[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సరికొత్త సినిమా పాటల శీర్షిక.]
హీరోకు హీరోయిన్ పట్ల ప్రేమ ఉంటుంది. నాయికకు అతని పట్ల ప్రేమ ఉంటుంది. నాయకుడికి నాయికకు తనపై ప్రేమ ఉన్నట్టు తెలియదు. ఉందో లేదోనని అనుమానం. తన భావనలు వ్యక్తపరచాలంటే భయం. ఆమె బయటపడదు. ఈ అనిశ్చంత పరిస్థితి ఎక్కువ కాలం ఇలాగే ఉండటం ఎవరికీ మంచిది కాదు. కాబట్టి ఒక రోజు నాయకుడు నాయికకు తనతో పాటు తాను ఏ స్థలంలో అయితే ధైర్యంగా తన మనస్సులోని భావాలు వ్యక్తపరచగలడో ఆ ప్రాంతానికి తీసుకువెళ్తాడు. అక్కడ అనుకూల వాతారవరణంలో తన మనసులో మాటను పాట రూపంలో బహిర్గత పరుస్తాడు. నాయిక అనుకూలంగా స్పందిస్తుంది.
నాయిక కానీ, నాయకుడు కానీ తమ ప్రేమను వ్యక్తపరచేందుకు ఇలాంటి సన్నివేశ సృష్టీకరణ మనకు అలవాటయినదే. కానీ తొలిసారిగా నాయకుడు ఇలా తన ప్రేమను అత్యంత ప్రతిభావంతంగా, ప్రపంచవ్యాప్తంగా సినీ కళాకారులను ప్రభావితం చేసే రీతిలో వ్యక్తపరచింది ‘సింగింగ్ ఇన్ ది రైన్’ సినిమాలో. ఈ సినిమాలో ఈ పాట చిత్రీకరణ, ప్రేయసి ప్రియుల నడుమ భావ వ్యక్తీకరణకు ఒక చక్కని సన్నివేశాన్ని సృష్టించటమే కాదు; సన్నివేశంలో సున్నితత్వము, భావ వ్యక్తీకరణలో మృదుత్వము, చిత్రీకరణలో సౌందర్యము వంటి అంశాలలో ప్రామాణికాలు ఏర్పరచటమే కాదు, భావి తరాల కళాకారులకు ప్రేరణదాయకంగా నిలిచింది.
‘సింగింగ్ ఇన్ ది రైన్’ సినిమాలో నాయకుడికి దుర్దశ నడుస్తుంటుంది. పట్టిందల్లా మట్టి అవుతుంటుంది. అలాంటి సందర్భంలో నాయిక పరిచయమవుతుంది. ఆమె అంటే ఇష్టం ఏర్పడుతుంది. కాని, ఆమెకు తన భావాన్ని వ్యక్తపరచేందుకు అయిన తనకు అలవాటయిన, అనుకూలమైన వాతావరణానికి తీసుకువెళ్తాడు. ఇద్దరూ సినిమాల్లో పని చేసేవారు. అతడు పేరున్న వాడు. జీవితమంతా సినిమాల్లోనే గడిపిన వాడు. కాబట్టి అతనికి సౌకర్యంగా ఉండేది సినిమా స్టూడియోనే. అంటే సినిమాల్లో నటిస్తూ ఒక కృత్రిమత్వం అలవాటుయిన వ్యక్తి మనసులోని భావనను నిజాయితీగా వ్యక్తపరచేందుకు కృత్రిమమైన ప్రపంచమే అవసరమవుతుందన్న మాట.
సినిమాలో పాటకు దృశ్యం సిద్ధం మయింది. దృశ్యం, ఎక్కడ చిత్రీకరించాలో కూడా నిశ్చయమయింది. ‘సౌండ్ స్టేజ్’ లో చిత్రీకరణ.
ఇక్కడే చిత్రీకరణకు ప్రణాళిక అవసరమౌతుంది.
ఇక్కడ హీరో పాడేందుకు వారు ఎంచుకున్న పాట చాలా చక్కనిది.
Life was a song,
You came along
I’ve laid awake the whole night through
If I ever dared to think you’d care
This is what I’d say to you.
ఇదీ పాట ఆరంభం. కానీ ఆమెను స్టూడియోలోకి తీసుకు వెళ్ళగానే పాట పాడితే బాగుండదు. పాట కోసం ఒక ఊపును, వేగాన్ని, ఉద్వేగాన్ని కలిగించాలి. అంటే, ఇక అపుడు హీరో పాట పాడకపోతే బాగుండదు అనిపించేట్టు చేయాలి అన్నమాట.
