[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
దుర్యోధనుడు గంధర్వులతో యుద్ధం
దుర్యోధనుడు వినోదం కోసం సరోవరం దగ్గర ఇళ్లు కట్టమని తన సేవకుల్ని ఆజ్ఞాపించాడు. అతడి సేవకులు దుర్యోధనుడు చెప్పినట్టు చేస్తున్నారు. అంతలో గంధర్వులు వచ్చి ఆ భటుల్ని అడ్డగించారు. “ఈ సరోవరం చిత్రసేనుడు అనే గంధర్వరాజు విహరించడం కోసం నిర్మించబడింది. మీరు ఈ కొలను దగ్గరికి రాకూడదు. వెంటనే తిరిగి వెళ్లండి” అన్నారు.
భటులు వెళ్లి దుర్యోధనుడికి విషయం చెప్పారు. దుర్యోధనుడు బలవంతులైన కొంతమంది భటుల్ని గంధర్వుల దగ్గరికి యుద్ధానికి పంపించాడు. వాళ్లు గంధర్వుల దగ్గరికి వెళ్లి “గంధర్వులారా! మహాబలవంతుడైన దుర్యోధన సార్వభౌముడు ధృతరాష్ట్రుడి కొడుకు, పరాక్రమశాలి, వీరాధివీరుడు. ఈ కొలనులో జలక్రీడలు ఆడాలని వచ్చాడు. మీరు ఇక్కడ ఉండకూడదు. దూరంగా వెళ్లిపొండి!” అన్నారు.
గంధర్వులకి ఆగ్రహం కలిగింది. వాళ్ల ప్రగల్భాలకి నవ్వుకుంటూ “భటులారా! మీ రాజుకి తన శక్తి తనకే తెలియదు. అవతలివాళ్ల శక్తిని అంచనా వెయ్యడం కూడా తెలియదు. గర్వంతో తన గౌరవాన్ని చివరికి ప్రాణాల్ని కూడా పోగొట్టుకోవలసి ఉంటుంది.
మీ ప్రభువుకి ఈ విషయం తెలిసినట్టులేదు. ఈ సరోవరతీరం గంధర్వుల స్థానం. మీ రాజు ఇటువంటి సాహసం చెయ్యకూడదు. వివేకంతో ఆలోచించి ఇక్కడి నుంచి వెళ్లిపోవడం మంచిదని మీ రాజుకి చెప్పండి” అన్నారు.
భటులు తమ ప్రభువు దగ్గరికి వెళ్లి గంధర్వులు చెప్పిన మాటలు వివరించి చెప్పారు. దుర్యోధనుడు ఆగ్రహంతోను, అహంకారంతోను తన తమ్ముళ్లని, సామంతరాజుల్ని చూసి “మీరు మీ సేనలతో వెళ్లి ఆ గంధర్వుల్ని ఓడించి సరోవరాన్ని ఆక్రమించండి. దేవేంద్రుడు దేవతలతో వచ్చినా సరే వాళ్లని జయించండి” అన్నాడు.
వాళ్లందరు తమ సేనలతో బయలుదేరి గంధర్వుల మీదకి దండెత్తి వెళ్లారు. వాళ్లు చేసిన సింహనాదాలకి దిక్కులు పిక్కటిల్లాయి. కౌరవవీరుల్ని చూసి కొంతమంది గంధర్వులు సౌమ్యంగా “వీరులారా! మీరెందుకు దండెత్తి వస్తున్నారు? మీకూ మాకూ కయ్యం ఎందుకు? ఆగండి!” అన్నారు. వాళ్ల మాటలు లెక్కచేయక గంధర్వుల మీదకు అస్త్రాలు, శస్త్రాలు ప్రయోగించారు కౌరవ భటులు.
