Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాప్రవాహం!-32

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[యల్లసామి దగ్గర ముప్పై రూపాయలు తీసుకుని కిరాణా శాపులో కొద్దిగా బియ్యం, కందిపప్పు, ఉల్లిగడ్డలు, పావు లీటరు నూనె కొంటాడు దావీదు. దారిలో కొన్ని కూరగాయలు కొనుక్కుని ఇల్లు చేరతాడు. జొన్న రొట్టెలు తిని కాసేపు నిద్రపోయి లేస్తాడు. మటిక్కాయలు పీసులు దీసి, చిన్న తుంటలుగా వలిచిపెడతాడు. మార్తామ్మ కూలీ పని నుంచి వచ్చి, కూలీ డబ్బులు మొగునికిస్తుంది. ఆమె కాలుసేతులు కడుక్కుని వచ్చాక, కిరాణా సామాను, కూరగాయాలు తెచ్చానని చెప్తాడు. పనులు దొరకటం లేదని దావీదు బాధపడితే, మార్తమ్మ ధైర్యం చెబుతుంది. రాత్రి భోం చేసి నిద్రపోతారు. నాలుగురోజుల తర్వాత కూతురు మేరీ ఉత్తరం రాస్తుంది. పోస్టుమ్యాన్‍తో చదివించుకుంటారా ఉత్తరాన్ని. డిగ్రీ పరీక్షలు పూర్తయ్యాయనీ, బాగా రాశానని, బి.యిడి కోసం కర్నూలులో ట్రైయినింగ్ సెంటర్‍లో చేరదలచానని, తన దగ్గర ఉన్న డబ్బుకి అదనంగా రెండు వందలు కావల్సి వస్తుందని, ఆ డబ్బుకి ఏర్పాటు చేయమని రాస్తుంది. పోస్టుమ్యాన్ వెళ్ళాకా, తమ ఇంట్లో ముంతలో ఎంత డబ్బుందో చూస్తారు. మూడు రోజుల కూలీ డబ్బులు కలిపితే కూతురు అడిగిన రెండు వందలు వస్తాయని అనుకుంటారు. రెండు రోజుల తర్వాత మేరీ వస్తుంది. అన్ని వివరాలు చెప్తుంది. మర్నాడు కర్నూలు వెళ్ళాలి. ఆ రాత్రి తల్లిదండ్రుల మధ్యలో పడుకుని కర్నూలులో చేసుకోవాల్సిన ఏర్పాట్లు, అక్కడి కోచింగ్ సెంటర్ వివరాలు చెబుతుంది. మర్నాడు తండ్రిని తీసుకుని కోచింగ్ సెంటర్‍కు వెళ్తుంది. అప్లికేషన్ నింపి ఇచ్చాక, ఫీజు కాస్త తగ్గించమని అడుగుతాడు దావీదు. ప్రిన్సిపాల్ శ్రీపాద రావు ఫీజు తగ్గించి, కర్నూలులో మేరీ – చంద్రకళ అనే మరో అమ్మాయి గదిలో రూమ్‍మేట్‍గా ఉండేలా ఏర్పాటు చేస్తారు. మేరీ కష్టపడి చదువుతుంది. బి.యిడి పరీక్ష పూర్తి చేసి, రూమ్ ఖాళీ చేసి ఇంటికొచ్చేస్తుంది. కొన్ని రోజులకి రిజల్ట్స్ వస్తాయి. మేరీ బి.యిడి సీటు సాధిస్తుంది. చంద్రకళకు రాలేదు. కౌన్సిలింగ్‍లో తిరుపతిలోని కాలేజీలో సీటు వస్తుంది మేరీకి. శ్రీపాద రావు అక్కడ తనకు తెలిసిన వ్యాసమూర్తి అనే లెక్చరర్‍ ఉన్నాడని, సాయం చేయమని చెప్తానని చెప్తాడు. మేరీ వెళ్ళి కాలేజీలో జాయినై, వ్యాసమూర్తిగారిని కలుస్తుంది. ఆయన ఓ ట్యుటోరియల్‍లో రోజు సాయంత్రం మూడు క్లాసులు చెప్తే, నెలకు రెండు వందలు వచ్చే ఏర్పాటు చేస్తారు. మేరీ మనసు కుదుటపడుతుంది. ఇక చదవండి.]

బిడ్డ, అల్లుడు, కొడుకు పండగ బోయిన మర్సనాడే ఎల్లిపోయినారు. ఇల్లంతా బోసిపోయి నట్లయినాది. కుమ్ములో మిగిలిన గెలలు మగ్గితే పనలిడిపించి రెండు రోజులు నాగలాపురం సంతలో అమ్ముకున్నాడు ఖాజా హుసేను.

సైకిలెక్కి పుల్లగుమ్మి కాశినాయన తోటకు బోయినాడు, సరుకేమైనా దొరుకుతాదేమోనని. కాశినాయన పుల్లగుమ్మిలో పెద్ద రైతు. కులానికి గొల్లల్లయినా, జీవాలు సాకడం మానేసి సేద్దెంలో దిగినాడు. ఆ యప్పకు మూడెకరాల అరటితోట ఉండాది. రెండెకరాల్లో కూరగాయలు పండిస్తాడు. పుల్లగుమ్మిని ఆనుకోని పెద్ద చెరువుండింది. దాని కింద శానా ఎకరాలు సాగవుతాయి.

