Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-117: దశరథుడి మరణం

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

దశరథుడి మరణం

మూర్ఛనుంచి తెలివిలోకి వచ్చిన దశరథుడు రాముడు అరణ్యవాసానికి వెళ్లాడని తెలుసుకుని “రామా! లోకాలకి అతీతమైన త్యాగాన్ని ప్రదర్శించి అడవులకి వెళ్లావు. నువ్వు గొప్పవాడివని తెలిసింది. కాని, నువ్వు లేకుండా నేను ఎలా జీవించగలను?” అని ఎంతో బాధని అనుభవిస్తూ దుఃఖిస్తూ మరణించాడు.

కైకేయి భరతుణ్ని రప్పించి  “రాముడు వనవాసానికి వెళ్లాడు కనుక, అర్హత కలిగిన నువ్వు రాజ్యభారాన్ని వహించు” అని అడిగింది.

భరతుడు కోపంతోను, బాధతోను “ఏ మలినము అంటని సూర్యవంశానికి మచ్చ తెచ్చావు. ధర్మమూర్తి, దేవేంద్రుడితో సమానుడైన భర్తను చంపుకున్నావు. హృదయంలో కొంచెం కూడా దయ లేకుండా దేదీప్యమానమైన తేజస్సు కలిగినవాడు, గొప్ప పరాక్రమవంతుడు మా అన్న శ్రీరాముణ్ని వనవాసానికి పంపించావు.

జీవితాల్ని హరించేదానివిగా పోగొట్టుకోలేనంత అపకీర్తిని నా తలమీద పెట్టావు. అన్ని లోకాలతోను నిందించబడుతూ నీ కోరికని తీర్చుకున్నావు. పాపాత్మురాలవై నువ్వు చేసిన ఈ పాపానికి నిష్కృతి ఉందా? నేనేం చెయ్యగలను?” అని అనేక విధాలుగా ఏడుస్తూ తండ్రికి అంత్యక్రియలు నిర్వర్తించాడు.

తరువాత మంత్రులతోను, సామంతరాజులతోను, బ్రాహ్మణులతోను, పురపౌరులతోను, పల్లెటూళ్లల్లో నివసించే జానపదులతోను, ముగ్గురు తల్లులతోను, పురోహితులు వశిష్ఠ వామదేవులతోను కలిసి శత్రుఘ్నుణ్ని తీసుకుని శ్రీరాముణ్ని ప్రసన్నుణ్ని చేసుకోడానికి చిత్రకూటపర్వతానికి వెళ్లాడు.

శ్రీరాముణ్ని చూడగానే భరతుడు రాముడి పాదాల మీద పడి పెద్దగా రోదిస్తూ తండ్రి మరణించిన సంగతి వివరంగా చెప్పాడు. “దేవా! నువ్వు తిరిగి అయోధ్యకి వచ్చి సింహాసనం అధిష్టించి మమ్మల్నందర్నీ ఏలుకో!” అని ప్రార్థించాడు.

అతడితో వచ్చినవాళ్లందరు భరతుడు చెప్పిన మాటని బలపరిచారు. పితృవాక్యపరిపాలనకి కట్టుబడిన శ్రీరాముడు భరతుడు ఎన్ని విధాలుగా బతిమలాడినా భూరాజ్యాన్ని పాలించడానికి అంగీకరించలేదు.

భరతుడు ఇంక చేసేదేమీ లేక అన్నగారి పాదుకలు తీసుకుని అయోధ్యకి దగ్గరలో ఉన్న నందిగ్రామంలో ఉంచి రాముడికి ప్రతినిధిగా రాజ్యపాలన చేస్తున్నాడు.

శ్రీరాముడు తను చిత్రకూటంలోనే ఉంటే భరతుడు మళ్లీ వచ్చి తనను అయోధ్యకి రమ్మని అడుగుతాడేమో అని అక్కడినుంచి శభంగమహర్షి ఆశ్రమానికి వెళ్లాడు. శభంగుడు శ్రీరాముడికి స్వాగతం చెప్పి గౌరవించాడు.

తరువాత శ్రీరాముడు దండకారణ్యం చేరుకుని గోదావరీ తీరంలో పర్ణశాలని నిర్మించుకుని భార్యతోను, తమ్ముడితోను నివసిస్తున్నాడు.

ఆ సమయంలో రావణుడి చెల్లెలు శూర్పణఖ వచ్చి వాళ్లకి కీడు చెయ్యబోతుంటే లక్ష్మణుడు అమె ముక్కు చెవులు కోసి వికారంగా చేశాడు.

శూర్పణఖకి జరిగిన అవమానానికి ప్రతీకారంగా అనేకమంది రాక్షసవీరులు శ్రీరాముడి మీదకి దండెత్తి వచ్చారు. శ్రీరాముడు వాళ్లందర్నీ సంహరించాడు.

