[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సరికొత్త సినిమా పాటల శీర్షిక.]
చిటపట చినుకులు పడుతూ ఉంటే
చెలికాడే సరసన ఉంటే
చెట్టాపట్టగ చేతులు పట్టి,
చెట్టు నీడకై పరుగిడుతుంటే
చెప్పలేని ఆ హాయి, ఎంతో వెచ్చగా ఉంటుందోయి..
‘వాన పాట’ ముఖ్యంగా ‘వానలో నాయికా నాయికలు’ అనగానే ఒక తరం వారికి ప్రథమంగా గుర్తకు వస్తుందీ పాట.
నిజానికి వానలో నాయికా నాయికలు తడుస్తూ పాటలు పాడకోవటం కల్పతరువు లాంటి రొమాంటిక్ సన్నివేశం. పాటకు పాట, ప్రేమకు ప్రేమ, గిలిగింతలకు గిలిగింతలు. ‘వర్షం’ పాట నిజానికి ఎటు పడితే అటు వంచుకుని తీగలా సాగించి, పలు విభిన్న రూపాలలో తెరకెక్కించి ప్రేక్షకులను అలరించే వీలునిస్తుంది. అందుకే సినిమాల్లో విషాద గీతాలు, భక్తి గీతాలు వంటి పలు రకాల గీతాలు అదృశ్యమైపోయినా ‘వాన’ పాటలు మాత్రం ఇంకా రాజ్యమేలుతూనే ఉన్నాయి. నాయిక తడుస్తూ పాడినా, నాయకుడు తడుస్తూ పాడినా, ఇద్దరూ తడుస్తూ పాడినా, ఒకరు వానను చూస్తూ గతాన్ని గుర్తు తెచ్చుకుంటూ పాడినా, ఏమీలేకపోతే, ఒక గుంపునేసుకుని వర్షంలో తడుస్తూ, నృత్యం చేస్తూ పాడినా, ఈనాటికీ ‘వాన’ పాటల జోరు ఏ మాత్రం తగ్గలేదు. అధికశాతం వాన పాటలు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. కానీ వర్షాన్ని రొమాన్స్ పాట పాడేందుకు వాడుకున్న తొలి సినిమా 1935లో విడుదలయిన ‘టాప్ హాట్’ (Top Hat).
అనుకోని పరిస్ధితులలో నాయికా నాయకులు కుంభవృష్టిలో ఇరుక్కుంటారు. ఇబ్బందికరమైన సన్నివేశం. ఉరుముల శబ్దానికి నాయిక బెదురుతుంది. కానీ ఆ ఇబ్బందికరమైన సన్నివేశాన్ని నాయకుడు తన ప్రేమని వ్యక్తపరచటానికి వాడుకుంటాడు. నాయిక అతడి ప్రేమను ఆమోదిస్తుంది. దాంతో చక్కటి రొమాంటిక్ సన్నివేశం తయారయిపోయింది.
ఈ సన్నివేశంలో గమనించవలసిందేమిటంటే, నాయికా నాయికలు ఒక ‘gazebo’ లో, అంటే, తోటలో నడుమ అన్ని వైపులా తెరచి ఉన్న కట్టడంలో ఉంటారు. అది అన్ని వైపులా తెరచి ఉండవచ్చు, లేదా బయట ప్రకృతి దృశ్యాలను చూస్తుండేందుకు అద్దాలుండవచ్చు. నాయికా, నాయకులు, వర్షం, గజెబోలో పాట. ముందుగా గుర్తుకు వచ్చేది ‘1942 ఎ లవ్ స్టోరీ’ లోని మధురమైన యుగళగీతం ‘రిమ్ ఝిమ్ రిమ్ ఝిమ్, రుంఝం రుంఝం.. భీగీ భీగీ ఋత్ మే తుమ్ హమ్, హమ్ తుమ్’. అయితే అంతకన్నా ముందు ‘ఝుక్ గయా ఆస్మాన్’ అన్న సినిమాలో నాయిక నాయకుడిని తలచుకుంటూ, ఇదే ‘గజెబో’లో ‘మేరే తుమ్హారే బీచ్ మే’ అంటూ పాడుతుంది. ఆ సినిమాలో నాయకుడు మరణిస్తాడు. కానీ తిరిగి భూమికి వస్తాడు. అతడినే తలచుకుంటూ నాయిక ఒంటరిగా పాడటం చూస్తుంటాడు.
