[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సరికొత్త సినిమా పాటల శీర్షిక.]
పాపం హీరోకు అన్నీ కష్టాలే.
పట్టిందల్లా మట్టి అవుతుంటుంది.
ఆ సమయంలో అతడికి ఓ అమ్మాయి దగ్గరగా వస్తుంది. అతడికి ఆమె అంటే ఇష్టం. కానీ ఆమెకు అతడంటే ఇష్టం ఉందో లేదో అతడికి తెలియదు. ఇంతలో ఒక రోజు ఆ అమ్మాయిని ఇంటి దగ్గర దిగబెట్టాల్సి వస్తుంది. ఆమె అతడిని ఇష్టపడుతున్నట్టు అతడికి తెలుస్తుంది. ఆమె ఇంట్లోకి వెళ్లిపోయి తలుపు వేసుకుంటుంది. అతడు వెనక్కు తిరుగుతాడు. చినుకులు పడటం ఆరంభమవుతుంది. ఆమె తనను ఇష్టపడుతోందని తెలిసిన ఆనందంలో అతడు ఏదో ఓ లోకంలో ఉంటాడు.
వెంటనే అతడు ఒళ్ళు పై మరచి తన్మయిడై వర్షంలో నృత్యం ఆరంభిస్తాడు. పాట పాడటం మొదలు పెడతాడు.
అలా సినీ ప్రపంచంలో తొలి వర్షపు పాట తెరపైకి ఎక్కింది. ఈ పాటను ప్రపంచానికి మరపురాని రీతిలో పరిచయం చేసి, ప్రపంచవ్యాప్తంగా కళాకారులు వానను చూసే దృష్టిని మార్చేసిన దృశ్యం, 1952లో విడుదలయిన ‘సింగింగ్ ఇన్ ది రైన్’ సినిమాలో టైటిల్ సాంగ్.
నిజానికి ‘సింగింగ్ ఇన్ ది రైన్’ పాట 1929 నుంచి ప్రచారంలో ఉంది. కానీ 1952లో ‘సింగింగ్ ఇన్ ది రైన్’ సినిమాలో జీన్ కెల్లీ (Gene Kelley) పాట పాడుతూ నృత్యం చేసిన దృశ్యం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించింది. కళాకారులకు తరతరాలుగా ప్రేరణగా నిలుస్తోంది. ఎటువంటి వారి మనస్సులనైనా ఆహ్లదపరుస్తుంది, పెదవులపై చిరునవ్వు కదలుతుంది.
పాటలు చుట్టూ సినిమాను అల్లటానికి చక్కటి నిదర్శనం ‘సింగింగ్ ఇన్ ది రైన్!’. ముందు నాలుగు పాటలు సిద్ధంగా ఉన్నాయి. వాటి చుట్టు కథను అల్లారు. వారి దృష్టి ‘సింగింగ్ ఇన్ ది రైన్’ పాట పైన ఉంది.
సినిమాలు మూకీ నుంచి టాకీలవుతున్న కాలం. మూకీలో గొప్ప స్టార్లు ‘టాకీ’ల్లో హాస్యస్పదమవుతూంటారు. ఆ సమయంలో ‘డబ్బింగ్’ చెప్పటం ద్వారా ‘మూకీ’ స్టార్ల సినీ జీవితాన్ని పొడిగించే ప్రయత్నాలు జరుగుతాయి ( ఈ డబ్బింగ్ చెప్పే ప్రయత్నాన్ని చేసే సీన్ తరువాత పడొసన్ అనే హిందీ సినిమాలో హాస్యంగా రూపొందించారు). సినిమా హీరోకు డబ్బింగ్ చెప్పే అమ్మాయి నచ్చుతుంది. ఆ అమ్మాయికి కూడా అతడు నచ్చాడని ఈ సీన్లో అతడికి తెలుస్తుంది. వీడ్కోలు చెప్తూ, ఇద్దరూ ముద్దు పెట్టుకుంటారు. ఆమె వెళ్ళిన తరువాత గొడుగు వేసుకుని వెనక్కు మళ్ళుతాడు హీరో. అతడి ముఖం ఆనందంతో వెలిగిపోతూంటుంది.
