[బాలబాలికలకు మహాభారతంలోని వివిధ ఘట్టాలను కథా రూపంలో వివరిస్తున్నారు శ్రీమతి భమిడిపాటి బాలాత్రిపుర సు౦దరి.]
వామదేవుడు చరిత్ర
ధర్మరాజు మార్కండేయ మహర్షిని బ్రాహ్మణ ప్రభావాన్ని గురించి తెలియచెయ్యమని ప్రార్థించాడు. మహర్షి ధర్మరాజుకి వామదేవుడి చరిత్ర వివరిస్తున్నాడు. “సూర్యుడితో సమానమైన తేజస్సు కలవాడు, సూర్యవంశంలో పుట్టినవాడు, అంతకుముందు ఎవరు పొందనంత కీర్తిని పొందినవాడు, సాటిలేని పరాక్రమం కలవాడు పరీక్షిత్తు అనే మహారాజు.
అతడు ఒకరోజు వేటకోసం అడవికి వెళ్లి ఎక్కువ వేగం కలిగిన గుర్రం మీద ఎక్కి తిరుగుతున్నాడు. అక్కడ మంచి సువాసన కలిగిన పువ్వుల్ని కోస్తూ ఒక అందగత్తె కనిపించింది. ఆమె దగ్గరికి వెళ్లి ఎక్కడినుంచి వచ్చావు? ఈ అడవిలో ఒంటరిగా ఎందుకు తిరుగుతున్నావు అని ప్రశ్నించాడు.
ఆమె తనొక పెళ్లికొడుకుని వెతుకుతూ తిరుగుతున్నానని చెప్పింది. రాజు తన కోరికని వెల్లడించాడు. అందుకు ఆమె అంగీకరించి తనను ఎప్పుడూ జలవిహారానికి రమ్మని అడగకూడదని ఒక షరతు పెట్టింది. ఆమె షరతుకి అంగీకరించి పరీక్షిత్తు మహారాజు తన వెంట తీసుకుని వెళ్లాడు.
తన రాజధానిలో ఉద్యానవనంలో విహరించడానికి అనువైన భవనాల్ని నిర్మించడానికి ఆజ్ఞాపించాడు. ఆ శరదృతువు రోజుల్లో తామరపువ్వుల తోటలనుంచి వచ్చే పరిమళాన్ని ఆస్వాదిస్తూ తన దేవేరితో కలిసి విహరిస్తున్నాడు.
అక్కడ ఒక మనోహరమైన తామరపువ్వులతో కళకళలాడుతున్న కొలను చూసి ఆమెని గట్టు మీద కూర్చోమని తను కొలనులోకి దిగాడు. కొంతసేపు గడిచాక అమెని పిలుస్తూ “ఈ నీళ్లు చాలా నిర్మలంగా ఉన్నాయి. నువ్వు కూడా ఈ నీళ్లల్లో దిగి స్నానం చెయ్యి” అని చెప్పాడు.
ఆమె నవ్వుతూ ఆ సరోవరంలో దిగి వెంటనే మాయమైపోయింది. రాజు ఆశ్చర్యంతో ఆ కొలనంతా వెతికాడు. ఎంత వెతికినా అమె కనిపించలేదు. రాజు ఆ కొలనులో ఉండే అన్ని నీళ్లని బయటికి చిమ్మేశాడు. అందులో ఉన్న కప్పల్ని చూసి అవే తన దేవేరిని తినేసి ఉంటాయని అనుకుని తన భటుల్ని పిలిచి ఈ భూలోకంలో ఉన్న కప్పల్ని అన్నింటినీ చంపించమని ఆజ్ఞాపించాడు.
రాజభటులు అన్ని వైపులకి వెళ్లి చెరువులు, మడువులు, సెలయేరులు, వాగులు, నదులు, వాననీరు పోడానికి తవ్విన కాలువలు వెతికి వెతికి చంపేస్తున్నారు.
అది చూసి కప్పల నాయకుడు మహర్షి రూపంలో వచ్చి రాజుతో “రాజా! ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఇలా కప్పల్ని చంపడం అన్యాయం. నువ్వు చేయిస్తున్న ఈ పని చూసి లోకమంతా నవ్వుతోంది. దీనివల్ల నీకు వచ్చిన ఉపయోగం ఉంటుందా? కప్పలమీద జాలి చూపించు” అని భేకనాయకుడు రాజుని వారించాడు.
