Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహాప్రవాహం!-31

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘మహాప్రవాహం!’ అనే నవలని ధారావాహికగా అందిస్తున్నాము.]

[గౌసుమియ బోగట్టా చేస్తే నాణ్యమైన రోజ్‍వుడ్డు గిద్దలూరు నల్లమల అడవిలో దొరుకుతుందనీ, కానీ తేవడం కష్టమని తెలుస్తుంది. ఆ మాట దినకర రెడ్డికి చెప్తే, ఆయన అన్ని ఏర్పాట్లు చేసి, డబ్బు మంచినీళ్ళలా ఖర్చు చేసి, సరుకుని ఆదోనికి తెప్పిస్తాడు. చెప్పిన మాట ప్రకారం గౌసుమియ, దస్తగరి, వీర కష్టపడి – అనుకున్న సమయానికన్నా ముందే పని పూర్తి చేస్తారు. కిన్నెర బార్ అండ్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం ఘనంగా జరుగుతుంది. దాని కోసం పని చేసిన అందరికీ కూలీ డబ్బులే కాకుండా, భారీగా ఇనాములిస్తాడు దినకర రెడ్డి. రెస్టారెండు మధ్యలో ఉండేలా వీర రోజ్‍వుడ్‍తో తయారు చేసిన యువతి శిల్పం అందరినీ ఆకర్షిస్తుంది. ప్రారంభోత్సవాని కొచ్చిన ఆదోని ఎమ్మెల్లే రత్నరాజప్ప దాన్ని చెక్కింది ఎవరని దినకర రెడ్డిని అడిగి, వీరని, గౌసుని దస్తగిరిని పిలిపించుకుంటాడు. వాళ్ళని మెచ్చుకుని, మీతో పని ఉందని, ఒకసారి వచ్చి నన్ను కలవండి అని చెప్తాడు. నాలుగురోజుల తర్వాత ఎమ్మెల్లే ఇంటికి వెళ్ళి ఆయనను కలుస్తారు. అప్పుడాయన వాళ్ళ పనితనాన్ని మెచ్చుకుని దుబాయిలో నిర్మాణం జరుగుతున్న హోటల్స్‌లో చెక్కపని చేయడానికి కార్పెంటర్లు కావాలని, మంచి జీతభత్యాలు ఉంటాయని, వీరని, దస్తగిరిని అక్కడికి పంపించమని చెప్తాడు. విమానం చార్జీలు, పాసుపోర్టు, వీసాలు అన్నీ సుమారు ఇరవై వేలయితాయని, తన బంధువు ద్వారా వెళ్తున్నారు కాబట్టి, వాళ్ళ గురించి తాను ప్రత్యేకంగా చెప్పాను కాబట్టి ఈ ఖర్చులు కంపెనీయే పెట్టుకుందని చెప్తాడు. గౌసుమియ దస్తగిరి వాళ్ళ నాన్నతో మాట్లాడి దుబాయ్ పంపడానికి ఒప్పిస్తాడు. వీర ఇంటికి వెళ్ళి తల్లిదండ్రులను ఒప్పిస్తాడు. మూడేళ్ళకు కాంట్రాక్టు కుదుర్చుకుని వీర, దస్తగిరి దుబాయ్ వెళ్ళిపోతారు. బొమ్మిరెడ్డి పల్లిలో మార్తమ్మ, దావీదుల జీవితం సాధారణంగా సాగుతూంటుంది. ఆ రోజు మార్తమ్మకి పని దొరికింది గానీ, దావీదుకు దొరకదు. యల్లసామిని అడిగితే, మరుసటి రోజుకయినా పని దొరుకుతుందని యల్లసామి ఇంటికి వెళ్తాడు దావీదు. ఆ యప్ప టిఫిన్ తినడానికి హైవే మీదున్న హోటలుకి వెళ్ళాడని అతని భార్య చెబుతుంది. అక్కడికి వెళ్ళి యల్లసామిని కలుస్తాడు. దావీదుకు వడలు తెప్పిస్తాడు. తిన్నాకా ఇద్దరూ టీ తాగుతారు. దావీదు తానొచ్చిన పని చెబితే, తనకీ పనేమీ దొరకలేదని, అందుకే ఇక్కడికొచ్చానని అంటాడు యల్లసామి. ఇక చదవండి.]

కిరానశాపు లోన దావీదు కేజీ బియ్యము, పావుకేజి కంది బ్యాడలు, ఉల్లిగడ్డలు తీసుకున్నాడు. నూనెకు సీసా త్యాలేదంటే శాపాయనే యాదో సీసాలో పావు లీటరు నూనె బోసిచ్చినాడు. యల్లసామి దగ్గర ముపై ఇప్పించుకోని ఇంటికి ఎలబారినాడు.

