[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సరికొత్త సినిమా పాటల శీర్షిక.]
అది సినిమాల్లోకి శబ్దాలు అడుగు పెడుతున్న కాలం.
అంతకు ముందు తెరపై దృశ్యాలు కనిపిస్తుంటే, ఆ దృశ్యాలకు తగ్గ సంగీతం వినిపించటం అలవాటయి పోయింది.
అప్పుడప్పుడే తెరపై కదిలే బొమ్మలు కబుర్లు చెప్పటం ప్రారంభమయింది. అప్పటికి తెరపై మాట్లాడినట్టు చేస్తే, వారి సంభాషణలను ఓ కార్డుపై రాసి చూపించేవారు. కానీ నెమ్మదిగా రికార్డయిన శబ్దం, తెరపై కదిలే నటుల పెదవులతో కలపటం ఆరంభమయింది.
1927లో హాలీవుడ్ మ్యూజికల్ ‘ది జాజ్ సింగర్’ విడుదలయింది. ఇందులో మాటలు ఒక చిన్న దృశ్యంలో వినిపించినా, సినిమా దృశ్యానికి ‘ఆడియో ట్రాక్’ జత చేసి పాటలు వినిపించిన సినిమా ‘ది జాజ్ సింగర్’.
ఆ తరువాత సినిమాల్లో కోరియోగ్రాఫీ, సంగీతాలు ప్రధాన స్థానాన్ని ఆక్రమించాయి. ‘గోల్డ్ డిగ్గర్స్’ సినిమా సంగీతం గురించి ఇప్పటికీ పరిశోధనలు సాగుతున్నాయి. ‘ఫ్రెడ్ ఆస్టియర్’, ‘జింజర్ రోజర్స్’ వంటి వారు ‘సూపర్ స్టార్స్’ లా ఎదిగారు.
ఇది అంతవరకూ మూకీ సినిమాలతో రాజ్యం ఏలుతున్న నటీనటుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించింది. మూకీ సినిమాల్లో నటీనటులు మాట్లాడేందుకు భయపడ్డారు. వారి రూపానికి స్వరానికి సమన్వయం కుదురుతుందో, లేదోనన్న భయం వారికి జీవన్మరణ సమస్య అయింది. ఒకవేళ వారి రూపానికి స్వరానికి సమన్వయం కుదరకపోతే, వారి కేరిర్లు సమాప్తమయినట్టే. ఈ భయం ఆనాటి సినీరంగాన్ని కుదిపివేసింది.
ఇలాంటి సమయంలో మూకీ చిత్రాల సూపర్ స్టార్ చార్లీ చాప్లిన్ ఓ సినిమా నిర్మించాడు. 1936లో విడుదలయింది, ‘ది మెడరన్ టైమ్స్’ సినిమా. ఈ సినిమాలో చార్లీ చాప్లిన్ పాట పాడేడు. తరువాత ఈ పాట కోసం చార్లీ చాప్లిన్ సృజించిన సందర్భం ప్రపంచ వ్యాప్తంగా అనుకరణకు గురయింది.
ఓ cafe లో పాట పాడే ఉద్యోగం వస్తుంది ఆయనకు. అది కూడా అతని డాన్సర్ ప్రేయసి ద్వారా వస్తుంది. ఆమె అతనికి పాడటం నేర్పుతుంది. పాటలో పదాలు గుర్తుండేందుకు ఓ కాగితం పై రాసిస్తుంది. ఆ కాగితాన్ని అతను తన పుల్ చేతుల చొక్కాలో ‘కఫ్స్’ దగ్గర ఉంచుకుంటాడు. అతను పాట పాడాల్సిన సమయం వస్తుంది. నాయక అతడిని కేఫ్ లోకి తోస్తుంది.
