Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాభారత కథలు-108: పతివ్రతాధర్మాలు

[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]

సత్యభామ ద్రౌపదుల సంభాషణ

త్యభామ “ద్రౌపదీ! నీ భర్తలు అయిదుగురు నీ మీద ప్రేమ కలిగి ఉంటారు. ఒకళ్లని మించి ఒకళ్లు నీ మీద ప్రేమని ప్రదర్శిస్తూ ఉంటారు. నువ్వు కూడ వాళ్లందరి మీద సమానమైన ఇష్టాన్ని చూపిస్తావు. దేదీప్యమైన తేజస్సు కలిగినవాళ్లు, పవిత్రమైన శీలం కలిగినవాళ్లు, దిక్పాలకులతో సమానమైన ఐశ్వర్యం కలిగిన పాండవులు నిన్ను మురిపెంగా చూసుకుంటూ ఉంటారు.

అంత అద్భుతమైన ప్రేమని ఎలా పొందగలిగావు? ఏమైనా నోములు నోచావా? మంత్రతంత్రాలు నేర్చుకున్నావా? మందులు మాకులు ప్రయోగించావా? అలంకారాల్లో నేర్పరితనమా? చురుకుదనము, వయ్యారాలు ఒలికించగలగడమా? నీ భర్తల అనురాగాన్ని చూరగొనడానికి కారణం తెలుసుకోవాలని అనుకుంటున్నాను.

ద్రౌపదీ! నీ వ్యక్తిత్వం అసాధారణమైంది. నీ భర్తల అనురాగాన్ని ఎలా పొందగలిగావో చెప్తే నేను కూడా నా భర్త శ్రీకృష్ణుడి అనురాగాన్ని పొందుతాను” అంది.

సత్యభామ అడిగినదానికి ద్రౌపదికి కొంచెం కోపం వచ్చింది. భర్తల ప్రేమని పొందడానికి మంత్రాలు, మందులు, మాకులు, అలంకరణలో నేర్పరితనము వంటివి కారణాలుగా చెప్పడం సత్యభామకి తగినదిగా అనిపించలేదు.

అయినా కోపాన్ని తనలోనే అణుచుకుని సత్యభామతో “నువ్వు ఎంత గొప్ప అందగత్తెవయినా నన్ను తక్కువస్థాయి ఆడవాళ్లతో సమానంగా మాట్లాడవచ్చా? నువ్వు ఇలా మాట్లాడుతావని నేను అనుకోలేదు. పురుషోత్తముడైన శ్రీకృష్ణుడికి భార్యగా ఉండతగిన యోగ్యత లేదు” అంటూ పైకి సరదాగా మాట్లాడుతున్నట్టు కనిపిస్తూనే నెమ్మదిగా చివాట్లు పెట్టింది.

ఇంకా మాట్లాడుతూ “సత్యభామా! మంత్రతంత్రాలతోను, మందుమాకులతోను భర్త వశమవుతాడని అనుకోవడం తెలితక్కువతనం. దానివల్ల అంతకు ముందు ఉన్న ప్రేమ కూడా తగ్గిపోతుంది. అంతకంటే ఉపయోగం ఉండదు. అటువంటి భార్యతో కాపురం చెయ్యడం కంటే పాముతో కాపురం చెయ్యడం మంచిదని అనుకుంటాడు.

అంతేకాదు అటువంటివి ప్రయోగిస్తే అవి బెడిసికొట్టి భర్తకి మూగతనం, మనస్సు, శరీరం మొద్దుబారడం వంటి జబ్బులు తెచ్చిపెట్టుకున్నట్టు అవుతుంది.

ఆమెకి లోకంలో అపకీర్తి వస్తుంది. చివరికి ఆమెకి మిగిలేది నరకయాతన మాత్రమే. కనుక భార్యలు మోసపు పనులు చెయ్యకుండా భర్త అభిప్రాయాల్ని గౌరవిస్తూ నడుచుకుంటే అదే అనుకూల దాంపత్యం అవుతుంది. నేను నా భర్తల అనురాగాన్ని ఎలా పొందగలిగానో నీకు చెప్తాను.

భర్తలు ఇతర స్త్రీలయందు అనురాగం చూపించినా నేను కోపం తెచ్చుకోను. అహంకారం ప్రదర్శించక వినయంతోను, పూజ్యభావంతోను వాళ్లకి పరిచర్య చేస్తాను. పరపురుషులు దేవతలైనా, యక్షులైనా, పరపురుషులైనాసరే వాళ్లని గడ్డిపోచతో సమానంగా చూస్తాను. సౌకర్యాలన్నీ ముందుగా భర్తలకి సమకూర్చి తరువాత నేను అనుభవిస్తాను.

