Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-111: దుర్యోధనుడి విషాదము

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

అరణ్యపర్వము – ఆరవ ఆశ్వాసము

దుర్యోధనుడి విషాదము

హాభారతకథని ఉగ్రశ్రవసుడు శౌనకుడు మొదలైన మహామునులకి చెప్పాడు. మనుష్యులకి ఉండే శక్తిని మించిన అర్జునుడి శక్తి, దుర్యోధనుడి అనుకోని భయంకరమైన అవమానం, ధర్మరాజు ప్రదర్శించిన దయాగుణం గురించి విని జనమేజయుడు ఆశ్చర్యంతోను, అసహ్యంతోను నిండిన మనస్సుతో వైశంపాయనుడితో  “ఋషులలో గొప్పవాడవైన మహర్షీ! పాండవులకి కీడు చెయ్యడం కోసం ఎప్పుడూ అవకాశాల కోసం ఎదురుచూస్తాడు దుర్మార్గుడు దుర్యోధనుడు. అతడు శత్రువులతో అవమానించబడి, కురువంశ సింహాలయిన పాండవుల బలపరాక్రమాలతో బంధం నుంచి తప్పించబడి రాజధానికి ఎలా తిరిగి వెళ్లాడు.

దుర్యోధనుడు చాలా స్వాభిమానం కలవాడని విన్నాం. అంత పరాభవం జరిగిన తరువాత అతడు ‘నేనొక గొప్ప అభిమానం కలిగిన మహారాజుని; నాకు ప్రాణాలు, మానాభిమానాలు ఉన్నాయి; ఇటువంటి అవమానాన్ని ఎలా దిగమింగుకోగలన’ని ఆలోచించకుండా ఎలా ఉండగలడు?

ఈ విషయం చాలా అద్భుతంగా ఉంది. ఇంత జరిగాక దుర్యోధనుడు ఎలా ప్రవర్తించాడో వివరంగా తెలియచెయ్యండి. నాకు వినాలని ఆశగా ఉంది” అని అడిగాడు జనమేజయుడు.

వైశంపాయనుడు “జనమేజయ మహారాజా! దుర్యోధనుడు పాండవులవల్ల బంధవిముక్తుడై అవమానంతో హృదయంలో అనేక విధాలుగా బాధపడుతూ చెల్లాచెదరైన సేనల్ని కలుపుకుని కొంత దూరం ప్రయాణం చేసి  మిట్టపల్లాలు లేని స్థలం చూసుకుని కుటీరాలు నిర్మించుకుని విడిది చేశాడు.

మనస్సుకి ప్రశాంతత లేకపోడంతో ఏంకాంతంగా లోపలి గదిలో మంచం మీద పడుక్కుని బాధపడుతున్నాడు. అవమానభారంతో దుర్యోధనుడి ముఖం పాలిపోయింది.

కర్ణుడు అక్కడికి వచ్చి రాజమర్యాదలు నిర్వర్తించి దుర్యోధనుణ్ని చూసి “దుర్యోధన మహారాజా! మనుషులకి సాధ్యంకాని గొప్ప పనిని నువ్వు చేశావు. అటువంటి యుద్ధం ఎక్కడా కనిపించదు.

వాళ్లు గంధర్వుల్లో సింహాల్లాంటివాళ్లు, గొప్ప శౌర్యం కలవాళ్లు, కోపంతో విజృంభించారు. కోరిన రూపం ధరించగల మాయా విద్య తెలిసిన వాళ్లని నువ్వు నీ తమ్ముళ్లు ఎదుర్కోడం చెప్పుకోతగిన విషయం.

నువ్వు చూశావు కదా.. గంధర్వులు ఎన్ని బాణాలతో నన్ను నిరోధించారో.. నేను కూడా వాళ్లతో పోరాడి కుప్పలు కుప్పలుగా నేల కూల్చాను. మన సేనలు నాకు సహాయం చెయ్యలేక పోయాయి. రణరంగంలో నేనొక్కడినే కష్టపడ్డాను. అంతలోనే నా రథం కూడా విరిగిపోయింది.