అరటి తోట సుట్టూ అవిశె చెట్లు పెంచినాడు కాశినాయిన. కాశినాయన రాయలసీమలో, ముక్యంగ కర్నూలు జిల్లాలో, సిద్ధిపొంది సమాది ఐన గొప్ప యోగి. ఇప్పటికీ కాశినాయన ఆశ్రమములో రోజూ నూరుమందికి తగ్గకుండా అన్నదానము చేస్తారు. కర్నూలు కడపజిల్లా లలో కాశినాయన భక్తులు శానామంది ఉంటారు. ఆ సామి పేరే ఇది. కాశమ్మ, కాశయ్య, కాశిరెడ్డి, కాశినాయిన ఇట్లా పిల్లలకు పేర్లు పెట్టుకుంటారు.

అవిశె చెట్లు నిలువుగా ఎత్తుగా పెరుగుతాయి. అరటి తోట పెనుగాలులకు కూలిపోకుండా నిలవరిస్తాయి. అవిశాకు కూర, పప్పు చేసుకుంటారు. అవిశె పూలు అరించీ ఎడల్పున మూడించీల పొడగున తెల్లగా ఉంటాయి. శెట్ల కింద పూలు రాలి ఉన్నాయి. అవిశె పూలతో కొందరు బజ్జీలు కూడ చేస్తారు. ఫాతింబీకి ఇస్టమని కొన్నిమంచివి, వాడు పట్టనివి ఏరుకొని చేతిసంచిలో ఏసుకున్నాడు ఖాజా.

తోటకు అనుకోని పెద్ద కొట్టముండాది. దింపిన గెలలను దాంట్లో పెట్టుకొంటారు. కొట్టం కాడికి పోయినాడు ఖాజా. కొట్టం ముందు నులకమంచం మింద కూసొని ఉండాడు కాశినాయన. కావిరంగు అడ్డపంచె కట్టుకోని, కద్దరు అంగీ ఏసుకొన్నాడు. ముకాన బొట్టుపెట్టుకున్నాడు. గడ్డము కొంచెము పెంచుకోని, ఒత్తుగా పెరిగిన మోసాలను గడ్డంలో కలిపేసినాడు. చేతికి రాగి కడియమున్నది. మెల్లో పగడాల దండ. బంగారుతీగ సుట్టించింది మెరుస్తోంది. వక్కాకు నముల్తున్నాడు.

జీతగాండ్లు అంటిగెలలు దింపి కొట్టంలోని బెడుతున్నారు. అది జూసి ఖాజా ముకం యిచ్చుకుంది. పోయి కాశినాయనకు నమస్కారం పెట్టినాడు.

“ఏంది సాయిబూ, బాగుండావా?” అన్నాడు ఆ యప్ప నోట్లో వక్కాకు రసం మింగి.

“అంతా బాగుండాము నాయినా అన్నాడు. “కొంచెము సరుకిప్పిస్తావేమోనని నీ కాడికొస్తి”

“ఓరినీ, నీకు తెలియదా ఖాజా, ‘తోటలోల్లందరూ కలిసి ఒకేసారి గెలలు దింపిస్తే, లారీ పంపిస్తా, ట్రాన్స్‌పోర్టు కర్చులు గుడ్క నావే, పదిరోజులకొక సారి, దింపే ముందు నాకు పోను చెయ్యండి’ అని కర్నూలు అన్వర్ మియ్య మాతో ఒప్పందం జేసుకున్నాడు. ఆ యప్ప మండీ ఎంత పెద్దదంటే, నాందేడ్ నుంచి గుడ్క లారీతో గెలలు తెప్పిస్తాడు. మీ మాదిరి ఎత్తండం యాపారస్తుల కంటే మాకు ఇదే మేలనిపిచ్చి సరే అంటిమి. ఇయ్యాల లారీ వస్తాది. ఏమనుకోబాకు సాయిబూ, నీకు సరుకియ్యలేను” అన్నాడు.

అనుకున్నంతా అయ్యిందని కుంగిపోయినాడు ఖాజా. “మరి మా మాదిరి గరీబోల్ల గతి?” అన్నాడు దీనంగా.

రెండు చేతులెత్తి ఆకాశం సూపించినాడు కాశినాయన. ఇంతలో పెద్దది లారీ వచ్చి కొట్టం ముందు నిలబడినాది. డ్రైవరు క్లీనరు దిగి వచ్చి కాశినాయనకు నమస్కారం బెట్నారు. “మాల్ రడీ అయినాదా సాబ్?” అని అడిగినారు. “ఇప్పుడే దింపి పెట్టినాము, లోడింగ్ చేయిద్దునా అయితే?” అని జీతగాండ్లను గెలలెత్తమని అరిశినాడు. “కలుగొట్లలో రంగారెడ్డితోట సరుకు ఎత్తుకోని వచ్చినాము. ఉండండి, అట్టలు అడ్డం బెట్టి వస్తాము. మీ సరుకు యాదో ఆడ మీరే చూసుకోవాల.  ఆసామికి  ఆసామికీ సరుకు కలిసిపోకుండా ఈ అట్టలు! మల్లా రామల్లకోటలో రెండు తోటల కాడ, బ్రమ్మగుండం ఇవతల ఒక తోట కాడ సరుకెక్కుతాది.”