ఖరుడు, దూషణుడు అనే రాక్షసుల్ని వాళ్ల భటుల్ని పధ్నాలుగు వేలమంది రాక్షసుల్ని సంహరించి దండకారణ్యంలో రాక్షసబాధ లేకుండా చేశాడు. శూర్పణఖ అన్న దగ్గరికి వెళ్లి ఏడ్చి జరిగినదంతా చెప్పింది.

రావణుడు తన చెల్లెలికి జరిగిన పరాభవానికి కోపంతో మండిపడ్డాడు. లంకాపట్టణాన్ని సంరక్షించడానికి తనకి ఆప్తులైన వాళ్లని నియమించాడు. తను ఒంటరిగా బయలుదేరి త్రికూటపర్వతాన్ని, కాలపర్వతాన్ని దాటి సముద్రతీరంలో ఉన్న గోకర్ణానికి వెళ్ళాడు.

ఒకసారి శ్రీరాముడితో పరాభవం పొందిన మారీచుడు ఈశ్వరుణ్ని గురించి గోకర్ణేశ్వరాలయం దగ్గర తపస్సు చేస్తున్నాడు. రావణాసురుణ్ని చూసి సంతోషంతో స్వాగతం చెప్పి యోగక్షేమాలు అడిగాడు.

రావణుడు జరిగినదంతా మారీచుడికి చెప్పి “ఆ రాముడిని అవమానించి అతడిమీద పగ తీర్చుకోవాలి. ఆ పనిలో నువ్వు నాకు చిన్న సాయం చెయ్యాలి” అన్నాడు.

మారీచుడు భయంతో గజగజా వణుకుతూ “రావణా! నీకు శ్రీరాముడితో యుద్ధం చెయ్యడమంటే ఏమిటో తెలియదు. అతడు గొప్ప పరాక్రమవంతుడు. పినాకపాణి కూడా రామబాణానికి తట్టుకోలేడు. నీకు ఏ దుష్టుడు చెడు బుద్ధి పుట్టించాడో తెలియదు కాని, నీకు వినాశకాలం దగ్గర పడింది. అందుకే నీకు ఈ బుద్ధి పుట్టింది.

నేనొకసారి శీరామచంద్రుడి శౌర్యం యుద్ధంలో చవిచూసి ఉన్నాను. అతణ్ని జయించడం కష్టమనే కదా నేను ఇలా సన్యాసం తీసుకుని తపస్సు చేసుకుంటున్నాను. నాకు ఇంత దీనస్థితికి కారణమైన శ్రీరాముడితో శత్రుత్వం నీకు ఎంతమాత్రం మంచిది కాదు” అన్నాడు.

మారీచుడి మాటలకి లంకాధిపతి రావణుడికి కోపం వచ్చింది. “మారీచా! నేను చెప్పినట్టు చెయ్యకపోతే నిన్ను ఇప్పుడే సంహరిస్తాను” అన్నాడు.

మారీచుడు ఆలోచించి ‘ఈ రావణుడి చేతిలో చచ్చేకంటే ఆ శ్రీరాముడి చేతిలో చావడమే మంచిది’ అనుకున్నాడు. “రావణా! నీకు మంచి చెప్పానుగాని, నీ మాట కాదని అనలేదు. ఏం చెయ్యాలో చెప్పు” అన్నాడు.

రావణుడు మారీచుడితో “నువ్వు బంగారులేడి రూపంలో వెళ్లి సీతకి కనిపించి ఆమె ఆకర్షించేలా చేసుకో. బంగారు లేడిని తెచ్చి ఇవ్వమని సీత రాముడిని అడుగుతుంది. రాముడు నిన్ను వెంబడిస్తాడు.

శ్రీరాముణ్ని దూరంగా తీసుకుని వెళ్లు. నేను సీతాదేవిని దొంగిలిస్తాను. సీతాదేవి కనిపించక శ్రీరాముడు దుఃఖంలో మునిగిపోతాడు” అన్నాడు.

మాయలేడి రూపంతో మారీచుడు

మారీచుడు మాయలేడి రూపంలో వచ్చి రాముడు సీత నివసిస్తున్న ప్రదేశంలో విహరించడం మొదలుపెట్టాడు. సీత లేడిని చూసి ముచ్చటపడి దాన్ని తెచ్చిపెట్టమని రాముణ్ని అడిగింది.

శ్రీరాముడు సీత ప్రోత్సాహంతో లేడిని పట్టుకురావడానికి బయలుదేరాడు. సీతని రక్షించడానికి లక్షణుణ్ని నియోగించాడు.

