Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

కాజాల్లాంటి బాజాలు-149: మగవాళ్ళకి మాత్రమే

[ప్రముఖ రచయిత్రి జి.ఎస్. లక్ష్మి సంచిక పాఠకులకు అందిస్తున్న శీర్షిక ‘కాజాల్లాంటి బాజాలు’.]

దయం పనంతా అయ్యేక మెసేజెస్ చూద్దామని తీరుబడిగా కూర్చుని ఫోన్ తీసేనో లేదో ముందుగా కనపడింది వదిన దగ్గర్నించి వచ్చిన మెసేజే.

దానిలో మొట్టమొదటగా కనిపించిన మాటే ‘మగవాళ్లకి మాత్రమే’ అన్నది. అది చూడగానే నాకు భలే ఆశ్చర్యం అనిపించింది.

“వదినా, ‘మగవాళ్లకి మాత్రమే’ అని రాసి అది నాకు పంపేవేవిటీ!” అంటూ వదినని వేళాకోళం చేద్దామనిపించింది. కానీ అదేదో చాలా పెద్ద మెసేజ్‌లా ఉండడం వల్ల అంత చదివే ఓపిక లేక విషయవేవిటో వదిననే అడిగేద్దాం అని వదినకి ఫోన్ చేసేను.

“అప్పుడే చదివేసేవా!” ఫోన్ ఎత్తగానే వదిన ఆత్రంగా అడిగిన ప్రశ్నకి నాకు నవ్వొచ్చింది.

“ఎలా చదవను వదినా, అది మగవాళ్లకి మాత్రమే అని ఉంటే నువ్వు పొరపాటుగా నాకు పంపేవేమోనని నేను చదవలేదు.” అన్నాను నవ్వుతూ.

“నీకన్నీ ఇలాంటి అనుమానాలే. అది నేను రాసిన ఆర్టికిల్‌కి హెడ్డింగ్. దానిని ఓ పత్రిక్కి పంపుదావనుకుంటున్నాను. నువ్వు ఓసారి చూసి బాగుందనేస్తే పంపించేస్తాను.” కాన్ఫిడెంట్‌గా అన్న వదిన మాటలకి నాకు నవ్వొచ్చింది.

“ఎందుకు నవ్వుతున్నావ్!”

వదిన అడిగిన దానికి నవ్వాపుకుంటూ చెప్పేను.

“మరి నవ్వక ఏం చెయ్యనూ! రాసినదానివి నువ్వు మహిళవి, చదవమన్న నేనూ మహిళనే.. కానీ రాసింది మాత్రం ‘మగవాళ్లకి మాత్రమే’. మరి నవ్వు రాక ఏవొస్తుందీ! మగవాళ్ల గురించి వాళ్లకన్న మహా మనకి ఎక్కువ తెలిసినట్టు ఎందుకీ రాతలు వదినా.. ఏదో మనకి కావల్సినవి రాసుకుంటే వ్రతం చెడ్డా ఫలం దక్కుతుంది.”

“అదిగో, అక్కడే నాకు మండేది. మగవాళ్ళ గురించి మనకి కాక ఎవరికి తెలుస్తుందీ! వాళ్ళని కని పెంచి పెద్ద చేసేది మనవే కదా! ఎటొచ్చీ పెద్దవాళ్లయేక వాళ్ళేదో మనని ఉద్ధరించేస్తున్నట్టు గొప్పగా ఫీలయిపోతుంటారంతే. ఇంతకీ ఆ ఆర్టికిల్ తొందరగా చదివి చెప్పు, ఈ రోజు పంపించెయ్యాలి.”

“అసలు దేని గురించి వదినా ఆర్టికిల్!”

“అదే స్వర్ణా, మనం మగవాళ్ళనుంచి ఏవి కోరుకుంటామో మనకి మాత్రమే తెలుస్తుంది కదా! కానీ, సాధారణంగా మగవాళ్ళు మనకి చీరలూ, నగలూ ఇచ్చేస్తే చాలనుకుంటారు. ఇదివరకేమో కానీ ఇప్పుడు రోజులు మారాయి. ప్రపంచం అంతా మొబైల్ ఫోన్ ద్వారా మన గుప్పిట్లో పెట్టుకుని, ఎడ్యుకేట్ అవుతున్న మనం చాలా ఎదిగిపోయేం. ఆ సంగతి మగవాళ్లకి ఇంకా తెలీటంలేదు. టీవీలో కాశ్మీర్ సమస్య చర్చలు వినకపోయినంతలో ఎప్పట్లాగే భార్య ఏవీ తెలీని మనిషనీ, వాళ్ళే ఎడ్యుకేట్ చెయ్యాలనీ అనుకుంటుంటారు.

