[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
దుఃఖపడుతున్న ధృతరాష్ట్రుడు
జనమేజయుడు వైశంపాయన మహర్షితో “మహర్షీ! కుంతి కొడుకులైన పాండవులు అడవిలో కష్టాలు అనుభవిస్తూ తమ నడవడికని ఎలా తీర్చి దిద్దుకున్నారో చెప్పండి” అని అడిగాడు.
వైశంపాయనుడు జనమేజయుడితో “మహారాజా! శ్రీక్రుష్ణుడు ద్వారకానగరానికి వెళ్లిపోయాక పాండవులు కామ్యకవనం వదిలిపెట్టి తమ నివాసాన్ని ద్వైతవనానికి మార్చారు. దార్లో వాళ్లు అనేక అడవులు, పర్వతాలు, నదులు వాటి విశేషాలు చూశారు.
చక్కని కథలు చెప్పగలిగిన హస్తినాపురంలో నివసించే ఒక బ్రాహ్మణుడు ద్వైతవనానికి వచ్చి పాండవుల్ని చూసి మళ్లీ హస్తినాపురానికి వెళ్లాడు. ధృతరాష్ట్రుడు ఆ బ్రాహ్మణుణ్ని పాండవుల యోగక్షేమాల గురించి అడిగాడు.
అతడు “పాండవులు అడవుల్లో ఎన్నో కష్టాలు పడుతున్నారు. ఎండలకి ఎండి, వానలకి తడిసి, చలికి వణికి దుఃఖంలో ఉన్నారు. వీరుల్ని భర్తగా పొందిన పాంచాలరాజపుత్రిక ద్రౌపది కష్టాలతో బాధలుపడుతోంది”. అని అక్కడి విషయాలన్నీ వివరించి చెప్పాడు.
పాండవుల కష్టాలు విని ధృతరాష్ట్రుడు దుఃఖంతో వేడి నిట్టూర్పులు విడుస్తూ “అయ్యో! పాండవులకి ఎటువంటి కష్టం వచ్చింది? ఇదంతా దుర్మార్గుడైన నా కొడుకు దుర్యోధనుడి అజ్ఞానం వల్ల జరిగింది. పుణ్యప్రదమైన పాండవులకి ఇది నేను చేసిన అపకారమే.
నేను నా పెద్ద కొడుకుగా అనుకునే ధర్మరాజు దుష్టులకి దూరంగా ఉండే ధర్మాత్ముడు, మంచివాడు, కౌరవ వంశానికి వెలుగుని ఇవ్వగలిగినవాడు. అటువంటి వాడికి బ్రహ్మదేవుడు ఇన్ని కష్టాలు వచ్చేలా చేశాడు.
ధర్మరాజు ప్రశాంతంగా స్వచ్ఛంగా ఉండే మేడల మీద హంసతూలికాతల్పం మీద నిద్రపోయే ఆగర్భ శ్రీమంతుడైన మహారాజకుమారుడు. తెల్లవారువేళ మాగధులు అతణ్ని సుప్రభాతాలు పాడుతూ మంగళతూర్యారావాలతో మేలుకొలిపేవాళ్లు. అయ్యో! అటువంటి రాజకుమారుడు విధివైపరీత్యం వల్ల కఠినమైన నేల మీద పడుక్కుని నక్కల కూతలతో నిద్ర లేస్తున్నాడు.
వాయుపుత్రుడైన భీముడు వేయి ఏనుగుల బలం కలవాడు; ఆజానుబాహువు; దిగ్గజానికి ఉండే తొండంలా పొడవుగా ఉండే చేతులు కలవాడు. అతడికి ఆవేశం వస్తే ఆపడానికి ఎవరి తరమవుతుంది. కష్టాలకి పరితపిస్తూ అలసిన ఏనుగులా అడవిలో పరితపిస్తూ ఉన్నాడు.
అర్జునుడు మహావీరుడు. అన్నలు ధర్మరాజు, భీముడు; తమ్ముళ్లు నకుల సహదేవుల బాధలు చూస్తూ కూడా అన్న మాటకి కట్టుబడి తాత్కాలికంగా అణిగి ఉన్నాడు. మనస్సులో మాత్రం పగబట్టిన పాములా దుర్యోధనుడి నేరాల్ని తలుచుకుంటూ కోపంతో కాలం గడుపుతున్నాడు.
సుకుమారమైన శరీరం కలిగిన నకుల సహదేవులు కవలబిడ్డలు కొదమసింహాల వంటివాళ్లు. భోగభాగ్యాలతో సకల భోగాలు అనుభవించవలసినవాళ్లు అడవిలో కష్టాలు పడుతూ ఓర్పుతో జీవిస్తున్నారు.