సంగీతం ఆరంభమవుతుంది. సంగీతానికి తగ్గట్టుగా హాస్యంగా స్టెప్పులేస్తాడు చాప్లిన్. ఆ స్టెపులేయటంలో చేతులు ఊపుతాడు. చేతిలో దాచుకున్న పాటల పదాల కాగితం ఎక్కడో ఎగిరిపోతుంది. ఇక అప్పుడు మొదలవుతుంది అవస్థ. పాట పాడలేడు. ఎందుకంటే పదాలు మరచిపోయాడు. పదాలు రాసుకున్న కాగితం ఎపుడో పోయింది. పాడకుండా ఉండలేడు. పాట ఎంతకీ ఆరంభం కాకపోవటంతో అక్కడున్నవారు గోల చేస్తారు. ‘ఏదో ఒకటి అర్ధం పర్ధం లేని పదాలుతో పాడు’ అని సౌంజ్ఞ చేస్తుంది నాయిక.
పాడటం ఆరంభిస్తాడు. సినిమాల్లో తొలిసారిగా చాప్లిన్ స్వరం వినిపిస్తుంది. అయితే, ప్రేక్షకుడు అప్పటికి పడీ పడీ నవ్వుతుంటాడు. చాప్లిన్ రూపానికి స్వరం సరిపోయిందా, లేదా అన్న ప్రశ్న కలిగే వీలు లేకుండా నవ్వటంలో మునిగిపోతాడు. ఎందుకంటే, అప్పటికే చాప్లిన్ పలు విభిన్న భాషలలో శబ్దాలను కలిపి, పాట పాడుతూ నృత్యం చేస్తుంటాడు.
SE BELLA GIU SATORS
JE NOTRE SO CAFORE
JE NOTRE SI CAVORE
JE LA TU LA TI LA TWAH
అర్థం పర్థం లేని శబ్దాలను హాస్యంగా పలుకుతూ, చాప్లిన్ చేసే నృత్యంలో మునిగిన ప్రేక్షకుడు మిగతావన్నీ మరచిపోతాడు, నిజానికి ఈ పాట పలు యురోపియన్ భాషల పదాలతో ఏర్పరచిన ‘bricolage’.
(Sing along with Chaplin – Nonsense Song
https://www.youtube.com/watch?v=Zqd1ar5_7qw )
ప్రేక్షకుడికి ఇవేవీ పట్టవు. పాటలో పదాలేమిటి, వాటి అర్థమేమిటీ అన్న ఆలోచనే రాదు. చాప్లిన్ పాడే విధానం, నృత్యం పైనే దృష్టి ఉంటుంది. గమనిస్తే, ఆనాడు చాప్లిన్ నృత్యంగా వేసిన స్టెప్పులను తరువాత ఎందరో అనుకరించారు. వెనక్కు జారటం, ముందుకు జారటం, వంటి స్టెప్పులు హాస్యగాళ్లు అనుకరించారు. చాప్లిన పాట ఆరంభించేందుకు ముందు గిటార్ లయను గమనించండి.
‘శ్రీ 420’ అనే రాజ్ కపూర్ సినిమాలో ‘ఈచక్ దానా బీచక్ దానా’ అని పిల్లలకు పాటలు చెప్తూ నర్గీస్ ఒక పొడుపు కథల పాట పాడుతుంది. ఆ పాట చివరి చరణం ముకేష్ స్వరంలో రాజ్ కపూర్ పాడతాడు. పాట లయ వేగం తగ్గుతుంది. రాజ్ కపూర్ లయ బద్ధంగా శరీరాన్ని కదుపుతాడు. అడుగులేస్తాడు. అచ్చు చార్లీ చాప్లిన్‌లా చేస్తాడు. అప్పుడు వచ్చే సంగీతాన్ని గమనిస్తే చాప్లిన్ పాట లయ ‘ఈచక్ దానా’ పాట లయ ఒక్కటే!
రాజ్ కపూర్‌పై చాప్లిన్ ప్రభావాన్ని అతి స్పష్టంగా పట్టిస్తుంది ఇది. ఇంకొంచెం జాగ్రత్తగా గమనిస్తే ‘మేరా జూతాహై జపానీ’ పాట లయ కూడా ‘ఈ చక్ దానా’ పాట లయతో కలుస్తుంది! ఈ లయ ను ‘దత్తారాం ఠేకా’ అంటారు. సంగీత దర్శకులు శంకర్ జైకిశన్ ల సహాయ సంగీత దర్శకుడు దత్తారాం.