‘రోటీ కపడా ఔర్ మకాన్’ సినిమాలో నాయకుడు వర్షంలో తడిసేందుకు ఇష్టపడడు. నాయికనే ‘హాయ్ హాయ్ యే మజ్‌బూరీ’ అని పాడుతూ, నాయకుడిని దూషిస్తూ, వర్షంలోకి రమ్మని పిలుస్తుంది.
ఈ సందర్భాలకే పలు భిన్నమైన మార్పులు, చేర్పులు ఉన్నాయి. కానీ, ఒకప్పుడు నాయిక నాయకులు కలవగానే వర్షం వచ్చేది. కొందరు వర్షంలో తడుస్తూ పాడితే, మరి కొందరు వర్షంలో తడిసిన తరువాత పాడేవారు. ‘కాలాబాజార్‘ సినిమాలో, నాయికా నాయకులు వర్షంలో తడుస్తూ, తమ గత పరిచయాన్ని గుర్తు చేసుకుంటున్నారన్నదానికి సూచనగా నేపథ్యంలో ‘రింఝిం కే తరానే లేకే ఆయీ బర్సాత్’ అన్న మధురమైన యుగళ గీతం వస్తుంది. కొన్ని సినిమాల్లో వర్షం తరువాత కథ మలుపు తిరిగేది. ఇంకొన్ని సినిమాల్లో నాయకుడు, నాయికల ప్రథమ పరిచయం వర్షంలోనే సంభవించేది. ‘చల్తీ కా నాం గాడీ‘ సినిమాలో నాయిక కార్ పాడైతే రిపేర్ కోసం నాయకుడి దగ్గరకు వస్తుంది. అదే ప్రథమ పరిచయం. పూర్తిగా తడిసిన నాయికవైపు దొంగ చూపులు చూస్తూ ‘ఎక్ లడ్కీ భీగీ భాగీసీ’ అంటూ పాడతాడు హీరో. ‘బర్సాత్ కీ రాత్‘ సినిమాలో నాయకుడు వర్షం వస్తున్నదని తలదాచుకున్న చోటికి నాయిక వస్తుంది. మరుసటి రోజు రేడియోలో నాయకుడు ‘ జిందగీభర్ నహీ భూలేంగి వో బర్సాత్ కీ రాత్’ అని పాట పాడితే విన్న నాయిక ఆ రాత్రి తనపక్కన వున్నది తాను అభిమానించే కవి అని గుర్తిస్తుంది. ప్రేమకథ ఆరంభమవుతుంది. నాయికానాయకులు వర్షం వస్తుంటే గుహలో దాక్కుంటే, ‘ భీగీరాత్‘ సినిమాలో మీనాకుమారి ‘ దిల్ జో న కహెసకా’ అని పాడుతూ నాయకుడిని రెచ్చగొడితే, అలాంటి సందర్భంలోనే, ‘గుడ్డి‘ జయా భాదురి, ‘బోలెరే పప్పీహరా’ అని మధురంగా పాడి నాయకుడిని అలరిస్తుంది. అయితే, అధిక శాతం వర్షం పాటలు అత్యంత ప్రజాదరణ పొందాయి. ఈ వర్షం పాటల చిత్రీకరణలో కొందరు దర్శకులు అత్యద్భుతమైన ప్రతిభను ప్రదర్శించారు. అధిక శాతం ప్రతిభ మాత్రం గేయ రచయితలకు దక్కుతుంది. వర్షంలో ‘చిక్కుకున్న రొమాంటిక్’ పాట అన్న సందర్భాన్ని గేయ రచయితలు తమ రచన ప్రతిభతో పలు విభిన్నమైన రూపాల్లో దర్శింపచేశారు.
అయితే, ఈ వర్షపు సన్నివేశాలకు ప్రేరణ నిచ్చిన ఆంగ్ల చిత్రం ‘టాప్ హాట్’ లో పాట చిత్రీకరణ సాధారణంగా ఉంటుంది. అక్కడ ప్రాధాన్యం సందర్భానికే, ఆ సందర్భంలో నాయకుడి ప్రతిపాదనను, నాయిక ఆమెదించటానికి మాత్రమే. దాంతో కెమెరా కోణాల్లో ఎలాంటి ప్రత్యేకత ఉండదు. కెమెరా అధిక శాతం నిశ్చలంగా ఉంటుంది. అప్పుడప్పుడు మాత్రమే కదలుతుంది.