ఆ మాటలు విని రాజు “ఇవి నా ప్రేయసికి కీడు చేసాయి కనుక నేను కసి తీర్చుకుంటున్నాను. ఇది న్యాయమే! నా ప్రేయసిని మింగిన దొంగ కప్పల్ని సంహరిస్తాను ఇంక నువ్వు నాకు చెప్పకు” అన్నాడు. రాజు మాటలు విని ఆ మహర్షి బాధపడ్డాడు.
తరువాత “మహారాజా! నేను మహర్షిని కాదు కప్పలకి నాయకుణ్ని. నా పేరు ‘ఆయువు’. నీ ప్రేయసి నా కూతురు. ఆమె చాలా మందిని మోసం చేసింది. అమెకి నువ్వొక లెక్క కాదు. నువ్వు మంచివాడివిగా కనిపిస్తున్నావు” అన్నాడు.
అతడి మాటలు విని రాజు “దయచేసి నువ్వు నా ప్రేయసిని రప్పించి నాకు అప్పగించు” అని ప్రార్థించాడు.
కప్పలనాయకుడు తలుచుకోగానే అతడి కూతురు అక్కడకి వచ్చింది. కప్పలనాయకుడు కూతురితో “నువ్వు చాలా చెడ్డదానివి. ఇంతకుముందు కూడా అనేకమంది రాజుల్ని ఇలాగే మోసం చేశావు. నీకు పుట్టే కొడుకులు మొసగాళ్లు అవుతారు” అని శపించాడు. తరువాత కప్పలనాయకుడు తన మార్గంలో తను వెళ్లిపోయాడు.
పరీక్షిత్తు మహారాజుకి ఆమె వల్ల శలుడు, నలుడు, వలుడు అనే ముగ్గురు కొడుకులు కలిగారు. వాళ్లల్లో పెద్దవాడైన శలుడికి రాజ్యభారాన్ని అప్పగించి తను తపస్సు చేసుకునేందుకు వెళ్లిపోయాడు.
శలుడు ఒకరోజు బంగారంలా వెలిగిపోతున్న రథాన్ని ఎక్కి వేటకి వెళ్లాడు. చాలా జంతువుల్ని సంహరించాడు. బాణంతో దెబ్బతిన్న ఒక జంతువు తప్పించుకుని పారిపోయింది. దాన్ని వెంబడిస్తూ రథం మీద చాలా దూరం వెళ్లాడు.
ఇంకా వేగంగా వెళ్లమని రథ సారథికి చెప్పాడు. రథసారథి తమ గుర్రాలు అంతకంటే వేగం వెళ్లవని ఆ జంతువు వేగానికి ‘వామ్య’ జాతికి చెందిన గుర్రాలు ఉండాలని చెప్పాడు. శలుడు అవి ఎక్కడ దొరుకుతాయని రథసారథిని అడిగాడు. వామ్యజాతికి చెందిన గుర్రాలు వామదేవమహర్షి దగ్గర ఉన్నాయని చెప్పాడు.
శలుడు రథసారథితో రథాన్ని వామదేవమహర్షి ఆశ్రమానికి చేర్చమన్నాడు. రథసారథి వెంటనే రథాన్ని వామదేవమహర్షి ఆశ్రమానికి తీసుకుని వెళ్లాడు. శలుడు ఆ మహర్షికి నమస్కరించి “మహర్షీ! నా చేతిలో ఒక జంతువు దెబ్బతిని పారిపోయింది. దాన్ని పట్టుకుని సంహరించాలి. అందుకు నీ గుర్రాలు కావాలి!” అని అడిగాడు.
అది విని మహర్షి “రాజా! నీ పని పూర్తయ్యాక నా గుర్రాలు నాకు తిరిగి ఇచ్చెయ్యాలి. అలా ఇస్తానంటేనే నేను వాటిని నీకు ఇస్తాను!” అని చెప్పాడు.
రాజు గుర్రాల్ని తిరిగి ఇచ్చెయ్యడానికి అంగీకరించాడు. ఆ గుర్రాల్ని రథానికి కట్టుకుని రాజు తప్పిపోయిన జంతువుని పట్టుకుని చంపి వేట పుర్తయ్యాక తన రాజధానికి వెళ్లిపోయాడు.
ఆ గుర్రాలు చాలా వేగం కలిగినవి. ఇవి రాజుల దగ్గర ఉంటేనే బాగుంటుంది. ఆ పేదబ్రాహ్మణుడికి ఎందుకు ఇవ్వడం అనుకుని వాటిని తమ నగరంలోనే ఉంచమని చెప్పాడు. శలుడు చిన్నవాడు, రాజకుమారుడు, బలవంతుడు, అహంకారం, గర్వం, దర్పం కలవాడు. గుర్రాల్ని తిరిగి ఇచ్చేయాలని అనుకోలేదు.
