[సంచిక కోసం ‘శంతనూ – శర్మిష్ఠ’ ప్రత్యేకంగా రచిస్తున్న సినిమా పాటల శీర్షిక.]
తేరే బినా ఆగ్ యే చాంద్‌నీ
తూ ఆజా
తేరే బినా, బేసురీ బాసురీ
యే మేరీ జిందగీ దర్ద్ కీ రాగినీ..
తూ ఆజా..
‘ఆవారా’ సినిమాలో పాటలన్నీ ఒక ఎత్తు, సినిమాలో అత్యంత కీలకమైన సమయంలో వచ్చే ఈ ‘కల’ పాట ఒక ఎత్తు.
భారతీయ సినిమాలకు కలలు నేర్పిన పాట ఇది. భవిష్యత్తు తరాలు, ఈ నాటికే కాదు, రాబోయే తరాలు కూడా స్ఫూర్తి పొంది అనుసరించే పాట ఇది.
సృజనాత్మకత పరంగా, సంగీత పరంగా, స్క్రిప్టు పరంగా, చిత్రీకరణ పరంగా, పాఠ్య పుస్తకం లాంటి సినిమా పాట ఇది. ఒక తరం మరో తరం నుండి స్ఫూర్తి పొంది సృజనాత్మక శిఖరాలు అధిరోహించి, ప్రామాణికాలను ఏర్పరచటానికి అతి చక్కని ఉదాహరణ ఇది.
‘ఆవారా’ సినిమా హీరో, నిర్మాత, దర్శకుడు రాజ్ కపూర్. దాంతో ‘ఆవారా’ ప్రధానంగా రాజ్ కపూర్ ప్రతిభ ప్రదర్శనకు తిరుగులేని తార్కాణంగా నిలుస్తుంది. సినిమా పలు కళాకారుల సమిష్టి కళా ప్రదర్శన ఫలితం అయినా, నిర్మాత, దర్శక, నటుడిగా రాజ్ కపూర్ పాత్ర అత్యంత ప్రధానమైనది. సంగీత సృజనలోనూ, కళా నిర్మాణ పనుల్లోనూ రాజ్ కపూర్ మాట ‘చివరి మాట’ కావటంతో అందరి కన్నా ఎక్కువగా కనబడేది రాజ్ కపూర్ ప్రతిభే.
‘ఆవారా’ సినిమా – స్క్రిప్టు రచన, స్క్రిప్టులో పాటలను ఉపయోగించుకున్న విధానం పాటల ద్వారా కథను ముందుకు నడిపించి, పాటలను సినిమాలో అంతర్భాగం చేయటం వంటి అనేక విషయాలకు అతి చక్కని పాఠ్య పుస్తకం లాంటిదీ సినిమా.
ఓ జడ్జి అనుమానంతో గర్భవతి అయిన భార్యను ఇంట్లోంచి గెంటేస్తాడు. ఆ జడ్జి తీర్పు నిచ్చి శిక్షించిన దొంగ ఆమెకు ఆశ్రయమిస్తాడు. ఆమె ఓ మురికివాడలో పిల్లవాడిని పెంచుతుంది. అతడికి ఆ జడ్జి పెంచుతున్న అమ్మాయి స్కూల్లో పరిచయం అవుతుంది. తరువాత అతడు ‘ఆవారా’ అవుతాడు. జైలు కెళ్తూ వస్తుంటాడు. ఓ రోజు అతడికి చిన్నప్పటి స్నేహితురాలు పరిచయం అవుతుంది. ఇప్పుడు ఆమె లాయరు. ఆమెకు తగినవాడిగా అర్హత పొందేందుకు మంచివాడిగా మారాలనుకుంటాడు హీరో. కానీ అతడిని వదలటానికి ఇష్టపడడు దొంగ. ఈ సందర్భంలో, అంటే ఓ వైపు తాను నాయికకు తగడన్న భావం, తాను ‘ఆవారా’ అన్న న్యూనతాభావం, దొంగ ఎలాగూ తనను వదలడన్న భయం, తమ నడుమ అడ్డు పడతాడన్న అభత్రతా భావం.. ఇలాంటి పలు ఉద్విగృతల నడుమ మానసికంగా నలుగుతూంటాడు హీరో. ఈ సందర్భంలో భవిష్యత్తు ప్రహేళికగా అనిపిస్తూ, ఏమౌతుందోనన్న ఆందోళన, ఉద్విగ్నతలతో హీరో సందిగ్ధంలో ఉన్న సందర్భంలో అతని మానసిక వేదనలను, భయాలను, ఆందోళనలను, అభద్రతాభావాన్ని, ఆశలను ప్రతిబింబిస్తూ అతనికి ఓ కల వస్తుంది.