మాయలేడి రాముణ్ని మోసగించి దూరంగా తీసుకుని పోయింది. బంగారులేడిని ప్రాణాలతో పట్టుకోవాలనుకున్న రాముడు దాన్ని రాక్షసమాయగా గుర్తించి దాని మీద తిరుగులేని బాణాన్ని ప్రయోగించాడు.

రామబాణానికి తిరుగు ఉండదు. అది తగిలితే శ్రీరాముడి చేతిలో చావు తప్పదు అనుకుని మాయలేడి రూపంలో ఉన్న మారీచుడు రామబాణం తగిలిన వెంటనే నేలమీద పడి రాముడి కంఠస్వరాన్ని అనుకరిస్తూ “హా! సీతా! హా! లక్ష్మణా!” అంటూ గట్టిగా అరుస్తూ గిజగిజ తన్నుకుని చచ్చాడు.

రాముడి కంఠధ్వని విని సీత “లక్ష్మణా! విన్నావుకదా! నీ అన్న ఆర్తనాదం. అతణ్ని రక్షించడం నీ కర్తవ్యం” అంది. సీత మాటలు విని లక్షణుడు “భయపడవద్దు. శ్రీరాముడిని యుద్ధంలో గెలవగలిగిన శూరుడు ఏ లోకంలోనూ లేడు. శ్రీరాముడికి ఎప్పుడూ, ఎక్కడా ఏ ఆపదా కలగదు. కొన్ని క్షణాల్లో శ్రీరాముడు తిరిగి వస్తాడు” అన్నాడు.

సీతకి లక్ష్మణుడి మీద అనుమానం కలిగింది. కోపంతో “లక్ష్మణా! నీ మనస్సు నాకు అర్థమయింది. భయంకరమైన ఆయుధాలతోనో, అగ్నితోనో ఆత్మహత్య చేసుకుంటానుకాని, నీకు మాత్రం లొంగను. నీకు దక్కుతానని మాత్రం అనుకోకు” అంది.

ఆ మాటలు విని లక్ష్మణుడు చెవులు మూసుకుంటూ విల్లు అమ్ములు ధరించి అన్నగారు వెళ్లిన మార్గంలో వెళ్లాడు. అదే సమయంలో యజ్ఞోపవీతము, చిన్న జుట్టుముడి, గోచిగుడ్డ, శరీరాన్ని కప్పుతూ చిన్నబట్ట, చేతికర్ర, కమండలము, దర్భలతో చుట్టబడిన ఉంగరము ధరించి నడవడం వల్ల అలిసిపోయినట్టుగా కనిపిస్తూ సన్యాసి వేషం ధరించి రావణాసురుడు వచ్చాడు. యతి వేషంలో ఉన్న అతణ్ని సీత పూజ్యభావంతో ఆరాధించి అతిథి సత్కారాలు చేసి అడవిపళ్లు ఇచ్చింది.

వాటిని తీసుకోకుండా రావణుడు సీతవైపే చూస్తూ “నేను రాక్షసుల సార్వభౌముడిని, జగత్తులో ప్రసిద్ధమైన లంకాపట్టణం నా రాజధాని. నాతో వచ్చి స్వర్గసౌఖ్యాలు అనుభవించు. ఈ ఆడవుల్లో పడి ఇన్ని కష్టాలు అనుభవించడం ఎందుకు? ఇంకేమీ ఆలోచించకుండా నాతో వచ్చెయ్యి” అన్నాడు.

రావణుడి మాటలు విని సీత “రావణా! నువ్వు వివేకం లేకుండా మాట్లాడుతున్నావు. తారతమ్యం తెలుసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. సమస్త తారాగణంతోను, కాంతివలయంతో సహా ఆకాశమంతా భూమిమీద పడినా, భూమి మొత్తం బ్రద్దలైపోయినా, సముద్రాలన్నీ ఎండిపోయినా, సూర్యచంద్రులు కాంతి కోల్పోయి గతులు తప్పినా నేను పరపురుషుడిని మనసులో కూడా కోరను. బుద్ధిహీనుడా! జాగ్రత్త! నన్ను ఎప్పుడూ కోరకు” అంది.

సీతని అపహరించిన రావణుడు

రావణుడిని బెదిరిస్తూనే సీత దూరంగా వెళ్లిపోతుంటే రావణుడు ఆమెని బెదిరించి పట్టుకుని ఆకాశానికి ఎగిరి లంకాపట్టణం వైపు వెళ్లిపోతున్నాడు.

సీత బాధతో “ఓ దేవతలారా! బ్రాహ్మణులారా! మూడులోకాల్లోను గొప్పవాడైన శ్రీరాముడి భార్యని నేను. జనకుడి కుమార్తె సీతని. రాక్షసుడు నన్ను బలాత్కారంగా తీసుకుని పోతున్నాడు. మీకు నమస్కరిస్తున్నాను. నన్ను రక్షించండి” అని అరుస్తోంది.