సంతోషంగా వర్షంలోకి చేయి చాపుతాడు. కారు డ్రైవర్‌ను వెళ్ళిపోమంటాడు. ఆశ్చర్యంగా చూసి డ్రైవర్ వెళ్ళిపోతాడు. అతడు ఆనందంతో కూనిరాగం తీస్తూ ఆకాశం వైపు చూస్తూ నడుస్తుంటాడు.
ఇక్కడి మనం ఒక సినిమా పాట చిత్రీకరణలో కేవలం, పాట బాగుండి, నటుడు బాగుంటే సరిపోదన్న విషయాన్ని స్పష్టంగా చెప్పుకోవాలి.
వర్షం దృశ్యం.
పై నుంచి ఫౌంటేన్లతోటి, పైపులతోటీ నీళ్ళు కురిపించి నటీనటుల్ని తడిపేస్తే సరిపోదు. ఈ పాట చిత్రీకరణలో పెద్ద సమస్య తెరపై వర్షపు నీరు కనిపించేట్టు చేయటం. సాధారణంగా వర్షపు నీరు కనిపించేట్టు చేయటం కోసం పాలునీళ్ళూ కలిపి వెదజల్లుతారు. కానీ ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో నీటి సమస్య ఉంది. అందుకని నీటిని పొదుపుగా జాగ్రత్తగా వాడాల్సి వచ్చింది.
పాట చిత్రీకరణ ఉదయం పూట జరిగింది. కానీ రాత్రి ఎఫెక్టు రావాలి దృశ్యం ప్రకారం. అందుకని నల్లటి బట్టలతో వెలుతురు పడకుండా పెట్టారు. దాంతో దృశ్యంలో ‘లైటింగ్’ ప్రాధాన్యం వహిస్తుంది.
వర్షం కనబడాలంటే వెలుతురు వెనుకవైపు నుండి పడాలి. కానీ హీరో కనబడాలంటే ముందు నుంచి వెలుతురు హీరో పై పడాలి. అందుకే, సంతోషకరమైన పాట అయినా ఈ సినిమాలోని ఇతర సంతోషకరమైన పాటల్లా తెర వెలుగుతో నిండదు.
లైటింగ్ సరిగ్గా అమర్చటంతో కొంత పని మాత్రమే అయింది.
పాటలో నటుడు ఎలా నాట్యం చేస్తూ, ఎక్కడ ఎంతెంత సేపు నృత్యం చేస్తాడు- ఇలాంటివన్నీ నిర్ణయించుకోవాల్సి ఉంటుంది. ఆపై కెమెరా ఏ కోణంలోంచి, ఏ దృశ్యాన్ని, ఎలా చిత్రీకరిస్తుందో నిర్ణయించుకోవాలి.
ఈ పాట చిత్రీకరణలో కెమెరా కదలికలు ఎంతో జాగ్రత్తగా ప్రణాళిక వేశారు. ముఖ్యంగా తెరపై కనబడే పాత్రలను ‘బ్లాక్’ (block) చేయంటంలో ఒక దృశ్యాన్ని చిత్రించటంలోని శ్రద్ధ తెలుస్తుంది.
సినీ పరిభాషలో blocking అంటే దృశ్యంలో తెర పై కనబడి నటీనటులు ఎలా కదలుతారు, ఏమేం చేస్తారు, ఒకరితో ఒకరు ఎలా ప్రవర్తిస్తారు, సెట్ ఎలా ఉంటుంది వంటి విషయాలను పరిగణనలోకి తీసుకుని వాటికి తగ్గట్టు కెమెరా కదలికలను నిర్ణయించటం. సరిగ్గా బ్లాకింగ్ జరగితే తెర పై పాత్రల సంబంధం, వారి కదలికల పై ప్రేక్షకుల దృష్టి కేంద్రీకృతమవుతుంది. అనవసరమైన వాటి పైకి దృష్టి పోదు.
ఒక దృశ్యం ఒక ప్రతిబంధకాలు లేని ప్రవాహంలా సులువుగా కదలి పోవటంతో కెమెరా కదలికలు, వేగం కోణం, సంగీతం వంటి వాటి నడుమ చక్కటి సహకారం, అవగాహనలు తప్పని సరిగా ఉండాలి.
