Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-113: ధర్మరాజు కలలోకి మృగాలు

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

ధర్మరాజు కలలోకి మృగాలు

జనమేజయుడు అడిగినదానికి ఋషిపుంగవుడు వైశంపాయనుడు “జనమేజయా! ఒకరోజు ధర్మరాజు నిద్రపోతూ ఉండగా అతడికి ఆ అడవిలో నివసిస్తున్న జంతువులన్నీ కలలోకి వచ్చాయి.

“పుణ్యాత్మా! మీరు ఎల్లప్పుడు వేటాడి మమ్మల్ని చంపడం వల్ల మా సంఖ్య తగ్గిపోతోంది. ఇప్పుడు మా జాతులు కొన్ని మాత్రమే మిగిలాయి. మీరు దయతో వేరొక చోటికి వెళ్లిపోతే మేము, మా వంశాలు అంతరించి పోకుండా ఉంటాము” అని చెప్పాయి.

ధర్మరాజు అవి చెప్పినట్టు చెయ్యడానికి అంగీకరించాడు. నిద్రలేచిన తరువాత జరిగినదంతా తన తమ్ముళ్లకి చెప్పి “మనం ఈ ద్వైతవనానికి వచ్చి సంవత్సరం మీద ఎనిమిది నెలలు గడిచింది. ఇంకొక చోటికి పోవడం మంచిది. ఇప్పుడు కామ్యకవనంలో అనేక జంతువులు నివసిస్తున్నాయి. రుచికరమైన పండ్లతో నిండిన చెట్లు ఉన్నాయి. మంచినీటి సరోవరాలతో మనోహరంగా కనిపిస్తుంది. మనం అక్కడికి వెళ్లి తృణబిందు ఆశ్రమంలో ఉండడం మంచిదని అనిపిస్తోంది” అన్నాడు.

అతడి మాటలు విని “ధర్మరాజా! మీరు ఏది నిర్ణయించినా దాన్ని మేము అంగీకరిస్తాము” అన్నారు.

తరువాత ధర్మరాజు తమ్ముళ్లు, ద్రౌపది, సేవకులు బ్రాహ్మణులతో కలిసి కామ్యకవనానికి వెళ్లి అక్కడ నివాసాలు ఏర్పరుచుకున్నారు. అక్కడ దొరికిన ఆహారాన్ని శరీరపోషణకి తగినంత తింటూ నివసిస్తున్నారు. ఒకళ్లని ఒకళ్లు చూసుకుని వాళ్లు పడుతున్న కష్టాలకి దుఃఖపడుతున్నారు. జూదం ఆడిన రోజు జరిగిన అవమానాల్ని గుర్తు చేసుకుని బాధపడుతూ పదకొండు సంవత్సరాలు పూర్తి చేశారు.

వనవాసం పూర్తవుతుంటే కొంచెం వికసించిన ముఖాలతో తరువాత చెయ్యవలసిన పనుల గురించి ఆలోచిస్తున్నారు. ఒకరోజు పరాశరమహర్షి కొడుకు వేదవ్యాసుడు పాండవుల దగ్గరికి వచ్చాడు. ఆయన రావడాన్ని దూరం నుంచే చూసిన ధర్మరాజు తమ్ముళ్లతో కలిసి ఎదురెళ్లి తీసుకుని వచ్చి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి పూజించాడు.

అడవిలోనే నివసిస్తూ ఉండడం వల్ల చిక్కిపోయిన శరీరాలతోను, బాధలతో పరితపిస్తున్న మనసులతోను ఉన్న పాండవుల్ని చూసి వ్యాసమహర్షి ఎంతో బాధపడ్డాడు. ధర్మరాజుతో “మారుతున్న కాలాన్ని బట్టి ఒకసారి సంతోషం, ఒకసారి దుఃఖం కలుగుతుంటాయి. సుఖదుఃఖాలు ఎవరికీ స్థిరంగా ఉండవు. తెలివికలవాడు రెండిటినీ ఒకేలా స్వీకరిస్తాడు. నేను చెప్పేది శ్రద్ధగా విను.

