Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మధురగీతాలు – మనోహరదృశ్యాలు-21

[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]

కానరార కైలస నివాస
బాలేందుధరా జటాధరా
భక్తజాల పరిపాల దయాళా
హిమశైల సుతా ప్రేమలోలా..

కళాకారులకు తమ కళాసృజన పట్ల గౌరవం, భక్తి శ్రద్ధలతో పాటు అత్యుత్తమ కళను సృజించాలన్న తపన ఉంటే, కాలదోషం పట్టని అతి సుందరము, అద్భుతము, అద్వీతీయమైన కళా ప్రదర్శన సంభవిస్తుంది. తరతరాల తరగని సృజనాత్మక సృష్టి సమాజానికి అందుతుంది. అందుకు చక్కని ఉదాహరణ, ఎన్టీరామారావు నటించి, దర్శకత్వం వహించిన ‘సీతారామ కల్యాణం’ సినిమాలో ‘రావణానుగ్రహం’లా ప్రసిద్ధి పొందిన ఈ పాట.

‘రావణానుగ్రహం’ కథ ‘శివపురాణం’, ‘ఉత్తర రామ చరిత్ర’ వంటి పురాణాలలో ఉంది. రావణుడు కుబేరుడిని ఓడించి, నగరాన్ని కొల్లగొట్టి పుష్పక విమానంలో తిరిగి వస్తుంటే, విమానం ఓ ప్రాంతంలో కదలదు. కారణం అది కైలాసం. శివుడి నివాస స్థలం. ఆ సమయంలో శివపార్వతులు నృత్యం చేస్తున్నారు. కాబట్టి, ఆ వైపు ఎవ్వరూ వెళ్లే వీలు లేదు. శివ దర్శనం కుదరదని ‘నంది’ రావణుడికి చెప్తాడు. అది విని ఆగ్రహించిన రావణుడు నందిని వెక్కిరిస్తాడు. నంది రావణుడిని శపిస్తాడు. ఆగ్రహించిన రావణుడు ఇరవై చేతులతో కైలాసాన్ని కదిలిస్తాడు. విషయం గ్రహించిన శివుడు కాలితో తొక్కటం వల్ల పర్వతం క్రింద పడి నలుగుతూ, రావణుడు ‘హాహా’కారాలు చేస్తాడు. అందుకని అతని పేరు ‘రావణుడు’ అయింది. ఆ సమయంలో శివానుగ్రహం కోసం రావణుడు ‘శివ తాండవ స్తోత్రం’ పాడతాడు. మెచ్చిన శివుడు ‘ఆత్మ లింగం’ తో పాటు అదృశ్యంగా ఉండే ఖడ్గం ‘చంద్రహాస’ను రావణుడికి బహుకరిస్తాడు. టూకీగా ఇది ‘రావణానుగ్రహం’ కథ.

దీనికి పాఠ్యాంతరాలున్నాయి. రావణాసురుడు శివుడి అనుగ్రహం కోసం తన తలను నరికి, దానితో ‘రుద్రవీణ’ ను చేసి గానం చేశాడని ఒక కథ ఉంది. రావణుడు తన కండరాలను తీగలుగా మలచి రుద్రవీణ తయారు చేసి, శివతాండవ స్త్రోత్రం గానం చేశాడని ఒక గాథ ఉంది.

‘భూకైలాస్’ సినిమాలో శివుడిని శరణు వేడుతూ, తన తప్పులను క్షమించమని పశ్చాత్తాపంతో పాట పాడతాడు రావణాసురుడు.

తగునా వరమీయ
ఈ నీతి దూరనకు, పరమా పాపునకు
తగునా..

ఈ పాట చూస్తే ఎందుకని ఆనాటి నటులు ప్రజలకు అంతగా ప్రీతిపాత్రులయి, సినిమా పరిధి దాటి సజీవ పురాణ పాత్రలయిపోయారో బోధ పడుతుంది.

‘ఆత్మ లింగం’ కోసం తపస్సు చేసి పార్వతిని వాంఛిస్తాడు రావణుడు. తన పొరపాటు గ్రహించి, పశ్చాత్తాపంతో తనని శిక్షించమని, తన పై కరుణ చూపటం తగదనీ పాట పాడుతూ చివరికి శిక్షగా తన తల నరికేసుకుంటాడు.

