[‘శంతనూ – శర్మిష్ఠ’ సంచిక కోసం ప్రత్యేకంగా రచిస్తున్న సరికొత్త సినిమా పాటల శీర్షిక.]
‘సినిమా’ అనగానే పాటలు గుర్తుకొస్తాయి మనకు.
కానీ అనేకులు సినిమాలలో పాటలు మెచ్చరు.
పలువురు సినీ విమర్శకులు సినిమా నిజానికి దగ్గరగా ఉండాలని అంటారు. కానీ నిజానికి ఊహను జోడించి అంతా నిజమని భ్రమింపచేయటమే సినిమా గొప్పతనాన్ని నిరూపిస్తుందని ఇంకొందరంటారు. ఉన్నది ఉన్నట్టు చూపిస్తే అది డాక్యుమెంటరీ అవుతుంది తప్ప సినిమా కాదన్నది వీరి వాదన.
అయితే ఈ వాదనలన్నీ మనకు అనవసరం. ఎందుకంటే మనం ‘పాటలు లేనిదే సినిమాలు లేవ’ని నమ్మేవారం మనం. పాటలు ఉండని ఇంగ్లీషు సినిమాలు చూస్తూ, ‘ఇక్కడో పాట ఉంటే ఎంత బాగుండేదో’ అనుకుని నిట్టూర్చే పాటల పిచ్చి వాళ్ళం మనం.
‘రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ సినిమా చూస్తూ హీరో హీరోయిన్‍లకు ఒక్క పాట కూడా లేదు, …విలన్ డెన్‍లోఒక్క ‘ఐటమ్ సాంగ్’ కూడా లేదని బాధపడుతూ, ఓ నాలుగైదు పాటలుంటే సినిమా ఇంకా అద్భుతంగా ఉండేదని అనుకునేవాళ్ళం మనం.
ఈ వ్యాస పరంపర అలాంటి వారి కోసమే. పాటలు లేని సినిమాలను ఎంజాయ్ చేసినా, పాటలు లేని వెలితిని అనుభవించే వారి కోసమే ఈ వ్యాస పరంపర. ముఖ్యంగా పాటలు చూస్తూ, వింటూ, పాటల లోని ప్రతి పదాన్ని, ప్రతి నోట్‌నూ అనుభవిస్తూ తెరపై కనబడే దృశ్యంపై పాటను ప్రతిష్ఠించి, అనుభవించి, ఆనందించి, పలవరించేవారి కోసమే ఈ శీర్షిక.
భాష రాకున్నా, పాటలు రాసుకుని, ఆ పదాలను అర్థం చేసుకోవటం కోసం స్నేహితులను విసిగించి, అర్థం తెలిసినా, తెలియకున్నా, పాటను పాడుకుంటూ తన్మయత్వంలోకి జారుకునే వారికోసం ఈ శీర్షిక.
‘దేవ దేవ ధవళాచల మందిర’ పాటలో రావణాసురుడికీ నారదుడికీ నడుమ తేడాను పాట పాడిన విధానంలోనే కాదు సంగీతంలోనూ, చిత్రీకరణ లోనూ చూపించిన విధానాన్ని గమనించి పదే పదే తలచుకుని మురిసిపోతూ, ఆ పాటను పదే పదే చూసి ఆనందించేవారి కోసం ఈ శీర్షిక.
https://www.youtube.com/watch?v=zApvEYZh9v0&pp=0gcJCdgAo7VqN5tD
‘ఆడవే మయూరీ’ అనే పాటలోని పదాలను, బాలసుబ్రహ్మణ్యం పాడిన విధానాన్ని, పాట బాణీని మెచ్చుకుంటూ కూడా, ‘పోటీ ఏమో, ఆమె నాట్యానికి తగ్గట్టు కవిత చెప్పటం’ కానీ, హీరో, ‘నా పలుకుల కెనయగు కులుకు చూపి, నా కవితకు సరియగు నటన చూపి’ అంటూ టెర్మ్స అండ్ కండీషన్స్ మార్చేయటం ఎలా కుదురుతుందని, పాటను మెచ్చుకుంటూ కూడా వాదించుకునే వారి కోసం ఈ శీర్షిక.
https://www.youtube.com/watch?v=t0j_NwG2O_g
‘వచ్చిండే పిల్లా మెల్లగ వచ్చిండే’ పాట బాగుందని పదే పదే చూస్తూ కూడా నాయిక ఏమైనా కుక్కనా ‘క్రీమ్ బిస్కట్ వేయటానికి’ అని లాజిక్ పాయింట్లు తీస్తూ, క్రీమ్ బిస్కట్ నిజమైన క్రీమ్ బిస్కెట్ కాదని, అమ్మాయిని పటాయిచేందుకు వేసే వేషాలను సూచించే పదమని వాదించుకుంటూ కూడా చిత్రీకరణ ‘రిచ్‌నెస్’ కో, నాయిక ‘ఛార్మ్’ కో పడిపోయి పాట కోసం ‘సినిమా’ చూసేవారి కోసం ఈ శీర్షిక.
https://www.youtube.com/watch?v=UlWAjd9bcKw
‘ది ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్’ సినిమా చూస్తూ, నేపథ్యంలో సందర్భానుసారంగా వినిపించే పాటలన్నీ విని విశ్లేషించి ఎలాగ, పాటలను సందర్భోచితంగా వాడుకుంటూ సినిమాను ముందుకు నడిపించారోనని మురిసిపోతూ చర్చించుకునే వారి కోసం ఈ శీర్షిక.
ఇలా చెప్తూ పోతే ఎన్నెన్నో చెప్పాల్సి ఉంటుంది. శీర్షికలో ఎలాంటి అంశాలను ప్రదర్శించి, చర్చించబోతున్నామో వివరించటమే ఒక గ్రంథం అవుతుంది. ఒక్కమాటలో చెప్పాలంటే సంగీతానికి ఎల్లలు లేనట్టే, సినిమాకూ ఎల్లలు లేవు. సినిమా సంగీతాన్ని అనుభవించి, ఆస్వాదించి, ఆనందించి, పరవశించటానికీ ఎల్లలు లేవు. లాజిక్కులు లేవు. అలా, సినిమాల్లోని పాటలు, పదాలు, చిత్రీకరణ, సందర్భాలు, నేపథ్య సంగీతం వంటి అన్ని విషయాల గురించి చర్చించే వ్యాసాలు ఇవి. ‘సినిమాలు – పాటలు’ అని ఈసడింపుగా, చులకనగా చూసేవారు వారి ఆరోగ్య దృష్యా ఈ వ్యాసాలకు దూరంగా ఉండాలని మనవి.
ఎందుకంటే, music is divine. Music is a divine medicine. Music is a divine blessing. Music is therapeutic.
కాబట్టి ఈ వ్యాసాలు చదువుతూంటే సినిమా పాటల పట్ల చులకన అభిప్రాయాలు ఉన్నవారు కూడా సినీ పాటల ప్రేమికులయిపోతారు. జీవితంలో ప్రతి క్షణం ఆనందంగా, హాయిగా, జీవంతో తొణికిసలాడుతూ, పాటలు పాడుతూ గడిపేస్తారు.
So, welcome to the feature!
మధురమైన గీతాలు – మనోహరమైన దృశ్యాలు.