చాప్లిన్ తరువాత ఇలాంటి సందర్భాన్ని సినిమాల్లో కొద్దిపాటి తేడాతో సృజిస్తూనే ఉన్నారు. హీరోకు పాట రాదనుకుంటారు. లేకపోతే ఆట రాదనుకుంటారు. ఏదో వాయిద్యం వాయించలేడనుకుంటారు. అతడిని ఇరుకున పెట్టాలని వేదిక పైకి నెడతారు. అందరినీ ఆశ్చర్యపరుస్తూ హీరో కానీ హీరోయిన్ కానీ అద్భతంగా పాడి/ ఆడి/వాయించి అందరినీ మెప్పిస్తారు. ఇలాంటి సందర్భాలు , పాటలు మీరు చూసిన సినిమాల్లోవి గుర్తుకువస్తే వెంటనే కామెంట్ రూపంలో తెలపండి.
‘కార్వాన్’ అని ఒక హిందీ సినిమా ఉంది. దాన్లో తనను వెంటాడుతున్న వారి నుంచి తప్పించుకుని నాయిక, నాయకుడితో తోటి ‘సర్కస్’ వారితో కలసి అనుకోకుండా స్టేజి పైకి వెళ్తుంది. ఆ స్టేజిపై పాడాల్సిన ఆమె వీరిపై కోపంతో ఆడదు. పాడదు. ఎదురు చూస్తున్న ప్రేక్షకులు అసహనం ప్రదర్సిస్తారు. ఎవరెవరో వచ్చి పాడబోతే వాళ్ల పై కోడి గుడ్లు విసుర్తారు. అలాంటి పరిస్థితులలో నాయికను స్టేజిపైకి తోస్తారు. ఎలాగోలా ఆడమంటారు. పాడమంటారు. నాయకుడు చేతులూ కాళ్లూ ఊపుతూంటాడు. ప్రేక్షకులు గోల చేస్తారు. అప్పుడు భయంతో నాయిక ఏదో ఓ పాట పాడేస్తుంది.
దయ్యా యె మై కహా ఆ ఫసీ, కైసీ ఫసీ
రోన అవే న ఆనే హసీ, పాపే బచాలో తుసీ..
పంజాబీ, హిందీ, విచిత్ర శబ్దాలు అన్నీ కలిపి చిత్ర విచిత్రంగా పాడుతుంది నాయిక. మధ్యలో హాస్యం సృష్టించేందుకు స్టేజిపై కోళ్లు వస్తాయి. ఇలా హాస్యం సృష్టించేందుకు నానా తంటాలు పడతారు నటీనటులు తెరపై. కానీ పాట అద్భుతంగా ఉంటుంది. ఆ కాలంలో సూపర్ డూపర్ హిట్ అయిందీ పాట. ఆశా భోస్లే ఇంకెవరూ పాడలేనంత అద్భుతంగా పాడిందీ పాట. మళ్లీ ఆశానే కాదు వేదికపై ఇంకెవరూ కూడా ఈ పాటను పాడి మెప్పించలేనంత అద్భుతంగా పాడిందీ పాటను.
చార్లీ చాప్లిన్ పాటకు సందర్భంలో హాస్యం ఉంది. అప్పటికే చాప్లిన్ పలు ఉద్యోగాలు చేసి భంగపడి ఉంటాడు. జైలు కెళ్లాలని విఫల ప్రయత్నాలు చేస్తాడు. దాంతో ఈ ప్రయత్నం కూడా విఫలమవుతుందని ప్రేక్షకుడు మానసికంగా సిద్ధంగా ఉంటాడు. పైగా, హాస్యం ‘చాప్లిన్’ పేరులోనే ఉంది అతని ప్రతి కదలికలో ఉంది. పాట చిత్రీకరణకు కెమేరామేన్ పెద్దగా కష్టపడి ఉండడు. ఆ కాలంలో కెమేరా పెద్దగా కదిలేది కాదు. స్థిరంగా ఉండేది. దాని ముందు నటీనటులు కదిలేవారు.
