[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సరికొత్త సినిమా పాటల శీర్షిక.]
విదేశీ సినిమాలలో నేపథ్య సంగీతానికి ఉన్న ప్రాధాన్యం భారతీయ సినిమాలలో సినిమా పాటకు ఉన్నదన్న విషయంలో ఒక నిర్ణయానికి వచ్చిన తరువాత అసలు సినిమాలో శబ్దానికి సంగీతానికి ఉన్న ప్రాధాన్యం గురించి కూడా స్పష్టంగా చర్చించుకోవాల్సి ఉంటుంది. ముందుగా స్పష్టంగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, సినిమా సంగీతం అంటే సినిమాలో వినిపించే సంగీతం. అది నేపథ్య సంగీతం, పాటలతో సహా ఇతర ధ్వనులు, నిశ్శబ్ధాలను కూడా కలుపుకుని సినిమా సంగీతంగా భావిస్తారు.
‘Film music is music that accompanies a film’ అన్నది సినిమా సంగీతానికి నిర్వచనం.
సినిమాలో సంగీత లక్ష్యం ఏమిటన్న విషయంలో పలు భిన్నాభిప్రాయాలున్నా, సినిమాకు సంగీతం, ‘ఆత్మ’ వంటిదన్న విషయంలో ఎలాంటి సందేహాలు లేవు. సినిమాల్లో పలు సందర్భాలలో దర్శకుడు ఒక స్థాయి వరకే సన్నివేశాలలో ఉద్విగ్నతను కాని ఇతర భావాలను కానీ ప్రదర్శించగలడు. నటీనటులు కూడా ఒక స్థాయి వరకే తమ నటన ద్వారా రక్తి కట్టించగలరు. అలాంటి సందర్భాలలో, అంటే దర్శకుడు దృశ్యం ద్వారా కానీ, నటీనటులు నటన ద్వారా కానీ సంపూర్ణంగా భావాలను వ్యక్తపరచి రస సృష్టిని ఉచ్చస్థాయికి చేర్చలేరో, ఆ సందర్భాలలో సంగీతం రంగప్రవేశం చేసి ఆ లోటును పూడ్చి దృశ్యాన్ని సంపూర్ణం చేస్తుంది. ఆయా సందర్భాలలో సంగీతం దృశ్యానికి అదనపు లోతును, శక్తినిచ్చి విలువను పెంచుతుంది.
“Music adds that extra dimension to a given scene that is necessary for the success of conveying directors intention” అంటారు Larry M. Timm, ‘Film Music, the Soul of Cinema’ అన్న పుస్తకంలో.
ప్రఖ్యాత సినీ సంగీత దర్శకుడు, రెండు అకాడమీ అవార్డులు గెలిచిన సంగీత దర్శకుడు, ఎ ఫిస్ట్ ఫుల్ ఆఫ్ డాలర్స్, ది గుడ్ బ్లాడ్ అండ్ అగ్లీ, సినిమా పారాడిసో, ది అన్‌టచబుల్స్ వంటి సినిమాల సంగీత దర్శకుడు అయిన Ennio Morricone, సినీ సంగీత ప్రధాన, లక్ష్యాల గురించి వివరిస్తూ “Film music must not add emphasis but must give more body and depth to the story, to the characters, to the language that the director has chosen. It must, therefore, say all the dialogue, images that affects cannot say” అంటాడు.
“సినిమా సంగీతం దృశ్యాన్ని ఉద్దీపింప చేయటం కాదు, కథకు, పాత్రలకు, భాషకు దర్శకుడు ఎంచుకున్న దాని కన్నా అధికమైన లోతును, వైశాల్యాన్ని జోడించాలి. సంభాషణలు, దృశ్యాలు, ఇతర సాంకేతిక పరిజ్ఞానం ఇవ్వలేని దాన్ని సంగీతం ఇవ్వాలి!”
‘Soundtrack: the Music of the Movies’ అన్న పుస్తకంలో Mark Evans సినిమా సంగీత విధులను సూచించాడు.