వామదేవుడు నెల రోజులు గడిచాక శిష్యుడు ఆత్రేయుణ్ని పిలిచి “మహారాజు శలుడు గుర్రాల్ని వెనక్కి ఇచ్చేలా కనిపించడం లేదు. నువ్వు వెళ్లి గుర్రాల్ని తీసుకుని రా!” అని చెప్పాడు.
ఆత్రేయుడు వెంటనే బయలుదేరి అయోధ్యానగరానికి వెళ్లి “మహారాజా! నన్ను వామదేవమహర్షి పంపించారు. దయచేసి ఆయన మీకిచ్చిన గుర్రాల్ని స్నేహధర్మంతో తిరిగి ఇచ్చెయ్యమని చెప్పారు” అని అడిగాడు.
ఆత్రేయుడితో శలుడు “ఆయన పంపించడం, గుర్రాల్ని తీసుకుని వెళ్లడానికి నువ్వు రావడం. చాలా బాగుంది వెళ్లవయ్యా! వెళ్లు! మేము మహారాజులం. ఇంతకంటే దురుసుగా చెప్పడం బాగుండదు. అంతరం గుర్తించకుండ నువ్వు కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మేము సహించము జాగ్రత్త!” అన్నాడు.
ఆత్రేయుడు తిరిగి వెళ్లి రాజు చెప్పిన మాటల్ని వామదేవమహర్షికి చెప్పాడు. ఆయన కోపంతో శలుడి దగ్గరికి వెళ్లి “మహారాజా! నీ పని పూర్తయింది కనుక నా గుర్రాల్ని నాకు ఇచ్చెయ్యి. దురాశతో పరుల వస్తువుల్ని ఆశించినా అవి దక్కవు. ఎరువుగా తీసుకున్నవి ఎల్లకాలం ఉంచుకోకూడదు. ఇతరుల సొమ్ము అపహరించడం పాపం. అటువంటి పాపం చేసినవాళ్లు వరుణపాశాలతో బంధించబడి నరకలోకంలో భయంకరమైన అగ్నిజ్వాలల్లో పడిపోతారు” అని అన్నాడు.
మహర్షి మాటలకి రాజు “బ్రాహ్మణులకి గుర్రాలు ఎందుకు? మంచి బలం కలిగిన రెండు ఎద్దుల్ని ఇస్తాను. ఒకవేళ అవి నీకు నచ్చకపోతే గొప్ప బలం కలిగిన కంచరగాడిదల్ని ఇస్తాను తీసుకుని వెళ్లు. గొప్ప జాతికి చెందిన గుర్రాలు నీకెందుకు?” అన్నాడు.
వామదేవ మహర్షి “రాజా! బ్రాహ్మణుల సొత్తు దొంగిలించడం మహాపాపం. పైగ వాటికి బదులు మరేదైనా ఇస్తాను అనడం హాస్యాస్పదం. ఇటువంటి న్యాయం ఎప్పుడూ లేదు” అన్నాడు.
శలుడు కోపంతో పరాక్రమవంతులైన భటుల్ని పిలిచి “ఇతణ్ని పట్టి బంధించి శూలాలతో పొడిచి చంపండి” అని ఆజ్ఞాపించాడు.
వామదేవుడి ముఖం కోపంతో భయంకరంగా మారింది. ఆ క్షణంలో అనేకమంది రాక్షసులు పుట్టి, రాజుని శూలాలతో పొడిచి చంపేశారు. వామదేవుడు వెళ్లిపోయాడు.
తరువాత శలుడి తమ్ముడు నలుడు రాజయ్యాడు. కొంతకాలం సుఖంగా రాజ్యాన్ని పాలించాడు. మహర్షి నలుణ్ని “నువ్వు ధర్మాన్ని అనుసరిస్తూ నడిచేవాడివి అయితే నా గుర్రాలు నాకు ఇయ్యి” అని అడిగాడు.
మహర్షి మాటలు విని రాజు కోపంతో తన దగ్గర ఉన్న సారథిని పిలిచి “ఈ బ్రాహ్మణుడు కండకావరంతో ఏది మంచో, ఏది చెడో తెలుసుకోలేక పోతున్నాడు. విషం పూసిన అమ్ముతోపాటు విల్లు కూడ తెచ్చిపెట్టు. ఇతడి వక్షస్థలాన్ని చీల్చేస్తాను” అన్నాడు.