సాధారణంగా మన సినిమాల్లో హీరో హీరోయిన్లు తోటకు వెళ్తారు. తోటలో పాట అందుకుంటారు. పాట బాగుంటే సంతోషిస్తాం. కానీ చిత్రీకరణ ఊహకు అందేట్టు ఉంటుంది. నాయిక నృత్యం చేస్తుంది. హీరో వెంబడిస్తాడు. చెట్లు పుట్టలు, పొదలు, పూలు ఎలాగో ఉంటాయి. దాంతో, చిత్రీకరణ పై కన్నా పాట బాణీ, భావం నటీనటుల ఇమేజ్ పాటను ప్రేక్షకులను చేరువ చేస్తుంది. ఇలా ఒక వేగాన్ని సృష్టించే చిత్రీకరణ తక్కవే.
‘ఆన్’ అనే పాత హిందీ సినిమాలో నాయిక రాకుమారి. నాయకుడు అడవిలో ఒక దొంగ. అతడు నాయికను అడవి లోకి ఎత్తుకువస్తాడు. ఆమె ఖైదులో అతను ఉన్నప్పుడు ఓ అందమైన పాట పాడతాడు (మొహబ్బత్ చూమే జిన్కే హాథ్). ఎత్తుకొస్తూ సుందరమైన పాట పాడతాడు (దిల్ మే ఛుపాకే ప్యార్ కా తూఫాన్ లే చలే). ఎత్తుకొచ్చి బందీ చేసిన తరువాత ఇంకో మధురమైన పాట పాడతాడు(మాన్ మెరా ఎహెసాన్ అరే నాదాన్).
‘చల్తీ కా నామ్ గాడీ’ సినిమాలో నాయిక నాయకుడు పిక్నిక్కు వెళ్తారు. అక్కడ ఆమె ఓ ‘కోడి’ని చూపి పట్టమంటుంది. నాయకుడు విఫల ప్రయత్నం చేస్తాడు. ఆమె పాట అందుకుంటుంది – ‘హాల్ కైసా హై జనాబ్ కా’ అంటూ.
ఇలా చెప్తూ పోతే అనేక సినిమాలలో ఇలాంటి పాటల సందర్భాలు గుర్తుకు వస్తాయి. ‘దేఖ్ కబీరా రోయా’ సినిమాలో నాయకుడు, నాయికను ఎదురుగా కూర్చోబెట్టుకుని ‘హమ్ సె ఆయా న గయా’ అంటూ అత్యంత సుకుమారమైన గీతాన్ని అత్యంత మృదుమధురంగా గానం చేస్తాడు.
కానీ ఇలాంటి పాటలలో ఒక ‘మూడ్’ను సృజించటం కనబడదు. వాళ్ళు పార్క్‌కు వెళ్లినా, పిక్నిక్కు వెళ్లినా పాట పాడతారని ముందే ఊహించేస్తాం. దాంతో అలరించే పాట, అభిమాన నటీనటులు ఎంతో ప్రాధాన్యం వహిస్తారు.
‘You Were Meant For Me’ పాట దృశ్యాన్ని విశ్లేషిస్తే, భవిష్యత్తులో కొన్ని అద్భుతమైన పాటలు రూపొందటంలో ఈ పాట వహించిన పాత్ర అర్థమవుతుంది.
పాట ఆరంభం కన్నా ముందు mood creation, build up to the song గమనించాల్సి ఉంటుంది.
ముందుగా ‘వైడ్ షాట్’ లో ఖాళీగా ఉన్న సౌండ్ స్టేజ్ కనిపిస్తుంది. తలుపు తెరచుకుంటుంది. నాయిక నాయకులు కనిపిస్తారు. తలుపు తెరచినంత మేర వెలుతురు పడుతుంది. ఈ దృశ్యం చూడగానే ఎవరికైనా ‘కాగజ్ కే ఫూల్’ సినిమా గుర్తుకు వస్తే అది వారి దోషం కాదు. (కాగజ్ కే ఫూల్ సినిమాలో కూడా నాయికా నాయకులు సినిమాకు సంబంధించిన వారే. వారిద్దరి నడుమ ప్రేమ నిర్ధారణ అయ్యేదీ స్టూడియోలోనే. తేడా అల్లా, కాగజ్ కే ఫూల్ సినిమాలో పాట నాయిక తరఫున వస్తుంది. అయితే, ఇంగ్లీష్ సినిమాలోని ఆనందకరమైన వాతావరణం వుంటుంది. హిందీ సినిమాలో ఆనందకరమైన సందర్భం దర్శకుడివల్ల సీరియస్ గా అనిపిస్తుంది).