కానీ స్మార్ట్ ఫోన్‌లో కొత్త మోడల్స్ ఎన్నొచ్చేయో, ప్రపంచవ్యాప్తంగా మన దేశం ఎంతగా అభివృద్ధి చెందుతోందో, మన ఇంట్లో ఆడపిల్లలకీ, మగపిల్లలకీ మైండ్‌సెట్లు ఎలా మారిపోతున్నాయో, నిన్న పెళ్ళైనవాళ్ళు ఇవాళ విడాకులకోసం కోర్టుకి ఎందుకు వెడుతున్నారో, అంతే కాదు యాభైయేళ్ళ సంసార జీవితం గడిపిన భార్య భర్త నుంచి విడాకులు కావాలని ఎందుకు కోరుకుంటోందో, మనింట్లో కన్న పక్కింట్లో గులాబీలు అంత పెద్దగా పూయడానికి వాళ్ళేమి మందు వేస్తున్నారో, మొన్న పంకజం పిన్ని చేసిన ఇడ్లీలు అంత మృదువుగా ఎలా వచ్చేయో, అదేదో కొత్తగా పెట్టిన రెస్టరెంట్‌లో వాడు చేసిన కొత్త అయిటమ్ ‘సాంబార్లో గులాబ్ జామూన్’ అంత ఫేమస్ ఎందుకయిందో, నిన్న రోడ్డు పక్కన పెట్టిన ఇడ్లీబండిలో వాడు చేసిన ‘బొగ్గు ఇడ్లీ’కి ఇంత డిమేండ్ ఎందుకొచ్చిందో, ఇలా ఒకటేవిటి.. బోల్డు విషయాలు మన బుర్రలో తిరుగుతుంటాయి. దీనిని బట్టి మనం మగవాళ్లనుంచి ఏవి ఆశిస్తున్నామో కనిపెట్టగలిగే సత్తా వాళ్ళ కెక్కడ ఉందీ!”

ఊపిరి తిరక్కుండా చెపుతున్న వదిన మాటలని గట్టిగా అరుస్తూ మధ్యలోనే అడ్డుకున్నాను.

“ఆగాగు వదినా. ఈ సాంబార్లో గులాబ్ జామూన్లేవిటీ.. బొగ్గు ఇడ్లీ లేవిటీ.. ఆ మాటలు వింటుంటేనే కడుపులో తిప్పేస్తోంది.”

“అరే స్వర్ణా, నువ్వు కూడా ఈ మగాళ్లలాగే తయారయ్యేవా! ఎంతసేపూ ఆఫీసు పన్లూ, ఇంటి కొచ్చేక క్రికెట్ మేచులూ, అవీ కాకపోతే న్యూస్ చానల్స్‌లో డిస్కషన్లూ.. ఇవి దాటి వాళ్ళు కొత్తగా ఆలోచించరు. కాస్త అప్డేట్ అవు స్వర్ణా. నువ్వు రీల్స్ చూడవా.. ప్రపంచంలో ఏ మూల ఏమవుతోందో చిన్న చిన్న రీల్స్‌లో భలే చూపిస్తారు. ఈమధ్య ఒక రెస్టరెంట్‌లో ఒక చెఫ్ చేసిన రెసిపి అదిరిపోయిందిట.. అదే సాంబార్‌లో గులాబ్ జామూన్..”

“యాక్.. ధనియాలూ, మిరియాలూ వేసిన సాంబార్ పొడితో, ఘాటుగా ఉండే సాంబార్‌లో నోట్లో వేసుకుంటే కరిగిపోయే గులాబ్ జామూనా..!”

మధ్యలో అడ్డుకున్న నన్ను ఆపి వదిన చెప్పింది.

“మరేవనుకున్నావ్. ‘అలాంటి ఘాటైన సాంబార్‌లో మధ్యలో తియ్యగా గుటుక్కున మింగేసే గులాబ్ జామూన్ నోట్లో పడితే ఎంత బాగుందో’ అంటూ ఎంత మంది దానిని ఆకాశానికి ఎత్తేసేరో. దానికోసం ప్రత్యేకం ఆ రెస్టరెంట్ కి క్యూలు కూడా కట్టేసేరు. అసలు అంతకన్న విడ్డూరం బొగ్గు ఇడ్లీ..”

“బొగ్గు ఇడ్లీయా.. పేరు వినడానికే ఎలాగో ఉంది”

“మరే.. ఓ రోడ్డు పక్కన పెట్టుకున్న ఇడ్లీ బండివాడు కనిపెట్టేడుట ఇది. ఆ బొగ్గు మామూలుబొగ్గు కాదుట. కొబ్బరిచిప్పలు కాల్చితే వచ్చిన బొగ్గుట. మామూలు ఇడ్లీలు రెండు ఇడ్లీలూ నలభై రూపాయిలైతే నల్లగా ఉన్న ఆ ఇడ్లీలు రెండూ యాభై రూపాయిలుట. రోడ్డు పక్కనున్న ఆ బండిలో ఆ ఇడ్లీలు కొనుక్కుంటుంటే అక్కడ ట్రాఫిక్ కూడా జామ్ అయిపోతోందిట..