రావణాసురుడు ఈ పాటలో ప్రదర్శించే పశ్చత్తాప భావన, శివుడి పట్ల కల అచంచల విశ్వాసం, అంకిత భావన వంటి పలు విభిన్నమైన మానసిక స్థితులను పాటలో పదాలు ప్రదర్శిస్తాయి. బాణీ అనుసరిస్తుంది. ఘంటసాల స్వరం జీవం పోస్తుంది. ఎన్టీరామారావు తానే ఆ పాత్ర అయి, ఆ భావాలకు రూపాన్నిస్తాడు తన నటన ద్వరా.

పాట ఆరంభమే ఎన్టీరామారావు విషాదం, పశ్చాత్తాపం  ఉట్టిపడే వదనం క్లోజప్పుతో ఆరంభమవుతుంది. నేపథ్యంలో కరుణ రసం ఉట్టి పడుతూన్న వయోలిన్లు వినిపిస్తాయి. సాధారణంగా నటనలో ‘కళ్లు’ అత్యంత ప్రధాన పాత్ర పోషిస్తాయి. కళ్ళతో నటించి, ప్రేక్షకుల మనస్సులలో ఆయా భావాలను జాగృతం చేసి, ప్రేక్షకులు తామే ఆ  పాత్ర అయి అయా భావాలను అనుభవించేటట్టు చేయటమే కాదు, క్లోజప్పు ద్వారా నటులు ప్రేక్షకులకు సన్నిహితమై, తన స్వీయ వ్యక్తిత్వాన్ని పాత్రలో విలీనం చేసి, ప్రేక్షకుల మనస్సులలో పాత్రలుగా స్థిరపడతారు. అందుకే, ఆ కాలంలో అటు నటుడు – గాయకుల అస్తిత్వాలు మిళితమవటమే  కాదు నటుడి అస్తిత్వం పాత్రలో కలసిపోతుంది. అందుకే ఆ కాలంలో నటులు రాముడు, కృష్ణుడు వంటి దైవావతారాలుగా నీరాజనాలందుకున్నారు.

‘తగునా’ పాట ఆరంభానికి ముందే రామారావు రావణాసురుడిగా పాత్రౌచితంగా.. పశ్చాతాప విషాద భావాలు ఉట్టి పడుతుండగా తెరపై కనిపిస్తాడు. తరువాత రాబోయే పాటను అనుభవించేందుకు భూమికను ఏర్పాటు చేస్తాడు.

‘తగునా.. ఆ.. ఆ..’ అంటూ పాడటంలో ఓ రకమైన ఏడుపు ధ్వనిస్తుంది. ‘వరమీయ’ అనేసరికి రావణుడి కళ్లల్లో నీళ్లు కదలుతాయి. ప్రేక్షకుడి గుండె కరగిపోతుంది. అంతటి బలశాలి, అహంకారి కన్నీరు పెట్టటం ఎలాంటి వారినయినా కరిగించేస్తుంది. ‘పరమా పాపునకు’ లో ‘మా’ వద్ద దీర్ఘం తీయటం, అలంకారం వేయటం, తానెంత ఘోరమైన పాపినని రావణుడు భావిస్తున్నాడో అనుభవానికి తెస్తుంది. ముఖ్యంగా ఘంటసాల గొంతులో ధ్వనించే విషాదం, ఏడుపు పశ్చాత్తాప  లోతులను తెలుపుతుంది.

రెండవసారి పల్లవిలో ‘తగునా’ అని పాట అందుకునే సరికి కెమెరా ‘హిప్ లెవల్’ షాట్‌తో రావణాసుడిని మోకాళ్ల వరకూ చూపిస్తుంది. ఇప్పుడు నటుడు తన శరీరంతో కూడా నటిస్తాడు. నటుడి నటనలో చేతులు, చేతుల కదలికలు, తల కదలిక, కళ్లు సర్వం భాగాలయిపోతాయి.

ఈ పాటలో కెమెరా ప్రధాన పాత్ర పోషిస్తుంది. రావణాసురుడు మోకాళ్ల మీద కూర్చుని పాడుకునేప్పుడు ‘knee level shot’ లో రావణాసురుడిని చూపిస్తుంది. మోకాళ్ల మీద కూర్చుని పాడుకోవటం, ‘అర్పణ’ భావం. నుంచున్న రావణాసురుడు మోకాళ్ల పైకి వచ్చేప్పుడు కెమెరా అనుసరిస్తుంది. అహంకారి రావణాసుడు అహంకారం వదలి వేడుకోవటం ప్రదర్శిస్తుంది.

