Site icon సంచిక – తెలుగు సాహిత్య వేదిక

మధురగీతాలు – మనోహరదృశ్యాలు-18

[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]

యే నహీహై, యే నహీ హై జిందగీ, జిందగీ
యే నహీ,  జిందగీ..

‘ఆవారా’ సినిమాలో ‘కల’ పాట ఆరంభంలో స్వర్గం తెరపై ప్రదర్శించాడు రాజ్ కపూర్. నాయకుడి కోసం నాయిక స్వర్గం దిగి వస్తుంది. స్వర్గం అంచుల్లో నిలబడి ‘తూ ఆజా’ అని పాడుతుంది.

లాయర్ అయినా సామాజికంగా నాయకుడి కన్నా ఉన్నత స్థాయిలో ఉన్నా, నాయిక నాయకుడిని ప్రేమిస్తోందని, అతడి సామాజిక స్థితిగతులతో సంబంధం లేకుండా నాయకుడి ప్రేమను ఆమోదించిందనీ, ఆమె నాయకుడి కోసం స్వర్గం దిగి అంచుల వరకు రావటం స్పష్టం చేస్తుంది.

నాయకుడు ఎలా ఉన్నాడో అలా స్వీకరించేందుకు నాయక సిద్ధంగా ఉంది. మరి ఆ సమయంలో నాయకుడి స్థితి ఏమిటి?

‘తూ ఆజా, తూ ఆజా’ అని నాయక నాయకుడిని పిలుస్తూ, తపించటం కనిపిస్తూ నెమ్మదిగా ‘తూ ఆజా’ ధ్వని తీవ్రత తగ్గుతూంటుంది.

తెరపై దృశ్యం మారుతుంది.

తెరపై భయంకరమైన ఆకారం కనిపిస్తుంది.

సంగీతం మారుతుంది. లయ మారుతుంది. దృశ్యంతో పాటు నృత్యం మారుతుంది. అంత వరకు మేఘాలు, పెద్ద పెద్ద భవనాలు, విశాలమైన మెట్లు ప్రశాంతంగా నృత్యం చేస్తున్న మహిళలు అదృశ్యమై, తెరపై రాక్షసులు, కంకాళాలు, అస్థిపంజరాలు కనిపిస్తాయి.

సంగీతం దూకుడు పెరుగుతుంది. అంత వరకూ సంగీతంలో ఉన్న మాధుర్యం కాస్తా బీభత్సంగా మారిపోతుంది.

ఓ పెద్ద రాక్షసుడి ముందు చేతులెత్తి ప్రార్థిస్తున్న నాయకుడు కనిపిస్తాడు.

అదీ ఎలా..

ముందుగా తెరపై భయంకరమైన కంకాళ రాక్షసుడు కనిపిస్తాడు. నెమ్మదిగా కెమెరా దూరం వెళ్తుంటే ప్రార్థిస్తున్నట్టు ఎత్తిన చేతులు కనిపిస్తాయి. కెమెరా దూరం వెళ్తున్నా కొద్దీ ఆ చేతులు నాయకుడివని తెలుస్తాయి.

అతి భయంకరమైన, హృదయాన్ని జలదరింప చేసే సంగీతం వస్తుంటుంది. నాయకుడు రెండు చేతులు తలపై పెట్టుకుని రోదిస్తున్నట్టు కొద్దిగా కెమెరా వైపు తిరుగుతాడు. వెనక నుంచి రోదిస్తున్న మన్నాడే స్వరంలో ఆలాపన వినిపిస్తుంది. ‘ఓ ఓ’ అంటూ నాయకుడు ముందుకు విరుచుకు పడతాడు.

వెంటనే దృశ్యం మాయమవుతుంది.

యమకింకరుల కంకాళాల ఊళల్లాంటి అరుపులు కేకలు వినిపిస్తుంటాయి. తెరపై ఓ భయంకరాకార రాక్షసుడు నిప్పులు విరజిమ్ముతుంటాడు. స్వర్గంలో దూదిపింజ లాంటి మేఘాలు తేలుతుంటే, ఇక్కడ భయంకరమైన అగ్ని జ్వాలలు దహించి వేస్తుంటాయి.