ముఖ్యంగా, తనను కలవనందుకు విలన్ బెదిరిస్తే ఓ ధనవంతుడి అమ్మాయిని డబ్బు కోసం వలలో వేసుకుంటున్నానని అబద్దం చెప్తాడు హీరో. అప్పుడు విలన్ కత్తి చూపించి ‘అగర్ జగ్గాకో ధోకా దేనేకీ కోషీష్ కీ’ అని బెదిరించి నవ్వుతాడు. అప్పుడు క్లోజప్పులో భయం, ఆందోళన, అభత్రతా భావాలతో నిండిన ముఖాన్ని నేపథ్యంలో విలన్ నవ్వు వినిపిస్తూండగా చూపిస్తారు. తరువాత దృశ్యం మంచంపై నిద్రిస్తున్న నాయకుడిని దూరం నుంచి చూపి ముఖాన్ని క్లోజప్పులో చూపిస్తుంది. నాయిక ప్రేమ మాటలు వినిపిస్తాయి. విలన్ బెదిరింపులు ఆ ముఖం పై కనిపిస్తాయి. పాట ఆరంభమవుతుంది.
విలన్ బెదిరింపులు వినిపించిన రెండు మూడు సెకన్ల తరువాత తాన్పూరా, మోర్సింగ్, చెల్లోలు కలగలసిన ధ్వని వినిపిస్తుంది. ఈ ‘ధ్వని’ శృతి చూసుకుంటున్నట్టుంది. ఇటు ఏవో ఏవేవో అర్థం కాని భయాలకు నాంది పలుకుతున్నట్టుంది. వయోలిన్లు, విహ్వలంగా ఈ ధ్వనులకు తోడవుతాయి. నెమ్మదిగా ఆందోళనగా ఉన్న రాజ్ కపూర్ వదనం మేఘాలు దట్టంగా కదలుతున్న దృశ్యంలోకి ‘డిజాల్వ్’ అవుతుంది.
నేపథ్య సంగీతం మారుతుంది. విహ్వలమైన వయోలిన్లలో ఏడుపు లాంటి స్వరంతో సారంగి వినిపిస్తుంది. కెమెరా మేఘాలలోకి నెమ్మదిగా వెళ్తూంటుంది. గంటలు వినిపిస్తూంటాయి. మేఘాలు చెల్లా చెదరవుతూ నెమ్మది నెమ్మదిగా spiral, వర్తులాకారపు మెట్లున్న ఒంటి స్తంభం మేడను చూపిస్తుంది.
నేపథ్యంలో చిత్ర విచిత్రమైన ధ్వనులు వినిపిస్తూంటాయి. పలు వాయిద్యాలు కలసి కోరస్‌ను జత చేసుకుని విషాదం, గాంభీర్యం, సస్పెన్స్‌లు కలగలిసిన నాదాలను వినిపిస్తుంటాయి. అత్యద్భుతమైన సంగీత రచన ఇది. సాంకేతికత అంతగా అభివృద్ధి చెందని కాలంలో జైలాఫోన్, పికోలా ఫ్లూట్, హర్న్, వయెలిన్లు, ఖంజరి, నగారా వంటి సాంప్రదాయక, పాశ్చత్య వాయిద్యాలను కలగలిపి ఎక్కడా ఒక్క ‘నోట్’ కూడా అటు ఇటూ కాకుండా సరిగ్గా కలసి మోగుతూ ‘సంగీత’ భావనను కలిగించటమే కాదు కనబడుతున్న దృశ్య భావాన్ని ఇనుమడింప చేస్తూ, ప్రేక్షకుడి మనస్సులో ఆ భావనను బలంగా ముద్రించే రీతిలో సంగీత సృజన చేయటం ఊహకందనంత అద్భుతం. సంగీతం దృశ్యాన్ని చూపుతోందా, దృశ్యం సంగీతం ప్రకారం రూపుదిద్దుకుంటున్నదా అన్న భ్రమను కలిగిస్తుందీ పాట చిత్రీకరణ. సంగీత ప్రకంపనల తీవ్రత, ఒక తెలియని రహస్యమేదో తెలుస్తున్న భావన కలిగిస్తూ మెలికలు తిరిగిన దారి పొగ నడుమ కనిపిస్తుంది. అంతలో సంగీతం మారుతుంది. దృశ్యం మారుతుంది. ఒక కళాతోరణం లాంటి కట్టడం పక్కన లయబద్ధంగా నృత్యం చేస్తూ కొందరు మహిళలు కనిపిస్తారు.
