[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సరికొత్త సినిమా పాటల శీర్షిక.]
సినిమా పాటల గురించి చర్చించే ముందు ఒక విషయం స్పష్టంగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రధానంగా సినిమా పాటలు వ్యాపారపరమైన సంగీత రూపానికి ప్రతినిధులు. కథను ముందుకు నడిపించటం, నాయికా నాయకుల భావాలను వ్యక్తపరచటం, నటులకు ఒక ఇమేజ్‍ని సృష్టించి ప్రేక్షకులకు చేరువ చేయటం వంటి ఎన్ని రకాల కారణాలను చెప్పినా ప్రధానంగా సినిమాల్లో పాటల ఉద్దేశం ప్రేక్షకులను పెద్ద సంఖ్యలో సినిమాకు వచ్చేట్టు చేయటం, పాటల రికార్డుల అమ్మకాల ద్వారా, నిర్మాతకు సినిమా వల్లనే కాక, అదనంగా ఆదాయం అందేట్టు చూడటం.
ఒక పాట ఎంత గొప్పగా రూపొందినా, అది శ్రోతల మెప్పు పొందకపోతే, ప్రేక్షకులను సినిమా హాళ్ళకు రప్పించలేకపోతే, రికార్డుల అమ్మకాలకు దారితీయకపోతే, ఆ పాట విఫలమయినట్టే. కాబట్టి, సినిమా పరిభాషలో ఒక పాట విజయవంతమయిందంటే అర్థం, ఆ పాట ప్రేక్షకులను పదే పదే సినిమా హాళ్ళకు రప్పించించి, రికార్డులను కొనేటట్టు చేసింది అని.
ఒక పాట ఎప్పుడు ప్రజలను ఆకర్షిస్తుంది? ఎందుకని ఆకర్షిస్తుంది? అన్న విషయంలో పలు పరిశోధనలు జరిగేయి. పాటలో ఏ అంశం ప్రజలను అధికంగా ఆకర్షిస్తుంది అన్న అంశం ఆధారంగానూ చర్చలు జరిగాయి. పరిశోధనలు జరిగాయి. ముఖ్యంగా, విదేశీ పరిశోధకులు ఈ విషయంపై అత్యంత ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు.
విదేశీ సినిమాలు సాధారణంగా ఒకే అంశం కేంద్రంగా సాగుతాయి. ‘మ్యూజికల్స్’ అంటే పాటలు ప్రధానంగా ఉండే సినిమాలు, క్రైమ్, రొమాన్స్ ఇలా సినిమాలు ఏక అంశం ప్రాధాన్యంగా రూపొందుతుతాయి. వారి స్క్రిప్టు రచన కూడా అలాగే సాగుతుంది. మొదటి దృశ్యం నుంచి చివరి వరకూ వారి సినిమాలు ఒక నది జన్మస్థానం నుంచి సాగర సంగమం గమ్యంగా ప్రవహించినట్టు, ప్రవహిస్తాయి. మన సినిమాలు ఇందుకు భిన్నం.
మన సినిమాలన్నీ పాటల సినిమాలు. అంటే మ్యూజికల్స్. సినిమాల్లో ప్రేమలుంటాయి. రొమాన్స్ ఉంటుంది. కుటుంబ గాథలుంటాయి. పిట్ట కథలుంటాయి. ప్రధాన సినిమా గమనంతో సంబంధం లేని కామెడీ ట్రాక్ ఉంటుంది. ఒక్కోసారి రెండు మూడు కామెడీ ట్రాక్‍లుంటాయి. ఇంతలోనే పగలు ఉంటాయి, ప్రతీకారాలు ఉంటాయి. ఓ విలన్ ఉంటాడు. వాడి అనుచరులుంటారు. అంటే, రొమాన్స్, లవ్, కామెడీ, మ్యూజికల్ లో క్రైమ్ ఉంటుంది. ఫైట్లు ఉంటాయి.
“Many Indian films are not quite comedies, not quite dramas, not quite romances, not quite musicals, but rather mixtures of all these genres in a single three-hour package.” అంటారు జేసన్ బీస్టర్- జోన్స్, ‘బాలీవుడ్ సౌండ్స్’ అనే పుస్తకంలో.
“భారతీయ సినిమాలలో అధిక శాతం సంపూర్ణంగా కామెడీలనో, డ్రామాలనో, రొమాన్సులనో, మ్యూజికల్స్ అనో అనలేము. ఇవి అన్ని రకాల కలగలుపు సినిమాలు. మూడు గంటలలో ప్రేమలు, ద్వేషాలు, యుద్ధాలు, పాటలు అన్నీ ప్రదర్శిస్తాయి సినిమాలు”. అందుకే మన సినిమాలను ‘ఫార్ములా సినిమాలు’ అంటారు.