‘సింగింగ్ ఇన్ ది రైన్’ పాట ఆరంభంలో కెమెరా నిశ్చలంగా ఉంటుంది. హీరో గొడుగు వేసుకుని చేయి చాపి పైకి చూస్తూ ముందుకు అడుగులు వేస్తాడు. మనకు తెరపై హీరోతో పాటు కారు, దాన్లో డ్రైవర్ కనిపిస్తుంటారు. రెండడుగులు వేసిన హీరో చాపిన చేయి అలానే కదుపుతూ డ్రైవర్‌ను వెళ్ళిపోమంటాడు. ఆ కదలిక కూడా నృత్యంలో భాగమే. ఆశ్చర్యంగా చూస్తున్న డ్రైవర్ ను వెళ్లిపోమని వేగంగా చేయి కదిపి చెప్తాడు. డ్రైవర్ వెళ్లపోతాడు. అప్పుడు సంతోషంగా ‘హమ్’ చేస్తూ అడుగులు వేస్తాడు. రెయిన్ కోట్ వేసుకున్న వ్యక్తి పరుగెత్తుతూ, హీరో వైపు వింతగా చూస్తూ వెళ్తాడు. అది పట్టించుకోడు హీరో.
ఇక్కడ ఒక విషయం గమనించాలి. అంత వరకూ నిశ్చలంగా ఉన్న కెమెరా, కారు వెళ్లిపోగానే వెనక్కు జరుగుతుంది. ఆ పై హీరో నడకను అనుసరిస్తుంది. తెర పై దృశ్యాన్ని చూస్తున్న ప్రేక్షకుడు కెమెరాతో పాటు కదలుతాడు. తాను కెమెరా కళ్లతో హీరోను వెంబడిస్తాడు. ఇదంతా ఎంతో ప్రణాళిక వేసుకుని, రిహార్సల్స్ పలు మార్లు చేస్తే కానీ వీలు పడదు. కానీ తెరపై అది కృత్రిమంగా కనబడకూడదు. స్వాభావికంగా జరుగుతున్నట్టు ఉండాలి.
కెమెరా నాయకుడిని వెంబడిస్తూంటుంది. నాయకుడు వర్షాన్ని అనుభవిస్తూ వెనక్కు చూస్తూ ముందుకు నడుస్తూ ఒక చోట ఆగిపోతాడు. గొడుగు తీసేస్తాడు. వర్షంలో తడుస్తూ అమితమైన ఆనందాన్ని అనుభవిస్తుంటాడు. కెమెరా అతడికి దగ్గరగా వెళ్తుంది. పాట ఆరంభిస్తాడు. నడవటం ఆరంభించగానే కెమెరా మళ్లీ అతడిని అనుసరిస్తుంది. పాడుతూ, నడుస్తూ హాఠాత్తుగా లాంప్ పోస్ట్ పైకి ఎగిరి ఎక్కుతాడు. దాన్ని కౌగిలించుకుంటాడు. ఇంత వరకూ ఒకటే షాట్. ల్యాంప్ పోస్ట్ ను కౌగలించుకునే సమయంలో కెమెరా ‘క్లోజ్ అప్’ కు వెళ్తుంది. సంతోషంతో వెలిగిపోతున్న అతని భావాలను చేరువ చేస్తుంది. వెంటనే మరో షాట్ ఆరంభమవుతుంది.
కెమెరా దూరం నుంచి ల్యాంప్ పోస్ట్ దగ్గర పాడుతున్న హీరోను చూపిస్తుంది. మళ్లీ అతడిని అనుసరిస్తుంది. ఇలా కెమెరా నటుడిని అనుసరిస్తుండటం వల్ల చూసే ప్రేక్షకుడికి దృశ్యం వేగవంతంగా, అతి మృదువుగా జరిగిపోతున్నట్టనిపిస్తుంది. సామాన్య ప్రేక్షకుడు వైడ్ షాట్స్, ట్రాక్ షాట్, క్లోజ్ అప్, మళ్లీ వైడ్ షాట్ ఇలా కెమెరా కదలటం ఏమీ గమనించడు. తెరపై కనబడుతున్న దృశ్యంలో లీనమై పోతాడు. గమనిస్తే, పాట టెంపో, సంగీతం మారినప్పడల్లా కెమెరా కోణం మారుతుంది. దీన్ని ‘కట్’ అంటారు. అలా మొత్తం 9 షాట్లు ఈ అయిదు నిముషాల దృశ్యంలో ఉన్నాయి. ఇందులోనే ఓ మనిషి పరుగెత్తటం, ఓ జంట వార్తాపత్రిక తలపై పెట్టుకుని ఇతనీ వర్షంలో ఎందుకు ఇంత సంతోషంగా నృత్యం చేస్తున్నడని వెనక్కి చూస్తూ వెళ్లటం, పోలీసు ఆఫీసరు ఆపటం, ఎదురుగా వస్తున్న వాడికి గొడుగు ఇచ్చి హీరో వెళ్లిపోవటం అన్నీ జరిగిపోతాయి. ఎంతో పకడ్బందీగా, ప్రణాళికతో, తీసిన దృశ్యం ఇది.
