Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహా మనిషి

[శ్రీ కొడాలి సీతారామా రావు రచించిన ‘మహా మనిషి’ అనే కథని పాఠకులకు అందిస్తున్నాము.]

నేను దేవుణ్ణి నమ్మను. మనిషినే నమ్ముతాను. కనపడని దేవుడి కన్నా కనపడే మనిషే నయం అని నా నమ్మకం. దేవుడు సాయం చేస్తాడో లేదో తెలియదు కానీ మనిషి ఒకరు కాకపోతే మరొకరు ఆదుకుంటారు.

దేవుడిని చూశామనీ, దేవుడితో మాట్లాడామనీ చెప్పే చాలామంది మనకి ప్రత్యక్షంగా ఆ విషయాన్ని రుజువు చేయలేరు. చేయలేదు కూడా. దేవుణ్ణి ఏవేవో కోరికలు కోరుకున్న వాళ్ళల్లో  కూడా  వాళ్ళ కోరికలు తీరకపోతే మన కర్మ  ఇంతే అని సరిపెట్టుకుంటారు తప్ప దేవుణ్ణి ఏమీ అనరు. భయం వల్లో భక్తి వల్లో. అలా అనుకున్నప్పుడు ఆయన్ని ప్రార్థించి ఇబ్బంది పెట్టడం ఎందుకు అనుకుంటాను. నిజానికి భక్తి కన్నా దేవుడంటే భయమే ఎక్కువమందిలో చూశాను.

అయినా కొందరు ప్రభుత్వ కార్యాలయాలలో ముడుపులు చెల్లిస్తే అసాధ్యమైన పనులు కూడా సాధ్యమవుతాయి  కదా అన్నట్లు దేవుడికి కూడా ముడుపులు కడుతుంటారు. అయితే ఆయన ప్రభుత్వ ఉద్యోగి కాదు కదా తిమ్మిని బమ్మిని చేయటానికి. కర్మను అనుసరించే అన్నీ జరుగుతాయి అన్నప్పుడు కోరటమెందుకు చింతించటమెందుకు అని నా భావన. అయితే నేను నా అభిప్రాయాలని ఎవరి మీదా రుద్దాలనుకోను.

నన్ను చాలా మంది అడుగుతుంటారు “అందరినీ నమ్ముతావు ఎన్నిసార్లు మోసపోయినా. నీకు బుద్ధి రాదే. కాస్త ఆలోచించాలి” అని. కానీ నాకేమనిపిస్తుందంటే అందరూ మోసం చేయరనీ, చేయలేరనీ. ఇలా అడిగిన వాళ్ళల్లో కొందరు నా స్నేహితులే ఐనా మోసం చేశారు. ఐనా నేను వాళ్ళతో స్నేహంగానే వున్నా. వాళ్లెప్పుడైనా ఆ విషయం గురించి ఆలోచించారో లేదో మరి.

***

మెయిన్ బజార్లో పనుండి వెళ్ళాను. స్కూటర్ ఒక చోట పార్కు చేసి చాలా దూరం నడవాలి. అలా నడుస్తుంటే నా చెప్పు తెగింది. నడవటం కష్టమైంది. చెప్పులు కుట్టేవాళ్లు ఎవరన్నా వున్నారా అని చూస్తున్నాను. సరిగ్గా నేను చెప్పులు కొన్న షాపు ఎదురుగానే వుంది. ఆహా ఏమి నా అదృష్టం అనుకున్నాను. మూడు నెలలే అయింది కొని. షాపులోకి వెళ్ళగానే నవ్వుతూ పలకరించాడు మేనేజరు. నా సమస్య చెప్పాను.

“సార్, మా షాపు మూసే సమయం అయింది. ఇది జిగురుతో అంటించాలి. ఒక గంట వుంచాలి. అందువల్ల ఇప్పుడు ఇచ్చేయండి రేపు ఉదయం మొదటి గంటలో ఇచ్చేస్తాం.”

“సరే ఇప్పుడెలా వెళ్ళటం.”

“తక్కువ ధరలో వేరేవి తీసుకోండి సార్.  రండి చూడండి. చాలా వెరైటీలు వున్నాయి.” అన్నాడు లోపలికి వెళ్తూ ఎవరినో పిలుస్తూ.

‘మొన్ననే కొన్నా ఎనిమిదొందలు పెట్టి.  ఇప్పుడు మళ్ళీ కొత్త చెప్పులెందుకు. ముందుకెళితే ఇంకా షాపులున్నాయి. మధ్యలో ఎవరైనా చెప్పులు కుట్టేవారు దొరకకపోతారా’ అనుకుంటూ నడుస్తున్నాను.

అలాగే ఇబ్బంది పడుతూ ఇంకో షాపులోకి వెళ్ళా. “వేరే కంపెనీ చెప్పులు మేము బాగు చేయం. ఐనా ఇస్తే  మా వర్కు షాపుకి పంపుతాం. వారం పట్టోచ్చు.”

‘ఆహా ఎంత దురవస్త వాటిల్లింది’ అనుకుంటూ బయటికి వచ్చా.

