[‘మధ్య తరగతి మందహాసం – బెహరా వెంకట సుబ్బారావు సర్వలభ్య రచనలు’ అనే పుస్తకాన్ని సమీక్షిస్తున్నారు ప్రొ. సిహెచ్. సుశీలమ్మ.]
“అర్థం లేని మూఢాచారాలకి, అనర్థాలను తెచ్చిపెట్టే పాత పద్ధతులకి ఈ సమాజాన్ని దూరం తీసుకుపోవాలి. విశ్వ శ్రేయస్సు కలిగించే మార్గంలో ఈ సమాజాన్ని పయనింపజేయాలి. సాంఘిక సమస్యల చిక్కుముడిని విప్పాలి సాహిత్యం. జనబాహుళ్యం అంతటినీ నూరు శాతం మార్చలేకపోవచ్చు, కానీ మార్పుకు పునాది వేసేది సాహిత్యమే..” అంటారు ప్రముఖ కథా రచయిత కీ.శే. శ్రీ బెహరా వెంకట సుబ్బారావు.
తన 40 ఏళ్ల సాహితీ సేవలో దాదాపు 200 పైగా కథలు, రెండు సీరియల్స్ వ్రాశారాయన. అన్నీ కూడా ఆనాటి వివిధ తెలుగు దిన, వార, మాస పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. 30 కథలకు పైగా బహుమతులు సంపాదించుకున్నవి.
ముఖ్యంగా బెహరా వారి కథల్లో మధ్యతరగతి మనిషి కష్టాలు, మోసపూరితమైన సంఘటనలకి లోలోపల కృంగిపోవటం, ఉన్నంతలో ఆనందంగా బ్రతకాలన్న ఆరాటం, నిజాయితీని నమ్ముకున్నవారు, ఉపాధ్యాయులు, టీ కొట్టు పెట్టుకున్న దిగువ మధ్య తరగతి వారు, గుమాస్తాలు, పోలీసు కానిస్టేబుల్, ఎస్సై తప్ప ఉన్నతవర్గాలవారు ఈ కథల్లో కనబడరు. కథల్లో మధ్యతరగతి మనుషుల్లో మిగిలివున్న మానవీయ దృక్పథం విస్తృతంగా చెప్పాలన్నది బెహరా వారి ప్రధానోద్దేశం. తిరుగుబాటు, హింస, రక్తపాతం విశృంఖలంగా వర్ణించి, కులమత విద్వేషాలను మరింత రంగు పులిమి భయోపేతంగా వివరించి, ఎలాగైనా బహుమతులు పొందాలన్న భావన ఎక్కడా కనబడదు. మనుషుల మధ్య అంతరాలు, తరం తరంకి అంతరాలు ఎక్కువగా చెప్పడం వల్ల కాబోలు చాలా కథలు ‘అంతరాలు’ అనే శీర్షికతో ఉంటాయి.
పోస్టల్ డిపార్ట్మెంట్ లో పనిచేసి, హెడ్ పోస్ట్ మాస్టర్‌గా పదవీ విరమణ చేసినందువల్ల ఉద్యోగ రీత్యా ఎందరో మనుషుల్ని కలవడం, మనస్తత్వాలను పరిశీలించడం, వాటినే కథా వస్తువులుగా స్వీకరించి రాయడం వల్ల సామాన్య ప్రజల అతి సాధారణ జీవితాలే వీరి కథల్లో ప్రతిబింబించాయి. మామూలు మనిషిలోని అంతర్యం మామూలుగానే సాగిపోవచ్చు, లేదా పైకి కనిపించేది కాకుండా ఆంతర్యంలో ఒక ముసుగు వేసుకొని ఉండవచ్చు అని రచయిత అభిప్రాయం. కొన్ని కథల్లో ఇది బాగా స్పష్టం అవుతుంది. మామూలు ఆఫీసులు, గుమస్తాలు, బస్సులు రైళ్లు, రిక్షాల్లో ప్రయాణికులు కనిపిస్తారు కానీ విమానాల్లో తిరిగే అత్యంత ధనవంతులు కనిపించరు. బెహరా వారి డెభై మూడు కథల్ని సర్వ లభ్య రచనలు పేరిట 480 పేజీలతో పుస్తకం తీసుకువస్తు ‘మధ్యతరగతి మందహాసం’ అని శీర్షిక నుంచడం సమంజసంగా ఉంది.