నేను వికర్ణుడి రథం ఎక్కాను. అది యుద్ధభూమి నుంచి దూరంగా వెళ్లిపోయింది. నువ్వు శత్రువుల్ని జయించి గాయాలు లేకుండా ఉన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంత గొప్ప పరాక్రమం ప్రదర్శించినవాళ్లు లోకంలో ఎవరున్నారు” అన్నాడు.

కర్ణుడి మాటలు విని దుర్యోధనుడు తన మనసులో ‘ఇతడికి నా సంగతి తెలియదేమో..’ అనుకుని సిగ్గుపడుతూ “కర్ణా! నేనూ తమ్ముళ్లు గంధర్వుల్ని ఎదిరించి యుద్ధం చేశాం. రెండు వైపుల సేనల్లోను చాలా మంది మరణించారు. అనేకమంది గాయపడ్డారు. నాకు, చిత్రసేనుడికి మధ్య ద్వంద యుద్ధం జరిగింది. అతడు నన్ను ఓడించి నన్ను, నా భార్యల్ని, తమ్ముళ్లని, కొడుకుల్ని, స్నేహితుల్ని బంధించి ఆకాశానికి ఎగిరాడు.

మనవాళ్లు భయంతో పరుగెత్తుకుని వెళ్లి ధర్మరాజుని శరణు వేడారు. మన కౌరవ భటుల ఆవేదన విని ప్రజలతో పూజింపబడే ధర్మరాజు పుణ్యాత్ముడు నన్ను బంధవిముక్తుణ్ని చేయించడానికి గొప్ప బలవంతులు శౌర్యవంతులయిన తన తమ్ముళ్లని పంపించాడు. వాళ్లు ఉత్సాహంతో గంధర్వుల్ని ఎదిరించారు.

మొదట పాండవులు మంచిమాటలతో మమ్మల్ని బంధవిముక్తుల్ని చెయ్యమని ప్రార్థించారు. గంధర్వులు అంగీకరించలేదు. పాండవులు సాహసించి గంధర్వులతో భీకరమైన యుద్ధం చేశారు. వాళ్ల ధాటికి తట్టుకోలేక గంధర్వులు మమ్మల్ని పట్టుకుని ఆకాశంలోకి ఎగిరిపోతుంటే అర్జునుడు బాణాలతో ఆకాశాన్ని నింపి వాళ్ల ప్రయత్నాన్ని ఆపించాడు. ఇంక చేసేదేమీ లేక అర్జునుడి బాల్యస్నేహితుడు చిత్రసేనుడు అర్జునుడి దగ్గరికి వచ్చి యోగక్షేమాలు అడిగి అతన్ని ప్రసన్నుణ్ని చేశాడు.

అర్జునుడు చిత్రసేనుడితో ‘దుర్యోధనుడు మాకు సహోదరుడు. అతణ్ని విడిచిపెట్టండి’ అని అడిగాడు. చిత్రసేనుడు మనం అనుకున్న విషయాలన్నీ అర్జునుడికి వివరించి చెప్పి ‘శూరుడా అర్జునుడా! ఇదంతా మేము చేసిన పనికాదు. దేవేంద్రుడు ఆజ్ఞాపించడం వల్ల మేము ఇదంతా చేశాము. కనుక వీళ్లని విడిచిపెట్టము’ అన్నాడు.

నాకు ఆ దయనీయస్థితిలో చాలా సిగ్గుగా అనిపించింది. మనసులో ‘అయ్యో! ఇప్పుడు భూమికి పెద్ద బెజ్జం పడితే బాగుంటుంది. అందులో పడి నాశనమయ్యేవాడిని’ అనిపించింది.