వాయుపుత్రుడు భీముడు సాటిలేని తేజస్సు కలవాడు. అసాధారణ బలవంతుడు. కయ్యానికి కాలు దువ్వుతాడు. సత్యసంధుడైన అన్నగారి మాటల్ని మీరలేడు కనుక అడవిలో ఘోరకష్టాల్ని అనుభవిస్తున్నాడు. కాని వాడి మనస్సు ఉద్రిక్తంగా ఉంటుంది.
మాయాద్యూతంలో శకుని చేసిన మోసం, దుశ్శాసనుడు నిండుసభలో చేసిన చెయ్యకూడని పని, దుర్యోధనుడు వాళ్ల రాజ్యాన్ని అపహరించడం ఇవన్నీ అతడి మనస్సులో ఏదుపంది ముళ్లు గుచ్చుకున్నట్టు బాధకలుగుతుంటే అతడిలో కోపం కార్చిచ్చులా వ్యాపించింది.
భీముడు అనే అగ్నిహోత్రుడికి అడవిలో పడుతున్న కష్టాలు అనే వాయువు సహాయపడి, అగ్నిని ప్రజ్వలింపచేసి అతడి అవయవాల్ని దహించివేస్తూ ఉంటుంది. నా మనస్సులో కుంతి కుమారుడి ఆకారం జేవురించిన ముఖంతోను, ముడతలు పడిన కనుబొమలతోను, పెదవిని కరుచుకుంటున్న దంతాలతోను భయంకరంగా కనిపిస్తూ ఉంటుంది.
ఆ భీముడే నా కొడుకులకి వాళ్ల స్నేహితులకి మృత్యువు. భీముడు యముడితో సమానమైనవాడు. అతడికి మనస్సులో కోపం చాలా ఎక్కువగా ఉంటుంది. కోపంతో రుసరుసలాడుతూనే ఉంటాడు. అతడికి ఉన్నంత కోపం ధర్మరాజుకి లేదు. అర్జునుడిలోను కనిపించదు. భీముడు కార్చిచ్చు. అర్జునుడు అనే వాయువుతో కలిసి కర్ణ శకునులతో పాటు నా కొడుకుల్ని వేగంగా దహించేస్తాడు. చేసిన కర్మకి తగిన ఫలం అనుభవించక తప్పదు.
దుర్యోధనుడు మొదలైనవాళ్లకి మరణం దగ్గరలోనే ఉంది. ఇది ముందు స్పష్టంగా కనిపిస్తున్న భవిష్యత్తు. నేను జూదం వద్దని ఎంత చెప్పినా వినలేదు. అతణ్ని చెడు నడవడిక నుంచి తప్పించలేక పోయాను.
నా అహంకారమే వంశ నాశనానికి దారి తీసింది. రాత్రి గడిస్తే పగలు, పగలు గడిస్తే రాత్రి వచ్చినట్లే సుఖదుఃఖాలు కూడా కాలాన్నిబట్టి సహజంగా కలుగుతుంటాయి.
శుభాలు కలిగాయని సంతోషపడేప్పుడు ఆపదలు కలుగుతాయి. ఆపదలు కలిగాయని బాధపడేప్పుడు సౌఖ్యాలు కలుగుతాయి. ఇది చాలా అద్భుతమైన విషయం.
సంపదలు పోగొట్టుకున్న అర్జునుడు అడవుల్లో నివసిస్తూ చిక్కి శల్యమయ్యాడు. అంతలోనే దేవతల నుంచి వరాలు సాధించి గొప్ప అస్త్రాలు ఆర్జించగలిగాడు. శరీరంతోనే కైలాసానికి వెళ్లి తిరిగి శరీరంతోనే భూలోకానికి వచ్చేశాడు.
ఏ జన్మలో చేసిన కర్మకి దక్కిన ఫలమో! అతిలోక మహిమ కలది, అనన్యసామాన్యమైనది గాండీవమనే విల్లు. అది ధరించేవాడు లోకోత్తర వీరుడైన అర్జునుడు. అతడు దేవేంద్రుడి కొడుకు.
దేవతా మహిమ కలిగిన ఆ వింటి బాణాలు ఉండగా భూమండలమంతా ఆవరించి ఉన్న సంపద పాండవులకే చెందుతుంది” అని ధృతరాష్ట్రుడు బాధపడుతున్నాడు.