సీత ఆక్రోశం విని అరుణుడి కుమారుడు జటాయువు అనే పక్షిరాజు రెక్కలు కలిగిన కులపర్వతంలా వేగంగా వచ్చి అకాశంలోకి ఎగిరి “నువ్వు నన్ను తప్పించుకుపోలేవు. నిన్ను నేను సంహరిస్తాను” అని రావణుణ్ని ఎదుర్కున్నాడు.

రావణుడు జటాయువుల మధ్య భీకరమైన యుద్ధం జరిగింది. రావణుడు తన కత్తితో జటాయువు రెక్కల్ని ఖండించాడు. జటాయువు ముక్కలుగా తెగి కిందపడ్డాడు.

తనకి ఇంకెవ్వరు సాయంచేసేవాళ్లు లేరని గ్రహించింది. తన ఆభరణాలు తీసి  చీరకొంగు చింపి దానిలో మూటగట్టింది. కొండశిఖరం మీద కనిపిస్తున్న వానరుల దగ్గర ఆభరణాల మూటని పడేసింది.

రావణుడు సీతని తీసుకుని వెళ్లి అశోకవనంలో ఉంచి ఆమె సంరక్షణకి కొంతమంది రాక్షస స్త్రీలని ఉంచాడు.

దండకారణ్యంలో మారీచుణ్ని చంపిన శ్రీరాముడు తన పర్ణశాలకి వెడుతున్నాడు. మార్గమధ్యంలో లక్ష్మణుడు ఎదురు వచ్చాడు. శ్రీరాముడు అతణ్ని చూసి “రాక్షసులు ఎక్కువగా ఉండే ఈ దండకారణ్యంలో సీతని ఒంటరిగా  వదిలి రావడం మంచిది కాదు” అన్నాడు.

లక్ష్మణుడు సీత తనని నిందించిన మాటలు చెప్పాడు. బంగారులేడి తనని అడవిలో దూరానికి తీసుకుని వెళ్లడం, సీతని జనసంచారం లేని అడవిలో ఒంటరిగా వదిలి లక్ష్మణుడు రావడం శ్రీరాముడి మనస్సులో ఆందోళన కలిగిస్తోంది. రామలక్ష్మణులు సీతలేని పర్ణశాలకి వచ్చారు. శ్రీరాముడు శూన్యంగా ఉన్న కుటీరాన్ని చూసి మూర్ఛపోయాడు. లక్ష్మణుడు ఉపచారం చేశాడు.

శ్రీరాముడు తెప్పరిల్లాక ఇద్దరూ కలిసి సీతని వెతుక్కుంటూ బయలుదేరారు. దెబ్బలు తగిలి కుప్పకూలి ఉన్న పక్షిని చూసి అది కూడా రాక్షసుల మాయ అనుకుని రాముడు బాణం తియ్యబోయాడు.

అది గ్రహించిన జటాయువు “అయ్యలారా! నేను జటాయువు అనే పక్షిని. అరుణుడి కుమారుణ్ని. మీ తండ్రి దశరథమహారాజుకి స్నేహితుణ్ని. రావణుడు సీతని ఎత్తుకుని పోతుండగా అతడితో తలపడి రెక్కలు పోగొట్టుకున్నాను” అని చెప్పి మరణించాడు.

రామలక్ష్మణులు అతడికి తన తండ్రితో సమానంగా గౌరవించి అగ్నిసంస్కారం చేశారు. రావణుడు దక్షిణ దిక్కుకి వెళ్లాడని జటాయువు చెప్పాడు. రామలక్ష్మణులు దక్షిణ దిక్కుగా ప్రయాణమయ్యారు.

విశ్వావసుడి శాపవిమోచనం

వాళ్లకి వికృతరూపం కలిగిన కబంధుడు కనిపించాడు. వక్షంలో కళ్లు, పెద్ద కడుపులో నోరు, పొడవైన చేతులతో కులపర్వతంలా ఎత్తుగా భయం కలిగించేలా వికార స్వరూపంతో ఉన్నాడు. అనేక జంతువుల్ని చంపి తింటూ పొట్ట నింపుకునే తిండిపోతు.

అదే సమయంలో అక్కడికి వచ్చిన లక్ష్మణుణ్ని పట్టుకున్నాడు. లక్షణుడు అతడి బంధం నుంచి తప్పించుకోలేక “అన్నా! శ్రీరామా! నేను ఇటువంటి దుస్థిలో పడ్డాను. నీకు ఆపదల మీద ఆపదలు కలుగుతున్నాయి. భోగభాగ్యాలతో తులతూగే రాజ్యం పోయింది. తండ్రిగారు మరణించారు. భయంకరమైన అడవుల్లో తిరగవలసి వచ్చింది.