ఫార్ములా ఏమిటంటే, నాయికానాయకుల మధ్య ప్రేమ, ప్రేమకు ఆటంకాలు, చివరకి అన్ని అడ్డంకులు దాటి వారిద్దరూ కలవటం. అదే సినిమాలో పాటలుంటాయి. వీరిద్దరిలో ఎవరో ఒకరి వెంట పడే దుష్ట పాత్ర ఉంటుంది. ఆ దుష్టపాత్ర స్మగ్లింగో, ఏదో ఇతర చెడ్డపనులు చేస్తుంది. ఆ పాత్ర వెంట ముఠా ఉంటుంది. ఆ ముఠాకు ఓ క్లబ్బు ఉంటుంది. ఆ క్లబ్బులో ఓ నర్తకి ఉంటుంది. ఆమె దుష్ట పాత్ర వెంట ఉంటూ హీరోను ప్రేమిస్తుంది. విలన్ నాయికను ఎత్తుకుపోతాడు. హీరో వెంటపడతాడు. ఈ పోరాటాలూ, ఛేజింగులు, కొండల మీద దొర్లటాలు, కొండ అంచుల నుండి వ్రేలాడటాలూ, ఈ పోరాటంలో నర్తకి చచ్చిపోవటం, చివరికి విలన్‍ని పోలీసులు పట్టుకుపోతారు. నాయికానాయకులు కలుస్తారు. ఓ పాట పాడుతూ వెళ్ళిపోతారు. ఈ కథలో హీరోయిన్‍ను ఏడిపిస్తూ ఓ పాట. హీరోను ఏడిపిస్తూనో, బ్రతిమిలాడుతూనే ఓ పాట. నర్తకికి ఓ రెండు పాటలు. హీరో హీరోయిన్‍లు వేరయి ఓ పాట. మధ్యలో హాస్య పాత్రలుంటాయి. వీలయితే వారికీ ఓ పాట. ఇలా క్రైమ్, కామెడీ, సస్పెన్స్, థ్రిల్లర్, మ్యూజికల్ రొమాన్స్ సినిమా తయారవుతుంది.
పై ఉదాహరణ చూసి, ఎవరయినా “ఇది పాత సినిమా కథ. ఇప్పుడు ఇలాగ లేదు” అని అన్నారనుకోండి. వారికి కవి నీరజ్ రాసిన ఈ పాట సమాధానం. “చష్మా ఉతారో, ఫిర్ దేఖో యారో, దునియా నయీ హై, చెహరా పురానా.” కళ్ళద్దాలు తీసి ప్రపంచాన్ని చూడు, ప్రపంచం కొత్తది. కానీ దాని ముఖం పాతది.
మేమో కథ చెప్తాం. సినిమా పేరు చెప్పండి.
ఓ మంచి వ్యక్తి ఉంటాడు. జైలు నుంచి విడుదలయి, తన ఫ్రెండు కూతురి బాధ్యతను తీసుకుంటాడు. ఆమెను ఆర్మీలో చేర్చాలనుకుంటాడు. అందుకోసం ఓ లేడీ సైకాలజిస్ట్ సహాయం తీసుకుంటాడు. ఇదే సమయంలో ఓ పెద్ద వ్యాపారి దేశంలో ఆర్మీ ప్రాజెక్టు రహస్యాలు దొంగిలించాలని అనుకుంటాడు. తన రహస్యం కనుగొన్న ఉప ముఖ్యమంత్రిని హత్య చేస్తాడు. ఈ రహస్యం తెలిసిన పి.ఎ. ప్రాణాలు అరచేత పట్టుకుని పారిపోతూ, ఆ రహస్యాన్ని హీరో దగ్గర దాస్తాడు. దాంతో విలన్‍కీ హీరోకి ప్రత్యక్ష యుద్ధం ఆరంభమవుతుంది. ఇలా సాగుతుంది కథ. ఈ కథలో మన నాయకుడికీ సైకాలజిస్టుకీ ప్రేమ. మధ్యలో ఆరు పాటలు. యుద్ధాలు, హత్యలు.. ఈ సినిమాను ఎలా వర్గీకరించటం? ఇందులో సంగీతం గురించి ఏమని చర్చిస్తాం?