భీముడు, అర్జునుడు, నకులసహదేవులు గంధర్వరాజుని వెంటబెట్టుకుని ధర్మరాజు దగ్గరికి వెళ్లారు. మన చెడు పన్నాగం బెడిసికొట్టి గంధర్వులు చెరబట్టడం వల్ల నన్ను అజాతశత్రుడైన ధర్మరాజు దగ్గరికి తీసుకుని వెళ్లారు. అతడు నన్ను విడిచిపెట్టమని గంధర్వరాజుకి చెప్పాడు. నీ యుద్ధం తరువాత ఇంత జరిగింది.

శత్రువుల ఎదుట అవమానం పొందాను. ప్రజలందరు ఇప్పుడు నన్ను వెక్కిరిస్తారు. ఇంక నాకు ఈ బ్రతుకెందుకు? ఈ భూమిని ఎలా పాలించగలను? ఏ ముఖం పెట్టుకుని తిరగగలను?

ఈ యుద్ధంలో గంధర్వులతో యుద్ధం చేసి అమితమైన పరాక్రమం ప్రదర్శించి వీరమరణం పొందినా బాగుండేది. ఈ అవమానం లేకుండా స్వర్గలోకం దక్కేది. నా కీర్తి ఈ భూలోకంలో నిలిచేది” అని చెప్పుకుని బాధపడ్డాడు

ప్రాయోపవేశ ప్రయత్నము

కర్ణుడితో “నాకు ఇటువంటి దీనస్థితి కలిగినందుకు నేను నిరశన వ్రతం మొదలుపెట్టి మరణిస్తాను. ఇంతకంటే వేరే గత్యంతరం లేదు. మీరందరు దుశ్శాసనుడిని నాయకుడిగా చేసుకుని హస్తినాపురానికి వెళ్లండి. మిత్రులకి సంతోషాన్ని, శత్రువులకి దుఃఖాన్ని కలిగిస్తూ తిరిగిన నేను ఇప్పుడు శత్రువులతో అవమానించబడి పరువు పోగొట్టుకుని తలవంచుకుని తిరగలేను.

నాది శత్రువులతో తన్నబడిన శిరస్సు. చుట్టాల మధ్య ఏ మొహం పెట్టుకుని వెళ్లగలను? ధృతరాష్ట్రుడితో ఎలా మాట్లాడగలను? గురువులైన కృపాచార్య, ద్రోణాచర్యుల సమక్షంలో ఎలా నిలబడగలను? సేవకుల్ని ఎలా ఆజ్ఞాపించగలను? పురజనుల్ని, పురోహితుల్ని ఎలా పలకరించగలను?

ఇదంతా నేను స్వయంగా చేసుకున్నదే. పశ్చాత్తాపంతో ప్రాయిశ్చిత్తం చేసుకుంటాను. ఈ కర్మ ఫలాన్ని అనుభవించక తప్పదు. అహంకారం కలవాడు సిరిసంపదలతో తులతూగవచ్చు, పెద్ద చదువులు చదవవచ్చు. కాని వాటిని మంచిగా ఉపయోగించుకోలేక మూర్ఖులు వెళ్లే దారిలో వెళ్లి చివరికి చెడిపోతాడు.

అయ్యయ్యో! నాకు ఎంత దురవస్థ కలిగింది. నా అంతటి పరాక్రమశాలిని శత్రువులు యుద్ధంలో ఓడించి బంధించడమా? ఒకడెవడో వచ్చి జాలితో నన్ను బంధవిముక్తుణ్ని చెయ్యడమా? దేవుడు తలుచుకుంటే ఏదైనా చెయ్యగలడు.

ఎంత బలం కలవాళ్ళైనా విధి చేతిలో కీలుబొమ్మలే కదా! ఆత్మాభిమానం లేకుండా ఈ శరీరంలో ఉన్న ప్రాణాల్ని ఎలా భరించగలను? మానం కంటే ప్రాణం గొప్పది కాదు. అందుకే నేను ప్రాయోపవేశం చేసి ప్రాణాలు విడుస్తాను. ఇది నా ధృఢ సంకల్పం. నన్ను ఎవరూ అపలేరు” అన్నాడు.