చివరికి దురదృష్ట దశకి పరాకాష్ఠ అన్నట్టు నేను కూడా ఈ రాక్షసుడికి చిక్కాను. ఇతడు నన్ను పొట్టనపెట్టుకుంటాడు. నువ్వు సీతాదేవి పట్టాభిషేకం చేసుకుని రాజలాంఛనాలతో శోభిల్లే సుందరదృశ్యాన్ని కన్నులపండువుగా చూడలేకపొతున్నాను. నావంటి దురదృష్టవంతుడు ఎవరు ఉంటారు?” అన్నాడు బాధపడుతూ.

శ్రీరాముడు తత్తరపడకుండా స్థిరంగా నిలబడి “లక్ష్మణా! నేనుండగా నీకు కీడు కలగదు” అన్నాడు. ఒరనుంచి పదునైన కత్తిని తీసి కబంధుడి ఎడమచేతిని ఖండించాడు. లక్ష్మణుడు బంధం నుంచి బయటికి వచ్చి కత్తి తీసి కబంధుడి కుడి చేతిని ఖండించి వాడి పొట్టకి రెండు వైపులా చీల్చాడు.

వెంటనే రాక్షసుడు దివ్యరూపం ధరించి నిలబడ్డాడు. శ్రీరాముడు అతణ్ని చూసి ఆశ్చర్యపోయి “నీకు ఈ రూపం ఎలా వచ్చింది? రాక్షసుడిగా ఈ అడవిలో ఎందుకు తిరుగుతున్నావు?” అని అడిగాడు.

కబంధుడు “నేను విశ్వావసుడు అనే గంధర్వుణ్ని. బ్రహ్మదేవుడి శాపం వల్ల రాక్షస జన్మ వచ్చింది. నీవల్ల నాకు శాపవిమోచనం కలిగింది. నేను చెప్పే విషయాన్ని శ్రద్ధగా విను. రావణుడు అనే రాక్షసుడు సీతని అపహరించి లంకాపట్టణానికి తీసుకుని పోయాడు. ఇక్కడి నుంచి చాలాదూరం ప్రయాణించాక ‘పంప’ అనే సరోవరం వస్తుంది.

ఆ సరస్సుకి కొంచెం దూరంలో ‘ఋష్యమూకం’ అనే పర్వతం ఉంటుంది. ఆ పర్వతం మీద వాలి తమ్ముడు సుగ్రీవుడు అనే వానరుడు నలుగురు మంత్రులతో కలిసి నివసిస్తున్నాడు. మీరు సుగ్రీవుడితో స్నేహం చెయ్యడం వల్ల మీకు మంచి జరుగుతుంది” అని చెప్పి రామలక్ష్మణుల దగ్గర సెలవు తీసుకుని వెళ్లిపోయాడు.

రామలక్ష్మణులు చాలా దూరం ప్రయాణం చేసి పంపాసరోవరాన్ని చేరుకున్నారు. మనోహరంగా ఉన్న పంపాసరోవర పరిసరాల్ని చూసి శ్రీరాముడు సీతని గుర్తుచేసుకుంటూ గట్టిగా ఆమె గురించి చెప్తూ బాధపడుతున్నాడు.

లక్ష్మణుడు శ్రీరాముడితో  “రాజా! నేను నీకు శిష్యుణ్ని, భక్తుణ్ని, తమ్ముణ్ని, పరిచారకుణ్ని. నేనుండగా నీకెందుకు విచారము? బాధపడకు” అని ఉపశమనం కలిగించాడు.

ఇద్దరు సరోవరంలోకి వెళ్లి స్నానం చేశారు. పితరులకి తర్పణాలు ఇచ్చారు. తరువాత ఆ సరోవరానికి ముందుగా ఉన్న ఋష్యమూకపర్వతాన్ని చూశారు. ఆ పర్వతం ఎత్తైన శిఖరాలతో నిటారుగా నిలబడి ఆకాశానికి తగులుతున్నట్టుగా ఉంది. ఇద్దరూ ఆ పర్వతం దగ్గరికి వెళ్లి విశ్రాంతిగా కుర్చున్నారు.

వానరులకి రాజు, పుణ్యాత్ముడయిన సుగ్రీవుడు దేదీప్యమానమైన తేజస్సుతోను, ఎత్తైన భుజాలతోను మహావీరులుగా కనిపిస్తున్న వాళ్లిద్దర్ని కొండ శిఖరం మీదనుంచి చూశాడు. తన మంత్రులతో చర్చించి ఆ రాజకుమారుల వివరాలు తెలుసుకుని రమ్మని హనుమంతుణ్ని పంపించాడు.