నేపథ్యంలో నాయకుడి రోదన వినిపిస్తూంటుంది. తెరపై అగ్ని జ్వాలలు, భయంకరమైన కింకరుల కరాళ నర్తనం.. ఉద్విగ్నతను ఉచ్చస్థాయికి తీసుకు వెళ్లి సంగీతం.. కల కాస్తా పీడకలగా మారటం ప్రేక్షకుడు అనుభవిస్తాడు.

ఇక్కడ యమకింకరుల నృత్యాన్ని జాగ్రత్తగా గమనిస్తే మేడమ్ సిమ్కీ చేసిన చమత్కారం అర్ధమవుతుంది.

యమకింకరుల నృత్యంలో వారు లయబద్ధంగా ముందుకు వెనక్కు ఊగుతూంటారు. వంగుతుంటారు. కాళ్లు దూరం పెట్టి సగం కూర్చున్నట్టు చేస్తారు. వారి వ్రేళ్ల కదలికలు చేతులను కదపటం గమనిస్తే, ఇది అస్త్రపూజ నృత్యం అనీ, నాగాలు చేసే ఖడ్గ నృత్యం అనీ అర్థమవుతుంది. ముఖ్యంగా, రవిశంకర్ సినిమా ‘కల్పన’ లోని నృత్యాల కొనసాగింపు అనీ అర్థమవుతుంది. రవిశంకర్ ‘కల్పన’ సినిమాలో ప్రదర్శించిన నృత్యాల వేగం పెంచి, దానికి తగ్గ భయంకరమైన దృశ్యాలను జోడించి, సంగీతాన్ని తగ్గట్టుగా రూపొందించి నరకం ప్రేక్షకులకు ప్రత్యక్షం అయేట్టు చేశారు.

ఇక్కడ గేయ రచయిత ప్రతిభ తెలుస్తుంది.

సందర్భసారాన్ని పట్టుకుని, సందర్భానికి జీవం పోసి ఊపునిచ్చేట్టు గీతాలను రచించటం శైలేంద్రకు వెన్నతో పెట్టిన విద్య. బాణీ కూడా ఉద్విగ్నతాభరితమై, పరుగిడుతున్నట్టుంటుంది.

ఇది కాదు జీవితం.. ఇది జీవితం కాదు అని ఒకే వాక్యాన్ని తారుమారుగా రాయటం వల్ల లోతైన అర్థాన్ని స్ఫురింప చేశాడు శైలేంద్ర.

ఆ తరువాత ఇది జీవితం కాకపోతే మరేమిటి జీవితమో చేప్తాడు.

జిందగీ కీ యే చితా మే జిందా జల్ రహా హూఁ, హాయ్
సాఁస్ కే యే ఆగ్ కే యే తీర్ చీర్‍‌తే హైఁ ఆర్‌పార్, ఆర్‌పార్..

జివితం అనే చితి పై సజీవంగా దహనమవుతున్నాడట !

అద్భుతం అనిపిస్తుంది.

నాయకుడికి ఎన్నో కలలున్నాయి. ఆలోచనలున్నాయి. కానీ అతని సామాజిక స్థితి అతడిని అణచివేస్తోంది. పైకి రానీయటం లేదు. ఒకసారి దొంగగా ముద్రపడితే, ఏం చేసినా ఆ ముద్ర పోదు. ఆ ముద్ర బరువు క్రింద జీవితాలు నలిగిపోతాయి. అతడు కోరుతున్న నాయిక ‘స్వర్గం’ స్థాయిలో ఉంది. ఇతడు నరకంలో ఉన్నాడు. ఆమెని అందుకోవాలని చేయి చాస్తున్నాడు. కానీ నరకంలోని కింకరుల కంకాళాలు, పంజరాలై అతడిని బంధిస్తున్నాయి. కదలనివ్వటం లేదు. ఇదంతా శైలేంద్ర రెండు పాదాలలో చెప్తాడు. దాన్ని ఆ పాదాల భావానికి దృశ్య రూపం తెరపై కనిపిస్తుంది.