రావణుడు తలపై చేతితో కొట్టుకోవటం ‘అయ్యో ఇలాంటి చెత్త పని ఎలా చేశాను?’ అని పశ్చాత్తప పడటానికి నిదర్శనం. ఆ నటనను తిన్నగా చూపదు కెమెరా. ఎడమ వైపు నుంచి చూపుతుంది. రెండు బండరాళ్ల నడుమ నుంచి చూపుతుంది. రావణుడు ఎలా నలుగుతున్నాడో పశ్చత్తాపంతో అన్న భావన కలిగిస్తుంది.

‘పాపకర్మ దుర్మదాంధుడన్’ అన్నప్పుడు రావణుడు కాస్త పైకి లేస్తాడు. తన పట్ల తనకే అసహ్యం, ధిక్కారం కనిపిస్తుంది. నటనలో, ఘంటసాల స్వరంలో,  రావణుడు పిడికిళ్లు బిగించటం తన పొరపాటు పట్ల అవేశం కనిపిస్తుంది. తనని తాను రావణుడు శిక్షించుకునేందుకు భూమికను సిద్ధం చేస్తుంది. రామారావు చేతులు, ఘంటసాల స్వరం కలసి ఏకమై నటించటం గమనించవచ్చు.

పార్వతిని మోహించటాన్ని ప్రస్తావించినప్పుడు రావణాసురుడి వదనాన్ని క్లోజప్పులో చూపించినప్పుడు వదనంలో భావాలు పశ్చాత్తాపమే కాదు అసహ్యం, ఆవేశం, మామూలు ఆవేశం కాదు ఆత్మహత్యావేశాన్ని ప్రదర్శిస్తాయి. కళ్లల్లో శూలంతో పొడిచి ‘కామము మాపుమా’ అని వేడుకునేప్పుడు ఆగ్రహం అసహ్యం, విషాదం, జాలి.. ఇలా పలు విభిన్న భావాలను రావణుడు ప్రదర్శించటం గమనించినప్పుడు, ఇది నటన కాదు, రావణాసురుడే కెమెరా ముందుకు వచ్చి పశ్చాత్తప పడుతున్నాడనిపిస్తుంది. అందుకే అనాటి నటులు తమ ఆస్తిత్వం కోల్పోయి పాత్రలుగా మిగిలారు. కెమెరా తానూ నటనలో భాగమై పోతుంది.

రావణుడు శిరఃఖండన కోసం కత్తిని దూసే సమయానికి పాట గతి మారుతుంది. కెమెరా కదలికలు మారతాయి. వయొలిన్ల వేగం విజృంభిస్తుంది. కెమెరా కత్తి దూసిన రావణుడిని వీరోచితంగా చూపించి, కైలాసంలో శివుడిని, అటూ ఇటూ వంపుతూ చూపుతుంది. ఘంటసాల పాడే విధానం, స్వరం మారతాయి. కెమెరా గిరగిరా తిరుగుతూ ఉద్విగ్నతను పెంచుతుంది. ‘పాపము బాపుమా’ అనే సందర్భంలో కెమెరా పలుకోణాల్లో రావణుడికి దగ్గరగా వస్తుంది. ఎడిటింగ్ ఈ సందర్భంలో గమనించ వలసిన అంశం. పాట ఉద్విగ్నతను, వేగాన్ని ఇనుమడింప చేస్తుంది ఎడిటింగ్.

శిరస్సు ఖండించిన తరువాత కెమెరా అల్లకల్లోమవుతున్న కైలాసాన్ని అటు ఇటూ తిప్పుతూ చూపటం ఆ కాలంలో అల్లకల్లోలాన్ని ఉద్విగ్నతను ప్రదర్శించే ప్రక్రియ.

ఇక రావణుడి తల కదలటం, పెదిమలు కదులుతూండటం ఒక ఎత్తయితే ‘చేకొనుమా’ అంటూ ప్రాధేయపడతూ పాడటం, ఘంటసాల స్వరం, జాలి దయా ఉట్టిపడే  చూపుతో పాటు నెమ్మదిగా శక్తి ఉడిగిపోవటాన్ని,  రావణుడి వదనం ప్రదర్శించే భావాలను ఉద్దీపితం చేస్తుంది. రామారావు వదనం ప్రదర్శించే భావాలను ఘంటసాల స్వరం పండించుతుంది.

