[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
అరణ్యపర్వము-అయిదవ ఆశ్వాసము
మార్కండేయ మహర్షి – ధర్మరాజు సందేహాలు
నైమిశారణ్యంలో శౌనకుడు మొదలైన మహర్షులకి సత్రయాగం సందర్భంగా సూతుడు మహాభారత కథని వినిపించాడు. ధర్మరాజుకి మార్కండేయ మహర్షి ఎన్నో పుణ్యకథలు చెప్పాడు.
వాటిని విని ధర్మరాజు ఎంతో సంతోషంతో మార్కండేయ మహర్షితో “అందరి పాపాలని పోగొట్టగలిగిన మహర్షీ! గొప్ప పతివ్రతల మహిమల్ని గురించి వినాలని కోరికగా ఉంది. ఇంద్రియాల్ని అరికట్టి, వాటిని మనస్సుకి లోబడేటట్లుగా చేసుకుని మనస్సులో అహంకారం లేకుండా తన భర్తకి సేవ చేసే స్త్రీ జగత్తులో అందరికంటే గొప్పదని నా అభిప్రాయం. అటువంటి నడవడికలో అనేక ధర్మసూక్ష్మాలు ఇమిడి ఉంటాయి. దయచేసి అటువంటి పుణ్యకథలు వినిపించండి.
అంతేకాకుండా సంతానం విషయంలో తల్లితండ్రుల్లో ఎవరిది ఎక్కువ శ్రమగా చెప్పవచ్చు, తల్లితండ్రుల విషయంలో కొడుకులు ఎలా ఉండాలి; తక్కువ కులంలో పుట్టిన మనిషి ధర్మాత్ముడు పొందే లోకాల్ని పొందాలంటే ఏం చెయ్యాలి; ఈ ప్రశ్నలకి సరయిన సమాధానం చెప్పగల అర్హత మీకు మాత్రమే ఉంది దయచేసి చెప్పండి” అని ప్రార్థించాడు.
మార్కండేయ మహర్షి ధర్మరాజుతో “రాజా! కొడుకుని తల్లి తొమ్మిది నెలలు తన కడుపులో మోసి తన ప్రాణాన్ని పణంగా పెట్టి చాలా శ్రమపడి ప్రసవిస్తుంది. తండ్రి కొడుకు పుట్టాలని ఉపవాసాలు, వ్రతాలు నిర్వహించి దానధర్మాలు చేసి నోములు నోచి, దేవతల్ని, మంచివాళ్లని పూజిస్తాడు. సంతానం కోసం తల్లితండ్రులు ఇద్దరు పడే శ్రమ ఒకటే అని చెప్పవచ్చు. తమ కొడుకు తమ మీద ప్రేమ కలిగి తమను ఆరాధించాలని ధర్మమార్గంలో నడుచుకోవాలని కోరుకుంటారు.
అందువల్ల తల్లితండ్రుల కోరిక తీర్చగలిగేవాడు అసలైన కొడుకు. తన నడవడిక వల్ల తన తల్లితండ్రులకి ఎక్కువ సంతోషాన్ని కలిగించే కొడుకే ధర్మాన్ని, కీర్తిని గొప్పగా సంపాదిస్తాడు. శాశ్వతమైన పుణ్యలోకాల్ని పొందుతాడు.
మార్కండేయమహర్షి సమాధానాలు
పతివ్రత మహిమ
తన భర్తకి సేవ చెయ్యడంలో ఇష్టం కలిగిన పతివ్రతకి అన్ని యజ్ఞాలు, దానాలు, తపస్సులు చేసిన పుణ్యాలు కలుగుతాయి. ఈ విషయాన్ని తెలియచేసే జరిగిన కథని వినిపిస్తాను. ఆ ఇతిహాసంలో నువ్వు అడిగిన ప్రశ్నలన్నింటికీ సరిపడిన సమాధానం దొరుకుతుంది.