ఈ దృశ్యం నాయకుడి సంతోషాన్ని, ఆనందాన్ని ప్రదర్శిస్తుంది. వర్షంలో దూకటం, నీళ్లల్లో చిన్న పిల్లవాడిగా ఆడటం, పేవ్మెంట్ మీద నుండి రోడ్డు పైకి, రోడ్డు నుంచి పేవ్మెంట్ పైకి దూకటం.. ఇలా ఆనందంతో మైమరచి పిల్లవాడిలా అల్లరి చేస్తున్న హీరో మానసిక స్థితికి దర్బణం పడుతుందీ పాట. సాధారణంగా కట్కీ కట్కీ నడుమ హీరోలు విశ్రాంతి తీసుకోవచ్చు. ఈ పాట చూస్తే, ముఖం పై వర్షం పడుతున్న క్లోజ్ అప్ షాట్ తరువాత, సుదీర్ఘమైన నృత్యం చేస్తాడు. అతి తక్కువ కట్ లతో సాగుతుందీ నృత్యం. అత్యద్భుతమైన ఎఫెక్ట్ ఇస్తుందీ రకమైన చిత్రీకరణ. అందుకే ఈ దృశ్యం ఈనాటికీ చూసిన వారిని అలరిస్తుంది. కళాకారులకు ప్రేరణనిస్తుంది.
(ఈ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=swloMVFALXw )
సాధారణంగా వర్షాన్ని దుఃఖానికి ప్రతీకగా వాడతారు. కానీ వర్షాన్ని ఆనందకరమైన భావనకు ప్రతీకలా వాడటం ‘సింగింగ్ ఇన్ ది రైన్’ తో ఆరంభమయింది.
మన హిందీ సినిమాల్లో వర్షాన్ని రొమాంటిక్ గా వాడింది 1955లో విడుదలైన రాజకపూర్ సినిమా ‘శ్రీ 420’. ఈనాటికీ ప్రేయసి, ప్రియులు వర్షంలో తడవటం అంటే గుర్తొచ్చే పాట ఆ సినిమాలో ‘ప్యార్ హువా, ఇక్ రార్ హువా’ పాటనే! తెలుగులో వర్షం పాట అనగానే గుర్తొచ్చేది ‘చిట పట చినుకులు పడుతూ ఉంటే!’. ఇంకొంచెం ముందుకు వస్తే ‘గీతాంజలి’ సినిమాలోని ‘ఒళ్ళంత తుళ్లింత కావాలిలే’ మదిలో మెదులుతుంది.
జీన్ కెల్లీ ‘సింగింగ్ ఇన్ ది రైన్’ ప్రభావం ‘ప్యార్ హువా’ పాటలో తెలుస్తుంది. అయితే, ‘సింగింగ్ ఇన్ ది రైన్’ పాటలో నాయకుడు ఒకడే పాడితే, ‘ప్యార్ హువా’ నాయికా నాయకులు పాడతారు. అయితే రాజ్ కపూర్ ‘సింగింగ్ ఇన్ ది రైన్’ ను అంత తేలికగా వదలలేదు.
