[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
అహింస స్వరూపము
కౌశికుడితో “మహానుభావా! నేను చేస్తున్న మాంసాన్ని అమ్మడం అనే పని హింసకి సంబంధించింది కదా అని మొదట నన్ను అడిగావు. అప్పటికి సరిపడిన సమాధానం చెప్పాను. దాన్నే ఇప్పుడు సూక్ష్మంగా వివరించి చెప్తాను. ’అహింస’ని ఎవరూ నిర్వచించి చెప్పలేరు. పెద్దలు చెప్పినది, ప్రజల్లో వినబడేది, మనకి తెలిసిన విషయం ఉంది కదా.
ప్రాణులు నశించడమనేది వాటి కర్మని అనుసరించే జరుగుతుంది. చంపేవాడు కేవలం ఒక కారణం మాత్రమే. పళ్లు, వేళ్లు, ధాన్యాలు, కూరలు వంటి అన్ని ప్రాణులకి ఆహారంగా బ్రహ్మదేవుడు ఏర్పరిచినట్టు వేదాలు గట్టిగా చెప్తున్నాయి. వేద ప్రమాణాన్ని తిరస్కరించలేము కదా?
మహర్షీ! ఉశీనరుడి కొడుకైన శిబి చక్రవర్తి తన శరీరంలో మాంసాన్ని కోసి ఇంద్రుడికి, అగ్నిహోత్రుడికి ఇచ్చాడు కదా? ఆ శిబి చక్రవర్తికి పుణ్యఫలం దక్కలేదా? పూర్వకాలం రంతిదేవుడు అనే మహారాజు వేయి సంవత్సరాలపాటు ప్రతి రోజు రెండువేల ఆవుల్ని చంపి సంతర్పణ చేశాడు కదా? ఆ మహానుభావుడికి పాపం చుట్టుకుందా?
పండితులైన బ్రాహ్మణోత్తములు యజ్ఞయాగాదుల్లో పశువుల్ని చంపారు కదా? వాళ్లకి పుణ్యలోకాలు దక్కలేదా? అగ్నులు మాంసహారాన్ని ఎక్కువగా ఇష్టపడతాయని వేదాలు చెప్పట్లేదా? అందువల్ల మాంసాహారాన్ని కేవలం హింసగా అనుకోడానికి వీలు లేదు.
పితృదేవతలకి శ్రాద్ధక్రియల్లో నైవేద్యంగా మాంసం సమర్పించడం సరయిన పద్ధతి అని, శ్రాద్ధాల్లో నివేదించబడిన తరువాత ఆ మాంసం ఆహారంగా తీసుకోతగినదే అని ఋషుల అభిప్రాయం.
పండితుడా! నాగలితో పొలం దున్నినప్పుడు నాగలికర్రుకి తగిలి ఎన్నో జీవాలు చచ్చిపోతున్నాయి. అది హింస కాదని వాదించలేము కదా?
నువ్వే ఆలోచించు. నీళ్లు, భూమి, ఆకాశం అన్నీ ప్రాణులతో నిండి ఉన్నాయి. కనుక, అన్ని పనుల్లోను ఎంతో కొంత హింస జరగక తప్పదు. అసలు హింసే చేయకుండా మనిషి జీవితం నడవదు.
కొంతమంది ఈ విషయాన్ని గ్రహించకుండ తాము అహింసావ్రతులమని భ్రమపడుతుంటారు. అరణ్యాల్లో నివసిస్తూ కందమూల ఫలాల్ని తినే మహర్షులు కూడా అహింసావ్రతులు కాదు. ఎందుకంటే కందమూలఫలాల్లో కూడా ప్రాణం ఉంటుంది. ఆలోచిస్తే అది కూడా జీవహింసే అని అర్థమవుతుంది.
ఈ లోకంలో హింస చెయ్యనివాడు ఒక్కడు కూడా ఉండడు. వీలయినంతవరకు హింస చెయ్యకుండా ఉండడమే అహింస అని చెప్పాలి. ధర్మాన్ని తెలుసుకోవడం కష్టం. ధర్మసూక్ష్మతని అసలు తెలుసుకునే వీలే ఉండదు.