కర్ణుడు, శకుని, దుర్యోధనుల మంతనాలు
ధృతరాష్ట్రుడు బాధతో మాట్లాడిన మాటలు విని దుర్యోధనుడు శకునితో “ఈ రాజు ఎందుకు పిరికి మాటలు మాట్లాడుతున్నాడు? ఇంత భయం ఈయనకి ఎందుకు కలిగింది?” అన్నాడు.
తరువాత శకుని, కర్ణుడు, దుర్యోధనుడు కలిసి ఏకాంత ప్రదేశానికి వెళ్లి మంతనాలు జరిపారు.
కర్ణుడు దుర్యోధనుడితో “మహారాజా! పరాక్రమ ప్రాభవాలు కలిగిన పాండవులు శౌర్యాన్ని అదుపులో పెట్టి అడవుల్లో కష్టాలు అనుభవిస్తున్నారు. ఇంద్రప్రస్థపురంలో ధర్మనందనుడి అనాటి సంపద నీ తెలివితేటలవల్ల నిన్ను వరించింది.
అన్ని దిక్కుల్లో ఉన్న రాజులు నీకు కప్పం కట్టి నీ ఆధిపత్యాన్ని అంగీకరించే సామంతులే ఉన్నారు. సువిశాలమైన అడవులతోను, పర్వతాలతోను, సముద్రాలతోను ఉన్న ఈ భూమండలం మొత్తం దేవేంద్రుడు స్వర్గలోకాన్ని ఏలుకున్నట్టే నువ్వు ఈ భూలోకాన్నిఏలుకో!
దుర్యోధనా! నీ పరిపాలన పట్టణాల వాళ్లకే కాకుండా పల్లెల్లో నివసించేవాళ్లకి కూడా నచ్చింది. అన్ని వర్గాలకి చెందిన ప్రజలందరు నీ అభివృద్ధినే కోరుతున్నారు. కౌరవవంశానికి చెందినవాళ్లు అందరు నిన్ను ఆరాధిస్తారు. నువ్వు ఆకాశంలో ప్రకాశించే సూర్యుడిలా భూమండలం మొత్తం వెలుగుతావు. ఇప్పుడు పాండవులు అష్టకష్టాలు పడుతూ అడవుల్లో ద్వైతవనంలో ఉన్నారు.
నువ్వు భోగభాగ్యాలు అనుభవిస్తూ గొప్ప సామ్రాజ్యానికి అధిపతిగా ఉన్నావు. ఇప్పుడు నువ్వు సపరివారంతో అక్కడికి వెళ్లి ఎండాకాలంలో ప్రకాశించే సూర్యుడిలా నీ వైభవాన్ని అక్కడ చూపించు.
ఆనాడు నహుష చక్రవరి కొడుకు యయాతిలా ప్రకాశించే నిన్ను చూసి పాండవులు మనస్సులో కుమిలిపోతారు. సంపదలు కలిగినందుకు ఫలితంగా మిత్రుల్ని సంతోషపెట్టాలి, శత్రువుల్ని బాధపెట్టాలి.
తనకి ధనము, ధాన్యాలు ఉండచ్చు. బంధువుల సహకారం అందచ్చు. ఇది గొప్ప సంతోషాన్ని కలిగించదు. తను సంపదలు సౌఖ్యాలతో విలసిల్లుతున్నప్పుడు విరోధి అనేక కష్టాలు అనుభవిస్తుంటే చూడడమే అసలైన సంతోషం.
తనకి కలిగే మంచి కంటే, శత్రువుకి కలిగే చెడే ఎక్కువ సంతోషాన్ని కలిగిస్తుంది.
దుర్యోధన సార్వభౌమా! సుకుమారమైన అందమైన జిలుగు పట్టుబట్టలు కాకుండ నార చీరలు ధరించి భయంకరమైన అడవిలో నివసిస్తూ కందమూలాలు తింటూ నికృష్టమైన జీవితాన్ని గడుపుతున్నాడు అర్జునుడు.
మనం చూడు దేదీప్యమనంగా వెలిగిపోతూ భోగభాగ్యాలు అనుభవిస్తున్నాం. ఇప్పుడు అర్జునుడి దీనావస్థని చూడడం కంటే మన జీవితాలకి ధన్యత వేరే ఏదీ ఉండదు” అని చెప్పాడు.