దావలో ఈరబ్రెమ్మం గుడి కాడ అరుగు మింద పావు కేజీ వంకాయలు, పావు కేజీ తమేటలు.. అర్ధకేజీ మటిక్కాయలు కొనుక్కున్నాడు. ఇంటికి బోయి జొన్న రొట్టెలు తినేసి కుంచేపు కునుకు తీసినాడు. లేసి, మటిక్కాయలు పీసులు దీసి చిన్న తుంటలుగా వలిసినాడు రేత్రి తాలింపుకు. ‘అలిసిపోయి వస్తాది పాపము! ఈ పనన్నా చేసిపెడ్తో బాగు’ అనుకొన్నాడు. ఇంటి ముందల గూసోని మార్తమ్మ కోసరం సూడబట్నాడు.

మార్తమ్మ కూలీ పని నించి వచ్చి కూలీ డబ్బులు మొగుని కిచ్చింది. కాలుసేతులు కడుక్కోని వచ్చి ఆయప్పను లోనికి బిల్సింది.

“కిరానసామాను, కూరగాయలు తెచ్చినామ్మేవ్. రేపు మానుకింది మద్దయ్య మొరుసు సేనులో కలుపుగుంటక దోలనీకె రమ్మనె. మన నేశె యల్లసామి, వాని బార్య, నీవు కలుప్పదియ్యనీకె రమ్మన్నాడు. నా గెడం పని రేపోక్కరోజే గాని మీకు మూడురోజులుంటాది. అడిగితే ముపై రూపాయ లిచ్చినాడు. అన్నీ దెచ్చినా. మటిక్కాయలు ఒలిసి పెట్టినా సూడు. రేత్తిరికి తాలింపు జేసుకుందాము.”

మార్తమ్మ నవ్వినాది. “నేను వలుసుకొనేదాన్ని గద! ఊకె ఉండబుద్దిగాదా నీకు” అనింది.

“మాది మూడురోజుల కూలైనా, నీవు ఒక్కరోజు గెడం కొట్టిన కూలితో సమానము గద!” అనింది.

దావీదు అన్నాడు – “ఈ మద్యన గెడం పనులు దొరకడమే గగనం అయిపోతుండాది. ఎట్ట జెయ్యాల్నో ఏమో”

“ఎదారు పడాకయ్యా, దడెం ఎచ్చుతగ్గు జరుగుతోనే ఉంది కదా! ఉండూర్నిడిసి పెట్టకుండా బ్రతుకుతున్నాము.”

మటిక్కాయ తాలింపు జేసి, శారు కాశింది మార్తమ్మ. మటిక్కాయలను శవలకాయలని కూడ పిలుస్తారు కర్నూలు జిల్లాలో. మిగతా చోట్ల గోరుచిక్కుడు కాయలంటారు. చిక్కుడుకాయల మింద కొంచెం పసరు ఎక్కువుంటాయి గాని రుసి ఎక్కువ. నూనెలో మగ్గుతే బాగుంటాది కూర. అట్టయితే ఎక్కువ నూనె కావాలని, సట్టిలో ముందు నీళ్లల్లో ఉడికిచ్చి, నీల్లన్నీ పూర్తిగా ఒంపేసి తిరగమాత ఏస్తే కుంచెమే నూనె సరిపోతాదని అట్టే జేస్తాది మార్తమ్మ. బియ్యము కొంచెము కొత్తవిచ్చినాడు. తూము కాడ గంజి వార్చేసి ఆ గంజిని గుడ్క ఒక గిన్నెలో పోసిపెట్టినాది, పొద్దున దాంట్లో కొంచెము మజ్జిగ బోసుకోని, మిరపకాయ, ఉల్లిగడ్డ నంచుకోని తింటే బాగుంటదని. పొయ్యి కింద కట్టెలు తీసేసి మంట తగ్గించినాది. అన్నం గిన్నె మూత మింద నాలుగు నిప్పలేసి పెట్టినాది. అన్నంలో యాదయినా తడి ఉంటే ఆ ఏడితో బిగుసుకుంటాది.

ఉడికిన మటిక్కాయలనీ తాలింపులో ఏసి మగ్గిచ్చినాది. ఉప్పు, కారము, కుంచెము పుట్నాలు దంచి, ఆ పొడి కూర మింద జల్లి, కలయదిప్పి మూతపెట్టినాది.

ఇద్దరు బోం చేసినారు. కొంచెం అన్నము కూర మిగిలినాయి.

“నీవు నసుకు లోనే బోతావు గదా గెడానికి. ఈ అన్నం, కూర తినేసిపో. నేను గంజి దాగి మనిద్దరికి ఇంత సద్ది గట్టుకోని వస్తా. అంబటిపొద్దు తిననీకె ఏం చేసుకోని రమ్మంటావు?”