కనుక, ధర్మాన్ని తెలుసుకోడానికి వేదాల ప్రమాణం, పెద్దల నడవడికని ఆధారంగా తీసుకోవాలి. ధర్మసూక్ష్మాలు కంటికి కనిపించని ముఖ్యమైన చిన్న అంశాలు. ప్రాణులకి మంచి జరగడానికి చెప్పే అబద్ధం నిజం కంటే గొప్పది. ప్రాణులకి కీడు కలిగించే నిజం అబద్ధంతో సమానం. ప్రాణరక్షణకి, పెళ్లి జరిపించడానికి చెప్పే అబద్ధం నిజం కంటె గొప్పది. ఇవి ధర్మసూక్ష్మాలు” అని చెప్పి ధర్మవ్యాధుడు ఇంకా ఇలా చెప్పాడు.
“కులవృత్తి ఇష్టమున్నా లేకపోయినా దాన్ని విడిచిపెట్టకూడదని ధర్మజ్ఞులు చెప్తారు. దైవం తనకి నిర్దేశించిన వృత్తిగా అనుకోవాలి. ఎవరు చేసిన కర్మ ఫలితాన్ని వాళ్లు అనుభవించక తప్పదు.
వాటిని ఆపడానికి ఎవరికీ శక్యం కాదు. ఆ విషయం తెలియని వాళ్లు దేవుణ్ని దూషిస్తారు. తను చేసిన పనులు కొన్ని ఫలితాన్ని ఇస్తాయి. కొన్ని ఫలితాల్ని ఇవ్వవు.
కనుక తను చేస్తున్న పనులు తన సామర్థ్యం మీదే ఆధారపడి ఉంటాయని అనుకోడం అజ్ఞానం. తను అన్ని పనులు చెయ్యగల సమర్థుడైతే అన్నింటిలో మంచి ఫలితాల్నే పొందగలడు కదా! అదెలా జరుగుతుంది అని నువ్వు అడిగావనుకో నా సమాధానం కూడా చెప్తాను విను.
ఈ ప్రపంచంలో అన్ని పనులూ ఎలా జరుగుతున్నాయో ఆ పద్ధతుల్ని వివరంగా తెలుసుకుని నడుచుకునేవాళ్లు, ధర్మాత్ములు, సామర్థ్యం కలవాళ్లు చేసే పనులు కొన్ని జయప్రదం కాకపోవచ్చు.
దుర్మార్గులు, క్రూరులు, అవివేకులు అయినవాళ్లు చేసే పనులు కొన్ని విజయవంతం కావచ్చు. ఏ పనీ చెయ్యకుండా ఊరికే కూర్చున్నాకూడా వాళ్లకి ఐశ్వర్య విజయాలు కలగవచ్చు.
కొందరు ఎంతో కష్టపడి గొప్ప శ్రమ పడినా వాళ్లకి మంచి ఫలితం కలగదు. నిరుపేదలకి ఎక్కువ సంతానం కలుగుతుంది. ధనవంతులైన కొంతమందికి దానధర్మాలు, యజ్ఞయాగాలు ఎన్ని చేసినా సంతానం కలగదు. తమ కర్మల్ని బట్టే ఫలితం కలుగుతుంది.
మనిషి కర్మకి అధీనుడు కాకపోతే తన ఇష్టప్రకారమే తీర్చిదిద్దుకోగలిగితే కష్టాలు, రోగాలు, చావు వంటివి కలగకుండానే జీవించవచ్చు కదా! నువ్వు కూడా ఆలోచించు” అని చెప్పాడు.
జీవలక్షణాలు
ధర్మవ్యాధుడు చెప్పింది విని కౌశికుడు “జీవుడు ఎటువంటివాడో వివరంగా చెప్పు” అని అడిగాడు.
“బ్రాహ్మణులలో ఉత్తముడవైన కౌశికమహర్షీ! జీవుడు పాపం లేనివాడు, శాశ్వతంగా ఉండేవాడు. అతడు కర్మవశం వల్ల శాశ్వతం కాని శరీరాన్ని ధరిస్తాడు. మరణ సమయంలో దేహం నశిస్తుంది. కాని, శాశ్వతుడైన జీవుడు నశించడు.
శరీరాన్ని విడిచిన జీవుడు తను చేసిన కర్మకి సంబంధించిన సుఖదుఃఖాల్ని అనుభవిస్తాడు. అదే విధంగా ఎన్నో జన్మలు పొందుతాడు” అని చెప్పాడు.
