[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
కర్ణుడికి సలహా ఇచ్చిన సూర్యుడు
ఇంతవరకు భారతకథ చెప్పిన వైశంపాయన మహర్షితో జనమేజయుడు “వైశంపాయన మహర్షీ! ఇంద్రుడు కర్ణుడి కవచకుండలాల్ని ఎలా అపహరించాడు? ఆ కథ కూడా దయచేసి చెప్పండి” అని ఆడిగాడు.
వైశంపాయనుడు “జనమేజయ మహారాజా! పాండవుల అరణ్యవాసంలో పన్నెండో సంవత్సరం కాబోతున్న సమయంలో ఇంద్రుడు పాండవులకి మంచి జరగడం కోసం కర్ణుడి కవచకుండలాల్ని అపహరించాలని అనుకున్నాడు. ఇంద్రుడి అభిప్రాయం సూర్యుడికి తెలిసింది. సూర్యుడు ఆ విషయాన్ని కర్ణుడికి తెలియచెయ్యాలని అనుకుని బ్రాహ్మణవేషం వేసుకుని కర్ణుడు ఏకాంతంగా ఉన్న చోటికి వెళ్లి కలిశాడు.
సూర్యుడు కర్ణుడితో “కర్ణా! నేను చెప్పేది శ్రద్ధగా విను. పాండవులయందు అమితమైన అభిమానం కలిగిన దేవేంద్రుడు నీ కవచకుండలాల్ని మోసం చేసి తీసుకుపోగలడు. నువ్వు బ్రాహ్మణులు ఏది అడిగినా మంచి మనస్సుతో కాదనకుండా ఇస్తావని దేవేంద్రుడికి తెలుసు. కనుక విప్రుడి వేషంలో నీ దగ్గరికి వస్తాడు. అతడికి నీ కవచకుండలాల్ని ఇవ్వద్దు.
మణులు, బంగారము చూపించి మభ్యపెట్టు. ఏదో విధంగా అతణ్ని బతిమలాడి తప్పించుకో. అంతేకాని, నీ కవచకుండలాలని అతడికి ఇచ్చావంటే నువ్వు మృత్యుముఖంలోకి వెళ్లినట్టే! జాగ్రత్త!
నీ కవచకుండలాలు నీకు అమృతం వంటివి. అవి నీ దగ్గర ఉన్నంతకాలం మూడు లోకాల్లో ఉన్న శత్రువులు నిన్ను చంపలేరు. సహజకుండలాలతో ఉంటే నువ్వు ఎప్పుడూ సుఖసంతోషాలతో ఉంటావు. నీ మంచి కోరి ఈ విషయం నీకు చెప్తున్నాను.. జాగ్రత్త” అని చెప్పాడు.
సూర్యుడు చెప్పిన మాటలు విని కర్ణుడు వినయంతో “బ్రాహ్మణుడా! నువ్వు సామాన్య బ్రాహ్మణుడివి కాదు. నువ్వు ఏ దేవతవో చెప్పమని ప్రార్థిస్తున్నాను” అని అడిగాడు.
కర్ణుడి ప్రార్థన విని సూర్యుడు అతడికి తన గురించి చెప్తూ “కర్ణా! నేను సూర్యుణ్ని! మనసులో నీ మీద గల ప్రేమ వల్ల నీకు కర్తవ్యాన్ని ఉపదేశించడానికి వచ్చాను” అన్నాడు.
సూర్యుడు చెప్పింది విని కర్ణుడు సంభ్రమంతో నిలబడి నమస్కారం చేసి “దేవా! నువ్వు దేవుడవు! నా మీద ఎంతో ప్రేమ కలిగి ఉండడం వల్ల నా మంచిని కోరి నా దగ్గరికి వచ్చావు. నేను ధన్యుణ్నయ్యాను. నాదొక విన్నపం కూడా ఉంది, అది కూడా ప్రశాంతంగా విను.
దేవతలతో ఆరాధించబడే సూర్యుడా! బ్రాహ్మణులు అడిగితే నా ప్రాణాలు కూడా కాదనకుండా మనస్ఫూర్తిగా ఇవ్వగలను. ఇది నా ప్రతిజ్ఞ. ఈ విషయం లోకానికంతటికీ తెలుసు. పైగా దేవేంద్రుడంతటివాడు నా దగ్గరికి ‘దేహి’ అని వస్తే కవచకుండలాలు నాకొక లెక్కా! అవి నాకు గడ్డిపరకలతో సమానం.
మూడు లోకాలకి కాంతినిచ్చే సుర్యదేవా! అన్ని లోకాల్లో వ్యాపించే కీర్తిని తగ్గించుకుని ఏ మాత్రం విలువలేని ఈ శాశ్వతం కాని శరీరం కోసం జీవితమంతా దీక్షగా చేస్తున్న నోముని వదిలిపెట్టడం మంచి పని కాదుగా!