“సినిమా వేగాన్ని పెంచటమో, సందర్భోచితంగా తగ్గించటమో చేస్తుంది సంగీతం.”
“సినిమా సంగీతం భావాలకు అద్దం పట్టాలి. పాత్రల భావాలను, సన్నివేశం పండిచే రసాన్ని సంగీతం ప్రతిఫలించాలి.”
సినిమా సంగీతం పాత్రలు మాటల ద్వారా చెప్పని ఆలోచనలను, ఒక సంఘటన వల్ల జరగబోయే ఊహంచని పరిణామాలను స్ఫురింపచేయాలి, ప్రేక్షకుల మెదళ్లలో. సినిమా సంగీతం తెరపై జరగుతున్న సంఘటన ప్రభావాన్ని పెంచాలి.
సంగీతం తెరపై కనబడే దృశ్య స్థలకాలాలను, వాతావరణాన్ని ప్రేక్షకుడు గ్రహించేట్టు చేయాలి.
సంగీతం అవసరాన్ని, వీలును బట్టి హస్య రసాన్ని సృజించాలి.
సంగీతం మరో విధి ఏమిటంటే కథకొక ఏకసూత్రతను సాధించటం.
సినీ సంగీతం సాధించగల మరో లక్ష్యం ఏమిటంటే ఒక సన్నివేశ తీవ్రతను తగ్గించటం. తెరపై కనబడే దృశ్యాలకి వ్యతిరేకమైన భావాలను కలిగించే సంగీతాన్ని వినిపించటం ద్వారా దృశ్య తీవ్రతను తగ్గిస్తుంది నేపథ్య సంగీతం.
సినీ సంగీతం తెరపై దృశ్యాన్ని వేగవంతం చేస్తుంది. మరి కొన్ని సందర్బాలలో ఎలాంటి లక్ష్యం, ప్రభావం లేకుండా నేపథ్యంలో వినిపిస్తుంది సంగీతం.
నిజానికి సినిమాల్లో ‘నిశ్శబ్దం’ ఎంతో ప్రభావం చూపిస్తుంది. ఈ నిశ్శబ్దాన్ని కూడా సినిమా నేపథ్య సంగీతంలో భాగంగా భావిస్తారు. అనేక సినీ దర్శకులు నిశ్శబ్ధాన్ని ఎంతో ప్రతిభావంతంగా, మరపురాని ఎఫెక్ట్‌ను ఇచ్చేందుకు వాడుకున్నారు.
ఇదంతా విదేశీ సినిమాలకి అధికంగా వర్తిస్తుంది. వారి సినిమాలలో సందర్భోచితంగా పాటలు వినిపించినా అవి నేపథ్యంలో వినిపిస్తాయి, ఒక్క మ్యూజికల్స్‌లో తప్ప. దాంతో విదేశీ సినిమాలలో నేపథ్య సంగీతం, దాని ప్రభావంపై అనేక చర్చలు జరిగాయి. పరిశోధనలు జరుగుతున్నాయి.
భారతీయ సినిమాలలో, ఇప్పుడు నేపథ్య సంగీతం గురించి చెప్పుకున్న కర్తవ్యాలు విధులు అన్నీ పాటలు సాధిస్తాయి.
పాటలు పాత్రల మనోభావాలు తెలుపుతాయి, సన్నివేశం విలువను పెంచుతాయి. పాటలకు స్క్రిప్టులో సరైన సందర్భం సృజిస్తే సినిమాను ముందుకు నడిపిస్తాయి. జరగబోయే సంఘటనలను సూచన ప్రాయంగా ప్రేక్షకుడికి స్పురింపచేస్తాయి, ఉద్విగ్నితను కలిగిస్తాయి, హాస్యాన్ని కలిగిస్తాయి. ఇలా నేపథ్య సంగీతం ఏయే కర్తవ్యాలు నిర్వహిస్తుందో, సినిమా పాట కూడా ఆయా కర్తవ్యాలను సమర్ధవంతంగా నిర్వహిస్తుంది. విదేశీ సినిమాల్లో నేపథ్య సంగీతం చేసే పనుల కన్నా ఎక్కువ పనులు సినిమా పాట చేస్తుంది.