అప్పుడే వచ్చి తన దగ్గర నిలబడిన దుశ్శాసనుణ్ని చూసి దుర్యోధనుడు “దుశ్శాసనా! నీకు పట్టాభిషేకం చేస్తాను. నువ్వే రాజువి. కర్ణుడు, శకుని నీకు సహాయపడతారు. ఈ భూమండలం మొత్తం పాలించి కీర్తిని పొందు. సోదరుల్ని అభిమానంగా చూసుకో. చుట్టాల్ని, స్నేహితుల్ని పోషించు. ఉత్తములైన బ్రాహ్మణులకి అగ్రహారాలు దానం చెయ్యి. పెద్దల్ని పూజించు. శత్రువుల మీద నీ పరాక్రమాన్ని చూపించు. వీరులైన స్నేహితుల్ని తగిన విధంగా ఆదరించు” అని చెప్పాడు.

దుర్యోధనుడి మాటలు విని దుశ్శాసనుడు నిలబడలేక బాధతో విలవిల్లాడుతూ దుర్యోధనుడి కాళ్ల మీద పడిపోయాడు. కన్నీళ్లతో అతడి కాళ్లు తడుపుతూ “దుర్యోధన సార్వభౌమా! రాజ్యభారం వహించవలసినవాడివి నువ్వే. ఈ రాజ్యం నువ్వు కోరుకోడం వల్లే ఏర్పడింది.

ఈ భూమి ముక్కలు చెక్కలయినా.. సముద్రం ఇంకిపోయినా సుర్యచంద్రులు తమ తేజస్సుని పోగొట్టుకున్నా నీలో ఎటువంటి చెడ్డ భావాలు కలుగకుండా ఉండాలి! ఈ రాజ్యభారాన్ని నేను మొయ్యలేను. ఈ భారం నీదే! మహారాజా! స్నేహితుల్ని కాపాడుతూ, శత్రువుల్ని నాశనం చేస్తూ ఈ భూమండలం మొత్తంలో విజయం సాధిస్తూ నువ్వే పరిపాలించు!” అని చెప్తూ దుశ్శాసనుడు బాధతో బిగ్గరగా ఏడ్చాడు.

వాళ్లని చూసి కర్ణుడు “మీరిద్దరూ చిన్నపిల్లల్లా ఎందుకు ఏడుస్తున్నారు. ధైర్యంగా ఉండాలి. దుఃఖం మంచిది కాదు. మీరు దుఃఖిస్తే శత్రువులు చూసి సంతోషిస్తారు. బాధపడేవాళ్లకి ఇంకా కొన్ని కష్టాలు వచ్చి చేరతాయి” అని చెప్పాడు.

దుర్యోధనుడితో కర్ణుడు “చంద్రవంశంలో పుట్టిన దుర్యోధన మహారాజా! ఒక మమూలు మనిషిలా నువ్వు ఏడవకూడదు కదా? గొప్ప భోగభాగ్యాలు అనుభవించ వలసినవాడివి, ఆత్మహత్య పేరుతో శరీరాన్ని విడిచిపెడతావా? ఇటువంటి పని క్రమశిక్షణలేని బలహీనమైన మనస్సు కలవాళ్లు చేస్తారు.

నీవంటి వాళ్లకి ఇది తగిన పని కాదు. నువ్వు మాకు అధిపతివి. నువ్వు దుఃఖపడితే నిన్ను చూసి నీ తమ్ముళ్లు అంత కంటే ఎక్కువ దుఃఖపడతారు. నువ్వు మమ్మల్ని చూసయినా నీ నిరశన వ్రతాన్ని వదిలిపెట్టు.