రాక్షసుల్ని జయించినవాడు, నూరు యజ్ఞాలు చేసినవాడు, దేవేంద్రుడు మనస్సులో పాండవుల మీద అభిమానం కలిగి నా దగ్గరికి మారువేషంలో యాచించడానికి రావడమా! వస్తే రానియ్యి. అతడి కీర్తికే లోటు వస్తుంది. నా కీర్తి మూడు లోకాల్లోను వెలుగుతుంది.
ఏ రకంగా చూసినా ఇది నా పుణ్యపలమే! నేను నా కీర్తిని వదలలేను. పేరుప్రతిష్ఠలతో జీవిస్తున్నప్పుడు నాకు మరణం కలిగినా ఇష్టమే! ‘అపకీర్తి కంటే మరణమే మంచిది’ అనే మంచిమాట నువ్వు వినలేదా? కీర్తి పుణ్యగతిని కలిగిస్తుంది, కన్నతల్లిలా కాపాడుతుంది.
మంచి కీర్తే గొప్ప ఆయుష్షు, గొప్ప సంపద. కీర్తిలేనివాడు పీనుగతో సమానం. చెడ్డ పేరు కలవాడిని అన్ని చెడులు ఆవహించి నశించేలా చేస్తాయని పూర్వం బ్రహ్మదేవుడు చెప్పాడు కదా!
నేను అనుసరించే వ్రతాల్లో బ్రాహ్మణులు అడిగితే నాకున్న సంపదలో తక్కవ చెయ్యకుండ దానం చెయ్యడం; బలవంతులైన శత్రువుల్ని సంహరించడం; యుద్ధంలో వీరుడిగా మరణించడం; శరణు కోరినవాళ్లని దయతో రక్షించడం; స్త్రీలు, బ్రాహ్మణులు, చిన్నవాళ్లు, దీన స్థితిలో ఉన్నవాళ్లని కాపాడడం వీటిలో ఏ ఒక్కటి చెయ్యలేకపోయినా నా కీర్తిని పోగొట్టుకున్నవాడినవుతాను. కనుక, ఇంద్రడు కవచకుండలాలు అడిగితే తప్పకుండా ఇస్తాను.” అన్నాడు.
కర్ణుడి మాటలు విని సూర్యుడు “కర్ణా! నువ్వు చాలా అమాయకుడివి. నీ మంచి కోరి చెప్తున్న మాటలు నువ్వు వినడం లేదు. నేను నీకు బాగుపడే మార్గం చెప్తున్నాను. నేను చెప్పినట్టు నడుచుకో! నీకు మంచి జరుగుతుంది. తనకి, తన సంతానానికి, తన భార్యలకి, తల్లితండ్రులకి, చుట్టాలకి చెడు జరగని మార్గంలో కీర్తిని సంపాదించడం భావ్యమే కాని, అందరికి కీడు కలిగించే కీర్తి ఎందుకు? నీ ప్రాణాలు కాపాడుకోవడం నీ మొదటి కర్తవ్యం. కీర్తి మాత్రమే కాదు చక్రవర్తిత్వ శోభ కూడా ప్రాణాలున్నప్పుడే శోభిల్లుతుంది.
మరణించాక మనిషి బూడిదగా మారిపోతాడు. తన కీర్తి స్వయంగా చూడలేడు, పొందలేడు. కీర్తి అనేది చచ్చినవాడి కళేబరానికి చేసిన అలంకారం వంటిదే. ఇందులో ఒక దేవరహస్యం ఇమిడి ఉంది. దాన్ని ఇప్పుడు నేను చెప్పను. సమయం వచ్చినప్పుడు దానంతట అదే తెలుస్తుంది.
నీకు, అర్జనుడికీ యుద్ధం జరిగి తీరుతుంది. అప్పడు ఈ కవచకుండలాలు అర్జునుడిని ఓడించడానికి సహాయపడతాయి. ఇవి లేకపోతే నీకు ఆపద కలుగుతుంది” అన్నాడు.
సూర్యుడు చెప్పింది విని కర్ణుడు “సూర్యభగవానుడా! నువ్వు ఎప్పుడూ భక్తుల మేలుకోరేవాడివి. నా మీద వాత్సల్యంతో నా మంచి కోరి హితోపదేశం చేశావు. నేను అసత్యానికి భయపడినట్టు యముడికి కూడా భయపడను. నన్ను మంచి వ్రతం నుంచి తప్పించడం నీకు పాడికాదు.