వాళ్లకి సంబంధించిన పనులన్నీ సేవకులతో చేయించకుండా నేనే చేస్తాను. నిర్ణీత సమయంలో సదుపాయాలన్నీ సమకూరుస్తాను. ఇళ్లు, పాత్రలు పరిశుభ్రంగా ఉంచుతాను.

ధనాన్ని, ధాన్యాన్ని వ్యర్థం అవకుండా చూస్తాను. చుట్టాలందరికీ సంతోషం కలిగిస్తాను. ఇంటి గుమ్మం దగ్గర తిరగడం, చెడ్డ ఆడవాళ్లతో మాట్లాడడం, వాదించడం, గట్టిగా నవ్వడం నాకు ఇష్టం ఉండదు.

భర్తలు పనుల మీద వేరే ఊళ్లకి వెళ్లినప్పుడు నేను పూలు అలంకరించుకోను. సువాసనలు వెదజల్లే మైపూతలు పూసుకోను. ఖరీదైన ఆభరణాలు ధరించను. భర్తలు ఎప్పుడు ఇంటికి వస్తారా అని ఎదురుచూస్తూ ఉంటాను.

అత్తగారిని పూజ్యభావంతో చూస్తూ అమె చెప్పినట్టే నడుచుకుంటాను. పెద్దలు, బ్రాహ్మణులు, అతిథులు వచ్చినప్పుడు సేవకులతో చేయించకుండా వారికి సపర్యలు నేనే చేస్తాను. తృప్తి, క్షమ, వినయం, మంచితనం ఎప్పుడూ విడిచిపెట్టను.

భారతవంశం వాళ్లైన పాండవులు ఎంత మెత్తగా ఉంటారో అంత కఠినంగానూ ఉంటారు. వాళ్ల మనసు మంచిదని తెలిసినా వాళ్లతో ఎప్పుడూ నిర్లక్ష్యంగా ప్రవర్తించను. వారికి కోపం వస్తే మనసు బాధపడేలా ప్రవర్తిస్తారు. అందుకే ఎప్పుడూ భయపడుతూనే సేవలు చేస్తాను.

మా అత్తగారు కుంతిభోజ మహారాజుగారి కూతురు. ఓర్పులో భూదేవి వంటిది. సుకుమారి. అమెకు స్నానం, ఆహారం అన్నీ స్వయంగా నేనే చూసుకుంటాను.

ప్రజలతో ఆరాధించబడే ధర్మరాజు ప్రతిరోజు తన సహపంక్తిలో ఎనిమిదివేలమంది బ్రాహ్మణులకి బంగారు కంచాల్లో అన్నసంతర్పణ చేస్తాడు. అలాగే పదివేలమంది సన్యాసులకి భోజనం పెడతాడు.

వాళ్లకి నేనే స్వయంగా వడ్డన వార్పులు సరిగా ఉన్నయో లేదో చూసి, బట్టలు, ఆభరణాలు సమకూరుస్తూ ఉంటాను. అందరికీ సంతోషం కలిగించడం నా బాధ్యతగా అనుకుంటాను.

ఇంకా చెప్తాను విను. ధర్మరాజు దినచర్య చాలా వైభవోపేతంగా ఉంటుంది. ఆయన అంతఃపురంలో నూరువేలమంది సేవకులు రాత్రి పగలు అనకుండా సేవలు చేస్తూ ఉంటారు. ఆ సేవకులు రత్నాలతో చేయబడిన ఆభరణాలు ధరించేవాళ్లు. వాళ్లు ఎప్పుడూ చేతుల్లో పాత్రలు పట్టుకుని అతిథులకి, అభ్యాగతులకి ఆహార పానీయాలు సమకూరుస్తూ ఉంటారు.

వాళ్లు జాగ్రత్తగా ఉన్నారో లేదో సేవలు ఎలా చేస్తున్నారో, అపచారాలు ఏవైనా చేస్తున్నారేమో అని కనిపెట్టుకుని చూస్తూ ఉంటాను.

మదపుటేనుగులు, గొప్ప వేగం కలిగిన గుర్రాలు లక్షలు లక్షలుగా ఉన్నాయి. వాటికి సరిపడిన ఆహారం పెట్టడానికి, వాటిని అదుపులో పెట్టి క్రమశిక్షణతో ఉంచడానికి తగిన వాళ్లని నేనే నియమిస్తాను. బొక్కసంలో రాశులుగా ఉండే రత్నాలు, బంగారు వస్తువులు రోజూ జరిగే ఆదాయ వ్యయాలు అన్నీ నాకు తెలుసు.