“మండీ కాడ దింపేటప్పడు మా జీతగాడుంటాడు. మీతోనే పంపిస్తాను” అన్నాడు కాశినాయన.

“కాశినాయినా, నా రెండు గెలలన్నాయిప్పించు. మల్లా రాను. సైకిలుకు కట్టుకోని పోతా” అన్నాడు ఖాజా.

“లేదు లేప్పా, ఇయ్యనీకి కుదరదు. నీవు పోయిరా” అన్నాడు కాశినాయన. చేసేదేమీలేక ఎనిక్కి తిరిగినాడు ఖాజా. దావలో రామల్లకోటలో ఒక తోట కాడ ఇశారిస్తే, ఇదే మాట – ‘లారీ వస్తోంది. మీకియ్యనీకె కుదరదు!’ అని.

ఖాజా యిల్లు చేరేసరికి పైటాలయింది. పొద్దున ఇంత బన్సీ రవ్వ ఉప్పమ తిని బోయినాడు. దిగాలుతో ముకం పీక్కబోయింది.

ఫాతింబీ మొగున్ని జూస్తానే గ్రయించినాది, అన్వర్ మియ్యా మండీ శిల్లర యాపారస్తుల పొట్ట కొట్టడం శురూ ఆయినాదని.

గలాసుతో మంచి నీల్లు తెచ్చిచ్చినాది. శీర కొంగుతో ముకం తుడిసినాది. “అంతగా పరేశాన్ గానీకె ఏముండాది? మొదుట్నుంచి అనుకుంటున్నదేగదా. నీవేం ఎదారు బడగాకు. అల్లుడు చెప్పినట్లు గద్దువాలకు బోదాము. ఈ యిల్లు అమ్మేసి, వచ్చిన దుడ్డు దగ్గర బెట్టుకుంటే, ఆడ పండ్ల యాపారానికి, కుదురుకునే వరకు కర్చులకు ఉంటాది. ఏదయినా మన మంచికే అనుకుంటేపాయ.. లెయ్యి, కాలుసేతులు కడుక్కోని రా! బువ్వ తిందాము!”

ఫాతింబీ మాటలతో కొంచెం ధైర్యం వచ్చినాది ఖాజాకు. “అంతేనంటావా మల్ల!” అన్నాడు ఆ యమ్మ చేయి పట్టుకోని. ఆ యమ్మ నవ్వినాది. “ల్యాకపోతే! ఖాదర్ చెప్పనే చెప్పె. జహంగీర్ గుడ్క సరే అనె. వాని చదువు గుడ్క వచ్చే నెల ఐపోతోంది. అప్రెంటిసు చేసుకోనివాడు గుడ్క గద్దువాలకు వస్తాడు. కస్టపడేటోల్లము, బతకలేక పోతామా ఏంది?”

వరన్నము, బుడంకాయ పప్పు, గోగాకు ఊరిమిండి చేసినాది. మొగునికి కుశాల మాటలు చెప్పి నవ్విస్తూ తినిపించినాది. మొగోడు పరిస్తితులకు కుంగిపోయినప్పుడు ఇంట్లో యిల్లాలే గద దైర్యం చెప్పేది? ఎనకుండిముందుకు నడిపించేది.

కడుపు నిండా తిని కంటి నిండా నిద్రబోయినాడు ఖాజా. లేచి, చాయ్ దాగినాడు. ఫాతింబీతో అన్నాడు “రేపు గద్వాలకు బోయె అల్లునితో జెప్పాల గద! నీవూ వస్తే బాగుంటాది!”

“నేనెందుకబ్బా, నీవు బోయి రా సాలు!”

“బీబీ ల్యాకపోతే మియాకు దిమాక్ పనిచెయ్యదు. పోదాము పా”

తన మింద మొగునికి ఉన్న బరోసా జూసి ఫాతింబీ ముకం ఇచ్చుకున్నాది. “సరే, పోదాం పా”, అని నవ్వినాది.

మర్సటి రోజు పొద్దన్నే పోయి, అయివే కాడ ఓటల్లో తలా నాలుగిడ్లీలు దిని బస్సెక్కి కర్నూలులో దిగినారు ఆలుమొగుడు. అల్లుడు సోడా అంగడి నడిపేది గద్వాల చౌరస్తాలోనే. ఆడ్నించి గద్వాల పన్నెండు మైల్లకు పైనుంటాది. వాండ్లది మానపాడైతే, ఖాదర్ వాండ్ల నాయిన బతకనీకె గద్వాల జేరినాడు. ఆ యప్ప అల్లం యాపారం జేసెటోడు. కాలం తీరి సచ్చిపోయినాడు. ఖాదర్ వాండ్లమ్మ వాని సిన్నప్పుడే సచ్చిపోయింది. వాండ్లు గీన ఉండింటే ఖాదర్ మియా ఇంత దైర్నంగ అత్తను మామనూ పిల్సిటోడు గాదేమో.

