిన ధర్మరాజు మనసు తల్లడిల్లింది. అతడి మొహం పాలిపోయింది. వేడి నిట్టూర్పులతో దుఃఖం వల్ల మూర్ఛపోయే స్థితికి చేరుకున్నాడు. కొంతసేపటికి తేరుకుని ధైర్యం తెచ్చుకుని ఒకసారి తమ్ముళ్లవైపు తేరిపార చూసి చుట్టూ కూడా పరికించి చూశాడు.
ఎక్కడా మనుషులు వచ్చి వెళ్లిన జాడగాని, పోరాటం జరిగిన జాడగాని లేదు. వాళ్ల వంటిమీద ఎక్కడా గాయాలు లేవు. భీముడు, అర్జునుడు, నకులసహదేవులు సామాన్యులు కారు. సులువుగా ఇతరులకి లొంగని మహావీరులు. ఎందుకు ఆ విధంగా పడి ఉన్నారో ధర్మరాజుకి అర్థం కాలేదు.
దృతరాష్ట్రుడి కొడుకు దుర్యోధనుడు దుర్మార్గుడు. అతడికి సహాయపడే గాంధారరాజు పుత్రుడు శకుని పేరు పొందిన మేధావి. ఆ దుర్మార్గలు ఏదైనా కుట్రపన్నారా? వీళ్ల ముఖాలు చూస్తే ప్రసన్నంగా కనిపిస్తున్నాయి. వీళ్ల కాళ్లు, చేతులు కాంతిగానే ఉన్నాయి.
ఇలా జరగడానికి కారణమేమిటో తెలియట్లేదు. ఈ కొలనులో నీళ్లు విషపూరితం అనడానికి వీలు లేదు. సమస్త భూరాజ్యాన్ని ఐశ్వర్యాల్ని శత్రువులకి అప్పగించి అడవులకి వచ్చి భయంకరమైన మృగాలతో కలిసి జీవిస్తున్న వీళ్లని ఇంకా వదలకుండా వెంబడించి బ్రహ్మదేవుడు ఇలా దిక్కులేనివాళ్లుగా చేశాడుకదా! నేనెక్కడికి పోగలను? నాకు దిక్కెవరు? ఈ బాధని ఎలా తట్టుకోగలను?
తన కొడుకుల దైన్యాన్ని తలుచుకుంటూ ఎప్పుడూ పరితపిస్తున్న పాండురాజు దేవేరి, పుణ్యాత్మురాలు కుంతిదేవి నాకు సంతోషంతో స్వాగతం చెప్తూ అలింగనం చేసుకుని “నాయనా! ‘నీతో అడవులకు వచ్చిన నీ తమ్ముళ్లు ఎక్కడ? ఒంటరిగా వచ్చావా? వాళ్లు ఎక్కడికి వెళ్లారు?’ అని అడిగితే ఏమని సమాధానం చెప్పాలి?” అని బాధపడుతూ దాహానికి తట్టుకోలేక చెరువులోకి దిగాడు.
అతడితో శరీరంలేని భూతం “ధర్మరాజా! నేను ఒక కొంగని. ఈ చెరువు నా ఆస్తి. నీ తమ్ముళ్లు నేను చేసిన హెచ్చరిక వినకుండా ఈ చెరువులో నీళ్లు తాగి ఇలా పడిపోయారు.
ఈ చెరువులో నీళ్లు తాగితే నీకు కూడా ఇదే గతి పడుతుంది జాగ్రత్త! ముందుగా నిన్ను హెచ్చరిస్తున్నాను. నేను అడిగిన ప్రశ్నలకి సరయిన సమాధానాలు చెప్పి తరువాత ఈ చెరువులో నీళ్లు తాగు” అంది.
నిర్మలమైన మనస్సు కలిగిన ధర్మరాజు “అయ్యా! నువ్వు కొంగవని నేను అనుకోవడం లేదు. కొంగరూపంలో ఉన్న శివుడవో, అగ్నిదేవుడవో, వాయుదేవుడవో అయి ఉంటావు. లేకపోతే వీరాధివీరులు కులపర్వత సమానులైన నా తమ్ముళ్లని నేలమీద కూల్చగలిగిన బలం పక్షులకి ఎప్పుడూ ఉండదు.
దేవతలకి, రాక్షసులకి, గంధర్వులకి, యక్షులకి కూడా నా తమ్ముళ్లని గెలవడం శక్యంకాదు. అలాంటి వాళ్లని నేలమీద పడేయగలిగావు అంటే నువ్వెవరివో. నా మనస్సులో భయం, ఆశ్చర్యం, వేడుక అన్నీ కలిసిపోయి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. నువ్వు ఏం చెయ్యాలని అనుకుంటున్నావో చెప్పు” అని అడిగాడు.
అదృశ్యభూతం “కౌరవనాయకుడవైన ధర్మరాజా! నేను కొంగనుకాదు, యక్షుణ్ని. నీ తమ్ముళ్లు నన్ను అవమానించి ఇక్కడ కుప్పకూలిపోయారు” అని చెప్పి నిజరూపంతో ప్రత్యక్షమయ్యాడు.
యక్షుడు తన భయంకరమైన రూపంతో చెరువుగట్టు మీద నిలబడ్డాడు. తాడిచట్టులా నిట్టనిటారుగా ఎత్తైన శరీరంతో, పొడవైన కంఠంతో, విశాలమైన నోటిలో ప్రకాశిస్తున్న కోరలతో దేదీప్యమానమైన తేజస్సుతో ఉన్నాడు.
అతడు “ధర్మరాజా! ఈ చెరువులో నీళ్లు తాగితే ఎంత గొప్పవాళ్లైనా చచ్చిపోతారు. నువ్వు ఆలోచనలో ఉండి ఆ పని చెయ్యలేదు. నేను వేసే ప్రశ్నలకి నువ్వు సమాధానం చెప్పాలి” అన్నాడు.
ధర్మరాజు “మహాత్మా! నేను చువ్వు వేసే ప్రశ్నలకి సమాధానం చెప్పగలనా? నేను ఎంతటివాడిని? నాకున్న జ్ఞానం ఎంత? అయినా నాకు తెలిసినంతవరకు సమాధానాలు చెప్పడానికి ప్రయత్నిస్తాను అడుగు” అన్నాడు.
(ఇంకా ఉంది)