[శ్రీ కార్తీక రాజు రచించిన ‘మహా విహారయాత్ర’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము. సంచిక – సాహితీ ప్రచురణలు సంయుక్తంగా నిర్వహించిన 2025 ఉగాది వచన కవితల పోటీలో బహుమతి పొందిన కవిత.]
తెల్లారిగట్లల్ల ఐదు గొట్టంగనే లేశి
రాత్రిపూట గట్టిపెట్టుకున్న సామాను మూటలను
తలొక్కటి పట్కొని
బయల్దేరేటోళ్ళం
టార్చి లైటున్న బాపు సైకిలు
పెద్ద పెద్ద మూటలను
దాని ఈపు మీదికెక్కిచ్చుకొని
మాతోని పాటిగె నడుస్తు
మాకు తొవ్వ జూపిచ్చుకుంట
మస్తు సాయం జేశేటిది
రాళ్ళూరప్పల నుంచి
పురుగూపుట్ర నుంచి
తప్పిచ్చుకుంట టకటక అడుగులేశేది మేం
జెల్ది శేరుకోవాలెగద మరి
తీర్తాల చోటు కాడికి
దూరమనుకున్న చోటు దగ్గరైతాన కొద్దీ
మనసుపిట్ట గిరికీలు గొట్టేది
నడిశే దారిలనే
ఊటశెలిమె నుంచి పారుకచ్చిన నీళ్ళు
మా పాదాలను కడిగేటియి
ఆ సల్లని తాకిడికి
కాలిఏళ్ళు నాట్యమాడేటియి
ఓ మంచి జాగ జూస్కున్నంక
ఆడ సామాను దిగేది
ఎండను మా మీద పడనియ్యకుంట
శెద్దరే టెంటు లెక్కయ్యేది
పచ్చని గడ్డిపర్కల మీద
జారకుండ నిల్సున్న మంచుబొట్లను
గప్పుడే పొడుసుకచ్చిన సూరీడు
మెల్లమెల్లగ తాగి మాయంజేశెటోడు
అప్పటిదాక బండ లెక్కనే ఉన్న బండ
మా ఊరోళ్ళ శెయ్యి పడ్డెంటనే
పసుపుబండార్లు తొడుక్కొని
అందరు మొక్కే దేవతయ్యేది
పొత్తుల కొన్న యాటపిల్ల
తెగి, పొతమయ్యి
పొయ్యి మీద కుతకుత ఉడికెదాక
మేమైతె బిందాస్ గ ఆటకు ఎగవడేది
పెద్ద పెద్ద పైసలబిళ్ళలు
రైలు పట్టాల మీదికెక్కేటియి
రేగు శెట్ల శిఖల మీద ఆలిన బంగారు పురుగులు
అగ్గిపెట్టెలపంజరాలల్ల ఇరుక్కపోయేటియి
మెత్తటి ఆరుద్ర పురుగులు
అరశేతుల్లల్ల ముద్దుగ పాకేటియి
తియ్యటి పరికి పండ్లు జేబుల్లల్ల జేరి
ఒక్కోటీ నోట్లె నాని కరిగిపోయేటియి
కోపుల్లల్లున్న నీలం రంగు నీళ్ళు
మా దూకుడుకు ఓ ఊపు ఊగేటియి
ఒక్కరోజుల ఎన్ని జరిగిపోయేటియో
కలిశికట్టుగ బంతిల కూసొని
మోదుగాకు ఇస్తార్లేసుకొని
ఒకళ్ళనొకలం అర్సుకుంట తినెటోళ్ళం
మెతుకు ఒదిలితె ఒట్టు
మనసు నిండిపొయ్యేది
మేమచ్చిన యాళ్ళకే అచ్చిన సూరీడు
మేం తిరిగిపొయ్యే యాళ్ళకే తిరిగిపొయ్యెటోడు
నడిమిట్ల మబ్బుజేస్తే ఆగమాగమయ్యెటోళ్ళం
వాన పడద్దని ప్రకృతికి మొక్కుకునేటోళ్ళం
శిన్నప్పుడు
అన్ని పండుగలల్ల
గా శెట్ల తీర్తాలంటేనే మస్తిష్టం
ఏ విహారయాత్రకు పొయ్యే స్తోమత లేని మాకు
గా శెట్ల తీర్తమేగదా
మహా విహారయాత్ర!!