“వంకాయలు దెచ్చినామ్మేవ్! నాలుగు కాయలు ఉల్లిగడ్డలు మగ్గిచ్చి ఊరిమిండి చెయ్యి. నాలుగు జొన్న రొట్టెలు చేసుకు రా”

“జొన్నపిండి అయిపోయినాది. జొన్నలు దెచ్చికోని మల్లా గిర్ని పట్టియ్యాల”

“అయితే రాత్రికి గూడ సరిపోయేటట్టు అన్నమే చెయ్యి. వచ్చేటప్పుడు తల్లెలో నీల్లు బోసి దాంట్లో అన్నం గిన్నె పెట్టి రావడం మర్సిపోయేవు! ఎర్ర సీమలెక్కినాయంటే చచ్చే చావవుతాది.”

“అట్నేలే మర్సిపోను”

నాలుగు రోజుల తర్వాత బిడ్డ జాబు రాసింది. పోస్టు ఆయనతోనే సదివించుకున్నారు.

“గౌరవనీయులైన అమ్మకు, నాయనకు నమస్కారములు. నిన్ననే నా డిగ్రీ ఫైనలియరు పరీక్షలు పూర్తయినాయి. శానా బాగ రాసినాను. టీచరు ట్రెయినింగు జేయనీకె మల్లా ఒక పరీక్ష పెడతారు. అది వచ్చే నెలలో ఉంటాది. దానికి కర్నూలులో కోచింగు ఇస్తున్నారు. నెలన్నరకి ఎనిమిది నూర్లంట. దాంట్లో చేరితే మంచిది. అందుకే నేను నాలుగయిదు నెలలనుంచి మీకు డబ్బులు ఇయ్యకుండా దాచి పెట్టుకుంటున్నాను. ఆ నెలన్నర కర్నూల్లో ఉండనీకె ఆస్టలుగాని రూము గాని తీసుకోని ఉండాలంటే, తిండీ తిప్పలు, ఇంకా మూడు నూర్లన్నాగావాల. నా దగ్గర వెయ్యి రూపాయలు ఉన్నాయి. నేను రెండు మూడు రోజుల్లో వస్తున్నాను. ఆపై రెండువందలు నాకు అవసరము ఐతాది. మీరే ఎట్లయినా సర్దాల. ఇట్లా అడగడానికి నాకు శానా సిగ్గు అయితున్నది. బి.యిడిలా కర్నూల్లోనే గవర్నమెంటు కాలీజీలో సీటు వస్తే, శానా మేలు. నా ఖర్చులకు ట్యూషన్లు చెప్పుకోని సంపాయిచ్చుకుంటాను. వచ్చి మిమ్నల్ని చూసి, కర్నూలుకు పోయి కోచింగులో చేరతాను. మీ ఆరోగ్యము జాగ్రత్త! ఇట్లు మీ బిడ్డ.. మేరీ.”

పోస్టాయిన జాబంతా చదివి అన్నాడు – “బంగారు తల్లిని గన్నారయ్యా దావీదూ, మీరు! ఎంత ఒద్దిక, ఎంత ఇనీయము! జాబు రాస్తే పిల్ల మన ఎదురుగ్గ నిలబడి మాట్లాడుతున్నట్టే ఉంటాది.” మజ్జిగ తాగి ఆ యప్ప ఎలబార్నాడు.

“మాయమ్మ, సదువుకుంటానే అదేదో కోచింగుకు గుడ్క సంపాయిచ్చికున్నాది చూడమ్మే! కొదవబడే రెండు నూర్లు అడగనికి సిగ్గయి తాందంట. పాపము! మన కాడ ఎంత ఉండిందో సూండు, ముంత లోన?” అన్నాడు దావీదు.

మార్గమ్మ ముంత తీసి లెక్కపెట్టింది. “తొంభై ఆరు రూపాయలుండాయి” అనింది.

“నా గెడం కూలీ, నీ మూడు రోజుల కలుపు కూలీ కలిసి ఇంకో నూరు రూపాయలపైనే వస్తాదిలే. మానుకింది మద్దయ్యనడిగి ఒక నూరు ఎక్కువ తీసుకుందాము. మల్లా పనుల్లో ఇచ్చే కూలీలో పట్టుకోమందాము. మేరమ్మకో రెండు నూర్లిచ్చి పంపించినా, మన కాడ కొంచెం కర్చుల కుంటాయి” అన్నాడు దావీదు ఇద్దరి మనసులూ నిమ్మలపడినాయి.

రెండ్రోజులకే మేరీ దిగింది. ఆ పిల్లను జూసి వాండ్లు సుమారు ఆరునెల్లయితాంది. పరీచ్ఛల కోసరమని రాత్రిల్లు మేలుకొని సదివిందేమో, కుంచెం ముకం పీక్కబోయింది. కానీ డిగ్రీ పూర్తి చేసినాననే ఆనందం ముకంలో కనబడతాంది.