నాకు తెలియని అంశం ఒక్కటి కూడా లేదు. సేవకుల్లో చివరి తరగతికి చెందిన గొల్లవాళ్లకి మిగిలినవాళ్లకి జీతభత్యాలు నేనే చూస్తుంటాను. పాండవులు తమ సంసారపు బరువుని నా మీద పెట్టి హాయిగా తమకి ఇష్టమైన చోట్లలో తిరుగుతూ ఉంటారు. కుంటుంబానికి సంబంధించిన అన్ని విషయాల్ని అన్ని వైపులా నేనే జాగ్రత్తగా చూసుకుంటాను.

తెల్లవారు ఝామున ఇంకా ఒక జాము సమయం మిగిలి ఉన్నప్పుడు మాత్రమే నాకు నిద్రపొవడానికి సమయం దొరుకుతుంది. నాకు కడుపునిండా తినడానికి, కళ్లనిండా నిద్ర పోవడానికి సమయం ఉండదు. సత్యభామా! ఇంత ఓర్పుతో సేవలు చేస్తున్నాను కనుకనే భర్తల ప్రేమని పొందగలిగాను.

పాండవులకి ఇష్టమైన పని చెయ్యడం మాత్రమే నాకు తెలిసిన ధర్మం. నువ్వు చెప్పిన మందు, మాకుల గురించి కాని, ఇంద్రజాల విద్యల గురించి కాని నాకు తెలియదు” అని చెప్పింది.

ద్రౌపది చెప్పిన విషయాలన్నీ విని సత్యభామ సిగ్గుతో తలవంచుకుని ద్రౌపదికి క్షమాపణ చెప్పింది. “ద్రౌపదీ! నువ్వు అభిమానవంతురాలివి. నేను కేవలం అజ్ఞానం వల్ల మాత్రమే మందులు, మాకులు, వశీకరణ విద్యల గురించి మాట్లాడాను.

వాటిని సరదాగా మాట్లాడుకున్న మాటలుగా అనుకుని నన్ను క్షమించు. నీ నడవడికే నీకు ప్రపంచంలో మంచి పేరు ప్రతిష్ఠలు సంపాదించి పెట్టింది” అంది.

ఆమె మాటలు విని ద్రౌపది “ఇవన్నీ నవ్వుకుంటూ మాట్లాడుకున్నవే!” అంది నవ్వుతూ

ద్రౌపది చెప్పిన ప్రతివ్రతాధర్మాలు

సత్యభామతో ద్రౌపది “భర్త మనస్సుని ఆకట్టుకునే ఉపాయాలు తెలివితేటలతో కూడినవి, గొప్పతనాన్ని తెచ్చిపెట్టేవి, ధర్మబద్ధంగా ఉండేవి చెప్తాను సావధానంగా విను. “భార్యకి భర్తని మించిన దైవం లేదు. భర్త అనుకుంటే భార్యకి ఆభరణాలు, ధన ధాన్యాలు, మంచి సంతానం, కీర్తి, పుణ్యం కలుగుతాయు. ఎంతో శ్రమపడితే కొంచెం సుఖం కలగుతుంది.

ఎక్కువ పుణ్యం దొరకాలంటే ఎక్కువ శ్రమ పడాలి. భర్తకి పరిచర్య చేస్తే సులువుగా పుణ్యము దానివల్ల ధర్మం కూడా దక్కుతుంది. నీ భర్త యందు సరైన ఆలోచన, ప్రేమ, ఉపాయము, ఆరాధనాభావం, తృప్తి చూపించు. నీ ప్రేమకి నీ భర్త కూడా నీ యందు అనురాగంతో ప్రవర్తిస్తాడు.

అతడు నీ ఇంటి గుమ్మం దగ్గరికి రాగానే ఎదురుగా వెళ్లి లోపలికి రమ్మని చెప్పు. అతడే త్వరత్వరగా నీ అంతఃపురంలోకి వస్తే అతడికి కూర్చోవడానికి సదుపాయాలు చెయ్యడానికి చాలమంది సేవకుల్ని నియమించాను కదా అని అనుకోకు. నువ్వే అతడికి అన్నీ సమకూర్చి అతడి అనురాగాన్ని అందుకో.