చూడగానే ఇదొక ‘కల’, సామాన్యమైన మానవ ప్రపంచం కాదని తెలిసిపోతుంటుంది. ముందుగా కనిపించిన వృత్తాకారపు మెట్లున్న ఒంటి స్తంభం మేడ; అందుకోలేని, కానీ ప్రయత్నిస్తే అందుకోగలిగే ‘ఎత్తు’లా తోస్తుంది. అంటే మన హీరో ‘ఆవారా’. నాయిక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి. అట్టడుగు స్థాయిలో ఉన్న హీరో అందుకోవాలని ప్రయత్నిస్తున్న దానికి అది ప్రతీక. ‘అందుకోజాలనీ ఆనందమే నీవు’ అన్న భావానికి చక్కగా మేఘాలు నాయకుడి సందిగ్ధంతో పాటు, ఒక ‘మరో లోకం’, ‘దివ్యలోకం’ అన్న బ్రాంతిని కలిగిస్తాయి. ‘దివ్యలోకం’ భావనను నృత్యం చేసే మహిళలు స్థిరపరుస్తారు. వారి నృత్యం ఆనందమయం. కట్టడాలు అందమైనవి.
బహుశా ఈ ‘కల పాట’ను విశ్లేషించినంతగా విమర్శకులు మరో పాటను విశ్లేషించలేదేమో! ఆ కాలంలో మాములుగా ‘పాట’కు ఉండాల్సిన లక్షణాలను, నిర్మాణ పద్ధతిని కాదని మూడు భిన్నమైన పాటలను ఒక పాటగా, ఒక సంఘటనగా, ఒక కథగా అత్యంత సృజనాత్మకంగా రూపొందించిన ఈ పాటలో ప్రతీకల గురించి, చిత్రీకరణలో మెలకువలు, అర్ధాలు గురించి, నృత్యం గురించి, ప్రతీకల వెనుక దాగిన మానసిక శాస్త్ర, సిద్ధాంతాల గురించి, నృత్యం, సంగీతం, దృశ్య నిర్మాణ సూత్రాల గురించి ఎన్నెన్నో చర్చలు, విశ్లేషణలు ఇంకా సాగుతూనే ఉన్నాయి. ఈ పాట సంగీతం రూపొందించిన విధానంపై, ప్రభావాల గురించి, సైట్ డిజైన్‌పై ప్రభావాల గురించి, నృత్యం రూపొందించిన విధానంపై ప్రభావాల గురించి అనేకానేక చర్చలు, వాదాలు, సిద్ధాంతాలు ఉన్నాయి.
నిజానికి ఈ పాట చిత్రీకరణలో వాడిన వర్తులాకార మెట్లున్న ఒంటి స్తంభం మేడ కానీ, వంపులు తిరిగిన దారి కానీ గతంలో ఆంగ్ల చిత్రాలలో వాడినవే. కానీ ఆ కట్టడాలను ‘ఆవారా’ సినిమాకు అన్వయించి, కథానాయకుడి మానసిక ఆందోళనలకు, సందిగ్ధాలకు , ఆశలకు ప్రతీకలుగా వాడటంలో దర్శకుడి ప్రతిభ తెలుస్తుంది. ముఖ్యంగా చిత్రీకరణ, సంగీతంల నడుమ జరిగే జుగల్బందీ పాట దర్శన ప్రభావాన్ని ఒక మరపురాని మానసిక సంఘర్షణను చిత్రించే దృశ్య సందర్భనానుభవంగా మలుస్తుంది.
ఈ పాటను విశ్లేషకులు మూడు భాగాలుగా విభజించారు. మొదటి భాగం స్వర్గం, రెండవ భాగం నరకం, మూడవ భాగం మళ్లీ స్వర్గంగా భావించి ఈ పాట చిత్రీకరణను మిల్టన్ రచన ‘ది లాస్ట్ ప్యారడైజ్’ ‘పారడైజ్ రీగైండ్’ లకు చిత్రానువాదంగా తీర్మానించారు.