శత్రువులయిన పాండవుల వల్ల బంధవిముక్తుణ్ని అయ్యానని అభిమానధనుడవైన నువ్వు బాధపడడం సహజమే! అయినా సూక్ష్మదృష్టితో ఆలోచిస్తే ఇది మంచిది కాదు. అసలు పాండవులు ఎవరు? నీ రాజ్యంలో సుఖంగా జీవిస్తున్న పౌరులే కదా! రాజుకి ఆపద వచ్చినప్పుడు తమ ప్రాణాలు అర్పించి అయినా పౌరులు రాజుకి సేవ చెయ్యలికదా!

పాండవులు నీ సేవకులు. నువ్వు పాండవులకి రాజయిన సార్వభౌముడివి. నీ రాజ్యంలో శాంతిభద్రతల్ని అనుభవిస్తూ నివసిస్తున్న సేవకులు.

సేవకుల ధర్మం రాజుని రక్షించడం. కనుక వాళ్లు తమ ప్రభువు ఋణం తీర్చుకోడానికి నిన్ను విడిపించారు. అది వాళ్లు తప్పనిసరిగా చెయ్యవలసిన బాధ్యత.

అంతేకాదు, జూదంలో ఓడిపోయిననాడే వాళ్లు నీకు దాసులు. వాళ్ల ధనధాన్య సంపదలు, పౌరుషప్రాభవాలు అన్నీ నీ సొత్తే కదా! అసలు పాండవులు నీ కొలువులో ఉండి ప్రతిరోజూ నీకు సేవ చెయ్యవలసినవాళ్లే! ఏదో అవసరం వచ్చింది కనుక నీకు సేవ చేసి స్వామి భక్తిని ప్రదర్శించి ధన్యులయ్యారు.

ఇలా సూక్ష్మదృష్టితో ఆలోచించి నీ ప్రాయోపవేశ దీక్షని మానుకో! తరువాత చెయ్యవలసిన పనేమిటో ఆలోచించు. లేకపోతే నిన్ను లోకులు పరిహాసం చేస్తారు” అని హితబోధ చేశాడు.

ఎన్ని చెప్పినా దుర్యోధనుడు తన పట్టు విడవలేదు. శకుని దుర్యోధనుడితో “దుర్యోధనమహారాజా! కర్ణుడు చక్కని హితబోధ చేశాడు. అతడి మాటలు సందర్భానికి తగినట్టు ఉన్నాయి. విచక్షణ, విజ్ఞానం కలిగి ఉన్నాయి. అతడు చెప్పినట్టు విని నీ దుఃఖంలోంచి బయటపడు. నువ్వు మామూలు మనిషివి కాదు. సార్వభౌముడివి. నువ్వు నీ కర్తవ్యాన్ని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి.

నీకు ఈ భూరాజ్యాన్ని మొత్తాన్ని కేవలం నా బుద్ధి బలంతో సంపాదించి ఇచ్చాను. ఈ రాజ్యం నువ్వు నీ బాహుబలంతో సంపాదించలేవు కదా! నువ్వు సంపాదించుకున్న దాన్ని నువ్వు వదిలిపెట్టచ్చు. కాని నేను సంపాదించి ఇచ్చినదాన్ని వదిలిపెడితే నా మనస్సు బాధ పడుతుంది.

నువ్వు కష్టపడకుండా పొందిన రాజ్యాన్ని హాయిగా అనుభవించకుండా ఆత్మహత్య చేసుకోవడం అవివేకం. నీకు పిచ్చెక్కిందేమో.. నీలో ఉన్న లోపం నాకు తెలిసింది. నువ్వు యువరాజుగా పుట్టి పెరిగిన ఆగర్భశ్రీమంతుడివి. నువ్వు పెద్దలకి పరిచర్య చేయలేదు. పెద్దలకి పరిచర్య చేస్తే కలిగే వ్యవహారిక జ్ఞానం నీకు కలగలేదు.