గంధర్వులు జరుగుతున్న విషయం తమ ప్రభువైన చిత్రసేనుడికి చెప్పారు. చిత్రసేనుడు కోపంతో “మీరు వెంటనే వెళ్లి కౌరవుల్ని చుట్టుముట్టి సంహరించండి” అని యుద్ధంలో ఆరితేరిన గంధర్వభటులని ఆజ్ఞాపించాడు.
పొడవైన బల్లెము, విల్లు, గుదియ, గండ్రగొడ్డలి, కత్తి, కొర్రు, అడ్డకత్తి మొదలైన ఆయుధాలు ధరించి భయంకరమైన చేతులు కలవాళ్లు, కులపర్వతాల్లా ఎత్తైన శరీరం కలవాళ్లు, దేదీప్యమానమైన వర్చస్సుతో వెలిగిపోతున్నవాళ్లు, ఆకాశంలో సంచరించగలిగిన శక్తిగల గంధర్వులు పరాక్రమంతో దండెత్తి వచ్చి దుర్యోధనుడి సేనల్ని ఎదుర్కున్నారు. దుశ్శాసనుడు మొదలైన కౌరవులు గంధర్వుల ధాటికి తట్టుకోలేక దుర్యోధనుడి దగ్గరికి వెళ్లిపోయారు.
కర్ణుడు ఒక్కడే యుద్ధభూమిలో నిలబడి అర్థచంద్రాకారంలో తిరుగుతూ బల్లెంతో గంధర్వుల్ని సంహరిస్తున్నాడు. గంధర్వులు అనేకమంది వచ్చి కర్ణుడితో యుద్ధానికి దిగారు. భూమి లక్షలకొద్దీ వచ్చి చేరిన గంధర్వులతో నిండిపోయినట్టు కనిపించింది.
దుర్యోధనుడు చిత్రసేనుడితో యుద్ధం
శకుని, తమ్ముళ్లు సైన్యంతో వెంటరాగా దుర్యోధనుడు సేనాసమేతంగా ఉత్సాహంగా కర్ణుడు ఉన్న ప్రదేశానికి వచ్చి గంధర్వుల్ని చుట్టుముట్టాడు. కౌరవులకీ గంధర్వులకీ మహా భయంకరమైన యుద్ధం జరుగుతోంది.
కౌరవుల బాణాలకి గంధర్వులు తల్లడిల్లి పోతున్నారు. విషయం తెలిసిన చిత్రసేనుడు వెంటనే మదపుటేనుగులా వచ్చి కౌరవుల్ని ఎదుర్కున్నాడు. అతడి యుద్ధానికి కౌరవసేన చిందరబందర అయిపోయింది.
చిత్రసేనుడు మాయాయుద్ధం తెలిసినవాడు. అతడు ప్రయోగించిన మాయాబాణాలకి గాలి ఆడడం ఆగిపోయింది. సూర్యకిరణాల కాంతి తగ్గిపోయింది. రథాలు విరిగి పోయాయి. ఏనుగులు, గుర్రాలు నేలకూలాయి. భటులు చచ్చిపోయారు. కౌరవసేనలో ఒక్కొక్క భటుడి చుట్టూ పదిమంది గంధర్వులు చుట్టుముట్టారు.
గంధర్వులధాటికి తట్టుకోలేక కౌరవసైన్యం ధర్మరాజు ఉన్న చోటికి పరుగులెత్తసాగారు. కర్ణుడు మాత్రం వెనక్కి తగ్గకుండా శక్తివంచన లేకుండా యుద్ధం చేస్తున్నాడు.
సోదరులు, శకుని తనకి సహాయం చేస్తుండగా దుర్యోధనుడు కర్ణుడికి బాసటగా నిలిచాడు. అమిత బలవంతులైన గంధర్వులు వాళ్లని చుట్టుముట్టారు. గంధర్వభటులు కొంతమంది సారథిని, కొంతమంది గుర్రాల్ని, కొంతమంది వింటిబద్దని, కొంతమంది చక్రాల్ని, కొంతమంది వెల్లగొడుగుని, కొంతమంది జెండాని, కొంతమంది ఇరుసుని ముక్కలుగా చేసి కర్ణుడి రథాన్ని ముక్కలు ముక్కలుగా చేశారు.
