[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
సావిత్రి సత్యవంతుడి తలని కింద పెట్టి వేగంగా లేచి నమస్కరించి “ఆర్యా! నువ్వు ఎవరివి? ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు?” అని అడిగింది.
దివ్యపురుషుడు “సావిత్రీ! నేను యమధర్మరాజుని. నువ్వు గొప్ప పతివ్రతవు కనుక నన్ను చూడగలిగావు. సామాన్య మనుషులు చూడలేరు. నీ భర్త సత్యవంతుడి ఆయువు తీరింది. అతడు గొప్ప పుణ్యాత్ముడు కనుక నేనే స్వయంగా వచ్చాను. వేరే ఎవరిని పంపించలేదు” అంటూనే సత్యవంతుడి దేహం నుంచి జీవుణ్ని తన పాశంతో బంధించి బయటికి లాగాడు. ఆ జీవుణ్ని తీసుకుని భయంకరమైన దారిలో దక్షిణ దిక్కువైపు వెడుతున్నాడు.
సావిత్రి దుఃఖిస్తూ తన భర్త దేహాన్ని భద్రంగా ఒక చోట దాచి పెట్టి యమధర్మరాజు వెనకాలే వెళ్లింది. నడవలేక నడుస్తున్న సావిత్రిని యమధర్మరాజు “సావిత్రీ నన్నెందుకు వెంబడిస్తున్నావు? ఇంక ముందు వచ్చే దారి నువ్వు నడవడానికి వీలుగా ఉండదు. వెనక్కి వెళ్లిపో” అన్నాడు.
సావిత్రి అతడి మాటలకి “గొప్పవాడవైన యమధర్మరాజా! భర్తలు ఎక్కడికి వెడితే భార్యలు అక్కడికి వెళ్లాలి కదా! నీ దయవల్ల, నా భర్త మీద ఉన్న పూజ్యభావం వల్ల నేను అన్ని చోట్లకి వెళ్లగలను. అన్ని దారుల్లో ముఖ్యమైన దారి ధర్మమే. ధర్మాన్ని అనుష్ఠించి చూసేవాళ్లు మంచివాళ్లే కదా!
అందువల్ల సజ్జనులే ధర్మానికి ఆధారం అని పెద్దలు చెప్తుంటారు. సజ్జనుల్ని దర్శించగలిగితే ఆ ఫలితం ఎప్పుడూ వృథాగా పోదు. నీ దివ్యదర్శనం నాకు కలిగింది కదా! దానివల్ల నేను ఏదైనా గొప్ప మేలు పొందకుండా వ్యర్థంగా ఎలా వెళ్లిపోగలను” అంది.
తెలివితేటలతో మాట్లాడిన ఆమె మాటలు విని యమధర్మరాజు ఆశ్చర్యపోయాడు. “సావిత్రీ! నీ మాటలు నా మనస్సుకి నచ్చాయి. నీ భర్త జీవితం కాకుండా ఏదైన వరం కోరుకో ఇస్తాను” అన్నాడు.
యమధర్మరాజుకి నమస్కారం చేస్తూ సావిత్రి “మహానుభావా! శత్రువులతో అవమానించబడి మంచివాడైన సాళ్వదేశపు రాజు ఎప్పుడూ పూజలు, వ్రతాలు చేస్తూ అడవిలో కాలం గడుపుతున్నాడు. ద్యుమత్సేన మహారాజుకి కంటి చూపు వచ్చేలా చెయ్యి” అని కోరుకుంది.
అమె కోరిక విని యమధర్మరాజు “నువ్వు కోరిన వరం ఇస్తున్నాను. ఇంక నా వెంట రాకుండా వెనక్కి వెళ్లిపో!” అన్నాడు.
సావిత్రి ఇంకా యముడి వెనక వెడుతూనే ఉంది. చాలా దూరం వెళ్లాక “అయ్యా! దయచేసి అర్యులు చెప్పిన ధర్మాలు వినండి. వాటిలో ప్రధానమైనది త్రికరణశుద్ధి. వాక్కు, మనస్సు, క్రియ. వీటిలో దేనినీ వదలకూడదు. మనస్సులో ఆలోచించినదాన్నే పలకాలి. చెప్పిందే చెయ్యాలి. మనస్సు ఒకటి, మాట మరొకటి, క్రియ వేరొకటి ఉండకూడదు.