ఇదే హాలీవుడ్ సినిమా అయి ఉంటే, నాయకుడు తాను బాధ్యత వహిస్తున్న అమ్మాయిని ఆర్మీలో చేర్చాలనుకుంటే, కొన్ని బాల్యానుభవాల వల్ల ఆమె ఆర్మీలో చేరేందుకు విముఖత చూపిస్తుంది. కాబట్టి సినిమా మొత్తం ఆమె మానసిక దౌర్బల్యాన్నీ, భయాలను అధిగమించి ఆర్మీలో చేరటం ఒక్కటే ఒక సినిమా అయి ఉండేది.
విలన్ ఆర్మీ రహస్యాలను దొంగిలించబోతే, వాటిని హీరో కాపాడటం ఒక్కటే ఒక సినిమా అయి ఉండేది. ఇంకాస్త హై’టెక్కు’ అయితే, జేమ్స్ బాండ్ లాంటి సినిమా అయి ఉండేది.
ఇక సైకాలజిస్టుకీ నాయకుడికీ ప్రేమ మరో సినిమా అయి ఉండేది.
ఇలా ఒక అయిదారు సినిమాలు కలగలిసి ఒక సినిమా అవుతున్నది మన దగ్గర. అందుకే మన సినిమాలను ఇలా పలు విభిన్నమైన అంశాలన్నిటినీ కలిపి ఒక ‘బొంత’లా కుట్టే సినిమాలుగా విమర్శిస్తారు. హింస, మహిళలను ఆడే అందమైన బొమ్మల్లా, లైంగికంగా రెచ్చగొట్టే వస్తువుల్లా చూపిస్తూ ప్రేక్షకులలోని పశుప్రవృత్తిని రెచ్చగొట్టే సినిమాలు అని విమర్శిస్తారు. ఈ రెచ్చగొట్టటంలో పాటలు తమ వంతు పాత్ర పోషిస్తున్నాయి.
‘హాలీవుడ్’లో కానీ, ఇతర విదేశీ సినిమాల్లో కానీ సినిమాకు ఒక ‘థీమ్’ ఉంటుంది. కేంద్ర బిందువు ఉంటుంది. కాబట్టి, ఆ కేంద్ర బిందువు ఆధారంగా సినిమాకు తగ్గ సంగీతాన్ని సృజించే వీలుంటుంది. అందుకే విదేశీ సినిమాలలో ‘థీమ్’ సంగీతానికి ప్రాధాన్యం ఉంటుంది. సినిమా పేర్లు వచ్చేటప్పుడే ‘థీమ్’ సంగీతం వినిపిస్తుంది. సినిమాలో కీలకమైన సన్నివేశాల్లో వినిపించే ఈ సంగీతం సినిమా ప్రభావాన్ని పెంచుతుంది.
‘స్టార్ వార్స్’, ‘షిండ్లర్స్ లిస్ట్’, ‘జాస్’, ‘రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’, ‘ది గాడ్ ఫాదర్’, ‘ది గుడ్ బాడ్ అండ్ అగ్లీ’, ‘2001, ఎ స్పేస్ ఒడిస్సీ’.. ఇలా చెప్పుకుంటూ పోతే, అనేక హాలీవుడ్ సినిమాలలో ‘థీమ్’ సంగీతం ప్రత్యేకంగా గుర్తుంటుంది. సినిమాలలో పాటలు ఉన్నా లేకున్నా, ఈ థీమ్ సంగీతం తనదైన ప్రత్యేకతను కలిగి ఉంటుంది.
‘ది గాడ్ ఫాదర్’ అనే సినిమాలో పేర్లు వచ్చేటప్పుడు వినిపిస్తుంది ‘థీమ్ సంగీతం’. సినిమాలో పలు కీలకమైన సన్నివేశాల్లో వస్తూంటుంది అదే సంగీతం. ఈ సంగీతాన్ని ‘ది గాడ్ ఫాదర్ వాల్ట్జ్’ (The Godfather Waltz) అంటారు. ఈ సంగీతాన్ని సృజించినది ‘నీనో రోటా’ (Nino Rota).
సినిమా ఆరంభంలో నల్లటి తెర కనిపిస్తుంది. తెరపై సినిమా పేరు కనిపించే సమయానికి ‘ట్రంపెట్’ మొదటి ‘మెలోడిక్ లైన్’ను వినిపిస్తుంది. ఇలా ట్రంపెట్‌తో ఈ ‘మెలోడిక్ లైన్’ సినిమాలో కీలకమైన సన్నివేశాలలో మాత్రమే వినిపిస్తుంది. ఈ మెలోడీ మానవ సంబంధాలకు ధ్వని రూపం. “తనకు ఇష్టం లేని మాఫియా అధికారం కొడుక్కు తండ్రి అప్పజెప్తున్నందుకు క్షమాపణలు వేడుకోవడం నా థీమ్ సంగీతం” అని ఈ సంగీత సృజన చేసిన ‘నీనో రోటా’ స్వయంగా వివరించాడు.
