Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-124: సూర్యుడి వల్ల కర్ణుణ్ని పొందిన కుంతి

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

సూర్యుడి వల్ల కర్ణుణ్ని పొందిన కుంతి

కొంతకలం గడిచాక దుర్వాసమహర్షి ఇచ్చిన మంత్రప్రభావాన్ని పరీక్షించాలనుకుంది కుంతి. ఒకరోజు తూర్పుకొండ మీద ఉదయిస్తున్న సూర్యుణ్ని చూసింది. “వికసిస్తున్న తామరలాగా నీవంటి అందమైన రూపం కలిగిన కుమారుణ్ని నాకు ప్రసాదించు” అని కోరుకుని మంత్రాన్ని జపించింది.

సూర్యుడు తన యోగబలంతో వేరొక రూపం ధరించి కుంతి దగ్గరికి వచ్చి “కుంతీకుమారీ! నీ మంత్రశక్తికి ఆకర్షించబడి ఇక్కడికి వచ్చాను.  నీకు ఏం కావాలో చెప్పు” అని అడిగాడు.

కుంతి సూర్యదేవుణ్ని చూసి “దేవా! నాకు నువ్వు చెయ్యవలసినది ఏదీ లేదు. ఏదో వేడుక కోసం మంత్రాన్ని జపించాను. ఇందుకే నువ్వు వచ్చెయ్యాలా? నువ్వు మళ్లీ ఆకాశానికి వెళ్లిపో!” అంది.

అది విని సూర్యుడు కుంతీదేవితో “కుంతీ! నేనెలాగూ వెళ్లిపోతాను. నువ్వు నా తేజస్సుతో సమానమైన తేజస్సుతో సహజ కవచకండలాలు ధరించిన అందమైన కుమారుడు కావాలని అనుకున్నావుకదా? అలాగే జరుగుతుంది.

నువ్వు నన్ను అంగీకరించకపోతే నిన్ను, నీ తల్లితండ్రుల్ని బూడిద చేస్తాను. నీ యోగ్యతని, నీ శీలాన్ని, నీ నడవడికని పరిగణలోకి తీసుకోకుండా ఇటువంటి మంత్రాన్ని ఉపదేశించిన మహర్షిని కూడా ఈ క్షణమే దహించేస్తాను.

నేను నీ వల్ల నవ్వులపాలయ్యాను. నీకు దివ్యదృష్టి ఇస్తాను చూడు. ఆకాశంలో నిలబడి ఇంద్రుడు మొదలైన దేవతలు నా అవస్థని చూసి పరిహాసం చేస్తున్నారు” అన్నాడు. కుంతి ఆ దృశ్యాన్ని చూసి సిగ్గుపడింది.

కుంతి “సూర్యదేవా! నన్ను నీకివ్వడానికి నా తల్లితండ్రులే అర్హులు. ఇది వనితాధర్మం. వాళ్లని కాదని మిమ్మల్ని అంగీకరిస్తే వంశహాని కలుగుతుంది. మంత్రానికి ఎటువంటి మహిమ ఉందో పరీక్షించాలని ఈ తప్పు చేశాను. తెలియక చేసిన తప్పుని చిన్నతనపు చేష్టగా అనుకుని క్షమించు” అని అనేక విధాలుగా సూర్యుణ్ని బతిమలాడింది.

తన వల్ల తల్లితండ్రులకి, గురువుకి హాని కలుగుతుందని “దేవా! లోకాల్లో ధర్మం, సత్యం నీవే కదా! ఏ ధర్మాలయినా నీకు తెలియనివి కావు. తల్లితండ్రులకి తెలియకుండా నీ మనస్సుకి ధర్మంగా తోస్తే నీ ఇష్టానుసారం చెయ్యి. ఇంక తరువాత వచ్చే నిందని నేనే భరిస్తాను” అంది.

సూర్యుడు “కుంతీ! నేను అధర్మాన్ని ఎలా ఆచరిస్తాను. నీ కన్యాత్వానికి ఎటువంటి భంగం కలగదు. నీకు మహాతేజస్వి అయిన కుమారుడు ఉద్భవిస్తాడు. ఎటువంటి అపవాదూ రాదు, ఇది నిజం” అన్నాడు.

సూర్యుడు కుంతీదేవి అంగీకరించాక అమెకి కుమారుణ్ని ప్రసాదించి ఆకాశానికి వెళ్లిపోయాడు. కుంతి గర్భంలో కర్ణుడు పెరుగుతున్నాడు. సూర్యుడి ప్రభావం వల్ల ఎవరికీ తెలియలేదు. ఈ విషయం ఒక్క దాది కూతురికి తప్ప ఎవరికీ తెలియదు. ఒకరోజు రాత్రి కుంతిభోజుడి కుమార్తె కుంతి ఒక కుమారుణ్ని ప్రసవించింది.