పూర్వం ఒక పల్లెటూర్లో కౌశికుడు అనే బ్రాహ్మణుడు నివసిస్తూ ఉండేవాడు. అతడు ధర్మాత్ముడు, తపస్వి, వేదాల్ని వల్లెవేస్తూ ఉండేవాడు. ఒకరోజు చెట్టు కింద కూర్చుని వేదాలు వల్లెవేస్తున్నప్పుడు ఒక కొంగ అతడి మీద రెట్టవేసింది. ఆ కౌశికుడు అమితమైన కోపంతో ఆ పక్షివైపు చూశాడు.
వెంటనే ఆ పక్షి ప్రాణం పోయి నేలమీద పడింది. అది చూసిన కౌశికుడు “అయ్యో! నా వల్ల కొంగ ప్రాణాలు పోగొట్టుకుంది. నేను ఘోరమైన పాపం చేశాను. నాకు ఇప్పుడు శాంతి ఎలా దొరుకుంది” అని బాధపడ్డాడు.
అప్పటికి మిట్టమధ్యాహ్నం అయింది. ఆ సమయంలో చెయ్యవలసిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని దగ్గరలో ఉన్న గ్రామానికి వెళ్లి అక్కడ బ్రాహ్మణ గృహాల్లో ‘బిక్షాం దేహి’ అన్నాడు. ఆ ఇంటి ఇల్లాలు కంగారుపడుతూ అతడికి భిక్ష వెయ్యడం కోసం గిన్నెని కడుగుతోంది.
ఆ సమయంలో ఆమె భర్త ఆకలితో తూలుతూ ఇంటికి చేరాడు. ఆమె అతణ్ని చూడగానే కాళ్లు కడుగుకోవడానికి నీళ్లందించింది. అతడికి స్నానం చేయడానికి అన్నీ అమర్చి, నెమ్మదిగా మాట్లాడుతూ అన్నం వడ్డించింది. భర్త భోజనం చేశాక పడుకోవడానికి పక్కని ఏర్పాటు చేసి, తాంబులమిచ్చి, కాళ్లుపట్టి పరిచర్యలన్నీ చేసింది.
ఆమెకి వాకిలి ముందు నిలబడి భిక్ష అడిగిన బ్రహ్మచారి గుర్తుకొచ్చాడు. వెంటనే గిన్నెలో అన్నం నింపుకుని వచ్చింది. ఆ ఇల్లాల్ని చూసి కౌశికుడు కోపంతో “అమ్మా! అడిగినప్పుడు వెంటనే వెళ్లిపొమ్మనుంటే వెళ్లిపోయి ఉండేవాడిని కదా! గర్వంతో నన్ను ఇలా నిలబెట్టి భిక్ష వెయ్యకుండా అవమాన పరిచావెందుకు?” అని అడిగాడు.
అతడి మాటలకి ఆ ఇల్లాలు “అయ్యా! నా భర్త ఎంతో ఆకలితో ఇంటికి వచ్చాడు. అతడికి సేవలు చేస్తూ మిమ్మల్ని మర్చిపోయాను. దీన్ని మీరు తప్పుగా అనుకోకుండా ఓర్పు వహించండి” అంది.
ఆమె మాట విని “అమ్మా! నీ భర్తే అంత గొప్పవాడని అనుకుంటున్నావా? నీ ఉద్దేశంలో జ్ఞానవంతులైన బ్రాహ్మణులు తక్కువగా అనిపిస్తున్నారా? దేవేంద్రుడు కూడా బ్రాహ్మణుల్ని భక్తితో పూజిస్తాడు. అటువంటి బ్రాహ్మణుణ్ని నువ్వు చులకనగా చూడడం నాకు ఆశ్చర్యంగా ఉంది.
బ్రాహ్మణులు అవమానించబడితే వాళ్ల కోపం అగ్నిజ్వాలలా విజృంభించి ఈ భూమిని కొండలతో, అడవులతో, దీవులతోపాటుగా దహించేస్తుంది. వాళ్ల మహిమ చాలా గొప్పది. నువ్వు ఈ విషయం తెలుసుకోలేకపోయావు” అన్నాడు.