మనస్సులో అపదల్ని గురించి ఆలోచించకు. కొంచెం ఓర్పుతో ఉండు. అన్నింటికంటే తపస్సు గొప్పది. దానివల్ల అన్ని సౌఖ్యాలు కలుగుతాయి. కనుక నువ్వు తపస్సు చెయ్యి. ఇహంలో చేసిన పుణ్యాన్ని మాత్రమే జీవి పరంలో అనుభవిస్తాడు. ఆ పుణ్యమే రాబోయే జన్మలో కూడా శుభాల్ని కలిగిస్తుంది. కాబట్టి శక్తివంచన లేకుండా దానధర్మాలు, పరోపకారం చెయ్యాలి” అని చెప్పాడు.

ధర్మరాజు “మహర్షీ! దానము, తపస్సులలో ఏది గొప్పది” అని అడిగాడు.

వ్యాసమహర్షి “ధర్మరాజా! దానం అంటే ధనాన్ని విడిచిపెట్టడమే కదా! అందువల్ల అది గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ధనాన్ని త్యాగం చెయ్యడం చాలా కష్టమైన పని. ఎందుకంటే మనుషులకి ప్రాణం మీదకంటే ధనం మీదే ఎక్కువ ఇష్టం ఉంటుంది.

ఆయుధాలతో యుద్ధం చెయ్యడం. సముద్రాలు దాటి దూరదేశాలకి వెళ్లడం, ఇతరులకి సేవకులుగా ఉంటూ శ్రమించడం ధనం కోసమే కదా! ఎన్నో కష్టాలు పడి సంపాదించిన ధనాన్ని త్యాగం చెయ్యడం గొప్ప విషయమే! అవినీతి మార్గంలో ధనాన్ని సంపాదించడం దాన్ని దానం చెయ్యడం బుద్ధిహీనులు చేసే పని. అటువంటి దానం వల్ల పుణ్యం కలగదు. శ్రమపడి సంపాదించిన ధనాన్ని దానం చేస్తేనే పుణ్యం కలుగుతుంది.

మంచి ఫలితాలనిచ్చేందుకు మూడు ముఖ్యమైన అంశాలున్నాయి. దానం అసలైన సమయంలోను, సరయిన ప్రదేశంలోను, అర్హత కలవాడికి ఇవ్వాలి. పూర్వకాలం ముద్గలుడు అనే బ్రాహ్మణుడు మంచి మార్గంలో సంపాదించిన వరిగింజలు నింపిన కలశాన్ని యొగ్యుడైన వ్యక్తికి దానం చెయ్యడం వల్ల కైవల్యపదాన్ని పొందాడు” అని చెప్పాడు.

అది విని ధర్మరాజు “మహర్షీ! ముద్గలుడు అనే బ్రాహ్మణుడు ఏ మార్గంలో వరిగింజలు సంపాదించి ఎవరికి ఎలా దానం చేశాడో దయచేసి వివరించి చెప్పండి” అని అడిగాడు.

వరిగింజలు దానం

“ధర్మరాజా! ముద్గలుడు చాలా గొప్ప బ్రాహ్మణుడు. తన ఇంటికి వచ్చిన వాళ్లకి అన్నంతో సహా అన్ని సౌకర్యాలు కలిగించేవాడు. అతిథుల్ని, అభ్యాగతుల్ని ప్రేమతో సేవించేవాడు. ఎప్పుడూ నిజాన్నే పలుకుతూ వైరాగ్యభావంతో ఉండేవాడు. ఇంద్రియాల్ని జయించినవాడు. గొప్ప పుణ్యాన్ని సంపాదించాడు. భార్యతోను, పుత్రులతోను కలిసి కురుక్షేత్రంలో ‘ఉంఛవృత్తి’ (పొలాల్లో రాలిన ధన్యాన్ని ఏరుకోవడం) చేసుకుంటూ జీవించేవాడు. పదిహేను రోజులు నిరాహార దీక్షతో ఉండేవాడు. అంటే పాడ్యమి తిథినుంచి, చతుర్దశి వరకు వాళ్లు వడ్ల గింజలు ఏరడం మొదలుపెట్టేవాళ్లు.