రథాన్ని పోగొట్టుకున్న కర్ణుడు దుర్యోధనుడి తమ్ముడు వికర్ణుడి రథాన్ని ఎక్కి యుద్ధభూమిని వదిలి వెళ్లిపోయాడు.
దుర్యోధనుడు నిలబడి శత్రువుల మీద యుద్ధానికి తలపడ్డాడు. చిత్రసేనుడు కోపంతో దుర్యోధనుడి రథాన్ని కూడా కర్ణుడి రథంలా ముక్కలుగా చేశాడు. చిత్రసేనుడు రథాన్ని పోగొట్టుకున్న దుర్యోధనుణ్ని జుట్టుపట్టుకుని నేలమీదకి ఈడ్చి రెండు చేతులు వెనక్కి విరిచి కట్టి విజయసూచకంగా సింహనాదం చేశాడు.
ఆ దృశ్యం చూసిన మిగిలిన గంధర్వులు దుర్యోధనుడి భార్యల్ని తమ్ముళ్లు దుశ్శాసనుడు, దుర్విషహుడు, దుర్ముఖుడు, వివింశతి, చిత్రసేనుడు, విందుడు, అనువిందుడు మొదలైనవాళ్లని, దుర్యోధనుడి కొడుకుల్ని, మంత్రుల్ని, పట్టి బంధించి చిత్రసేనుడికి అప్పగించాడు.
మిగిలిన కౌరవులు, మంత్రులు, హస్తినాపురప్రజలు ఏడుస్తూ ధర్మరాజుని శరణువేడారు. “రాజులలో గొప్పవాడవైన ధర్మరాజా! గంధర్వ యోధులు వారించడానికి వీలులేని సాటిలేని పరాక్రమంతో దుర్యోధనుణ్ని, అతడి కాంతల్ని, సోదరుల్ని బంధించి తీసుకుని పోతున్నారు. నువ్వు శత్రువుల్ని జయించి నీ సోదరుల్ని కాపాడు. నువ్వు దయ కలవాడివని నిన్ను ప్రార్థిస్తున్నాము” అన్నారు.
దుర్యోధనుడికి ధర్మరాజు సహాయం
ధర్మరాజుని రెండు చేతులూ జోడించి ప్రార్థిస్తున్న దుర్యోధనుడి మంత్రుల్ని చూసి నవ్వు ముఖంతో భీముడు ధర్మరాజుతో “ఆహా! ఎంత మంచి పని జరిగింది. మనం చెయ్యవలసిన పనిని మనకి కష్టం లేకుండా గంధర్వ వీరులు చేసి మనకి గొప్ప ఉపకారం చేశారు. మనకి సులభంగా విజయం కలిగింది.
పుట్టుకతోనే అసత్యాలు మాట్లాడుతూ ఎన్నో పాపాలు చేస్తూ లోకాలతో నిందింపబడుతున్న దుర్మార్గుడికి ఈ విధంగా గంధర్వులతో పరాభవం కలిగేలా చేసిన బ్రహ్మదేవుడు తెలివిగలవాడని తెలుస్తోంది.
పరిస్థితులు తారుమారై అడవుల్లో కష్టాలు పడుతూ దీనావస్థలో ఉన్నామని అనుకుని గర్వంతో మనల్ని అవమానించాలని వచ్చిన ధృతరాష్ట్రుడి కొడుకు దుర్మార్గుడైన దుర్యోధనుడు తన మంత్రులతో కలిసి తగిన శాస్తిని అనుభవించాడు. ఇది నిజం! దుర్యోధనుడి పరిస్థితికి మనం దయ చూపించకూడదు” అన్నాడు.