కౌశికుడి మాటలు విని ఆ ఇల్లాలు “భూదేవతలైన బ్రాహ్మణులు దేవతలతో సమానమే. నాకు వాళ్ల గొప్పతనం తెలియదా? ఒక బ్రాహ్మణుడు కోపంతో సముద్రపు నీళ్లు తాగడానికి వీలుకానివిగా శపించాడు. మరొక బ్రాహ్మణుడు దండక ప్రదేశం తగులపడేటట్లు చేసాడు. ఒక బ్రాహ్మణుడు వాతాపి అనే రాక్షసుణ్ని తిని జీర్ణించుకున్నాడు.
అంతేకాదు, భూలోకంలో అనేకమంది బ్రాహణోత్తముల కథలు నేను విన్నాను. బ్రాహ్మణోత్తమా! తెలిసీ తెలిసీ బ్రాహ్మణుల్ని అవమానించి కొరివితో తలగోక్కోడానికి నేను పిచ్చిదాన్ని కాదు. నేను అనుసరిస్తున్న మార్గాన్ని గురించి చెప్తాను విను.
నా దృష్టిలో నాకు గొప్ప దేవుడు నా భర్తే. మనస్సు, మాటలు, చేతలతో నా భర్త మంచినే నేను కోరుకుంటాను. ఇంతకంటే గొప్ప ధర్మాలు నాకు కనిపించట్లేదు. నువ్వు కోపస్వభావం కలవాడివని, నీ కోపం వల్ల ఒక కొంగ చనిపోయిందని తెలుసు. ఈ విషయం పాతివ్రత్య మహిమ వల్ల తెలుసుకోగలిగాను. కోపం కలిగి ఉండడం మంచిది కాదు” అని చెప్పి ఆగింది.
తరువాత మళ్లీ చెప్పడం మొదలుపెట్టింది. “మానవుల హృదయాల్లో కోపం, మోహం అనే పేర్లు గల శత్రువులు ఇద్దరు నివసిస్తుంటారు. ఆ శత్రువులిద్దర్నీ ఆణిచివెయ్యకపోతే బ్రాహ్మణులకి నిజమైన గొప్పతనం ఎలా కలుగుతుంది? బ్రాహ్మణుడు ఎవరు? ఎవరికి బ్రాహ్మణ గౌరవం దక్కాలి?
ఎప్పుడూ నిజాన్నే పలుకుతూ; ఎవరినీ బాధపెట్టకుండా; గురువుల, తల్లితండ్రుల మేలు కోరుతూ; అన్ని ప్రాణులయందు దయ చూపిస్తూ; కోరికల్ని వదిలిపెట్టి; తను ఆచరించవలసిన కర్మల్ని ఆచరిస్తూ ఉండే మహాత్ముడైన బ్రాహ్మణుణ్ని నిజమైన బ్రాహ్మణుడిగా దేవతలు ప్రస్తుతిస్తారు.
మంచి ప్రవర్తన, వేదాధ్యయనము, ఇంద్రియనిగ్రహాలు బ్రాహ్మణుడికి గొప్ప ధనాలు. ధర్మమార్గానికి ఇటువంటి మంచిగుణాలే సాధనాలని వేదాల్లో చెప్పబడ్డాయి. ధర్మాన్ని గురించి తెలుసుకోడం చాలా కష్టం. స్థూలదృష్టికి ఒక రకంగాను, సూక్ష్మదృష్టికి మరొక విధంగాను కనిపిస్తుంది. ధర్మం యొక్క తీరుతెన్నులు చాలా విధాలుగా కనిపిస్తాయి.
నువ్వు వేదాల్ని వల్లెవెయ్యడంలో మాత్రమే ఎక్కువ నిష్ఠకలవాడివి. ధర్మసూక్ష్మాల్ని తెలుసుకోవడంలో విచక్షణ లేనివాడివి. నువ్వు మిథిలాపట్టణం వెళ్లి అక్కడ ధర్మవ్యాధుణ్ని కలుసుకో.
అతడు ఇంద్రియాల్ని జయించినవాడు. తల్లితండ్రుల్ని పూజిస్తాడు. ధర్మసూక్ష్మవేత్త. నీ సంశయాలన్నీ పోగొట్టి సందేహాలు తీర్చి విచక్షణాజ్ఞానం కలిగిస్తాడు. నా మీద కోపగించకు. ఆడవాళ్లకి విచక్షణా జ్ఞానం ఉండదు కదా! అజ్ఞానంలో పడి కొట్టుకునే నా వంటి ఆడవాళ్లు ఎలాంటి నేరం చేసినా క్షమించాలి” అని చెప్పింది.