ఆ మాటలకి వామదేవుడు నవ్వి “నన్ను చంపాలని నువ్వు తెప్పిస్తున్న బాణం అంతఃపురంలో ఉన్న అమాయకుడైన నీ కొడుకుని చంపగలదు” అన్నాడు.
అదే సమయంలో అస్త్రంతో ఘోరంగా చంపబడ్డ బాలుడి మృతదేహాన్ని అంతఃపురంవాళ్లు ఏడ్పులతో మోసుకుంటూ వచ్చారు. జరిగిన సంగతి కళ్లారా చూసి కూడా రాజు అక్కడున్నవాళ్లతో “అందరూ నా ప్రతిజ్ఞ వినండి. నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్న ఈ బ్రాహ్మణుణ్ని ఇప్పుడే ఇక్కడే సంహరిస్తాను. రక్తం కారుతూ అతడి దేహం నేల మీద పడుతుంది చూడండి” అని అమితమైన వేగంతో విల్లు ఎక్కుపెట్టాడు.
విల్లుతోపాటు రాజు రెండు చేతులూ స్తంభించి పోయాయి. రాజు తెల్లబోయి చూస్తూ ఉండిపోయాడు. చాలా భయపడిపోయాడు. అక్కడున్నవాళ్లతో “ప్రజలారా! నేను ఎంతో తప్పుగా మాట్లాడాను. ఇప్పుడు పశ్చాత్తాపం కలిగింది. నా ఆయుధాల బలం తగ్గింది. బ్రాహ్మణ శక్తి చాలా గొప్పది.
ఇది నిజమని అనుభవంతో తెలుసుకున్నాను. నేను ఓడిపోయాను. వామదేవమహర్షే గెలిచాడు. శత్రువుల్ని సంహరించగలిగిన, ప్రజలందరితో పూజింప తగిన వామదేవమహర్షిని నేను శరణువేడుతున్నాను” అని రాజు గర్వాన్ని వదిలిపెట్టి మహర్షికి నమస్కరించాడు.
రాజు బంధువులు, మిత్రులు కూడా మహర్షిని కాపాడమని వేడుకున్నారు. మహర్షి శాంతించి స్తంభించి పోయిన రాజు రెండు చేతులు మామూలుగా చేసి, అతడి కొడుకుని బతికించాడు.
రాజు గుర్రాల్ని తెప్పించి వామదేవుడికి ఇచ్చాడు. వామదేవమహర్షి గుర్రాల్ని తీసుకుని తన దారిన తాను వెళ్లిపోయాడు. బ్రాహ్మణుల గొప్పతనం ఇలా ఉంటుంది” అని మార్కండేయమహర్షి చెప్పాడు.
ఇంద్రద్యుమ్నుడు చరిత్ర
ధర్మరాజు మార్కండేయ మహర్షికి నమస్కరించి “పుణ్యాత్ముడా! ఈ లోకంలో మీకంటె వృద్ధుడైన పురుషుడు ఉన్నాడా?” అని అడిగాడు.
“ధర్మరాజా! పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనే గొప్ప మహారాజు ఉండేవాడు. అతడు చాలాకాలం స్వర్గలోకంలో సంతోషంగా జీవించాడు. కొంతకాలానికి అతడి కీర్తి తరిగిపోయిన తరువాత దేవతలు అతడితో “ఇంక నీ పుణ్యం తగ్గిపోయింది” అని చెప్పి అతణ్ని భూలోకానికి పంపించేశారు.
ఇంద్రద్యుమ్నుడు నేనున్న చోటికి వచ్చి “అయ్యా! అనేక పుణ్యాలు చేసిన ఇంద్రద్యుమ్నుణ్ని. నన్ను నువ్వు గుర్తుపట్టగలవా?” అని అడిగాడు.
నేను అతడితో “అయ్యా! నిన్ను నేను గుర్తించలేకపోయాను. హిమాలయ శిఖరంలో నివసించే ప్రావారకర్ణుడు అనే గుడ్లగూబ నాకంటె వయస్సులో చాలా పెద్దది. అతడికి తప్పకుండా నీ గురించి తెలిసే ఉంటుంది అక్కడికి వెళ్లు” అని చెప్పాను.
ఇంద్రద్యుమ్నుడు నన్ను కూడా తనతో రమ్మన్నాడు. నేను అతడితో “అయ్యా! ముసలితనంతో శక్తి కలగడానికి మాత్ర వేసుకున్నాను. దేహతాపం వల్ల రాలేకపొతున్నాను” అన్నాను.
