Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-116: రామాయణ కథ

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

రావణ, కుంభకర్ణ, విభీషణుల తపస్సు

జనమేజయుడు అంతవరకు భారత కథని విన్న తరువాత “వైశంపాయనమహర్షీ! అడవిలో అంతులేని దుఃఖాన్ని అనుభవిస్తూ సత్యదీక్షతో ఉన్న మహానుభావులు పాండవులు ధర్మపత్ని పాంచాలితో కలిసి ఏం చేశారు?” అని అడిగాడు.

వైశంపాయనమహర్షి జనమేజయుడికి “ద్రౌపదిని విడిపించుకుని వచ్చి కామ్యకవనంలో బ్రాహ్మణులతో కలిసి నివసిస్తున్న పాండవుల దగ్గరికి మార్కండేయ మహర్షి వచ్చాడు. ధర్మరాజు తమ్ముళ్లతో కలిసి ఎదురెళ్లి తీసుకుని వచ్చి అతిథి సత్కరాలు చేశాడు.

జయద్రథుడు చేసిన దుర్మార్గం గురించి తాము చేసిన యుద్ధం గురించి వివరించి “మహానుభావా! మేము మంచి నడవడిక కలవాళ్లం, పరాక్రమవంతులం. అయినా ఈ అడవిలో ఇన్ని కష్టాలు పడుతున్నాం. ఎంత బలవంతులైనా విధి నుంచి తప్పించుకోలేరని అనిపిస్తోంది.

మహాత్మా! ద్రౌపదిలా ఇన్ని కష్టాలు అనుభవించిన రాజకుమారి, నేను అనుభవిస్తున్నట్టు కష్టాలు అనుభవించిన రాజకుమారుడు ఎవరేనా ఉన్నారా? మావాంటివాళ్లు ఉన్నట్లు ఎక్కడా వినలేదు, చూడలేదు” అన్నాడు.

ధర్మరాజు మాటలు విని గొప్ప తపస్సంపన్నుడైన మార్కండేయమహర్షి “ధర్మరాజా! ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నానని అదేపనిగా ఎందుకు బాధపడుతున్నావు?

నువ్వు పడిన కష్టం కంటే రఘువంశంలో పుట్టిన శ్రీరాముడు ఎక్కువ కష్టాల్ని అనుభవించాడు. కారడవుల్లో నివసించి అనేక బాధలు పడ్డాడు.

ఆ రఘురాముడి భార్య జనకమహారాజు కూతురు, మహాపతివ్రత అయిన సీత. అమెని రావణాసురుడు ఎత్తుకుపోలేదా? శ్రీరాముడు కోతిమూకల సాయంతో సముద్రం మీద వారథి కట్టి దివ్యాస్త్రాలతో రావణుడిని సంహరించలేదా? మళ్లీ ఆ రాజ్య సంపదలు అనుభవించలేదా?” అన్నాడు.

మార్కండేయుడు చెప్పినది విని ధర్మరాజు “మహాత్మా! శ్రీరాముడు ఏ వంశానికి చెందినవాడు? రావణుడు ఎవరి కొడుకు? రావణుడు సీతాదేవిని ఎత్తుకునిపోడానికి కారణం ఏమిటి? రాముడికి, రావణుడికి మధ్య యుద్ధం ఎలా జరిగింది? దయచేసి వివరంగా చెప్పండి” అని రామాయణ కథని వివరంగా తెలుసుకోవాలనే కోరికతో అడిగాడు. వైశంపాయన మహర్షి సావధానంగా వినమన్నాడు.

“ధర్మరాజా! ఇక్ష్వాకువంశంలో ’అజుడు’ అనే మంచి నడవడిక కలిగిన రాజు జన్మించాడు. అతడికి దశరథుడు అనే కొడుకు పుట్టాడు. దశరథుడికి ముగ్గురు భార్యలు. దశరథుడి భార్యల్లో కౌసల్యకి రాముడు, కైకేయికి భరతుడు, సుమిత్రకి లక్ష్మణ శత్రుఘ్నులు కలిగారు. వాళ్లల్లో రాముడికి విదేహ రాజకుమారి సీత భార్య అయింది.