‘తెగి పడిన తల పాడటం ఏమిటని?’ కొందరు ఆలోచనాపరులు ప్రశ్నించవచ్చు. వైజ్ఞానిక పరిశోధనల ప్రకారం శరీరం నుంచి తల వేరయిన తరువాత కొన్ని సెకన్ల వరకూ కదలికలుంటాయి. రక్త ప్రసరణ జరగటం లేదని గ్రహించేందుకు సమయం పడుతుంది. అంత కాలం పెదవులు కదలటం, కనురెప్పలు కొట్టకోవటం వంటి చర్యలు కనబడతాయి. ఈ నిజాన్ని ఇంకాస్త పొడిగిస్తే రావణుడి తల పాడటంలో పెద్దగా అభ్యంతరం చెప్పాల్సిన అవసరం కనబడదు. ఎంతయినా సినిమాల్లో నిజాన్ని కాస్త సాగతీయటం ఆమోదయోగ్యమే కదూ!

(‘తగునా వరమీయ’ పాటను యూట్యూబ్‍లో చూడవచ్చు
https://www.youtube.com/watch?v=zBzv-6xrExI )

‘భూకైలాస్’ సినిమాలో ఈ పాట ఎలా పలు విభిన్నమైన భావాలను, స్పందనలను ప్రదర్శిస్తుందో అలాగే, ‘కానరార’ పాటలోను కూడా పలు రకాల భావాలను రావణుడి వ్యక్తిత్వాంలోని పలు పార్శ్వాలను, అవి రూపాంతరం చెందటాన్ని దర్శకుడిగా ఎన్టీరామారావు రూపొందించారనిపిస్తుంది. అయితే ‘కానరార’ పాట చిత్రీకరణపై, నిర్మాణంపై ‘నీల కంధరా’ పాట చిత్రీకరణ ప్రభావం అధికంగా ఉందనిపిస్తుంది.

‘ఆత్మ లింగం’ సాధన కోసం రావణాసురుడు బయలుదేరతాడు ‘దేవ దేవ ధవళాచల’ పాట పాడుతూ. దారిలోనే జరగబోయే కథకు ప్రాతిపదిక ఏర్పడుతుంది. రావణుడు దారి తప్పేందుకు బీజం పడింది.

ఇక రావణుడి తపస్సును ‘పాట’ ఆధారంగా చూపించటం చక్కని పద్ధతి. ఆకర్షణీయమే కాదు,  భక్తి గీతంలా ఎల్లకాలము పాడుకునే గీతం రూపొందింది. ఇది సినిమా ‘రీపీట్ వాల్యూ’ను పెంచుతుంది.

జయ జయ మహదేవ
శంభో, సదాశివా
ఆశ్రిత మందారా
శృతి శిఖర సంచారా

పాట ఆరంభానికి ముందు ప్రశాంత సంగీతం నేపథ్యంలో వినిపిస్తుంది. తెరపై కొండలు,  కొండల వెనక నుంచి బాహువులు సాచిన సూర్య కిరణాలు, ఫోర్‌గ్రౌండ్‌లో ప్రశాంత సరస్సు, నీరు కనిపిస్తాయి. ఈ పాట చిత్రీకరణలో గమనించాల్సిన అంశం ప్రకృతి కథా గమనంలో ఒక ప్రధానాంశం కావటం. అది పాట ప్రారంభం నుంచే ఆరంభమయింది. పాటలో మారే మూడ్ ను ప్రకృతి ప్రతిబింబిస్తుంది.

ఈ ప్రశాంత దృశ్యం నుంచి కెమెరా పైకి కదలుతుంటేనే ఒళ్ళు ఝల్లుమనేలా ఘంటసాల స్వరం వినిపిస్తుంది ‘జయి జయ మహాదేవా’ అంటూ.

ఈ పాటలో కూడా ఘంటసాల స్వరం ఎన్టీరామారావు నటనకు మెరుగులు దిద్దినట్టుంటుంది. నటనకు పొడిగింపుగా , కొనసాగింపుగా అనిపిస్తుంది.

తపస్సు ఆరంభంలో రావణాసురుడి ‘అహం’ కనిపిస్తుంది. శివ దర్శనం సులభం తనకు అన్న అహంకారం కనిపిస్తుంది. ఇది ఘంటసాల స్వరం ధ్వనిస్తుంది. పాటలో పదాలు సూచిస్తాయి. ఎన్టీరామారావు నటన ఈ విశ్వాసాన్ని అహంకారాన్ని ప్రదర్శిస్తుంది.

