[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
సావిత్రికి వరుడి ఎంపిక
తరువాత ధర్మరాజు మార్కండేయమహర్షికి నమస్కరించి “మహర్షీ! పతిభక్తితో ఎన్నో కష్టాలు పడి చివరికి శుభాన్ని పొందిన పుణ్యవతి చరిత్ర వినాలని ఉంది” అని అడిగాడు.
మార్కండేయ మహర్షి ధర్మరాజు కోరిక విని “ధర్మరాజా! నువ్వు అడిగినదానికి సరిపోయేలా ఉండే సావిత్రి కథ చెప్తాను విను.
మద్రదేశపు మహారాజు అశ్వపతి చాలా గొప్పవాడు. ఆయన పిల్లల కోసం పద్ధెనిమిది సంవత్సరాలు అతి నిష్ఠతో సావిత్రీదేవిని ఉపాసించాడు. రాజుకి సావిత్రీదేవి ప్రత్యక్షమైంది. అతడు భక్తితో కొడుకుని ప్రసాదించమని ప్రార్థించాడు.
ఆ లోకమాత “రాజా! నీకు కూతురు కలుగుతుంది” అని చెప్పింది.
అది విని అశ్వపతి “అమ్మా! నువ్వు కనిపించావు. నాకు కావలసింది అడగమన్నావు. నా కోరిక తీర్చాలి కదా?” అన్నాడు.
సావిత్రీదేవి “రాజా! నీ కోరిక ముందే తెలిసిన నేను బ్రహ్మదేవుడిని సంప్రదించాను. ఆయన నీకు కూతురు కలుగుతుందని చెప్పాడు. ఆయన మాటకి తిరుగులేదు. మొదట నీకు కూతురు కలిగినా కొన్ని కారణల వల్ల తరువాత నీకు నూరుగురు కొడుకులు కలుగుతారు” అని చెప్పి అంతర్థానమయింది.
కొన్నాళ్లకి అశ్వపతికి భార్య మాళవిక యందు సావిత్రి అనే కూతురు కలిగింది. ఆమెని ఎంతో గారాబంతో పెంచారు. సావిత్రి పెరిగి దేవకన్యలు, సిద్ధ, సాధ్య, యక్ష కన్యలకంటే అందంగా ఉంది. అశ్వపతి కూతుర్ని అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఇంత సౌందర్యవతికి మంచి గుణగణాలు, వయస్సు, రూపము సరిపడే వరుణ్ని ఎక్కడినుంచి ఎలా తీసుకునిరాగలను అనుకుని వెతుకుతూనే ఉన్నాడు.
సావిత్రి సాళ్వదేశపురాజు ద్యుమత్సేనుడి కొడుకు గురించి వింది. కాని, సిగ్గు వల్ల ఎవరికీ చెప్పలేదు. ఒకరోజు నారదుడు మద్రదేశం వచ్చి మహారాజు అశ్వపతిని కలిశాడు, అశ్వపతి నారదుడిని సకలమర్యాదలతో పూజించాడు. ఇద్దరూ అనేక విషయాల గురించి మాట్లాడుకున్నారు.
రాజపుత్రిక సావిత్రి సిరిసంపదంతా కలిసి మూర్తీభవించినట్టు అమితమైన సౌందర్యంతో వెలిగిపోతూ చెలికత్తెలతో కలిసి అక్కడికి వచ్చింది. చెలికత్తెల్ని దూరంలోనే ఆపి సావిత్రి తండ్రి దగ్గరికి వచ్చి నమస్కరించింది. అశ్వపతి తన ముద్దులకుమార్తెని ఎత్తుకుని ఒళ్లో కూర్చోబెట్టుకుని తన్మయత్వంతో చూస్తున్నాడు.
తండ్రికి సావిత్రి చిన్నపిల్లగా కనిపించింది. నారదుడికి సంపూర్ణ యౌవనంతో తొణికిసలాడుతున్న సౌందర్యవతిగా కనిపించింది. నారదుడు అశ్వపతిని అమె వివాహం గురించి అడిగాడు.
అశ్వపతి కూతురివైపు చూసి “అమ్మా! నారదమహర్షి మాటలు విన్నావు కదా? నీ అందచందాలకి, గుణగణాలకి, ప్రవర్తనకి తగినట్టు ఉండే పెళ్లికొడుకుని నువ్వే ఎంచుకో.. నీ ఇష్టమే నా ఇష్టం” అన్నాడు.