రావణుడు పుట్టుక గురించి కూడా చెప్తాను విను. అన్ని లోకాల్ని సృష్టించే బ్రహ్మదేవుడికి మానసపుత్రుడై పులస్త్యుడు అనేవాడు పుట్టాడు. పులస్త్యుడికి వైశ్రవణుడు అనే కుమారుడు పుట్టాడు. వైశ్రవణుడు పులస్త్యుడు చెప్పినట్టు వినకుండా బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశాడు.

నలకూబరుడు అనే కొడుకుని కిన్నెరలోక ప్రభుత్వాన్ని, ధనానికి ఆధిపత్యాన్ని, శివుడితో స్నేహాన్ని వరాలుగా పొందాడు. ఆ వైశ్రవణుడి సంపద చూసి పులస్త్యుడికి కోపం వచ్చింది. తన సగం శరీరభాగం నుంచి విశ్రవసుడు అనేవాడిని సృష్టించి వైశ్రవణుడికి కీడు చెయ్యమని చెప్పాడు.

వైశ్రవణుడు విషయం తెలుసుకుని విశ్రవసుడి దగ్గరికి వెళ్లి “మహాత్మా! నేను నీకు కొడుకుగా ఉంటాను. నా మీద దయ చూపించు” అని వేడుకున్నాడు. అతడి అనుగ్రహాన్ని పొందాడు.

నాట్యంలోను, సంగీతంలోను ప్రావీణ్యం కలిగిన ముగ్గురు రాక్షస వనితల్ని ‘పుష్పోత్కట, మాలిని, బక’ అనే పేరు కలవాళ్లని ఆ బ్రాహ్మణుడికి సేవకులుగా సమర్పించాడు.

ఆ ముగ్గురూ మహర్షికి అత్యంత భక్తిశ్రద్ధలతో ఒకళ్లని మించి ఒకళ్లు సేవ చేసి అతడిని సంతోషపెట్టారు. వాళ్ల సేవకి సంతోషంచి విశ్రవసుడు వాళ్లకి సంతానాన్ని ప్రసాదించాడు.

పుష్పోత్కటకి రావణుడు, కుంభకర్ణుడు పుట్టారు. మాలినికి విభీషణుడు పుట్టాడు. బకకి ఖరుడు, శూర్పణఖ ఆడ మగ జంటగా కవలపిల్లలుగా పుట్టారు. ఆ నలుగురు కొడుకులకి తండ్రి అయిన విశ్రవసుడు జాతకర్మ సంస్కారాలు, వడుగులు చేయించాడు.

వాళ్లల్లో రావణుడు గొప్ప తేజస్సు కలవాడు. ఎత్తైన భూజాలు, పేరుప్రతిష్ఠలు సంపాదించిన పరాక్రమము, పది తలలతో ఎప్పుడూ ప్రజ్వరిల్లే కోపంతో ఉండేవాడు. కుంభకర్ణుడు కూడా కఠినంగాను, అహంకారంతోను ఉండేవాడు. విభీషణుడు గౌరవించదగిన మంచి గుణాలు కలిగి, మంచి మనస్సుతో నిర్భయంగా ఉండేవాడు.

ఖరుడిది వాడి వేడి కలిగిన వర్చస్సు కలవాడు. బ్రాహ్మణుల్ని అవమానించేవాడు. అతడి ఆహారం మాంసం, నెత్తురు. కఠినమైన మనస్సు కలవాడు.

శూర్పణఖ పాపాత్మురాలు. ధర్మకార్యాలు ఇష్టం లేని ఆ రాక్షస కుమారులు కనకుడి దగ్గర వేదవేదాంగాలు, విలువిద్య క్షుణ్నంగా నేర్చుకున్నారు.