తూమెడు (నాలుగు కుంచాలు) వరిగింజలు పోగు చేసేవాళ్లు. పధ్నాలుగు రోజులు ఉపవాసముండి అమావాస్య లేదా పౌర్ణమి నాడు వంట చేయించేవాళ్లు. అలా వండిన అన్నంలో దేవతలకి పితృదేవతలకి నివేదన చేసి అతిథులకి పెట్టి మిగిలినది ముద్గలుడి కుటుంబం తినేవాళ్లు. జీవించడం కోసమే వాళ్లు ఆహారాన్ని తీసుకుంటూ పక్షోపవాస వ్రతాన్ని ఆచరించేవాళ్లు.

ఒకరోజు ముద్గలుడి దగ్గరికి దుర్వాసమహర్షి వచ్చాడు. పిచ్చివాడిలా, చిరిగిపోయిన బట్టలతో, జుట్టు విరబోసుకుని పల్లెటూరికి చెందిన అనాగరికుడిలా నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ వచ్చాడు.

పుణ్యమూర్తి అయిన మహర్షి అకలి అంటూ అర్తిగా వచ్చాడని ముద్గలుడు గౌరవంగా ఎదురెళ్లి అతడికి అర్ఘ్యపాద్యాలు ఇచ్చి పూజించాడు. అతిథిసత్కారం చేసి మహర్షికి భోజనం పెట్టాడు.

దుర్వాసుడు కడుపునిండా అన్నం తిని మిగిలిన అన్నాన్ని తన శరీరం నిండా పూసుకుని వెళ్లిపోయాడు. దుర్వాసుడు ప్రతి అమావాస్యకి, పౌర్ణమికి వస్తూనే ఉన్నాడు. ముద్గలుడు తను భోజనం చెయ్యకుండా దుర్వాసమహర్షికి అతిథిమర్యాదలతో గౌరవంగా ప్రేమగ భోజనం పెడుతూనే ఉన్నాడు.

అలా ఆరుసార్లు వచ్చి దుర్వాసుడు ముద్గలుణ్ని పరీక్షించాడు. ముద్గలుడి మనస్సులో కొంచెం కూడా లోపం కనిపించలేదు. ఆశ్చర్యంతోను, సంతోషంతోను దుర్వాసుడు ముద్గలుడితో “నీతో సమానమైన దానగుణం ఉన్నవాడిని నేను ఈ భూమి మీద ఇంతవరకు చూడలేదు. నువ్వు మహానుభావుడివి.

అన్నదానం చెయ్యడంలో సాటిలేని నిష్ఠ కలవాడివి. అన్నదానం చేసేప్పుడు నీ మనస్సులో కొంచెం కూడా అయిష్టత చూపించలేదు. నువ్వు అతిథుల్ని అవమానించకుండా అతిథిపూజ స్వచ్ఛమైన భక్తితో చేశావు. ప్రసన్నత, సత్యం, ధైర్యం, బహిరేంద్రియ నిగ్రహం, ఇతరుల సొమ్ము మీద కొంచెం కూడా కోరిక లేకపోవడం అనేవే నీ సంపదలు.

ముద్గలమహర్షీ! నాలుక ఎప్పుడూ రుచులకోసం ఉవ్విళ్లూరుతుంది. ఓర్పుని, ధర్మాన్ని, ఇంద్రియనిగ్రహాన్ని నాలుక నాశనం చేస్తుంది. వాటి మీద నీకు ఆసక్తి లేదు. నువ్వు బ్రతుకుని తీర్చిదిద్దే అన్నాన్ని, బ్రతకాలనే కోరికని కూడ వదిలిపెట్టేశావు. నీ గొప్పతనం మాటల్లో చెప్పలేను. చిత్తాన్ని, ఇంద్రియాల నడవడిని సరిగా ఉండేలా చేసే ధర్మమే తపస్సు అని పెద్దలు చెప్తారు.

ఆ నిర్వచనానికి సరిపోయే తపస్సు నీ దగ్గర కొత్తగా కనిపించింది. సిద్ధులన్నీ నువ్వు పొందావు. దేవతలు నీ తపస్సు గొప్పతనాన్ని కీర్తిస్తున్నారు. నువ్వు ఈ శరీరంతోనే స్వర్గలోకానికి చేరుకుంటావు” అని చెప్పి వెళ్లిపోయాడు.

