Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మహా కుంభమేళా – నా అనుభవాలు

[జనవరి 2025లో మహా కుంభమేళాలో శ్రీ రాకేష్ ఆనంద్ బక్షి పాల్గొని తన అనుభవాల గురించి ఆంగ్లంలో రాశారు. వాటి స్వేచ్ఛానువాదం ఈ రచన.]

1) భూమిపై అమృతం చిందినవేళ

ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ. ఓం.

దేవదానవులచే విశ్వమహాసముద్రపు మథనం జరుగుతున్నప్పుడు, సుధ, అమృతం బిందువులు జారి భూమి మీద నాలుగు ప్రదేశాల (నదులు) – ప్రయాగ్‌రాజ్ (త్రివేణి సంగమం, గంగా, యమునా, సరస్వతి సంగమం), హరిద్వార్ (గంగా), ఉజ్జయిని (శిప్రా నది), నాసిక్ (గోదావరి) పై పడ్డాయి. అందువల్ల ఈ నాలుగు ప్రదేశాలు పవిత్రమైనవిగా పరిగణించబడి ‘కుంభమేళా’ అని పిలవబడే అతిపెద్ద ఆధ్యాత్మిక ఉత్సవానికి వేదికలయ్యాయి. కుంభమేళా ఉత్సవంలో పవిత్ర నదులలో స్నానం చేయడం, దానధర్మాలు చేయడం వల్ల, పునర్జన్మని తప్పించుకుని; జనన మరణ చక్రం నుండి విముక్తి పొందవచ్చని హిందువులు విశ్వసిస్తారు. కుంభమేళా మూలం సనాతన ధర్మ గ్రంథం ఋగ్వేదంలో ప్రస్తావించబడింది, ఖగోళశాస్త్రపరంగా ఇరవై వేల సంవత్సరాల క్రితం నాటిది.

ఈ ఉత్సవాలకి ఎవరూ ఎవరినీ పిలవరు, ఆహ్వానపత్రికలు ఉండవు. అయినా, సంస్కృతి, సాంప్రదాయం, ఐక్యత, సహజీవనం, కృతజ్ఞత, గౌరవాలను పాటిస్తూ ఈ ‘ఆధ్యాత్మిక ఉత్సవం’ కోసం కోట్లాది భక్తులు (సనాతనులు), పర్యాటకులు, బ్లాగర్లు, సోషల్ ఇన్‍ఫ్లుయెన్సర్స్, మీడియా సిబ్బంది వస్తారు. సనాతన ధర్మపు విశిష్టమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక అనుభవంపై ఉత్సుకత, విశ్వాసంతో ప్రేరేపితులై సందర్శకులు కుంభమేళా సమయంలో పవిత్ర నదులలో స్నానం చేస్తారు. సనాతన ధర్మం ఒక ‘మతం’ కాదని నేను నమ్ముతున్నాను. మతం అనేది అబ్రహామిక్‌లు మొదలైన వారి నమ్మకం. అందుకే నేను, ఇంకా చాలా మంది, కుంభమేళాను సాంస్కృతిక, ‘ఆధ్యాత్మిక కూడిక’ గా వ్యవహరిస్తాము. అది ‘మతపరమైనది’ కాదు.

2025లో ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న ప్రత్యేక మహా కుంభమేళా 144 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుందని విశ్వాసం. నేను దానికి పూర్తిగా సిద్ధమయ్యాను. వీలైనంత తక్కువ సామాన్లతో ప్రయాణించాలని నిర్ణయించుకున్నాను. వాహనం ఆపివేసిన చోటు నుండి చాలా దూరం నడవాల్సి వచ్చింది. పార్కింగ్ స్థలం నుండి కుంభమేళా ఉత్సవం జరిగే ప్రధాన ప్రదేశానికి; బస/వసతి కోసం గుర్తించబడిన ప్రదేశానికి దాదాపు 3 కి.మీ.లు నడవాలి. గత కుంభమేళాకు హాజరైన స్నేహితులు, బంధువుల అనుభవాల ద్వారా – ఇది చాలా చక్కగా నిర్వహించబడిందని, అత్యున్నత స్థాయి భద్రత ఉందని, అత్యంత పరిశుభ్రంగా ఉందని నాకు ఖచ్చితంగా తెలిసింది. ఘనమైన ఈ ఉత్సవం జరుగుతున్న ప్రాంతంలోని వీధులు, దారులు, రోడ్లు ప్రతి గంటకు ఒకసారి శుభ్రం చేయబడుతున్నాయి, దారికి ఇరువైపులా ప్రతి 500 మీటర్లకు ఒక చెత్త కుండీ ఉంది. అత్యంగా భారీగా జనాలు హాజరైనప్పటికీ, ఈ జాగ్రత్తల వల్ల నా అనుభవం ఆహ్లాదకరంగా ఉండి, నాకు మరింత సౌఖ్యంగా అనిపించింది.