ఆమె చెప్పినదాన్ని విని కౌశికుడు “అమ్మా! నువ్వు ఇల్లాళ్లకి మార్గదర్శకురాలివి, కర్మయోగినివి. నీ వల్ల నాకు జ్ఞానోదయమయింది. నా మనస్సుకి ప్రశాంతత కలిగింది. నువ్వు చెప్పినట్టే నేను మిథిలానగరానికి వెడతాను. నీకు మంచి జరుగుతుంది” అని చెప్పి వెళ్లిపోయాడు.
ధర్మవ్యాధుడి ధర్మబోధ
ధర్మవ్యాధుణ్ని కలిసిన కౌశికుడు
కౌశికుడు ఆ పతివ్రత జ్ఞానానికి ఆశ్చర్యపోయాడు. తను చేసిన తప్పుకి పశ్చాత్తాపం పొందాడు. అతడు ఎన్నో పల్లెలు, పట్టణాలు దాటి మిథిలానగరం చేరుకున్నాడు. రాజధాని అందాల్ని చూస్తూ రాజమార్గంలో ఉండే ప్రజల్ని అడుగుతూ ధర్మవ్యాధుడు ఉండే చోటుని తెలుసుకున్నాడు.
కౌశికుడు అక్కడికి వెళ్లేటప్పడికి ధర్మవ్యాధుడు అంగట్లో మాంసాన్ని ముక్కలుగా చేసి అమ్ముతున్నాడు. మాంసాన్ని కొనడానికి వచ్చిన జనాలతో ఆ కొట్టు నిండిపోయి ఉంది. ఆ ప్రదేశం రోత పుట్టి కౌశికుడు ఒక చోట ఒదిగి నిలబడ్డాడు
ధర్మవ్యాధుడు కౌశికుడు రావడం తన మనశ్శక్తితో తెలుసుకుని అతడు నిలబడి ఉన్న చోటుకి వెళ్లి ప్రేమతో పలకరించాడు. “పుణ్యాత్ముడా! నీకు నా గురించి పతివ్రత చెప్పింది కనుక, ఇక్కడికి వచ్చావు. ఈ విషయం నాకు ఎవరూ చెప్పలేదు. నా మనసుకి తెలిసింది. ఎంతో సంతోషంగా ఉంది. మా యింటికి రా!” అని బ్రాహ్మణోత్తముడైన కౌశికుణ్ని గౌరవంగా తన ఇంటికి తీసుకుని వెళ్లాడు.
కౌశికుడిక పతివ్రత మాటలే కాకుండా ధర్మవ్యాధుడి మాటలు కూడా వింతగా అనిపించాయి. ధర్మవ్యాధుడి ఇంటికి వెళ్లి అతిథిసత్కారాలు పొందాడు. తరువాత ధర్మవ్యాధుడితో “అయ్యా! ధర్మమార్గం గురించి తెలిసినవాడివి కదా! జీవహింసని బ్రతుకుతెరువుగా ఎంచుకోడం న్యాయంగా ఉందా? నువ్వు చేస్తున్న ఈ పాపపు పని చూసి నా మనస్సు బాధపడుతోంది” అన్నాడు.
కౌశికుడి మాటలు విని ధర్మవ్యాధుడు “ఎవరి ధర్మాలు వాళ్లు ఆచరించాలి. బ్రాహ్మణులు ఆచరించవలసిన ధర్మాలు – తపస్సు, వేదాలు చదవడం, పరిశుభ్రంగా ఉండడం, ఇంద్రియ నిగ్రహం పాటిస్తూ జ్ఞానాన్ని పొందడం.
క్షత్రియులు పాటించవలసిన ధర్మాలు- మంచివాళ్లని రక్షిస్తూ, దుష్టుల్ని శిక్షిస్తూ రాజ్యపాలన చేయడం.