ప్రకృతిసిద్ధమైన చెవిపోగులు తనుత్రాణంతో సుకుమారుడు; ఆజానుబాహుడు; అందమైన దృడమైన శరీరము, సూర్యప్రకాశము కలిగిన కొడుకుని చూసుకుని లోకంలో ఏర్పడే అపనిందకి భయపడింది. తన చెలికత్తెతో కలిసి ఒక చెక్కపెట్టెలో భద్రంగా ఉంచి దాన్ని ఒక తెప్ప మీద పెట్టి తాళ్లతో కట్టి నగరానికి దగ్గరలో ప్రవహిస్తున్న ‘అశ్వనది’లో విడిచిపెట్టింది.

తిరిగి వచ్చి “చిట్టితండ్రీ! ఏ పుణ్యాత్మురాలికి కొడుకుగా ఉండి సంతోషపెడతావో కదా! ఎక్కడికి చేరుతావో నాకు తెలియదు. ఏ పుణ్యవతి మధురస్వప్నాలకి దక్కుతావో. దుమ్ములో ఆడుకునేటప్పుడు తప్పటడుగులు వేస్తూ తియ్యటి జిలిబిలి మాటలు చెపుతూ చెవుల్లో అమృతం కురిపించే నిన్ను; పెద్దపెద్ద కళ్లతో చిన్నచిన్న నవ్వులు ఒలకబోసే నిన్ను; శుభలక్షణాలతో వెలిగే నిన్ను ఏ అమ్మ కౌగలించుకుని గుండెకు హత్తుకుని వేడుకగా ముద్దులు పెట్టుకుంటూ మురిసిపోతూ అనందపడుతుందో?

అయ్యో! నాకు ఆ అదృష్టం లేకపోయిందే! తండ్రీ నువ్వెక్కడ ఉన్నా నీ తండ్రి సూర్యుడు కనుక నిన్ను చూడగలడు. నిన్ను చూడలేని కన్నతల్లిని నిర్భాగ్యురాలిని నేనే. కొన్నాళ్లు గడిచాక నిన్ను నేను చూడగలను. నీ సహజకుండలాలే నిన్ను గుర్తుపట్టడానికి ఉపయోగపడతాయి.

నిన్ను కాపాడవలసిన కన్నతల్లిని ఇప్పుడు నిర్దాక్షిణ్యంగా వదిలేశాను. అయినా కన్నతల్లిగా నిన్ను దీవిస్తున్నాను. స్వర్గంలో, భూలోకంలో, ఆకాశంలో, అన్నిదిక్కుల్లో, గాలిలో, నిప్పులో, సముద్రాల్లో, భయంకరమైన అడవుల్లో నీకు శుభం కలగాలి.

దిక్పాలకులు, సిద్ధులు, సాధ్యులు, రుద్రులు, వేల్పులు, అశ్వినీదేవతలు, జగాలు, సూర్యచంద్రులు నిన్ను దయతో రక్షిస్తారు” అని తన కుమారుణ్ని దీవించి బాధపడింది. తిరిగి అంతఃపురానికి వచ్చేసింది.

సూతుడి దగ్గర పెరిగిన కర్ణుడు

ఆ పసివాడితో ఉన్న పెట్టె అశ్వనదీ ప్రవాహవేగం వల్ల చర్మణ్వనదిలోకి చేరింది. ఆ నది నుంచి యమునానదికి చేరింది. యమునానది నుంచి గంగానదికి చేరి సూతదేశంలో పంపానగర సమీపానికి చేరుకుంది.

ఆ సమయంలో ధృతరాష్ట్రుడి స్నేహితుడు అతిరథుడు అనే సూతుడు గంగలో తన భార్యతో స్నానం చేస్తున్నాడు. సూతుడికి కెరటాలమీద తేలుతూ తెప్పమీద ఉన్న మంజూష కనిపించింది.

సూతుడు తన సేవకుల్ని పంపించి ఆ పెట్టెని తెప్పించాడు. పెట్టెని తెరిచి చూశాడు. అందులో బంగారు కవచకుండలాలతో మెరిసిపోతున్న మగబిడ్డని చూసి సంతోషంతో తన్మయత్వంతో ఎత్తుకున్నాడు.