వానరవీరులతో మైత్రి

సుగ్రీవుడి మంత్రి, పనులు నిర్వర్తించడంలో స్థిరమైన సంకల్పం కలవాడు హనుమంతుడు సుగ్రీవుడు చెప్పినట్టు రాజకుమారుల దగ్గరికి వెళ్లి విషయం కనుక్కుని సుగ్రీవుడికి చెప్పి వాళ్లిద్దరి మధ్య స్నేహాన్ని పెంపొందించాడు.

అంతకుముందు రావణుడు ఎత్తుకుని పోతున్నప్పుడు సీత తన సొమ్ములు మూటకట్టి వానరులు తిరుగుతున్న ఋష్యమూక పర్వతం మీద పడేసిన ఆభరణాల మూటని సుగ్రీవుడు శ్రీరాముడికి ఇచ్చాడు.

సీత ఆభరణాలు చూసి శ్రీరాముడు కొంచెం సేపు ఉద్వేగంతో ఉండి పోయాడు. తరువాత తనకు వాటిని ఇచ్చిన సుగ్రీవుడికి వాలిని చంపి రాజ్యాన్ని అప్పగిస్తానని వాగ్దానం చేశాడు.

సుగ్రీవుడు రావణుడి చెరలో ఉన్న సీతని విడిపించడానికి సహాయపడతానని అంగీకరించాడు. తరువాత వాళ్లందరు కలిసి వాలి రాజధాని పట్టణమైన కిష్కింధకి వెళ్లారు.

సుగ్రీవుడు గర్వంతో వాలి ఇంటిముందు నిలబడి తన బాహువుల్ని చేతులతో చరుస్తూ చప్పుడు చేశాడు. వాలి కోపంతో సుగ్రీవుడి మీదకి యుద్ధానికి బయలుదేరాడు.

సుగ్రీవుడి భార్య తార “ఈ రోజు సుగ్రీవుడి వైఖరి వేరేగా కనిపిస్తోంది. దశరథుడి కుమారుడు శ్రీరాముడు అతడి తమ్ముడితో కలిసి వచ్చి సుగ్రీవుడితో స్నేహం చేశాడు. రావణుడు శ్రీరాముడి భార్యని అపహరించాడు.

సుగ్రీవుడు శ్రీరాముడికి సహాయం చెయ్యడానికి; శ్రీరాముడు సుగ్రీవుడికి సాయం చెయ్యడానికి ఇద్దరి మధ్య ఒప్పందం కుదిరింది.

అంతేకాదు, సుగ్రీవుడికి బలవంతులైన మందుడు, ద్వివిదుడు, లోకోత్తరపరాక్రమశాలి హనుమంతుడు, గొప్ప తెలివి కలిగినవాడు జాంబవంతుడు తోడుగా ఉన్నారు. ఇప్పుడు నువ్వు సుగ్రీవుడితో యుద్ధం చెయ్యడం నాకు మంచిదిగా అనిపించట్లేదు” అంది.

తార మాటలు విని వాలి నవ్వాడు. అమె మాటలు లేనిపోని ఊహలుగా అనుకుంటూ పరాక్రమ గర్వంతో ముందుకి వెళ్లి సుగ్రీవుణ్ని చూసి “సుగ్రీవా! నిన్ను ఎన్నోసార్లు యుద్ధంలో తరిమి తరిమి కొట్టాను. నన్ను ఎదిరించలేక పారిపోయిన పిరికిపందవు, నీకు ఇంత ధైర్యం ఎలా వచ్చింది?” అని అడిగాడు.

వాలి మాటలకి సుగ్రీవుడు “వాలీ! నేను నా భార్యని, రాజ్యాన్ని కూడా పోగొట్టుకున్నాను. ఇంత దురవస్థ నాకు కలిగింది. అర్థం లేని ఈ జీవితాన్ని గడిపి నేను పొందేది ఏముంది? అందుకే ధైర్యంగా యుద్ధానికి వచ్చాను. ఇదివరకటి సుగ్రీవుడు వేరు. ఇప్పటి సుగ్రీవుడు వేరు. నిన్ను యుద్ధంలో సంహరించకుండా వెళ్లడు ఇప్పటి సుగ్రీవుడు” అన్నాడు.

ఇద్దరి మధ్య భీకరంగా పోరు మొదలైంది. పెద్దపెద్ద చెట్లు, రాళ్లు, గోళ్లు ఆయుధాలుగా చేసుకుని ఒకరితో ఒకరు తలపడ్డారు. దేవేంద్రుడి కొడుకు వాలి, సూర్యుడి కొడుకు సుగ్రీవుడు బలమైన శరీరాలు కలవాళ్లు.