కెమెరా వ్యూ పరిధి నిర్ణయించుకుని అంతలోనే హాస్యాస్పదమైన నృత్యం చేస్తాడు చాప్లిన్. అతని ప్రతి కదలికలో హాస్యం ఉట్టి పడుతుంది. పాటలో ప్రతి పదం హాస్యం కలిగిస్తుంది.
ఇందుకు భిన్నంగా ‘కారవాన్’ పాట సందర్భం ‘మోడరన్ టైమ్స్’ లాంటి సందర్భమే అయినా, హాస్యం సృష్టించేందుకు ఎంతో కష్టపడాల్సి వచ్చింది నటీనటులు. చిత్రీకరణలో కూడా హాస్యం సృష్టించేందుకు కోళ్లను వదిలినా, గేయ రచయిత మజ్రూహ్ సుల్తాన్‌పురి అర్ధం లేని వాక్యాలను అర్థవంతంగా కలిపి పాట రచించినా, ఆశాభోస్లే అద్భుతంగా గానం చేసినా పాట బాగుంది కానీ అంతగా హాస్యం పండదు. ఇందుకు ప్రధాన కారణం, పాట కోసం సన్నివేశం కల్పించారు తప్ప, సన్నివేశాన్ని ఉద్దీపింప చేసేందుకు పాటను సృజించలేదు. పైగా, పాట బాణీ ఎంత అద్భతంగా ఉంటుందంటే, ఆశ్చర్యానందాలను కలిగిస్తుంది. హాస్యం కలిగించదు. తెరపై నటీనటులు వేసే చిందులు చిరాకు కలిగిస్తాయి. ఇంత అందమైన పాటకు, అంత అద్భుతమైన గానానికి ఈ ‘చిందులేమిటి?’ అనిపిస్తుంది.
దేఖె హర్ ఏక్ మొహె జూవూన్ మై కిధర్?
భాగీ తో ఖుర్సీ ఉలట్ గయి ఉధర్
కాలీ సీ ముర్గీ ఉడ్ గయీ కిధర్?
తురు తురు తురు
తర రారా తరా
దేఖే అండా కహాఁ ఫసీ
బచ్చీ కైసే బచ్చీ కైసీ బచీ
రోన ఆవేన అవే హసీ
పాపే బచాలో తుస్సీ..
ఇవి పాటలో ఒక చరణంలో పదాలు. మజ్రూహ్ ఎలాంటి సందర్భంలో పాటనయినా అవలీలగా అందంగా రాయగలడు. Nonsense ను కూడా sensible గా రాస్తాడంటారు. ‘ప్రతి ఒక్కరు నా వైపే చూస్తుంటే ఎటు పోవాలి నేను? నేను పరుగెత్తితే కుర్చీ పడిపోయింది. ఈ నల్ల కోడి ఎటు పోవాలని ఎగిరింది? ఈ కోడి గుడ్డు ఎక్కడ ఇరుక్కుందో చూడు. పిల్ల ఎలా తప్పించుకుంటుందో. ఏడుపు రావటం లేదు. నవ్వు వస్తుంది. నువ్వే రక్షించాలి.’ ఇదీ చరణం అర్ధం. మజ్రూహ్ పద ప్రయోగాలు గమ్మత్తయినవి ‘బచ్చీ బచీ’ ‘పిల్ల’ ‘తప్పించుకోవటం’
ఇలా అర్థం లేని వాక్యాలకు అర్థం ఇస్తూ సందర్భోచితంగా పాట రచించాడు. కానీ స్క్రిప్టులో పాట కోసం సరైన సందర్భం లేకపోవటంతో, పాట ‘హిట్’ అయింది కానీ అనుకున్నంత ప్రభావం చూపలేదు. ఈ సినిమాలోని ఇతర పాటలే ఇంకా ‘హిట్’ అయ్యాయి.