నీ మీద ఎంతో ప్రేమ కలిగిన శ్రీకృష్ణుడు సరదాగా మాట్లాడుతున్నప్పుడు ఏదైనా రహస్యం చెప్తే దాన్ని నువ్వు నీ దగ్గరి సఖులకి కూడా చెప్పకూడదు.

ఒకవేళ ఆ సంగతి నీ సవతులకి తెలిస్తే వాళ్లు నిన్ను నిందించి ఆ రహస్యాన్ని బట్టబయలు చేస్తారు. అప్పుడు నీ మీద ఉన్న ప్రేమాభిమానాలు శ్రీకృష్ణుడి మనస్సులో తగ్గిపోతాయి.

భర్తకి ఇష్టమైన చుట్టాలకి, స్నేహితులకి అతిథిమర్యాదలు చేసేటప్పుడు ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకో. వాళ్లని పూజ్యభావంతో చూడు.

భర్త మేలు కోరక వ్యతిరేకంగా ప్రవర్తించేవాళ్లు నీ స్నేహితులైనా సరే వాళ్లని విడిచిపెట్టు. స్త్రీలు తమ నడవడికని చాలా కష్టపడి జాగ్రత్తతో తీర్చిదిద్దుకోవాలి. ప్రద్యుమ్నుడు మొదలైనవాళ్లు నీకు పుత్రసమానులే అయినా కూడా వాళ్లతో ఏకాంతంగా ఒకే చోట ఉండకూడదు.

మంచి కుటుంబానికి చెందిన మంచి బుద్ధి కలిగిన పతివ్రతలతో మాత్రమే స్నేహం చెయ్యి. వన్నెలవిసినికర్రల్లా విర్రవీగుతూ ఉండే స్త్రీలతో ఎప్పుడూ కలిసిమెలిసి తిరగవద్దు..

నేను చెప్పిన ఈ మాటలన్నీ నీ భర్త అభిమానాన్ని పొందడానికి ఎంతగానో ఉపయోగపడతాయి” అని చెప్పింది ద్రౌపది.

అమె చెప్పిన మాటలు విని సత్యభామ “ద్రౌపదీ! నువ్వు ధర్మం తెలిసినదానివి. నీ భర్తలు దేవతలతో సమానమైనవాళ్లు. లోకంలో గొప్ప పేరుప్రతిష్ఠలు సంపాదించారు. దేదీప్యమానమైన తేజస్సుతో, బలంతో, పరాక్రమంతో వెలుగుతున్నారు. అటువంటి వాళ్లకి భూరాజ్యం తప్పకుండా వస్తుంది.

నీకు అపకారం చేసిన దుర్మార్గుల భార్యలు దిక్కులేక కష్టాలు పడవలసి వస్తుంది. అప్పుడు నీ మనస్సుకి సంతృప్తి కలుగుతుంది. నువ్వు వీరపత్నివి, నీ కొడుకులు కూడా అతిలోక పరాక్రమవంతులు కనుక నువ్వు వీరమాతవి కూడా. మనస్సులో ఎటువంటి ఆందోళన పెట్టుకోకు.

నీ కొడుకులు ప్రతివింధ్యుడు మొదలైనవాళ్లు ఇప్పుడు ద్వారకానగరంలో ఉన్నారు. వాళ్లకి ఏ లోటూ లేకుండ రుక్మిణి, సుభద్ర మిగిలినవాళ్లు అందరూ చూస్తున్నారు. తమ కొడుకులకంటే నీ కొడుకుల్ని ఎక్కువ ప్రేమతో లాలిస్తున్నారు. నువ్వు మనస్సులో ఏ ఆలోచనలు లేకుండా సుఖంగా సంతోషంగా ఉండు” అని చెప్పింది.

ఆ సమయంలో శ్రీకృష్ణుడు పాండవుల దగ్గర అనుమతి తీసుకుని మార్కండేయుడు మొదలైన బ్రాహ్మణ ఋషులకి నమస్కరించి ప్రయాణమయ్యాడు.

సత్యభామ కూడా ద్రౌపదిని కౌగలించుకుని శ్రీకృష్ణుడితోపాటు వెళ్లడానికి అనుమతి తీసుకుంది. శ్రీకృష్ణుడు సత్యభామతో కలిసి రథం మీద ద్వారకానగరం వైపు వెళ్లిపోయాడు.

మార్కండేయమహర్షి పాండవుల్ని ఓదార్చి తన ఆశ్రమానికి వెళ్లిపోయాడు” అని వైశంపాయనమహర్షి సర్పశాలలో జనమేజయుడికి భారతకథని వినిపించాడు.

Exit mobile version