అర్జునుణ్ని గెలవలేనని అనుకోకు. నా దగ్గర ఉన్న దివ్యాస్త్రాల గురించి నీకు తెలియదు. పరశురాముడు, ద్రోణుడు నాకు ఇచ్చిన దివ్యాస్త్రాలు తక్కువయినవి కాదు. నేను యుద్ధంలో అర్జునుణ్ని సంహరించడం జరిగి తీరుతుంది. కనుక, నన్ను ఆశీర్వదించు” అన్నాడు.
కర్ణుడు చెప్పినవన్నీ విని సూర్యుడు కొంచెంసేపు ఆలోచించి “నాయనా! కర్ణా! దేవేంద్రుడు అడిగినప్పుడు కవచకుండలాలు ఇవ్వడానికే నువ్వు నిశ్చయించుకున్నావంటే ఇంకొక మాట చెప్తాను విను. దేవేంద్రుడి దగ్గర విశేషమైన శక్తి అనే ఆయుధం ఒకటి ఉంది.
నువ్వు ఆ ఆయుధాన్ని అడిగి తీసుకో. మొదట ఆయుధాన్ని తీసుకుని తరువాత నీ కవచకుండలాలు ఇస్తే నీకు మంచిది. శక్తి ఆయుధం యుద్ధంలో శత్రువుల్ని సంహరించి వెంటనే మరల తిరిగి నీ దగ్గరికి వచ్చేస్తుంది. ఆ ఆయుధంతో దేవేంద్రుడు అనేకవేల మంది రాక్షసుల్ని సంహరించాడు. నీకు ఆ ఆయుధం దొరికితే సులభంగా శత్రువుల్ని చంపగలవు” అని చెప్పి సూర్యుడు అంతర్థానమయ్యాడు.
కర్ణుడు దేవేంద్రుడి కోసం ఎదురు చూస్తున్నాడు” అని చెప్పాడు వైశంపాయనుడు.
కుంతికి దుర్వాసుడు ఇచ్చిన వరము
జనమేజయుడు వైశంపాయనుడితో “మహర్షీ! ఏదో దేవరహస్యం ఉందని కర్ణుడితో సూర్యుడు చెప్పాడని చెప్పావు కదా! ఆ రహస్యం ఏమిటి? కర్ణుడు కవచకుండలాల్ని ఎలా సంపాదించగలిగాడు? ఈ విషయాలు కూడ తెలియచెయ్యవలసిందిగా ప్రార్థిస్తున్నాను” అని అడిగాడు.
జనమేజయుడితో వైశంపాయనుడు “మహారాజా! పూర్వం కుంతిభోజుడి ఇంటికి దుర్వాసమహర్షి అతిథిగా వెళ్లాడు. కుంతిభోజుడు ఆ మహర్షిని పూజించాడు. దుర్వాసుడు “మహారాజా! నాకు నీ ఇంటిలో కొన్నాళ్లు నివసించాలని కోరిక కలిగింది. నేను ఉన్నంతకాలం నువ్వు, నీ సేవకులు ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ఓర్పుతో నాకు పరిచర్య చెయ్యగలరా?” అని అడిగాడు.
అందుకు కుంతిభోజుడు అంగీకరించి తన పెళ్లికాని కుమార్తె పృథని పిలిపించాడు. ఆ మహర్షిని చూపించి “ఈ బ్రాహ్మణుడు దేవతలతో సమానమైనవాడు. ఇష్టంతో మన ఇంట్లో ఉండడానికి వచ్చాడు. నేను కూడా అంగీకరించాను. కుమారీ! నువ్వు ఎంతో ధైర్యం కలదానివి. వినయంతో ఈ దుర్వాసమర్షిని సేవించు. ఎప్పుడు ఏది కోరితే అది సమకూర్చు. అతడికి కోపం తెప్పించకూడదు సుమా!
నేను చెప్పంది జాగ్రత్తగా విను. బ్రాహ్మణులకి కోపం వస్తే ఈ భూగోళం మొత్తాన్ని బూడిద చెయ్యగల శక్తిని కలిగి ఉంటారు. గొప్ప తేజస్సు, ధైర్యము, తెలివితేటల కలవాళ్లు. బ్రాహ్మణుల్ని అవమానించిన వాతాపి, మొదలైనవాళ్లు తమ గొప్పతనాన్ని పోగొట్టుకుని నశించారు. బ్రాహ్మణుల్ని ఆదరించడం వల్ల ఈ లోకాలన్నీ సుభిక్షంగా ఉన్నాయి.