ఇద్దరు యుద్ధం మీద ఉన్న ఉత్సాహంతో రెండు మదపుటేనుగుల్లా ద్వంద్వయుద్ధంలోకి దిగారు. వాళ్లిద్దరిలో ఎవరు వాలో.. ఎవరు సుగ్రీవుడో పోల్చుకోడం కష్టమై రాముడు యుద్ధం చూస్తూ ఉండిపోయాడు.

రాముడి అవస్థ గుర్తించిన ఆంజనేయుడు చిగురాకుల దండ తీసుకుని వెళ్లి సుగ్రీవుడి మెడలో వేశాడు. వెంటనే శ్రీరాముడు బాణాన్ని ఎక్కుపెట్టి వాలిమీదకి గురిపెట్టి వదిలాడు. దశరథమహారాజు కొడుకు శ్రీరాముడు అటువంటి పని చెయ్యడం ధర్మం కాదని అంటూ వాలి ప్రాణాలు వదిలాడు.

శ్రీరాముడు కోతులన్నింటికీ రాజుగా సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. వాలి భార్య తారని సుగ్రీవుడికి అప్పగించాడు. సుగ్రీవుడు శ్రీరాముడితో “మహాత్మా! వస్తున్నది వర్షాకాలం. సీతని వెతకడానికి అనువైన కాలం కాదు. వర్షకాలం గడిచిపోయాక కోతుల్ని పంపించి సీతజాడ తెలుసుకుందాము” అన్నాడు.

సుగ్రీవుడు రామలక్షణులకి మాల్యంవంతం అనే పర్వతం మీద విడిది ఏర్పాటు చేయించాడు. తాను రాజధాని కిష్కింధానగరంలో నివసిస్తున్నాడు.

సీతకి తన స్వప్న వృత్తాంతాన్ని చెప్పిన త్రిజట

ఆ సమయంలో సీతాదేవి రావణాసురుడి చెరలో అనేక కష్టాలు అనుభవిస్తూ ఎప్పుడూ తన భర్త శ్రీరాముడిని తలుచుకుంటూ స్పృహలేకుండా పడి ఉంది. వికృతరూపాలతో ఉన్న త్ర్యక్తి, లలాటాక్షి, త్రిస్తని, ఏకపాద, దీర్ఘజిహ్వ, అజిహ్వ, త్రిజట, ఏకలోచన మొదలైన సార్థకనామధేయం కలిగిన రాక్షసస్త్రీలు సీతకి కావలి కాస్తున్నారు.

రాత్రి పగలు నిష్కారణంగా బాధిస్తూ, చంపేస్తామని బెదిరిస్తున్నారు. సీత వాళ్లతో  “ఓ తల్లులారా! మీకు నన్ను చంపాలని ఉంది. నాకు కూడా బతకాలని లేదు. నేను శ్రీరాముని తప్ప ఇంకెవరిని మనస్సులో కోరుకోను. మీ ఇష్టం వచ్చినట్టు చెయ్యండి!” అంది.

సీత చావుకి కూడా భయపడట్లేదని రావణుడికి చెప్పడానికి కొంతమంది రాక్షసస్త్రీలు వెళ్లారు. సీతతో ఎప్పుడూ మృదువుగా మాట్లాడే త్రిజట సీత దగ్గరికి వచ్చి “తల్లీ! నేను నీకు ఒక శుభవార్త చెప్తాను సావధనంగా విను. నేను చెప్పేది నిజం! నా మాటలు నమ్ము. అవింధ్యుడు అనే ముసలి రాక్షసుడు ఈ మాటలు నీకు చెప్పి నిన్ను ఊరడించమని చెప్పాడు.

ఆ రోజు నిన్ను విడిచిపెట్టిన తరువాత లక్ష్మణుడు, శ్రీరాముడు కలుసుకున్నారు. వాళ్లు వానరరాజు సుగ్రీవుడితో స్నేహం చేసారు. ఇప్పుడు రావణుడి చెరనుంచి నిన్ను విడిపించాలని వస్తున్నారు.

రావణుడు నిన్ను బలవంతంగా అనుభవించలేడు. అందుకు ఒక కారణం ఉంది. రంభని బలాత్కరించి అనుభవించడం వల్ల నలకూబరుడు రావణుణ్ని శపించాడు. ఇంక రావణుడి వల్ల భయం లేదు. దుర్మార్గుడైన రావణుడికి కీడు మూడింది.

ఈ విషయం తెలియచేస్తూ నాకు కల వచ్చింది. ఆ కలని కూడా చెప్తాను విను. రావణుడు రాజ్యాన్ని కోల్పోయి రాముడి చేతిలో హతమైనట్టు; కుంభకర్ణుడు మొదలైన రాక్షసులు అందరు యముడి నగరానికి వెడుతున్నట్లు; ధైర్యంలోను, మంచిగుణాలలోను గొప్పవాడైన విభీషణుడు తన నలుగురు మంత్రులతో గొప్ప తేజస్సుతో వెలుగుతున్నట్లు నేను కలలో చూశాను.