భీముడి మాటలు విని ధర్మరాజు “భీమసేనా! నువ్వు మహా బలవంతుడివి. శరణు అని వచ్చిన వాళ్ల మీద నీ వంటి వాళ్లు దయ చూపించాలే కాని ఇటువంటి కఠినమైన మాటలు మాట్లాడకూడదు. బాధల్లో ఉండి శరణు కోరుతూ వచ్చిన కౌరవుల మీద దయ చూపించడం క్షత్రియధర్మం.
ఒకే వంశంలో పుట్టిన వాళ్ల మధ్య ధనానికి సంబంధించిన కలహాలు వస్తూనే ఉంటాయి. అందువల్ల ప్రకృతిసిద్ధమైన ప్రేమ నశించి పోకూడదు.
ఒకే కుటుంబానికి చెందినవాళ్లు తమలో తాము ఎలా ప్రవర్తించినా ఫరవాలేదు. కాని ఇతరులవల్ల అవమానం కలిగినప్పుడు ఒకళ్లకొకళ్లు సాయం చేసుకోకపోతే లోకులతో నిందింపబడతారు.
దుర్యోధనుడు చెడు నడవడిక కలవాడే కావచ్చు. అతడు మన జ్ఞాతి. భార్యలతో సహా బంధింపబడ్డాడు. దీన్ని మనం వదిలేస్తే ఇది మన కుటుంబానికి కూడా అవమానమే కదా? రాజవంశంలో పుట్టినవాడు బలహీనుడైనా శరణు అని అడిగిన వాళ్లని కాపాడాలి. ఇది రాజవంశ మర్యాద.
బలహీనుడికే శరణాగత రక్షణ కర్తవ్యం అయినప్పుడు నీ వంటి బలశాలికి ఇది తప్పకుండా నెరవేర్చవలసిన కర్తవ్యం అని విడిగా చెప్పాలా? ఇంక వాదించడం ఆపేసి నీ కర్తవ్యాన్ని నువ్వు నెరవేర్చు. నువ్వు నీ సోదరులు మనస్ఫూర్తిగా రథాలనెక్కి మీ ఆయుధాలు ధరించి దుర్యోధనుణ్ని విడిపించండి” అన్నాడు.
ధర్మరాజు మాటలకి భీమసేనుడు “ధర్మరాజా! దుర్యోధనుడు మనకి చేసిన అపకారాల గురించి నువ్వు అలోచించడం లేదు. అతడు నన్ను గంగానదిలోకి తోయించాడు. అన్నంలో విషం పెట్టి చంపాలనుకున్నాడు. లక్క ఇంట్లో పెట్టి మనల్ని దహించాలని చూశాడు.
జూదమనే వంకతో మనల్ని మోసం చేసి రాజ్య సంపదల్ని దోచుకున్నాడు. అతిలోక సౌందర్యవతి, పాంచాలరాజు కూతురు ద్రౌపదిని నిండు సభలో వస్త్రాపహరణం చేయించాడు. పుట్టినప్పటి నుంచీ ఈ దుర్యోధనుడు మనకి అపకారాలు చేస్తూనే ఉన్నాడు. నువ్వు దయతో అతడి తప్పులన్నీ మన్నిస్తే అది మన పనులకి హాని కలిగిస్తుంది కదా!” అన్నాడు.
మునుపటి శత్రుత్వాన్ని గుర్తు చేసుకుంటూ బాధపడుతున్న భీముడితో ధర్మరాజు “దయచేసి మీరు నన్ను కాపాడండి! అని దీనంగా అడిగినప్పుడు బలహీనుడు కూడా సాయం చేస్తాడు కదా? మరి, నీ వంటి గొప్ప వీరుడు దీనజనుల బాధ చూసి సాయం చెయ్యకుండా ఊరుకుంటాడా?
శరణు వేడినప్పుడు భయంకరమైన శత్రువుని కూడా ప్రేమతో రక్షించాలి. ఇది దయార్ద్రహృదయం కలవాళ్ల పద్ధతి. శరణాగత రక్షణకి సాటి గల ధర్మాలు వేరేవి లేవు. ఇది పరమ ధర్మం. ధృతరాష్ట్రుడి కొడుకు దుర్యోధనుడికి మీ బలపరాక్రమాల గురించి తెలుసు.