ఇలాంటివన్నీ మనకి తెలుస్తాయి. కానీ, అవేవిటో మనం మగవాళ్లకి చెప్పవాయే.. వాళ్ళే గ్రహించా లనుకుంటాం. కానీ నోరు విప్పి చెప్పనిదే మన మనసులో మాట వాళ్లకి ఎలా తెలుస్తుంది చెప్పూ.. కాని మనం చెప్పం. అక్కడే వస్తోంది ఇద్దరి మధ్యా కమ్యూనికేషన్ గేప్. దాంతో అలకలూ, కోపాలూ, పోట్లాటలూ.. ఆఖరికి విడిపోడాల దాకా నడుస్తోంది.

ఏఏ మహిళలు దేని గురించి మాట్లాడుతుంటారో విని, ఆ మాటల్లోని సారాంశం గ్రహించి, వాళ్ళకి కావల్సినవి తెచ్చివ్వడం ఆ ఇంటి మగవాడి బాధ్యత. అందుకని అవన్నీ మగవాళ్లకి తెలీవు కనక అదంతా ఒక లిస్ట్ లా రాసి, వాళ్లకి మాత్రమే అవసరం కనక ఆ ఆర్టికల్‌కి ‘మగవాళ్లకి మాత్రమే’ అని పేరు పెట్టేనన్న మాట.”

వదిన ఊపిరి పీల్చుకుందుకు కాసేపాగింది.

వింటున్న నాకు ప్రపంచమంతా ఒక్కసారి బుర్రలో తిరిగినట్తైపోయింది.

ఇప్పుడిదంత అవసరమా! అంత కష్టపడి, ఆడవాళ్ల మనసులో ఏవుందో కనుక్కుని మగవాడు తెచ్చిచ్చే బదులు ఆడవాళ్ళే ‘మాకిది కావాలి’ అని చెప్పేస్తే ఒక్క మాటలో తేలిపోతుంది కదా! ఆ చెప్పేదేదో ఈ విషయం ఆడవాళ్లకి చెప్పక ఏదో దాగుడుమూత లాడినట్టు, ‘కనుక్కోండి చూద్దాం’ పజిల్ లాగ ఇంత డొంకతిరుగుడుగా చెప్పాలా! అందులోనూ ఆర్టికల్ కూడా రాసి. దీనిని ఏ పత్రికవాడు వేసుకుంటాడూ..

ఏవో వేసుకుంటాడేమో.. ఈ రోజుల్లో ఏదీ నిర్ధారించి చెప్పలేం. ఏ ఆర్టికలూ దొరకకపోతే దీనినే వేసుకుంటాడేమో.. రేప్పొద్దున్న ఈ ఆర్టికల్ బాగుందని బోల్డు ఉత్తరాలు వస్తాయేమో.. ఇలాంటివి ఇంకా ఇంకా రాసి పంపించండని వదినని చాలా పత్రికలవాళ్ళు అడుగుతారేమో.. అలా అలా వదిన ఫేమస్ అయిపోతుందేమో.. ఏమో ఎవరైనా గొప్ప బిరుదు కూడా ఇచ్చెయ్యొచ్చు.. రోజులలా వున్నాయి. దేన్నీ కాదనుకోలేం..

ఆలోచనల్లో ఎక్కడికో వెళ్ళిపోయిన నన్ను ఫోన్‌లో వదిన, “స్వర్ణా.. మాట్లాడవేం.. ఇంత గొప్ప ఆలోచనలతో నీ వదిన ఆర్టికిల్ రాసిందని నువ్వు అవాక్కయ్యావా!” అనడుగుతోంది.

“అబ్బే, నీ గొప్ప ఆర్టికల్‌కి కాదొదినా.. రేప్పొద్దున్న నువ్వందుకోబోయే బిరుదులు తల్చుకుని అవాక్కయ్యాను.”

అనబోయి, బలవంతంగా నోట రాబోయే మాట నాపుకుని, “ఇదిగో వదినా, ఇప్పుడే చదివి చెపుతాను.” అంటూ ఫోన్ పెట్టేసి వదిన రాసిన ఆర్టికల్ చదవడానికి ధైర్యం తెచ్చుకుందుకు గ్లాసు నిండా చిక్కటి కాఫీ కలుపుకుని, తెచ్చుకుని, కూర్చుని, మొబైల్ చేతిలోకి తీసుకున్నాను.

Exit mobile version