తరువాత ఓ పాత్ర గాడ్ ఫాదర్‍కు తన బాధను వినిపించే సందర్భంలో ‘ట్రంపెట్’ వినిపిస్తుంది, అది గాడ్ ఫాదర్ శక్తిని ధ్వని రూపంలో వినిపిస్తుంది. అంటే ట్రంపెట్ వినిపించే మెలోడీకి గాడ్ ఫాదర్‌కూ సంబంధం ఏర్పడిందన్న మాట. మళ్ళీ ఇదే సంగీతం గాడ్ ఫాదర్‍కు తుపాకీ గుండ్లు తగిలినప్పుడు వినిపిస్తుంది. గాడ్‌ఫాదర్ తుపాకీ గుళ్ళు తగిలి క్రిందకు జారే సమయంలో ఇదే సంగీతం వేగవంతంగా, బలహీనంగా వినిపిస్తుంది, గాడ్‌ఫాదర్ శక్తివిహీనుడవటాన్ని సూచిస్తూ. గమనిస్తే, గాడ్‍ఫాదర్ పాత్ర తెరపై లేనప్పుడు ఈ సంగీతం ట్రంపెట్‍పై వినబడదు. అంటే, ట్రంపెట్ గాడ్‌ఫాదర్‍కు ప్రతీక అని ప్రేక్షకుడు గ్రహిస్తాడు.
మైఖేల్ పాత్ర, అతని ప్రేయసి ఓ ‘షో’ చూసి వెళ్ళిపోయే ముందు ట్రంపెట్ ఇదే సంగీతాన్ని వినిపిస్తుంది. కానీ తెరపై మైఖేల్ కనిపించేసరికి ట్రంపెట్ ఆగిపోతుంది. గాడ్‍ఫాదర్ స్థానాన్ని మైఖేల్ ఆక్రమించబోతున్నాడనటానికి ఇది సూచన.
‘ది గాడ్‍ఫాదర్’ సినిమా చివరి దృశ్యంలో, గాడ్‍ఫాదర్ స్థానాన్ని మైఖేల్ ఆక్రమించటం, అందరూ అతడిని గాడ్‍ఫాదర్‌గా ఆమోదించే దృశ్యంలో ఇదే సంగీతం ట్రంపెట్‌తో పాటు ఇతర వాయిద్యాలతో కలసి వినిపిస్తుంది. సినిమా ముగింపుకు వచ్చేసరికి ‘ట్రంపెట్’ గాడ్‍ఫాదర్‌ను వ్యక్తిగతంగా కాదు, ‘డాన్’ అనే ‘పొజిషన్’ను సూచిస్తున్న భావనను కలిగిస్తుంది సంగీతం.
ఈ రకంగా ఒక థీమ్ సంగీతాన్ని సృజించి, ఆ సంగీతంలో ఒక్కో వాయిద్యాన్ని పాత్రలకు, కీలక సంఘటనలకు సూచనగా మలచటం, పలు హాలీవుడ్ సినిమాలలో కనిపిస్తుంది. ముఖ్యంగా ‘జాస్’ సినిమాలో ‘సొరచేప’ వస్తూందనటానికి సూచనగా వినిపించే సంగీతం ‘సొరచేప’ కన్నా ఎక్కువగా భయపెడుతుంది.
విదేశీ సినిమాలో పాటలు ప్రధానం కాదు. కాబట్టి, పాటల స్థానాన్ని నేపథ్య సంగీతం ఆక్రమిస్తుంది. తాను ఓ ప్రధాన పాత్ర అయి కథను ముందుకు నడుపుతుంది. పాత్రల మనస్సులలోని సంఘర్షణలను, సందిగ్ధాలను ప్రేక్షకుడికి చేరువ చేస్తూ పాటలు లేని లోపాన్ని భర్తీ చేస్తుంది.
