[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]
జీవము నీవే కదా, దేవా,
బ్రోచే భారము నీదే కదా!
నా భారము నీదే కదా!
ప్రపంచంలోని పలు దేశాలు వారి వారి పురాణ గాథలను సినిమాలుగా నిర్మించినా, భారతీయ సినిమాలలో పౌరాణిక సినిమాలు ప్రత్యేకం. ఆ ప్రత్యేక పౌరాణిక సినిమాల్లో తెలుగు సినిమాలు మరీ ప్రత్యేకం. తెలుగు పౌరాణిక సినిమాలు చూసిన తరువాత, ఇతర ఏ దేశానికి చెందిన పౌరాణిక సినిమా కూడా నచ్చదు. ఇతర ఏ భాషకు చెందిన పౌరాణిక సినిమా కూడా నచ్చదు. ముఖ్యంగా తెలుగు సినిమాలలో పద్యాలు, పాటలు ఇతర దేశాల, భాషల పౌరాణిక సినిమాల నుండి తెలుగు పౌరాణిక సినిమాలను ప్రత్యేకంగా నిలుపుతాయి. ఈ విషయంలో ఎవరికైనా ఎలాంటి సందేహం ఉన్నా, తెలుగు ‘లవకుశ’ సినిమాను, దాని రీమేక్ అయిన హిందీ ‘లవ్‌కుశ్’ సినిమానూ చూస్తే చాలు నిజాన్ని గ్రహిస్తారు. ముఖ్యంగా రాముడిగా జితేంద్ర, సీతగా జయప్రదలను అయినా భరించవచ్చు గానీ పద్యాలు లేకుండా ‘లవకుశ’ను చూడటాన్ని మించిన ఘోరమైన శిక్ష మరొకటి లేదు.
హాలీవుడ్ పౌరాణిక సినిమాలు ఎంతో గొప్పగా వున్నా, టెన్ కమాండ్మెంట్స్, బెన్హర్, కోవాడీస్ తో సహా పలు సినిమాలు ఎంతో అద్భుతమయిన సినిమాలయినా, పాటలు, పద్యాలు లేని లోటు స్పష్టంగా తెలుస్తూంటుంది. పలు సందర్భాలలో ఇక్కడ ఒక పాట వుంటే ఎంత బాగుండుననిపిస్తుంది. మోజెస్, రామ్సెస్ ల నడుమ మాటల వాదన బదులు పద్యాల వాదన వుంటే, ఎంత బాగుండేదనిపిస్తుంది. ఎర్ర సముద్రం చీలేముందు మోజెస్ ఒక పాడితే.. ఆహాహా.. ఈ సినిమాల స్క్రిప్టులలో పాటలు పద్యాలు చేర్చి తీస్తే, హాలీవుడ్ వారుకూడా మెచ్చి ఆనందిస్తారు. కావ్యాల సంపద, ప్రబంధాల ఖనిజాలు, పద్యాల పగడాలున్న ఏకైక సంస్కృతి తెలుగు సంస్కృతి. పౌరాణిక సినిమాలు తీస్తే తెలుగువారే తీయాలి అనిపిస్తుంది.
అలాగే, భక్త ప్రహ్లాదుడి కథను సినిమాగా తీస్తే ‘భక్త ప్రహ్లాద’ లాగే, ‘ఇలాగే తీయాలి’, ఇంతకన్నా బాగా ఇంకెవరూ తీయలేరు అనిపిస్తుంది. ముఖ్యంగా ప్రహ్లాదుడిగా నటించిన రోజారమణి ఆశ్చర్యం కలిగిస్తే, సినిమాలో పాటలు ఆనందాన్ని కలిగిస్తాయి. ‘అద్భుతం’ అనిపిస్తాయి. ఈ సినిమా మళ్ళీ తీసినా, ఇలాంటి పాటలు రావు. రోజారమణిలాంటి బాల నటి దొరకదు.