నవ్వు వయస్సులో చిన్నపిల్లవే అయినా మంచి గుణాలు కలదానివి. పెద్దల్ని, బ్రాహ్మణుల్ని పూజ్యభావంతో చూస్తావు. చుట్టాలు, స్నేహతులు, నగరంలోవాళ్లు, అంతఃపురంలోవాళ్లు నిన్ను ప్రశంసిస్తూ ఉంటారు. నిన్ను నేను ఎలా అభినందించగలను. యాదవ వంశంలో కూతురిగా పుట్టి సకల భోగభాగ్యాలు అనుభవిస్తున్నా కూడా ఇటువంటి చరిత్ర కలిగిన ఆడపిల్ల ఎక్కడా కనిపించదు.
అందువల్ల నిప్పుతో సమామనుడైన ఈ మహర్షికి సేవ చెయ్యడానికి నిన్ను నియమిస్తున్నాను. నువ్వు అహంకారాన్ని విడిచిపెట్టి ఈ మహర్షిని సేవించి నీ జీవితానికి ధన్యత చేకూర్చుకో” అన్నాడు.
కుంతిభోజుడు చెప్పినది విని పృథుకుమారి “బ్రాహ్మణులకి సేవచెయ్యాలని నా మనస్సు ఎప్పడూ ఉవ్విళ్లూరుతుంది. ఈనాటికి నా కోరిక నెరవేరింది. నా మీద ఈ బాధ్యత పెట్టి నువ్వు నిశ్చింతగ ఉండు తండ్రీ” అని చెప్పింది.
కుంతిభోజుడు సంతోషంతో పృథని చూపించి దుర్వాసుడితో “దుర్వాసమహర్షీ! ఈ కన్యక చాలా పసిపిల్ల. ఈమె నా కూతురు. తనంతట తను మీకు సపర్యలు చెయ్యడానికి ముందుకి వచ్చింది. మీరు ఏ కోపము లేకుండ ఆమె సపర్యలు అందుకోమని ప్రార్థిస్తున్నాను.
తెలియక చిన్నతనం వల్ల కొన్ని తప్పులు చేసినా మీరు క్షమించి ఆమెకి నేర్పి సపర్యలు స్వీకరించమని కోరుకుంటున్నాను. చిన్నపిల్లలు, స్త్రీలు తప్పులు చెయ్యడం సహజమని మీకు కూడా తెలుసుకదా! పరిపూర్ణమైన శాంత స్వభావంతో మీ వంటి తాపసులు కోపగించుకోకుండ క్షమిస్తారు” అని చెప్పి కుంతిభోజుడు దుర్వాసమహర్షికి తెల్లగా వెన్నెలలా ఉన్న మేడని విడిదిగా ఏర్పాటు చేశాడు. ఆ మేడలో కావలసిన సామగ్రి మొత్తాన్ని సమకూర్చాడు.
పృథ చిత్తశుద్ధితో భక్తి వినయాలతో దేవతల్ని సేవించినట్టు దీక్షతో దుర్వాసమహర్షిని సేవించింది. దుర్వాసమహర్షి పృథ ఓర్పుని పరీక్షిస్తూ బయటికి వెళ్లి ఉదయం వస్తానని చెప్పి అర్థరాత్రికి, రాత్రికి వస్తానని చెప్పి ఉదయానికి వచ్చేవాడు.
పృథ అతడు ఏ సమయంలో వచ్చినా అన్నీ సమకూర్చి పెట్టేది. కుంతిభోజుడు ప్రతిరోజు కూతుర్ని పిలిచి మహర్షిని గురించి అడిగేవాడు. పృథ కూడా తను చేస్తున్న సేవ గురించి వినోదంగా వివరించి చెప్పేది. కుంతిభోజుడు సంతోషపడేవాడు.
కుంతి చేసిన సేవకి సంతోషించి దుర్వాసమహర్షి కుంతిని కావలసిన వరం కోరుకోమని అడిగాడు. కుంతి దుర్వాసుడికి నమస్కరించి “మహానుభావా! నా సేవలకి మీరు సంతోషించారు. అందుకు నా తండ్రి కుంతిభోజుడు సంతోషించాడు. మీ ఇద్దరి సంతోషం కంటే నాకు కావలసింది ఏముంది?” అని వినయంగా సమాధానం చెప్పింది.
దుర్వాసుడు “నువ్వు వరాన్ని కోరుకోకపోతే నేనే నీకు ఒక వరాన్ని ఇస్తున్నాను. ఒక మంత్రాన్ని ఉపదేశిస్తాను. ఈ మంత్రాన్ని ఉపాసించి ఏ దేవతని ఆహ్వానిస్తే ఆ దేవత వచ్చి నీకు కావలసినది ఇస్తాడు” అని చెప్పాడు.
కుంతి మాట్లాడకుండా “మహాప్రసాదం” అని ఆయనకి ధన్యవాదాలు చెప్పింది. ఆయన కూడా శాస్త్రప్రకారం మంత్రాన్ని ఉపదేశించి వెళ్లిపోయాడు.