ఆ మాట విని కౌశికుడు ధర్మవ్యాధుడిని “పుణ్యకర్మలు చెయ్యడం వల్ల పునర్జన్మ ఎలా ఉంటుంది? పాపకర్మ వల్ల తరువాత వచ్చే జన్మ ఎలా ఉంటుంది?” అని అడిగాడు.
ధర్మవ్యాధుడు “శాశ్వతమైన పుణ్యకార్యాలు చేస్తే దేవలోకంలో జన్మ దొరుకుతుంది. పుణ్యాలు, పాపాలతో కలిసిన కర్మలు చేస్తే మనిషి జన్మ లభిస్తుంది. కేవలం పాపాలే చేస్తే జంతువులుగాను, పురుగులుగాను పుడతారు. ఇలా జీవుడు పుడుతూ చస్తూ సంసారమనే భ్రాంతి చక్రంలో తిరుగుతాడే గాని ఎప్పటికీ ఒడ్డుకి చేరుకోలేడు.
పండితుడైనవాడు ఈ విషయాన్ని తెలుసుకుని పాపపు పనులు చెయ్యకుండా, అహంకారాన్ని, అసూయని విడిచిపెట్టి ధర్మకార్యాలు ఎక్కువగా చేస్తుంటాడు. ఎప్పుడూ ధర్మకార్యాలే చెయ్యడం వల్ల మనస్సు నిర్మలమవుతుంది. చిత్తం ప్రశాంతత పొందడం వల్ల ఇంద్రియ సుఖాల వల్ల ఉపయోగం లేదని తెలుస్తుంది.
అటువంటి జ్ఞానం కలగడం వల్ల అన్నింటినీ విడిచిపెట్టి తపస్సు, ఇంద్రియ నిగ్రహం, సత్యవ్రతం, మొదలైన సద్గుణాలతో ఆధ్యాత్మికమైన ఉన్నత స్థితికి చేరుకుంటాడు” అని చెప్పాడు.
కౌశికుడు ధర్మవ్యాధుడితో “ఇంద్రియాలు అంటే ఏమిటి? వాటిని అదుపులో పెట్టకపోతే కలిగే పాపం ఏమిటి? వాటిని అదుపులో పెడితే కలిగే లాభం ఏమిటి? వివరంగా చెప్పు” అని అడిగాడు.
కౌశికుడి ప్రశ్నలకి ధర్మవ్యాధుడు “విషయ జ్ఞానానికి ఆధారమైంది మనస్సు. అది కోరికలతోను, కోపతాపాలతోను కలిసి ఉండడం వల్ల మనిషిని ఇంద్రియభోగాలకి సంబంధించిన పనులవైపు తిప్పుతుంది. దానివల్ల కోరికలు పెరిగి, లోభం పెరిగి దయాగుణానికి దూరమవుతాడు.
గర్వంతో పాపపు పనులు చేస్తూ మంచివాళ్లు చెప్పే ధర్మాన్ని వినకుండా చెడ్డవాళ్లతో స్నేహం చేస్తాడు. మాటకి, మనస్సుకి, చేతలకి పొంతన లేకుండా చెడిపోతాడు. పుణ్యలోకాలు పొందకుండా దుఃఖాన్ని పొందుతాడు. మనస్సుని విషయ భోగాలవైపుకి వెళ్లకుండా జాగ్రత్త పడుతూ మంచివాళ్లతో సహవాసం చేస్తూ పుణ్యలోకాలకి వెళ్లడం మంచిది” అని చెప్పాడు.
బ్రహ్మవిద్యాప్రపంచము
ధర్మవ్యాధుడు ఇంకా చెప్తున్నాడు. “కౌశికమహర్షీ! ఇంద్రియాలు అంటే ఏమిటి? ఇంద్రియనిగ్రహం ఎలా దొరుకుతుంది? అని అడిగావు కదా.. అది ఆధ్యాత్మికతత్త్వం. నావంటి వాళ్లకి చెప్పడానికి వీలవదు. అయినా నువ్వు గొప్ప బ్రాహ్మణుడివి తెలుసుకోవాలన్న కోరిక కలవాడివి, వినడానికి యోగ్యత ఉన్నవాడివి కనుక నీ కోరిక నేను తీర్చాలి.