మనం అతడికి జ్ఞాతులం, ఒకే కుటుంబానికి చెందినవాళ్లమని మనం తప్పకుండా అతడిని విడిపిస్తామని మన మీద ఆశ పెట్టుకుని ఉంటాడు. ఇది పుణ్యకార్యం. ఈ పని చెయ్యడం వల్ల మనకి కీర్తి ప్రతిష్ఠలు పెరుగుతాయి. ఈ మంచి అవకాశాన్ని జారవిడుచుకోకూడదు.
ప్రస్తుతం నేను యజ్ఞదీక్షలో ఉన్నాను. ఈ పవిత్రకార్యాన్నిమధ్యలో విడిచిపెట్టకూడదు. అసలు నేనే వెళ్లి దుర్యోధనుణ్ని విడిపించవలసింది. నిన్ను బలవంతం చెయ్యడం భావ్యం కాదు. నేను యజ్ఞదీక్షలో ఉండి కదలడానికి వీలు లేకపోవడం వల్ల ఇంతగా అడగవలసి వచ్చింది.
మీరు వెంటనే వెళ్లి ముందు గంధర్వుల్ని మంచి మాటలతో ప్రార్థించి దుర్యోధనుడు మొదలైనవాళ్లని విడిపించండి. ఒకవేళ మంచిమాటలకి గంధర్వులు లొంగకపోతే మీ శౌర్యసాహసాల్ని ప్రయోగించి వాళ్లని విడిపించండి. నేను చేసే యజ్ఞం సఫలం చెయ్యండి” అని ధర్మరాజు భీముడికి మృదువుగా చెప్పాడు.
చివరికి భీముడు అంగీకరించాడు. ధర్మరాజు ఆజ్ఞని శిరసావహించి దుర్యోధనుణ్ని బంధ విముక్తుడిని చేస్తానని శపథం చేశాడు. నకులసహదేవులు మంచిపని చెయ్యడానికి స్థిరమైన సంకల్పంతో అర్జునుడిని అనుసరించారు.
అస్త్రశస్త్రాలు తీసుకుని రథాలమీద గంధమాదనపర్వతం దగ్గర గంధర్వసైన్యాన్ని చేరుకున్నారు.
గంధర్వులతో పాండవుల యుద్ధం
గొప్పవాళ్లు, అగ్నితో సమానమైన కాంతితో వెలుగుతున్నవాళ్లు, దేవేంద్రుడితో సమానులు, పుణ్యాత్ములైన పాండవులతో తలపడ్డారు గంధర్వులు. అన్నగారు చేసిన హితోపదేశాన్ని గుర్తు చేసుకుని అర్జునుడు గంధర్వులతో “మీకు మాతో విరోధం ఎందుకు? మేము దుర్యోధనుణ్ని విడిపించడానికి వచ్చాము. స్నేహపూర్వకంగా అతడిని విడిచిపెట్టండి. ఇది రాజులలో గొప్పవాడైన ధర్మరాజుగారి ఆజ్ఞ. ఆయన ఆజ్ఞని మీరు జవదాటకూడదని తెలుసుకోండి” అన్నాడు.
అర్జునుడు చెప్పింది విని గంధర్వులు “ధర్మరాజు మాకు రాజు కాదు కదా! మేము అతడి ఆజ్ఞని ఎందుకు పాటించాలి? మాకు దేవేంద్రుడే ప్రభువు. మిగిలినవాళ్లు ఎంతటివాళ్లయినా మాకు భయం లేదు” అన్నారు.
గంధర్వుల మాటలు విని అర్జునుడు “మొదట్లోనే సాహసం చెయ్యడం మంచిదికాదని మంచి మాటలతో చెప్పాను. మీరు యుద్ధమే చెయ్యాలని అనుకున్నప్పుడు మీతో భయంరమైన యుద్ధం చేసయినా దుర్యోధనుణ్ని విడిపించుకునే వెడతాను” అన్నాడు.