2) ప్రయాగ్‌రాజ్, త్రివేణి సంగమం సంగమం. జనవరి 13, 2025.

ఈ తీర్థంలో నాకు కలిగిన అత్యంత గాఢమైన అనుభవం – ‘భక్తి’.

ప్రాముఖ్యత: 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే కుంభమేళా తేదీని బృహస్పతి, భూమి, చంద్రుడు గ్రహ స్థానాలు నిర్ణయిస్తాయి. 12 కుంభమేళాల తరువాత వచ్చే కుంభమేళాని పూర్ణ కుంభమేళా అంటారు. 12 పూర్ణ కుంభమేళాల తరువాత, అంటే, 144 సంవత్సరాలు పూర్తయి, 145వ సంవత్సరంలో నిర్వహించబడే కుంభమేళాని మహా కుంభమేళా అంటారు. ఇది 2025లో వచ్చింది.

ప్రయాగ వద్ద త్రివేణి సంగమం చాలా ప్రత్యేకమైనది, ఎందుకంటే ప్రతి నది – తనకే ప్రత్యేకమైన భౌగోళిక అంశాలలో, మూడు విభిన్న మార్గాల గుండా ప్రవహిస్తూ అక్కడికి – త్రివేణి సంగమ ప్రదేశానికి తన నీటిని తీసుకువెళ్తుంది. మూడు భూకంపాల కారణంగా 7500 సంవత్సరాల క్రితం సరస్వతి నది తన గమనాన్ని మార్చుకున్నప్పటికీ, దానిలో కొంత భాగం యమునా, గంగా నదులతో కలిసిపోయిందనీ, కొంత భాగం భూగర్భంలో అంతర్హింతంగా ఉందని హిందువుల విశ్వసిస్తారు. పంచేంద్రియాల ద్వారా చూడని లేదా అనుభూతి చెందని వాటిని కూడా హిందువు నమ్ముతాడు. మన మెదడు లోపల న్యూరాన్ల కార్యకలాపాలను మనం చూడకపోయినా, ఆ న్యూరాన్ల కార్యకలాపాలు సృష్టించిన ప్రతిదాన్ని మనం అనుభవిస్తున్నాము/అనుభూతి చెందుతాము. చూడడం అంటే నమ్మడం అని అంటారు (సీయింగ్ ఈజ్ బిలీవింగ్). చూడకపోవడం కూడా నమ్మడమే అని హిందువుకు తెలుసు.

అఖాడాలు:

అఖాడాలు సనాతన ధర్మ సంరక్షకులు, తదుపరి తరానికి వేద జ్ఞానాన్ని అందజేస్తూంటారు.

విదేశీ దండయాత్రలు, సామాజిక మార్పుల మధ్య మతపరమైన, సాంస్కృతిక పద్ధతులను కాపాడుకోడానికీ, ప్రోత్సహించడానికి అఖాడా వ్యవస్థ ఏర్పడింది. అఖాడాల యొక్క మూలాలు పురాతన కాలం నుండి ఉన్నాయి. సాంప్రదాయకంగా, అఖాడాలు ఆధ్యాత్మిక సాధన, శారీరక శిక్షణ కేంద్రాలుగా పనిచేశాయి, మేధోపరంగా, భౌతికంగా, విశ్వాసాలను రక్షించడానికి తమ సభ్యులను సిద్ధం చేస్తాయి. శతాబ్దాలుగా, ఈ వ్యవస్థలు వృద్ధి చెంది, హిందూ ధర్మం, ఆధ్యాత్మిక సాధన సంరక్షకులుగా మారాయి.

