Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మధ్య తరగతి

[కె.వి.యస్. గౌరీపతి శాస్త్రి గారు రచించిన ‘మధ్య తరగతి’ అనే కవితని పాఠకులకి అందిస్తున్నాము.]

వేకువ సూరీడు
రేతిరి చంద్రుడు
తేడాల నెరుగని
కార్ఖానాల్లో
కార్యాలయాల్లో
గృహాలయాల్లో
ప్రరిభ్రమిస్తూ
పరిక్రమిస్తూ
బ్రతుకు బాటలో
మెతుకు వేటలో
మా రుధిరం
బొట్టు బొట్టు
మా స్వేదం
చుక్క చుక్క
మా కండలు
ముక్కలు చేసి
పైసలన్నీ కూర్చి
రూపాయలుగా
నెలసరి బత్తేల
కూడ బెడుతూ
కడుపు మేతకు
బ్రతుకు తెరవుకు
పొదుపు పేరున
ప్రోది చేయుచు
పొదుపు ఖాతాల
నిలువ చేయగా
పన్ను పోటులు
అధిక ధరలు
నెట్‌వర్క్ మోసాలు
బ్యాంకుల వడ్డీలు
సేవల రాజకీయాల
నేరచరితుల ప్రవేశాల
ప్రభుత్వ విధానాలు
దోపీడీ మాటు నేతలు
విధించే సేవా పన్నులు
నడుమ నలిగే జీవితాలు
మధ్యతరగతి బ్రతుకులు
ఎదగ లేక ఆవేదనలు
దిగలేక పడేటి దిగులు
ఎప్పటికి తీరు వేదనలు
ఏనాటి కగుపడు వెలుగులు
సమాధాన మెరుగని ప్రశ్నలు
మధ్య తరగతి జీవితాలు.

Exit mobile version