కర్ణుడి మాటలు విని దుర్యోధనుడు సంతోషంతో “కర్ణా! నువ్వు చెప్పిన ఉపాయం చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. కాని ద్వైతవనానికి వెళ్లడానికి ధృతరాష్ట్రుడు అంగీకరించడు కదా! పాండవులు ద్వైతవనంలో నివసిస్తున్న సంగతి ధృతరాష్ట్రుడికి తెలుసు. ఇప్పుడు మనం ద్వైతవనానికి వెళ్లడం పాండవులతో కయ్యానికి కాలు దువ్వడానికే అని అనుకుని ఆయన అక్కడికి వెళ్లడానికి అంగీకరించడని నా భయం.
అంతేకాకుండా ధృతరాష్ట్రుడికి పాండవులంటే భయం కలుగుతోంది. పాండవులు సాటిలేని శౌర్యం కలవాళ్లని, గొప్ప తపస్సు చేసి ఎక్కువ స్థైర్యాన్ని పొందారని మనస్సులో బాధపడుతూ ఉంటాడు.
విన్నావు కదా.. ఇప్పటి వరకు పాండవుల శౌర్యం గురించి చెప్తూనే ఉన్నారు కదా! ఆ మహారాజు దగ్గర మంత్రిగా ఉన్న విదురుడు కౌరవుల తిండి తింటున్నాడు. అతడికి పాండవులంటేనే ఇష్టం.
జూదం జరిగిన రోజే విదురుడి పాండవ పక్షపాతం గురించి అందరికీ తెలిసింది. అతడు ఎప్పుడూ పాండవుల్ని పొగుడుతూనే ఉంటాడు. మన ఆలోచన అతడికి ఏమాత్రం తెలిసినా మనకి ఆటంకాలు కలిగిస్తాడు.
మనం మన పనిని రహస్యంగా చేసుకోవాలి. అన్నింటికంటే ముందు ధృతరాష్ట్రుడు మన ఆలోచనకి ఒప్పుకోవాలి. అందుకు తగిన ఉపాయాన్ని నువ్వు, శకుని ఆలోచించండి. మనం రేపు ఉదయం సభాభవనానికి వచ్చి కురువంశానికి వృద్ధుడైన భీష్ముణ్ని, కురువంశానికి గొప్పవాడైన ధృతరాష్ట్రుణ్ని ఒప్పించి ద్వైతవనానికి విహారయాత్రకి వెడదాము” అని చెప్పి దుర్యోధనుడు అంతఃపురానికి వెళ్లిపోయాడు.
ఆ రాత్రంతా ఆలోచనలతో గడిపాడు. మర్నాడు ఉదయాన్నే కర్ణుడు దుర్యోధనుణ్ని కలిసి “సుయోధన మహారాజా! నాకు ఒక మంచి ఉపాయం తట్టింది. ద్వైతవనంలో మన ఆవులమంద ఉన్నట్టు అందరికీ తెలుసు కదా! ఆవులమందని చూడడానికి ద్వైతవనం విహారానికి వెడుతున్నామని చెప్తే ధృతరాష్ట్ర మహారాజు అంగీకరిస్తాడు. ఎవరికీ అనుమానం కలగకుండా మన కోరిక తీరుతుంది” అన్నాడు.
సుబలుడి కొడుకు శకుని “ధర్మరాజా! నీ మీద ఒట్టు! నాకు కూడా రాత్రి ఈ ఉపాయమే తట్టింది. నేను కర్ణుడి ఆలోచనతో ఏకీభవిస్తున్నాను”. అన్నాడు.
కర్ణుడి ఆలోచన దుర్యోధనుడికి కూడా నచ్చింది. ముగ్గురూ సంతోషంతో నవ్వుకుంటూ చేతులు కలుపుకున్నారు.
ధృతరాష్ట్రుడి అనుమతి
వెంటనే ఆ ముగ్గురూ ‘సుమంగుడు’ అనే గొల్లవాణ్ని పిలిపించి ధృతరాష్ట్రుడి దగ్గర ఎలా మాట్లాడాలో నేర్పి సభాభవనానికి తీసుకుని వెళ్లారు. మొదట ఈ విషయం గురించి మాట్లాడకుండా రాచమర్యాదలతో ధృతరాష్ట్రుణ్ని ప్రసన్నం చేసుకున్నారు. తరువాత “మహాప్రభూ! ద్వైతవనంలో ఉన్న మన ఆవులమంద దగ్గరనుంచి ఒక గొల్లవాడు మీ దర్శనం కోసం వచ్చాడు” అని చెప్పాడు.
ధృతరాష్ట్రుడు గొల్లవాడివైపు తిరిగి ఆవుల క్షేమాన్ని అడిగాడు. సుమంగుడు “మహారాజా! ద్వైతవనంలో ఆవులు ఇంతవరకు సుఖంగానే ఉన్నాయి. ఆవులకి అనువైన అడవే కాని, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. క్రూరజంతువులు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. ఆవులకి భయం కలిగేలా హాని చేస్తున్నాయి.