వస్తానే ఇద్దర్నీ కరుసుకుని అత్తుకున్నాది. “డబ్బులు చాలవని ఈ తూరి మీకేమీ త్యాలా. అంతా ఇవరంగా జాబు వ్రాసినా గద!” అనింది. “నీవేం త్యాకపోయినా పరవాలేదమ్మా, నీవు రావడమే సాలు మాకు” అనింది మార్తమ్మ. బిడ్డ కిష్టమని ఉర్లగడ్డ ముద్దకూర, జొన్న రొట్టె చేసింది. కారం బొరుగులు కలిపి డబ్బాలా పోసింది. ఏమయినా నూనె వస్తువులు చేసిపెట్టాలంటే బయము! డబ్బులు సాలవని!

మానుకింది మద్దయ్యకు ఇసయం చెప్పి, కూలి డబ్బులు కాక ఇంకా నూర్రూపాయి లడిగితే సంతోశంగ యిచ్చినాడు. “ఎందుకైనా మంచిది ఇంకా నూరు తీసుకపో” అని మొత్తం మూడు నూర్లిచ్చినాడు. ‘నాల్రోజులు పోతే ఎర్రన్యాలకు సెరువు మన్ను తోలాల. కొడుకు లేడు కాబట్టి దావీదు, యల్లసామి లాంటివాల్లతోనే పని జరుపుకోవాల. ముందుగా దుడ్డిచ్చినాను గాబట్టి నాకే కట్టుబడి ఉంటారు. ఇంకోల్లకు మాటియ్యారు. పైగా పిల్ల సదువుకంటాడాడు’ అనుకున్నాడు మద్దయ్య.

బిడ్డ ఉన్న నాలుగు రోజులూ కూలీ పనికి బోక తప్పలేదు దావీదుకూ మార్తమ్మకు. మద్దయ్య పున్యమా అని బిడ్డపోయే రోజు బియ్యంపిండి గిర్నీ బట్టిచ్చి పప్పుబిల్లలు చేసినాది మార్తమ్మ. శనగ బ్యాడలు పరమాన్నము చేసినాది. మర్సటి రోజు పొద్దున్నే మేరీ బోయేది! రాత్రి అమ్మకూ నాయినకు మద్యన బొంత మింద పండుకోని చెప్పింది –

“నాయినా, కర్నూలులో నరసింగరావు పేటలో కోచింగు సెంటరు ఉందంట. మా నేస్తురాలు భారతి అని ఉంది. వాండ్లది పక్కనే అలంపురు. ఆదోనిలో నాతో బాటు సదివినాది. అలంపూరు కర్నూలుకు శానా దగ్గర. కోచింగుకు రోజూ వచ్చి పోవచ్చునంట. కోచింగు సెంటరుకు ఆస్టలు లేదంట. కానీ కోచింగుకొచ్చే స్టూడెంట్ల కోసరము రూములు బాడిక్కిస్తారంట. ఇద్దరు ఆడపిల్లలము కలిసి రూము తీసుకుంటము. వంట జేసుకుంటే కర్చులు కలిసొస్తాయిగాని చదువుకు భంగమయితాది. ఆడనే ఒక మెస్సు ఉందంట. నెలన్నర కోచింగుకు రెండు పూటల బోజనం పెట్టడానికి టిక్కెట్ల బుక్కు తీసుకుంటే ఐదు రూపాయల బోజనం నాలుగు రూపాయలే బడతాదంట. అంటే బోజనానికి నాలుగు వందలు, పైకర్చు నూట యాభై అనుకున్నా; నా దగ్గరున్న వెయ్యి, మీరిచే మూడు వందలు, మొత్తం పద్ముడు వందలయితాయి. నీవు కూడా నాతో బాటు వచ్చి కోచింగు పీజు తగ్గించమని అడుగు. రూము, మెస్సు ఏర్పాటు జేసి వద్దువు గాని.”

“పాప చెప్పింది శానా బాగుంది. నీవు కూడ ఎలబారు రేపు పొద్దున్న!” అన్నది తల్లి. పప్పుబిల్లలు, కారం బొరుగులు కట్టిచ్చింది. తండ్రీ బిడ్డా బయలుదేరి కర్నూలుకు బోయినారు. కోచింగ్ సెంటర్‍కు ఒక పెద్ద బిల్డింగు బాడిక్కు దీసుకున్నారు. డిగ్రీ రిజల్టు రాకముందే మొదులుబెడతారు. మేరీ చదివింది బి.యస్సీ కాబట్టి సీటు కష్టమే. కోచింగ్ సెంటరు ప్రినిపాలు శ్రీపాద రావు. బ్రామ్మడు. బియిడి కాలీజీ లెక్చరరుగా పని చేసి రిటైరైనాడు. తన మాదిరి ఇంకా ముగ్గురితో కలిసి ఈ కోచింగ్ సెంటరు బెట్టినాడు. సదువుల తల్లి దయ ఆ యప్ప మీద ఉన్నాది. ఆయన ముగంలో ఒక కళ ఉండాది.