ఆ తరువాత వారి నృత్యం చూపిస్తుంది. అంటే, సన్నివేశాన్ని రూపొందించేప్పుడే వారికి పాటలో భావం, నటీనటులు ప్రదర్శించే నటనలు సన్నివేశాన్ని రక్తి కట్టిస్తాయి తప్ప భయంకరమైన కెమేరా కదలికలు, కోణాలు కావన్నది స్పష్టంగా అర్థం చేసుకున్నారు. అదీ గాక, ఈ సన్నివేశం ఆ కాలం వారిని ఎంతగానో ఆశ్చర్య పరచింది. మాట్లాడుతూ, మాట్లాడుతూ, మాటనే పాటగా మార్చటం ఆ కాలంలో ఎంతో సంచలనం సృష్టించింది. ఇది ప్రధానంగా గమనించాల్సిన అంశం. ‘వాన’ పాటల్లో అత్యంత ప్రాధాన్యం పాటలో పదాలు వ్యక్తపరచే భావాలదే.
The weather is fright’ning
The thunder and lightning
Seem to be having their way
But as far as I’m concerned, it’s a lovely day
The turn in the weather
Will keep us together
So i can honestly say
That as far as i’m concerned, it’s a lovely day
And everything’s okay
‘వాతావరణం భయపెడుతోంది. ఉరుములు, మెరుపులు అడ్డు అదుపు లేకుండా వస్తున్నాయి. కానీ నా మటుకు నాకు ఇది అద్భుతమైన రోజు’. ఎందుకంటే, వర్షం పడుతున్నంత సేపు ఆమె అతడిని వదలి పోలేదు. అతడితోనే ఉండాల్సి ఉంటంది. కాబట్టి అతడికి అది అందమైన రోజు.
రొమాంటిక్ ఆలోచన. చుట్టూ వర్షం పడుతోంది. కానీ ఆమె అతడిని వదలి ఎక్కడి పోలేదన్న భావన అతడికి ఆ రోజును lovely day గా మలచింది.
(Isn’t This a Lovely Day to Be Caught in the Rain పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=jd_z3fpnNpc )
వో అభితో ఆయె హైఁ
కహతే హైఁ హమ్ జాయేఁ హైఁ
యూ బరస్ బరసోం బరస్
యే ఉమ్ర్ భర్ నా జాయే రే
బరఖా రాణీ జరా జమ్‍కే బరసో
మేరా దిల్‍బర్ జా నా పాయే,
ఝూమ్‌కర్ బరసో..
‘సబక్’ సినిమాలో ముకేష్ పాడిన ఈ పాట ముకేష్ స్వరం వల్ల, గాన సంవిధానం వల్ల, పాటలో భావం వల్ల, బాణీ వల్ల ఆకర్షిస్తుంది. ‘ఇప్పుడే వచ్చింది. అప్పడే వెళ్ళిపోతానంటోంది.. సంవత్సరాల పాటు ఇలాగే వర్షిస్తూ ఉండు. జీవిత కాలం ఈమె వెళ్లకుండా నా దగ్గరే ఉండిపోయేట్ట’ని వర్షపు రాణిని వేడుకుంటున్నాడు హీరో. పాట ఎంతో చక్కగా ఉంటుంది. వింటుంటే మళ్ళీ వినాలనిపిస్తుంది. కానీ చిత్రీకరణ పాటను పాడుచేస్తుంది. నేపథ్యంలో కనిపించే సుందరమైన ప్రకృతి దృశ్యాలు అలరిస్తున్నా, తెరపై కనబడే నటీనటుల నటన పాటలో వ్యక్తపరచే భావాలకి విరుద్ధంగా ఉంటుంది. బహిరంగంగా వర్షంలో తడిసే పాట పాడుతున్నారు. నిండా మునిగిన వాడికి చలేమిటి? వర్షంలో తడిసిన ఆమె, తడుస్తూ వెళ్ళిపోయేందుకు అడ్డంకి ఏమిటి? అన్న ఆలోచన వస్తుంది. ప్రేక్షకులకు ‘లాజిక్’ ఆలోచన వచ్చే అవకాశం ఇచ్చిందంటే చిత్రీకరణ దెబ్బతిన్నట్టే. గమనిస్తే ఈ పాటలో వ్యక్తపరిచిన భావం ‘The turn in the weather will keep us together’ అన్న ఆలోచనకు సుదీర్ఘ వివరణలా అనిపిస్తుంది.