గద్వాల చౌరస్తా అయివే మింద ఉంటాంది. ఆడ ఊరు కూడా ఉంటాది. దానిని ‘ఎర్రవల్లి’ అంటారు. అయివే నుంచి ఎడం పక్కకు గద్వాల రోడ్డు బోతుంది. అదే రోడ్లు అయివే మీదుగా రాయిచూరుకు కూడ బోతాది, రాయిచూరు కన్నడ దేశములో ఉంటాది గాని ఆంద్రా బోర్డరు. కర్నూలు నించి గద్వాలకు, రాయచూరుకు బస్సులు శానా తిరగతాయి.

వీండ్లు చౌరస్తాలో దిగేతలికి పదిన్నరయినాది. అయివే రోడ్డు మిందే అల్లుని సోడాలంగడి. ‘బిస్మిల్లా కూల్ డ్రింక్స్’ అని శాపుకు పేరు పెట్టుకున్నాడు. సోడాలంగడి అంటే సోడాలే కాకుండా, నిమ్మకాయ సోడా, షర్బతు, నన్నారి సోడా, సుగంద సోడా, జాజిర్ సోడా, లస్సీ ఇట్టా శానా రకాలు అమ్ముతాడు ఖాదర్ మియా. గోల్డ్ స్పాటు, కిస్మత్ ఇట్లాంటి కూల్ డ్రింకులు గుడ్క దొరకుతాయి. గద్వాల నించే ఐసు దిమ్మలు కొనుక్కోని తెచ్చుకుంటాడు. అవి బెరీన కరిగిపోకుండా గోనె సంచులు తడిపి దాన్లోన ఉంచుతాడు దిమ్మలను. కూల్ డ్రింకులు సల్లగా ఉండనీకె ఒక గోలెంలో నీల్లు బోసి దాంట్లో ఏస్తాడు. పక్కన నీల్లటెంకాయలు కూడ పెద్ద కుప్పబోసి ఉంటాయి.

షాపు అంటే అది పెద్ద శెక్క బంకు. పనిచెయ్యనీకె ఒక పొట్టిగాడు ఉండాడు. వాని పేరు చలం. వానిది జడ్‍చర్ల కాడ బూత్‍పూరు.

బస్సు దిగి వస్తున్న అత్తను మామను చూసి శానా సంతోశించినాడు ఖాదర్ మియా. ఇదర్నీ బంకు ముందల శక్కబెంచీ మింద కూసోబెట్టినాడు. సల్లగ నిమ్మకాయ సోడా కలిపి యిచ్చినాడు. వాండ్లు తాగి నిమ్మలపడినంక అడిగినాడు. “ఏంది మామా మియా? ఉన్నట్లుంది బిడ్డ మింద గాలి మల్లెనా ఏంది? ఈ మధ్యనే గదా పండక్కు వచ్చిపోతిమి. మేరా సాలా జహంగర్ బాగున్నాడా? వాని సదువు అయిపోవచ్చింది గద!”

“అంతా బాగుండాము బేటా! మనమనుకున్నట్టే తోటలోండ్లు మనకు మాల్ యియ్యడం బంద్ చేసిరి. డైరెక్టుగా కర్నూలు అన్వర్ మియా మండీకి లారీ దోలబట్నారు.”

“అన్వర్ మియా కర్నూల్లో శానా బడే ఆద్మీ. వాండ్ల తమ్ముడు ఉస్మాన్ మునిసిపల్ వైసుచైర్మన్. వాండ్ల మండీ ఎంత పెద్దదంటే, పెద్ద మార్కెట్ కాడ, లారీ డైరెట్టు లోపలికి బోయి అన్లోడింగు చేస్తాది. అరటి గెలలే కాదు, మోసంబీ, నింబు, సేపు, అంగూర్ అన్నీ ఆ యప్ప మండీకి వస్తాయి. వచ్చే కమీసనే రోజానా వేలల్లో ఉంటాదంటారు. ఇంక అరటి పండ్ల యాపారం, సైకిలు తొక్కేది, సంత లెంబడి తిరిగేది భూల్ జావ్ మామూ! మనం మొన్న అనుకున్నట్లు గద్వాలలో పండ్లంగడి పెట్టిస్త నీతోని. మధ్యాన్నం భోజనానికి బోదాము. కుంచీపు కూసోండి” అని యాపారం మింద దృష్టి పెట్టినాడు. మెయిన్ రోడ్డు కాబట్టి బ్యారాలు బాగానే ఉండాయి. పొట్టెగాన్ని పంపించి పక్కన ఓటల్లో పుగ్యాలు (మెత్త పకోడీ) తెప్పించినాడు అత్తకు మామకు.