సంప్రదాయం, ఆధ్యాత్మిక శిక్షణ, సాంస్కృతిక సంరక్షణ, యుద్ధ వారసత్వం, సామాజిక ప్రభావం వంటి కారణాల వల్ల హిందూమతంలో అఖాడాలకు అపారమైన ప్రాముఖ్యత ఉంది.

కుంభమేళా అఖాడాలు:

నాగ సాధువులు:

ఒక నాగసాధువు 2010 నుండి తన శరీరమంతా 75,000 రుద్రాక్షలు ధరించి, సత్వ గుణానికి (మనలోని విశ్వ మేధస్సుకు) అంకితమయ్యారు, అందరికీ మోక్షాన్ని సాధించాలని ప్రార్థించారు. ఒక వ్యక్తి 12 సంవత్సరాల నుండి తన తల మీద, చేత్తో తయారు చేసిన మట్టి శివలింగాన్ని ధరించి, సకల జీవుల శ్రేయస్సు కోసం ప్రార్థిస్తున్నాడు. చేరిక విషయానికొస్తే, కిన్నార్ అఖాడా బాగా ఆకట్టుకుంది, దీనిలో సృష్టికర్తకు శరణాగతి చేసిన ‘ట్రాన్స్‌జెండర్లు’ కూడా ఉన్నారు, భక్తితో వారు స్వచ్ఛందంగా చేరారు.

అఖాడాలలో లేదా వారు ఏర్పాటు చేసిన శిబిరాలలో, ఇంకా త్రివేణి సంగమం సమీపంలోని అనేక ఇతర ప్రదేశాలలో భక్తులందరికీ 24 గంటలు ఉచితంగా భోజనం పెడతారు. అన్ని హిందూ ఫౌండేషన్లు, సంస్థలు లక్షలాది మంది  భక్తుల కోసం ఏర్పాటు చేసిన – శిబిరాలు, ఉచిత వసతి, కొంత నామమాత్రపు రుసుముతో టాయిలెట్లు, స్నానపు గదులు అందుబాటులో ఉన్నాయి. నేను అక్కడ ఓ మాజీ కార్పొరేట్‌ని, మాజీ సి.ఇ.ఓ, ముంబై ఐఐటి గ్రాడ్యుయేట్, టెక్ డిజైనర్, ఏరో స్పేస్ ప్రొఫెషనల్ అయిన అభయ్ సింగ్‌ను కలిసాను. బహుశా అతని వయసు 35-40 ఏళ్ల మధ్యలో ఉంటుందేమో, తన పూర్తి సమయాన్ని ఆధ్యాత్మికతకే కేటాయించాడు. అభయ్ సింగ్ దాదాపు అన్ని రకాల మీడియా, టీవీలలోనూ కనబడ్డాడు. యూట్యూబ్ ద్వారా విస్తృతంగా అతని గురించి తెలిసింది. తమ ఆధ్యాత్మిక జ్ఞానం, మానవాళి కోసం చేసే సేవలను బట్టి ఇలాంటి వారిని స్వాములు లేదా బాబాలు అని పిలుస్తారు.

అంతా భక్తిమయం:

నాకు కలిగిన అత్యంత గాఢమైన అనుభవం ‘భక్తి’. నా మూడు రోజుల పర్యటనలో నేను చూసిన లక్షలాది మందిలో నాకు భక్తి కనబడింది. భక్తి అనేది సంస్కృత పదం, ఇది భజ్ అనే ధాతువు నుండి ఉద్భవించింది, దీని అర్థం ‘స్వయంగా వెళ్లడం’ (లోపలికి) లేదా ‘ఆశ్రయించడం’ లేదా ‘ప్రార్థించడం/ధ్యానం చేయడం’ లేదా ‘ఆరాధించడం’ అని చెప్పవచ్చు. ఈ పదానికి చాలా భిన్నమైన అర్థాలు ఉన్నాయి. ఇది – ‘అనుబంధం, అభిమానం, ప్రేమ, విశ్వాసం, నిరతి, మతం, ఆధ్యాత్మికం, మోక్షం – వంటి వాటి పట్ల ఆసక్తి’ని వెల్లడిస్తుంది. సాహిత్య పదాలలో భక్తి అంటే, “శరణాగతి, నిరతి, విశ్వాసం, విధేయత, అనుబంధం”. సరళంగా చెప్పాలంటే, భక్తుడు అంటే ఆధ్యాత్మికంగా లేదా భౌతికంగా భగవంతుని ఆరాధన కోసం తనను తాను సమర్పించుకునే వ్యక్తి అని అర్థం. వేద సంస్కృత గ్రంథాలలో, భక్తి అనే పదం, సాధారణ మానవ సంబంధాలలోని – ప్రేమికుడు, స్నేహితుడు-స్నేహితుడు, పాలకుడు, తల్లిదండ్రులు మరియు పిల్లల మధ్య ఉండే సంబంధాల వలె – “అనుసరణ, నిరతి, ప్రేమ, అనురక్తి” అనే సాధారణ అర్థాన్ని కలిగి ఉంటుంది. ఆధ్యాత్మిక గురువు పట్ల భక్తిని గురు-భక్తి అనీ; దేవునిపై భక్తిని దైవభక్తి అనీ, మరో పద్ధతిలో నిర్గుణ భక్తిగా పేర్కొనవచ్చు.