త్రికరణాల్లో ఎవరికి హింస తలపెట్ట కూడదు. దీనులయందు దయ చూపించాలి. దానం చేసేటప్పుడు కొరతలేకుండా కోరినవాళ్లకి సంతృప్తి కలిగేట్టు చెయ్యాలి. ఆశ్రయించినవాళ్లని మనసారా ఆదరించాలి. ఇవి పెద్దలు ఆచరించవలసిన ధర్మాలు, నెరవేర్చవలసిన కర్తవ్యాలు.
యమధర్మరాజా! నువ్వు అన్నీ తెలిసినవాడివి. నీకు ధర్మసూక్ష్మాలు అన్నీ తెలుసు కనుకనే నీకు ధర్మదేవత అని పేరు. ధర్మమార్గాలన్నీ నీ అధీనంలోనే ఉంటాయి. నిన్ను అందరు యముడు అంటారు కనుకనే నువ్వు ప్రాణికోటిని అణుస్తావు. నీకు శమనుడు అని కూడా పేరు ఉంది. నువ్వు పాపాల్ని శమింపచేస్తావు” అని చెప్పింది.
సావిత్రి మాటలు విని అమె సందర్భానికి తగినట్టు మాట్లాడడం చూసి యముడు సావిత్రితో “పుణ్యాత్మురాలా! దాహంతో ఉన్నవాడికి మంచినీళ్లు దొరికితే కలిగినంత తృప్తి నీ మాటల వల్ల కలిగింది. నీ భర్త ప్రాణం తప్ప ఇంకొక వరం కోరుకో ఇస్తాను” అన్నాడు.
సావిత్రి “యమధర్మరాజా! ద్యుమత్సేనుడికి శత్రువులు అపహరించిన రాజ్యం తిరిగి దక్కేలా చెయ్యి!” అని అడిగింది. ధర్మరాజు ఆమె అడిగింది ఇచ్చి ఇంక రావడానికి వీలు పడదని వెనక్కి వెళ్లిపొమ్మని చెప్పాడు.
సావిత్రి “యమధర్మరాజా! ఎంత దురవస్థ కలిగినా ధర్మాత్ములు ధర్మంతో కూడిన తమ ధర్మకార్యాల్ని వదిలిపెట్టరు. ధార్మికుల మనస్సులో పరితాపము, భ్రాంతి కలగదు. కనుక భర్తను వదిలిపెట్టి వెళ్లడం న్యాయం కాదు కదా! ఏ విధంగానైనా సరే భ్రాంతిమూలకమైన ఉద్వేగాన్ని వదిలిపెట్టి అచంచలమైన నిష్ఠతో ధర్మాన్ని నిలబెట్టాలి కదా?” అంది.
ఆమె మాటలు విని “సావిత్రీ గొప్పదైన ధర్మం మీద అమితమైన ఆసక్తి కలదానివి. నీ భర్త ప్రాణాలు అడగకుండా ఏదైనా వరం కోరుకో ఇస్తాను” అన్నాడు.
సావిత్రి ధర్మరాజుకి నమస్కరించి “మా తండ్రి మద్రదేశపు ప్రభువు. ఆయనకి కొడుకులు లేరు. అతడికి వందమంది కొడుకుల కలిగేట్లు వరం ప్రసాదించు” అని అడిగింది.
అది విని యమధర్మరాజు “నువ్వు అడిగినట్టే నీ తండ్రికి వందమంది కొడుకులు కలుగుతారు. ఇప్పటికే చాలా దూరం వచ్చావు. బాగా అలిసిపోయావు. ఇంక తిరిగి వెళ్లు” అన్నాడు.
అతడి మాటలకి సావిత్రి “మాహానుభావా! నాకు శ్రమ ఎందుకుంటుంది? ఎన్ని వరాలు పొందినా పతివ్రతలకి భర్తని ఆశ్రయించి ఉండడంతో సమానంకాదు కదా! ఏకైక ధర్మం భర్త అండే కదా!
ఇంకా చెప్తాను విను. ధర్మాన్ని నిర్వహించే మహానుభావులు చాలా అరుదుగా కనిపిస్తారు. అటువంటి వాళ్లతో కలిసి ఉండడం వల్ల సమస్త పాపాలు పోతాయి. వాళ్లు జంగంతీర్థాలతోను, పుణ్యతీర్థాలతోను సమానమైనవాళ్లు. ఆత్మధర్మనిరతులైన మహానుభావుల గొప్పతనం వల్లే కదా ఈ సృష్టి ప్రశాంతంగా నడుస్తోంది.
