Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-119: సముద్రుడిని ప్రార్థించిన శ్రీరాముడు

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

సముద్రుడిని ప్రార్థించిన శ్రీరాముడు

శరథుడి పెద్దకొడుకు శ్రీరాముడు, అతడి తమ్ముడు లక్ష్మణుడు నిరాహార దీక్ష తీసుకుని సముద్రుడిని ఆరాధించారు. శ్రీరామలక్షమణుల దీక్షకి మెచ్చి సముద్రుడు జలచర పరివారంతో కలిసి ప్రత్యక్షమై “ఆర్యా! నీ దీక్షకి సంతోషించాను. నీకు ఏం కావాలో అడుగు” అన్నాడు.

శ్రీరాముడు సముద్రుడితో లంకాపట్టణం మీద దండెత్తడానికి దారి ఇమ్మని, లేకపోతే తన బాణాగ్నితో సముద్రజలాలు ఇంకిపోయేలా చేస్తానని చెప్పాడు.

సముద్రుడు “ప్రభువైన శ్రీరామా! నీ పనికి నేను ఎటువంటి అంతరాయం కలిగించను. కాని, నేను చెప్పేది విను. ఇప్పుడు నేను ప్రజలందరికి తెలిసేలా దారి ఇస్తే అందరు దివ్యాస్త్రాలు ప్రయోగించి నన్ను వశం చేసుకోవాలని చూస్తారు. ఇది మంచిది కాదు ఇంతకంటే మంచి ఉపాయం చెప్తాను.

నీ సేనలో ‘నలుడు’ అనే శిల్పకళావేత్త ఉన్నాడు. అతడు విశ్వకర్మ కొడుకు. అతడు నా జలాల్లో చెట్లు, చేమలు, కొండలు వేస్తే నేను భరించగలను. అది మీకు వారధిగా ఉపయోగిస్తుంది. ఆ వారధి మీద నుంచి వెళ్లి శత్రువులని గెలవండి” అని రాముడు అంగీకరించేలా మాట్లాడి వెళ్లాడు.

శ్రీరాముడు నలుడిని పిలిపించి వారధి కట్టడానికి నియోగించాడు. కోతివీరులు నాలుగువైపులకి వెళ్లి చెట్లని, పర్వతశిఖరాల్ని తెచ్చి ఇస్తుండగా నలుడు వంద ఆమడల పొడుగు, పది ఆమడల వెడల్పుగల వారధిని బలంగా ఉండేలా నిర్మించాడు.

ఆ సమయంలో రావణుడి తమ్ముడు విభీషణుడు అన్న మీద కోపగించి తన స్నేహితులతో వచ్చి శ్రీరాముణ్ని శరణు కోరాడు. విభీషణుడిని పరిశీలించి చూసి అతడు ధర్మవేత్త అని నిశ్చయించుకుని శ్రీరాముడు అతడికి అభయమిచ్చాడు. విభీషణుడికి రావణుడి సామ్రాజ్య సంపద మొత్తం కట్టబెడతానని శపథం చేశాడు.

విభీషణుడుకి లక్ష్మణుడికి స్నేహం కలిగించాడు. విభీషణుడు మార్గం చూపిస్తుంటే వారధి మీదుగా సముద్రాన్ని దాటారు. త్రికూటపర్వతం ఎక్కి వానరసేనలకి విడుదులు కట్టించమని ఆజ్ఞాపించాడు.

వానరసైన్యాలు లంకాపట్టణం చుట్టూ ఉన్న అడవుల్లో శిబిరాలు నిర్మించుకున్నాయి. ఆ అడవిలో తాడిచెట్లు ఏలకుల తీగలు, మద్దిచెట్లు, తియ్యమామిడిచెట్లు, చీకటిచెట్లు, వేలచెట్లు, నేరేడు, నిమ్మచెట్లు అందంగా ఎదిగి ఉన్నాయి.

‘శుకసారణులు’ అనే రావణుడి గూఢచారులు వానరసైన్యంలో వానరులుగా రూపం మార్చుకుని తిరుగుతున్నారు. విభీషణుడు వాళ్లని గుర్తించి రాముడికి అప్పగించాడు. వాళ్లకి శ్రీరాముడు ముందు తమ సైన్యాన్ని చూపించమని చెప్పి తరువాత బంధవిముక్తుల్ని చేసి పంపించాడు.