ఈ పాటను ఇక్కడ చూడవచ్చు
బర్‍ఖా బైరన్
జరా థమ్ కే బరసో
పీ మేరే ఆ జాయెతో
చాహే జమ్ కే ఫిర్ బరసో..
ఈ పాటను ఇక్కడ వినవచ్చు
ఆమె ప్రియుడి కోసం ఎదురు చూస్తున్నది. అతడు ఆమె దగ్గరకు వచ్చేందుకు వర్ధం అడ్డుగా ఉంది. అందుకని వర్షాన్ని కాస్సేపు ఆగి, ఆమె ప్రియుడు వచ్చిన తరువాత మళ్ళీ కావాలంటే భోరుమని కురవమంటోంది. ఈ పాట చిత్రీకరణ కూడా మామూలుగా ఉంటుంది. అయితే, మాములుగా వర్షంలో నాయికా నాయికలు తడుస్తూ పాడే రొమాంటిక్ పాట స్వరూపాన్ని మార్చింది, 1962లో విడుదలయిన ‘దిల్ తేరా దీవానా’ సినిమాలో టైటిల్ సాంగ్. షమ్మీకపూర్ హీరో, మాలాసిన్హా హీరోయిన్. వీళ్ళిద్దరూ ఓవర్ యాక్షన్‌కు,
ఈపాటను ఇక్కడ చూడవచ్చు
https://www.youtube.com/watch?v=87ytyRxiRvM&ab_channel=GaaneNayePurane
Let the rain pitter patter
but it really doesn’t matter
If the skies are gray
Long as I can be with you
ఇలా పాడిన తరువాత ఫ్రెడ్ అస్టియర్, గింజర్ రోజర్స్ నృత్యం చేస్తారు. అదీ వర్షంలో కాదు. కానీ హీరో హీరోయిన్లు వర్షంలో దూకి ఎగిరి, పడి చేసే విన్యాసాలను ‘దిల్ తేరా దీవానా’ ఆరంభించినా, పాటలో భావాలు మాత్రం అత్యద్భుతమైనవి. ఈ నేపథ్యంలో చూస్తే తెలుగులో ‘చిటపట చినుకులు’ పాటలో అటు ‘టాప్ హాట్’ ప్రభావం కనిపిస్తుంది, ఇటు, చిత్రీకరణలో ‘దిల్ తేరా దీవానా’ను అనుసరించటం గమనించవచ్చు.
నాయికా నాయకులు అటు ఇటు పరుగెత్తుతుంటారు. ముందుగా వారిద్దరి పట్టుకున్న చేతులను క్లోజప్పులో చూపిస్తుంది కెమెరా. తరువాత దూరమయి వారిద్దరూ నృత్యం చేయటం చూపిస్తుంది. నల్లటి మేఘాలను చూపిస్తుంది. నాయికపై చినుకులు పడటం, ఆమె ఆనందించటం కనిపిస్తుంది. వెంటనే సంగీతం వేగం పుంజుకుంటుంది. వయోలిన్లు వీరంగం వేస్తాయి. నాయికుడు పరుగెత్తు వచ్చి నాయికకు ఆకాశం చూపిస్తాడు. ఆకాశం మెరుస్తుంది. చెట్టు నీడను చూపిస్తాడు. ఇంతలో ఆమె పై చినుకులు పడటం క్లోజప్పులో కనిపిస్తుంది. ఇదంతా సింబాలిజం, వర్షం పడుతున్నదని చెప్పటం.
నీటిలో చినుకులు పడటం కనిపిస్తుంది. నాయిక పాట అందుకుంటుంది. పల్లవిని నటించి చూపుతుంది నాయిక. నాయకుడు పాట అందుకుంటాడు.
ఉరుములు పెళపెళ ఉరుముతు ఉంటే.
మెరుపులు తళ తళ మెరుస్తు ఉంటే.
మెరుపు వెలుగులో చెలి కన్నులలో
బిత్తర చూపులు కనపడుతుంటే.