నాయికా, నాయకులకు ఇమేజ్‌ని సృష్టిస్తాయి పాటలు. సినిమా వ్యాపార విలువను పెంచుతాయి. సినిమాలకు గుర్తింపు సంతకంలా ఎదుగుతాయి. విదేశీ సినిమాల నేపథ్య సంగీతాన్ని విశ్లేషిస్తూ పలు పుస్తకాలు వచ్చాయి. నేపథ్య సంగీతాన్ని వాయించేందుకు వాటి నొటేషన్స్‌ను అందించే పుస్తకాలున్నాయి. నేపథ్య సంగీత సృజనకర్తలతో ఇంటర్వ్యూలు, పలు పుస్తకాలు వచ్చాయి. అలాగే భారతీయ సినిమాలలో పాటల రూపకర్తలైన సంగీత దర్శకులు, గేయ రచయితలు, గాయనీ గాయకుల గురించి పలు పుస్తకాలు వచ్చాయి. సినిమా పాటలను విశ్లేషిస్తూ పుస్తకాలున్నాయి. ఒకప్పుడు సినిమా పాటల పుస్తకాలు కూడా వచ్చేవి. ఘంటసాల పాటలు, ఘంటసాల – సుశీల పాటలు, ఆత్రేయ గీతాలు, ఆరుద్ర పాటలు, శ్రీశ్రీ సినీ గీతాలు, వేటూరి, సిరివెన్నెల సీతారామ శాస్త్రి పాటలు – ఇలా ఇప్పుడు బోలెడన్ని పుస్తకాలు వస్తున్నాయి. కానీ, భారతీయ సినిమాలలో నేపథ్య సంగీతాన్ని విశ్లేషిస్తూ, అది రూపాంతరం చెందిన విధానాన్ని వివరిస్తూ వ్రాసిన పుస్తకాలు బహు అరుదు. ఎందుకంటే భారతీయ సినిమాలలో పాటలకు ఉన్న ప్రాధాన్యం నేపథ్య సంగీతానికి లేదు కాబట్టి.
నేపథ్య సంగీతం సినిమా ఘాటింగ్ పూర్తయిన తరువాత సృజిస్తారు. ఇది సినిమా నిర్మాణంలో ‘పోస్ట్ ప్రొడక్షన్’ పని. సినిమాలలో మనం వినే ధ్వనులు, సంగీతం అంతా సృజించటం, డబ్బింగ్ చేయటం, రికార్డు చెయ్యటం.. మొత్తం సినిమా షూటింగ్ అయిన తరువాత జరుగుతుంది.
ఇందుకు భిన్నంగా భారతీయ చలన చిత్రాలలో సినిమా పాటల రూపకల్పన, రికార్డింగ్ పలు సందర్భాలలో సినిమా నిర్మాణం ఆరంభానికి ముందే పూర్తవుతుంది. పాటల చిత్రీకరణ సమయానికి పాటల రూపకల్పన పూర్తి అయిపోవాలి. కొన్ని సందర్భాలలో సినిమా పాటలు విడుదలయిన తరువాత రూపొందించి ఎడిట్ చేసి సినిమాలలో జోడించటం వల్ల కూడా సినిమా వ్యాపార విలువను పెంచుతారు. అయితే, పాటలు సినిమా విడుదలకు ముందే ప్రజాదరణ పొంది, సినిమా విడుదలయిన తరువాత దాని విజయంలో ప్రధాన పాత్ర పోషించాలి. ఇంకొన్ని సందర్భాలలో షూట్ చేసిన పాటను పలు రకాల కారణాల వల్ల సినిమాలోంచి తొలగిస్తారు. కానీ ఆ పాట అప్పటికే ప్రజాదరణా పొందటంతో సినిమా విజయానికి తోడ్పడుతుందన్న భావన కలిగితే దాన్ని సినిమా విడుదలైన కొన్నాళ్ళకి సినిమాలో జోడించి సినిమాను ప్రదర్శిస్తారు.