ఇంద్రద్యుమ్నుడు గుర్రం రూపం ధరించి నన్ను తన వీపు మీద ఎక్కించుకుని గుడ్లగూబ దగ్గరికి వెళ్లి నన్ను అడిగినట్లే అడిగాడు. ఆ గుడ్లగూబ కొంతసేపు ఆలోచించి “నాకు నువ్వు ఎవరో గుర్తు రాలేదు. ‘ఇంద్రద్యుమ్నం’ అనే పేరు గల సరోవరం ఉన్నట్లు నాకు తెలుసు. ఆ సరోవరంలో ’నాళీకజంఘుడు’ అనే పేరుగల గొప్ప కొంగ ఉంది. ఆ కొంగ వయస్సులో నాకంటె చాలా పెద్దది. దానికి నీ గురించి తెలియవచ్చు, అక్కడికి వెళ్లు” అని చెప్పింది.
ఇంద్రద్యుమ్నుడు గుడ్లగూబని, నన్ను కూడా వీపు మీద ఎక్కించుకుని కొంగ దగ్గరికి వెళ్లి మమ్మల్ని అడిగినట్టే అడిగాడు. ఆ కొంగ ఇంద్రద్యుమ్నుడు తనకు తెలియదని ఆ కొలనులో ఒక తాబేలు ఉందని అది వయస్సులో తనకంటే చాలా పెద్దదని దానికి తెలియవచ్చని చెప్పింది.
కొంగ తాబేలుని గట్టిగా పిలిచి “మా కొక సందేహం ఉంది తీర్చడానికి బయటికి రా!” అనిపిలిచింది.
తాబేలు బయటికి వచ్చింది. “ఇంద్రద్యుమ్న మహారాజు నీకు తెలుసా?” అని కొంగ అడిగింది.
తాబేలు కొంతసేపు ఆలోచించి కన్నీరు కారుస్తూ గొంతు బొంగురుపోతుండగా “అయ్యో! ఇంద్రద్యుమ్న మహారాజుని నేను మర్చిపోవడమా? అతడు గొప్ప గుణాలు కలిగిన మహాత్ముడు. నన్ను అనేకసార్లు ఆపదల నుంచి రక్షించాడు. ప్రజల్లో గొప్పవాడైన అతణ్ని నేను ఎల్లప్పుడూ కృతజ్ఞతతో స్మరించుకోవాల్సిన అవసరం ఉంది.
మహానుభావుడైన ఆ ఇంద్రద్యుమ్న మహారాజు అనేక యజ్ఞాలు చేసి అనేక గోవుల్ని దక్షిణగా బ్రాహ్మణులకి దానం చేశాడు. ఆ మహాత్ముడు దానం చేసిన ఆవుల గిట్టల రాపిడితోనే ప్రజలతో కీర్తించబడుతున్న ఈ మడుగు ఏర్పడింది” అని తాబేలు చెప్పింది.
వెంటనే దేవతలు విమానాన్ని తీసుకుని వచ్చి “మహాత్మా! నీ కీర్తి లోకంలో ఎప్పుడూ ఉంటుంది. నీకు శాశ్వత స్వర్గసౌఖ్యం దొరుకుతుంది. దయచేసి ఈ విమానం ఎక్కి స్వర్గలోకానికి రండి. పాపం లేనివాడా! ఈ లోకంలో తన కీర్తి ఎంతకాలం వినబడుతుందో అంతకాలం మనిషి స్వర్గసౌఖ్యాలు అనుభవిస్తాడు” అని చెప్పారు.
వాళ్ల మాటలు విని ఇంద్రద్యుమ్నుడు దేవదూతలతో “నా పని మీద వృద్ధులైన మహర్షిని, గుడ్లగూబని, కొంగని ఇక్కడికి తీసుకుని వచ్చాను. వాళ్లని వాళ్ల ప్రదేశాల్లో విడిచిపెట్టి వస్తాను కొంచెం సేపు ఆగండి” అని చెప్పాడు.
తరువాత వాళ్లని వాళ్ల స్థానాల్లో విడిచిపెట్టి దేవతల విమానం ఎక్కి స్వర్గలోకానికి వెళ్లిపోయాడు” అని చెప్పాడు.
కుంతీదేవి కొడుకు ధర్మరాజు ఆ కథ విని చాలా సంతోషపడ్డాడు. మార్కండేయమహర్షితో “మహర్షీ! నీ కంటే కూడ వయస్సులో పెద్దవాళ్ల గురించి చెప్పావు. ఇది చాలా ఆశ్చర్యం కలిగిస్తున్న విషయం” అని మహర్షికి భక్తితో నమస్కరించాడు.