మరి కొందరు ఈ పాటను నాలుగు భాగాలుగా భావించి మొదటి భాగం స్వర్గం, రెండవ భాగం భూమిపై, మూడవ భాగం నరకం, నాలుగవ భాగం తిరిగి సాధించిన స్వర్గంగా విభజించారు. ఈ పాటకు సంగీతాన్ని సృజించిన శంకర్ జైకిషన్‍ల లోని శంకర్ ఓ ఇంటర్వ్యూలో ముందుగా, “రెండు వేర్వేరు పాటలని అనుకున్నాం. పాటలను రూపొందించాం. కానీ రెంటినీ కలుపుతూ మరో పాట ఉంటే బాగుంటుందనిపించింది. దాంతో ఈ పాట మూడు పాటల కలయిక అయింది” అన్నాడు.
ఈ పాటలో గమనించాల్సిందేమిటంటే, పాట రూపొందించిన తరువాత చిత్రీకరణ ఊహించారా? చిత్రీకరణ ఊహించి అందుకు తగ్గట్టు పాటను సృజించారా? లేక, రెంటినీ ఒకేసారి ఊహిస్తూ, ఆలోచిస్తూ, సృజిస్తూ ముందుకు సాగారా? ఎందుకంటే దృశ్యాలు సరిగ్గా సంగీతాన్ని అనుసరిస్తాయి. తెరపై కనబడే దృశ్యాల ప్రభావాన్ని సంగీతం ఇనుమడింప చేస్తుంది.
ఇంకా పాటలో ఒక్క పదం పాడలేదు. అప్పుడే, సంగీతం, దృశ్యాలు మనకు స్వర్గం చూపించాయి. స్వర్గంలో అప్సరసల నృత్యం చూపించాయి. అప్సరసలు అందదనుకున్న ఒంటి స్తంభం మేడను లయబద్ధంగా అధిరోహించటం కనిపిస్తుంది. ఎన్నెన్ని వాయిద్యాలు ఎన్నెన్ని హోయలు ధ్వనుల అలల రూపంలో వినిపిస్తాయో! ఈ లయ కనుగుణంగా దృశ్యానికి, సంగీతానికి స్పందిస్తూ కదలుతుంది కెమెరా. నెమ్మదిగా పైకి వెళ్తుంది. పై నుంచి క్రిందకు వస్తుంది. వంపులు తిరిగిన దారి నుంచి కెమెరా క్రిందకు వచ్చి భూలోకాన్ని చూపించినట్టు చూపిస్తుంది. పాములా వంపులు తిరిగిన పెద్ద విగ్రహం దగ్గర నాయిక కనిపిస్తుంది. పాత పవిత్ర స్థలాలకు మల్లే పెద్ద విశాలమైన మెట్లు, పైన విగ్రహం. ఆకాశంలో చంద్రుడు, మేఘాలు.. అద్భుతమైన పెయింటింగ్‌లా ఉంటుంది. జీవంతో చలనం కల పెయింటింగ్. క్రింద మేఘాలు సంగీతానికి అనుగుణంగా కదలుతుంటాయి. విహ్వలమైన సంగీతం వినిపిస్తుంది. లయ మారుతుంది. లత అలాపన ఈ లోకానికి చెందిన దానిలా అనిపించదు. ఒక వేదనా భరితమైన రోదన. ఇంతలో తెరకి ఇరువైపుల నుంచీ నర్తిస్తూ లయను అనుసరిస్తూ నాట్యగత్తెలు వస్తుంటారు. వారి కదలికల్లోనూ విషాదం. ఇంతలో తెరను మేఘం క్రమ్మేస్తుంది. అది తొలగేసరికి క్లోజప్పులో విషాద వదన అయిన నాయిక కనిపిస్తుంది. వెనుక నుంచి లైటింగ్ ఆమె దివ్యకన్య అన్న భావనను కలిగిస్తుంది. వెంటనే క్రింద మూడు గుంపులుగా విడివడిన శ్వేత వస్త్రధారులయిన యువతులు ఆ విషాద లయకు అనుగుణంగా కదులుతుంటారు. కెమెరాపై నుంచి వారిని చూపించటంతో, నాయిక ఎంత ఎత్తున ఉన్నదో తెలుపుతుంది. ఇదంతా చూస్తూంటే ప్రేక్షకుడు ఈ లోకంలో ఉన్నానన్న విషయం మరచిపోతాడు. మరో లోకాన్ని దర్శిస్తున్న అనుభూతి పొందుతాడు. నలుపు తెలుపు సినిమాల సౌందర్యానికి పరాకాష్ఠ లాంటిది ఈ పాట చిత్రీకరణ.