అడ్మిషను పారము నింపుకుని లోపలికి బోయినారు.

“కూర్చొండి” అన్నాడాయన. మేరీ కూర్చోలేదు. నాయినను కూర్చోమన్నట్లు సైగ చేసినాది. దావీదు కూడా ఎనకాముందులాడుతుంటే ప్రిన్సిపాల్ అన్నాడు – “పర్వాలేదు కూర్చొండి. మీదే ఊరు? ఏం చేస్తారు?”

“మాది ఉళిందకొండ కాడ బొమ్మిరెడ్డిపల్లి సారు. వెల్దుర్తి గుడ్క మాకు దగ్గరే. సేద్దం కూలీ పనులు చేసుకుంటాము” అన్నాడు దావీదు.

“వెరీగుడ్!” అన్నాడాయన. “వ్యవసాయ కూలీగా ఉంటూ మీ పాపను బియస్సీ చదివిచ్చినారంటే, మీరు నిజంగా గ్రేట్!” అని దావీదుకు షేక్ హ్యాండ్ ఇవ్వబోతే ఈ యప్పకు అర్ధం కాల్యా.

“అంతా గవర్నమెంటు దయ సారు! డిగ్రీ సదువుతా గూడ సాయంత్రము ట్యూషన్లు చెప్పుకుంటా కస్టపడి తన కర్చులకు సంపాయిచ్చుకొన్నాది. మీరు మా మింద దయ చూపి పీజు కొంచెం తగ్గిస్తే, మీ పీరు చెప్పుకుంటాము.”

“తప్పకుండా దావీదు గారు. నేను దీని మీద రాస్తాను. ఏడు వందలు కట్టండి చాలు. మీ పాప కష్టపడి ప్రిపేరయితే సీటు గ్యారంటీగా వస్తుంది. మరి కర్నూల్లో పాప ఎక్కడ ఉండాలని?”

“యాదో రూం తీస్కొని ఉండాల సారు. మాకు తెలిసినాల్లెవరూ ఈడ లేరు.”

టేబులు మింద బెల్లు కొట్టినాడాయన. అటెండరు లోపలికి వచ్చినాడు. “ఇంతకు ముందే అడ్మిషను అయింది చూడు ఒక అమ్మాయి. వెలుగోడు అనుకుంటాను. బయట ఫీజులు కడుతూంటుంది. ఒకసారి రమ్మను.”

అటెండరు వెళ్లి ఆ పాపను తీసుకుని వచ్చినాడు. ఆ పిల్లకూ మేరీ వయసే ఉంటుంది.

“నీ పేరేమన్నావమ్మా” అని అడిగినాడాయన.

“చంద్రకళ సార్”

“నీతోబాటు చేర్చించడానికి ఎవరు వచ్చింది?”

“మా పెద్దనాయిన గారండి”

“ఎక్కడయినా వసతి చూసుకున్నారా?”

“అవును సార్. మన సెంటరుకు దగ్గర్లోనే కొత్తపేటలో రూము చూసినామండి. బాగానే ఉంది”

“నీకు రూమ్‌మేట్ ఎవరయినా ఉన్నారా?”

“ఇంకా లేదండి చూసుకోవాల”

“అయితే యింకేం? ఇదిగో ఈ పాప పేరు మేరీ. ఆదోనిలో బి.ఎస్సీ చదివింది. నీవు కూడా బియస్సీయే కద!”

“అవును సార్”

“మీరిద్దరూ కలిసి ఉండడానికి ఇబ్బందేం లేదు కదా!”

“అబ్బే, అలాంటిదేం లేదండి”

“గుడ్. షేర్ ది రూమ్ అండ్ స్టడీ హార్డు. ఓకె?”

చంద్రకళ పెద్దనాయిన రైతు. తమ్ముడు చచ్చిపోతే ఆయనే చంద్రకళను పెంచి పెద్ద జేసి చదివించినాడు. వెలుగోడులో వాండ్లకో ఐదెకరాల తరిపొలముంది. ఆయన కూడ సరే అన్నాడు. చదువులు కులాల అంతరాలను చాలా వరకు చెరిపేస్తాయి మరి. మేరీ ఫీజు కట్టేసినాది.

వెళ్లి రూము చూసినారు. స్టూడెంట్ల కోసరమే కట్టినట్లున్నారు. ఒకే రూము. చిన్నదే. లైటు, ఫ్యాను ఉన్నాయి. ఇద్దరికి సరిపోయే నవారు మంచం గోడకానించి ఉంది. ఒక మూల చిన్న చెక్క టేబులు, రెండు చేతులు లేని చెక్క కుర్చీలున్నాయి. గోడలకు రెండు షెల్ఫులు, ఒక కిటికీ. బాత్‌రూము, లెట్రిన్ నాలుగు రూములకు కలిసి ఒకటి.