శుకసారణులు రావణుడి దగ్గరికి వెళ్లి రామలక్ష్మణుడు అతిలోక వీరులు, గొప్ప తేజస్సు కలవాళ్లు అని చెప్పారు. రావణుడు వాళ్ల మాటలు పట్టించుకోకుండా యుద్ధసన్నాహాల్లో మునిగిపోయాడు.

బలవంతుడైన రావణుడు లంకాపట్టణానికి అధికమైన రక్షణ కల్పించాడు. అన్ని వస్తువులు సమృద్ధిగా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాడు. లంకాపట్టణానికి రావణుడు రక్షణ కల్పిస్తున్నాడు.

శ్రీరాముడు వారథి దగ్గర సుగ్రీవుడితో కలిసి కూర్చుని వానరయువరాజు అంగదుడిని పిలిచి “అంగదా! నువ్వు రావణుడి దగ్గరికి రాయబారిగా వెళ్లి అతడికి సీతని వదిలి పెట్టడం మంచిదని అర్థమయ్యేలా చెప్పు. నువ్వు రావణుడితో సమయానుకూలంగా మాట్లాడు” అని చెప్పి పంపించాడు.

లంకానగరాన్ని ముట్టడించిన కపిసేన

శ్రీరాముడు చెప్పినట్టు చెయ్యడానికి అంగదుడు ఉత్సాహంగా లంకాపట్టణంలోకి ప్రవేశించాడు. దేదీప్యమానంగా వెలిగిపోతున్న అతడి తేజస్సు చూసి రాక్షసులు భయపడ్డారు. రావణుడు స్నేహితులతో కలిసి కూర్చున్నాడు.

అంగదుడు అక్కడికి వెళ్లి ధ్యైర్యంగా “సూర్యవంశంలో పుట్టిన రాజుల్లో గొప్పవాడు, విలువిద్యలో ఆరితేరినవాడు శ్రీరాముడు నీతో చెప్పమన్న మాటలు వివరంగా చెప్తాను సావధానంగా విను.

రావణా! మహానుభావులు, నిర్దోషులు, సాత్వికులు అడవుల్లో తపస్సు చేసుకుంటున్న ఋషుల్ని చంపావు. పతివ్రతలైన దేవతాస్త్రీలని బంధించి అన్ని లోకాలకి అపచారం చేశావు. నువ్వు చేసిన అపరాధాలన్నీ ఒక ఎత్తు. నాకు చేసిన అపచారం నీకు తెలుసు. పరాక్రం ఉంది అనుకుంటే నాతో యుద్ధం చెయ్యి.. లేదనుకుంటే నన్ను శరణు కోరుకుని, సీతని నాకు అప్పగించు” అని చెప్పాడు.

అంగదుడి మాటలకి రావణుడికి కోపం వచ్చింది. అతణ్ని చుట్టుముట్టి బంధించాలని అనుకుంటుండగా వేగంగా మేడపైభాగానికి దూకి అక్కడనుంచి ఆకాశంపైకి లంఘించి వానరశిబిరాల మధ్యకి దూకాడు. శ్రీరాముడికి జరిగిన విషయం చెప్పాడు.

బలపరాక్రమాలు కలిగిన వానరసేనలు నినాదాలు చేస్తూ ఒక క్రమ పద్ధతిలో వరుసల్లో కదులుతుంటే సముద్రంపు అలల్లా కనిపించారు. కపిసేన లంకాపట్టణం కోటముందు యుద్ధానికి సిద్ధంగా ఉన్న రాక్షసుల్నిఅడ్డగించి, కోటని కూలతోసి, జెండాలు, గోపురాలు మేడలు ధ్వంసం చేశారు.

ప్రాకారం మీద ఉన్న ఆయుధాలు- గదలు, ఇనుపకట్ల గుదియలు, ఈటెలు, అన్నింటినీ నగరంలోకి విసిరేశారు. పౌరుల రోదనలు విని రావణుడు కోట్లకొద్దీ రాక్షస వీరుల్ని పంపించాడు.