గంధమాదన పర్వతం మీద సుఖంగా జీవిస్తున్నారు. ఒకరోజు కుబేరుడు విశ్రవసుణ్ని చూడాలని అక్కడికి వచ్చాడు. కుబేరుడికి వైభవము, మహిమలు కలగడానికి కారణం అతడు చేసిన తపస్సే అని తెలుసుకున్నారు. వాళ్లకి అసూయ కలిగింది. బ్రహ్మదేవుడిని గురించి తపస్సు చేయడం మొదలుపెట్టారు.

వాళ్లు ఎలా తపస్సు చేశారో చెప్తాను విను. రావణాసురడు వేసవి మండుటెండల్లో అయిదు అగ్నుల మధ్య నిలబడి, వానాకాలంలో ఆరుబయట, మంచుకురిసే కాలంలో నీళ్లల్లోను, నిష్ఠతో నిలబడి కేవలం గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుని తపస్సు చేశాడు.

కుంభకర్ణుడు ఆహారనియమాలు పాటిస్తూ ఇంద్రియాల్ని నిగ్రహించి, చలించని మనస్సుతో వ్రతాలు చేశాడు.

విభీషణుడు ఆకులు మాత్రమే ఆహారంగా తీసుకుంటూ వేదమంత్రాల్ని వల్లెవేస్తూ మనస్సుని నిర్మలంగా పవిత్రంగా ఉంచుకుంటూ తపస్సు చేశాడు.

ఖరుడు, శూర్పణఖ తమ అన్నగార్లయిన రావణుడు, కుంభకర్ణుడు, విభీషణులకి సేవలు చేస్తూ ఉన్నారు.

వేయి సంవత్సరాలు తపస్సు చేసినా బ్రహ్మదేవుడు సాక్షాత్కరించలేదు. రావణుడు తన దీక్షని వదలక పదితలల్లో ఒక తలని ఖండించి అగ్నికి ఆహుతి చేశాడు. అలాగే రావణుడు మరో తొమ్మిదివేల సంవత్సరాలు కఠోరతపస్సు చేశాడు. వేయి సంవత్సరాలు సంవత్సరానికి ఒక శిరస్సు వంతున ఆహుతిచేస్తూ చివరికి పదవతలని కూడా ఖండించి అగ్నిలో వేల్చడానికి సిద్ధమయ్యాడు.

పితామహుడు బ్రహ్మదేవుడు సాక్షాత్కరించి రావణుడి తొమ్మిది తలలు యథాప్రకారం వచ్చేట్టు చేసి అమరత్వం తప్ప ఏ వరం కావాలో కోరుకోమన్నాడు.

బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాలు

బ్రహ్మదేవుడు వరాలు కోరుకోమని చెప్పినప్పుడు రావణుడు “బ్రహ్మదేవా! దేవతలతోను, పితరులతోను, దితిపిల్లలతోను, పాములతోను, గంధర్వులతోను, రాక్షసులతోను, విద్యాధరులతోను, యక్షజాతులతోను నాకు ఓటమి రాకూడదు. ఈ సువిశాల సృష్టిలో నేను ఎక్కడికైనా ఇష్టమైన రూపంతో ఇష్టమైన చోటికి వెళ్ళగల శక్తి కావాలి” అని అడిగాడు.

అతడితో బ్రహ్మదేవుడు “మనుష్యులతో తప్ప నీకు ఇతర జాతులవల్ల చావుభయం లేదు” అని చెప్పాడు.

తరువాత బ్రహ్మదేవుడు కుంభకర్ణుణ్ని అడిగాడు. కుంభకర్ణుడు దురదృష్టం వల్ల తనకి ఎక్కువ ఇష్టమైన నిద్ర కావాలని కోరుకున్నాడు. బ్రహ్మదేవుడు కుంభకర్ణుడికి నిద్రని ప్రసాదించాడు.

బ్రహ్మదేవుడు విభీషనుణ్ని అడిగాడు. విభీషణుడు బ్రహ్మకి నమస్కారం చేసి ప్రస్తుతించాడు. ఎంత కీడు జరిగినా తన మనస్సు పాపానికి ఒడిగట్టకుండా వరం ఇచ్చి, బ్రహ్మాస్త్రాన్ని అనుగ్రహించమన్నాడు.