కానీ ఇదే పాటను సందర్భం మార్చి నాయకుడి వ్యక్తిత్వాన్ని చూపే పాటగా సృష్టిస్తే, మరపురాని మధుర గీతంలా మారి, హిందీ పాటకన్నా గొప్పగా అనిపిస్తుంది.
తెలుగులో ‘శ్రీవారు మావారు’ అనే సినిమాలో జి.కె.వెంకటేశ్ సంగీత దర్శకత్వంలో బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట మరపురాని మధురమైన పాట. పాట సండర్భం వేరు. బాణీ ‘దయ్యా యె మై కహ ఆకే ఫసీ’ దే. హిందీ పాటలో లాగా హాస్యం సృష్టించాలన్న తపనలేకుండా ఆహ్లాదకరమైన రీతిలో పాటను మృదువుగా చేశారు. పాట చిత్రీకరణలో కూడా హీరోతో పాటు ప్రకృతి దృశ్యాలపై కూడా దృష్టి పెట్టటంతో పాట చూసేందుకు కూడా చక్కగా ఉంటుంది. పాట రాసిన డాక్టర్ సి.నారాయణరెడ్డి, పాటలో మృదు మధురమైన, సరళ లాలత్యమైన పదాలను అత్యద్భుతంగా వాడటంతో పాట ఎన్నో మెట్లెక్కింది.
‘పూలు గుసగులాడేనని – జత గూడేనని
గాలి ఈలలు వేసేనని, సైగ చేసేననీ
అది ఈ రోజే తెలిసిందీ..’
అద్భుతంగా కుదిరింది. పల్లవిలో ఒక్క ద్విత్యాక్షరం లేదు. ‘పూలు గుసగుసలాడటం’, ‘గాలి ఈలలు వేయటం’ అద్భుతంగా కుదిరింది.
హిందీలో ఆశా భోస్లే ‘దయ్య’, ‘ఫసీ’ ‘అవేన్న’, ‘ఆవే’, ‘తూసీ’ వంటి పదాలను పలికిన తీరు, తీసిన రాగాలు, పోయిన వయ్యారాలు గమనిస్తే, తెలుగులో సందర్భోచితంగా బాలసుబ్రహ్మణ్యం అదే తరహాలో పాటను మార్చి పాడటం తెలుస్తుంది.
‘మబ్బు కన్నెలు పిలిచేనని
మనసు రివ్వున ఎగసేనని
వయసు సవ్వడి చేసేనని..
ఇప్పుడే తెలిసింది..’
మబ్బు, మనసు, వయసు. కన్నె, రివ్వున, సవ్వడి, పిలిచేనని, ఎగసేనని, చేసేనని.. పాట రచనా సంవిధానం పరమాద్భుతం. ఎక్కడా కఠినమైన పదం లేదు. ‘ఫాలనేత్ర సంప్రభవత్ జ్వాలలు ప్రసవశరుని దహియించగా’ అన్న కవేనా ఇది రాసింది? అన్న సందేహం రాక మానదు.
పాట చిత్రీకరణలో కూడా నటుడు కృష్ణ తనదైన ప్రత్యేక రీతిలో పాట లయకు అనుగుణంగా నడిచాడు, పరుగులు పెట్టాడు. చిన్నగా ఎగిరేడు. పూలను వంగి తాకాడు. పాట వింటూ తెరపై చూస్తుంటే పెదవుల పై చిరునవ్వు నిలుస్తుంది. పాట అయితే, మనసును దోచేస్తుంది.
‘అలలు చేతులు సాచేనని
నురుగు పువ్వులు పూచేనని
నింగి నేలను తాకేనని, నేడే తెలిసింది..’