కొంచం దూరం నడవంగానే రోడ్డు పక్కన తాటాకు గొడుగు కనపడింది. అది చెప్పులు కుట్టేవాడే అయి వుంటాడనుకుంటూ అటు నడిచా. తను చెప్పులు కుట్టేవాడే! కానీ అంతకు మునుపు ఎప్పుడూ చూడలేదు అక్కడ. అయితే అతను సామనంతా సర్దేశాడు. వెళ్లిపోతాడేమో. నేను చెప్పు వేపు చూపించాను చెప్పు అతని ముందు విడుస్తూ.

అతను దాన్ని తీసుకుని చూస్తూ “బాబూ ఇది జిగురుతో అంటించాలి. గంట పడుతుంది. మీరొస్తానంటే అంటించి వుంచుతా. లేదంటే మేకులతో కానీ, దారంతో కానీ అయితే ఇప్పుడే ఇచ్చేస్తా.” అన్నాడు నా  మొహం వంక చూస్తూ. అంత ఖరీదైన చెప్పులకి మళ్ళీ దారం, మేకులు ఎందుకు అని అంటించి వుంచితే పని చూసుకుని వస్తానని చెప్తూ రెండో చెప్పు కూడా విడిచా. అతను తన గోనెసంచి లోంచి ఓ కవరు తీసి, అందులోంచి ఓ చెప్పుల జత తీసి “కొత్తవే బాబూ వేసుకోండి.” అన్నాడు.

 నేను సందేహిస్తుంటే “కొత్తవే బాబూ, అందాకా వుత్త కాళ్ళతో ఎలా తిరుగుతారు. ఓ గంటలో వచ్చీయండి” అన్నాడు.

బజారు పని చూసుకుని అతని దగ్గిరకి వచ్చేసరికి చెప్పులు సిద్దంగా వున్నాయి. నా ముందు పెట్టాడు. పర్సు తీస్తూ “ఎంతివ్వామంటావు?” అన్నా.

“మీ దయ బాబూ” అన్నాడు.

వంద రూపాయలు ఇచ్చాను.

“బాబూ చిల్లర లేదు. మల్లోచ్చినప్పుడు ఇవ్వండి. పర్లేదు” అన్నాడు.

“ఫరవాలేదులే. వుంచు. నువ్వు చేసిన సాయం చిన్నది కాదయ్యా.”

అతనా డబ్బులు కళ్ళకద్దుకుని, “బాబూ ఆశ పనికిరాదుట. మా అయ్యోరు చెప్తారు. మీరు మళ్ళీ ఇటేపొచ్చినప్పుడు చిల్లర తీసుకోండి. నేను లేకపోయినా  మా ఆవిడో, పిల్లోడో వుంటారు. నేను చెప్పి వుంచుతా. మీకు ఇవ్వాలిసింది కూడా విడిగా వుంచుతా. మీరెప్పుడైనా రండి.” అని తన సామాను సర్ది లేవబోతూ “ఒక సిటం వుంటే ఎల్లిపోయేవోన్నిబాబు. మా వూరి సివరి బస్సు ఏలయింది  అప్పుడు. మీరిబ్బంది పడతారని ఆగా” అన్నాడు.

ఎందుకో అడగాలనిపించింది ఇప్పుడెలా వెళ్తావని. “ఏముంది బాబూ, ఆటోలో ఎల్లాల ఈ ఏలప్పుడు. ఇరవై రూపాయలౌతాయి. బస్సైతే డబ్బులక్కరలేదు మా కుటుంబానికంతటికీ. ఆ వోనరూ నేనూ సదూకున్నాం చిన్నప్పుడు ఐదో తరగతి దాకా. ఆడికి మా సెడ్డ ప్రేమ నేనంటే. ఆళ్ళ బస్సుల్లో ఏటిలోనూ టికెట్టు లేదు మాకు. మంచోడండి బాబూ. ఏరా అనే అనమంటాడు. ఎంతమంది  మద్దెలో వున్నా నా బుజం మీద చెయ్యేసే మాటాడతాడు. మా అబ్బాయిని ఆడి మూలానే చదివిత్తన్నా.”

“ఈ వుత్తి గిట్టుబాటు అవటం లేదండి. మా వోళ్ళందరూ మానేసి పళ్ళో, కాయగూరలో అమ్ముకోమంటారు. నాకేమనిపిస్తందంటే ఇలా చెప్పులు తెగిన వోల్లు ఇబ్బంది పడరా అని. ఈ చుట్టు పక్కల చెప్పులు కుట్టేవోల్లు లేరు.”

అప్పుడనిపించింది మనుషుల్లో మంచివాళ్ళు వున్నారని. అతని మంచితనం గురించి ఆలోచిస్తున్నా. నా కోసం ఆగాడు, బస్సు టైమౌతున్నా. నా కోసం కొత్త చెప్పులు ఇచ్చాడు. ఇరవై రూపాయలే అడిగాడు. ఎక్కువ అడగలేదు అవకాశం వున్నా. నేను ఇస్తున్నా వద్దన్నాడు.

ఇప్పుడు అతను కనిపిస్తున్నాడు నాకు దేవుడిలా! కాదు. మనిషిలా! మహా మనిషిలా!!

Exit mobile version