సీతాదేవీ! నేను తెల్లని కీర్తి భూమ్యకాశాల మధ్యభాగంలో అక్రమించగా పరాక్రమవంతుడైన శ్రీరాముడు ఎత్తైన ఏనుగు మీద తమ్ముడు లక్ష్మణుడితో కూర్చుని సంతోషంతో తేనె కలిపిన పాయసాన్ని తింటున్నట్టు చూశాను.

నా కల నిజమవుతుంది. ఇంక నువ్వు దుఃఖించకు.” అంది.

త్రిజట చెప్పిన మాటలకి సీత కొంచెం ఊరటపడింది.

రావణుడు సీతని తలుచుకుంటూ వశం తప్పిన మనస్సుతో ఎన్నో వస్త్రాలు, ఆభరణాలు పట్టుకుని అశోకవనానికి వచ్చాడు సీతతో “నేను దేవతల్ని, యక్షుల్ని, గంధర్వుల్ని, కిన్నరల్ని, పన్నగుల్ని జయించాను. అన్ని జాతుల్లోను ఎంతోమంది అందగత్తెలు ఉన్నారు. వాళ్లందరు నా అధీనంలో ఉన్నా కూడా వాళ్లని వదిలి  నేను నిన్నే కోరుకోవడం నిజంగా నీకు పట్టిన అదృష్టం. నువ్వు గుర్తించట్లేదు.

సౌందర్యవంతురాలా! రాముడు ఎవరు? రాజ్యాన్ని, గొప్పతనాన్ని పొగొట్టుకుని అడవుల్లో దుఃఖంతో తిరుగుతున్న ఒక అల్పమానవుడు. అతడితో నీకు సుఖమేమి ఉంటుంది? రాముడి మీద ప్రేమతో దుఃఖిస్తున్నావు.

నేను అన్ని భువనాలకి సార్వభౌముడిని. నాకు పధ్నాలుగు కోట్లమంది దేవతలు, ఇరవైఎనిమిది కోట్లమంది రాక్షసులు, ఎనభై ఆరు కోట్లమంది యక్షులు సేవకులుగా ఉన్నారు.

ధనం మొత్తానికి అధిపతి అయిన కుబేరుడు నాకు అన్న. బ్రహ్మతో సమానుడైన  విశ్రవసుడు నా తండ్రి. దేవేంద్రుడికి ఉన్నంత సిరిసంపదలు నాకు ఉన్నాయి.

నా ఐశ్వర్యాన్నే కాకుండా నా జీవితాన్ని కూడా ఏలుకో. సమస్త సౌఖ్యాలు అనుభవించు” అని రావణుడు చెప్పాడు.

ఆ మాటలు విన్న సీత అతడి మొహం చూడడానికి ఇష్టపడక ఒక పచ్చగడ్డి పరకని రావణుడుగా అనుకుని  “అయ్యో! నాకు ఎలాంటి దుస్థితి పట్టింది. నేను వేరొకరి భార్యని. భర్తయందు ప్రేమ కలిగి భర్తనే దైవంగా భావిస్తున్నాను. నువ్వు రాక్షసుడివి. నీ మీద ఏమాత్రం అనురాగం లేని నా వల్ల నీకు ఎటువంటి సుఖం కలుగదు. నువ్వు బ్రహ్మదేవుడికి మనవడివని, దిక్పాలకులతో సమానుడవని, పరమశివుడి మిత్రుడు ధనపతి కుబేరుడి సొదరుడవని గొప్పలు చెప్పుకుంటున్నావు.

మరి అంతటి గొప్పవాడికి ధర్మం తెలియాలి కదా! నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్న నీ ప్రవర్తన ఏ మాత్రం బాగాలేదు” అని చెప్పి సీతాదేవి ముఖానికి గుడ్డ అడ్డుపెట్టుకుని దీనంగా ఏడుస్తోంది.

రావణుడు సీతాదేవిని అనరాని మాటలు అని వెళ్లిపోయాడు. సీతని ఎప్పటిలాగే రాక్షసస్త్రీలు సంరక్షిస్తున్నారు” అని మార్కండేయ మహర్షి ధర్మరాజుతో చెప్పాడని వైశంపాయన మహర్షి మహాభారతకథని మనోహరంగాను, వివరంగాను, మధురంగాను చెప్పాడు.

అరణ్యపర్వంలోని ఆరవ ఆశ్వాసం సమాప్తం

Exit mobile version