“మగపిల్లలకు గూడ్క యిక్కడేనా?” అనడిగినాడు చంద్రకళ పెద్దనాయన. ఆయన పేరు ‘శివనంది’ అంట.

ఓనరు అన్నాడు “లేదు సార్, ఈ రెండు ఫ్లోర్లలో ఆడపిల్లలే ఉంటారు. మగపిల్లలది వేరే ఉంది.”

నెలన్నరకు బాడుగ నూట ఇరవై. కరెంటు చార్జీ పదైదు. ఇద్దరూ డబ్బు కట్టినారు. బాత్ రూము, లెట్రిన్ శుభ్రంగానే ఉన్నాయి. రోజూ వచ్చి కడిగిపోయే తోటీ ఆమెకు చివర్లో పది రూపాయలు ఇయ్యలంట.

అక్కడ నించి స్టేటు బ్యాంకు మెయిన్ బ్రాంచి పక్కన ఉన్ని ‘గీతా మెస్’ కు పోయినారు. నెలన్నరకు తొంభై మీల్సు టికెట్లున్న కట్ట తీసుకుంటే మూడు వందలే అని చెప్పినాడు మెస్సాయన. వేరే వాండ్లకయితే మూడు వందల అరవై అని, స్టూడెంట్లకు తగ్గిస్తున్నామని చెప్పినాడు. టికెట్లు కొనుక్కుని పర్సులో జాగ్రత్తగా పెట్టుకున్నారు ఇద్దురు ఆడపిల్లలు.

తర్వాత వాండ్లకు కావలసిన సబ్బు, కొబ్బరినూనె సీసా, బ్రష్షు, పేస్టు ఇట్టాంటివి కొనుక్కున్నారు. జాగ్రత్తలు చెప్పి ఊరికి ఎలబార్నాడు దావీదు. మద్యలో డబ్బులు అవసరమైతే జాబు రాయమని, తెచ్చిస్తాననీ అన్నాడు పోయే ముందల.

మరొక పదేను దినాల్లో డిగ్రీ రిజల్టు వచ్చింది. మేరీ 78 శాతము తెచ్చుకున్నాది. దాన్ని డిస్టిన్షన్ అంటారని రాసింది. అమ్మా నాయినకు తెలియాలని ఫస్టు క్లాసు కంటే ఎక్కువ అని రాసింది. చంద్రకళకు గుడ్క ఫస్టు క్లాసు వచ్చిందంట. ఆ పాప డిగ్రీ ఆత్మకూరులో చదివినాది.

కోచింగు క్లాసులు జరుగుతాండాయి. వారానికి రెండుసార్లు మోడల్ పరీక్షలు పెడతాన్నారు. మేరీ తెలివితేటలు, కష్టపడే తీరు శ్రీపాద రావుగారు గమనించినారు. ఆ యమ్మిని శానా బాగ ప్రోత్సాహము చేస్తాన్నారు.

బి.యిడి ఎంట్రన్స్ పరీక్షలు రాసి, రూము కాలీ జేసి ఇంటికి వచ్చినాది మేరీ. నెలరోజులకు గాని రిజల్టు రాదు. తర్వాత రెండేండ్లు వీండ్లను ఎట్టా ఇడిసి పెట్టి ఉండాల, ఈ నెల రోజులన్నా వీండ్ల కాడ ఉందామని అనుకునింది. దావీదుకు మార్తమ్మకు పనులు దొరికిన రోజు దొరకతండాయి. లేని రోజు ల్వా. రెండ్రోజులు ఇంటికాడనే ఉన్నాది మేరీ. మర్సటి రోజు మార్తమ్మ ఇత్తనం బుడ్డలు గొట్టనీకె కొండారెడ్డి యింటికి కూలీకి బోతాంటే, తానూ వస్తానన్నాది. ఎంతచెప్పినా ఇనదే..

ఆ పని మూడు రోజులు జరిగినాది. రోజుకు ముఫైరూపాయలు ప్రకారము తొంబై రూపాయలు సంపాయిచ్చినాది. అలవాటు లేక చేతులు కందిపోయినాయి పాపం!

నాయనతో అన్నాది “నాయినా, రిజల్టు వచ్చి బి.యిడి.లో చేరేంత వరకు నేను కూడ మీతో పాటు పనికొస్తా. ఎంతో కొంత నా కర్చులకు వస్తాది.”