ఆ బాలుణ్ని తీసుకుని వెళ్లి భార్య రాధకిచ్చి “మనకి సంతానం లేదని భగవంతుడే మనకోసం పంపించాడు. ఈ పిల్లవాడు దైవాంశసంభూతుడు” అని చెప్పాడు. అమె ప్రేమతో అతణ్ని ఎత్తుకుని హృదయానికి హత్తుకుంది.

అతిరథుడు, రాధ ఆ పసివాణ్ని ఎత్తుకుని తమ ఇంటికి వచ్చి తమ కులసంప్రదాయానికి అనుగుణంగా శిశువుకి చేసే సంస్కారాలన్నీ చేయించి చెవులకి కుండలాలు కలిగినవాడు కనుక ‘కర్ణుడు’ అని పేరు పెట్టాడు. బంగారు మెరుపుతో ఉన్నాడు కనుక బ్రాహ్మణులు అతడికి ‘వసుసేనుడు’ అని పేరు పెట్టారు.

ఈ విధంగా సూర్యభగవానుడి కొడుకు సూతుడికి కొడుకయ్యాడు. కుంతి తన అంతరంగిక గూఢచారుల వల్ల అప్పటివరకు జరిగిన విషయాల్ని తెలుసుకుంది. ఆతిరథుడు తన కొడుకు కర్ణుణ్ని ద్రోణాచార్యుడి దగ్గర అస్త్రవిద్య నేర్చుకోడానికి పెట్టాడు.

సూతసుతుడుగా పేరుపొందిన కర్ణుడు ద్రోణాచార్యుడికే కాకుండా కృపాచార్యుడికి, జమదగ్నిమహర్షి కొడుకు పరశురాముడుకి కూడా శిష్యుడయ్యాడు. విలువిద్యలో అనేక అస్త్రాలు సంపాదించాడు. దుర్యోధనుడికి కూడా గొప్ప స్నేహితుడయ్యాడు. అతడితో స్నేహం వల్ల పాండవులకి విరోధిగా మారి వాళ్లకి అపకారాలు చెయ్యడం మొదలుపెట్టాడు.

బ్రాహ్మణవేషంలో దేవేంద్రుడు

జనమేజయ మహారాజా! కర్ణుడి అస్త్రవిద్యా పాటవాన్ని, అతడి కీర్తిని, సహజ కవచకుండలాల్ని గురించి విని ధర్మరాజు ధైర్యం తగ్గి మనస్సులో బాధపడుతున్నాడు. ధర్మరాజు భయం పోగొట్టాలని దేవేంద్రుడు ఒకరోజు కర్ణుడి కవచకుండలాలు తెచ్చెయ్యాలని కర్ణుడి దగ్గరికి బ్రాహ్మణ వేషంలో వెళ్లాడు.

ఆ మధ్యాహ్న సమయంలో కర్ణుడు సూర్యోపాసన చేస్తున్నాడు. అక్కడ గుమిగూడి ఉన్న బ్రాహ్మణులందరికీ కోరిన వస్తువులు ఇస్తున్నాడు.

దేవేంద్రుడు అక్కడికి చేరుకుని ‘భిక్షాందేహి’ అన్నాడు. కర్ణుడు ఏం కావాలో కోరుకోమన్నాడు. బ్రాహ్మణవేషంలో ఉన్న ఇంద్రుడు “నువ్వు ఇచ్చే వస్తువులేవీ నాకు అక్కర్లేదు. నీకు ఇష్టమైతే నీ చెవిపోగుల్ని, ప్రసిద్ధమైన కవచాన్ని దానంగా ఇయ్యి” అన్నాడు.

కర్ణుడు “బ్రాహ్మణోత్తమా! నీకు విలువైన, గొప్పవైన వస్తువుల్ని ఇస్తానని చెప్తున్నాను కదా! ఇలా ఉపయోగంలేని వస్తువుల్ని అడుగుతున్నావెందుకు? ఇంతకు ముందు ఎవరైనా ఎవరినేనా ఇటువంటి వస్తువుల్ని అడిగారా? ఉపయోగంలేని కవచకుండలాల్ని అడగద్దని అనేక రత్నాలు, బంగారము ఇస్తాను” అని చెప్పాడు.

బ్రాహ్మణుడు తన పట్టు విడవలేదు. కర్ణుడు కవచకుండలాలు తనకు పుట్టుకతో వచ్చినవని అవి లేకపోతే యుద్ధంలో తనకి అపజయం కలుగుతుంది కనుక ఇవ్వనని చెప్పాడు. అనేక రాజ్యాలతోను, సంపదలతోను తులతూగే అంగదేశం దానంగా ఇస్తానన్నాడు.