‘ఛలియా’ సినిమాలో నాయికకు తన మీద ప్రేమ ఉందని నాయకుడు గ్రహిస్తాడు. వెంటనే వర్షం వస్తుంది. అందరూ పరుగులు తీస్తుంటే మన హీరో ఒకడి చేతిలోంచి గొడుగు లాక్కుని దాన్ని జీన్ కెల్లీలా తిప్పుతూ ‘దందం డిగాడిగా’ అంటూ పాట అందుకుంటాడు. ఈ పాటలో ‘సింగింగ్ ఇన్ ది రైన్’లో లాగా, నీళ్లని తంతాడు. ఎగుర్తాడు. గొడుగు తిప్పతూనే ఉంటాడు. పాట బాగుంటుంది. రాజ్ కపూర్ అలవాటయిన రీతిలో అలవోకగా నటించేశాడు. కానీ ‘సింగింగ్ ఇన్ ది రైన్’ లోని మృదుత్వం, ఆహ్లాదం, పెదవులపై చిరునవులను నిలిపే ఆనందం సున్నితత్వాలు చిత్రీకరణలో లేవు. రాజ్ కపూర్ కు ముకేష్ పాడాలి. పాడేడు. పాట బాగుండాలి. బాగుంది. అంతే..సూపర్ హిట్ పాట. ఇది మన్ మోహన్ దేశాయ్ దర్శకత్వం వహించిన తొలి సినిమా.
(ఈ పాటను ఇక్కడ చూడవచ్చు
https://www.youtube.com/watch?v=3xcsL17J-dA&list=RDGMEMPipJmhsMq3GHGrfqf4WIqA&start_radio=1&rv=l2Oi7inSVoc&ab_channel=SuperHitGaane)
ఈ పాటలో కనబడని మృదుత్వం, సున్నితత్వం, శ్రీ 420 పాటలో కనిపిస్తుంది. దానికి దర్శకత్వం వహించింది రాజ్ కపూర్.
‘శ్రీ 420’ పాట కోసం కల్పించిన దృశ్యం కూడా ‘సింగింగ్ ఇన్ ది రైన్’ దృశ్యంతో పోలి ఉంటుంది. రాజ్ కపూర్, నర్గీస్ పాత్రల నడుమ ప్రేమ ప్రకటితమవుతుంది. ఇద్దరు ఫుట్‌పాత్ హోటల్లో టీ తాగుతారు. ప్రేమ ప్రకటితం అవటంతో నర్గీస్ పాత్ర సిగ్గుతో ముఖం దాచుకుంటుంది. ఆకాశంలో మేఘాలు గర్జిస్తాయి. గాలి వీస్తుంది. వర్షం వస్తుంది. మైమరచి ఉన్న నర్గీస్ చేతిలోంచి గొడుగు లాక్కుంటాడు రాజ్ కపూర్. ఒకే గొడుగులో ఇద్దరూ దగ్గరగా వచ్చినప్పుడు పురుషునితో ప్రథమ సాన్నిహిత్య సమయంలో, యువతి శరీరంలో ఆ వయసులో కలిగే సంచలనాన్ని, సౌఖ్యభావనను, తన్మయత్వాన్ని అత్యద్భుతంగా ప్రదర్శిస్తుంది నర్గీస్. కెమెరా క్లోజప్పులో ఆమె ప్రదర్శించే భావ ప్రకటనను చూపిస్తుంది. ఆమె అదే అలవి కాని సౌఖ్య భావనతో కళ్లు తెరచి రాజ్ కపూర్ వైపు చూస్తుంది. అత్యద్భుతమైన రొమాంటిక్ భావనలను ఒకేసారి ప్రదర్శిస్తుంది నర్గిస్. చూస్తున్న ప్రేక్షకుడు దృశ్యంలో లీనమైపోతాడు. దృశ్యంలోని ఉద్విగ్నతను, సందిగ్థాన్ని, శృంగార భావనను ఉద్దీపితం చేస్తూ నేపథ్య సంగీతం వినిపిస్తుంది. ‘ప్యార్ హువా, ఇక్ రార్ హువా’ అంటూ హీరో పాట అందుకుంటాడు.
ఈ పాట చిత్రీకరణలో ప్రతి చిన్న షాట్ ఫ్రేమింగ్ అద్భుతంగా ఉంటుంది. నర్గీస్ వదనంలో ప్రతిఫలించిన భావనలపై ఓ పుస్తకం రాయవచ్చు. ‘కెహతా హై దిల్, రస్తా ముష్కిల్’ అన్నప్పుడు చూసిన చూపులో ఎన్నెన్నో భావనలు గోచరిస్తాయి. ‘మాలూమ్ నహీ హై కహా మంజిల్’ అనే ముందు తల దించుకుని, మళ్లీ అతడి వైపు చూస్తూ పాడేప్పుడు ప్రదర్శించిన భావాలు అమోఘం. తరువాత ఇద్దరూ లాంగ్ షాట్లో ఒకే గొడుగులో నడుస్తూ.. టీ తాగిన చోట నుంచే నడుస్తూ వెళ్తారు. కెమెరా వీరి వైపు అర్థవంతంగా చూస్తూ టీ తాగుతున్న వాడి వైపు కదిలి క్లోజప్‌లో చూపిస్తుంది.