పాట ఆరంభానికి దారి తీసే సంగీతం కూడా రోదిస్తున్నట్టు ఉంటుంది. ఆ సంగీతానికి అనుగుణంగా నృత్యం ఉంటుంది. పాట ఆరంభమయ్యే సరికి నాయిక కూర్చుని ఉంటుంది. చంద్రుడు పెద్దగా ఉంటాడు. ‘నువ్వు లేనప్పుడు వెన్నెల వేడి మంట’ అని నాయిక అనటం అనుభవిస్తాడు ప్రేక్షకుడు. తరువాత ఒక్కో వాక్యం పాడుతూ మెట్లు దిగి వస్తుంటే విశాలంగా వెనుక సెట్లు కనిపిస్తూంటే, తెరపై ఎడమ అంచున మహిళలు లయబద్ధంగా కదులుతుంటారు. ఆకాశాన ఉన్న దేవత క్రిందకు దిగి వస్తున్నట్టుంటుంది. ఇలా తెర అంచున మేఘాలు ఎగసెగసి పడుతూంటాయి. ‘తూ ఆజా’ అని నాయిక అంటున్నప్పుడు ఆమె వేదనను ప్రేక్షకులకు చేరవేసేందుకు బాధతో ఉన్న ఆమె వదనాన్ని క్లోజప్పులో ఒక వైపే చూపిస్తారు. ఆమె ‘తూ ఆజా’ అంటూ కెమెరా వైపు తిరుగుతుంది. కానీ సంపూర్ణంగా కెమెరా వైపు తిరగదు. అద్భుతమైన ఎఫెక్టు ఇస్తుంది.
వెంటనే దృశ్యం కట్ అయి మేఘాలతో నిండిన మెట్లు, ప్రతి మెట్టు అంచున నర్తకిలను చూపిస్తుంది. వారు లయబద్ధంగా ఊగుతూంటారు. కోరస్‌లో పాడుతుంటారు. కట్ చేసి నాయికను ఎదురుగా ‘పాయింట్ ఆఫ్ వ్యూ’ కోణంలో చూపుతాడు. ఇప్పుడు నాయిక వేదన తెలుస్తుంది. నేపథ్యంలో పైకి వెళ్తున్న మెట్లు, వెనుక ఉన్న మేఘాలు, ఎత్తయిన కట్టడం కనిపిస్తుంటాయి. సినిమాటోగ్రాఫర్ అత్యద్భుతమైన నైపుణ్యంతో దృశ్యంలో ‘లోతు’ను సాధించాడు. నాయకుడి కోసం ఎంతగా నాయిక క్రిందకు దిగి వచ్చిందో ఈ దృశ్యం చూపుతుంది. ఇంత వరకూ తెర అంచులలో ఉన్న మేఘాలు ఇప్పుడు తెర మధ్యన, నాయిక వెనుకకు వస్తాయి. అంటే ఇంత వరకూ నాయిక మేఘాల కన్నా ఎత్తున ఉంది. ఇప్పుడు మేఘాలు ఆమె కన్నా ఎత్తున ఉన్నాయి. ఆమె నాయకుడి కోసం స్వర్గం వదలి వస్తోంది. ఆమె ఎంతగా దిగి వస్తోందో చూసేందుకు ఇప్పుడు కెమెరా గొప్ప చమత్కారం చేస్తుంది.