తండ్రి మాటలు విని సావిత్రి సిగ్గుపడుతూ “తండ్రీ! తరగని కీర్తిని పొందిన సాళ్వదేశ రాజకుమారుడు సత్యవంతుడు నాకు తగిన వరుడు. నన్ను అతడికి ఇచ్చి పెళ్లిచేయండి. సాళ్వదేశపు రాజు విధివశం వల్ల కళ్లు పోగొట్టుకున్నాడు. శత్రువులు అతడి రాజ్యాన్ని ఆక్రమించారు. అతడు భార్యాపిల్లలతో అడవిలో నివసిస్తున్నాడు. అయినా నేను సత్యవంతుడినే పెళ్లిచేసుకుంటాను” అంది.
అది విని అశ్వపతి నారదుడితో “మహర్షీ! అతిలోకపూజ్యులు మీరు. సత్యవంతుడు ఎలాటివాడు. అతడి గుణాలు, రూపం, నడవడికల గురించి చెప్పండి” అని అడిగాడు.
నారదుడు “మహారాజా! సత్యవంతుడు పేరుకు తగినవాడు. అతడికి చిత్రాశ్వుడు అని మరొక పేరు కూడా ఉంది. అతడు తేజస్సులో సూర్యుడిని, తెలివితేటల్లో ఇంద్రుడి గురువైన బృహస్పతిని, ఓర్పులో భూదేవిని, కాంతిలో చంద్రుడిని అందచందాలలో అశ్వినీదేవతల్ని తలపిస్తాడు.
తపస్సు, అంతరేంద్రియ నిగ్రహం, బాహ్యేంద్రియ నిగ్రహం, త్యాగబుద్ధి, పరోపకారబుద్ధి, బ్రాహ్మణభక్తి, మంచి వ్యక్తిత్వం అన్నీ సత్యవంతుడిలోనే కనిపిస్తాయి. సత్యవంతుడిలో ఒక లోపం ఉంది. అతడికి పెళ్లయ్యాక ఒక సంవత్సరానికి మరణిస్తాడు. ఇది కూడ నీకు చెప్పవలసిన విషయం కనుక చెప్పాను” అన్నాడు.
నారదుడు చెప్పిన విషయాలు విని అశ్వపతి కూతురితో “అమ్మా! నారదుడు త్రిలోక సంచారి మాత్రమే కాదు. మూడు కాలాలు తెలిసినవాడు. దేవతలకి మాత్రమే తెలిసిన విషయాలన్నీ ఈ మహానుభావుడికి తెలుసు. ఈయన మాటలకి తిరుగులేదు. నీకు ఇటువంటి వరుడు ఎందుకు? వేరే ఎవరినైనా ఎంచుకోవచ్చు కదా!” అన్నాడు.
సావిత్రి “తండ్రీ! మనస్సు, వాక్కు, శరీరం – ఈ త్రికరణాలలో మనసు ప్రధానమైంది. కాబట్టి మనసారా కోరుకున్న వరుడిని కాదనడం మంచిది కాదు. సత్యవంతుడు ఎలాంటి వాడైనా నేను సత్యవంతుడినే వరిస్తున్నాను” అని చెప్పింది.
అశ్వపతి నారదుడి వైపు చూశాడు. నారదుడు “నీ కూతురి మనస్సుని మరలించడం సాధ్యం కాదు. ఎటువంటి ఆలోచనలు చెయ్యకుండా నీ కూతురిని సత్యవంతుడికి ఇచ్చి పెళ్లి జరిపించు. నీ కూతురు చేసుకున్న పుణ్యం వల్ల సంత్యవంతుడికి పూర్తి ఆయుర్దాయం కలగవచ్చు” అన్నాడు.
అశ్వపతి నారదుడికి నమస్కరించి “మహర్షీ! నువ్వే మాకు ఉత్తమ గురువు. నువ్వు చెప్పినట్టే చేస్తాను” అన్నాడు. నారదుడు సావిత్రిని దీవించి స్వర్గలోకానికి వెళ్లిపోయాడు.