ఒంటి గంటకు షాపు పొట్టెగాని కప్పజెప్పి ముగ్గురూ గద్వాల బస్సెక్కినారు. అర్ధగంట లోపే దిగినారు. గద్వాల శానా పెద్ద టౌను. అయివే మింద లేదుగాని, కాచిగూడ బెంగుళూరు రైల్వే లైన్లో ఉంటాది. పెద్ద టేసనే. అది ఒకప్పుడు రాజుల సంస్థానము. శితిలమైపోతున్న పెద్ద కోట గూడ్క ఉండాది. దాని బురుజుల్లో పిచ్చి చెట్టు మొలిసినాయి.

ఖాదర్ వాండ్లిల్లు బస్టాండు దగ్గరే. వాండ్ల నాయిన కాలంలో అదంతా పోరంబోకుగా ఉంటే రెండు సెంట్లు జాగా కొనుక్కోని, నాలుగడుగులు గోడలు లేపి పై కప్పు రేకులతో ఏసుకొన్నారు. దాన్నే ఇంకొంచెం బాగు చేసుకున్నాడు అల్లుడు. ఇంటి ముందే మున్సిపాలిటీ బోరింగు, కొంచం దూరంలో మంచి నీల్ల కొలాయి. ముందు చిన్న అరుగున్నాది. మొత్తం ఇల్లంతా ఏకాండంగా ఉంటే దాన్ని తడికెలతో బాగాలు చేసుకొన్నారు. తడికెలకు పేపర్ల కరిపించినారు. మొగుడు పెండ్లాము పండుకోనీకె ఒక బాగము. దాంట్లో చాందిని మంచము ఏసుకున్నారు. ఇంటి మద్యలో ఒక ఫ్యాను, రాడ్‌తో కిందికి వేలాడదీసినారు. ల్యాకపోతే గాలి తగలదని పండుకొనే సోట గుడ్క శిన్న రెక్కల ప్యానుంది. ఒక బాగములో వంట చేసుకుంటారు. ఒక యినప టేబులు మింద ఒక కిరసిన్ స్టవ్వు, ఒక బొగ్గులపొయ్యి పెట్టుకున్నారు. వంటింటి డబ్బాలన్నీ ఒక్కచెక్క శెల్పుతో సర్దుకున్నారు.

ఇంటెనక చిన్న స్థలముండాది. దానికి దడి కట్టినారు. ఒకేపు తానాలు చెయ్యనీకె రేకుల శెడ్డు. ఒక మూలన కక్కుసు దొడ్డి.

అమ్మను నాయినను జూసి హసీనా ఉచ్చితబ్బిబయినాది. “యా అల్లా! కైసా ఆనాహఆ అమ్మీ, బినా ఖబర్!” అని అరిచినాది. “అబ్బా, ఆప్ కైసే హో!” అని తండ్రిని తల్లిని రెండు చేతులతో కర్చుకొన్నాది.

“ప్యార్ చూపించింది సాలు గాని, ఖానా బనావ్ జల్దీ!” అన్నాడు ఖాదర్ నవ్వుతూ. “మన కోసరం పాలక్ దాల్ చేసినా. అది సరిపోదు అన్నం గుడ్క వండాల” అన్నది కూతురు ఆందోళన పడుతూ.

“ఇప్పుడేం చేస్తావు గాని, పాండి, అందరం ఇయ్యాల ఓటల్లో తిందాం. అత్తకు మామకు అల్లుడు దావత్ ఇస్తాడు” అని అన్నాడు ఖాదర్.

“దస్ మినిట్ల రడీ ఐత” అని పడకటింట్లోకి లగెత్తింది హసీనా. అందరూ మెయిన్ రోడ్డు మిందున్న సికిందర్ మిలిటరీ హోటలుకు బోయినారు. చపాతీ, కోడిగుడ్డు కుర్మా చెప్పినాడు అల్లుడు. అది తింటుండగానే శికిను బిర్యానీ రెండు గిన్నెలు ఆర్డరిచ్చినాడు. ఒక్కో గిన్నె ఇద్దురికి మస్తుగయితాది.

“ఖానా బహుత్ అచ్ఛా హై” అన్నాడు ఖాజా హుసేను.

నలుగురికీ ఎనబై రూపాయల చిల్లయినాది. “ఇంత కర్పు ఏమైన అగత్యమా!” అని ఫాతింబీ గొనిగినాది.

“దినాము తింటామా అమ్మీ, ఏదో మీరు వచ్చినారు గదాని..” అనింది హసీనా. ఎదురుగ్గ వైను శాపులో మామకు ఒక క్వాటరు బ్రాంది కొనిచ్చినాడు అల్లుడు. ఇంటికి బోయినంక “అయిగ రెస్టు తీసుకోండి. నేను శాపు జూసుకోని రాత్రి వస్త” అని ఎల్లిపోయినాడు.

కూతురి సంసారము చూసి కడుపు నిండిపోయినాది ఖాజామియ్యాకు, ఫాతింబీకి. ఖాజా ఒక పెగ్గు బ్రాందిలా నీళ్లు కలుపుకొని తాగి పడసాలలో బొంత పరుచుకోని పడుకోని నిద్రబోయినాడు.