అటువంటి వాళ్ల గొప్పతనం వల్లే సూర్యచంద్రులు గతులు తప్పకుండా తిరుగుతున్నారు. సర్వసముద్రాలు పరిథి దాటకుండా నిలబడి ఉన్నాయి. కులపర్వతాలు కదలకుండా ఠీవిగా ఉన్నాయి. సమస్త ప్రాణుల్ని భరిస్తున్న భూమి గౌరవాన్ని పొందుతోంది” అని చెప్పింది.
సావిత్రి యమధర్మరాజుతో ఇంకా మాట్లాడుతూ “ఏడు మాటలు మాట్లాడితే ఎటువంటివాళ్లైనా బంధువులు అవుతారు అని పెద్దలు చెప్తారు. మనం చాలాసేపు మాట్లాడుకున్నాం. కనుక, నేను ఈవిధంగా నీకు బంధువునయ్యాను. కాబట్టి మిత్రుల కోరిక తీర్చడం తప్పనిసరిగా నెరవేర్చవలసిన ధర్మం. నన్ను అనుగ్రహించు” అని యముడికి సావిత్రి విన్నవించుకుంది.
మహానుభావుడైన యముడు సావిత్రిని చూసి “ఇప్పుడు నువ్వు నీకు ఇష్టం వచ్చిన వరాన్ని కోరుకో!” అన్నాడు.
సావిత్రి యమధర్మరాజుతో “ఇంతవరకు నా భర్త ప్రాణాలు తప్పించి తక్కిన వరాలు మాత్రమే కోరుకోమన్నావు. ఇప్పుడు ఆ అవసరం లేకుండా ఇష్టం వచ్చిన వరం కోరుకోమని అడిగావు. మహాప్రసాదంగా నాకు కావలిసిన వరాన్ని కోరుకుంటాను.
యమధర్మరాజా! భర్త ఎడబాటు భార్యకి భరించలేని ఆవేదన కలిగిస్తుంది. భర్త మరణించిన స్త్రీ అన్ని శుభకార్యాలనుంచి వదిలివెయ్యబడుతుంది. కనుక సాటిలేని కీర్తిని పొందినవాడు; సాళ్వభూపతి కొడుకు; సద్గుణాలు కలిగిన నా భర్త బతికేటట్టుగా దయచేసి వరాన్ని ప్రసాదించు” అని ప్రార్థించింది.
యమధర్మరాజు సావిత్రి అడిగినట్టే సత్యవంతుణ్ని బతికించి “సావిత్రీ! ఇదుగో నీకు సంతోషాన్ని కలిగించే నీ భర్త ప్రాణాలు. నీ భర్త సత్యవంతుడు ఇప్పటి నుంచి నాలుగువందల సంవత్సరాలు జీవిస్తాడు.
నూరుమంది కొడుకుల్ని, పేరుప్రతిష్ఠల్ని పొందుతాడు. అనేక యజ్ఞాలు చేసి దేవతలని సంతోషపెడతాడు. తన వంశంలో గొప్పవాడవుతాడు” అని చెప్పి యమధర్మరాజు అంతర్ధానమయ్యాడు.
సావిత్రి అడవికి తిరిగి వచ్చి తన భర్త తల తొడమీద పెట్టుకుని యథాప్రకారం కూర్చుంది. కొంతసేపటికి సత్యవంతుడు లేచి సావిత్రిని చూసి “సావిత్రీ! నేను చాలాసేపు నిద్రపోయాను. నువ్వయినా లేపాలి కదా! ఎవరో ఒక బలవంతుడు నన్ను పట్టుకుని లాగినట్టు అనిపించింది. అది కల అని నేననుకోవడం లేదు. నిజంగానే జరిగినట్టు అనిపిస్తోంది. నాకు చాలా భయం వేసింది” అన్నాడు.
సావిత్రి “రాజకుమారా! జరిగినదంతా రేపు మాట్లాడుకుందాము. అన్నివైపులా చీకటి కమ్ముకుంది. రాత్రివేళ అడవిలో ఇంకా ఉండడం మంచిది కాదు. ఇది రాక్షసులు తిరిగే సమయం. నక్క కూతలు వింటుంటే నాకు వణుకు పుడుతోంది. ఇప్పటికే ఆలస్యం అవడం వల్ల నీ తల్లితండ్రులు ఆందోళనపడతారు. ఇంటికి వెళ్లి, వాళ్లకి సంతోషాన్ని కలిగించాలి” అని చెప్పింది.