ఇక్కడ చిత్రీకరణలో గొప్పతనం గమనించాల్సి ఉంటుంది. రావణాసురుడు కూర్చున్న విధానంలోనే విశ్వాసం కనిపిస్తుంది. కెమెరా క్లోజప్పులోకి వెళ్లదు. దూరం నుంచే చూపిస్తుంది. రావణాసురుడు తలపెట్టిన కార్యం ఎంత పెద్దదో, లక్ష్యం ఎంత కఠినమైనదో తపస్సు చేస్తున్న రావణుడిని విశాల ప్రకృతిలో ‘చిన్నగా’ చూపించటం ద్వారా తలపింపచేస్తుంది కెమెరా. అంతే కాదు, పాట ఆరంభంలో సూర్యోదయాన్ని తలపింప చేస్తోంది కెమెరా. కానీ తపస్సు చేస్తూ పాడుతూన్న వ్యక్తి అంత స్పష్టంగా కనబడడు. వెలుగురేఖలు ఇంకా సంపూర్ణంగా అక్కడికి చేరలేదని సూచిస్తూ, కానీ ఆలాపన చివరికి వచ్చేసరికి ఆ ప్రాంతాన్ని వెలుగు ఆక్రమిస్తుంది. వెంటనే పాట ఆరంభమవుతుంది. కెమెరా రావణుడిని క్లోజప్పులో చూపిస్తుంది.

నీల కంధరా.. దేవా.. దీన భాంధవా రారా.. నన్ను గావరా..
సత్య సుందరా.. స్వామీ.. నిత్య నిర్మలా .. పాహీ..

పాటలో పదాలు అద్భుతమైనవి. వింటుంటేనే మనసు పరవశిస్తుంది భక్తి పరిమళం అణువణువు విస్తరిస్తుంది. ఘంటసాల స్వరంలో పలికే భక్తి భావం గురించి చెప్పేందుకు మాటలు దొరకవు, అనుభవించాల్సిందే. ఎన్టీరామారావు నటన రావణాసురుడే తపస్సు చేస్తున్నాడనిపిస్తుంది. ఇక్కడ గమనించాల్సిందేమిటంటే, అభ్యర్దన పాటలో ఉన్నా కూర్చున్న విధానంలో కనబడదు. నటనలో చేతులు సాచి అభ్యర్ధిస్తున్నట్టున్నా, కళ్లు తెరచి పాడటంలో  విశ్వాసం కనిపిస్తుంది. అంటే, శివుడు త్వరగా కరుణించి దర్శనమిస్తాడన్న నమ్మకం కనిపిస్తంది. మళ్లీ ‘నీల కంధరా’ అన్నప్పుడు కళ్లు మూసుకుని ప్రార్థిస్తాడు.

‘సత్యసుందరా’ అంటున్నప్పుడు కెమెరా క్లోజప్పులోనే కదలుతూ చూపిస్తుంది. సత్యసుందరత్వం,  నిత్య నిర్మలత్వం ఘంటసాల స్వరం ధ్వనిస్తుంది. రామారావు వదనంలో ప్రతిఫలిస్తుంది. చూస్తున్న ప్రేక్షకుడు ఎన్టీఆర్, ఘంటసాలలను మరచిపోతాడు. రావణాసురుడినే చూస్తాడు. భక్తి భావంతో తన్మయుడవుతాడు.

పల్లవికీ చరణానికీ నడుమ వచ్చే సంగీతం కనబడే దృశ్యం పాటలో పాత్రలవటం గమనించవచ్చు. నెమలి ప్రశాంతంగా కనిపిస్తుంది. కెమెరా కూడా నేపథ్యం లయను అనుసరిస్తూ నెమ్మదిగా కదలుతూ, సూర్యకిరణ కాంతితో మిలమిలలాడే నీటిని చూపుతూ, జలజలా కొండ నుండి పారే నీటిని చూపుతూ రావణాసురుడి చుట్టూ తీరుగుతూ దూరం నుంచి చూపుతుంది. ఇప్పుడు రావణుడు కూర్చున్న పద్ధతి మారుతుంది. ముఖంలో భావాలు మారుతాయి. ‘అన్యదైవమూ కొలువ’ అన్నప్పుడు  గర్వం, ‘నీదు పాదమూ’ అంటూ చేతులు జోడిస్తున్నప్పటి విశ్వాసం మరోసారి ‘అన్యదైవము’ అన్నప్పుడు కళ్లు ఎగరేయటం, కనుబొమలను కదలించటం ‘దర్శనమ్మునీరా’లో బ్రతిమిలాడటం ఉన్నా, దానిలో బుజ్జగిస్తున్న భావన కనిపిస్తుంది. కానీ సంపూర్ణ అంకిత భావన కనబడదు.