చెప్పలేని ఆ హాయి ఎంతో
వెచ్చగ ఉంటుందోయి
ఈ పాట చిత్రీకరణలో వాడిన లైటింగ్ కూడా ‘దిల్ తేరా దీవానా’ పాటను గుర్తుకు తెస్తుంది. ఆ పాటలోలాగా నాయిక ఓవర్ ఏక్టివ్ గా ఉంటుంది. కానీ తెలుగులో హీరో నాగేశ్వరరావు తనదైన నటన పద్ధతి ఉన్నవాడు. షమ్మీకపూర్‌లా ఎగరి, గంతులేసి, పడి, నీటిలో పొర్లి, నాయికను లాగి రొమాన్స్ చేసేవాడు కాదు. తనదైన ఒక ‘మర్యాదకరమైన’ నటన పద్ధతి కలవాడు. అందుకని. హీరో పరుగెత్తటం, నాయికకు గొడుగులా వంగి నిలుచోవటం, నాయికను దగ్గర తీసుకోవటం తప్పపెద్దగా పిచ్చి వేషాలు వేయడు. కానీ నాయిక ఓవర్ ఏక్షన్ పాట ప్రభావాన్నితగ్గిస్తుంది. ముఖ్యంగా ‘చెలి కన్నులలో బిత్తర చూపులు’ అన్నప్పుడు వారితో సమానంగా దగ్గర నుంచి కెమెరా ఇద్దరినీ చూపిస్తుంది. నాయిక రెప్పలల్లార్పటం బిత్తరచూపులుగా అనిపించదు. హాస్యాస్పదం అనిపిస్తుంది. కానీ మొత్తం పాట ప్రభావంలో ఈ ‘హాస్యం’ గ్రహించటం కష్టం. ముఖ్యంగా, ఘంటసాల గొంతులో ఉట్టిపడే రొమాన్స్ కట్టిపడేస్తుంది. సుశీల గొంతు పలికే భావాలు అలరిస్తాయి. నిజానికీ పాటలో ఆత్రేయ ప్రదర్శించిన భావాలు తెరపై ప్రదర్శితం కావు. నాయిక నాయకుడి లయబద్దమైన అడుగులు, నాయిక నృత్యం పాటలో పదాలలోని సున్నితత్వాన్ని ప్రతిబింబించాలి.
కారు మబ్బులు కమ్ముతు ఉంటే
కళ్లకు ఎవరూ కనబడకుంటే
జగతిని ఉన్నది మనమిద్దరమే
అనుకొని హత్తుకుపోతుంటే..
తెరపై వెలుతురు దివ్యంగా ఉంటుంది. ముఖ్యంగా సాఫ్ట్ లైట్‌లో నాయికా నాయకులు వెలిగిపోతుంటారు. కాబట్టి ‘కళ్లకు ఎవరూ కనబడకుంటే’ అన్న భావన కుదరదు. ఇది ‘హిందీ’లో నాయిక గట్టు మీద నృత్యం చేస్తుంటే, నాయకుడు నీటి గుంటలో నుంచుని ‘జీవన్ మే ఏక్ బార్ ఖుద్ హోజాతాహై ప్యార్’ అని చెయ్యెత్తి ఒక వేలు చూపించేట్టుంటుంది. జీవితంలో ప్రేమ ఒకేసారి సంభవిస్తుందన్న సున్నితమైన భావన ప్రదర్శన అన్నమాట అది. కానీ, వర్షం జోరుగా పడుతుంటే ఆ వర్షంలో తడిసి ముద్దవుతూ, చుట్టూ ఎవరూ లేరనుకుని ప్రేయసీ ప్రియులిద్దరూ హత్తుకు పోవటమనే భావన కలిగించే వెచ్చదనం అనుభవైకవేద్యం. అద్భుతమైన భావ వ్యక్తీకరణ ఇది.
చలి చలిగా గిలి వేస్తుంటే
గిలిగింతలు పెడుతూ ఉంటే
చెలి గుండియలో రగిలే వగలే
చలిమంటలుగా అనుకుంటే..