బ్రహ్మదేవుడు “నాయనా! విభీషణా! నువ్వు రాక్షసవంశంలో పుట్టినా ధర్మంగా ప్రవర్తించడం ఆశ్చర్యంగా ఉంది. నీకు అమరత్వాన్ని ప్రసాదిస్తున్నాను” అని చెప్పి అదృశ్యమయ్యాడు.

తరువాత బ్రహ్మదేవుడి వల్ల వరాలు పొందిన అహంకారంతో రావణుడు కిన్నరులకి అధిపతి అయిన కుబేరుడి మీద దండెత్తి వెళ్లాడు. కుబేరుడు రావణుడితో యుద్ధం చెయ్యడం వల్ల ప్రయోజనం లేదనుకుని పుష్పకవిమానం ఎక్కి లంకని వదిలిపెట్టి వెళ్లిపోయాడు. వెళ్లిపోతున్న కుబేరుణ్ని వెంబడించి అతడి పుష్పకవిమానాన్ని కూడా తీసేసుకున్నాడు.

యక్షరాజయిన కుబేరుడు కోపగించాడు. పెద్దవాడయిన తనని అవమానపరిచాడు కనుక, పుష్పక విమానం శత్రువులపాలవుతుందని రావణుణ్ని శపించాడు.

రాక్షస నాయకులు, భేతాళ నాయకులు రాక్షస మాయల్లో నేర్పుకలిగిన రావణుడిని రాక్షస సామ్రాజ్యానికి సార్వభౌముడిగా పట్టాభిషేకం చేశారు.

రావణుడు గర్వంతో విజృంభించి దేవేంద్రుడు మొదలైన వాళ్లని ఓడించి వాళ్ల స్థానాల్ని ఆక్రమించి జగత్తు మొత్తం బాధపడేట్టుగా రావణుడు అనే పేరు సార్థకమయ్యేలా ప్రవర్తించాడు.

దేవతలు, ఋషులు అగ్నిదేవుడి దగ్గరికి వెళ్లి విషయం చెప్పారు. అగ్నిదేవుడు వాళ్లని వెంటబెట్టుకుని బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లాడు. “బ్రహ్మదేవా! గొప్ప పరాక్రమం కలిగిన వీరుడు, విశ్రవసుడి కుమారుడు, దశముఖుడు, రాక్షస సార్వభౌముడు రావణుడు బలగర్వంతో దేవేంద్రుడు మొదలైన దేవతల్ని జయించాడు.

వాళ్లందరు గతిలేక రావణుడికి సేవకులై ఉన్నారు. అతడి బాధలు భరించలేక నీ పాదాల్ని ఆశ్రయించాము. నువ్వు తప్ప మాకు వేరే దిక్కు లేదు రక్షించు” అని వేడుకున్నారు.

బ్రహ్మదేవుడు “నేను ఈ సమస్య గురించి ఇదివరకే ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. శ్రీమన్నారాయణుడితో చెప్పాను. ఆయనే భూలోకంలో మనిషిగా జన్మించి రావణుడిని సంహరిస్తాడు.

ఆయనతో పాటు ఇంద్రుడు మొదలైన దేవతలు కూడా తమ తమ అంశలతో వానరులుగా, ఎలుగులుగా అవతరిస్తారు. ఇంక మీరు భయపడకండి!” అని చెప్పాడు.

తరువాత యక్షకాంత దుందుభిని పిలిచి దేవకార్యం నిర్వర్తించడానికి భూలోకంలో ‘మంథర’ అనే కుబ్జగా పుట్టమని చెప్పి, అగ్నిదేవుణ్ని మిగిలినవాళ్లని పంపించేశాడు” అని చెప్పాడు మార్కండేయమహర్షి.

అరణ్యవాసానికి వెళ్లిన శ్రీరాముడు

ధర్మరాజు మార్కండేయమహర్షితో “మహాత్మా! ‘మూర్తీభవించిన ధర్మం’ అని పేరు పొందిన శ్రీరాముడిని దశరథమహారాజు అడవులకి ఎందుకు పంపించాడు?” అని అడిగాడు.