రాత్రి ఖాదర్ వచ్చేతలికి ఎనిమిది అయ్యింది. భోజనాలయిన తర్వాత అందరూ కూర్చుని మాట్లాడబట్నారు.

“మామూ! రేపు సాయంత్రము బెరీన వస్తా. బస్టాండు, పూల బజారు, స్టేషన్ రోడ్డు ఇయన్నీ తిరుగుదాము. మళిగె బాడిగలు మనకు అందుబాటులో ఉంటే గీన తీసుకుందాము. మళిగెలు దొరకడము శానా కష్టము. నేను మొన్న వచ్చినపుడు చెప్పినాను చూడు, అట్లా ఏర్పాటు చేసుకున్నా బాగుంటాది, కనీసం కొంచెం పెద్దది చెక్క బంకు దొరికినా శాను” అన్నాడు ఖాదర్.

మర్సటి దినం మామా అల్లుడు బజార్లోన ఇశారించుకుంటు తిరగబట్నారు. ఖాదర్ వాండ్ల చిన్నాయన మస్తాన్ పెద్ద మార్కెట్టు కివతల కటికంగడి నడుపుతాన్నాడు. ఆ యప్ప దగ్గరకు బోయి ఇసయము అంతా చెప్పినారు.

“ఈ మద్యన స్టేషను రోడ్లులోనే ఒక బంకు కాళీ అయినాదని ఇన్నాను. పోదాం పాండి. అడగదాము” అన్నాడా యప్ప. ముగ్గురు పోయి అడిగితే దాన్ని మొన్ననే సైకిలు శాపుకని ఎవురో తీసుకున్నారని చెప్పినారు.. నాలుగు రోజులు తిరిగినా ఏదీ దొరకల్యా.

ఒక దినము పూల బజారు కాడ పోతాన్నారు. అది శానా పెద్ద సెంటరు. పూలంగల్లు, టెంకాయలు, తమలపాకులు పండ్లు అమ్మేవి శానా ఉన్నాయి. కానీ యావీ మలిగెలలో, బంకులలో లేవు. సైడు కాలవ మింద ఐదడుగుల ఎత్తున మంచెల మాదిరి చేసుకోని, వాటి మింద సరుకులు పెట్టుకోని అమ్ముతాన్నారు. ఆడ సందులో ఒక దేవళం ఉన్నాది. మైసమ్మ తల్లిది. ఆ యమ్మ శానా మగిమ గలిగిన దేవతని పేరు. ముక్యముగా మంగళవారము, శుక్రవారము శానామంది ఆ దేవలానికొస్తారు. సెంటరుకు కొంచెం దూరములో రెండు సినిమాహాల్లున్నాయి ఒకటి ‘రహమతీయ’, ఇంకోటి ‘గెలాక్సి’.

స్టేషను నుంచి వచ్చేటోల్లు, బస్టాండు నుంచి వచ్చేటోల్లు ఊర్ల యా పక్కకు బోవాలన్నా పూల బజారు సెంటరు తగుల్తాది. వీండ్లకు ఒక మంచె కాలీగా కనపడినాది. ఒక వైపు పూలంగడి ఉంది. ఇంకో పక్క టెంకాయలంగడి.

నాలుగు పక్కలా తాటిదూలాలు పాతుకోని, వాటి మింద మందంగ చెక్కలు కొట్టించినారు. చిన్నదే గాని, ఏడెనిమిది గంపలు ఆయిగ పడతాయి.

టెంకాయలంగడి ఆయన ఖాదర్‍ను గుర్తుపట్టినాడు.

“ఒరే, నీవు దస్తుమియ కొడుకువు గదా! శానా పెద్దోని వైనావు!” అన్నాడు. ఆ యప్ప పేరు శివరాముడు. ఖాదర్ వాండ్ల నాయినకు దోస్తుడంట.

“కాకా, ఈ స్తలం ఎవురిది? కాలీగున్నాదే! ఈన మా మామూ! ఖాజా హుసేను. పండ్ల యాపారం చెయ్యనీకె మనూరికి వచ్చినాడు. మనకేమన్న ఇస్తారా?”

“సిన్నోడా, ఇయన్నీ సొంతానివేం గాదు. మున్సిపాలిటీలో పర్మిశను దెచ్చుకోవాల. పోలీసోల్లకు గూడ చెప్పాల. ఈదిలో జేసే యాపారాలివి. సామాన్యంగ దొరకవు. మొన్న ఈడ పూలంగడి పెట్టుకొన్నాడు సచ్చిపోయినాడు. వానికి పిల్లలు లేరు. వాని పెండ్లాన్ని ఆ యమ్మ తమ్ముడు వాండ్లూరికి తీస్కపోయినాడంట.

మీరు బెరీన మున్సిపల్ ఆఫీసుకు బోయి అక్కడ యాదగిరి అని ఒకడుంటాడు. వాన్ని బట్టుకుంటే మన పని అయితాది.”