ఆ తరువాత నాయకుడు నాయికకు ముందు నడుస్తాడు. స్టూడియోలో అడుగు పెట్టిన తరువాత ఆమె చేయి పట్టుకుని దారి తీస్తాడు. ఇంత వరకూ కెమెరా దూరం నుంచే చూపిస్తుంది. ఇక్కడ ‘లో యాంగిల్ షాట్’ లో అతడు ఆమె చేయి పట్టుకోవటం చూపిస్తారు. కెమెరా వారి వెంటనే వెళ్తుంది. చీకటిగా ఉండటం వల్ల silhouette లో మాత్రమే కనిపిస్తారు. హీరో ఓ స్విచ్ వేయగానే వివిధ రంగుల్లో ఉన్న ఆకాశం కనిపిస్తుంది. మరో స్విచ్ వేయగానే వెలుతురు వారి మీద పడుతుంది. అంతా కృత్రిమమే. కానీ సెట్టింగ్ రొమాంటిక్ అయిపోతుంది. స్యూర్యాస్తమయమవుతున్న ఆకాశం, రంగురంగుల వెలుతురు, చేయి చేయి కలపి కదలుతున్న నాయికా నాయికలు. ఇటీవలి కాలంలో షారూఖ్ ఖాన్, దీపిక్ పడుకొనేలు నటించిన ‘ఓం శాంతి ఓం’ సినిమాలో సరిగ్గా ఇలాగే నాయికకు తన మనసులోని మాట చెప్తాడు నాయకుడు ‘మై అగర్ కహూ’ అని పాట పాడుతూ. ఇలాగే సినిమా సెట్టింగ్ లోకి తీసుకువెళ్తాడు. మనసులోని మాట చెప్పేస్తాడు, కృత్రిమ వాతావరణాన్ని సృష్టించే ఒక్కో పరికరాన్ని ఆరంభిస్తూ.
‘సింగింగ్ ఇన్ ది రెయిన్’ సినిమాలో ఓ నిచ్చెనను ఎక్కిస్తాడు నాయికను. అది బాల్కనీ లాగా ఉంటుంది. నాయిక పై మెట్టు మీద ఉంటుంది. హీరో ఆమె కన్నా క్రింద ఉంటాడు. ఆమె పై వెలుగు వేస్తాడు. వెనక్కాల పలు రూపాల రంగుల దీపాలు వెలిగిస్తారు.
ఇక్కడ సంగీతం ఆరంభమవుతుంది. దృశ్యం, సంగీతం, లైటింగ్, రంగులు, కెమెరా కోణాలు, నాయిక దుస్తులు వంటివన్నీ కలసి ఒక రొమాంటిక్ వాతావరణాన్ని కలిగిస్తాయి. ముఖ్యంగా నాయికను నేపథ్యంలో రంగుల వెలుగుల నడుమ క్లోజప్‌లో చూపించినపుడు నాయిక ఎంతో అందంగా అనిపిస్తంది. మృదువైన వెలుతురు, లో ఫోకస్ కెమెరా, అంటే, నాయిక ఎత్తున ఉన్నట్టు చూపించే కోణంలో చూపించటంలో నాయకుడి దృష్టిలో ఆమె దేవదూత అన్న భావన కలుగుతుంది. ప్రేక్షకుడు కూడా ఆమె అందాన్ని ఆనందంగా దర్శిస్తాడు. ఇప్పుడు పాట అందుకుంటాడు.
ఆమె పై మెట్టున, అతడు క్రింద, ఒక దేవతను కలుస్తున్న భక్తుడిలా. ఒక మెట్టు పైకి ఎక్కుతుంటే నేపథ్య సంగీతంలో ఉద్వేగం పెరుగుతుంది. కెమెరా కూడా దగ్గరకు వస్తూ ఆకాశ నేపథ్యంలో వారిద్దరికీ కాస్త దగ్గరగా చూపిస్తుంది. అతడు తదేకంగా ఆమె వేపే చూస్తుంటాడు.