వానరులతో చుట్టుముట్టబడిన లంకానగరం గోరోజనం రంగుతో కనిపించి రాక్షసులు ఆక్రమించగానే మబ్బురంగులో కనిపించింది. వానరులు వెనక్కి తిరిగి రావడంతో మహావీరులైన రామలక్ష్మణులు యుద్ధానికి ఉపక్రమించారు.

రావణుడు బలవంతులైన పర్వతుడు, ప్రఘసుడు, ఖరుడు, క్రోధవశుడు, ప్రరుజుడు అయిదుగురు రాక్షసవీరుల్ని పంపించాడు. వాళ్లు అనేకమంది రాక్షసుల్ని, భూతాల్ని వెంటబెట్టుకుని వచ్చి మయాయుద్ధంతో వానరుల్ని హింసించారు. గొప్ప పరాక్రమం కలవాడు, మయాయుద్ధం తెలిసిన విభీషణుడు కోపంతో వాళ్లని సంహరించాడు.

మిగిలిన రాక్షస సైన్యం యుద్ధభూమి నుంచి పారిపోయింది. రావణుడు మంత్రులతోను భయంకరమైన సైన్యంతోను, శుక్రుడు, బృహస్పతి చెప్పినట్టుగా యుద్ధానికి బయలుదేరి వానరసేనని అడ్డగించాడు.

యుద్ధంలో రాముడు రావణుడిని, లక్ష్మణుడు ఇంద్రజిత్తుని, విభీషణుడు విరూపాక్షుణ్ని, తారుడు నిఖర్వటుడిని ఎదుర్కున్నారు. రెండు పక్షాలవాళ్లు భయంకరంగా యుద్ధం చేస్తున్నారు. రావణుడు తన బాహుబలంతో శ్రీరాముడి పరాక్రమాన్ని ఆపడం కష్టమని తెలుసుకుని లంకానగరానికి వెళ్లిపోయాడు.

రాక్షసవీరులు భయంతో వెనక్కి వెళ్లిపోతుంటే వాళ్లని ఆపి వీరుడైన ప్రహస్తుడు యుద్ధం మొదలుపెట్టాడు. విభీషణుడు ప్రహస్తుడితో భీకరంగా పొరాడుతున్నారు. చివరికి విభీషణుడు శక్తి అనే ఆయుధంతో ప్రహస్తుణ్ని సంహరించాడు.

రాక్షస సేనల్ని ఉత్సాహపరుస్తూ రాక్షసవీరుడు ధూమ్రాక్షుడు ముందుకొచ్చాడు. హనుమంతుడు ముందుకొచ్చి ధూమ్రాక్షుణ్ని ఎదుర్కున్నాడు. రెండు సేనలమధ్య యుద్ధం భయంకరంగా సాగింది. రాక్షససేనల ధాటికి వానరసేన తట్టుకోలేకపోయింది.

అది చూసి హనుమంతుడు విజృంభించి ధూమ్రాక్షుడి మీదకి దూకాడు. పూర్వం ప్రహ్లాదుడికీ దేవేంద్రుడికీ మధ్య జరిగిన యుద్ధంలా ఘోరయుద్ధం జరిగింది. చివరికి ద్వంద్వయుద్ధంలోకి దిగారు. హనుమంతుడు ధూమ్రాక్షుణ్ని పట్టుకుని ఒక పెద్ద చెట్టుకి వేసి కొట్టాడు. ధూమ్రాక్షుడు చచ్చిపోయాడు.

యుద్ధంలో మరణించిన కుంభకర్ణుడు

రావణుడికి విషయం తెలిసి ఉన్నవాళ్లందరు చచ్చిపోయారు; కుంభకర్ణుడు ఉన్నా కూడా లేనివాడుగా నిద్రలో ఉన్నాడు; అతడిని లేపాలి అనుకున్నాడు. అనేక వ్యయప్రయాసలతో కుంభకర్ణుణ్ని నిద్ర లేపారు. రావణాసురుడు అప్పటి వరకు జరిగిన సంగతుల్నికుంభకర్ణుడికి చెప్పాడు.

శ్రీరాముడితో యుద్ధం చెయ్యగలవాళ్లు అతడు తప్ప వేరెవరు లేరని; దూషణుడి తమ్ముళ్లు వజ్రవేగుడు, ప్రమాథుడు తోడుగా ఉంటారని చెప్పి యుద్ధానికి పంపించాడు. కుంభకర్ణుడు కావలసిన ఆయుధాలు తీసుకుని రణభూమికి వెళ్లాడు.

వానరయోధులు కుంబకర్ణుడిని చూసి ఆశ్చర్యపోయారు. వికారమైన రూపంతో కార్చిచ్చులా ఎర్రగా ఉన్న మబ్బురంగు శరీరంతో; కోపంతో నిప్పులు కక్కుతున్న కళ్లతో; పటపట కొరుకుతూ నెత్తురు కారుతున్న పెదవులతో; పొడవైన చేతులు చాపి చాలా ప్రదేశాన్ని ఆక్రమిస్తూ నడుస్తున్నాడు. అతడి కాళ్ల బరువుకి భూమి కుంగిపోతోంది. కుంభకర్ణుడు వానరసేనని లెక్కచెయ్యకుండా రామలక్షణులవైపు నడుస్తున్నాడు.

వానరమూక పెద్ద పెద్దరాళ్లని, కొమ్మల్ని కుంభకర్ణుడి మీదకి వేసి గోళ్లతో గీకి బాధలు పెడుతున్నారు. కుంభకర్ణుడు అవేమీ పట్టించుకోకుండా దొరికిన సైన్యాన్ని దొరికినట్టు మింగేస్తున్నాడు. బలుడు, చండబలుడు, వజ్రబాహుడు మొదలైన సేనాధిపతులు అనేక వానరవీరుల్ని కుంభకర్ణుడు తినేశాడు.

అది చూసిన సుగ్రీవుడు పెద్ద చేట్టుని పెకిలించి దాంతో కుంభకర్ణుడి తలమీద మోదాడు. ఆ దెబ్బకి నిద్రమత్తు వదిలిన కుంభకర్ణుడు సుగ్రీవుణ్ని పట్టుకున్నాడు. కుంభకర్ణుడి చేతుల్లో చిక్కిన సుగ్రీవుణ్ని చూసి లక్ష్మణుడు బాధపడి కుంబకర్ణుణ్ని బాణంతో కొట్టాడు. కుంభకర్ణుడు సుగ్రీవుణ్ని వదిలి పెద్ద బండరాయి పట్టుకుని లక్షణుడి వైపు వెళ్లాడు.

లక్ష్మణుడు బాణాలతో అతడి చేతులు ఖండించాడు. ఎన్నిసార్లు ఖండించినా మళ్లీ వస్తూనే ఉన్నాయి. చివరికి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించి కుంభకర్ణుణ్ని చంపేశాడు. హనుమంతుడు, లక్ష్మణుడు, నీలుడు చేస్తున్న యుద్ధానికి రాక్షసవీరులు భయపడిపోయారు.

కుంభకర్ణుడు చచ్చిపోయాడన్న వార్త విని రావణుడు దుఃఖపడ్డాడు. అతడి కొడుకు అతి పరాక్రమవంతుడు మేఘనాథుడు వచ్చి ‘శత్రుబలగాన్ని హతమార్చి వస్తాను, రామలక్ష్మణుల్ని బంధించి తెస్తాను రణరంగానికి వెళ్లడానికి అనుమతి ఇమ్మ’ని అడిగాడు.

రావణుడు ఇంద్రజిత్తుణ్ని పొగుడుతూ అంతకు ముందు అతడు చూపించిన సాహసం గురించి చెప్తూ “నాయనా! శత్రువుల్లో ఎవరూ మిగలకుండా అందర్నీ సంహరించి అంతకు ముందు యుద్ధంలో ప్రాణాలు వదిలినవాళ్ల ఋణం తీర్చుకో వెళ్లిరా!” అన్నాడు.

Exit mobile version