తరువాత దేవదూత ముద్గలుడి దగ్గరికి విమానం తీసుకుని వచ్చాడు. ఆ విమానంలో హంసలు, బూరుగు పక్షులు ఉన్నాయి. వరుసగా ఉన్న చిరుగంటలతో ఆ విమానం అందంగా కనిపిస్తోంది.

ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లగల మహిమ కలిగినది. “ముద్గలమహర్షీ! నువ్వు చేసుకున్న పుణ్యం వల్ల నీకు స్వర్గలోకం ప్రాప్తించింది. అనందంగా వచ్చి ఈ విమానాన్ని ఎక్కు” అన్నాడు దేవదూత.

ముద్గలమహర్షి దేవదూతతో “మహాత్మా! స్వర్గలోకం ఎలా ఉంటుంది? దాని గురించిన వివరాలు వినాలని అనుకుంటున్నాను దయచేసి వివరించండి. మంచివాళ్లతో స్నేహం ‘సప్తదీనం’ అని పెద్దలు అటుంటారు. మన ఇద్దరికి స్నేహం ఏర్పడింది కనుక అడుగుతున్నాను” అన్నాడు.

పుణ్యలోక వివరణ

“ముద్గలా! స్వర్గలోకం భూలోకానికి పైన ఉంటుంది. ఎంతో అందంగా వెలుగుతూ దేవతలు తిరిగే స్థలము. అక్కడ గొప్ప తపస్సుతో సిద్ధిపొందిన మహర్షులు, గొప్ప యజ్ఞాలు చేసినవాళ్లు, సత్యాన్ని వదలకుండా పాటించినవాళ్లు, దానధర్మాలు చేసినవాళ్లు, యుద్ధాల్లో పరాక్రమం ప్రదర్శించినవాళ్లు సంతోషాన్ని అనుభవిస్తూ నివసిస్తారు.

అందులో అప్సరసలు, సాధ్యులు, దేవర్షులు, మరుత్తులు, వసువులు ఇష్టంగా నివసిస్తుంటారు. స్వర్గలోకంలో ముప్ఫై మూడువేల ఆమడల వైశాల్యం కలిగిన మేరుపర్వత శిఖరం ఉంది. అక్కడ దేవతలు పెంచుకునే తోట ఉంది. దాహం ఉండదు. చలి, వేడి వల్ల కలిగే బాధలు ఉండవు. ముసలితనం, రోగాలు ఉండవు. ఎటు చూసినా మనోహరంగా కనిపిస్తుంది.

స్వర్గలోకానికి వెళ్లడానికి అర్హులైన పుణ్యాత్ములు ఆయుష్షు తీరిన తరువాత రాలిపడిపోయే మనుషులు శరీరాల్ని విడిచిపెట్టి తేజోమయదేహాల్ని పొందుతారు. వాళ్లకి ఇష్టమైన వస్త్రాలు, అలంకారాలు, ఆభరణాలు, వాడిపోని పూలదండలు, అందమైన బంగారపు విమానాలు సమకూర్చి దేవతలు స్వర్గానికి తీసుకుని వెడతారు.

ఆ స్వర్గలోకంలో ఉన్నప్పుడు వాళ్లకి ఎటువంటి దుఃఖాలు ఉండవు. వాళ్లు ఎప్పుడూ సుఖాలే అనుభవిస్తూ అనందంలో మునిగి తేలుతుంటారు.

స్వర్గలోకానికి పైన ఇంకొక గొప్ప లోకం బ్రహ్మలోకం ఉంది. అక్కడ కూడా దుఃఖాలు ఉండవు. స్వయం ప్రకాశంతో సాటిలేని వెలుగుతో ప్రకాశిస్తుంది. బ్రహ్మలోకం యొక్క ప్రకాశంతో జగత్తు మొత్తం ప్రకాశిస్తుంది. అక్కడ మనువులు, బ్రహ్మలు, ఋషులు ఉంటారు. అక్కడ లోభం, కోపం, పాపం, చెడ్డపేరు, ఆవేదన, పునర్జన్మలు ఉండవు.