నాకు కలిగిన అత్యంత గాఢమైన అనుభవాన్ని అక్షరాల ద్వారా లేదా చిత్రాల ద్వారా వర్ణించలేను. వాటిలో కొన్నింటిని ఇక్కడ వ్రాస్తున్నాను, వాటి లోతుని, విస్తృతిని గ్రహించాలంటే మీరు స్వయంగా ప్రయాగ్‍రాజ్‍లో ఉండితీరాలి. అక్కడ నేను వేలాది మంది యువకులు, ముసలివారు, పసిపిల్లలు, బలహీనులు, బలవంతులు, అతి బలహీనులు, అతి బలవంతులు, ధనవంతులు, పేదవారు – అందరూ ఒక్కటిగా ఏకమవడాన్ని చూశాను. జాతి, వర్ణం, సంపద-హోదా మొదలైన ఆధారంగా ఎటువంటి విభజన, వర్గీకరణ లేదు. పూర్తిగా ధర్మం, భక్తిపై దృష్టి కేంద్రీకరించబడింది, మరే ఇతర పట్టింపులు లేవు. వాతావరణం, ఆహారం, శారీరిక అసౌకర్యాలు ఇవేవీ కూడా ఆటంకాలు కావు. అంటే, ఇలాంటివి ఎదురవవని కాదు, కానీ పవిత్రమైన స్నానం, దానధర్మాలకున్న ప్రాధాన్యత ముందు ఇవి చాలా చిన్న విషయాలు.

దేశవ్యాప్తంగా, అవిభాజ్య భారతదేశమంతటా ఉన్న అసంఖ్యాకమైన తీర్థ స్థలాలు, హిందూ యాత్రాక్షేత్రాలను పరిశీలిస్తే, అవన్నీ నీటి వనరులు, నదులు, ‘ప్రకృతి’, ‘రమణీయ దృశ్యాలు’ అధికంగా ఉన్న ప్రదేశాలలో ఉన్నాయని గ్రహిస్తారు, తదుపరి. విశాలమైన ‘ప్రకృతి’ పథకంలో మన ఉనికి ఎంత అల్పమో అవగతమవుతుంది. అయినప్పటికీ మనం దానిలో విడదీయలేని భాగమే. ఇతర జీవులు అన్ని కూడా తమ ఇంద్రియాలతో, అవయవాలతో తమ స్వంత మార్గాల్లో గ్రహిస్తాయి. అవిభక్త భారత్‌లో దాదాపు 87000 పుణ్యక్షేత్రాలు ఉండేవని, ఇప్పుడు కొన్ని మాత్రమే మిగిలి ఉన్నాయని చదివాను.

ఇటువంటి ఆధ్యాత్మిక ఉత్సవాలు ఇతరులని మనతో చేరడానికి మరింత స్ఫూర్తినిస్తాయని ఆశిద్దాం. మిగిలి ఉన్న వాటిని క్రమంగా బలోపేతం చేసి, కోల్పోయిన వాటిని సజీవంగా తీసుకువద్దాం.

ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమః శివాయ.

(ఫోటోలు: సంజీవ్ మెహతా, అమిత్ బక్షి)

Exit mobile version