వైశ్యులు ఆచరించవలసిన ధర్మాలు- వ్యవసాయం, వర్తకం, పాడిపంటలు పెంచడం.
శూద్రులు చెయ్యవలసిన ధర్మం- పరిచర్య చేయడం.
అలాగే వ్యాధులు నెరవేర్చదగిన ధర్మం మాంస విక్రయం. మాంసాన్ని అమ్మి జీవించడం మాకు వంశక్రమంగా సంక్రమించిన ఆచారం. అంతేకాదు, ఇది మిథిలారాజ్యం. ఈ దేశపురాజు జనకమహారాజు ఎవరి వంశానికి చెందిన వృత్తులు వాళ్లు చేయాలని శాసించాడు. ఈ శాసనం మీరితే తన కొడుకైనా సరే దండించేవాడు. ఇన్ని కారణాలు ఉండడం వల్ల మాంస విక్రయం నా స్వధర్మం కనుక నేను దాన్ని విడిచిపెట్టలేను.
స్థూల దృష్టికి నా ప్రవర్తన నీకలా కనిపించి ఉంటుంది. కాని, నా అంతట నేను ఎప్పుడూ జీవహింస చెయ్యలేదు. ఇతరులు మృగాల్ని చంపి తెచ్చి ఇచ్చిన మాంసాన్ని కొని, ఎక్కువ లాభాన్ని ఆశించకుండా సరయిన ధరకి అమ్ముతుంటాను. అలా వచ్చిన ధనంతో జీవిస్తాను.
అందువల్ల నాకు మనశ్శాంతి కూడా కలుగుతుంది. నేను వినయంతో గురువుల్ని, పెద్దల్ని అతిథుల్ని, బ్రాహ్మణుల్ని గౌరవిస్తాను. నిజమే మాట్లాడతాను. పరిశుభ్రంగా ఉంటాను. సేవకులకి దానాలు ఇస్తాను.
బంధువుల్ని మర్యాదగా చూస్తాను. ఓర్పుకలిగి ఉంటాను. అసూయ పడను. ఏ విషయాల్లోను కోరికల్ని పెంచుకోను. ఇతరుల తప్పుల్ని గురించిన మాటలు వినను. ఆహార విహారాల్లో నిష్ఠ కలిగి ఉంటాను. ఉపవాస వ్రతాలు పాటిస్తాను. పొగడ్తలకి సంతోషించి, నిందలకి అవమానపడను.
నేను తక్కువ కులంలో పుట్టినా మంచి నడవడికని అలవరుచుకున్నాను. ఇదంతా దాని గురించిన మాటలు వచ్చాయి కనుక, నీకు చెప్తున్నాను. నా గొప్ప చెప్పుకోవడానికి మాత్రం కాదు” అని చెప్పాడు
ధర్మసూక్ష్మాలు
“బ్రాహ్మణోత్తమా! నువ్వు నా దగ్గరికి ధర్మసూక్ష్మాలు తెలుసుకోడానికి వచ్చావు కనుక వాటి గురించి చెప్తాను విను. పెద్దలు చెప్పిన మాట ప్రకారం ఎవరి కులానికి చెందిన ధర్మాన్ని వాళ్లు వదలకుండా ఆచరించాలి. దయాగుణం కలిగి ఉండాలి. తన అభిప్రాయమే మంచిది ఇతరుల అభిప్రాయం చెడ్డది అనే భావం ఉండకూడదు. అందరి భావాల యందు ఓర్పు కలిగి ఉండాలి. మనస్సులో ఇంద్రియసుఖాల మీద కోరిక వదలాలి.
త్యాగంతో సమానమైన లక్షణం లేదని పెద్దలు చెప్పారు. త్యాగం చేసే స్వభావం కలవాళ్లకి అసాధ్యమైంది ఎక్కడా ఉండదు. సావధానంగా విను. ఎప్పుడూ మంచివాళ్లని గౌరవించాలి. కోరికలు అలజడి కలిగించినా ధర్మమార్గాన్ని వదలకుండా నడవడిక తీర్చిదిద్దుకోవాలి.