అసలు, మన పురాణగాథలు సినిమా స్కిప్టులలాగే ఉంటాయి. వాటిలో పాటల కోసం సన్నివేశాలు వెతుక్కోనవసరం లేదు. పద్యాల రూపంలో గాథలను రచించిన పద్ధతి గమనిస్తే, అవి సినిమా స్క్రిప్టులే అనిపిస్తాయి. కాబట్టి ఒక సినిమాకు ఉండవలసిన వేగం, సంఘర్షణలు, ఉద్విగ్నతలన్నీ పురాణగాథలలో సంపూర్ణంగా కనిపిస్తాయి. కానీ విదేశీయులు వారి పురాణ గాథలను వాడుకున్నంతగా మన సినీ కళాకారులు మన పురాణ గాథలను వాడుకోలేదనిపిస్తుంది. ఒక దశ తరువాత పురాణ పాత్రల చిత్రీకరణ, తెరకెక్కించే విధం సర్వం రొటీన్ అయిపోయాయి. అలా అన్నీ రొటీన్ అయిపోతున్న సమయంలో ‘భక్త ప్రహ్లాద’ (1967) సినిమా తెరపైకి వచ్చింది.
ఈ సినిమాలో సన్నివేశ సృష్టీకరణ, చిత్రీకరణలన్నీ ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా కీలకమైన సన్నివేశాలు, ప్రహ్లాదుడిని అతడి తండ్రి ఆజ్ఞ ప్రకారం చంపాలని ప్రయత్నించే సన్నివేశాల ప్రదర్శనకోసం పాట పద్ధతిని ఎంచుకోవటం తోటే స్క్రిప్టు రచయిత సినిమాకు సగం విజయం చేకూర్చిపెట్టాడు.
పిల్లవాడిని, అందులో ముద్దులొలికే పిల్లవాడిని చంపటం అన్న ఆలోచననే పిల్లవాడిపై జాలి కలిగిస్తుంది. ఎదను కలచివేస్తుంది. ఆ చంపాలనుకుంటున్నది తండ్రే అయితే మరీ ఘోరం. ఏదో ఒకటి అయి పిల్లవాడు బ్రతికితే బాగుండనని ప్రేక్షకులు ప్రార్ధిస్తుంటారు మౌనంగా. ఆ చంపేవాళ్లు కత్తులు, కటార్లు పట్టుకుని వస్తే మరీ మంచిది! ప్రేక్షకుల గుండెలు జాలితో కరగిపోతూంటాయి. భయంతో వణికిపోతుంటాయి.
నిజానికి పాట ‘ఆదుకోవయ్యా’ అంటూ ఆరంభమవుతుంది. పాట చిత్రీకరణలో గమనించాల్సిన విషయం ఏమిటంటే, కెమెరా దృశ్యాన్ని ‘అతి నాటకీయం’ చేయదు. బహుశా పాట భావం, బాలనటి నటనలు పాటను మరింత రమణీయం చేస్తాయనీ, ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయని. అందుకని, అధికంగా క్లోజప్పులలో ప్రహ్లాద పాత్ర హావభావాలను చూపించటం ద్వారా ప్రేక్షకుల అనుభూతి స్వరూపాన్ని నిర్దేశించాడు దర్శకుడు. అవసరమైనప్పుడు కెమేరా బాలుడిని చిన్నగా, అతడిని హింసించేవారిని పెద్దగా ఒకే ఫ్రేమ్ లో చూపిస్తుంది. ఇందువల్ల హింసించేవారి బలం, పిల్లవాడి నిస్సహాయతలు ప్రస్ఫుటమవుతాయి. అలాంటి పరిస్థితిలో పిల్లవాడిని భగవంతుడు రక్షించటం ప్రేక్షకుల ఆనందాన్ని ద్విగుణీకృతం చేస్తుంది.
‘ఆదుకోవయ్యా’ అని పాట ఆరంభించినప్పుడు ప్రహ్లాదుడి వదనాన్ని క్లోజప్పులో చూపిస్తాడు. తరువాత నెమ్మదిగా కెమెరా వెనక్కి వెళ్తూ, తెరపై ఫౌర్గ్రౌండ్లో పెద్దటి గద, వెనుక కరకు సైనికుడి దుస్తులు, గద క్రింద పిల్లవాడిని చూపిస్తాయి. ఇంతటి బెదిరింపులలో కూడా పిల్లవాడు బెదరకుండా ‘భగవంతుడి’ ప్రార్ధన చేయటం ‘సినిమా’ చెప్పదలచుకున్న విషయాన్ని ప్రేక్షకుడికి చేరువ చేస్తుంది. పిల్లవాడి ముఖంలో భయం లేదు. భక్తి ఉంది. భక్తి భయాన్ని జయిస్తుంది. భక్తి మంచి, భయం చెడు. మంచి చెడుపై విజయం సాధిస్తుంది. ప్రేక్షకుల మనస్సుల్లో ఆశాభావం జనిస్తుంది.