విదేశీ సినిమాలలో నేపథ్య సంగీతం ఎంత కీలకమైన పాత్రను పోషిస్తుందంటే, ఘాటింగ్ పూర్తి అయిన తరువాత సినిమా వేగం తక్కువగా ఉందనిపించినా, అంతగా బాగా లేదనిపించినా, సినిమాను ఆసక్తికరంగా ఆకర్షణీయంగా చేసే బాధ్యతను నేపథ్య సంగీతం దర్శకుడిపై వదిలేస్తారు. అక్కడ నేపథ్య సంగీతానికి అంత ప్రాధాన్యం. ఒక సినిమా పరాజయం నుండి విజయవంతం అవటం, హిట్ నుండి సూపర్ హిట్ అవటంపై నేపథ్య సంగీత ప్రభావం అమితంగా ఉంటుందని వారు నమ్ముతారు. అందుకే కొన్ని సందర్భాలలో సినిమా షూటింగ్ కన్నా ఎక్కువ సమయం నేపథ్య సంగీత సృజనపై వెచ్చిస్తారు.
మన సినిమాల్లో ఇంతకన్నా ఎక్కువ సమయం పాటలపై వెచ్చిస్తారు. ఒక సినిమా విడుదలకు ముందే పాట విడుదలై ప్రజాదరణ పొందితే సినిమా సగం హిట్ అయినట్టే. ‘పుష్ప’ సినిమా విడుదలకు ముందే ‘ఊ అంటావా మామా’ పాట విడుదలయింది. ప్రజలను విపరీతంగా ఆకర్షించింది. దాంతో సినిమా ఆకర్షణ విపరీతంగా పెరిగింది.
‘సారంగదరియా’ పాట కూడా ‘లవ్ స్టోరీ’ సినిమా విడుదలవక ముందే ప్రజలను విపరీతంగా ఆకర్షించింది. సినిమా పట్ల కుతూహలం పెంచింది.
కానీ, ఈ రెండు పాటల ప్రాధాన్యం సినిమా విడుదల అవగానే తగ్గిపోయింది. ఇతర పాటల ప్రాధాన్యం పెరిగింది. ‘పుష్ప’లో ‘నా సామీ’, ‘శ్రీవల్లీ’ పాటలు విపరీతంగా ప్రజాదరణ పొందాయి. వాటి ఆదరణ ముందు ‘ఊ అంటావా’ వెనక్కు పోయింది. అలాగే ‘లవ్ స్టోరీ’ లో ‘ఏయ్ పిల్లా’, ‘ఏవో ఏవో కలలే’ లు ‘సారంగదరియా’ పాటను డామినేట్ చేశాయి ప్రజాదరణ విషయంలో.
ఇందుకు కారణాలు పాట చిత్రీకరణ, పాట కోసం సన్నివేశాన్ని స్క్రిప్టు సృష్టించటం.. వినే సమయంలో పాట ప్రభావం ఎంత ఉన్నా, సినిమాలో పాట కోసం సరైన సన్నివేశాన్ని సృజించక పోయినా, పాట చిత్రీకరణ, పాట విన్నప్పుడు శ్రోతల మనసులలో కలిగిన ఊహాచిత్రానికి భిన్నంగా ఉన్నా, ఆ పాటకు ఆదరణ తగ్గుతుంది. ‘ఊ అంటావా’ కానీ ‘సారంగదరియా’ పాటలు కానీ విన్నప్పుడు కలిగించిన స్పందనను సినిమాలో కలింగించ లేక పోవటం, ఇతర సన్నివేశాలు కానీ, వాటి చిత్రీకరణ కానీ ఈ పాటలన్నా మెరుగుగా ఉండటంతో ఆయా పాటల ఆదరణ ఈ పాటలకన్నా ఎక్కువయింది.