ఇద్దరిమధ్య భీకరమైన యుద్ధం మొదలయింది. గంధర్వులు అర్జునుడి రథాన్ని చుట్టుముట్టారు. అర్జునుడు కఠినమైన మనసుతో ప్రళయకాలంలో అగ్నితో సమానమైన, యుద్ధంలో గొప్ప శక్తి సామర్థ్యాలు ప్రదర్శిస్తున్న పదిలక్షలమంది గంధర్వుల్ని తన మంత్ర బాణాలతో దగ్ధమయ్యేట్టు చేశాడు.
అర్జునుడి ప్రతాపానికి తోడుగా భీముడు, నకులసహదేవులు రెట్టించిన ఉత్సాహంతో విజృంభించి విరోధుల తలల్ని ఖండించారు. రణరంగంమంతా నెత్తురు ఏరులుగా ప్రవహించింది. బంధించబడిన దుర్యోధనాదుల్ని పట్టుకుని ఆకాశం లోకి ఎగిరి పారిపోడానికి ప్రయత్నించారు గంధర్వులు.
సవ్యసాచి అర్జునుడు బాణాలతో అన్ని దిక్కుల్నీ మూసేశాడు. గంధర్వులు వలలో చిక్కున్న పక్షుల్లా గిలగిలలాడారు. నేలకొరుగుతున్న గంధర్వసేనని చూసి గంధర్వరాజు చిత్రసేనుడు అర్జునుడి మీదకి తన గదాదండాన్ని విసిరాడు. అర్జునుడు దాన్ని ముక్కలుగా ఖండించాడు.
చిత్రసేనుడు అక్కడినుంచి మాయమై కనిపించకుండా భీమార్జున నకుల సహదేవుల మీద బాణవర్షం కురిపించాడు. శబ్దాన్నిబట్టి లక్ష్యాన్ని భేదించగలిగిన అర్జునుడు చిత్రసేనుడి శరీరాన్ని తూట్లు తూట్లుగా చేశాడు.
చిత్రసేనుడు మాయాయుద్ధం వదిలిపెట్టి అర్జునుడి దగ్గరికి వచ్చాడు. తన ప్రియమిత్రుడు చిత్రసేనుణ్ని చూసి అర్జునుడు యోగక్షేమాలు కనుక్కున్నాడు. “శూరుడా! చిత్రసేనా! కౌరవులతో నీకు శతృత్వమెందుకు. అతడితోపాటు అతడి భార్యల్ని, మంత్రుల్ని మిగిలినవాళ్లందరినీ విడిచిపెట్టు” అన్నాడు.
చిత్రసేనుడు అర్జునుడితో “నీకు తెలియని విషయాన్ని చెప్తున్నాను విను. నీ మీద నాకు కోపంగాని, అసూయగాని లేదు. నువ్వు నాకు ప్రియ మిత్రుడివి.
ఈ దుర్యోధనుడు దుర్మార్గుడు. మీరు ఈ అడవిలో పాట్లు పడుతుంటే మిమ్మల్ని చూసి ఎగతాళి చెయ్యాలని ఘోషయాత్ర అనే వంకతో ఇక్కడికి వచ్చారు.
ఇలా మిమ్మల్ని వెక్కిరించాలని అనుకోవడం తప్పు కాదా! ఆ సంగతి తెలిసిన దేవేంద్రుడు దుర్యోధనుణ్ని అతడి పరివారాన్ని బంధించి తీసుకుని రమ్మని నన్ను ఆజ్ఞాపించాడు. నువ్వు ఇంకేమీ చెప్పకు. ఇతణ్ని దేవేంద్రుడి సమక్షంలోకి తీసుకుని వెళ్లాలి” అన్నాడు.