అప్పుడప్పుడు కోపం వచ్చినా, మనస్సుకి బాధకలిగినా అటువంటి వాటిని ధైర్యశాలి వెంటనే వదిలిపెట్టెయ్యాలి. భయపడే స్వభావం, ప్రమత్తత, వికారత్వం, మరీ మెత్తగా ఉండడం వల్ల బాధ్యతలు నిర్వహించడంలో విచక్షణ లేకుండా పోతుంది. అటువంటి లక్షణాలు కలిగిన రాజుకి సంపదలు పోతాయి. కనుక, నువ్వు ఎలా చేస్తే బాగుంటుందో ఆలోచించుకో.

బాధ్యతలు నిర్వర్తించవలసిన జ్ఞానం ఎలా ఉంటుందో చెప్తాను విను. మహారాజా! నీకు పాండవులు ఉపకారం చేసిన మాట నిజమే. నువ్వు వాళ్లకి ప్రత్యుపకారం చెయ్యడం మంచిది. నువ్వు వాళ్లని సత్కరించు. ప్రేమతో వాళ్లతో స్నేహంగా ఉండు. అంతేకాని, సంతోషించవలసిన చోట దుఃఖపడ్డం మంచి పద్ధతి కాదు.

పాండవులు నీకు చేసిన మేలు గుర్తించి నీ మనస్సులో ఉన్న పాపాన్ని తుడిచేసి వాళ్లని పిలుచుకునిరా! కుంతి కొడుకులు మంచివాళ్లు, లోకోత్తర పరాక్రమవంతులు, దివ్యతేజస్సు కలవాళ్లు. పాండవులకి చెందిన రాజ్యాన్ని వాళ్లకి ఇచ్చి ప్రేమగా ఆదరించు. అప్పుడు నీకు ఈ భూమండలంలో ఎనలేని కీర్తి కలుగుతుంది.

పాండవులు నీకు తోడపుట్టినవాళ్లు. మీరూ పాండవులూ ఐకమత్యంతో ఈ రాజ్యాన్ని పాలించండి. అలా చేస్తే మీకూ పాండవులకీ ఇద్దరికీ మంచి జరుగుతుంది” అని తన అభిప్రాయాన్ని వివరించాడు.

దుర్యోధనుడు తన కాళ్ల మీద పడి ఏడుస్తున్న దుశ్శాసనుణ్ని పైకి లేపి కౌగలించుకున్నాడు. కర్ణుడితోను, శకునితోను “ఎందుకు మీరు నన్ను బాధ పెడుతున్నారు? నాకు ధర్మంమీద, ధనధాన్యాలమీద, సంపదల మీద ఇష్టం లేదు. నిరాహారదీక్ష చెయ్యాలన్న నిర్ణయానికి కట్టుబడి ఉండాలని గట్టిగా నిర్ణయించుకున్నాను. నన్ను వారించకండి. మీరు మీ ఇష్టం వచ్చిన చోటుకి వెళ్లండి” అని చెప్పాడు.

వాళ్లు అతడి మాటలు విని  “ప్రభూ! మిమ్మల్ని వదిలి మేము ఎక్కడికీ వెళ్లలేము. నీతోపాటు సహగమనం చేస్తాము” అన్నారు.

సూర్యుడు అస్తమించే సమయం అయింది. దుర్యోధనుడు స్వర్గలోకానికి వెళ్లడానికి నిశ్చయించుకుని స్నానం చేసి పవిత్రమైన దర్భలచాప మీద కూర్చుని సంధ్యా సమయంలో చేయవలసిన పనులు చేసి ఏకాంతప్రదేశంలో మౌనవ్రతం మొదలుపెట్టాడు.

నిరాహారదీక్షలో ఉన్న దుర్యోధనుడు క్రమక్రమంగా పైకి కనిపించే ఇంద్రియాలు చేసే పనులన్నీ వదిలిపెట్టాడు. గొప్ప సమాధి స్థితిలోకి చేరి దేదీప్యమానంగా ప్రకాశిస్తున్నాడు.

Exit mobile version