మొదట నేను మహానుభావులు, ఆధ్యాత్మిక తత్త్వకోవిదులు అయిన బ్రాహ్మణుల్ని ధ్యానించి, వాళ్లకి సవినయంగా నమస్కరించి నీకు బ్రహ్మజ్ఞానం గురించి తెలియచేస్తాను నువ్వు ఏకాగ్రతతో విను.
ఆకాశం, గాలి, నిప్పు, నీరు, నేల అనేవి పంచభూతాలు. వీటి గుణాలు వరుసగా నాదం, స్పర్శ, ఆకృతి, ద్రవం, వాసనలు. అంటే ఆకాశగుణం శబ్దం, వాయుగుణం స్పర్శం, అగ్నిగుణం రూపం, నీటిగుణం రసం, భూమిగుణం గంధం.
ఆకాశం మొదలైన పంచభూతాలు అనులోమ క్రమంలో పుడతాయి. అవి ప్రతిలోమ క్రమంలో లయమవుతాయి. అంటే ఆకాశం నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీటి నుంచి భూమి పుడతాయి. దీన్ని అనులోమక్రమం అంటారు. ప్రతిలోమ క్రమంలో ప్రళయకాలంలో భూమి నీటిలోను, నీరు అగ్నిలోను, అగ్ని వాయువులోను, వాయువు ఆకాశంలోను లయమవుతాయి.
చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు ఇవి ఐదు ఇంద్రియాలు. శబ్దం, స్పర్శం, రూపం, రసం, గంధం ఇవి అయిదు ఇంద్రియార్థాలు. వీటికి పంచతన్మాత్రలు అని పేరు. ఇంద్రియపంచకానికి తోడు ఆరవది మనస్సు, ఏడవది బుద్ధి, ఎనిమిదవది అహంకారం.
సత్త్వం, రజస్సు, తమస్సు మూడు త్రిగుణాలు. ఈ భూత ప్రపంచం మొత్తం ’అవ్యక్తం’ అనే తత్త్వంలో ఉదయిస్తుంది, అందులోనే లయిస్తుంది.
అవ్యక్తమై అగోచరమయ్యే తత్త్వము.. వ్యక్తం కాకపోయినా అనిర్వచనీయము, అనుభవైకవేద్యము అయినదే అయినా లోకవ్యవహారంలో, ఇంద్రియాలకి భూతాలకి అనువైన భావనలో లింగభేదంతో కలిసిన రూపంతో కనిపించవచ్చు.
ఆ విధంగానే అవ్యక్తతత్త్వాన్ని లౌకికులైన మానవులు తెలుసుకోగలుగుతారు. అంటే అవ్యక్తతత్త్వం వ్యవహారంలో వ్యక్తం కావచ్చును. అది నిరాకారము, అవ్యక్తము.
ఇంద్రియాలు శబ్దం మొదలైన భోగసాధనాలలో చిక్కుకుని ఇష్టానుసారం నడుస్తూ ఉంటాయి. బుద్ధిమంతుడు అది తెలుసుకుని జ్ఞానంతో వాటిని నిగ్రహించాలి. తపస్సు చేసి జ్ఞానాన్ని పొందిన వివేకవంతుడు సర్వభూతాల్లో తనను తాను తెలుసుకుంటాడు. తనయందున్న సర్వ భూతాల్ని తెలుసుకుంటాడు.
తపస్సు అంటే అన్ని విషయాలనుంచి వెనక్కి మరలిన మనస్సుతో కూడిన వైరాగ్యమే. తపస్సులో నిలకడ ఉన్న మనిషికి ఇంక చెయ్యవలసిన పనులు ఏవీ ఉండవు.
ఇంద్రియాల్ని నిగ్రహించడం వల్ల స్వర్గం లభిస్తుంది. ఇంద్రియాలని నిగ్రహించలేనివాళ్లకి నరకం లభిస్తుంది. ఈ శరీరం ఒక రథంగా అనుకుంటే ఇంద్రియాలు రథానికి కట్టిన గుర్రాలు. ఎవరు ఈ గుర్రాల్ని అదుపులో పెట్టి నడవగలడో అటువంటివాడు క్షేమ మార్గంలో వెడతాడు.