పాటలకు ప్రాధాన్యం లేని ‘సత్యజిత్ రే’ సినిమా ‘పథేర్ పాంచాలి’లో కూడా నేపథ్య సంగీతం ఒక పాత్ర అయి సినిమాకు ఊపునివ్వటం గమనించవచ్చు. పండిత్ రవిశంకర్ ‘పథేర్ పాంచాలి’ కోసం సృజించిన థీమ్ సంగీతంలో బెంగాలీ జానపద సంగీతం పరిమితమయిన సాంప్రదాయిక వాయిద్యాలతో వినిపిస్తుంది. సినిమా స్థల కాలాదులను స్థిరపరుస్తుంది.
https://www.youtube.com/watch?v=g5Tn-FdN070
సితార్, ఫ్లూట్ లు అద్భుతంగా వినిపించే ఈ థీమ్ సంగీతం సినిమాలో కీలక సందర్భాలలో పదే పదే వినిపిస్తుంది. సందర్భాల లోతును, సాంద్రతను పెంచుతుంది. పాత్రల మనోభావాలను ప్రేక్షకుడు భావించేట్టు చేస్తుందీ సంగీతం. అందుకే సినిమా బెంగాలీ సినిమా అయినా, సబ్ టైటిల్స్ లేకున్నా, కేవలం దృశ్యాలు, నేపథ్య సంగీతం ఆధారంగా ‘పథేర్ పాంచాలి’ సినిమాను అర్థం చేసుకోవచ్చు. సినిమాలోని పాత్రల అనుభూతులకు స్పందించవచ్చు.
మన సినిమాల్లో పాటలకున్న ప్రాధాన్యం నేపథ్య సంగీతానికి లేదు. సంగీత దర్శకులు అధికంగా పాటలు రూపొందించి, నేపథ్య సంగీత సృజనను అసిస్టెంట్లకు అప్పగిస్తారు. లేకపోతే, ‘స్టాక్ మ్యూజిక్’ నుంచి తీసుకోమంటారు. కానీ పాటలతో పాటుగా నేపథ్య సంగీతానికీ, సంగీతాన్ని పాత్రల వ్యక్తిత్వానికి ప్రతీకలుగా చేసి చూపించటాన్ని మనం పాత సినిమాల్లో అధికంగా చూడవచ్చు. అంటే, ఆ బాణీ వినబడగానే ఫలానా పాత్ర తెర పైకి వస్తోందని తెలిసిపోతుందన్న మాట. ‘మాయాబజార్’లో ఘటోత్కచుడు తెరపై వచ్చే సమయంలో వినిపించే సంగీతం ఇందుకు చక్కని ఉదాహరణ.
పాటలు ప్రధానమైన సినిమాలు కాబట్టి, ఇలా పాత్ర వచ్చేటప్పుడు సంగీతం వినిపించటంపై కన్నా, పాట పాడుతూ పాత్ర తెరపైకి రావటాన్ని మనవారు ఆదరించారు. పాత్ర వ్యక్తిత్వాన్ని పాట తెలుపుతుంది. పాట గుర్తుంటుంది. పాడుకోవచ్చు. పదే పదే వినవచ్చు. నేపథ్య సంగీతాన్ని పాడుకోలేము. పైగా, పాట పాడే గాయకుడికీ, నటుడికీ, సంగీత దర్శకుడికీ పాట ఇమేజ్‍ని ఇస్తుంది. వ్యాపారపరంగా ఇది ఎంతో లాభదాయకమైన విషయం.
‘దునియా , మై తేరే తీర్ కా యా తక్దీర్ కా మారా హూఁ’ అని అడుగుతాడు హీరో ఆ పాటలో. ‘ప్రపంచమా నేను
రాజ్‍కపూర్‍కు ముకేష్ స్వరం నప్పటంతో ముకేష్ రాజ్‍కపూర్ స్వరంలా నిలిచాడు. అందువల్ల గాయకుడు – హీరోల మధ్య ఒక చక్కటి వ్యాపార బంధం ఏర్పడింది. సంగీత దర్శకులు శంకర్ జైకిషన్ లను రాజ్‍కపూర్ తెరపైకి తేవటంతో – రాజ్‍కపూర్, ముకేష్, శంకర్ జైకిషన్‍ల వ్యాపార బంధం మరింత ఆకర్షణీయమయింది. శంకర్ జైకిషన్‍లకు శైలేంద్ర, హస్రత్ జైపురిలు గీత రచయితలు కావటంతో రాజ్‍కపూర్ సినిమాల సంగీత భవంతికి శంకర్ జైకిషన్, హస్రత్, శైలేంద్ర, ముకేష్‌లు నాలుగు స్తంభాలుగా నిలిచారు. ఈ స్తంభాలు పటిష్టంగా ఉన్నంత వరకూ రాజ్‍కపూర్ సంగీత భవంతి దివ్యంగా వెలిగింది. వ్యాపార లాభాలు తెచ్చి పెట్టింది.
(మళ్ళీ కలుద్దాం)