సినిమాకు వెళదామని భార్యా పిల్లలతో చెప్పి, ఆఫీసరు అర్జెంట్ పని చెప్పడంతో సమయానికి ఇంటికి వెళ్ళలేక పోయిన ఒక గుమస్తా.. పైకి ‘అమాయకుడు’ గా కనిపించే ఒక ‘మాయకుడు’, అల్లుడికి రాయల్ ఎన్ఫీల్డ్ బండి కొనాలనుకునే ఆఫీసరు – నోట్ బుక్ కొనమని వారం రోజుల నుండి పోరుతున్న ఆఖరబ్బాయి గుర్తుకు వచ్చిన గుమస్తా, కూతురికి పెళ్ళి చేయడానికి చేసిన అప్పులు తీరకుండానే కూతురు పురిటికి వస్తే చేబదుళ్ళ కోసం బయలుదేరే రంగనాథం, బాగా చదువుకుంటూ సంస్కారం ఉట్టిపడే తలారి కోటేశు, అర్ధరాత్రి వర్షంలో తల్లీకూతుళ్లను క్షేమంగా ఇంటికి చేర్చే క్రమంలో ఒక దుర్మార్గుడి వల్ల గాయపడినా కూడా, వారు కృతజ్ఞతతో ఎక్కువ ఇస్తానన్నా తన బాడుగ డబ్బులు మాత్రమే తీసుకున్న నిజాయితీ గల రిక్షా రావులు, సైకిళ్ళు, పెట్రోమాక్స్ లైట్లు అద్దెకిచ్చే బ్రహ్మం, అమ్మగారు ఇచ్చిన చీరను పండక్కి ఇంటికి వచ్చిన ఆడపడుచుకి బొట్టుపెట్టి ఇచ్చేసిన ‘దొడ్డమనసు’ గల గౌరి, కిళ్లీకొట్టు అప్పలస్వామి, కాఫీకొట్టు కొండమ్మ, తన శిష్యుడు మంచి పొజీషన్లో ఉండి, ఇంటర్వ్యూలో తన కొడుకుకి ఉద్యోగం ఇచ్చే ఉదారత్వం ఉన్నా, అతని ఇంటికి వెళ్ళి ‘క్వాలిఫికేషన్ ప్రకారమే ఉద్యోగం ఇవ్వాల’ని కర్తవ్యం బోధించిన మాస్టారు.. వంటి సంస్కార సుగంధం వెదజల్లే మంచి పాత్రలను సృజించిన ఉత్తమ రచయిత శ్రీ బెహరా వెంకట సుబ్బారావు.
పద్నాలుగేళ్ళ కోటేసు తల్లి తండ్రి అండగా నిలబడి, రైల్లో తినుబండారాలు అమ్ముతూ హుషారుగా ఉండే కుర్రాడు. అమ్మ చేసే బజ్జీలు, గారెలు, పకోడీలు అమ్మి తల్లికి చీర కొనాలనే కోరిక. షావుకారు దగ్గర అప్పు చేసి తెచ్చిన సరుకులకు నిజాయితీగా ఎంతో కొంత చెల్లు వేస్తూ, మళ్లీ అప్పు తెస్తూ అతని నమ్మకం పొందాడు. కోటేసు కథను ఏషియన్ లాంగ్వేజెస్ బుక్ సొసైటీ ప్రచురించింది. సుబ్బారావు గారి చాలా కథలు కన్నడం లోకి అనువాదమయ్యాయి. అనేక సన్మానాలు, సత్కారాలు పొందిన శ్రీ బెహరా వెంకట సుబ్బారావు 1998 లో కన్నుమూసారు. వారి మరణానంతరం వారి కథలన్నీ పుస్తక రూపంలో తీసుకుని వచ్చిన వారి కుమారుడు బెహరా సత్యనారాయణ మూర్తి, బెహరా సత్యనారాయణ మూర్తి గారి సతీమణి పద్మావతి, అభినందనీయులు. ముఖ్యంగా కథల పేర్లు, అవి ప్రచురింపబడిన పత్రికలు, తేదీల వారిగా ఇవ్వడమే కాక, ఆ కథల సారాంశాన్ని ఒకటి రెండు వాక్యాల్లో ముందుగా చెప్పడం చూస్తుంటే, మూర్తిగారికి తండ్రి గారి పట్ల ఉన్న గౌరవం, కథల పట్ల ఉన్న ఆసక్తి తెలుస్తోంది. తండ్రినే మర్చిపోతున్న ఈ రోజుల్లో తండ్రి కథలనన్నిటినీ ఒకచోట చేర్చి, తన ఖర్చుతో అచ్చు వేయించి, తండ్రి పరిచయస్థులను కలిసి మాట్లాడి, కొందరిచే ముందు మాటలు రాయించి, ఇంత చేస్తూ కూడా, మంచి రచయిత అయిన తండ్రికి ఇంకా తానేం చేయలేక పోతున్నానని ఆరాటపడే మూర్తి గారు తెలుగు సాహిత్యం లోకంలో ఎందరికో ఆదర్శవంతుడు అని చెప్పక తప్పదు.
***
(బెహరా వెంకట సుబ్బారావు సర్వలభ్య రచనలు)
సంపాదకులు: బెహరా పేరిందేవి, బెహరా సత్యనారాయణమూర్తి, డా. వి. వి. వెంకట రమణ
ప్రచురణ:అభ్యుదయ రచయితల సంఘం, విజయనగరం జిల్లా
పేజీలు: 480
వెల: ₹ 500
ప్రతులకు:
అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు
~
బెహరా పేరిందేవి
ఫ్లాట్ నెం. 1B, శ్రీనివాసా ఎన్క్లేవ్,
ప్రహ్లాదపురం
విశాఖపట్టణం 530027
ఫోన్: 9848318204, 8309574116
~
బెహరా లక్ష్మీ దివ్య స్ఫూర్తి
ఫోన్: 7396627924
~
ఆన్లైన్లో:
https://www.amazon.in/Madhya-Taragati-Mandahasam-Behara-Venkata/dp/B0FHQQ84LD
~
సంపాదకులు శ్రీ బెహరా సత్యనారాయణ మూర్తి గారి ప్రత్యేక ఇంటర్వ్యూ:
https://sanchika.com/special-interview-with-mr-behara-satyanarayana-murthy/