స్వరంలో కానీ, నటనలో కానీ, అద్భుతమైన రీతిలో రావణుడి వ్యక్తిత్వాన్ని, మనస్తత్వాన్ని ప్రదర్శించటం ఇది. రామారావు నటన, పెదవులపై నవ్వు, కళ్లలో అభ్యర్థన, పదాలు పలికేప్పుడు వణికే పెదవులు.. అద్భుతం.

మరో కోణం వైపు వెళ్లేప్పుడు సంగీతం మారుతుంది. ఇప్పుడు ప్రశాంతం,  విశ్వాసం లేవు. ఆందోళన ఉద్విగ్నతలు ధ్వనిస్తాయి. పారే నీటి వేగం పెరుగుతుంది. పిలవగానే వస్తాడనుకున్న శివుడు రావటం లేదు. విశ్వాసం సన్నగిల్లుతోంది. పెద్దగా చెట్లు  ఉండే ప్రాంతంలో బండరాళ్లు కనిపిస్తున్నాయి. పాట బాణీ మారుతోంది. ధోరణి మారుతోంది.

దేహి అన వరములిడు దానగుణ సీమా..
పాహి అన్నను భక్తినిడు పరంధమా..

పాట ధోరణి మారింది. బ్రతిమిలాడటంలో తీవ్రత నిజాయితీలు పెరిగాయి. ఆందోళన హెచ్చింది. అహంకారం తగ్గుతోంది. తపస్వి చుట్టూ చీమల పుట్టలు పెరుగుతున్నాయి. కళ్ళు ధ్యానంలో మూతపడుతున్నాయి.

నీ దయామయ దృష్టి దురితమ్ము లారా..
వరసుధావృష్టి నా వాంఛలీడేరా..
కరుణించు  పరమేశ దరహాస భాసా..
హరహర మహాదేవ కైలాసవాసా..

మళ్లీ బాణీ మారుతుంది. ఇప్పుడు తీవ్రత desperation స్థాయికి చేరుకుంటుంది. భక్తి పెరిగింది. అహంకారం తగ్గింది. చుట్టూ పుట్టలు పెరిగాయి. ముఖంలో దైన్యం ఉన్నా, దివ్యత్వం కనిపిస్తుంది. ‘ఫాలలోచన’ అంటూ ఆరంభించే కన్నా ముందు కనిపించే ప్రకృతి మారింది.

ఇప్పుడు పాట పాడుతూంటే పాడే వేగం  చూపించే కోణం మారుతుంది. క్లోజప్పులు చూసినప్పుడల్లా భక్తి పెరుగుతుంది. ధ్యానం తీవ్రత పెరుగుతుంది. ‘శంకరా.. శివ శంకరా..’ అంటున్నప్పుడు పెరిగే వేగంతో పాటు ‘షాట్లు’ కట్ చేసి చూపే  వేగం మారుతుంది. పాట పూర్తయేసరికి అద్భుతమైన భావన కలుగుతుంది. రావణుడి భక్తి తీవ్రత, తపస్సు తీవ్రత అనుకున్నది సాధించాలన్న పట్టుదలలు  ప్రస్ఫుటమవుతాయి. సమాజానికి రోజూ పాడుకునే పరమ అద్భుతమైన భక్తి గీతం లభించింది. తరువాత దృశ్యాలలో వర్షం, తుఫాను, పాములు, ఉరుములు, మెరుపులు రావణ ‘దీక్ష’లో తీవ్రతనూ నిజాయితీని ప్రేక్షకులకు చేరువ చేస్తాయి. ఆరంభంలోని అహంకారం, విశ్వాసాలు భక్తిగా మారి అహంకారం నశిస్తుంది. అద్భుతమైన చిత్రీకరణ, స్క్రిప్టు రచన, గీత రచన, సంగీతం, గానం నటనలు  ఈ పాటను మరపురాని మధురమైన అనుభవంలా మలుస్తాయి.

‘కానరార’ పాటను పరిశీలిస్తే ఈ ‘భూకైలాస్’లో పాటల ప్రభావానికి సృజనాత్మకతను  జోడించి పాటను రూపొందించిన విధానం, సినీ పాట చిత్రీకరణను మరిన్ని ఎత్తులు ఎదిగించే విధానం గమనించవచ్చు.

(‘కానరార’ పాటను యూట్యూబ్‍లో చూడవచ్చు
https://www.youtube.com/watch?v=9JMMK12lKTc )

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version