మున్సిపల్ ఆపీసులో శానా జనం ఉండారు. యాదగిరిని కలిసినారు.

“పూల బజారులో అంగడి కోసరమా! ఇంకా ఎవ్వరికీ ఇయ్యలేదు. నా ఎంబడి రాండి” అని ఆఫీసులో ఒకాయన దగ్గరకు తీస్కపోయినాడు. ఆయన ఆపీసరంట. పేరు జోగయ్య. యాదగిరి వీండ్లను జూపిచ్చి, ఇసయం చెబితీ

“అది మునిసిపాలిటీ స్తలము. ఖాళీ అయినంక యాలం పాట పెడ్తాము. ఎవురెక్కువ పాడుకుంటే వాల్లకొస్తాది. ప్రతి సంవత్సరము రెన్యూ జేయించుకుంటుండాల. టాక్సు గట్టాల. యాలానికి నోటీసు ఇచ్చినంక కనపడమను” అన్నాడు.

యాదగిరి ఆ యప్ప పక్కకుబోయి సెవిలో ఏదో సెప్పినాడు. “సరే రాత్రి ఇంటి కాడికి రాండి. మాట్లాడదాము” అన్నాడు.

యాదగిరిని తీసుకోని జోగయ్య సారు యింటికి బోయినారు. ఆ యప్ప ఇల్లు ద్వారకానగర్‌లో ఉంది. శానా బాగ కట్టుకున్నాడు. ముందల వరండాలో కుర్చీలు వేసి ఉన్నాయి. లుంగీ బనియన్మింద ఉన్నాడు జోగయ్య.

“మీరు పోయింతర్వాత కమీషనరు గారితో మాట్లాడినాను. ఇట్లాంటివి నా దగ్గర కెందుకయ్యా తెస్తారని అరిసినాడు. ‘పాపం బీద ముస్లిములు సార్! మనం సాయం చేస్తే మీ పేరు చెప్పకోని బతుకుతారు’ అని రిక్వెస్టు చేసినా. మెత్తబడినాడు లేండి. ఇప్పుడేందంటే పాత తారీకు తోని ఒక వేలం నోటిసు తయారు జెయ్యాల. ఆ శాపు లీజుకని వేలం వేసినట్లు, ఈ ఖాజా హుసేను పాడుకున్నట్లు పైలు తయారు చెయ్యాల. ల్యాకపోతే యాలం ఎయ్యకుండా ఎట్లిచ్చినారని కొట్లాట కొస్తారు.”

ఖాదర్‌కు అంతా సమజైంది గాని, మామూకు కాల్యా! ఆ యప్పకు ఇవన్నీ తెలియదు.

ఖాదర్ అన్నాడు జోగయ్యతో – “సార్, సబ్ కుఛ్ మీరే జూసుకోవాల. ఎంతయితాదో చెప్పండి. గరీబోల్లము. మీరే దయ చూపాల.”

“నా ఒక్కనితోని కాదు కదరా భై! శానా కత నడపాల!” అని

“ఐదువేలయితాది! మున్సిపాలిటీ ఆ స్తలాన్ని మీకు లీజుకిచ్చిందని, సంవత్సరం సంవత్సరము రెన్యూ చేయించుకోవాలని, మున్సిపల్ టాక్సు కట్టాలని, కమీషనర్ సంతకంతో మీకు కాయితం ఇస్తా!” అన్నాడు జోగయ్య.

“పోలీసోల్లతో..”

“వాండ్లతో ఏం పని లేదు. ట్రాపిక్‍కి అడ్డమనీ, రోడ్డు మింద పెట్టుకున్నారనీ, అప్పుడపుడు వచ్చి ఐదో పదో గుంజకపోతాంటారు – అంతే! మరీ కక్కుర్తి నా కొడుకయితే నాలుగు పండ్లు తీసుకోని బోతాడు. అంతే.”

“నెలకు బాడిగ ఎంతుంటాది సార్?”

“అది తక్కువే. నెలకు నూరో నూటిరవయ్యో, అంత కంటే ఎక్కువుండదు.”

యాదగిరి అన్నాడు – “ముందు మంచె ఏసుకున్నాడు వచ్చి అడిగితే దానికయిన ఖర్చు ఇస్తే సరి. చీకటి పడినంక ఒక లైటు వేసుకుంటారు. కరెంటల్లకు ఎంతో కొంత యిస్తే సరి. దానికేం మీటరా పాడా?”

ఖాదర్ – సారుకు మొక్కి “రేపు వచ్చి కలుస్తాము సార్. దయ ఉంచండి. ఇంకెవరికి మాట ఇయ్యబాకండి” అన్నాడు

“లేదు లెండి. రేపు పొద్దున ఆపీసుకొచ్చి కొన్ని కాయితాల మీద నిశాని ఏసి పొండి. రేపు రాత్రి ఇదే టైములో ఇంటి కాడికొచ్చి మూడువేలిచ్చిపోండి. లీజు కాయితమిచ్చినంక మిగతాది ఇద్దురుగాని” అన్నాడు జోగయ్య సారు.