‘ఆదుకోవయ్యా’ పల్లవి పూర్తి కాగానే కెమెరా కారాగారంలో శిక్షకు గురవుతున్న వారిని చూపిస్తుంది. వారంతా కోరస్ పాడతారు.
ఇక్కడ మరో విషయం చెప్పుకోవాలి. ప్రహ్లాదుడిగా నటించిన రోజారమణి ముఖంలో కనబడే ధైర్యం, భక్తి భావనలతో పాటు, పాటలో పదాలకు తగ్గట్టుగా పెదవులు కదపటం. ‘పతిత పావన శ్రిత జనావన సుజన జీవన మాధవా’ అన్నప్పుడు చిరునవ్వుతో ఆ పదాలను ఉచ్చరిస్తుంటే ఎంతో సంతోషం అనిపిస్తుంది. చుట్టూ ఉన్న భయానక వాతావరణం, పొంచి ఉన్న ప్రమాదం అన్నీ మరపుకు వస్తాయి. నవ్వుతున్న పిల్లవాడి ముఖం, పాటలో భావం, రాగంతో మైమరచిపోతాము. ‘భువననాయక ముక్తిదాయక భక్తపాలక కేశవా’ అనే కన్నా ముందు, దండనాయకుడు వేగంగా రావటం, ఇనుమును ఎర్రగ కాల్చటం వంటివి చూపించి, వెంటనే గద క్రింద, ఇంతింత కళ్లు చేసుకుని పిల్లవాడు పాడటం చూపటం గొప్ప ఎఫెక్టునిస్తుంది. తరువాత మళ్లీ కెమెరా వెనక్కు వెళ్తూ పిల్లవాడికి పొంచి ఉన్న ప్రమాదాన్ని చూపిస్తుంది. మళ్లీ ‘ఓ రమేశా’ అనేప్పుడు తెరపై పెద్దల నడుమ పిల్లవాడిని చూపిస్తుంది. పిల్లవాడు ఎలాంటి వారితో తల పడుతున్నాడో ప్రేక్షకులకు గ్రహింపు వస్తుంది. అంటే, కెమెరా కదలికలతో, ప్రేక్షకులలో జాలి ధైర్యం, విశ్వాసం, భయం ‘అయ్యో’, ‘అబ్బో’, ‘అమ్మా’ అనిపించే భావాలు కలిగిస్తూ, మరో వైపు పాటలో భావంతో మురిపిస్తూ పాట చిత్రీకరణ అతి చక్కగా అర్థవంతంగా సాగుతుంది.
ఇక్కడ ఎడిటింగ్ గురించి కూడా చెప్పుకోవాలి. ఓసారి వ్రేలాడుతున్నవారు, ఎర్రగా ఉన్న ఇనుపతీగెలు పట్టుకున్న వాళ్లు, టాప్ యాంగిల్ షాట్లో గదల ఎత్తు నుంచి క్రింద చిన్నగా కనిపిస్తున్న పిల్లవాడు ఇలా షాట్లు మార్చి మార్చి చూపిస్తూ, నేపథ్యంలో వినిపిస్తున్న ఉద్విగ్నభరితమైన సంగీత ప్రభావాన్ని పెంచుతూ దృశ్యాలను అమర్చటం, దృశ్య ప్రభావాన్ని పెంచటమే కాదు సినిమా దర్శనానుభవాన్ని మరపురానిదిగా మలుస్తుంది. పాట బాణీ మారుతుంది. అందరూ పాట అందుకుంటారు. మళ్లీ ‘దుష్ట గర్వ శిక్షణ’ అన్నప్పుడు గదలు క్లోజప్పులో కనిపిస్తూ, వాటి క్రింద ప్రహ్లాదుడు కనిపించినా ప్రేక్షకుడికి భయం కలగదు. అందరూ ‘స్వామి రక్షణ’ అని పాడుతున్నప్పుడు, గద సగంలో ఆగిపోయినప్పుడు ‘మనస్సు ఉప్పొంగుతుంది’. తరువాత దృశ్యాలలో కెమెరా ప్రత్యేకంగా చేయాల్సిందేమీ లేదు. జరుగుతున్న దాన్ని చూపించటం, పాట పాడే సమయంలో ప్రహ్లాద పాత్రధారిని క్లోజప్పులో చూపించటం. ఇక్కడి నుంచీ పాటలో భావం, నటీనటుల నటన, హావభావాల వల్ల పాట ‘అద్భుతం’ అనిపిస్తుంది. చిత్రీకరణ కూడా తెరపై జరిగే సంఘర్షణ వల్ల మరపురానిదిగా ఎదుగుతుంది.