ఇంద్రియాలు ఆకర్షించిన వైపుకే మనస్సు ఎప్పుడూ వెడుతూ ఉంటుంది. వాటి వేగాన్ని అరికట్టకపోతే బుద్ధి పాడైపోతుంది. అయిదు ఇంద్రియాల్ని తన వశం చేసుకున్నవాడు ధ్యానయోగి. అటువంటివాణ్ని దేవతలు, ఋషులు కూడా ప్రశంసిస్తారు.
కౌశికమహర్షీ! తమోగుణం మంచిది కాదు. సత్త్వగుణం జ్ఞానంతో కలిసి ప్రకాశిస్తుంది. తమోగుణము, సత్త్వగుణాల సమ్మేళనమే రజోగుణం.
తమోగుణాన్ని సూచించే లక్షణాలు – ఇష్టం కలిగించని రూపం, నిద్రమత్తులోనే ఉండడం, హీనత్వం, ఎక్కువ భ్రాంతి కలిగి ఉండడం, సహనం లేకుండా ఉండడం మొదలైనవి.
రజోగుణాన్ని సూచించే లక్షణాలు – దురాశ, పిసినిగొట్టుతనం, జడత్వం, దురహంకారం మొదలైనవి.
సత్త్వగుణాన్ని సూచించే లక్షణాలు – ఆపద కలిగినా చలించని మనసు, మానసిక సంతృప్తి, తెలివితేటలు మొదలైనవి.
వీటి గురించి నువ్వు ఆలోచించుకుంటే నిజమే అని తెలుస్తుంది. పాపాలు నశించి జ్ఞనాన్ని పొందిన వివేకవంతుడు ఇహలోకంలో జరుగుతున్న విషయాలు సరయినవి కాదని వైరాగ్యభావాన్ని పెంచుకుని అహంకారాన్ని విడిచిపెట్టి ఇంద్రియనిగ్రహం కలిగి ఉండడం వల్ల యోగీశ్వరుడుగా మారి గొప్ప ప్రశాంతతని పొందుతాడు.
ఋషులు ఆత్మని తలయందు ధరిస్తారు.
ప్రాణుడు, అపానుడు మొదలైన వాయువులతో కలిసిమెలిసి అన్ని శరీరాల్లో తిరిగే అగ్నే జీవాత్మ. నీటిలో తడిసిపోకుండా ఉండే తామరాకులా శూద్రుడై పుట్టినవాడు సత్త్వగుణాలు కలిగి ఉంటే తరువాత జన్మలో వైశ్యుడిగా పుడతాడు. అదే విధంగా తరువాత జన్మలో క్షత్రియుడిగాను, తరువాత బ్రాహ్మణుడుగాను పుడతాడు. తరువాత జన్మరాహిత్యాన్ని కూడా పొందగలుగుతాడు” అని చెప్పాడు.
ధర్మవ్యాధుడు చెప్పినది విని కౌశికుడు “శరీరంలో అగ్నిహోత్రుడు ఎలా ప్రజ్వరిల్లుతుంటాడు? దేహంలో ఉండే గాలులు ఏ ప్రదేశాల్లో ఉంటాయి? ఈ విషయాల గురించి నాకు సందేహం కలగకుండా ఉండేలా వివరించు” అని అడిగాడు.
ధర్మవ్యాధుడు “ఆత్మ అనే అగ్ని నాభి నుంచి తల వరకు వ్యాపిస్తుంది. ప్రాణుడు అనే వాయువు ఆ అగ్నికి మధ్యలో శిరస్సులో తిరుగుతూ ఉంటుంది. అతడు భూతాలన్నింటికీ జీవత్వాన్ని ప్రసాదిస్తాడు.
ప్రాణుడికి అపానుడు తోడుగా ఉంటూ అగ్నిని జ్వలింపచేస్తాడు. అపానుడు మర్మావయవము పొత్తికడుపు మధ్య అగ్నితో కలిసి ఉంటాడు. అతడే మలమూత్రాల్ని విసర్జించేలా చేస్తాడు.