శుభం కలిగినా అశుభం కలిగినా పొంగిపోకూడదు, కుంగిపోకూడదు. అపకారం చేసినవాళ్లకి కూడా ఉపకారమే చెయ్యాలని పెద్దలు చెప్పిన మాట. అపకారం చేసివాడు ఎలాగూ తన పాపంతో తనే కాలిపోతాడు.
వేదం చెప్పిన మాటలు అంగీకరించకుండా దేవుడు లేడు అని వాదించేవాళ్లు ధర్మాత్ములు చేసే మంచిపనుల్ని నిందిస్తారు. వాళ్లు చెప్పే మాటలు విని వివేకవంతుడు ధర్మాన్ని వదిలిపెట్టకూడదు. ఆలోచించకుండా పాపం చేసినప్పుడు పశ్చాత్తాపం వల్ల సగం పాపాన్ని, ఇంకెప్పుడూ చెయ్యనని అనుకోడం వల్ల మిగిలిన సగం పాపాన్ని పోగొట్టుకోవచ్చు. కోపము, లోభము జయించని వాడిని ధర్మాత్ముడు అని చెప్పుకోరు.
మంచివాళ్లు ఆచరించని కొన్ని పద్ధతులు పైకి ధర్మాలుగా కనిపించవచ్చు. దట్టంగా గడ్డితో కప్పబడిన నూతులు పైకి నేలలా కనిపించినా లోతైన గోతులుగా ఉండి చూసేవాళ్లకి భ్రాంతి కలిగిస్తాయి. అటువంటి కపట ధర్మాల్ని వదిలిపెట్టి మంచివాళ్లు చెప్పే ధర్మాల్ని ఆచరించడం మంచిది” అని చెప్పాడు.
ధర్మవ్యాధుడు చెప్పినవి విని మంచివాళ్లు ఆచరించే ధర్మాలు ఏమిటో చెప్పమని అడిగాడు. ధర్మవ్యాధుడు కౌశికుడితో “మహాత్మా! ఎన్నో గొప్ప గుణాలు కలిగి ఉంటేనే మంచిలక్షణం అనిపించుకుంటుంది. మంచి గుణాలు అని చెప్పే విషయాల గురించి చెప్తాను విను-
ఉపకారం కోసం ధనాన్ని ఇవ్వడం; ఎప్పుడూ నిజమే మాట్లాడడం; ఇంద్రియాల్ని మనస్సుని నిగ్రహించడం; విశ్వశ్రేయస్సుకోసం క్రతువులు నిర్వహించడం; ఇతరుల్ని మోసగించకుండా ఉండడం; ప్రశాంతంగా జీవించడం; కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మాత్సర్యము అనే గుణాల్ని విడిచిపెట్టడం; తల్లితండ్రుల్ని, విద్యనేర్పిన గురువుల్ని గౌరవించడం; నీచత్వానికి దిగజారకుండా నాస్తికుల సమూహంలో చేరిపోకుండా నడవడికని కాపాడుకోవడం; తీర్థయాత్రలు చేయడం; అన్ని ప్రాణులయందు దయకలిగి ఉండడం; తక్కువగాను, ప్రేమతోను మాట్లాడడం; ఆశ్రయం కోరిన స్నేహితుల్ని కాపాడడం మొదలైనవి.
మంచిప్రవర్తనతో అసూయని విడిచిపెడితే కలిగే సంతోషం ఇంక ఏ మార్గాన్ని అనుసరించినా దొరకదు. కనుక, పెద్దల పరిచర్య చేస్తూ కోపాన్ని వదిలిపెట్టి ధన్యత పొందు.
మహాత్మా! అన్ని ధర్మాల్లోకి అహింస గొప్పది. సత్యంతో కలిసిన అహింస చాలా గొప్పది. అంతకంటే గొప్పది నిజాన్ని పలకడం. ధర్మాలు మూడు రకాలు. వేదాల్లో చెప్పబడినవి, శాస్త్రాల్లో చెప్పబడినవి, పెద్దల నడవడికల వల్ల తెలిసేవి. ఈ మూడు పద్ధతులు మంచి గతులు పొందడానికి ఉపయోగపడతాయి” అని చెప్పాడు.