You were meant for me
And I was meant for you
Nature patterned you
And when she was done You were all the sweet things Rolled up in oneకెమెరా ఎంతో మృదువుగా వారి దగ్గరకు వస్తుంది. వారి చుట్టూ తిరుగుతుంది. ఇప్పుడు ఇద్దరూ సమస్థాయిలో ఉంటారు. పాడుతూ ఒకే వైపు వస్తారు. కేమేరా వారిద్దరినీ వెంబడిస్తుంది.
అంటే, ఆమె అతడి ప్రేమను ఆమెదించిందన్న మాట. చేతులు పట్టుకుని నడుస్తారు. ఇప్పుడు కెమెరా దూరం అయి మంచి నేపథ్యంగా చూపిస్తుంది.
అద్భుతమైన దృశ్యం. రొమాన్స్ ఉట్టి పడుతుంది.
(You were meant for me పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=zHPnl43_N4o )
హీరోయిన్ నిచ్చెన మెట్టు పైన, నాయికుడు నిచ్చె క్రింద మెట్టు పై ఉండి ఆమె వైపు చూస్తున్నపుడు, తరువాత దృశ్యాలు చూస్తుంటే, ఎవరికైనా ‘1942 – A Love Story’ సినిమాలోని ‘కుఛ్ న కహో’ పాట చిత్రీకరణ గుర్తుకు వస్తే కూడా దోషం వారిది కాదు. ఈ పాటలో లాగే సూర్యాస్తమయ ఆకాశం, పైకి అంతమయ్యే మెట్లు.. రొమాన్స్, కెమెరా కోణాలు సర్వం, ‘సింగింగ్ ఇన్ ది రైన్’ దృశ్యాన్ని గుర్తుతెస్తాయి. అయితే మెడలో పూసల హారం తెగటం, పళ్లన్నీ కనబడేలా నాయిక నవ్వటం వంటివి మన సృజన. పాట చివరలో పాట ఆరంభం నాటి పరిస్థితికి వ్యతిరేత పరిస్థితి వస్తుంది. అదే నిచ్చెన దగ్గర నాయకుడు పైన ఉంటాడు. నాయిక ఒక మెట్టు క్రింద ఉంటుంది. ‘కుఛ్ న కహో’ కూడా అంతే.
‘దాగుడు మూతలు’ సినిమాలోని ‘గోరొంక గూటికే చేరావు చిలక’ పాట సందర్భం కాస్త భిన్నమైనదైనా నాయకుడు, నాయికను ‘చిలక’తో పోలుస్తూ పాడిన పాటలో వెన్నెల తోటలో పూలు, ఒక చక్కని రొమాంటిక్ వాతావరణాన్ని కలిగిస్తాయి. అంతర్లీనంగా పైకి ప్రత్యక్షంగా ప్రకటంచని రొమాన్స్. ” మా మల్లెపూలు నీకు మంచి కథలు చెప్పునే” అనటంలో, తన దగ్గరకు వచ్చిన అతిథికి మర్యాదలు చేయతమనే భావన కలుగుతుంది. కానీ, ఆ వచ్చింది యువతి కావటంతో రొమాంటిక్ భావన కలుగుతుంది.
నిలవలేని కళ్ళు నిదుర పొమ్మన్నాయి
దాగని చిరునవ్వులు రమ్మన్నాయి, అబ్బ ఉండన్నాయి.
పైట చెంగు రెపరెపలు పద పద లెమ్మన్నాయి
పలుకైనా పలుకవా బంగారు చిలకా..
‘దాశరథి’ కలం నుంచి భావాలు తేనె సరస్సుల తీపిదనాన్ని విరజిమ్ముతాయి. ఎక్కడా నాయకుడి మనసులో భావాలు ప్రత్యక్షంగా ప్రకటితం కావు. అంతా నర్మగర్భితం. నాయిక వదనం వ్యక్తపరుస్తున్న సున్నితమైన భావనలు మనసులో ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
అందమైన కెమెరా కోణాలు, భావాత్మకమైన రంగులు లేని లోటును పాటలోని పదాలు, గాయకుడి గొంతులో ఉట్టిపడే అదిమి పట్టిన అభిమానం, అంతర్లీనమైన శృంగారం, అత్యంత మధురమైన, సున్నితమైన భావాలు కలిగిస్తాయి. Romance అంటే ‘ఇది’ అని తరతరాల ప్రేక్షకులకు పాఠం చెప్తాయి.
‘You were meant for me’ పాట ప్రభావంతో రూపొందిన ఒక పాట, అది విడుదలైన 60 ఏళ్ల తరువాత కూడా రొమాన్స్‌కు, ప్రేమ భావ ప్రకటనకు అత్యుత్తమ గీతంగా నిలుస్తోంది.