ఆశ్రమానికి చేరిన సావిత్రీసత్యవంతులు
అప్పటికి సత్యవంతడు ప్రశాంతంగా లేకపోవడం చూసి సావిత్రి “చుట్టూ చీకటి అలుముకుంది. ఇక్కడికి మన ఆశ్రమం చాలా దూరం. మనసులో ప్రశాంతంగా లేకపొతే ఈ రాత్రికి ఇక్కడే గడిపి రేపు ఉదయాన్నే వెళ్లవచ్చుకదా! మీ ఆలోచన ఏమిటి?” అని అడిగింది.
సావిత్రి అడిగినదానికి సత్యవంతుడు “ఇప్పుడు నా తలనొప్పి పూర్తిగా తగ్గింది. నా శరీరానికి బలం వచ్చింది. నెమ్మదిగా నడిచి రాగలను. నా తల్లితండ్రుల్ని చూడకుండా ఈ అడవిలో ఉండలేను. ఇంతకు ముందు నేనెప్పుడూ నా తల్లితండ్రుల్ని వదిలి ఇంతసేపు ఉండలేదు. ఇప్పుడు ఆలస్యం జరగడం వల్ల వాళ్లు ఆవేదన పడుతూ ఉంటారు.
ఎలా ఉన్నారో? సాయంకాలం మా అమ్మ నన్ను ఎటూ వెళ్లనివ్వదు. ఈ రోజు ఈ అడవిలో రాత్రిపూట ఆలస్యం చెయ్యడం వల్ల ఎంత బాధ పడుతోందో? నన్ను కౌగలించుకుని నా తల వాసన చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటూ “నాయనా! మా శరీరాల్లో పంచప్రాణాలు నువ్వే! మా సరిసంపదలు నువ్వే! కళ్లు లేని మాకు కళ్లు, కాళ్లు కూడ నువ్వే” అని ప్రతిరోజు నా కోసం బాధపడుతూ ఉంటారు.
ఇంత ఆలస్యమయినందుకు ఎంత బాధ పడుతున్నారో? అరణ్యానికి వచ్చి కావలసిన వస్తువులు తీసుకుని వెళ్లిపోయి ఉంటే బాగుండేది. విధివశంతో ఇక్కడ చిక్కుపడిపోయాను. నా తల్లితండ్రులు బాధతో ఇప్పటకే ప్రాణాలు వదిలిపెట్టి ఉంటారు. ఇప్పుడు నేను ఆశ్రమానికి వెళ్లినా ప్రయోజనం ఏముంటుంది? ఇక్కడే ప్రాణాలు వదిలిపెడతాను” అని ఏడుస్తున్న సత్యవంతుణ్ని ఓదార్చి లేవతీసింది సావిత్రి.
నెమ్మదిగా నడుస్తూ బయలదేరారు. పండ్ల బుట్టని మొయ్యలేక అక్కడే ఒక చెట్టుకు వేలాడదీసి గండ్ర గొడ్డలి పట్టుకుని బయలుదేరారు. వాళ్లు ఆశ్రమం చేరే సమయానికి ద్యుమత్సేనుడికి గుడ్డితనం పోయి దృష్టి వచ్చింది. కాని తన ఆత్మకు కన్నులా ఉండే సత్యవంతుడు కనిపించలేదు. కళ్లు కనిపించినా ఆ కళ్లకి కనిపించని కొడుకు కోసం దంపతులిద్దరూ దుఃఖిస్తున్నారు.
ద్యుమత్సేనుడు తన కొడుకు గుణగణాలన్నీ చెప్పుకుంటూ అడవిలో అతణ్ని వెతుక్కుంటూ తిరుగుతున్నాడు. మహర్షులందర్నీ పేరుపేరునా కొడుకు సత్యవంతుడు కనిపించాడా అని అడుగుతూ తిరుగుతున్నాడు.
అక్కడ నివసిస్తున్న ఋషులు ద్యుమత్సేనుడికి దృష్టి రావడం చూసి ఆశ్చర్యపోయారు. అతణ్ని అందరూ కలిసి ఓదారుస్తున్నారు. చాలాసేపు గడిచాక సావిత్రితో కలిసి సత్యవంతడు ఆశ్రమానికి చేరుకున్నాడు.