సావిత్రి సత్యవంతుల వివాహము
ఒక మంచిరోజు అశ్వపతిమహారాజు చుట్టాలు, మంత్రులు, పెద్దలు పురోహితులు వెంట రాగా సావిత్రిని తీసుకుని పెళ్లికి కావలసిన సంభారాలన్నీ సమకూర్చుకుని ధర్మారణ్యంలో తపస్సు చేసుకుంటున్న ద్యుమత్సేన మహారాజు దగ్గరికి వెళ్లాడు. ద్యుమత్సేనుడు అశ్వపతిమహారాజుకి ఎదురువెళ్లి స్వాగతం చెప్పి అర్ఘ్యపాద్యాలతో సత్కరించి వచ్చిన కారణం అడిగాడు.
అశ్వపతి సాళ్వరాజుతో “ద్యుమత్సేన మహారాజా! ఈమె నా ప్రియమైన కూతురు సావిత్రి. నా వంశాన్ని తరింపచేసే నావ. ఈమెని దయచేసి నీ కోడలిగా స్వీకరించు. నా కూతురు సావిత్రికి నీ కొడుకు సత్యవంతుడు; నీ కొడుకు సత్యవంతుడికి నా కూతురు సావిత్రి సరిపోతారు. ఈడుజోడు కుదిరిన జంట” అన్నాడు.
అశ్వపతి మాటలు విని ద్యుమత్సేనుడు “మహారాజా! మేము రాజ్యం పోగొట్టుకుని భయంకరమైన అడవుల్లో నివసిస్తున్నాము. నీ కూతురు చిన్నపిల్ల, సుకుమారి. మాతో ఈ అడవుల్లో ఉండి కష్టాలు పడుతూ కాపురం చెయ్యగలదా?” అన్నాడు.
అశ్వపతి “ద్యుమత్సేన మహారాజా! సంపద, దారిద్ర్యం, శాశ్వతంగా ఉండవు. సంపద వచ్చినప్పుడు పొంగిపోవడం, దారిద్ర్యం వచ్చినప్పుడు కుంగిపోవడం ధైర్యవంతుల లక్షణం కాదు. నా కూతురు చిన్నపిల్లే అయినా ధైర్యవంతురాలు. నేను నీతో వియ్యమందాలన్న కొరికతో వచ్చాను. దయచేసి అంగీకరించు” అన్నాడు.
అశ్వపతి చెప్పిన మాటలు విని ద్యుమత్సేనుడు సంతోషంతో అంగీకరించాడు. ఆశ్రమవాసులైన ఋషులు శుభముహూర్తం నిర్ణయించారు. సావిత్రి సత్యవంతులకి పెళ్లి జరిగిపోయింది. అశ్వపతి తన కూతురికి, అల్లుడికి పెళ్లి కానుకలు, వస్త్రాలు, ఆభరణాలు మొదలైన వస్తువులు ఇచ్చి తన రాజధానికి వెళ్లిపోయాడు.
తరువాత సావిత్రి అందమైన వస్త్రాలు ఆభరణాలు వదిలిపెట్టి అడవిలో ఆశ్రమానికి తగినట్టు నారచీరలు ధరించి భర్తకి సపర్యలు చేస్తూ ఉండిపోయింది.
సావిత్రి చేసే పరిచర్యలు, మంచి నడవడిక, ప్రియమైన మాటలతో అత్తమామలకి సంతోషాన్ని కలిగించింది. సావిత్రి నారదమహర్షి చెప్పిన ప్రకారం సత్యవంతుడి ఆయువు ఎంత కాలముందో లెక్కపెట్టుకుంటూ గడుపుతుండగా సంవత్సరం గడవడానికి నాలుగు రోజులే మిగిలాయి. గడువు దగ్గరికి వచ్చిందని సావిత్రి మూడురోజుల నిరాహారదీక్ష మొదలుపెట్టింది.
ద్యుమత్సేన మహారాజు కోడలితో “తల్లీ! ఇంత కఠోర దీక్ష ఎందుకు చేస్తున్నావు?” అని అడిగాడు.
సావిత్రి “అయ్యా! నా వ్రతాన్ని గురించి విచారించకండి. శుభాలు కలగాలని ఈ నోము మొదలుపెట్టాను. తరువాత మీకే తెలుస్తుంది” అంది. మహారాజు కోడలిని శుభం కలగాలని దీవించాడు.
నాలుగవ రోజు తన భర్త మరణించే రోజని మనస్సులో బాధపడుతూ ఉదయాన్నే లేచి కాలకృత్యాలు పూర్తయ్యాక భర్తకి కావలసినవి సమకూర్చి అత్తమామలకి నమస్కరించి తనకు మాంగల్యబలం కలగాలని ఆశీస్సులు అందుకుంది.