ఇంట్లో అందురూ కూర్చుని మాట్లాడుకున్నారు. బంకు కూడ కాదు, ఐదు వేలంటే శానా ఎక్కువంటాడు ఖాజా. “అది శానా పెద్ద సెంటరు మామూ! యాపారం బాగ జరగతిది. జోగయ్యసారుకు అయిదువేలు బోయినా, ఇంతకు ముందున్నోనికి ఒక వెయ్యి యిచ్చినా, దాన్ని కొంచెం నీటుగ జేసుకోని నాలుగు పక్కలా పైన గూడ్క పెద్దవి వెదురుబొంగులు కింది నించి పాతించి, ఎండా వాన తగలకుండా పైన తడికెలు ఏయించుకోడానికి ఇంకో వెయ్యి, ఇంకా గంపలు, ట్రేలు ఇట్లాంటి పైకర్సులు కలిసి ఎనిమిది వేలకి శాపు చేతికొస్తాది. వెదురుబొంగలెంబది అరటి పండ్ల పనలు పురితోస తోని కొట్టుకోవచ్చును. సేపు (యాపిలు) పండ్లు గూడ్క సోకుగ యాలాడదీయవచ్చు. షాపు సెట్టయితే యాపారమేముంది రోటేశనే గదా. చెడిపోయే సరుకు గాబట్టి కొంచెం కొంచెం తెచ్చుకుంటే పాయ” అన్నాడు ఖాదర్.

బిడ్డా, పెండ్లాము ‘తెగించకపోతే కుదరద’ని దైర్యం చెప్పినారు.

“మామూ నా కాడ రెండు వేలుండాయి. ఒక వెయ్యి యాడన్న చేబదులు తీస్కోని మూడు వేలు రేపు ఇచ్చేద్దాము. నీవు ఎల్లుండి ఊరికి బోయి ఇల్లు అమ్మకానికి పెట్టు. రెండున్నరంకనాలు పైనే ఉంటాది. ఇరవై వేలన్నా రాదూ?” అన్నాడు ఖాదర్.

“రావాల మరి మన బడేమియా బావనే కొనుక్కోవాల కొనుక్కుంటే. పోయి ఎట్లా ఒకట్ల అమ్ముకోని వస్తా! మనమంటే ఆ యప్పకు అబిమానము” అన్నాడు ఖాజా.

పొద్దున ఆపీసులో నిశాన్లు ఏసినాడు కాయితంల మింద. రాత్రి జోగయ్య సారుకు డబ్బు లిచ్చినారు. మర్సటి రోజు ఊరికి ఎలబారి పోయినాడు ఖాజా. పోయి బడేమియాను కల్సినాడు. విషయమంతా చెప్పినాడు.

ఆ యప్ప ఇట్లా అన్నాడు – “మంచి పని చేస్తాండావురా తమ్మీ! నాకైతే ప్రస్తుతము ఇల్లు అవసరము లేదు. మొన్న నా దోస్తు సరెడ్ది అనుమంతరెడ్డి డోనులో కలిసినాడు. ఆ యప్ప కొడుకు ఉళిందకొండలో పెన్నా సిమెంటు డీలర్‍శిప్పు దీసుకున్నాడంట. శాపు దొరికింది గాని గోడౌను దొరకలేదు. ఉన్నవి మిడిమ్యాలపు బాడిగలంట. సిమెంటు సంచులు పెట్టుకోనీకె నీ యిల్లు సరిపోతాది. దీన్ని గోడవును చేసుకోని, ట్రాక్టరు మింద షాపుకు తోలుకోవచ్చు. ఒక మాట చెప్పి చూద్దాము. ఏమంటాడో!”

ఇద్దరూ సరెడ్డి అనుమంతరెడ్డి యింటికి బోయినారు. ఆ యప్ప ఇంటి కాడనే ఉన్నాడు. సేద్దాలు తగ్గించుకొని, ఇద్గురు కొడుకులతో యాపారాలు పెట్టించినాడు. ట్రాకటరు ఉండాది.

బడేమియా ఆ యప్పకు ఖాజా ఇల్లు గురించి చెప్పినాడు.

“అజరత్, నా నెత్తిన పాలుబోసినావు. గోడవును కోసరము సస్తాండాము. మావోడు రాత్రికి వస్తాడు. ఈ సాయిబు యిల్లు నాకు తెలుసుగాని లోపల సూడల్యా. వానికి గుడ్క చూపించి, రేపు కాయం చేసుకుందాము. శిన్న శిన్న రిపేర్లు జేపిచ్చుకుంటే సరిపోతాదేమో సూడాల!” అన్నాడు.

ఆ రోజు బడేమియా ఇంట్లోనే పండుకున్నాడు ఖాజా. రాత్రి జొన్న రొట్టెలు, మాంసం కూర చేయించినాడు బడేమియా. పొద్దున అనుమంతరెడ్డి ట్రాక్టరు డ్రైవరు వచ్చి “రెడ్డి పిలుస్తాండాడు. ఇల్లు సూడనీకె పోవాలంట” అని చెప్పినాడు.

(ఇంకా ఉంది)

Exit mobile version