‘యే నహీ హై జిందగీ యే నహీ’ అన్న తరువాత తెరపై నరక కింకరులు చేతులు పైకెత్తి, వ్రేళ్లు దూరం చేసి చేతులను వణుకుతున్నట్టు కదుపుతారు. ఇది కథకళి నృత్యం, ఇండోనేషియాలోని ‘బాలి’కి చెందిన ‘కేచక్’ నృత్యాల కలగలుపు. ‘కేచక్’ నృత్యాన్ని సాయంత్రం పూట ఆరంభిస్తారు. ఇది ప్రధానంగా రావణుడు సీతను అపహరించటాన్ని ప్రదర్శిస్తుంది. దీన్లో ‘చక్’ అని దాదాపుగా యాభై మంది లయ బద్ధంగా ‘కోరస్’లో అంటూ నృత్యం చేస్తారు.

ఆ నృత్యాన్ని తిన్నగా నరకంలో నాయకుడి శ్వాసనే అగ్ని అయి గుండెల్లోంచి బాణంలా దూసుకుపోవటాన్ని ప్రదర్శించేందుకు వాడుకున్నది ‘మేడమ్ సిమ్కీ’. పాట పాటలో పదాలు, సంగీతం, నృత్యం, దృశ్యం, సందర్భాల నడుమ అత్యద్భుతమైన  సమతౌల్యంతో  మరపురాని అనుభవాన్ని కలిగిస్తుందీ పాట.

(‘కేచక్’ నృత్యాల పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు
https://www.youtube.com/watch?v=CdVNrwO9DSk )

ఇక్కడ కెమెరా పనితనం అద్భుతంగా ఉంటుంది. మంటల్లో నాయకుడు మండుతుంటే కింకరులు నీడల్లో నృత్యం చేస్తూ నీడల్లో ఒదుగుతారు. ఆ తరువాత కింకరులు ‘కేచక్’ నృత్యాన్ని చేస్తూ తెర మధ్యలో కనిపిస్తారు. వెనుక అస్థిపంజరాల చేతులు నీడలు భయంకరంగా ఉంటాయి. వారు నృత్యం చేస్తూ కెమెరాను క్రిందకు తెస్తుంటే, కెమెరాను చూసి భయపడ్డట్టు నాయకుడు దగ్గర నుంచి పరుగెత్తుతాడు. నృత్యం చేస్తున్న  గుంపులోకి కెమెరా నెమ్మదిగా ‘పాయింట్ ఆఫ్ వ్యూ ఏంగిల్’ నుంచి ‘లో ఎంగిల్’కు వెళ్తుంది.

నాయకుడు కెమెరాకు దూరంగా పరుగెడుతూ కంకాళాల ఎముకల చేతులలో చిక్కుకుంటాడు. వాటి చేతుల్లో బందీ అవుతాడు. నాయకుడు బందీ అయ్యేసరికి కెమెరా లో-ఏంగిల్‌లో ఉంటుంది. దాంతో పుర్రెలు, ఎముకలు, చేతులు పెద్దగా భయంకరంగా కనిపిస్తాయి. నాయకుడు వాటిల్లో బందీ అవుతాడు. తప్పించుకునే ఆశ లేదు.

ఇప్పుడు దృశ్యం ‘కట్’ అయి నాయకుడుని క్లోజప్‌లో చూపిస్తుంది. పూర్తి  ముఖం కెమెరా వైపుండదు. మట్టి గొట్టుకుని ఏడుస్తున్న ముఖం, వెనుక ఎముకల చేతులు, విస్తరిస్తున్న అగ్ని.. చీకటి.. నరకం అంటే ఇదే అనిపిస్తుంది!

నాయకుడు ‘ఓ’ అని ఏడుస్తున్నట్టు దీర్ఘం తీసి, ఏడుపు ముఖంతో పాట అందుకుంటాడు.

ముఝ్‍కో యే నరక్ నా చాహియే
ముఝ్‌కో పూల్, ముఝ్‌కో గీత్, ముఝ్‌కో ప్రీత్ చాహియే
ముఝ్‌కో చాహియే బహార్..