బ్రాహ్మణుడు దేనికీ అంగీకరించలేదు. వచ్చిన బ్రాహ్మణుడు ఇంద్రుడని కర్ణుడు అర్థం చేసుకున్నాడు. “దేవేంద్రా! నిన్ను నేను గుర్తుపట్టగలిగాను. లోకాలన్నీ నీ సంరక్షణలోనే ఉన్నాయి. నేనే నిన్ను అడిగి ఏదైనా తీసుకోవాలిగాని, నువ్వు నన్ను అడగడమేమిటి? చెప్పు” అన్నాడు.

దేవేంద్రుడు కర్ణుడితో “పుణ్యాత్ముడా! నీ మీద ఉన్న ప్రేమతో నీ తండ్రి సూర్యుడు నీకు విషయం చెప్పాడు కనుక, నువ్వు నన్ను గుర్తించగలిగావు. ఇంక నావంటి వాళ్లకి ఇష్టమైన పని చెయ్యకుండా వెళ్లిపొమ్మంటావెందుకు?” అని అడిగాడు.

అది విని కర్ణుడు “దేవేంద్రా! అయితే సమస్త శత్రువుల్ని చంపగలిగిన శక్తి అనే నీ ఆయుధాన్ని నాకు ఇచ్చి నా కవచకుండలాల్ని తీసుకో” అన్నాడు.

దేవేంద్రుడు “కర్ణా!  నువ్వు అడిగినట్టే విశేషమైన నా శక్తి ఆయుధాన్నినీకిస్తాను. అది యుద్ధంలో శత్రువులందర్ని సంహరించి నా దగ్గరికి తిరిగి వస్తుంది.

ఇప్పుడు అది నేను నీకు ఇస్తే భూలోకంలో నువ్వు గెలవలేని నీ శత్రువుని ఒక్కణ్ని మాత్రమే చంపి అది నా దగ్గరికి వచ్చేస్తుంది. ఈ నియమానికి అంగీకరిస్తే నువ్వు నా ‘శక్తి ఆయుధాన్ని’ తీసుకో” అన్నాడు.

ఆ మాటలు విని కర్ణుడు “నాకు ఉన్న శత్రువు ఒక్కడే! కనుక, నువ్వు నిర్ణయించిన నియమాన్ని నేను అంగీకరిస్తున్నాను” అన్నాడు.

దేవేంద్రుడు చిరునవ్వుతో “కర్ణా! నీ కోరికలో ఉన్న విషయం నేను తెలుసుకున్నాను. నీ భయంకరమైన శత్రువు అర్జునుడు. అతణ్ని యుద్ధంలో జయించాలన్న నీ కోరిక నెరవేరదు. మూడులోకాలకి అధినేత నారాయణుడైన శ్రీకృష్ణుడు. అతడు అర్జునుణ్ని కాపాడుతున్నాడు. కనుక అర్జునుణ్ని ఎవరూ జయించలేరు” అన్నాడు.

కర్ణుడు “ఆ విషయం వదిలిపెట్టు. ఇప్పుడు నా కవచం ఒలిచి ఇస్తే నా శరీరం వికారంగా ఉంటుంది కదా! ఏం చెయ్యాలో కూడా చెప్పు” అన్నాడు.

దేవేంద్రుడు “కర్ణా నీ శరీరం నీ తండ్రి సూర్యుడి తేజస్సుతో సమానమైన రంగుతో ప్రకాశిస్తుంది” అని చెప్పి గొప్పదైన శక్తి అనే ఆయుధాన్ని కర్ణుడికి ఇచ్చి దాన్ని కష్టసమయంలో మాత్రమే ఉపయోగించాలని లేకపోతే ప్రమాదం జరుగుతుందని హెచ్చరించాడు.

కర్ణుడు తన కవచకుండలాల్ని తీసి దేవేంద్రుడికి ఇచ్చాడు. అలా ఇవ్వడం కోసం పదునైన ఆయుధంతో అవయవాలన్నింటి మీద పై చర్మాన్ని ఒలుస్తున్న దృశ్యాన్ని చూసి ఆకాశం నుంచి చూస్తున్న దేవతలు అతడి త్యాగబుద్ధిని కీర్తిస్తూ మంగళవాయిద్యాలు మోగిస్తూ పూలవర్షం కురిపించారు.

దేవేంద్రుడు కర్ణుడి కవచకుండలాల్ని తీసుకుని స్వర్గలోకం చేరాడు. అది విని పాండవులు సంతోష పడ్డారు; కౌరవులు దుఃఖపడ్డారు” అని చెప్పాడు వైశంపాయనుడు.

Exit mobile version