మొదటి చరణానికి ఏ మాత్రం తీసిపోదు రెండవ చరణం. అలలు చేతులు సాచటం, నింగి నేలను తాకటం అనుభవమే. వెంటనే ఆ అనుభూతి పొందుతాం.. ‘నురుగు పువ్వులు పూయటం’ దగ్గర అగిపోతాం. ఎంత అద్భుతమైన ఊహ! అలల వల్ల ఏర్పడిన నురుగును పరిశీలించిన వారయితే మైమరచిపోతారు. అలలు నురుగును ఏర్పరచటాన్ని నురుగు పువ్వులు పూయటంగా ఊహించిన కవి ఊహాశబలతకు ముగ్ధులమైపోతాం. ‘నురుగు పూలు పూయటం..’ ఇదీ గేయ రచయిత పాట స్థాయిని పెంచేందుకు చక్కని నిదర్శనం.
హిందీ భాషలో ద్విత్వాక్షరాలు తక్కువ. అతి లలితమైన భాష అది. ఆ భాష కోసం ఏర్పరిచిన బాణీని తెలుగులో అంత లలితమైన, అంతకన్నా మధురమైన పదాలను భావాలను, ఊహలను అద్ది అందించటం అచ్చమైన కవికే సాధ్యం. ఒక కవి ఇంత లలితంగా రాయగలగాలంటే అతని వ్రేళ్ళు ప్రాచీన సాహిత్యంలో ఎంతో లోతుగా నాటుకుని ఉండాలి.
‘నల్లని మబ్బులు గుంపులు గుంపులు
తెల్లని కొంగలు బారులు బారులు
అవిగో అవిగో అవిగో..’ (కృష్ణశాస్త్రి, మల్లీశ్వరి)
పదాలు సామాన్యం అనిపిస్తాయి. పదాల వెనుక ఉన్న ప్రతిభ పాండిత్యాలు సామాన్యం కావు. పుట్టు గేయ రచయితలను, పెట్టు గేయ రచయితలనూ వేరు చేసేది ఇదే! అందరూ బళ్లని వేగంగా కాస్త సాధన చేస్తే నడపగలరు. వేగంగా నడపగలిగి ఉండీ సందర్భాన్ని బట్టి అతి నెమ్మదిగా నడిపించగలగటమే డ్రైవర్ ప్రతిభకు నిదర్శనం అంటారు. అది లలిత చలిత పద కలిత కవిత లతల గేయ మాలికల రచనలో తెలిసిపోతుంది.
ఈ పాట నిజానికి ఆర్.డి. బర్మన్ సృష్టి అయినా దానికి సందర్భోచితమైన మార్పులు చేర్పులు చేశాడు సంగీత దర్శకుడు జి.కె. వెంకటేశ్. పాట ముందు ‘యే షామ్ మస్తానీ’ పాట బాణీని ఈలతో పాడించాడు. ఆ బీట్ నుంచి అసలు పాట బీట్ లోకి ఎలాంటి ‘జెర్క్’ లేకుండా రూపాంతరం చెందించాడు. పాట చివరలో గ్రామీణ తీన్మార్ బీట్లు మ్రోగించాడు. మెత్తంగా కలిపి పాటను ఒక అద్భుతమైన అతి సున్నితమైన అనుభవంలా మలచి ‘ఒరిజినల్’ను మరపింపజేశారు.
హిందీలో ఆశా ఎంత అద్భుతంగా పాడినా తగిన భావాలను ఆశా పరేఖ్ ప్రదర్శించలేకపోయింది. తెలుగులో బాల సుబ్రహ్మణ్యం ఎంత అద్భుతంగా పాడేడంటే, నటుడు కృష్ణ ఎలాంటి భావాలను ప్రదర్శించకపోయినా , కృష్ణ పాడేడన్న అనుభూతి కలుగుతుంది. బాలసుబ్రహ్మణ్యం, కృష్ణ గొంతుగా నిలవటంలో ఈ పాట దోహదపడిందంటేనే పాట ప్రభావాన్ని ఊహించవచ్చు.
(ఈ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు:
https://www.youtube.com/watch?v=jRjwP7GWlOY )
(మళ్ళీ కలుద్దాం)