తనకీ నరకం వద్దనీ, పూలు పాటలు ప్రేమ కావాలని, వసంతం కావాలని పాడుతూ, జట్టు పీక్కుంటు, అస్థిపంజరాల బారి నుంచి, నిప్పు బారి నుంచీ తప్పించుకుని పరుగులు పెడతాడు హీరో. కెమెరా హీరోను క్లోజప్‌లో తరుముతూ అతను పారిపోవటానికి నెమ్మదిగా హై ఏంగిల్ షాట్ లోకి వస్తుంది. అద్భుతమైన కెమెరా పనితనం ఇది. నాయకుడు నరకంలో ఇరుక్కునట్టున్న హై ఎంగిల్ నుంచి లో ఏంగిల్ లో చూపించారు. అతడు నరకం నుంచి పారిపోవటాన్ని లో-ఏంగిల్ నుంచి హై-ఏంగిల్‌లో చూపించారు. అంటే నరకంలో పడటం దిగజారటం, తప్పించుకోవటం ఎదగటం అన్న మాట! హై-ఏంగిల్ షాట్‌లో మంటలకు దూరంగా, కెమెరాకు దగ్గరగా నృత్యం చేస్తాన్న కింకరులు. వారు నృత్యం చేస్తూంటే, దూరంగా నాయకుడు కొండపైనెక్కి తప్పించుకోవటం కనిపిస్తుంది.

దీంతో రెండో అంకం పూర్తవుతుంది.

ఇప్పుడు నాయకుడు స్వర్గం చేరాలి.

నరకానికి స్వర్గానికి తేడా అద్భుతంగా చూపిస్తోంది కెమెరా.

కింకరులు, మంటలు, నృత్యాలు నెమ్మదిగా నిశ్బబ్దమైపోతాయి. తెర అంతా తెల్లటి పొగలాంటి మేఘాలు అలుముకుంటాయి.

ప్రశాంతమైన నాదం వినిపిస్తుంటుంది. మేఘాలు కాస్త తొలగగానే విరాట్ మూర్తి త్రిమూర్తుల వదనాలు కనిపిస్తాయి.

ఆ నరకలోకపు అదరగొట్టే  సంగీతం తరువాత ఈ శాంత ప్రశాంత బంధర నాదం ఎంతో హాయిని కలిగిస్తుంది. శాంతిని కలిగిస్తుంది.

కోరస్ ‘ఓం నమః శివాయ’ అంటుంది.

‘ఓం’ సరికి కెమెరాలు దగ్గరలో foreground లో మేఘాల నడుమ హీరో తల కనిపిస్తుంది. నరకం శిక్ష అనుభవించి స్వర్గానికి ఎదిగాడన్న మాట హీరో.

రెండవ సారి స్వర్గంలో పాట బాణీ ఏదో కుదరటం లేదు. ఎవ్వరికీ నచ్చటం లేదు. అప్పుడు నర్గీస్ ఓ రికార్డు తీసుకుని తన గదిలోకి వెళ్లటం శంకర్ జైకిషన్ లతో శంకర్ చూశాడు. ఆ రికార్డు ఏమిటని అడిగి తీసుకుని విన్నాడు. అది 1936లో విడుదలైన ‘వెద్దార్’ అనే ఈజిప్టు సినిమాలోని అరబిక్ పాట ‘అల బలది ఎల్మాహ్బౌబ్.’ పాడింది ప్రఖ్యాత గాయని ‘ఉమ్మ్ ఖల్తుమ్’. వెంటనే ఆ బాణీని తీసుకుని దానికి వాయిద్యాలను జోడించటంతో సూపర్ హిట్ పాట ‘ఘర్ ఆయా మేరా పర్‌దేశీ’ రూపొందింది. లతా మంగేష్కర్ దివ్యమైన స్వరంలో నిజంగా స్వర్గలోకపు మధురమైన గీతంలా ఎదిగింది.