దీన్నిబట్టి గ్రహించేదేమిటంటే ఒక పాట వింటే బాగుంటే సరిపోదు, తెరపై చూస్తున్నప్పుడూ బాగుండాలి. అప్పుడే ఆ పాట లక్ష్యం నెరవేరుతుంది. లేకపోతే సినిమా చూడటం కన్నా, పాట వినటానికే ఇష్టపడతారు. చిత్రీకరణ సరిగ్గా లేకపోతే ఒకోసారి ఆ ప్రభావం పాట వినటంపై కూడా పడుతుంది. అంత వరకూ నచ్చిన పాట కూడా సినిమాలో చూసిన తరువాత నచ్చకపోవచ్చు.
ఒక పాట ‘హిట్’ అవ్వాలంటే బాణీ బాగుండి, రచన బాగుండి, గాయనీగాయకులు చక్కగా పాడితే సరిపోదు. పాట కోసం సృజించిన సందర్భం బాగుండాలి. చిత్రీకరణ కూడా పాట ప్రభావాల్ని పెంచేదిగా ఉండాలి. ఇవన్నీ సరైన పాళ్లల్లో సక్రమంగా ఉంటే ఒక పాట చిరకాలం మనగలుగుతుంది. లేకపోతే కొన్నాళ్లకి మరపున పడుతుంది. స్క్రిప్టు రచన, చిత్రీకరణలు పాట మరువరానిదిగా ఎదగడటంలో ప్రధాన పాత్ర పోషిస్తాయి.
కానీ అనేక సినిమాల్లో సందర్భం సరిగ్గా రూపొందించరు. అలాంటి సందర్భాలలో పాటల ఆకర్షణ, నటీనటుల ఇమేజ్ పై ఆధారపడి పాట ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. సినిమాతో సంబంధం లేకుండా, పాట ఉండాలి కాబట్టి, ఉంచిన పాట పలు ఇతర కారణాల వల్ల, గాయనీ గాయకులపై ఉండే అభిమానం, నటీనటులపై అభిమానం వంటివాటివల్ల పాట ప్రేక్షకులను ఆకర్షిస్తుంది. సినిమాకథతో సంబంధం లేకుండా పాట ఉండాలి కాబట్టి పాటను ఇరికించే ఇలాంటి సినిమాలను ‘లలిత గోపాలన్’ అనే విమర్శకురాలు ‘cinema of interruptions’ అంటుంది. బాలసుబ్రహ్మణియన్ అనే సినీ పరిశోధకుడు సినిమా పాటలను ‘సినిమాలలో ప్రత్యేక సందర్భం’ ‘a special movement within a film’ అంటాడు.
కానీ మన సినిమాలకు ప్రధాన ఆకర్షణ పాటలు అన్నది నిర్వివాదాంశం. ఈనాటికి కూడా, పాటలు సినిమా కన్నా ముందు విడుదలవుతున్నాయి. పాటలు కనుక ఆకర్షణీయంగా ఉండి ప్రజాదరణ పొందితే సినిమా సగం విజయం సాధించినట్లే సంబర పడిపోతారు. అలాంటి పాటలు సృజించిన సంగీత దర్శకుడు, రాసిన గేయ రచయిత, పాడిన గాయనీ గాయకుల డిమాండ్ పెరిగిపోతుంది. కాబట్టి సినిమా పాటలని తేలికగా తీసిపారేయకుండా లోతుగా విశ్లేషించి విమర్శించి చర్చించాల్సి ఉంటుంది. ఎంత లోతుగా అంటే విదేశీయులు నేపథ్య సంగీతం గురించి అధ్యయనం చేసి విశ్లేషించి, విమర్శించినంత లోతుగా!
(మళ్ళీ కలుద్దాం)