ఆరంభంలో ఎత్తు నుంచి నాయిక ‘తూ ఆజా’ అంటూ కెమెరా దగ్గరకు వచ్చి ఆగిపోతుంది. ఇప్పుడు కెమేరా ఆమెకు దూరం వెళ్తుంది. ఎత్తు నుంచి ఆమెను చూపిస్తుంది. ఇప్పుడు ఆమె ఎంతగా క్రిందకు దిగి వచ్చిందో, ఆమె వేదన లోతు ఎంతో ప్రేక్షకుడికి బోధపడుతుంది. ‘తూ ఆజా’ అంటున్న ఆమెను మేఘాలు కప్పేస్తాయి. ఇప్పుడు అర్థమవుతుంది, పాట ఆరంభంలో నాయిక లేచి నిలుచున్నప్పుడు ఆమెను దాదాపుగా చంద్రుడి అంత ఎత్తున ఉన్నట్టు అనిపించేట్టు చూపిస్తుంది కెమెరా. అది ఆమె స్థాయి. ఇప్పుడు నాయకుడి కోసం ఆమె
ఈ పాటకు కొరియోగ్రఫీ కోసం రాజ్ కపూర్, ఉదయ్ శంకర్ నృత్య భాగస్వామి ‘మేడమ్ సిమ్‌కీ’ని ఎంచుకున్నాడు. ఆ కాలంలో ‘ఉదయ్ శంకర్’ భారతీయ కళా ప్రపంచాన్ని ఉర్రూతలూపాడు. శంకర్ జైకిషన్‌లలో శంకర్ కూడా కొన్నాళ్లు అక్కడ నృత్యం నేర్చుకున్నాడు. గురుదత్ కూడా ఆ పాఠశాల విద్యార్థి. అందుకే ప్యాసాలో ‘హమ్ ఆప్ కీ ఆంఖో మే’ పాట చిత్రీకరణ ‘తెరా బినా ఆగ్ యే చాందినీ’ పాట చిత్రీకరణను పోలి ఉంటుంది.
‘మేడమ్ సిమ్‍కీ’ పాట చిత్రీకరణ అంతకు ముందు ఉదయ్ శంకర్ నిర్మించిన ‘కల్పన’ సినిమాలో నృత్యాలను పోలి ఉంటాయి. ఈ పాటలో నృత్యాలన్నీ మేడమ్ సిమ్‍కీ బృందం వారు చేశారు.
‘మేడమ్ సిమ్‌కీ’ అసలు పేరు ‘సేమన్ బార్బియేర్’. చిన్నప్పుడే పియానో నేర్చుకుంది. తరువాత విభిన్నమైన నృత్యాలు నేర్చుకుంది. 16 ఏళ్ల వయసులో ఉదయ్ శంకర్ ఆమెకు పరిచయం అయ్యాడు. ఆమెను తన పాఠశాలలో ఉపాధ్యాయునిగా ఆహ్వానించాడు. ఆమె భారతీయ సంగీతాన్ని పియానోకనుగుణంగా రూపొందించటం ఉదయ శంకర్‌కు నేర్పించింది. ఆమెకు ‘సిమ్‍కీ’ అన్న పేరు పెట్టింది ఉదయ శంకరే. ఇద్దరూ కలసి పలు పేరు పొందిన నృత్యాలను రూపొందించారు. అందుకే ‘ఆవారా’ లో ‘తేరా బినా’ పాట లోనే కాదు, మొత్తం ‘కల పాట’లో సెట్స్, నృత్యాలు ‘కల్పన’ సినిమాలోని నృత్యాలను పోలి ఉంటాయి.
ఈ పాట సెట్లను రూపొందించింది ఎ.ఆర్. ఆచ్రేకర్. కెమెరా బాధ్యతలను నిర్వహించింది రాధూ కర్మకర్. ఈ పాటలో మేఘాల కోసం ఘనీభవించిన కార్బన్ డయాక్సైడ్, మంచును వాడేరు. అయితే, పాట చిత్రీకరణ సమయంలో అధికంగా కార్బన్ డయాక్సైడ్‌ను పీల్చటం వల్ల పలువురు డాన్సర్లు సృహ తప్పి పడిపోయారు. కానీ ఎక్కడా పాట చూస్తుంటే అలాంటిది జరిగినట్టనిపించదు.
ఇంత వరకూ మనం ‘స్వర్గం’ నుండి నాయిక భూమి పైకి రావటం మటుకే చూశాము. ఇక, ‘నరకం’లో నరకయాతన అనుభవిస్తున్న హీరోను రెండవ భాగంలో చూస్తాము.
మొదటి భాగం ‘అద్భుతం’ అనిపిస్తే రెండో భాగంలో సంగీతం, సెట్లు, పాట, నటన, చిత్రీకరణ, నృత్యాలు ‘పరమాద్భుతం’ అనిపిస్తాయి. నరకం ఇలాగే ఉంటుందనిపిస్తుంది.
(‘తేరే బినా ఆగ్ యే చాంద్‌నీ’ పాటని యూట్యూబ్‌లో చూడవచ్చు
https://www.youtube.com/watch?v=9zC9f6qSnPI )
(మళ్ళీ కలుద్దాం)