లోకాలన్నీ ప్రళయకాలంలో నాశనమయినా సత్యలోకం శాశ్వతంగా ఉంటుంది. ఆ లోకానికి చేరుకోవాలని ఇంద్రుడివంటివాళ్లు కూడా తాపత్రయపడతారు. స్వర్గలోకంలో ఉండే మంచి గుణాలు చెప్పాను.

దానిలో ఉండే దోషాలు కూడా చెప్తాను విను. భూలోకంలో చేసిన పుణ్యఫలితాలు మనిషి స్వర్గలోకంలో అనుభవిస్తాడు. కాని, మనిషి స్వర్గలోకంలో ఎటువంటి పుణ్యాన్ని సంపాదించలేడు. మనిషి చేసిన పుణ్యం పూర్తయిపోయాక అతడు స్వర్గలోకంలో ఉండకూడదు. అతణ్ని మళ్లీ భూలోకంలోకి తోసేస్తారు.

స్వర్గం నుంచి తేజస్సు పోగొట్టుకుని పుణ్యమంతా నశించి భూమిమీదకి వచ్చిన మనిషి ఆవేదన పొందుతాడు. భోగాలు అనుభవించడానికి అలవాటు పడినవాడికి వాటిని వదలడమంటే కలిగేది ఆవేదనే కదా! బ్రహ్మలోకానికి మిగిలిన పుణ్యలోకాలకి మధ్య ఉండే తారతమ్యం ఇదే.

భూలోకం కర్మభూమి. భూలోకంలో చేసిన కర్మవల్ల పుణ్యపాపాలు సిద్ధిస్తాయి. స్వర్గసీమ ఫలభూమి. జీవి భూలోకంలో చేసిన కర్మలకి అనువైన పుణ్యానికి తగిన స్వర్గభోగాల్ని స్వర్గలోకంలో అనుభవిస్తాడు.

 నీ మీద ఉన్న అభిమానం వల్ల నేను నీకు ఈ విషయాలు వివరించి చెప్పాను. ఇంక అలస్యం ఎందుకు? నువ్వు స్వర్గలోకానికి రా!” అన్నాడు.

దేవదూత చెప్పింది విని ముద్గలుడు కొంతసేపు ఆలోచించి “ప్రియమైన దేవదూతా! నాకు స్వర్గభోగాలు అవసరం లేదు. అటువంటివి పదివేలు కలిగినట్లుగానే అనుకుంటున్నాను. వాటిని దేవతలే అనుభవించనియ్యి. నువ్వు ఈ క్షణంలోనే నీకు ఎక్కడికి వెళ్లాలని అనిపిస్తే అక్కడికి వెళ్లిపో.

ఏ ప్రదేశానికి చేరితే జీవుడు మళ్లీ భూలోకానికి చేరకుండా ఉంటాడో అటువంటి ప్రదేశానికి వెళ్లడానికి శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాను” అని చెప్పి దేవదూతని గౌరవ మర్యాదలతో సాగనంపాడు.

తరువాత ఉంఛవృత్తి విడిచిపెట్టాడు. ఏ వికారము లేని నిర్వికారస్థితిని పొంది గొప్ప జ్ఞాని అయ్యాడు. పొగడ్తలని, నిందలని ఒకే భావంతో స్వీకరించడం; మట్టిపెళ్ల, రాయి, బంగారాన్ని ఒకేదృష్టితో చూడడం కలిగిన స్థితికి చేరుకుని జీవన్ముక్తుడయ్యాడు.

“ధర్మరాజా! నువ్వు రాజ్యాన్ని పోగొట్టుకున్నానని బాధపడకు. కర్మయోగంతోగాని, జ్ఞానయోగంతోగాని చరితార్థత సిద్ధిస్తుంది. నువ్వు తపస్సు చెయ్యి. తపస్సు వల్ల అన్ని శుభాలు కలుగుతాయి.

పదమూడు సంవత్సరాలు గడిపిన తరువాత నీకు నీ తల్లితండ్రుల రాజ్యం దక్కుతుంది” అని సత్యవతి కొడుకు వేదవ్యాసుడు కుంతి కొడుకులైన పాండవుల్ని ఓదార్చి తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు.

Exit mobile version