మహారాజు కోడలితో “అమ్మా! నీ వ్రతం పూర్తయింది కనుక ఇంక భోజనం చేయవచ్చు. నువ్వు చాలా అలిసి ఉన్నావు” అన్నాడు.
సావిత్రి ద్యుమత్సేనుడితో “రాజా! సూర్యుడు అస్తమించే వరకు నేను ఈ రోజు కూడా భోజనం చెయ్యకూడదు. ఈ వ్రతాన్ని మొదలుపెట్టడానికి ముందే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను” అని చెప్పింది.
సత్యవంతుడితో అడవికి వెళ్లిన సావిత్రి
సత్యవంతుడు సమిధలు, దర్భలు, పళ్లు తీసుకుని రావడానికి అడవికి బయలుదేరాడు. సావిత్రి అడవికి తను కూడ వస్తానని చెప్పింది. సత్యవంతుడు సావిత్రి ఉపవాసాల వల్ల అలిసి ఉంది కనుక తనతో రావడానికి అంగీకరించలేదు.
సావిత్రి సత్యవంతుడితో “నిరాహారదీక్ష వల్ల కలిగిన బడలిక నా మనస్సులో ఏమాత్రం కనిపించడం లేదు. ఈ అడవి అందమైన చెట్లతోను లతలతోను నిండి అందంగా ఉంటుందని విన్నాను. చూడాలని మనసు ఉవ్విళ్లూరుతోంది. నన్ను కూడా ఒకసారి తీసుకుని వెళ్లవచ్చు కదా!” అని అడిగింది.
సత్యవంతుడు అంగీకరించాడు. సావిత్రి తన భర్తతో కలిసి అడవికి వెడుతున్నానని అంగీకరించమని చెప్పి అత్తమామలకి నమస్కారం చేసి ఆశీస్సులు అందుకుని సత్యవంతుడి వెంట బయలుదేరింది.
మనస్సులో చెలరేగుతున్న విచారాన్ని ముఖంలో పైకి కనిపించకుండా అణుచుకుంటూ సత్యవంతుడికి ఉల్లాసం కలిగిస్తూ సుకుమారి అయిన సావిత్రి సత్యవంతుడితో కలిసి అడవిలోకి వెళ్లింది. అడవిలో ఉన్న అందాలన్నీ ఒక్కొక్కటిగా వర్ణించి చెప్తున్నాడు సత్యవంతుడు.
సావిత్రి అతడు చెప్తున్న మాటలు వింటూ, అతడు చూపిస్తున్న విశేషాలు చూస్తూ అతడికి బదులు చెప్తూనే అతణ్ని పరిశీలనగా చూస్తోంది. సత్యవంతుడు తియ్యటి పండ్లు కోసి బుట్టనిండ నింపాడు. తరువాత గొడ్డలితో కట్టెలు నరుకుతూ అలిసిపోయి గొడ్డల్ని నేలమీద పడేశాడు.
సావిత్రి వైపు చూసి “సావిత్రీ! నా శరీరం స్వాధీనం తప్పింది. మనస్సు భ్రమిస్తున్నట్టు తూలుతోంది. బాణాలతోను, బల్లేలతోను పొడిచినట్టు తల పోటు వస్తోంది. కొంచెంసేపు కూడా నిలబడలేను. విశ్రాంతి తీసుకుంటాను. అలసట తీరేవరకు పడుకుంటాను” అన్నాడు.
సావిత్రి వెంటనే సత్యవంతుడి తల తన తొడమీద పెట్టుకుని కూర్చుంది. రాజకుమారుడు సత్యవంతుడు చైతన్యం లేనివాడుగా అయిపోయాడు.
కొంతసేపటికి సావిత్రికి ఎదురుగా నల్లని మబ్బులా కాటుక నలుపుతో, భయంకరంగా వెలుపలికి వచ్చిన పదునైన కోరలతో, నెత్తురు రంగు కలిగి మిలమిలా మెరుస్తున్న కళ్లతో, తళతళలాడే బంగారు రంగు బట్టలు ధరించి, ప్రళయకాలంలో మండే అగ్నిజ్వాలలా ఉన్నవాడు; లోకంలో ప్రజలకి భయం కలిగించేవాడు; తన చేతిలో ఉన్న పాశాయుధాన్ని నేర్పుగా తిప్పుతున్న దివ్యపురుషుడు సత్యవంతుడి దగ్గరికి వస్తూ కనిపించాడు.