ఇట్లా కలుపులు దీయానీకె, కొర్రు శేనుకోయానీకె, దుక్కి తర్వాత మట్టి గడ్డలు పగలగొట్టనీకె, ఆకిరికి కందులు ఇసరనీకె గుడ్క బోయినాది మేరీ. సుమారు నెలన్నరలో వెయ్యి రూపాయలు సంపాయిచ్చుకున్నాది బంగారు తల్లి.

జూలై నెల మొదుట వారంలా బి.యిడి రిజల్టు వచ్చినాది. పలాన రోజు వస్తాదని, తమ సూడెంట్లందరూ కర్నూలుకు రావల్లనీ జాబులు వచ్చినాయి.

నాయినను దీసుకొని పోయినాది మేరీ. ఆపీసులో శానామంది ఉన్నారు. శ్రీపాద సారు దగ్గర రిజల్టు ఉండింది. హాల్ టికెట్టు నంబరును బట్టి, పిల్లల పేర్లు బోర్డు మీద రాసిపెట్నారు. మేరీకి గుండెల్లో ఒక దడ మొదలైనాది. కాల్లు వనుకుతుండగా, పోయి తన నంబరు ఉందో లేదో చూసినాది. దావీదుకు అంత టెనసను లేదు. ‘నా బిడ్డకు రాకపోతే ఎవురి కొస్తాది’ అని ఆ యప్ప నమ్మకము.

మేరీ నంబరు మొదటొరుసలోనే కనపడినాది! ‘ప్రభువా! కరునించినావా తండ్రీ!’ అనుకున్నాది. సంతోషముతో కండ్లకు నీల్లు వచ్చినాయి ఆ పిల్లకు. నాయినను రెండు చేతులతో కరుచుకొని, ఆ యప్ప శెంప మింద ముద్దు బెట్టినాది. పోయి శ్రీపాద సారును గలిసినారు. ఆయన కాల్లకు మొక్కినాది మేరీ. ఆ యమ్మని దగ్గరకు దీస్కోని తల నిమిరినాడు సారు. “మన సెంటరు పేరు నిలబెట్టి నావమ్మా!” అన్నాడు “మొత్తం మన సెంటరు నుంచి నూట నలభై ఆరు మందికి కోచింగు ఇస్తే పద్నాలుగు మంది సెలెక్టయినారు. నీకు మార్కులు బాగానే వచ్చినాయి కాబట్టి గవర్నమెంటు సీటు రావచ్చును. ఆల్ ది బెస్ట్ అమ్మా” అని దీవించినాడు సారు. చంద్రకళ సెలక్టు కాలేదు. పది దినాల తర్వాత కడపలో కౌన్సిలింగు జరిగినాది – అంటే సెలెక్ట్ అయినోల్లకు కాలేజీలు కేటాయించడం. మేరీకి ‘తిరుపతి గవర్నమెంటు కాలేజు ఆఫ్ ఎడ్యుకేషన్’కు ఇచ్చినారు. ‘కర్నూలు అయుంటీ బాగుండేది కాని మన యిష్ట ప్రకారము ఇయ్యరు కదా!’ అనుకున్నాది ఆ పిల్ల.

వారం రోజులలో తిరుపతిలో చేరాల. కడప కర్చుబోను ఎనిమిదివందల యాభై ఉన్నాయి మేరీ కాడ. నాయిన ఇంకా రెండు నూర్లు సగీస్తానన్నాడు. గవర్నమెంటు కాలేజీ కాబట్టి పీజులు శానా తక్కువ. పుస్తకాలు, హాస్టలు కర్చు ఉంటాది. పోయి శ్రీపాద సారుకు చెప్పినాది.

ఆయన ఇట్టా అన్నాడు “నాతో బాటు చిత్తూరులో పనిజేసిన వ్యాసమూర్తి అనే సారు యిప్పడు తిరుపతిలోనే పనిచేస్తున్నాడమ్మా. ఇంకా సర్వీసుంది. నాకంటే చిన్నాడు. నేను ఆయనకు ఫోన్ చేస్తాను. పోయి కలువు. నీకు అండగా ఉంటాడు.”

‘ఈ సంవత్సరమంతా కర్చుల కోసరం ట్యూషన్లు చెప్పుకుంటాననీ, డిగ్రీలో కూడ అట్లే జేసినాననీ, అట్లాంటి వీలు యాదయినా తిరుపతిలో ఏర్పాటు చేయనీకె అయితుందేమో సూడ’మని శ్రీపాద సారును అడిగినాది మేరీ.

“మా వ్యాసుకు ఇది గూడ చెబుతాలేమ్మా” అన్నాడాయన.