ఉదానుడు అనే వాయువు కంఠంలో ఉంటాడు. కర్మతంత్రాన్ని నడిపిస్తాడు. వ్యానుడు అనే వాయువు శరీరంలో ఉండే అన్ని అవయవాలు ఒకదానితో ఒకటి కలిసే ప్రదేశాల్లో ఉంటాడు.
సమానుడు అనే వాయువు నాభి ప్రదేశంలో ఉండి ఆహారపానీయాలు జీర్ణమయ్యేలా చేసి శరీరంలో ఉండే ధాతువులు పెరిగేటట్లు చేస్తాడు. సమానుడు అత్మాగ్నికి ప్రాణ అపానులకి తోడుగా ఉండి సహకరిస్తాడు.
పంచప్రాణాల గురించి, ఆత్మాగ్నిని గురించిన పరిజ్ఞానం గొప్ప యోగదర్శనం వల్ల మాత్రమే కలుగుతుంది. సాధనవల్ల గొప్పవాళ్లైన వాత్మ దేహంలో నిర్లిప్తంగా ఉంటాడు. ఆ జీవాత్మే పరమాత్మ.
అచేతనంగా ఉండే శరీరాన్ని చేతనంగా చేసేవాడు జీవాత్మగా చెప్పబడే పరమాత్మే. అతడు గొప్పవాడు. మూడు లోకాల్ని సృష్టించగలవాడు. అన్ని పదార్థాల్లోను ప్రకాశిస్తూ భూతాలన్నింటికీ ఆత్మగా వెలుగొందుతూ స్థూల దృష్టికి కనిపించే శాశ్వతుణ్ని సూక్ష్మదృష్టి కలిగిన జ్ఞానులు పరమాత్మగా తెలుసుకుంటారు” అని చెప్పాడు.
తరువాత ధర్మవ్యాధుడు కౌశికుడికి వేదాంత జ్ఞానం యొక్క మహిమ ఆచరణలో ఎలా తెలుస్తుందో వివరిస్తూ “జ్ఞానవంతుడు- మంచిపనుల్లోను, చెడ్డపనుల్లోను కూడా నిర్లిప్తంగా ఉంటాడు. సుఖదుఃఖాలకి అతీతంగా ఉంటాడు. అన్ని విషయాల్లోను సమభావం కలిగి ఉంటాడు.
పుణ్యాత్ముడు చెయ్యవలసిన కర్తవ్యాలు – ప్రతిరోజు అన్ని కాలాల్లోను యోగసాధన చేస్తూ, ఆహారాన్ని మితంగా తీసుకుంటూ, ఇంద్రియాల్ని నిగ్రహించినవాడు ఆత్మలో పరమాత్మని దర్శించి గాలి లేని చోట నిశ్చలంగా ప్రకాశించే దీపంలా నిశ్చలంగా వెలుగుతాడు.
మహర్షీ! పరిపక్వత చెందిన మనసు కలిగినవాళ్లు కామక్రోధాల్ని వదిలిపెడితే మంచి జరుగుతుంది. మనిషి కర్మల్ని ఆచరిస్తూనే ఉండాలి కాని, వాటి ఫలితాల్ని విడిచిపెట్టాలి. మనిషి జీవితం శాశ్వతం కాదని తెలుసుకున్న జ్ఞాని ఎవరికీ అపకారం చెయ్యడు. స్నేహభావంతో మెలుగుతాడు.
ఎప్పుడూ తపస్సు చేసుకుంటూ, ఎవర్నీ యాచించకుండా ఉన్నదానితో తృప్తిపడతాడు. ఇంద్రియనిగ్రహం సాధించిన బ్రాహ్మణుడు శాశ్వతమైన ఆనందస్థితిని పొందుతాడు. నువ్వు అడిగిన విషయాలన్నీ నాకు తెలిసినంతవరకు తెలియచేశాను. నీకు ఏ విషయం గురించి కావాలో అడుగు!” అన్నాడు ధర్మవ్యాధుడు.
కౌశికుడు “మహానుభావా! నేను వినాలనుకున్న విషయాలన్నీ నువ్వు వివరంగా చెప్పావు. నువ్వు చెప్పిన విషయాలవల్ల ఆధ్యాత్మికంగా జ్ఞానవంతుడిని అయ్యాను. అన్ని విషయాలు తెలిసిన సర్వజ్ఞుడివి. నీకు ధన్యవాదాలు” అన్నాడు.