అరబిక్ పాట ఇక్కడ వినవచ్చు.

https://www.youtube.com/watch?v=nzW05lhEPKs

ఒకోసారి ‘ఓం నమః శివాయ’ అంటుంటే నాయకుడు కొద్ది కొద్దిగా పైకి వస్తుంటాడు. అతిడిని తెరపై మూలలో చూపించి తెర అంతా త్రిమూర్తుల విగ్రహాన్ని చూపిస్తారు. ‘ఓం నమః శివాయ’ అనే సమయానికి లాంగ్ షాట్‌లో విగ్రహాల ఎత్తు, తెలిసేట్టు, విశాలమైన మెట్లు కనిపించేట్టు, మెట్లు అంచున సాంప్రదాయ నృత్య దుస్తులు ధరించి శిల్పాల్లా నాట్యభంగిమలో నిలిచిన నాట్యగత్తెలు కనిపిస్తారు. మేఘాల నుంచి పైకి వస్తుంటాడు హీరో. పడుతూ లేస్తూ మెట్లు చేరుకుంటాడు. ఇంతలో మెట్ల మీద నుంచి పరుగెత్తుతూ నాయిక వస్తుంది. సంగీతం మారుతుంది.

‘లో ఏంగిల్ షాట్’లో ఆకాశమంతా నిండిన నాయిక క్రిందకు వంగి, పడుతూ లేస్తూ వస్తున్న నాయకుడికి ఆసరా నిస్తుంది. పట్టి లేపుతుంది. అంత వరకూ వినిపిస్తున్న ఓం నమః శివాయ స్థానాన్ని మధురమైన మాండలీన్ తంత్రుల స్వరాలు ఆక్రమిస్తాయి. అతి చక్కటి ప్రశాంత భావన కలుగుతుంది. లయబద్ధంగా కోరస్ స్వరం విపుతుంది. గిటార్, తబలా, హర్మోనియంలు జోడవుతాయి. పాట ఆరంభమవుతుంది.

ఘర్ ఆయా మేరా పర్‌దేశీ
ప్యాస్ భుజీ మెరీ అఖియన్ కీ..

నాయిక చేయి అందించి అతడిని మెట్లు ఎక్కిస్తుంది. పాడుతూ, సంతోషంగా నృత్యం చేస్తూ అతడిని ఒంటి స్తంభం వర్తులాకారపు మేడ పైకి తీసుకు వెళ్తుంది. అంటే, ఆమె అతడిని స్వీకరించి, అతడిని మంచి వైపు మళ్లించింది. అతడిని ఉన్నత స్థాయి వైపుకు తీసుకు వెళ్తోంది. మేఘాల లోంచి బయటకు వచ్చి ఆమెను అనుసరిస్తాడు హీరో. ఇక్కడ కూడా నటరాజ విగ్రహానికి ముందు ఉదయ్ శంకర్ శైలిలో నత్యం సాగుతుంది. అద్భుతమైన నృత్యం, పరమాద్భుతమైన గానం, మనోహరమైన సంగీతం, మధురమైన దృశ్యం కలగలసి ఈ పాట దర్శనాన్ని మరపురాని అనుభవంగా మలుస్తాయి.

నర్గీస్ గొప్ప నృత్యం తెలిసిన నటి కాదు. కాబట్టి ఆమె నృత్యాన్ని మౌలిక కదలికలకు పరిమితం చేస్తారు. క్లోజప్‌లలో అభినయానికి, హావభావ ప్రదర్శనకీ ప్రాధాన్యం ఇస్తారు.

ఆమె అతడిని ఒక్క అడుగు పైకి తీసుకు వెళ్తుంటుంది. అంతా హాయిగా, సంతోషంగా ఉన్న సమయంలో విలన్ ‘జగ్గు’ వస్తాడు కత్తి పుచ్చుకుని.