చేరడానికి ముందురోజు గుడ్డలు, కావలిసినవన్నీ సర్దుకున్నాది మేరీ. కర్నూలు నుండి తిరుపతికి, నంద్యాల, కడప మిందుగా బస్సున్నాది గాని దానికి చార్జీ ఎక్కువనీ, గుంతకల్, ధర్మవరం మీదుగా రైలు ఉందనీ, దానికి చార్జి శానా తక్కువని చెప్పినారు తెలిసినోల్లు. అది అయిదరాబాదు నుండి వస్తాదంట. దాన్ని డోనులో ఎక్కొచ్చంట.

అమ్మా నాయినా డోను కొచ్చి రైలెక్కించినారు మేరీని. జనరల్ పెట్టెలో శానా జనముండారు. ఎట్లో లోపలికి బోయి సంచులు పెట్టుకోని నిలబడింది. రాత్రంతా పిల్ల నిలబడాల్సిందేమోనని తనకలాడినారు ఇద్దరూ. సింగిల్ సీటులో కూచున్న ఒకాయన తాను గుంతకల్లులతో దిగిపోతా లెమ్మనీ అప్పుడు కూచుందువులే అనీ చెప్పినాడు. కిటికీలో నుంచి, గుంతకల్లులో సీటు దొరుకుతాదని, అమ్మను నాయినకు అరిచి చెప్పినాది.

రైలు కదులుతాంటే ఇద్దరికీ దుక్కం నిలబడల్యా. మెల్లగా టేసను దాటింది రైలు. ఆ రాత్రి టేసను లోనే పండుకొని పొద్దన బస్సుకు ఊరికి పోయినారిద్దరూ. పొద్దున పది గంటలకు తిరపతి చేరినాది రైలు. దిగడానికి ముందే ముకం కడుక్కొని, తల దువ్వుకొని, రడీ అయినాది మేరీ. టేసను బయట రిక్షా మాట్లాడుకోని బి.యిడి కాలేజికి చేరుకున్నాది. ఒక జిప్పు సంచిలో సర్టిఫికెట్లు అన్నీ భాగ్రత్తగా పెట్టుకొన్నాది.

వ్యాసమూర్తి సారు యాడుంటాడో తెలుసుకోని పోయి కలిసినాది. రూము ముందర బోర్డు ఉన్నాది. ‘కె.వ్యాసమూర్తి, లెక్చరర్ ఇన్ టీచింగ్ మెథడాలజీ’ అని ఇంగ్లీషులో రాసి ఉన్నాది.

“మే ఐ కమిన్ సర్!” అని అడిగి ఆయనకు చేతులు జోడించి నమస్కారము చేసినాది.

“చెప్పమ్మా” అన్నాడాయన. శ్రీపాద సారు పంపించినాడని చెప్పితే ఆయన, “ఓ! నీవేనా మేరీవి! నిన్ననే ఫోన్ చేసినాడాయన. నాకంటే సీనియర్. నీవు చాలా బ్రయిట్ స్టూడెంటువని చెప్పినాడులే. డోన్ట్ వర్రీ అమ్మా! ఐ కెన్ హెల్ప్ యు. వెళ్లి సర్టిఫికెట్స్ వెరిఫికేషను చేయించుకోని హస్టలు రూం అలాట్ చేయించుకోనిరా” అన్నాడు.

మధ్యాహ్నం హాస్టలులో రూం ఇచ్చినారు. నలుగురు కలిసి ఉండేలా. బి. బ్లాక్ హాస్టలు పేరు ‘వకుళమాత’. రూం నంబరు 103. నిశ్చింతగా నిట్టూర్చినాది మేరీ. మర్సటిరోజు నుంచీ క్లాసులు.

వెళ్లి వ్యాసమూర్తి సారును కలిసి చెప్పినాది. “గుడ్! బాగా చదువు. బికం ఎ గుడ్ టీచర్!” అన్నాడు. ట్యూషన్ల విషయము అడిగింది. “ఔనమ్మా. అది గూడ చెప్పినాడాయన. కపిలతీర్థం రోడ్డులో మాకు తెలిసినవాండ్లది ‘శేష శైల ట్యుటోరియల్స్’ అని ఉంది. నీవు ఎయిత్, నైన్త్, టెంత్ వాళ్లకు చెప్పొచ్చు. నా మాట కాదనరు. ఈ రోజు సాయంత్రం పోయి కలిసిరా. మీ వార్డెన్‍కు కూడ చెబుతాలే” అన్నాడు.

వ్యాసమూర్తి సారు పంపినాడని ఆ ప్రిన్సిపాలు శానా బాగ ఆదరించినాడు మేరీని. సాయంత్రం ఆరు నుంచి, ఎనిమిది వరకు మూడు కాసులిస్తామనీ, నెలకు రెండువందలు ఇస్తామనీ అన్నాడాయన. మేరీకి మనసు నిమ్మలపడింది. కాలం అట్లా ఒక బీద పిల్ల జీవితంలో ఒక కొత్త మలుపు తిప్పింది!

(ఇంకా ఉంది)

Exit mobile version