రాజ్ కపూర్ నర్గీస్‌ల క్లోజప్పులయితే వారిద్దరి నడుమ సాన్నిహిత్యాన్ని ఎంతో గొప్పగా చూపిస్తాయి. మనకు చేరువ చేస్తాయి. రాజ్ కపూర్ కూడా ‘అహహ’ అనేపుడు జీన్ కెల్లీ లాగా చేతులు చాపుతాడు.
పాట విలువను పెంచుతాడు గేయ రచయిత, రెండవ చరణంలో ‘మై న రహూంగి, తుమ్ న రహోగే ఫిర్ భి రహేగి నిషానియా’ అనిపించి నప్పుడు పాటను సంపూర్ణంగా అర్థం చేస్తున్న దర్శకుడు ‘నిషానియా’ అని నవ్వుతూ నర్గీస్ వేలు చూపించగానే రోడ్డు పై వెళ్తున్న ముగ్గురు పిల్లలను చూపిస్తాడు. పాట స్థాయి పెరిగిపోతుంది. రొమాంటిక్ పాట జీవితతత్వాన్ని, ప్రేమతత్వాన్ని, మనిషి బాధ్యతను ప్రదర్శించే తాత్వికగీతంలా ఎదుగుతుంది. ఇద్దరి వ్యక్తిగత ప్రేమ పాట సార్వజనీనతను ఆపాదించకుని సమస్త మానవులకు వర్తించే పాటగా ఎదుగుతుంది.
ఈ పాట చిత్రీకరణలో ప్రతి అంశాన్ని రాజ్ కపూర్ ముందే ఊహించాడు. ప్రణాళిక వేసుకున్నాడు. పాట రికార్డింగ్‌కు ముందు రిహార్సల్స్ అయ్యే సమయంలో రాజ్ కపూర్, నర్గీస్ పాటకు తగ్గిట్టు నటించేవారు. రాజ్ కపూర్ దృశ్యాల ఫ్రేమింగ్, కెమెరా కోణాలను ఆలోచించి పెట్టకునేవాడు. ఈ సినిమా కేమేరామెన్ రాధు కర్మకర్. మొత్తం స్టూడియోలో చిత్రితమైన పాటను రాత్రి పూట చిత్రితమైన భ్రమ కలిగించటమే కాదు, రోడ్ల మీద ఔట్ డోర్లో షూట్ చేసిన భ్రమను కలిగించాడు రాధు కర్మకర్. చివరికి దూరంగా రైలు వెళ్ళిన భ్రమతో పాటూ బ్రిడ్జ్ పై వెళ్తున్న రైలు ప్రతిబింబాన్ని రోడ్ పైని నీళ్ళలో చూపిస్తాడు. నమ్మిస్తాడు. చార్లీ చాప్లిన్ సైతం ఈ పాటలో కెమెరా పనితనానికి మెచ్చుకున్నాడు. ‘ఆవారా’ సినిమాలో భర్త భార్యను బయటకు గెంటగానే అరంభమైన వర్షం పిల్లవాడు పుట్టటంతో ముగుస్తుంది. ‘ఆవారా’ లో వర్షాన్ని విషాదానికి దుఃఖానికి సంకేతంగా వాడిన రాజ్ కపూర్, ‘శ్రీ420’ సినిమాలో వానను రోమాంటిక్ పాటకు వాడటం ‘సింగింగ్ ఇన్ ది రైన్’ ప్రభావం. ‘సింగింగ్ ఇన్ ది రైన్’ ప్రభావం రాజ్ కపూర్ మీదనే కాదు, పాటల చిత్రీకరణకు పెట్టింది పేరయిన విజయానంద్పై కూడా అతి తీవ్రంగా ఉంది. ఈ విషయం రాబోయే వ్యాసాల్లో చర్చించుకుందాం!
(ప్యార్ హువా పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=xjxyculMGzE )
(మళ్ళీ కలుద్దాం)