దృశ్యం మారుతుంది. సంగీతం మారుతుంది. అంత వరకూ ఆహ్లదంగా హాయిగా ఉన్నదంతా ఒక్క క్షణంలో మారిపోతుంది.కల చెదరి, పీడకలగా మారుతుంది.నాయకుడు తుఫానులో చిక్కుకుంటాడు. నాయిక నాయకుడికి రక్షణగా నిలబడుతుంది. కానీ విలన్ శరీరం రాక్షసుడిలా పెరిగిపోతుంది. అతడి ముందు హీరో, హీరోయిన్లు పిపీలకాలు. విలన్ కత్తి అతి పెద్దగా అయి వారి దగ్గరకు వస్తుంది. విలన్ నవ్వుతూంటాడు. నాయిక నాయకుడినుంచి వేరై పోతుంది..

నటరాజు విగ్రహం పడిపోతుంది. అన్నీ కూలిపోతుంటాయి.

కోరస్ విహ్వలంగా కేకలు పెడుతుంది.

 క్లోజప్‌లో నాయకుడి వదనం చూపిస్తాడు. నాయికను పిలుస్తూ అరుస్తూ నాయకుడు నిద్ర లేస్తాడు.

తొమ్మిది నిమిషాల ఇరవై ఆరు సెకన్లలో మానవ మనస్తత్వాన్ని ఆందోళనల స్వరూపాన్ని మనిషి మెదడులోనే స్వర్గ నరకాలున్నాయన్న నిజాన్ని భవిష్యత్తును సూచించే కలల శక్తినీ సర్వం ప్రదర్శిస్తూనే, కథను ముందుకు తోస్తాడు దర్శకుడు.

అందుకే ఈ పాట ఒక క్లాసిక్‌గా నిలచిపోయింది.

ఈ పాట ప్రభావం సినీ కళాకారులపై ఎంతగా పడిందంటే తరువాత మానసిక సంఘర్షణలకు, ఆశలకు, కోరికలను ప్రదర్శించటానికిక ‘కల’ ఒక మాధ్యమం అయింది. స్వర్గం, నరకం, ఎలా ఉంటాయో చూసేందుకు కళాకారులు ఒక ‘మోడల్’ లభించింది. ‘మిస్సమ్మ’ సినిమాలో సావిత్రి కలగంటుంది ఒక కీలకమైన సన్నివేశంలో. మానసిక ఆందోళనలను ఆ కల ప్రతిబింబిస్తుంది.

‘సువర్ణ సుందరి కథ’ లో ‘పిలువకురా’ పాట స్వర్గంలో నాయిక పాడుతుంది. అప్పుడు ఆ స్వర్గంలో వంపులు తిరిగిన దారి ఉంటుంది. మేఘాలుంటాయి. ‘ఆవారా’లో లానే. అనేక పౌరాణిక సినిమాలలో స్వర్గాన్ని చూసేందుకు ‘ఆవారా’నే ఆదర్శంగా నిలిచింది.

చివరికి ‘గుమ్‌నామ్’ సినిమాలో వంట చేస్తూ ‘మహమూద్’ – హెలెన్ నృత్యం చేస్తున్నట్టు, ‘హమ్ కాలే హైఁ తో క్యా హువా’ అని పాడుతూన్నట్టు కల కంటే దానికి సెట్టింగులకు ప్రేరణ ‘ఆవారా’నే!

“హుమ్ కాలే హైతో క్యా హువా” పాటను ఇక్కడ చూడవచ్చు.

https://www.youtube.com/watch?v=pgeyRvKTFdc

ఇది భారతీయ చలన చిత్ర కళాకారులను ఈనాటికీ ప్రభావితం చేస్తున్న ఆవారా ‘కల’ పాట. ఈ పాటను చిత్రీకరించేందుకు మూడు నెలలు పట్టింది. పాటను రికార్డు చేయటం గురించి ఇప్పటికీ కథలనేకం వినిపిస్తూనే ఉంటాయి. అందుకే మధుర గీతంగా మనోహరమైన దృశ్యంగా ఎన్నటికీ నిలుస్తుంది ఈ ‘ఆవారా’ కల పాట.

(‘ఘర్ ఆయా మేరా పర్‌దేశీ’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు
https://youtu.be/-qGfuzu3Obo )

(మళ్ళీ కలుద్దాం)

Exit mobile version