నాయిక రాకుమారి. కానీ చెలికత్తెలా నటిస్తుంది. ఆమె ఓ అడవి దొంగతో ప్రేమలో పడి స్వచ్ఛందంగా అతని ఇంటికి వస్తుంది. అతనిది అడవి. ఎలాగయితే సినిమా నటుడు స్టూడియోలోని కృత్రిమ అందాలు చూపి నాయికకు తన మనసులో మాటను చెప్తాడో, అలాగే ఈ అడవి దొంగ అడవిలోని ప్రాకృతికమైన అందాలను చూపి నాయికను మెప్పిస్తాడు. నాయిక తనతో పాటు అడవిలో అడుగిడగానే అత్యంత రొమాంటిక్ భావనలు నిండిన పాట అందుకుంటాడు. తన దగ్గరకు వచ్చిన ప్రేయసిని అతిథిలా భావించి ప్రకృతిని ఆమెకు ఆతిథ్యం ఇమ్మని అభ్యర్ధిస్తాడు.
బహారో ఫూల్ బర్సావో, మేరా మహబూబ్ ఆయా హై
వసంతాన్ని, అంటే వసంతంలో విరగబూసే పూల చెట్లను, తన ప్రేయసి వచ్చింది కాబట్టి, పూల వర్షం కురిపించమంటున్నాడు. సింప్లీ సూపర్బ్. మనస్సు సున్నితమైన భావనలతో ఉప్పొంగుతుంది. ప్రాకృతికమైన ప్రేమ భావనలోని సున్నితత్వం అనుభూతికి వస్తుంది.
ఓ లాలీ ఫూల్ కీ మెహందీ లగా ఇన్ గోటే హాథోం పె
ఉతర్ ఆ ఏయ్ ఘటా, కాజల్ లగా ఇన్ ప్యారీ ఆంఖోం మే
సితారోం మాంగ్ భర్ జావో, మేరా మహబూబ్ ఆయా హై
అతని ప్రేయసి వచ్చింది కాబట్టి ప్రకృతిని అంతా సంబరాలు జరపుకోమంటున్నాడు. ఆమెను అలంకరించి ప్రకృతి అందంలో ఓ భాగం చేయమంటున్నాడు. పూల రంగు ఆమె చేతికి గోరింటాకు పెట్టాలట, నల్లటి మేఘం దిగి వచ్చి ఆమె కంటికి కాటుక దిద్దాలట. నక్షత్రాలు ఆమె పాపిట అలంకరణలవ్వాలట.
ఎక్కడి గంధర్వులండీ వీళ్లు?
పొరపాటున, దారి తప్పి, మన అదృష్టం కొద్దీ భూతలం పైకి దిగి వచ్చి, మనకు అనంతమైన అనందం కలిగించే గీతాలను సృజించి వెళ్లిపోయారు. ఈ పాటను మహమ్మద్ రఫీ పాడిన విధానం గురించి పుస్తకాలు రాయవచ్చు. శంకర్ జైకిషన్ సంగీతం గురించి, వాయిద్యాల వాడకం గురించి పరిశోధనలు ఎన్ని చేసినా సరిపోదు. హస్రత్ జైపురి రొమాంటిక్ గీత రచన గురించి ఎంత చెప్పినా తనివి తీరదు. దాంతో చిత్రీకరణ సాధారణంగా ఉన్నా, ప్రేక్షకుడు పట్టించుకోడు. నాయికా నాయకులు ఎలాంటి భావాలు ప్రదర్శించక నిద్రలో నడుస్తున్న వారిలా నటించినా పరవాలేదు. మహమ్మద్ రఫీ , సంగీతం నాయికా నాయకుల కన్నా ఎక్కువ ప్రభావం చూపుతాయి. నెమళ్లు, ఏనుగులు, పూలు, చూపిస్తే చాలు పాట అమోఘం అయిపోతుంది. ఈపాట మహమ్మద్ రఫీకి ఎంతగా నచ్చిందంటే, ఇదే బాణీతో ఒక ఆంగ్ల గీతాన్ని సృజించి ఇతర దేశాలు పర్యటించినప్పుడె అక్కడ ఆంగ్ల గీతాన్ని పాడేడు.
(బహారో ఫూల్ బర్సావో పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=l71_FEbklBQ )
(మళ్ళీ కలుద్దాం)