కొడుకుని చూసి తల్లితండ్రులు ఆనందంతో అతణ్ని కౌగలించుకున్నారు. రాజర్షి “నాయనా! అరణ్యంలో ఇంత ఆలస్యం ఎందుకయింది?” అని అడిగాడు. సత్యవంతుడు జరిగనది చెప్పాడు.
తరువాత సావిత్రి “మహారాజా! సత్యవంతుడికి ఈ రోజు మరణం ఉందని నారదమహర్షి చెప్పాడు. ఆ మహర్షి మాటలు తప్పకుండా జరుగుతాయి. నేను అందుకే ఈ రోజు సత్యవంతుణ్ని వదలకుండా అతడితో కలిసి అడవికి వెళ్లాను. సత్యవంతుడు అలసటతో నిద్రపోతున్న సమయంలో యమధర్మరాజు వచ్చి ఇతడి ప్రాణాలు తీసుకుని వెడుతుంటే నేను యముడిని వెంబడించాను.
సత్యము, ధర్మము కలిసి ఉండేలా అతణ్ని ప్రస్తుతించాను. ఆయన సంతోషపడి నాలుగు వరాలు ప్రసాదించాడు. వాటిలో ఒక వరం వల్ల సత్యవంతుడు తిరిగి బతికాడు. ఇంకొకవరం మీకు చూపు రావడం, పోయిన రాజ్యం మీ చేతికి రావడం, నా తల్లితండ్రులకి నూరుగురు కొడుకులు కలగడం” అని చెప్పింది.
ఆ దంపతులు అనందంగా సావిత్రితో “సావిత్రీ! నీ జీవిత చరిత్ర చాలా గొప్పది. మా సంసార సముద్రానికి తెప్పలా వచ్చి మమ్మల్ని కాపాడావు” అన్నారు. అక్కడికి వచ్చిన మహర్షులందరు సావిత్రిని పొగిడి వాళ్లని ఆశీర్వదించి తమ ఇళ్లకి వెళ్లారు.
కొన్నాళ్లకి సాళ్వరాజు నగర అంతరంగికులైన మంత్రులు, ప్రధాన సేవకులు, పురజనులు, పెద్దలు అందరు కలిసి ద్యుమత్సేనుడి దగ్గరికి వచ్చారు. “మహారాజా! ఆత్మీయులు పన్నిన కుట్ర వల్ల తన చుట్టాలు సన్నిహితులతో సహా నీ శత్రువు మరణించాడు. ప్రజలందరు ఏకగ్రీవంగా నిన్ను పట్టాభిషిక్తుణ్ని చెయ్యాలని ఇక్కడికి వచ్చారు.
నువ్వు విజయాన్ని సాధించినట్టు రాజ్యమంతటా చాటింపు వేయించడం జరిగింది. పట్టపుటేనుగునెక్కి రాజధానికి బయలుదేరు. నీ తపశ్శక్తి చాలా గొప్పది. దానివల్ల నీకు దృష్టి వచ్చింది. నిన్ను మళ్లీ చూడగలగడం మా అదృష్టం” అన్నారు.
ద్యుమత్సేనుడు ఆశ్రమంలో ఉన్న ఋషులకి వాళ్ల పరివారానికి చెప్పి సత్యవంతుడితో సహా ఏనుగునెక్కి చతురంగబలాలతో ప్రయాణం చేసి రాజధాని నగరానికి చేరుకున్నాడు.
సత్యవంతుడు యువరాజయ్యాడు. ద్యుమత్సేనుడు గొప్ప ఐశ్వర్యవంతుడయ్యాడు.
మార్కండేయమహర్షి ధర్మరాజుతో “తనతోసహా తన భర్తని, అత్తమామల్ని, తల్లితండ్రుల్ని, సమస్తాన్ని ఉద్ధరించిన సావిత్రి కథ విన్నావు కదా! పతివ్రత అయిన సావిత్రిలా ద్రౌపది కూడా గొప్ప శుభాల్ని కలిగించి మీ వంశాన్ని ఉద్ధరిస్తుంది. అటువంటి అదృష్టం మీకు కలుగుతుంది” అని సావిత్రి కథని చెప్పి మార్కండేయమహర్షి ప్రేమతో పాండవుల దగ్గర సెలవు తీసుకుని తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు.