Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-118: లక్ష్మణుణ్ని కిష్కింధకి పంపించిన శ్రీరాముడు

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

అరణ్యపర్వము – ఏడవ ఆశ్వాసము

రామలక్ష్మణుల అన్వేషణ

లక్ష్మణుణ్ని కిష్కింధకి పంపించిన శ్రీరాముడు

శ్రోతలైన శౌనకుడు మొదలైన మహర్షులకి సూతుడు చెప్పిన మహాభారత కథని మార్కండేయమహర్షి ధర్మరాజుకి చెప్తూ “ధర్మరాజా! మాల్యవంత పర్వత గుహలో నివసిస్తున్న శ్రీరాముడు ఎంతో కష్టంగా వర్షాకాలాన్ని గడిపాడు.

తరువాత ఒకరోజు తమ్ముడు లక్ష్మణుడిని పిలిచి “లక్ష్మణా! సుగ్రీవుడి స్వభావం అర్థం కావడం లేదు. ఇతడి శత్రువుని చంపి కపిరాజ్యానికి అధిపతిగా చేశాము. భోగాల్లో మునిగి మనకి వాగ్దానం చేసిన విషయం మర్చిపోయాడు. ఇంత కృతఘ్నుడా? అసలు పని మర్చిపోయాడేమో?

నువ్వు ఇప్పుడే కిష్కింధకి బయలుదేరు. ఆరోజు నేను వాలిని చంపినట్టే నీచుడైన సుగ్రీవుణ్ని చంపి రా! ఒకవేళ నువ్వు అక్కడికి వెళ్లే సమయానికే సుగ్రీవుడు సీతని వెతకడానికి సన్నహాలు చేసి ఉంటే అతడిని ఏమీ చెయ్యకు. వెంటబెట్టుకుని ఇక్కడికి తీసుకునిరా!” అని చెప్పాడు.

శ్రీరాముడు చెప్పగానే లక్ష్మణుడు ఆయుధాలు చేతపట్టుకుని కిష్కింధకి వెళ్లాడు. ఎక్కుపెట్టడానికి సిద్ధంగా ఉన్న ధనస్సుని పట్టుకుని లక్ష్మణుడు వస్తున్నాడని తెలుసుకున్న సుగ్రీవుడు లక్ష్మణుడికి ఎదురు వెళ్లి స్వాగత మర్యాదలు చేసి నమస్కరించాడు. లక్ష్మణుడు శ్రీరాముడు సుగ్రీవుడికి చెప్పమన్న మాటలు చెప్పాడు.

సుగ్రీవుడు భయంతో గజగజా వణుకుతూ “అయ్యా! చేసిన మేలు మర్చిపోయేంత నీచుడిని కాదు నేను. సీతాదేవిని వెదకడానికి దేహబలం, బుద్ధిబలం కలిగి ఉన్న వానరుల్ని నాలుగు దిక్కులకి పంపించాను. వాళ్లు ఈ భూమండలంలో ఉన్న అడవులు, కొండలు, సముద్రాలు, పట్టణాలు, పల్లెలు, నదులు అన్నీ వెతికి ఒక నెలరోజుల్లో తిరిగి వస్తామని చెప్పి వెళ్లారు. ఆ గడువు ఇంకా అయిదు రోజులు ఉంది. సీతాదేవి ఉనికిని గురించి సమాచారం అందగానే మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నాను. నేను అప్రమత్తంగానే ఉన్నాను” అన్నాడు.

సుగ్రీవుడు చెప్పినది విని లక్ష్మణుడు అతణ్ని తీసుకుని శ్రీరాముడి దగ్గరకి వచ్చాడు. సుగ్రీవుడు చేస్తున్న పని గురించి వివరించాడు. శ్రీరాముడు సంతోషించాడు.

కొన్ని రోజులు గడిచాక అన్ని దిక్కులకి వెళ్లిన వానరులు తిరిగి వచ్చి శ్రీరాముడిని చూసి “దేవా! సముద్రాలతో సహా సమస్త భూమండలాన్ని గాలించాము. సీతాదేవి జాడ ఎక్కడా కనిపించలేదు” అన్నారు. శ్రీరాముడు సీతజాడ తెలియనందుకు దుఃఖించాడు. దక్షిణ దిక్కుకి వెళ్లిన వానరులకి సీతని గురించి సమాచారం తెలుస్తుందని అనుకున్నాడు.

ఇంతలో మరికొంతమంది వానరులు వచ్చి సుగ్రీవుడితో “రాజా! మధువనం అనే ఉద్యానవనంలో యువరాజు అంగదుడు, హనుమంతుడు మొదలైనవాళ్లు స్వేచ్ఛగా తిరిగి తినగలిగినన్ని పళ్లు తిని అడ్డగించిన వాళ్లని అవమానించారు. వాళ్ల ఆనందానికి హద్దు లేకుండా ఉన్నారు” అని చెప్పారు.

వాళ్లు సీతాదేవిని వెదకడానికి దక్షిణ దిక్కుకి వెళ్లారు. వాళ్లకి సీతాదేవి గురించి సమాచారం ఏదో తెలిసి ఉంటుంది. అందుకే హద్దులు మీరి ప్రవర్తించారు. లేకపోతే క్రమశిక్షణ తప్పేవాళ్లు కాదు. రాజుగారు చెప్పిన పని జయప్రదంగా చెసినవాళ్లకే అంత చనువు ఏర్పడుతుంది అనుకున్నాడు సుగ్రీవుడు. అదే విషయాన్ని శ్రీరాముడికి చెప్పాడు.

మధువనంలో వాయుపుత్రుడు హనుమంతుడు స్నేహితులతో కలిసి తిరుగుతూ కడుపునిండా తేనె తాగి, రుచికరమైన పళ్లు తిని, దట్టమైన చెట్ల నీడల్ని పొగుడుతూ విశ్రాంతి తీసుకున్నారు. చల్లగాలుల్ని, పరిమళాల్ని ఆస్వాదించి అనందంలో తేలుతూ సుగ్రీవుడు, శ్రీరాముడు ఉన్న చోటుకి వచ్చి సాష్టాంగ నమస్కారం చేశారు.

రాముడికి సీత జాడ చెప్పిన హనుమంతుడు

అందరిలోకి మేధావి అయిన హనుమంతుడు రాముడితో “ప్రభూ! శ్రీరామచంద్రా! దయచేసి మా మాటలు సావధానంగా విను. మేము పడిన శ్రమ మీకు చెప్తేనేగాని మాకు తృప్తిగా ఉండదుకదా! మేము అక్కడ ఇక్కడ అని లేకుండా వెతుకుతూ ఆశ్చర్యం కలిగించేలా ఉన్న ఒక పెద్ద సొరంగాన్ని చూశాము. క్రిమికీటకాలతో నిండి చీకటిగా ఉన్న సొరంగంలో ప్రవేశించి చాలా దూరం ప్రయాణం చేశాము.

చివరికి సూర్యరశ్మిలా ధగధగలాడుతున్న ఒక నగరాన్ని చూశాము. ఆ నగరంలో తపస్సు చేసుకుంటున్న ఒక స్త్రీ కనిపించి తన పేరు ‘ప్రభావతి’ అని చెప్పి తియ్యని తినుబండారాలతో విందు భోజనం పెట్టింది.

అది తిని ఆమె చెప్పినట్టు నేల సొరంగం దాటాము. తరువాత ‘సహ్యం’, ‘దుర్దురం’ అనే పర్వతాలు దాటి మలయపర్వత శిఖరం ఎక్కాము.

అక్కడికి దూరంగా ఆకాశానికి చేరుతున్న అలలతో, సుడులు తిరుగుతున్న నీటిలో అనేక ఎండ్రకాయలు, మొసళ్లు, చేపలు నివసిస్తున్న అతి పెద్ద సముద్రాన్ని చూశాము. అంతమెక్కడో తెలియని సముద్రంలో ఉన్న ప్రదేశాలన్నీ వెదికాము కాని, సీత ఉన్న చోటు తెలియలేదు. సముద్రాన్ని దాటడం ఎవరికీ సాధ్యం కాదు. సీతాదేవిని వెతికి వెతికి అలిసిపోయాము కాని ఎక్కడుందో తెలుసుకోలేకపోయాము.

ఈ విషయం శ్రీరాముడికి చెప్పి ఆయన్ని బాధపెట్టడమెందుకని అందరం కలిసి మరణిద్దామని అనుకున్నాము. మరణించడానికి సిద్ధపడుతూ శ్రీరాముడి కోసం జటాయువు అనే పక్షిరాజు పొందినట్టు మనం కూడా ఉత్తమగతిని పొందుదాము అని మాట్లాడుకుంటున్నాము.

ఆ సమయంలో గొప్ప బలం కలిగిన పక్షిరాజు ఒంటరిగా మేము ఉన్నచోటికి వచ్చాడు. మేము ఆశ్చర్యంతో చూస్తుండగా అతడు కన్నీరు కారుస్తూ “పూజ్యులారా! మీ మాటల్లో నాకు జటాయువు అనే పేరు వినబడింది. అతడు నా తమ్ముడు. నా పేరు సంపాతి. నేను, జటాయువు అనూరుడి కొడుకులం.

చిన్నప్పుడు నేను, తమ్ముడు సూర్యుడి దగ్గరికి ఎగరాలని అనుకున్నాము. వేడికి నా రెక్కలు మాడిపోయాయి. బలవంతుడైన జటాయువు రెక్కలు మాడిపోలేదు. అప్పటినుంచి ఇక్కడే పడి ఉన్న నాకు జటయువు జాడ తెలియలేదు. దయచేసి అతడి గురించి చెప్పండి” అని అడిగాడు.

మేము మాకు తెలిసిన విషయాలన్నీ చెప్పాము. జటాయువు మరణించాడని విని ఏడ్చాడు. మా వివరాలు తెలుసుకుని “రావణుడు నాకు తెలుసు. అతడు చాలా పరాక్రమం కలవాడు. సముద్రం మధ్యలో ఉన్న సుప్రసిద్ధమైన లంకాపట్టణంలో నివసిస్తున్నాడు. అతడిని ఓడించడం సాధ్యం కాదు. మీరు అక్కడికి వెళ్లగలిగితే సీతామాత అక్కడ కనిపిస్తుంది” అని చెప్పాడు.

సంపాతి లంకాపట్టణం వెళ్లమని చెప్పాడు కాని మాలో ఎవరికీ సముద్రం దాటే ఉపాయం తట్టలేదు. శ్రీరామా! నీ ఆజ్ఞ నెరవేర్చాలన్న కోరిక, నా తండ్రి వాయుదేవుడి దయ నాకు బలాన్ని కలిగించాయి. భయంకరమైన ఆ సముద్రాన్ని దాటగలిగాను. అది లోకానికి చాలా ఆశ్చర్యం కలిగించే విషయం.

ఆ సముద్రంలో మూడు శిఖరాలతో ఉండే పర్వతం మీద ఉన్న లంకాపట్టణాన్ని చూశాను. ఆ పట్టణంలో ఉన్న సంపద ఇంకెక్కడా ఉండదు. లంకాపుర వైభవాన్ని చూస్తూ సీతాదేవిని వెతుకుతూ తిరిగాను.

వెతికి వెతికి రావణుడి అంతఃపురంలో ఉన్న అశోకవనం చేరాను. అక్కడ కన్నీరు కారుస్తూ, శక్తిలేని దేహాన్ని చెట్టుకి ఆసరాగా చేసుకుని కూర్చుని, జరిగిన విషయాలు తలుచుకుంటూ, తనలో తను మాట్లాడుకుంటూ, తల ఊపుతూ సహజమైన సౌందర్యం కలిగి దుఃఖిస్తున్న సీతాదేవిని గుర్తించాను.

వినయంగా అమె దగ్గరకి వెళ్లి నేను శ్రీరాముడి దూతని, వాయుపుత్రుణ్ని, నిన్ను వెతకడానికి వచ్చాను; రామలక్ష్మణులు క్షేమంగా ఉన్నారు; కోతులకి రాజయిన సుగ్రీవుడితో స్నేహం చేశారు; సుగ్రీవుడు శ్రీరామలక్ష్మణులకి సాయం చేసి వాళ్ల పనిని నెరవేర్చడానికి ప్రతిజ్ఞ చేశాడు; తొందరలోనే నీ భర్త శ్రీరాముడు వస్తాడు బాధపడకు అని చెప్పాను.

ఇంకా నేను రాక్షసుడిని కానని, నిజంగానే కోతినని, మనస్సులో సందేహించవద్దని చెప్పి ఊరడించాను. సీతాదేవి కొంచెంసేపు ఆలోచించి ఉత్సాహాన్ని పొందింది. నాతో సీతాదేవి “ప్రియమైన అన్నా! నేను నిన్ను గుర్తించాను. నువ్వు రాక్షసుడివి అని సందేహం నాకు కలిగి ఉండేది. కాని, ఇంతకు ముందే శ్రీరాముడిమీద అభిమానం కలిగిన ముసలి రాక్షసుడు శ్రీరాముడు సుగ్రీవుడితో స్నేహంగా ఉన్నాడని త్రిజటతో చెప్పించాడు.

ఇప్పుడు శ్రీరామదూతగా నువ్వు వచ్చావు. అందువల్ల నాకు నమ్మకం ఏర్పడింది. వేగంగా సుగ్రీవుడి సహకారంతో శ్రీరాముడిని ఇక్కడికి తీసుకునిరా! నీ పని జయప్రదం అవుతుంది వెళ్లిరా!” అని చెప్పి గుర్తుగా తలమీద ధరించే మాణిక్యాన్ని దీన్ని తీసి ఇచ్చింది.

మీరు చిత్రకూట పర్వతం మీద ఉన్నప్పుడు జరిగిన మాయకాకి గురించి కూడా నాకు చెప్పింది. నేను బయలుదేరేటప్పుడు నన్ను దీవించి పంపించింది. తరువాత నేను లంకపట్టణాన్ని కాల్చి విషయం నీకు చెప్పాలని వచ్చాను” అని చెప్పాడు.

తను తీసుకుని వచ్చిన మణిని శ్రీరాముడికి ఇచ్చాడు ఆంజనేయుడు. మనోహరమైన ఆ చూడామణిని గుండెకు హత్తుకుని శ్రీరాముడు కొంచెంసేపు కళ్లు మూసుకుని ఉండిపోయాడు.

హనుమంతుడు చెప్పిన సీతాదేవి వృత్తాంతాన్ని చెప్పగానే ఆమెని తీసుకుని రావాలన్న ఆతృతతో సుగ్రీవుడిని రావణుడి మీద దండెత్తడానికి తగిన సన్నాహాలు చెయ్యమని చెప్పాడు. సుగ్రీవుడు రాముడి ఆజ్ఞని శిరసావహించి నాలుగు దిక్కుల్లో ఉన్న వానర నాయకుల్ని కిష్కింధకి రమ్మని కబురు పంపించాడు.

సుగ్రీవుణ్ని చేరిన వానర వీరులు

వానర వీరులందరు సుగ్రీవుడి ఆజ్ఞ ప్రకారం కిష్కింధకి వచ్చి చేరారు. శత్రువుల్ని ఎదుర్కోవాలన్న ఉత్సాహంతో శూరులు ‘గజుడు, గవయుడు’ రెండువందల కోట్ల కోతులతో శ్రీరాముడికి సాయం చెయ్యాలని వచ్చారు.

‘కుందుడు’ అనే వానర వీరుడు అరవై కోట్లమంది వానరులతో కలిసి మూడులోకాలు దద్దరిల్లిపోయేట్టు శ్రీరాముణ్ని దర్శించాడు.

శత్రువులు లేనివాడు, మహాబలవంతుడు ‘సుషేణుడు’ వెయ్యికోట్లమంది వానర సైన్యంతో కలిసి పైకెత్తిన తోకల తాకిడికి దిక్కుల్ని చీల్చుకుంటూ కిష్కింధకి వచ్చాడు. ‘దధిముఖుడు’ అనే వానరనాయకుడు లెక్కలేనన్ని కోతులగుంపుల్ని భూభాగం దద్దరిల్లేటట్లు నడిపించుకుంటూ వచ్చాడు.

ఎలుగురేడు, సాటిలేని బలం కలవాడు, నల్లని మేఘాలవంటి భయంకరమైన రూపం కలిగిన ‘జాంబవంతుడు’ వందవేయికోట్ల భల్లూకసేనతో శ్రీరాముడి పనికి సాయం చెయ్యడానికి వచ్చి చేరాడు. ఇంకా వేలకు వేలు కోతులగుంపులతో వానర నాయకులు కిష్కింధకి వచ్చి చేరారు.

అలా వచ్చిన కోతుల్లో అనేక ఆకారాలు కలిగిన వీరులు, గొప్ప పరాక్రమం కలవాళ్లు భయంకరంగా కిష్కింధలో తిరుగుతున్నారు. ఎటు చుసినా కోతులమూక, కొండగుహల్లో చెట్లమీద విచ్చలవిడిగా తిరుగుతున్నాయి.

తమ్ముడు లక్ష్మణుడు అనుసరిస్తుండగా, సుగ్రీవుడు కలిగించిన సాయం అనే ఉత్సాహంతో వానరసేనలతోపాటు శుభముహూర్తంలో గంభీరంగా దండయాత్రకి బయలుదేరిన శ్రీరాముడు సూర్యుడిలా ప్రకాశించాడు.

వాయునందనుడు, సుగ్రీవుడు కోతుల సేనకి మార్గాన్ని సూచిస్తూ నాయకత్వం వహించి ముందు ఉన్నారు. అంగదుడు, నీలుడు మొదలైన యోధులు అన్నివైపుల సేనలకి రక్షణ కలిపిస్తూ రావణాసురుడిని సంహరించాలన్న ఉత్సాహంతో గుంపులుగా వెళ్లారు.

కపిసైన్యం నడుస్తూ అడవిపండ్లు, చెరువులు ఎక్కువగా కలిగిన ప్రదేశాల్లో ఆగుతూ కొన్ని రోజులకి దక్షిణసముద్ర తీరాన్ని చేరుకుని రెండవ సముద్రంలా కనిపించారు. తరువాత సేనలు ముందుకు వెళ్లడానికి లేక ఆగిపోయింది.

శ్రీరాముడు సుగ్రీవుడితో “వానరరాజా! మన సేన కూడా సముద్రమంత ఉంది. కాని ఈ సముద్రం దాటడానికి వీలు కాదు. దీన్ని దాటే ఉపాయాన్ని నువ్వే ఆలోచించాలి” అన్నాడు.

అందరూ ఆలోచిస్తున్నారు. కొంతమంది తెప్పలు కడదామని, కొంతమంది పడవల మీద దాటుదామని ఎవరి ఆలోచన వాళ్లు చెప్పారు.

వాళ్లమాటలు విని శ్రీరాముడు “మీరు చెప్పిన ఉపాయాలు బాగానే ఉన్నాయి. కాని, మన సేన చాలా ఎక్కువ. ఇంత పెద్ద సేనకి సరిపడిన తెప్పలు, పడవలు సమకూర్చడం వీలుపడదు. ఈ సముద్రం వంద ఆమడలకి మించి ఉంది. మనం పడవల మీద వెళ్లేటప్పుడు శత్రువులు చూస్తూ ఊరుకోరు. ఆకాశమార్గంలో వచ్చి మన సేనల్ని సంహరిస్తారు.

పైగా మనం వీరులం శత్రువుల్ని సంహరించడానికే గాని, వర్తకవ్యాపారానికి సముద్రం దాటడం లేదు. బలపరాక్రమాలు ప్రదర్శించి వీరులుగా ఉండాలిగాని, వర్తకుల్లా కాదు. నేను ఉపవాసవ్రతంతో సముద్రుడిని ఆరాధిస్తాను.

ఈ సౌమ్యపద్ధతిలో సముద్రుడు దారి ఇస్తే మంచిదే. కాకపోతే రాజపద్ధతితో నాబాణాగ్నితో సముద్రజలాలు ఇంకిపోయేలా చేసి సముద్రుణ్ని తుకతుక ఉడికించేస్తాను” అన్నాడు.

Exit mobile version