మీకు ఈ విషయం విన్నవించుకోవాలని నేను ఇక్కడికి వచ్చాను. ఆవుల్ని కాపాడడానికి వెంటనే ఏదైన చర్య తీసుకోమని ప్రార్థిస్తున్నాను” అన్నాడు.
గోపాలుడు చెప్పిన వెంటనే కర్ణుడు, శకుని ధృతరాష్ట్రుడితో “మేము గోపాలుడు చెప్పిన విషయాలు నిజమే అని అనుకుంటున్నాము. క్రూరమృగాల్ని వేటాడి ఆవుల్ని రక్షించడానికి మీ కొడుకు దుర్యోధనుణ్ని పంపించండి” అన్నారు.
ధృతరాష్ట్రుడు కొంతసేపు ఆలోచించి “గోరక్షణ చెయ్యడం మంచిదే! అది రాజులకి ముఖ్యమైన కర్తవ్యం కూడా. ద్వైతవనంలో పాండవులు ఇష్టంగా నివసిస్తున్నారు. వాళ్లు మహానుభావులు, శౌర్యం కలవాళ్లు. అనేక పరీక్షల్లో విజయం సాధించారు. అందువల్ల మీరు ద్వైతవనానికి వెళ్లడం నాకు ఇష్టంగా అనిపించడం లేదు.
మీరు అడవులకి వెళ్లి కష్టాల్లో ఉన్న పాండవుల్ని అవమానిస్తారు. ఆ పాండవులు పురుషసింహాలు, తపస్సంపన్నులు. వాళ్లు ఆగ్రహిస్తే తపోబలంతో మిమ్మల్నిదహించివేస్తారు. లేదా యుద్ధంలో మిమ్మల్ని ముక్కలు ముక్కలుగా నరికేస్తారు.
పాండవులు మనతో అవమానించబడి బాధపడుతున్నారు కదా! ఇప్పుడు మిమ్మల్ని చూస్తే పాములకి శత్రువైన గరుత్మంతుడితో సమానమైన బలం కలిగిన భీముడు మనస్సులో కోపం లేకుండా ఉంటాడా? మిమ్మల్ని చూడగానే పాండవులకి కోపం తప్పకుండా వస్తుంది.
అర్జునుడు కూడా సాధారణమైన వీరుడు కాదు. దివ్యాస్త్రాలు పొందకముందే తన వీరత్వంతో దిగ్విజయయాత్ర చేసి సమస్త భూమండలాన్ని జయించగలిగాడు. ఇప్పుడు దేవేంద్రుడి సమక్షంలో దేవతామహిమ గల అస్త్రాల్ని సంపాదించుకుని వచ్చాడు. అటువంటి అర్జునుడితో పోరాడి ఎవరూ నెగ్గలేరు. దుష్టబుద్ధితో మీరు పాండవులకి కీడు తలపెట్టారు. మీరు అక్కడికి వెళ్లడం మంచిది కాదని అనిపిస్తోంది. ఆవులమందల్ని కాపాడడానికి వెంటనే సమర్థులైనవాళ్లని నియోగిద్దాం” అన్నాడు.
ధృతరాష్ట్రుడి మాటలకి శకుని “మహారాజా! పాండవుల పరాక్రమం క్రమశిక్షణతో కూడి ఉంటుంది. వాళ్లకి మేము కీడు చెయ్యాలని అనుకోవడం లేదు. ఒకవేళ మేము వాళ్లకి కీడు చేసినా సంత్యసంధుడు, అజాతశత్రువయిన ధర్మరాజు మాట తప్పడు.
అతడి తమ్ముళ్లు భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు అతడి మాట జవదాటరు. ఇది నిజం. మా మాటలు నమ్మండి. మాకు వేటకి వెళ్లాలని చాలా కోరిక. ఆవుల్ని రక్షించడం చాలా మంచి పని. మంచి పని చేసేటప్పుడు కీడు ఎలా జరుగుతుంది?” అన్నాడు.
కర్ణుడు, శకుని చెప్పిన మాటలు విని ధృతరాష్ట్రుడు కొంచెం సేపు ఆలోచించి “అలాగే వెళ్లి రండి. మంచి బుద్ధితో మసులుకుని ఆవుల్ని కాపాడి ఆలస్యం చెయ్యకుండా తిరిగి రండి!” అని వాళ్లకి ఘోషయాత్రకి అనుమతించాడు.