మార్కండేయమహర్షి “ధర్మరాజా! దశరథమహారాజు పుణ్యఫలం వల్ల నలుగురు కొడుకుల్ని పొంది మూడులోకాలకి సార్వభౌముడు అయినంత ఆనందపడ్డాడు. వాళ్లల్లో శ్రీరాముడు పెద్దవాడు. నలుగురు పెరిగి పెద్దవాళ్లయ్యారు. వడుగులు జరిపించాడు. వేదవేదాంగాలు చదివారు. వివాహాలు కూడా జరిపించాడు.

వివిధవిద్యలు, వేదవేదాంగాలు సంపూర్ణంగా చదివినవాడు, దేవేంద్రుడితో సమానుడు; ఇంద్రియాల్ని జయించినవాడు; ధర్మం తెలిసినవాడు; బంధువులతోను, పౌరులతోను ఆరాధింపబడేవాడు; దుష్టశిక్షణ, శిష్ట రక్షణ చేయగల ఆదర్శ పరిపాలకుడు; రఘువంశాన్ని పావనం చేసేవాడు; తన పెద్దకుమారుడిని పట్టాభిషిక్తుడుగా చేయాలని అనుకున్నాడు.

దశరథమహారాజు తన శ్రేయోభిలాషులతోను, మంత్రులతోను, పురప్రజలతోను సంప్రదించి వాళ్ల అనుమతి తీసుకుని మంచి ముహూర్తం నిర్ణయించాడు.

కైక కొడుకు భరతుణ్ని పెంచిన దాది మంథర. ఆమె కైక దగ్గరికి వెళ్లి “నీ భర్తకి నీమీద నిజమైన ప్రేమ లేదని తెలిసింది. అతడి కపట ప్రేమని నిజమని నమ్మావు. దశరథుడికి కౌసల్యాదేవి అంటేనే ఎక్కువ ఇష్టం. దశరథుడు ఆమె కొడుకు శ్రీరాముడికి యువరాజ్య పట్టాభిషేకం చేస్తున్నాడు. నువ్వు కళ్లు మూసుకుని ఉన్నావు. నీ సవతి కౌసల్య, ఆమె కొడుకు శ్రీరాముడు భరతుణ్ని పక్కకి పెట్టి రాజ్యాన్ని ఏలుకుంటారు” అని చెప్పింది.

మంథర చెప్పిన మాట విని కైకేయి వెంటనే దశరథమహారాజు దగ్గరికి వెళ్లింది. అతడిని ఏకాంతంలో కలుసుకుని ప్రేమగా మాట్లాడి “మహారాజా! పూర్వం నువ్వు నాకు ఒక వరాన్ని ఇస్తానన్నావు. నువ్వు సత్యదీక్ష కలవాడివి కదా! ఇప్పుడు ఆ వరాన్ని నేను కోరుకుంటున్నాను. నాకు ప్రసాదించు” అని అడిగింది.

అది విని దశరథమహారాజు “చంపకూడనివాళ్లని చంపడము, చంపదగినవాళ్లని కాపాడడము, బ్రాహ్మణుల సొమ్ముని అపహరించడం తప్ప తక్కిన పనులు పాపం కలిగించేవయినా సరే నీ సంతృప్తికోసం చేస్తాను అడుగు” అన్నాడు.

కైకేయి “దశరథమహారాజా! భరతుడికి యువరాజపట్టాభిషేకము చెయ్యి. శ్రీరాముడిని పధ్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసం చెయ్యమని ఆజ్ఞాపించు. ఇదే నేను నిన్ను కోరుకుంటున్న వరం” అని చెప్పింది.

అది విని దశరథమహారాజు స్పృహతప్పి నేలమీద పడి మూర్ఛపోయాడు. జరిగిన విషయం తెలుసుకున్న శ్రీరాముడు తండ్రి సత్యసంధుడుగా ఉండాలని అనుకుని సీతాదేవితో కలిసి అడవికి బయలుదేరాడు. లక్ష్మణుడు అతడిని అనుసరించాడు.

Exit mobile version