ఈ చరణం పాడేసరికి హీరో హీరోయిన్లు వర్షంలో తడవటం మాని ఇంట్లోకి వెళ్తారు. ‘గజెబో’ బదులు ఇల్లు దొరికింది. అక్కడ ‘చలిచలిగా గిలి’ దగ్గర నాయకుడి నటన ఎంత వద్దనుకున్నా ‘నవ్వు’ పుట్టిస్తుంది అంతే కాదు, ‘చెలి గుండెయలో రగిలే వగలు చలి మంటలు’ అనుకోవటం ఎంత అత్యద్భుతమైన రొమాంటిక్ భావననో, ఇద్దరూ ఇంట్లో fireplace దగ్గర కూర్చుని చలి కాచుకోవటం అంత విరుద్ధమైన భావన. చివరలో ఇద్దరూ ఇంట్లోనే ఉండి ‘చెట్టు నీడకు పరుగులు తీయటం ఎంత హాయి’ అని పాడుకోవటం అనౌచిత్యం. కానీ ‘చిటపట చినుకులు’ పాటను, ‘దిల్ తేరా దీవానా హై’ పాటను వింటుంటే తెరపై చూస్తూ కలిగే భావనలకు పూర్తిగా విరుద్ధమైన భావన కలుగుతుంది. హిందీలో కన్నా తెలుగు పాటలో రొమాన్స్ కానీ, సున్నితమైన భావనలు కానీ అత్యద్భుతం, అత్యంత మృదువైన శృంగార భావనలు కలిగిస్తాయి. ఈ రెండు పాటలు సూపర్ హిట్లుగా నిలవటమే కాదు, సినిమాలు కూడా అత్యంత ప్రజాదరణ పొందటం, ప్రేక్షకులకు పాటలేకాదు, చిత్రీకరణ కూడా నచ్చిందని అర్ధం.
అసలు ‘చినుకులు పడుతుంటే, చెట్టా పట్టలుగా చేతులు పట్టి చెట్టు నీడకు పరుగెత్తటం’ అన్న భావన కలిగించే అత్యద్భుతమైన రొమాంటిక్ భావన, కళ్ల ముందు ఊహించే దృశ్యం ఆహ్లాదకరమైన శృంగారానుభూతిని కలిగిస్తుంది. ఆ అనుభూతి మనసులో మెదులుతుండడం వల్ల తెరపై అనౌచిత్యాలను, అసంబద్ధాలను పట్టంచుకునే ‘మూడ్’లో ఉండడు ప్రేక్షకుడు. ముఖ్యంగా ‘మెరుపు వెలుగులో చెలి కన్నులలో కనబడే బిత్తర చూపులు’, ‘జగతిని ఉన్నది మనమిద్దరమే అని హత్తుకు పోవటం’, ‘చెలి గుండియలో రగిలే వగలు చలిమంటలుగా అనుకోవటం’ పాట కలిగించే అనుభూతులు, ఊహలు – మామూలు రొమాంటిక్ భావనల స్థాయిని వెయ్యింతలు పెంచి ప్రదర్శిస్తాయి. వింటున్న శ్రోతను మనోహరమైన ఊహలోకంలో విహరింప చేసి మధుర భావనల సుమమాలల ఉయ్యాల్లో ఊగిస్తాయి. ఈ భావాలను ఘంటసాల, పి. సుశీల తమ స్వరాలలో పలికించిన తీరు ఒక రకంగా చెప్పాలంటే అద్భుతమైన ‘స్వర నటన’ అది. తెరపై నటీనటులు కనబడతున్నా గాయనీ గాయకులు తమ స్వరంలో పలికించిన భావాలు మనస్సు తెరపై నటీనటుల హావభావాల చిత్రాలు చిత్రిస్తాయి. తెరపై దృశ్యం ఈ హృదయ చిత్రానికి దగ్గరగా ఉంటే పాట ప్రభావం మరింత పెరుతుంది. ముఖ్యంగా ఆ కాలంలో ఎఎన్నార్, సరోజాదేవిలకు ఉన్న ఇమేజ్ పాటను మరపురాని మధురమైన పాటగా నిలుపుతుంది. తరతరాలకు రొమాంటిక్ భావాలకు ఊపిరిపోస్తున్నది.
(చిటపట చినుకులు పడుతూ ఉంటే – పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=3FwvuIs0L4M )
వర్షంలో రొమాంటిక్ పాట సృజనలో, సందర్భాన్ని సృష్టించటంలో మన కళాకారులు ఎన్నెన్నో వింత వింత పోకడలు పోయారు. వచ్చే వారం దృష్టిని ఆ వైపు సారిద్దాం.
(మళ్ళీ కలుద్దాం)