అర్జునుడు చిత్రసేనుడి మాటలు విని “దుర్యోధనుడు దుర్మార్గుడే కావచ్చు. కాని, అతడు మాకు సోదరుడు. అతణ్ని వెడిచిపెట్టడమే తగిన పని. ఎందుకంటే ఈ పని ధర్మరాజుకి సంతోషం కలిగిస్తుంది. బంధించి తీసుకుని రమ్మని దేవేంద్రుడి ఆజ్ఞే అయినా ముందు మనం ధర్మరాజు దగ్గరికి వెళ్లి ఆయనకి విషయమంతా వివరించి చెప్పి ఆయన ఎలా నిర్ణయిస్తే అలా చేద్దాము. ముందు నాకోసం ధర్మరాజు దగ్గరికి రా” అన్నాడు.
అర్జునుడు చెప్పినట్టు చెయ్యడానికి చిత్రసేనుడు అంగీకరించాడు.
దుర్యోధనుణ్ని విడిపించిన ధర్మరాజు
పాండవులు, చిత్రసేనుడు కలిసి ధర్మరాజు దగ్గరికి వెళ్లారు. అజాతశత్రుడు ధర్మరాజు చిత్రసేనుడికి గౌరవమర్యాదలతో స్వాగతం చెప్పాడు. తరువాత చిత్రసేనుడితో “మహనుభావా! ఈ దుర్యోధనుడు మాకు సోదరుడు. మా అదృష్టం వల్ల ఇతడు, ఇతడి భార్యలు, సోదరులు, మంత్రులు మీతో సంహరించబడలేదు. మీ దయవల్ల మా కుటుంబానికి కీడు జరగలేదు.
మీకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. ఇతడు మీకు ఎటువంటి అపచారం చేసినా క్షమించి, మాయందు దయ చూపించి ఇతడిని విడిచిపెట్టమని వేడుకుంటున్నాను” అన్నాడు.
ధర్మరాజు మాటలు కాదనలేక చిత్రసేనుడు దుర్యోధనుణ్ని మిగిలిన వాళ్లని విడిచిపెట్టి పాండవుల దగ్గర వీడ్కోలు తీసుకుని స్వర్గానికి వెళ్లి జరిగిన విషయం దేవేంద్రుడికి చెప్పాడు. ఇంద్రుడు అమృతవర్షం కురిపించి యుద్ధంలో మరణించిన గంధర్వుల్ని బ్రతికించాడు.
ద్వైతవనంలో ధర్మరాజు దుర్యోధనుడికి బంధాలు తీయించి “నాయనా! దుర్యోధనా! ఇకముందెప్పుడూ ఇటువంటి సాహసకృత్యాలు చెయ్యకు. ఇప్పుడు జరిగిందేదో జరిగిపోయింది. చెడ్డవాడు అహంకారంతో ఎదుటివాడి గొప్పతనాన్ని తెలుసుకోలేక సాహసం చేసి నశిస్తాడు. జాగ్రత్తగా ఉండు.
ఇప్పటికి నీ తమ్ముళ్లని, మంత్రుల్ని, పరివారాన్నితీసుకుని మీ రాజధాని నగరానికి వెళ్లిపో. ఇటువంటి అవమానం జరిగినందుకు మనస్సులో బాధపడకు” అని దుర్యోధనుణ్ని మందలించి హితోపదేశం చేసి పంపించాడు.
దుర్యోధనుడు వెలవెల పోతున్న ముఖంతో తల వంచుకుని వెళ్లిపోయాడు. ధౌమ్యుడు మొదలైన బ్రాహ్మణులు, ఆశ్రమంలో నివసిస్తున్న మహర్షులు ధర్మరాజు అతడి తమ్ముళ్ల ధర్మప్రవర్తనకి ప్రశంసించారు” అని వైశంపాయనమహర్షి జనమేజయమహారాజుకి వినిపించాడు.
అరణ్యపర్వంలో అయిదవ ఆశ్వాసం సమాప్తం