సందర్భం వల్లా అంత వరకూ ప్రహ్లాదుడి పాత్రతో ప్రేక్షకులకు కలిగిన అనుబంధం వల్లా ప్రేక్షకులు తెరపై జరిగే సంఘటనలను స్పందిస్తారు. ఏనుగులపై ఎక్కి కూర్చున్నప్పుడు జాగ్రత్తగా గమనిస్తే పిల్లవాడి ముఖంలో లీలగా భయం కనిపిస్తుంది. కానీ, లిప్ మూమెంట్లో ఏ మాత్రం తేడా రాదు.
అయితే, అన్నిటికన్నా ఆశ్చర్యం కలిగించేది, అభినందించదగ్గది, అద్భుతం అనిపించేది, పామును మెడలో వేసుకుని కూడా అభినయంచగలగటం పాటలో భావానికి తగ్గట్టుగా భావాలు ముఖంలో ప్రతిఫలింప చేయటం నిజంగా ఊహకందని అద్భుతం.
ఇక పాటలో పిల్లవాడు ‘చంపేదేవరు సమసేదెవరు’ అని ప్రశ్నించటం, ఏ మాత్రం ‘ఎబ్బెట్టు’గా అనిపించదు. ఆ వయసులో అంత విశ్వాసం, భగవంతుడిపై భారం వేసి నిబ్బరంగా ప్రమాదాల్ని ఎదుర్కొనగలిగే జ్ఞానం ఉన్నవాడు వేదాంతం పలకటంలో ఎలాంటి ఆశ్చర్యం కలగదు.
ఒక్కసారి మరణానికి చేరువై వస్తేనే జీవితం పట్ల దృక్పథం మారిపోతుంది. అలాంటిది ఇన్నిసార్లు మృత్యుముఖంలో తల పెట్టి చివరి క్షణంలో బ్రతికి బయటపడ్డ వాడికి ఇంకెంత విరక్తి, వేదాంతాలతో పాటు స్థితప్రజ్ఞత వస్తుందో ఊహించటం కష్టం కాదు.
అయితే, ఈ సినిమాలో ఈ దృశ్యాలు చూస్తున్నంత సేపు, అయిదేళ్ళ పిల్ల మనస్సుపై ఎలాంటి ప్రభావం చూపించాయా? అన్న ఆలోచన వస్తుంది.
ఈ సినిమాలో కూడా గంభీరమైన విజ్ఞానవంతమయిన పాత్రలను జోకర్లుగా హాస్యాస్పదంగా చూపినా, వీలయినంత వరకూ కావ్యాలలో ఉన్న వర్ణనలకు అతి దగ్గరగా ఉంచటంతో, పోతన పద్యాల మాధుర్యం సినిమా ప్రేక్షకులను ప్రభావితం చేస్తుంది. భక్తి భావన కలిగిస్తుంది. భగవంతుడిపై విశ్వాసం పెంచుతుంది. అందుకు ఈ పాట, పాటకు తెరపై కనబడే దృశ్యాలు ఎంతగానో తోడ్పడతాయి. సినిమా ప్రభావాన్ని ప్రదర్శిస్తాయి. ఇలాంటి పాటలు, పద్యాలు లేని పౌరాణిక సినిమాలు తీపి, పాలు లేని క్షీరాన్నం లాంటివి.
(‘జీవము నీవే కదా’ పాటను యూట్యూబ్‌లో చూడవచ్చు
https://www.youtube.com/watch?v=J1LQ1SbPajI )
(మళ్ళీ కలుద్దాం)
